Friday, April 10, 2026

Chapter 11 The story of the birth of the planet Mercury - అధ్యాయము 11 బుధుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 11

బుధుని జన్మవృత్తాంతము

ఋషులిట్లనిరి : అపురూరవ మహారాజెవరు? దేవకన్యక యూర్వశి యెవర్తుక? ఆ మహారాజునకు కష్టములెట్లు గలిగెను? ఆ కథ మాకు వినిపింపుము. నీ ముఖకమలమునుండి వెడలు మధురసామృత మెంత గ్రోలినను తనివితీరదు. నీ వాక్కుల నుండి యమృతరసమే కురియును. అమృతములో లేని దివ్యరసము నీ వాక్కులందు గలదు. అమరుల మృతమున దనియరు. అట్లే మేము నీ వాగమృతమున దనియకున్నాము. 

సూతుడిట్లనియెను : మునులారా ! మున్ను శ్రీ వ్యాసునిచే చెప్పబడిన సుమనోహర దివ్యకథ నా బుద్ధికి దోచినట్లు వివరింతును వినుడు. దేవగురుడు బృహస్పతి. అతని భార్య తార. ఆమె సురూపమును ¸ వనమును కలది. అందమగు అవయవములు కలది. మదన పరవశ. ఒకనాడు రూప¸ వనశాలిని యగు ఆ భామిని ఆ కాలమున యజ్ఞము నాచరించున్న చంద్రుని గృహమునకేగి అతని కంటబడెను. ఆ రాజముఖిని గాంచగనే చంద్రుడు కామాతురుడయ్యెను. ఆమెయును చందురుని చూచి మిక్కిలిగా కామపీడిత యయ్యెను. ఇట్లు తారాశశాంకులు పరస్పరా సురాగమున కామార్తులైరి. మదోన్మత్తులగుచు కామబాణ పీడితులైరి. కామమదమత్తులును పరస్పరానురాగాన్వితులునగు వారిరువురును అట్ల క్రీడించుచు ఎన్నియో దినములు గడిపిరి. ఇది తెలిసి గురుడు విచారగ్రస్తుడై తారను ఇంటికిదోడ్కొని రమ్మని తన శిష్యునంపెను. కాని చంద్రునిచే వశీకృతయగు నామె రాలేదు.

అట్లే మాటిమాటికి గురుడు పంపుశిష్యులను చంద్రుడు తిరుగ బంపుచుండెను. కడకు ఆ యుదారమతి యగు బృహస్పతి తానే బయలుదేరి సోమునింటికేగి మదాన్వితుడై నవ్వు చంద్రుని గని పట్టరాని రోషమున నతని కిట్లనియెను: 

"చంద్రా ! ధర్మనిందితమైన పనిజేసితివేమి? సుందరియగు నా భర్యను నీవట్టె పెట్టుకొని యంటివేమి? దేవతలలోని వాడవగు చంద్రా! నీకు గురుడను. నీవు యాగముచేయుచున్న వాడవు గదా! ఓరీ మూఢా! నీవు గురుభార్య ననుభవించితివే! మీదుమిక్కిలి ఇపుడును వదలకున్నావు. బ్రహ్మహంత సువర్ణాపహారి సురాపాయి గురుతల్పశాయి వారి సంసర్గము కలవాడు అను వీరు పంచమహాపాతకులు. నీవు మహాపాపివి. దురాచారివి. అతినిందితుడవు. నీవు నా యంగన ననుభవించి నందున దేవలోకార్హుడవు కావు. ఇకనైన నా యసితేక్షణను వదలిపెట్టుము. నా యింటికామెను గొనిపోదును. కానిచో నీవు దుష్టాత్ముడవని గురుభార్యనే కూడినవాడవని లోకమున కెలుగెత్తి చాటుదును" అని పలుకుచున్న క్రుద్ధుడును భార్య యొక్క యెడబాటుచే దుఃఖితుడునైన గురునితో 

