శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట
సూతు డిట్లనియెను : జగద్గురుడగు విష్ణుని దేహమందలి కన్నులు ముక్కు నోరు గుండె ఱొమ్ములనుండి నిద్ర తొలగిపోయెను. అపుడా తామసశక్తి హరి మేను విడనాడి గగనసీమపై నొప్పుచుండెను. ఆ హరియు మాటి మాటి కావులించుచు మేలుకాంచెను. మహాతేజుడు శ్రీహరి భయపీడితుడైన బ్రహ్మను గనుంగొని మేఘగంభీర భాషలతో నతని కిట్లు పలికెను:
"ఓ భగవానుడా! కమలజా! నీ తపము వదలి యిటకేల యరుగుదెంచితివి? మఱియు చింతా తరుడవై భయభీతుడవై వైక్లబ్యమున నేలయుంటివి?
బ్రహ్మ యిట్లనియెను: ఓ దేవా! నీ చెవుల మలమునుండి భీకరాకారులు బలవంతులు మధుకైటభులను దనుజులను పుట్టిరి. జగత్పతీ! దేవా! వారివలన భయమున నేను నీ సన్నిధి చేరితిని. నేను భయగ్రస్తుడను-విచేతనుడను. నన్ను త్వరగా కాపాడుము.
విష్ణు విట్లనియెను: నీ విచటనే యుండుము. నేనేగి వారి యంతు తేల్చుకొందును. ఆ మూఢుల కాయువు మూడినది. లేనిచో నాతోడ నేల బోరవత్తురు?
సూతు డిట్లనియెను: ఆ దేవేశుడట్లు పలికినంతనే యా మదమత్తులు విక్రమవంతులు నగు రక్కసులు వేల్పు పెద్దను వెదకుచు నచటి కేతెంచిరి. ఓ మునులారా! ఆ సంద్రమునందు నిరాధారులై విగతజ్వరులై మదగర్వమున విఱ్ఱవీగు దైతేయులు బ్రహ్మతో నిట్లనిరి:
"మానుండి పరుగెత్తి నీ వితని చెంత కెల వచ్చితివి? మాతో రణము సల్పుము. ఈ పురుషుడు చూచుచుండగనే యిపుడే నిన్ను బరిమార్తుము. ఆ పిదప పాపసెజ్జపై పరున్న యితనిని హతమార్తుము కాన నీవు మాతో బోరుము. లేక మీకు దాసుడనైతి ననుము.
సూతు డిట్లనియెను : వారి పలుకులు విని జనార్దనుడు వారి కిట్లనియెను:
సూతు డిట్లనియెను : వారి పలుకులు విని జనార్దనుడు వారి కిట్లనియెను:
"ఓ దైత్యులారా! మీరు నాతో సంగర మొనరింపుడు. మహాబలులారా! మదయుతులగు మీ కండకావరమంతయు నిపుడే యంతమొందింతును. మీ కిష్టమైనచో నాతో సంగర మొనరింపుడు.
సూతు డిట్లనియెను : హరి మాటలు విని వారు క్రోధమున నెఱ్ఱబారిన గుండెలతో నిరాధారమైన నీటిలోనే యుండి యుద్ధము సేయ దలపెట్టిరి. అంత మధువు శ్రీహరితో రణ మొనర్ప నాయత్తమయ్యెను. కైటభుడూరుకుండెను. వారు మత్తమల్లవీరులవలె పోరదొడగిరి. మధు వలసట జెందగనే కైటభుడు హరితో నాలము సల్పుచుండెను. ఆ మధుకైటభు లొకరి తరువాత నొకరు రాగాంధులై ప్రభవిష్ణువగు విష్ణునితో బాహుయుద్ధమునకు దలపడిరి. ఆకసమునుండి శ్రీదేవియు బ్రహ్మయు నిరువురును వారి పోరితము తిలకించుచుండిరి. దురము సలుపు దానవు లెంతకు నలయుటలేదు. కాని హరి డస్సిపోయెను. ఈ రీతిగ నాలము జరుగుచుండగ నైదు వేలేండ్లు గడచినవి. భగవంతు డంతట వారి వధోపాయమునుగూర్చి తన మదిలో నీ రీతి విచారించదొడగెను:
"నేను వీరితో నైదు వేలేండ్లుగ బోరితిని. ఐనను వీరికి శ్రమ గలుగుటలేదు. కాని నేనలసితిని. ఇదంతయు జూడగ నాకచ్చెరువు గలుగుచున్నది. నా బలవీర్యములు నేడేమైనవి? వీరింకను కుశలముగనే యున్నారు. ఇందులకేమి కారణమో?" ఇట్లు హరిని గని మదోన్మత్తులగు దనుజులు సంతసమున మేఘగంభీర నిస్వనమున హరితో నిట్లనిరి:
"విష్ణూ! నీలో బలముడిగినచో రణములో నలసట చెందినచో నేను మీ దాసుడనైతినని తలపై దోయిలించుము. కాక నీకు లావే యున్నచో తిరిగి మాతో గయ్యము సేయుము. మొదట నిన్ను జంపి పిదప నలుమోములుగల యీ మహాపురుషుని నంతమొందింతుము."
