Sunday, April 12, 2026

Chapter 42 The story of Satyavrata - అధ్యాయము 42 సత్యవ్రతుని చరితము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 42

సత్యవ్రతుని చరితము

జనమేజయు డిట్లనియె : ఆ సత్యవ్రత బ్రాహ్మణు డెవడు? అతడే దేశమందు జన్మించెను? అత డెట్టివాడు? ఇదంతయు నాకు విశదపఱచుము. అతడు ''ఐ'' కారము నెవనివలన వినెను? దాని నతడే విధముగ నుచ్చరించెను? అతనికి వెంటనే కల్గిన సిద్ధి యెట్టిది? ఆతని వలన సర్వాంతర్యామిని పరిపూర్ణ సర్వజ్ఞ యగు భగవతి యెట్లు సంతుష్టి జెందెను? ఆతని చమత్కారజనకమైన గాధను విస్తారముగ తెలుపుము అని రాజు ప్రశ్నింపగ సత్యవతీ సుతుడగు వ్యాసుడు తన రసభరితమైన వాక్కులతో నతని కిట్లనెను: 

"జనమేజయా! ఒకప్పుడు నేనొక ముని సమాజములో నొక పరమ పౌరాణిక దివ్యగాథ వింటిని. దానిని వినపింతును, సావధానుడవై యాలకింపుము. నే నొకప్పుడు పావనతీర్థాటన మొనరించుచు మునిసేవితము పరమపవిత్రమునగు నైమిశారణ్యము జేరితిని. ఆ పుణ్యాశ్రమమునందు మహావ్రతులు జీవన్ముక్తులు మునిసత్తములు విధి పుత్త్రులు నివసించుచుండిరి. నేను వారి కెల్లర కభివందనము లాచరించితిని. అపుడా బ్రాహ్మణ సమాజమున సత్కథా కాలక్షేపము సాగుచుండెను.వారిలో జమదగ్ని ముని తక్కిన మునుల నిట్లు ప్రశ్నించెను: 

"మహాభాగులగు తాపసులారా! నా మదిలో నొక సందియము గలదు. ఆ సందియమును మీరు దీర్పగలరని నమ్ముచున్నాను. బ్రహ్మ విష్ణువు శివుడు సురపతి వహ్ని వరుణుడు ధనపతి సేనాపతి గణపతి మిత్రుడు పవనుడు త్వష్ట అశ్వినీకుమారులు పూషుడు సర్వగ్రహములు చంద్రుడు అను దేవతలు గలరు గద! వీరందఱిలోను గొప్పగ కోరికలన్ని యొకేసారి త్వరలో తీర్చి పూజలందుకొనగల దేవదేవోత్తము లెవరు? సర్వజ్ఞులు సంశితవ్రతులు నగు మునివరులారా! వీరిలో నతిశీఘ్రముగ సుఖముగ సులభముగ సుప్రసన్నుడగు దేవుడెవడు? నిత్యము సేవనీయు డెవడు?

అను జమదగ్ని ప్రశ్న విని మునులలో లోమశముని యిట్లు పలికెను; ఓ జమదగ్ని మునీ! నీ వడిగిన ప్రశ్నకు సమాధాన మాలకింపుము. శ్రేయము ప్రేయము గోరుకొనువారు ఏకైకతత్త్వమగు పరాభట్టారికను లలితాదేవి నారాధింపవలయును. ఆమె సర్వమూల మూలము. పరాప్రకృతి. ఆద్య-శివ-సర్వద-సర్వగయని ప్రసిద్ధి కెక్కినది. ఆ తల్లి బ్రహ్మాది దేవతల కందఱకు మహాత్ములకు జనని. ఈ సంసార మహావృక్షమునకు మూలబీజము. ఆ శ్రీమాతృదేవీ నామ మమృత మధురము. ఆ మధురాతిమధురనామ ముచ్చిరించినంతనే లోకుల మనోరథము లీడేరును. నిరంతరము వరము లొసంగుట కా వరదాయిని దయార్ద్ర హృదయమున వరదహస్తయై సంసేవింపబడుచుండును. ఈ విషయమున నే నొక సుంద రేతిహాసము వినిపింతును. వినుము. మును పొక బ్రాహ్మణు డొక దివ్యాక్షర ముచ్చరించిన మాత్రన పరమసిద్ధి గాంచెను.