చంద్రుడిట్లనియెను: "బ్రాహ్మణులు కోపముననే యపూజ్యులగుదురు. దర్మశాస్త్రము లెఱింగిన వారు పూజార్హులు. క్రోధయుక్తులు పూజయందు విడువదగినవారు. అనఘా! నీ భార్య నీ యింటికే రాగలదు. ఆ చిన్నది నా యింటిలోనే యున్నను నీకు గల్గునష్టమేమి? ఆమె తన యభీష్టము ననుసరించి కామ సుఖార్థినిగదా! ఇచట కొన్ని నాళ్లిట్టులే యుండి తన యిష్టముననుసరించి యింటికి వచ్చును. పాతకము చేసినను ఋతుమతియైన పిదప స్త్రీ దుష్టురాలుగాదనియు, పాతకియైనను వేదకర్మలాచరించుటచే విప్రుడెన్నడును నింద్యుడుగాడు అనియు గురు వర్యులగు మీరు దర్మశాస్త్ర సమ్మతమైన పలుకు మున్ను పల్కితిరి, అని చంద్రుడు పలుకగనే గురుడు మరింత దురపిల్లెను. అతడు చేయునదిలేక స్మరాతురుడై చింతావశుడై తన యింటి మొగము పట్టెను. ఇట్లు కొన్ని దినములు గడచిన పిదప గురుడు చింతాపరవశుడై మరల త్వరితగతితో నోషదీపతి యింటికేగెను. ద్వారపాలు రడ్డగించుటచేత గురుడు బయటనే యుండెను. చంద్రెడంతకును బయటికా రాలేదు. గురునకంతకంతకును కోపము మితిమీరు చుండెను. ఇతడు నాకు శిష్యుడు. గురుపత్ని తల్లియేయగును. ఐన నితడు ధర్మముతో నా దానిని బల్మితో తానే యుంచుకొనెను. ఇపుడు నేనితనిని శిక్షింతును.

గురుడు ద్వారము చెంతనే నిలుచుండి యిట్లు కేకలు పెట్టుచుండెను : 

"ఓరీ మందా! పాపీ! సురాధమా! ఇంకను లోననే పండుకొని యున్నావా! వేగమే నా ప్రియకామినిని నాకిమ్ము. లేనిచో నిన్ను శపింతును. నా ప్రియను నా కీయనిచో నిన్ను భస్మమొనర్పగలను."

సూతుడిట్లనియెను : ఇట్లు గురుని పరుషవాక్కులు విని వెంటనే చంద్రుడింటిలోనుండి వెలుపలకు వచ్చెను. చంద్రుడు పక పక నవ్వుచు గురున కిట్లనియెను : 

"ఏమో యెక్కువగ పలుకుచున్నావే? సర్వశుభలక్షణ లక్షితయగు ఈ అసితా పాంగి నీకు యోగ్యురాలుగాదు. నీకు తగిన కురూపను చేపట్టుము. ఒక్క బిచ్చగాని యింట నిట్టివరవర్ణిని యుండదగదు. మందమతీ! స్త్రీకి తనకు సాటివాడగు ప్రియునివలన రత్యానందము కలుగును. నీ వీ కామశాస్త్ర మర్మము లెఱుగవు. దుర్మతీ! ఇంక నీవు యథేష్టముగ పోవచ్చును. నేను ఆ కామినిని ఈయను. నీ చేతనైనది చేసికొమ్ము. ఈ వరవర్ణిని నీయను కామార్తుడవగు నీవు శపించినను నాకదితగులదు. గురూ! ఈ కాంతను నేనీయను. నీ కిష్టమైనది చేసికొమ్ము.'' 

సూతుడిట్లనియెను: చంద్రుడట్లు పలుకగా గురుడు చేయనదిలేక కిన్కబూని పెల్లుదురపిల్లి వేగనింద్రుని కడకరిగెను. క్రుంగిన మదితో చింతం బొగులుచుండిన గురుని దర్శించి ఇంద్రుడు అర్ఘ్యపాద్యాదివిధుల బూజించెను.

పరమోదారు డింద్రుడు దీనదశలో నున్న గురునకిట్లనియెను : 

"మహాభాగా! మీ మోము విన్నబోయియున్నదే! శోకార్తుడవైతివేమి? మీ చింతవేమి? నీవు నా గురుడవు. నా యేలుబడిలో నిన్నెవ్వడవమానించెను? ఈ లోకపాలురతోడి నా సైన్యమంతయును నీ యధీనము. బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలెల్లరు నీకు సాయమొనర్పగలరు. మీ చింతయేమో వేగిరమే వెల్లడించుడు'' 

గురుడిట్లనియెను : "సులోచనయగు నా పత్ని తారను తారేశుడు తన చేజిక్కించుకొనెను. ఎన్ని మారులు వేడికొన్నను ఆ దుష్టాత్ముడు తిరిగి యామెను నా కిచ్చుటలేదు. ఇపుడు నేనేమిచేతును? నీవే నాకు శరణము. నేను మిక్కిలి క్లేశపడుచున్నాను. నాకీ విషయమున సాయమొనర్పుము.