సూతు డిట్లనియెను : వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగ నింపుసొంపు దనరు పలుకులతో సాగర మందున్న దానవులకిట్లనియెను :
సూతు డిట్లనియెను : వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగ నింపుసొంపు దనరు పలుకులతో సాగర మందున్న దానవులకిట్లనియెను :
"మహావీరులు జంకిన - యలసిన - శస్త్రము వదలినవానిపైగాని బాలునిపైగాని దెబ్బకొట్టరు. ఇది సనాతన ధర్మము. మీతో నే నైదు వేలేండ్లు బోరితిని. మీరిరువురును సమబలులు, సోదరులు. ఎడతెరపి లేక బోరువారు. నేను మాత్ర మొక్కడనే! మీరు నట్ట నడుమ సేద దీర్చుకొని కయ్య మొనర్చుచున్నారు. ఇక మీదట నేను సైత మలసట దీర్చుకొని పిమ్మట మీతో తప్పక పోరు సల్పుదును. కనుక నేను విశ్రమించి వచ్చి న్యాయమార్గమున రణము సలుపు దనుక బలశాలురు మదోత్కటులు నగు మీరు తాలిమి బూనుడు.
సూతు డిట్లనియెను : ఆ హరి వాక్కులు విని రాక్షసులు అతనిపై విశ్వాసముంచి విష్ణుడు విశ్రాంతినొందిన పిమ్మట మరల సమరము కొనసాగించదలచి దూరముగ తొలగియుండిరి. చతుర్భుజుడగు వాసుదేవుడు రక్కసులను దూరమందే కాంచి వారి చావు కారణమును తన మనస్సులో నిట్లు విచారించుచుండెను. అంతలో హరి కీ విధముగ జ్ఞానోదయమయ్యెను. శ్రీదేవీ వరము నుసరించి వీరు స్వచ్ఛందమరణులు. వీరు నశింపరు. నేను వీరితో వ్యర్థముగ రణమొనర్చితిని. నా పడిన శ్రమయంతయు వమ్మైనది. ఇక ముందెట్లు వీరిని గెలువగలనో తెలియుట లేదు. నేనెదిరించినచో వరమదగర్వితులగు వీరిచ్చోటు వీడి కదలరు. చావకున్నచో వీరు మరింత దుఃఖకారకులగుదురు. భగవతి వీరి కొసగిన వరమతి దుర్భరమైనది. ఎంత దుఃఖితుడైనను తాను స్వయముగ చావగోరుకొనడు గదా! రోగియై యుండియు దీనుడైయున్నను నెవ్వడును చావగోరడు. ఇంక నీ బలమదోన్మత్తులు తమ చావు తామే యేల కోరి తెచ్చుకొందురు? కనుక నిత్తఱి కామప్రదాయినియగు శ్రీ విద్యాశక్తిని నేను శరణు వేడుదును. ఆమె సుప్రసన్న కానిదే కోరికలు సిద్ధింపవు.