పూర్వము కోసలదేశమున దేవదత్తుడను బ్రాహ్మణుడు వాసి కెక్కెను. ఆతడు సంతాన హీను డగుటచే పుత్రార్థము విధిపూర్వకముగ యాగ మొనరించెను. ఆతడు తమసానదీతీరమునం దొక విశాలమండప మేర్పరచెను; వేదవిదులును యాగకర్మ కుశలురునైన బ్రాహ్మణోత్తముల నాహ్వానించెను. ఆత డచట విధి ప్రకారముగ యజ్ఞవేదిక నిర్మించి యందగ్నిని ప్రతిష్టించి యథావిధిగ పుత్రకామేష్టి జరిపెను. ఆ జన్నమునందు సుహోత్రుని బ్రహ్మగ యాజ్ఞవల్క్యు నధ్వర్యునిగ బృహస్పతిని హోతగ-పైలుని ప్రస్తోతగ గోభిలుని నుద్గాతగ నితరమునులను సదస్యులుగ నియమించి యథావిధిగ విస్తారముగ దానదక్షిణ లొసంగెను. అపుడు సామగుడగు నుద్గాత సప్తస్వరములు మేళవింప స్వరిత ప్రధానముగ రథంతర సామగాన మొనరించెను. అతడు మాటామాటికెగశ్వాస పీల్చుకొనుటలో గానమునందు స్వరభంగము జరిగెను. వెంటనే దేవదత్తుడు కుపితుడై గోభిలునితో నేను పుత్రార్థము కామ్యకర్మ చేయుచు జన్న మొనర్చుచుండగ నీవు మూర్ఖుడవై స్వరభంగ మొనర్చి యపశ్రుతి పల్కితివేమి? అనెను. అపుడు గోభిలుడును గినుకబూని దేవదత్తున కిట్లనియెను: 

'నన్ను నీవు మూర్ఖుడ వంటివి. కనుక నీకు గల్గు కొడుకు మూర్ఖుడు శఠుడు శబ్దము నుచ్చరింపజాలనివాడుగ నగును గాక! ప్రాణులందఱిలోని యుచ్ఛ్వాస నిఃశ్వాసములు దుర్గ్రాహములై యుండును. కాన నో మహామతీ! స్వరభంగమునకు నన్ను దూషింప బనిలేదు.'

అను గోభిలముని వాక్కు వినగనే దేవదత్తుడు శాపభీతిచే దుఃఖితుడై యతనికిట్లనియెను: 

"ఓ విప్రోత్తమ! నిరపరాధుడనైన నాపై నీకింతకోపమేల? మునులు క్రోధరహితులు. పరమశాంతులు. సుఖము కలుగజేయువారు. ఓ బ్రాహ్మణోత్తమ! ఈపాటి కొద్ది తప్పునకే నన్నింతగ శపింపనేల? నేను మొదలే పుత్త్రులులేక దుఃఖించుచుండగ వ్రణములో కారము జల్లినట్లు నన్నింకను సంతాప మొందింపజేసితివేల? మూర్ఖపుత్రునికన్న అపుత్త్రత్వంబు మేలని వేదవిదులు వక్కాణింతురు. అందునను బ్రాహ్మణుడు మూర్ఖుడైనచో నతనిని ప్రతివాడు తెగనిందించును. అట్టి వాడెల్ల కార్యములందు పశువువలె శూద్రునివలె పనికిమాలిన వాడగును. నాకట్టి మూర్ఖ పుత్రునివలన ప్రయోజనమేముండును? మూర్ఖ విప్రుడు శూద్రతుల్యుడు. అతడెల్ల శుభకర్మలందు పూజకు అనర్హుడు. దానమునకు అయోగ్యుడు, నిందాపాత్రుడు అగును. ఇందు నెంతమాత్రము సందేహము లేదు. తన దేశమందు వేదబాహ్యుడై వసించు విప్రుని నుండి శూద్రునినుండివలె రాజు పన్నులు గ్రహింపవచ్చును. ఆ మూర్ఖుడు దేవపితృ కార్యములకు యోగ్యుడుకాడు. శుభములు కాంక్షించువాడు మూర్ఖ విప్రున కాసనాదులొసంగడు.