ఇంద్రుడిట్లనియెను : "ధరజ్ఞా! సువ్రతా! మహామతీ! నీ వింక దుఃఖించకుము. నేను నీ దాసుడను. నీ కాంతను తప్పక తెప్పించి యిత్తును. నేనిపుడే నా దూతనంపుదును. ఆ మదమత్తుడప్పటికిని నీ భార్యనీయనిచో సురసైన్యముతో నతని మార్కొని యుద్ధము చేయుదును. అని యిటుల నింద్రుడు గురునోదార్చి విచారదర్శియు చతురుడునగు దూతను వార్త నందించుటకై చంద్రునికడ కంపెను. సువిచక్షణుడగు ఆ దూత వెంటనే చంద్రలోకమేగి రోహిణీ పతితో నిట్లు పలికెను : 

"మహాభాగా! మహామతీ! ఇంద్రుడు నీ కొకమాట చెప్పుమని నన్నంపెను. నా ప్రభువనిన పలుకులు పలుకుచున్నాను. నీవు దర్మజ్ఞుడవు నీతివిదుడవు. నీ తండ్రి అత్రియును ధర్మాత్ముడు. కాన నీవు నింద్యమైన కార్యము చేయదగదు. ఎల్లరును తమ తమ భార్యలను యథాశక్తిగా ఎచ్చరికతో గాపాడుకొనవలయును. ఈ విషయమున కలహముకూడ జరుగునకాశము కలదు. అందు సందియము లేదు. నీవు నీ భార్యనెటుల రక్షించుకొనదలతువో గురుడును తన భార్య నటులే రక్షించుకొన దలచును. సుధానిధీ! ఎల్లభూతములను స్వాత్మభావమున జూడుము. నీ కిరువదెనమండ్రుగురు దక్షకన్యకలు గలరు. వారినందఱిని స్వేచ్ఛగ ననుభవింపుము. గురు భార్యను మాత్రము విడిచిపెట్టుము. నీవంటి గొప్పవాడే యహంకరించి నింద్య కార్యము సేయుటకు పూనుకొన్నచో నిక మూర్ఖుడునట్లే ప్రవర్తించును గదా. దాని వలన ధర్మము నశించును. మనోరమ యగు గురు నిల్లాలిని వదలిపెట్టుము. నీ నిమిత్తమున విబుధులలో కలహము చెలరేగకుండుగాక!"

ఆ యింద్రుని సందేశమాలించి చంద్రుడించుక కినుకబూని ఇంద్రుని దూతతో వక్రభంగి నిట్లు పలికెను. 

"ఓ మహాబాహో! నీవును ధర్మజ్ఞుడవే! దేవేంద్రుడవే! నీ పురోహితుడు నీతో సమానుడే. మీ యిద్దఱి బుద్ధులును సమానములే. చాలమంది పరోపదేశమున పండితులు. ఏ పనియైన తామే చేయవలసి వచ్చినపుడు అట్లే యాచరించువారు దుర్లభులు. ఎల్లరును బృహస్పతి రచించిన ధర్మశాస్త్రమును ప్రమాణముగ నంగీకరింతురు గదా! తన్నువలచిన కామినిని అనుభవించుట దోసముగాదని దాని యందే కలదు. ఇంతకు వీర్యవంతున కందఱును తనవారే. పాపము! బలహీనున కొక్కడును తనవాడునువాడు లేడు. ఈమె స్వీయ - ఆమె పరకీయ యను భేదములు మందమతుల భ్రమలే. ఈ తారకు నా యందనురాగమున్నంతగా బృహస్పతియందు లేదు. అనురాగవతిని వదలిపెట్టుటేమంత ధర్మము గాదు. న్యాయమును గాదు. అనురాగముగల దానియందే సంసారముగాని విరక్తురాలియందు కాదుగదా! ఆ గురుడు తనయన్న భార్య యందనురక్తుడైన నాటనుండియే యీమె కతనియందు విరక్తి గిగినది. దూతా! ఇక నీవు వెళ్లవచ్చును. నే నీ వరారోహన గురున కీయను. నీవు నా మాటగ స్వయముగ నింద్రునకిట్లు దెల్పుము: 

"ఓ యింద్రా! నీవు దేవపతివి. నీకు తోచినది చేసికొనుము." 

సూతుడిట్లనియెను : అని చంద్రుడు పల్కగా విని దూత యింద్రుని చెంతకేగి చంద్రుని మాటలతనికి వినిపించెను. అదివిని యమరపతి కోపాతిరేకమున తన గురునకు సాయము సేయ సేననాయత్త పరచెను. శుక్రునకు గురునకు సరిపడదు. ఆ ద్వేషముతో శుక్రుడు చంద్రునిజేరి తారను మరల గురునకీయ వద్దని యిట్లు చెప్పెను. 

