Friday, April 10, 2026

Chapter 10 Vyasa, having a son, performs penance for Shiva - అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 10

వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట


ఋషు లిట్లనిరి : సూత మహర్షీ! మహా తేజస్వియగు వ్యాసుడీ దివ్యదేవీ పురాణమును రచియించి శ్రీ శుకునిచే దానిని చదివించెనంటివి. వ్యాసుడు తపమొనరించి శుకునెట్లుద్భవింపజేసెను? నీవా వ్యాసుని వలన విన్నదంతయు మాకు విశదమొనరింపుము. 

సూతు డిట్లనియెను : సత్యవతీ తనయుడు వ్యాసుని వలన యోగి వరుడగు శుకుని జన్మమెట్లుగల్గెనో యా వృత్తాంతము దెల్పెదను. పూర్వము సత్యవతీ సుతుడగు వ్యాసుడు రమణీయమైన మేరుగిరి శిఖరముపై నియమముతో పుత్రునికై ఘోరతపమాచరించెను. ఆ తపోనిధి పుత్రార్థియై నారదుని వలన నేకాక్షరమంత్ర రాజమగు వాగ్బీజమంత్రము నుపదేశము పొంది జపించుచు మహామాయను ధ్యానించు చుండెను. వ్యాసుడు తనకు నింగి గాలి నిప్పు నీరు నేలయను పంచభూతముల శక్తులతో సంపన్నుడగు పుత్రుడు గలుగవలయునని నిశ్చయించుకొనెను. అందులకై వ్యాసుడు నిరాహారియై దీక్షతో నూరేండ్లు తపమొనరించెను. శివాశివుల నారాధించెను. సకల భూతయోనియగు మహాశక్తియే యెల్లెడల బూజనీయయని తలంచి వ్యాసుడాదేవిని నిరంతరము గొలుచుచుండెను. లోకమందశక్తుడు నింద్యుడగును. శక్తుడు పూజ్యుడగును. ఆ మేరుగిరి శిఖరముపై అద్భుతకర్ణికారవనము శోభిల్లుచుండును. అందు వేల్పులు క్రీడలందు మునిగి తేలుచుందురు. మునులు తపములు సేయుచుందురు. అచట మధుర సంగీతరవములు వీనుల విందులు సేయును. అట్టి సుమనోహరమైనచోట ధర్మాత్ముడు సత్యవతీ సుతుడునగు వ్యాసుడు తపము సేయ మొదలుపెట్టెను.

అతని మహోగ్ర తేజము చరాచరలోకములనే వెలిగించెను. ధీమంతుడగు ఆ పారాశర్యుని జడ లగ్నివర్ణములయ్యెను. అతని తపము వేడిమికి దేవేంద్రుడే గడగడలాడెను. ఇంద్రుని భయవ్యాకులత్వములను రుద్రుడు గాంచెను. అపుడా రుద్రభగవాను డింద్రున కిట్లనియెను: 

"ఓ యింద్రా! ఏల భీతుడవైతివి? నీకు గలిగిన శోకమునకు కారణమేమి? తాపసులను గని యెవ్వడు నెప్పుడును కోపము జెందకూడదు. మహర్షులు నన్ను శక్తి సంపన్నునిగ దెలిసికొని తపమొనర్తురు. తాపసు లెప్పుడు నితరులకు కీడు తలపెట్టరు." అను వచనములాకర్ణించి "ఆ వ్యాసుడేల తపమొనర్చు చుండెను. అతని మదిలోని కోర్కి యెట్టిది?" అని ఇంద్రుడడుగ "ఆ వ్యాసుడు పుత్రుని కొరకు కఠిన తపమొనర్చుచున్నాడు. వ్యాసునకు తపముతో నూరేండ్లు నిండినవి. కాన నతనికిపుడు శుభకరుతనయుని ప్రసాదింతును" అని రుద్రుడనెను. మధుర దయాసముద్రుడు ప్రసన్నవదనుడు జగద్గురువునగు రుద్రుడు వ్యాసుని జేరి యిట్లనియెను: 