రాజు వేదమురాని మూర్ఖువిప్రుని శూద్రునిగ భావించి యతనిచేత వ్యవసాయపు పనులు చేయించవచ్చును. శుభ కార్యములందతనిని నియోగింపకూడదు. మూర్ఖవిప్రుని శ్రాద్ధభోక్తగ నిమంత్రణము చేయరాదు. అట్టిస్థితిలో దర్భలపై నన్నముంచి యైన కార్యము జరుపుకొనవలయును. ఆ వేదమునేర్వని మూర్ఖున కతనికివలసిన ఆహారముకంటె నెక్కువ అన్నము నీయరాదు. అట్లిచ్చినచో నిచ్చినవాడును తిన్నవాడును అధికముగ నరకముల పాలగుదురు. ఎచ్చోట వేదవిహీనులైను మూర్ఖద్విజులు దానసత్కారమయులతోడ పూజింపబడుదురో యారాజ్యము వ్యర్థము. ఆ రాజును వ్యర్థుడే. వేద పండితులకు మూర్ఖులకు మధ్య నాసన పూజాదానములందు భేదముండి తీరవలయును. విబుధులు వీరిర్వురియంతరము గుర్తించి వర్తింపవలయును. దానమాన పరిగ్రహముల కారణముగ మూర్ఖుడెచ్చోట గర్విష్ఠుడై యుండునో యాదేశమందు పండితుడు వసింపరాదు. వేపపండ్లను కాకులే తినునుగాని మేలు జాతిపక్షులు తినవు. అటులే దుష్టులసంపదలు దుష్టులకే పనికివచ్చును. వేదపాఠ నిరతులగు విప్రులు న్యాయార్జితమైన యున్నము భుజించి వేధాభ్యాసమొనర్తురు. అట్టివారి పితరులు స్వర్గముల ప్రమోదమందుదురు. కావున నోగోభిల మునీశ! వేదవేత్త! ఇంతకు మిక్కిలిగ నేను నీకేమిచెప్పగలను? ఈ దురిత సంసారమందు మూర్ఖపుత్రత్వము మరణముకంటె గర్హింప దగినది. ఓ మహానుభావా! శాపము నిగ్రహించుము. నన్ననుగ్రహింపుము. నీ నిండుమనసు వెన్నవంటిది. నీవు దీనుల సముద్ధరింప సమర్థుడవు. నీ పాదములమీద నా తల నుంతును.

లోముశు డిట్లనియె: అట్లు దేవదత్తుడు గోభిలునికి మ్రొక్కి దీనాశ్రులు కన్నులనిండ నిండగ గుండె దిగులుతో నతనిని సంస్తుతించెను. గోభిలు డా దీనవదనునిగని దయార్ద్రు డయ్యెను. మహాత్ములు క్షణకోపులు, పాపిష్ఠులు కల్పాంత క్రోధనులు గద! జలము సహజముగ చల్లగ నుండును. కాని యది యగ్నితాపమున వేడిగ నుండును. వేడిమిలేనిచో వెంటనే చల్లబడును. అంతట గోభిలుడు దయాళువై దుఃఖితుడగు దేవదత్తుని నీ పుత్త్రుడు మూఢుడయ్యు విధ్వాంసుడై పేరుగాంచును అని యనుగ్రహించెను. ఇట్లు గోభిలునివలన వరము బడసి దేవదత్తుడు ప్రసన్నుడై తన యాగము పూర్ణము గావించి విప్రులను దనిపి యనిపెను. కొన్ని దినములు గడచిన పిదప దేవదత్తుని భార్య రోహిణియను నామె రోహిణి పగిది గర్భవతి యయ్యెను. అంత దేవదత్తు డామెకు గర్భాదాన పుంసవనాది కర్మలు విధివిదానముగ జరిపించెను. వేదవిధానముగ సీమంతోన్నయనము జరిపించెను. యాగము సఫలముగ పరిసమాప్తమందుటవలన దేవదత్తుడు సంతుష్టుడై దానాది సత్క్రియ లొనరించెను. అంత నొక శుభదినము నందు రోహిణి రోహిణీ నక్షత్రమున శుభలగ్న మందొక చక్కని పుత్త్రుని గనెను. దేవదత్తు డా బాలుని జాతకము దైవజ్ఞులకు చూపి జాతకర్మదులు జరిపించెను. ఆ కుమారుని ముఖలక్షణములు వీక్షించి పూర్వ విదులతనికి 'ఉతథ్యు'డను నామకరణము చేసిరి.