"ఓ మహామతీ ! ఆర్యా ! ఆ యింద్రునితో నీకు పోరాటము సంఘటిల్లినచో నా మంత్రశక్తిచేత నేను నీకు సాయపడుదును. చంద్రుడు గురుదారను బొందెననియును శుక్రుడు గురునకు శత్రువనియు శివుడెఱింగి బృహస్పతికి తానండగ నిలిచెను.

ఆ సమయమున తారకాసుర సంగ్రామమువలె సురాసురుల నడుమ పెక్కేండ్లు ఘోరమైన పోరు సంఘటిల్లెను. ఆ దేవదానవ సంగ్రామము గూర్చి విని వారిని శాంతింప జేయుటకు బ్రహ్మయును హంసవాహనమెక్కి యక్కడి కేతెంచెను. అపుడు బ్రహ్మ చంద్రునితో నిట్లు పలికెను : 

"నీవా గురుపత్నిని వదలుము. కానిచో శ్రీ విష్ణువునకు జెప్పి నిన్ను నశింపజేతును. 

పిమ్మట బ్రహ్మశుక్రుని వారించి యిట్లనియెను : "ఓ మహామతీ! దైత్యుల సహవాస దోషమున నీ మతియు నన్యాయమే తలపెట్టుచున్నదా? 

అంత శుక్రుడు చంద్రుని వారించి "ఆ గురునాలినింక విడనాడుము. నీకిట్లు చెప్పుమని నీ తండ్రియే నన్నంపెను." అనెను. 

సూతుడిట్లనియెను : శుక్రుని మాటలు విని చంద్రుడు అప్పటికి గర్భవతి యగు గురుని యిల్లాలిని తిరిగి గురునకు నప్పగించెను. గురుడు తన భార్యను మరల గ్రహించి, సంతసించి తన యింటి కరిగెను. దేనదానవులును దమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మ తన లోకమేగెను. శంకరుడు కైలాసము జేరెను. గురుడు తన మనోరమ దార యగు తారను మరల బడసి సంతసించెను. కొన్ని నాళ్లకొక శుభ దినమున శుభ తార యందు తార యందొక సుపుత్రుడుదయించెను. ఆ శిశువు గుణములలో తారాపతినే పోలియుండెను. గురుడు సంతుష్టుడై యా కుమారునకు జాతకర్మ మున్నగు కార్యములు యథావిధిగ జరిపెను. 

మహామతి చంద్రుడునపుడు పుత్త్ర జననము విని "ఈ శిశువు నీ కుమారుడు గాడు. మద్వీర్య సంజాతుడు. జాతకర్మాది విదులను నీ వొనర్చితివేమి ?" అని దూతచే గురునకు వార్త నంపెను.

దూతవాక్కులు విని గురుడు "నను బోలి యున్నందున ఇతడు నా కొడుకు. ఇందు సందేహము లేదు" అని సమాధానమంపెను. అపుడు దేవదానవులు మరల వాదించుకొనుచు సంఘములుగ కయ్యమునకై గుమికూడిరి. శాంతికాముడగు బ్రహ్మ మరల నచ్చటికి విచ్చేసి దుర్మదులై రణమొనర్ప జూచువారిని వారించెను. 

మరియు దర్మాత్ముడగు బ్రహ్మ తారతో "వరారోహా! ఈ తనయుడెవరివాడో నిక్కము పలుకుము. జరిగినదంతయు నీవు చెప్పిననే కాని వీరు శాంతించరు" అని పలికెను. అపుడా వరవర్ణిని తారాధిపతివై పోరగన్నుల నగి తల వంచుకొని యా శిశువు చంద్రుని పుత్రుడేయని మెల్లగ బల్కి లోనికేగెను. అంత చంద్రుడు ముదమంది తన తనయుని నెత్తుకొని యతనికి బుధుడను పేరు పెట్టి తన నెలవున కేగెను. బ్రహ్మ తన లోకమున కేగెను. సురలింద్రుని గూడి నాక లోకము చేరిరి. ఇట్లెల్ల వారును దమ తమ నిలయముల కరిగిరి. 

ఇట్లు గురుని భార్యయందు చంద్రుని వనల బుధుడు జన్మించెను. ఇదే బుధుని జన్మ వృత్తాంతము. మున్ను సత్యవతీ సుతుడగు వ్యాసుని వలన నిదంతయును వింటిని. ఇపుడదే మీకు వినిపించితిని.

అధ్యాయము 12 సుద్యుమ్నస్తుతి

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...