ఇట్లు తలంచి హరి నింగిపై నున్న మనోహర శివ స్వరూపిణియగు యోగనిద్రను దర్శించెను. అమేయాత్ముడు యోగవిదుడునగు హరి ఆ రాక్షసులను చంపుటకై వరదాయినియు త్రిభువనేశ్వరియు నగు యోగనిద్రను దోయిలించి ఇట్లు సంస్తుతించెను :

"దేవీ! మహామాయా! సృష్టి సంహారకారిణీ! అనాదినిధనా! చండీ! భుక్తి ముక్తి ప్రదాయినీ! నీకు నా వందనములు. దేవీ! నీ సగుణ నిర్గుణ స్వరూపములు నే నెఱుంగజాలను. నీ విచిత్ర చరిత్రము లనంతములు. వాని నన్నిటి నెవ్వడు పేర్కొనగలడు? నీ దుర్ఘటమైన ప్రభావ విశేషము లెఱింగితిని. నేను నిద్రయందుండగ చేష్టలు దక్కియుంటిని. అపుడు బ్రహ్మ నన్ను మేలుకొలుపుటకు పలుమారు యత్నములు జరిపెను. కాని నా యింద్రియములు చేతలుడిగియుండుటచే మేల్కొనజాలకుంటిని. నీ ప్రభావముననే నిద్రించితిని. మరల నీ మూలముననే మేలుకొంటిని. ఈ ఘోర సంగర మొనర్చితిని. ఇందు నేనే యలసితిని గాని నీ వర మహిమ గల యీ దానవుల లయలేదు. ఇంతేకాక వారు బ్రహ్మను చంపుటకు బూనుకొనిరి. నేను వారిని ద్వంద్వ యుద్ధమునకు బురికొల్పితిని. వారితో మహాసాగరమునం దతి ఘోరముగ బోరు సల్పితిని. కాని వారి చావునకు నీ వరమడ్డుగ గలదని తెలిసికొంటిని. ఇపుడు సర్వశరణ్యవగు నిన్నే నే శరణుగోరుచున్నాను. ఓ దేవార్తి వినాశినీ! ఈ దానవులు వరదాన దర్పితులు. నేను యుద్ధముచే ఖిన్నుడనైతిని. కాన నాకిపుడు సాయపడుము. ఆ పాపులు నన్ను జంపన సమకట్టి యున్నారు. నేనేమి చేతును? ఎక్కడి కేగుదును? ఇట్లు హరి వాక్కులు విని అతి దీనముగ ప్రణమిల్లుతున్న దేవదేవుడు వాసుదేవుడు సనాతనుడునగు హరిని గని దేవి నగి యిట్లనియెను :
"దేవదేవా! నీవు మరల స్వయముగ యుద్ధ మొనరించుము. వీరిని మోసముతో జంపుము. నేను నా మాయాశక్తిచే వీరి బుద్ధులను మోహింపజేయుదును. అపుడా శూరులు మాయా మోహితులగుదురు. నీవు వెంటనే వారిని చంపుము."
ప్రీతి పూర్వకములగు శ్రీదేవి పలుకులు హరి వినెను. అంతలో ఆ మహావీరులగు దానవులు యుద్ధకాములై మహాసాగరమందలి సమరస్థలము జేరిరి. వారట విష్ణుని గని సంతసిల్లి "ఓ మహాకామా!చతుర్భుజా! నిలునిలుము. మాతో యుద్ధ మొనరింపుము. నిజముగ జయాపజయములు దైవాధీనములు. బలవంతుడే సాజముగ గెలుపొందును. కాని యొకొక్కప్పుడు దుర్బలుడును దైవబలమున జయమందును. కనుక మహాత్ము డెప్పుట్టునను హర్షశోకములందరాదు. తొలుత పెక్కురు రక్కసులు దేవతల చేతులలో మడిసిరి గదా! ఇప్పడు నీవు మాత్రము మాతో బోరుచు పరాజయమొందితివి" అనిరి. ఇట్లు పలికి మహాబలులగు దైత్యులు సమరమునకు తలపడిరి. అద్భుతకర్ముడగు హరి వారిని గాంచి తన బలముకొలది పిడికిట వారిని పోటు పొడిచెను. అపుడా పోటు మొనగాండ్రు హరిని మరల పిడికిళుతో పొడిచిరి. ఇట్లు వారికి పరస్పరము దారుణ రణము సంఘటిల్లెను. నారాయణుడా వీర్యవంతుల యుద్ధ నైపుణ్యము గాంచి దీనదృక్కులతో తన సమక్షమునందున్న భగవతిని దర్శించుచుండెను.

సూతుడిట్లనియె : అపుడు దేవి కరుణ భావమున కందుచున్న హరిని పరికించి వెంటనే మరులు రేకెత్తించు వాడితూపులవంటి చూపులతో దానవులను జూచెను. ఒకేసారి పెద్దగ నవ్వెను. చిరునగవు నెయ్యము చిందులాడు దేవి నెమ్మొగముగాంచి యాపాపాత్ములు మోహమాదాంధులైరి. వారు నిర్మలకాంతులీను దేవీ రూపమునే మాటి మాటికి మనసుందు దలంచుచు మదనబాణహతులై యామెనే చూడ దొడగిరి. ఆ మహాదేవి మహిమవలన వారు మోహితులైరని కార్యకుశలుడగు భగవాను డూహించెను. అతడు నవ్వుచు మేఘగంభీర ఘోషముతో వారికిట్లనియెను;
"మీరలు మహావీరులు. పరమడుగుడు. మీ యుద్ధమునకు సంతుష్టుడనైతిని. మీకు వరమీయదలచితిని. నాతో తొలి పెక్కురు రక్కసులు బోరిరి. కాని మిమ్ముబోలు వీరాధివీరులను నేను గనలేదు, వినలేదు. అందుచే మీ మేటిబలమునకు సంతసించితిని. మీరు సమబలులు, సోదరులు, మీకోరిన వరమిత్తును." విష్ణువు వచనములు వినగనే వారికభిమానము మెండయ్యెను. వారు మదనపరవశులునైరి.