దేవదత్తుడు తన కొడుకున కెనిమిదవయేట శుభముహూర్తమున యథావిథిగ నుపనయన సంస్కారమొనరించెను. బ్రహ్మచర్య వ్రతస్థుడగు వటునకు గురువు వేదము పాఠము చెప్పెను. కాని యుతథ్యుడు ముగ్ధునిపగిదినుండి యేమియునుచ్చరింపలేదు. అతని తండ్రియు నతని నెన్నో రీతుల చదివించిచూచెను. కాని యతడు తన మనసులో చదువు నిల్పుకొనలేక మూఢునివలె తెల్లమొగమున నుండెను. తన కొమరుని దుస్థ్సితికతని తండ్రి మిక్కిలి దురపిల్లెను. ఇట్లు పండ్రెండేండ్లు వచ్చునప్పటి కాబాలుడు యథావిధిగ సంధ్యా వందనాది విధులొనర్చు టెఱుగకుండెను. అతడు మహామూర్ఖుడనువార్తబ్రాహ్మణ తాపసులకు లోకమంతటి కెగబ్రాకెను. అతడెచ్చటికేగినను జనమతనినిగని పరిహసించు చుండెను. అతని తలిదండ్రులు నతనిని బెదరించుచు నిందించుచుండిరి. ఈ విధముగ నా మూర్ఖవిప్రుడు తన తల్లిదండ్రులచే బందుగులచే నిందింపబడి 'కుంటి గ్రుడ్డి కొడుకులున్నచో నేదో కొంతమేలే యగును. కాని మూర్ఖ పుత్త్రుడుండుట నిరర్థక మని తన తలిదండ్రులును పలుకగా విని యతడు వైరాగ్యముతో నడవులు పట్టెను. ఆతడు పావనగంగా నదీతారముననొక పవిత్రస్థలమున పర్ణ కుటీరమేర్పరచుకొని వన్యవృత్తితో నిశ్చలమతితో నందు తన కాలము వెళ్ళబుచ్చుచుండెను. 'నే నేవిధముగనైన నెన్నడైన నసత్యమాడ నని ప్రతిని బూని యతడు తన శుభాశ్రమమున బ్రహ్మచర్యమున గడపుచుండెను.

అధ్యాయము 43 వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 41 Brahma explaining the triguna form to Narada - అధ్యాయము 41బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 41

బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట

నారదు డిట్లనియెను: నీవు గుణముల లక్షణములను విస్తరించి చెప్పితివి. నీ ముఖనిర్గతమైన దేవీ వాక్యకథా సుధారస మెంత క్రోలినను నాకు తృప్తి గులగుటలేదు. ఆ త్రిగుణముల స్వరూపములనుగూర్చి నా కింకను కొంచెము తేటగ వివరింపుము. వాని నన్నిటిని సమగ్రముగ వినినగాని నా మదికి శాంతి చేకూరదు.