"ఓ సత్యవతీ తనయా! వ్యాస మునీ! లెమ్ము. నీకు సత్పుత్త్రుడుదయించుగాక! ఓ యనఘా! అమిత తేజోనిధియు జ్ఞానియు నీకు పేరు ప్రతిష్ఠలు దెచ్చువాడును లోక ప్రియుడునగు పుత్త్రుడు నీకు జన్మించుగాక! అతడు సత్త్వగుణ సంపన్నుడు సత్యవిక్రముడు పూర్ణాత్ముడు గాగలడు." 

సూతుడిట్లనెను : అను శివుని శివంకరవచనములు విని వ్యాసుడు శివునకు నమస్కరించి తన యాశ్రమమున కరిగెను. అతడు తాను పెక్కేండ్లు పడినపాట్లకు బాధపడుచు –

అరణిలో గుప్తమైయున్న యగ్నిని మరల బొందుట కరణిని మథించుచుండెను. అపుడతని డెందమున పుత్ర కామమును గలిగెను. దండముతో నరణిని జేర్చి మథించగ మథించగా నగ్ని యుదయించెను. నాకు పుత్ప్రోత్తికి హేతువగు స్త్రీ లేనేలేదు! నాకీ యగ్నితో సమానుడగు పుత్రుడెట్లు కలుగును? కుల్పోత్పన్న రూప సంపన్న తరుణి కాళ్ళకు సంకెళ్ళవంటిది అగు కాంతను నేనెట్లు పరిగ్రహింతును? ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలు, పాత్రివ్య్రత జీవన రూపవతి కామిని కావచ్చును. అట్టి స్వేచ్ఛాసుఖ విధాయిని యగు నారి బంధన కారిణి. ప్రణవ స్వరూపుడగు శివు డంతటివాడే ఉమా రాగపాశ బంధములచే బద్ధుడయ్యె గదా! ఇట్లు దుర్ఘటమైన గార్హస్థ్యము నేనెట్లు నెఱపగలను అని వ్యాసుడు విచారించు చుండెను. అంతలో దివ్య కామిని యగు ఘృతాచి వ్యాసునకెట్ట యోదుట నింగిపై దోచెను. చపలములగు క్రీగంటి చూపులతో తన సమీపమున ఉన్న ఆ అప్సరః శ్రేష్టుని చూచి వ్యాసుడు వ్రతపరాయణుడయ్యు కామబాణవ్యాప్తమనస్కుడయ్యెను. ఆ సంకటము విషయమున నేనేమి చేతునని అతడు తలపోసాగెను. ఇపుడు ధర్మము ముందు దుస్తరమైన కామము పెల్లుబికినట్లున్నది. నన్నే మోసగించవచ్చిన యీ రమణిని నే నొకవేళ నంగీకరింతు ననుకొందము. అపుడు బ్రహ్మవాదులు తాపసులును కామ లోలుడనగు నన్ను గేలిసేతురు. 

'ఇతడే నూరేండ్లెంతో ఘోరముగ తపించి యొక యచ్చర కొంగుబట్టుకొని తన సర్వస్వమామె ముందుంచెను' అని వారందురు. సాటిలేని సుఖము లభించినచో నిందవచ్చినను సరే! గృహస్థాశ్రమమున పుత్త్రజన్మము గల్గినచో నది సర్వసుఖము గలిగించును. అది జ్ఞానులకు మోక్షానందమును గల్గించును. ఈ దేవకన్యవలన నాకట్టి పుణ్యము గలుగదు. తొల్లి పురూరపు డూర్వశికి వశుడై తుదకామెచేతనే తిరస్కరింపబడెను అను కథను నేను నారదుని వలన వింటిని.

అధ్యాయము 11 బుధుని జన్మవృత్తాంతము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...