ఆ జగదానంద కారిణియగు మహామాయను కామపరవశులై చూచుచు వారు విష్ణువుతో నిట్లనిరి: "ఓ హరీ! మేము యాచకులము గాము. నీకే మేము వరమీయగలము, మేమే దాతలము. కోరుకొమ్ము. నీకే మేము వరమిత్తుము. హృషీకేశా! వాసుదేవా! నీ మనస్సులోని కోరిక దెలుపుము. నీ విచిత్ర యుద్ధమునకు మేమెంతయు సంతసించితిమి." అను దానవుల మాటలు విని హరి వారికిట్లు మారు పలికెను:

"మీరు నా యెడల ప్రసన్నులైనచో మీరు నా వధ్యులుగండు."
సూతుడిట్లనియె: ఆ హరి వచనములు విని వారు విస్మితులై మనము వంచింపబడితిమని శోకమున వ్యాకులచిత్తులైరి. అది అంతయును నీటిమయమే. నేలయెచ్చోటను లేదు. అది యెఱింగి దనుజులు హరికిట్లనిరి:
"దేవా! జనార్దనా! మొదట నీవే మాకు వరమిత్తునంటివి. కనుక సత్యపరాక్రముడనేని నీవే మాకు ముందుగ వరమొసంగుము. నీరు లేనిచోట నీవు మమ్ము వధించుము. అపుడు మేము వధ్యులమగుదుము, ఆ రీతిగ చేసి నీ సత్య ప్రతిజ్ఞను నిలువబెట్టుకొనుము."
అంత చక్రియగు హరి తన చక్రమును మది దలంచి వారితో నవ్వుచు నిట్లు పలికెను :
అంత చక్రియగు హరి తన చక్రమును మది దలంచి వారితో నవ్వుచు నిట్లు పలికెను :
"మహాభాగులారా! నీరులేని చోటుననే మిమ్ము హతమార్చగలను. దేవదేవేశుడట్లు పలికి తన పెందొడలను మరింత వెడల్పు చేసి యిదే నీరు లేనిచోటని చూపి వారికిట్లనియెను:
"ఓ దనుజులారా! నా తొడలపై మీ తలలు విడిచెదరుగాక! అపుడు మీరును నేనును సత్య ప్రతిజ్ఞల మగుదుము. అదివిని మది విచారించి దనుజులు తమ మేనులు వేయి యోజనములంత పెంచిరి. దాని కచ్చెరుమంది భగవంతుడును తన పెందొడలు దానికి రెండింతలు పెంచెను. అపుడు వా రా పరమాద్భుతమైన పెందొడలపై తమ తలలుంచిరి. ప్రభ విష్ణువు తన చక్రముచే వారి తలలు ద్రుంచెను. ఇట్లు మధుకైటభులు ప్రాణములు గోల్పోయిరి. వారి మేదస్సుచే సాగరమంతయు నిండినది. ఆనాటి నుండి భూమికి మేదినియను మరొక పేరు గలిగెను. మునులారా! ఆ కారణముననే మన్ను తినదగనిదైనది. ఈ ప్రకారముగ మీరడగినదంతయును వివరించితిని. కనుక బుధులు నిరంతరము శ్రీ మహామాయా రూపయగు శ్రీ విద్యను సముపాసించ వలయును. ఎల్లసురాసురులు నాపరమ కళ్యాణ శక్తిని సమారాధించవలయును. ఇంతకు మించిన భాగ్యమీముల్లోకములందును మరేదియును లేదు. కనుక సగుణనిర్గుణాత్మిక యగు పరాశక్తి సతతము పూజనీయ అని యెల్ల వేదశాస్త్రార్థములందును వచింప బడినది. ఇది ముమ్మాటికి నిజము నిజము.
అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట
పంచాంగం
అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట
No comments:
Post a Comment