ఇట్లు నారదుడు తన తండ్రి నడుగ రజోగుణ సముద్భూతుడు విశ్వకర్తయు నగు బ్రహ్మ తన కొడుకున కిట్లు పలికెను: 

"నారదా! నీ కా త్రిగుణముల గుఱించి వర్ణింతును. వినుము: వానిని గూర్చి నాకును పెద్దగ తెలియదు. ఐన నేదో నా మదికి తోచినంతగ దెలుపగలను. కేవలమొకే సత్త్వగుణ మెచటను నిలువజాలదు. అది తక్కిన గుణములతో చేతులు కలిపి మిశ్రభావమున ద్యోతిత మగుచుండును. ఎట్లన నొక చక్కని యువతి పెక్కుసొమ్ములుదాల్చి హావభావ విలాసములతో తన భర్తకు సంతృప్తి గల్గించును. ఆమెయే తన తల్లిదండ్రులకును బంధువులకును ప్రీతి నొడగూర్చును. కాని యామెయే తన సవతుల దుఃఖమోహములకు కారణభూతురాలగును. ఈ రీతిగ నా స్త్రీ సత్త్వరూపమున నున్నప్పటికిని ఆమెలో రజస్తమనస్సుల భిన్నవృత్తులు పెల్లుబుకుచుండును. ఇట్లా స్త్రీలోని రజోగుణముతో తమము జేరి యా రెంటి కూడిక వలననే వేరొక వృత్తి ప్రతిభాసించును. సహజస్వభావమందు నెలకొనియున్నప్పుడితర వృత్తులు తలలెత్తవు. ఒకప్పుడు భిన్నములైన గుణవృత్తులు జేరి విపరీత ప్రవృత్తులుగ పొడసూపును.

ఎట్లనగ, నొక స్త్రీ రూపవతి యువతి లజ్జా మధురిమలు గలది-వినయవతి - ధర్మశాస్త్ర కామశాస్త్ర విధిజ్ఞ. ఆమె తన పతి హృదయమును నలరించును. కాని యామెయే తన సవతులకు దుఃఖమోహములు గల్గించును. ఇట్లే తీరని దుఃఖములో తెలియని మోహము సత్త్వమందు సైతముండునని జనులందురు. అట్లే సత్త్వము నందితర భావములును ప్రకటమగుచుండును. సేన యొక్కటియ చోరులవలని యుపద్రవము నొందిన సాధు జనులకు సుఖకరముగను దొంగలకును దోపిడిగాండ్రకును దుఃఖమోహములను కలిగించుచు దోష సహితముగాను తోచును. ఒక్కొక్కప్పుడీ గుణములవలన సాజముగ విపరీత భావములు వెలువడుచుండును. ఎట్లన పెద్దగ మబ్బులు క్రమ్మిన దుర్దినమున ఉఱుములు మెఱుపులు భయంకరముగ నుండును. చిమ్మచీకట్లు గ్రమ్మును. వర్షములు కురియును. ఆ స్థితిని లోకులు తమోరూపమందురు. ఈ పరిస్థితి పండినపంటగల కృషకులకు దుర్దినమగును. విత్తనములు నాటిన కర్షకునకు సుదినముగ నుండును. ఇదే పై కప్పులేని యింట నివసించుచు తృణకాష్ఠములపై బ్రతుకు గృహస్థుల కతిదుఃఖదాయక మగును.

తన పతి విదేశమందున్న ప్రమద కీ దుర్దినము భరింపరాని మోహమునకు కారణమగును. ఆమె స్వభావములోని గుణవికారములెల్ల విపరీతమై మాటలు చెలరేగుచుండును. వీని లక్షణము లింకను విశదముగ వెల్లడింతును. ఆలింపుము. సత్త్వగుణము నిర్మలమై స్వచ్ఛమై నిత్యమై లఘుప్రకాశముగలదై స్వచ్ఛమగు వెలుగులు జిమ్ముచుండును. కన్ను ముఖము మున్నగు నింద్రియములు సకలాంగము లెప్పుడు స్వచ్ఛముగ వికాసము జెందునో చిత్తము గంగవలె నిర్మలముగ కోర్కులు లేకుండునో యప్పుడు సత్త్వతేజము వెలుగుచున్నదని యెఱుంగవలయును. అట్టి సత్వము విషయములజోలికి పోదు. అప్పుడు శరీరమందు లోనను బైటను నొకే సత్వము తేజరిల్లుచున్నదని భావింపవలయును. చంచలత ఆవులింత స్తంభము తంద్ర యనునవి రజోగుణలక్షణములు. ఇట్టి క్లేశకారకములైన లక్షణము లెవనిలో మూర్తీభవించునో వానిలో రజోగుణము రాజిల్లుచున్నదని యెఱుగవలయును. గ్రామాంతర మేగుట చిత్తచాంచల్యము వివాదములందు దగుల్కొనుట దేహము బద్ధకించుట మున్నగు లక్షణములు దోచినపుడు తమోగుణము నిండియున్నదని యెఱుగవలయును. అపు డొడలంతయు బరువెక్కును. తమము దట్టమై పేరుకొనును. చిత్తము ఇంద్రియములు క్రియాశూన్యము లగును. నిద్ర పట్టకుండును.

ఈ విధముగ గుణముల లక్షణము లెఱుంగవలయును అనగా నారదు డిట్లనియె: 

"పితామహా! నీవు త్రిగుణలక్షణములను వేరువేరుగ వివరించితివి. ఇవన్నియు నొకేచోటజేరి పనులన్నిటి నెట్లొనరింపగలవు? ఇవి పరస్పరము శత్రువులయ్యు నెట్లు కూడాయుండును? ఈ విషయము కొంచెము విడదీసి చెప్పుము. 

బ్రహ్మయిట్లనె: పుత్త్రా! విపులముగ వాక్రుత్తును. చెవి యొగ్గి వినుము. ఆ గుణములు దీపకాంతి లక్షణము గలవి. అది మనము వస్తువులను చూచునట్లు చేయును. వత్తి తైలము జ్వాల - యివి పరస్పర విరుద్ధములు. వత్తి తైలములు-తైలాగ్నులు-వర్త్యగ్నులు పరస్పరము విరుద్ధములు. కాని యివన్నియు నొక్కచోజేరి పదార్థములను దర్శింపజేయును. వ్యాసా! ఇట్లు గుణములన్నియు మూలసహజప్రకృతినుండి కల్గుచుండును. ఇవన్నియును సంసారకారణములు అని తొల్లి నేను బ్రహ్మవలన వింటిని. అని ఇట్లు నేను నారదునివలన నెఱింగిన గుణముల లక్షణములును వాని కార్యములును నీకు విడమరచి చెప్పితిని. గుణములన్నిటిని కల్పించి విభజించి జగన్నాటక మాడించు ప్రకృతి మహాశక్తి యెల్లవారికి నారాధ్యదేవత. ఆ దేవీ గుణకార్యభేదములవలన నిర్గుణయు సగుణయునై విలసిల్లుచుండును. ఆమెయే పూర్ణపురుషుడు-అన్యయుడు నిరీహుడు - అచ్యుతుడునగు పరమపావనుడు.

ఆ మహా మాయాశక్తియే యీ సదసదాత్మకమైన బ్రహ్మాండములందు బ్రహ్మ విష్ణువు రుద్రుడు రవి శశి ఇంద్రుడు వసువులు అశ్వినులు వరుణుడు కుబేరుడు వహ్ని ఆయువు పూషుడు సేనాపతి వినాయకుడు మున్నగు దేవతలను గుణకర్మ విభాగమున సృజించును. వీరెల్ల రా శక్తితో యుక్తులగుటవలననే కార్యకరణదక్షు లగుచున్నారు. ఆ శక్తి తోడు లేనిచో వారు నెంతమాత్రము చలింపజాలరు. ఓ రాజా! ఆ పరమేశ్వరి విశ్వజగత్కారణురాలు. కాన జనమేజయా! దేవీ యజ్ఞ మొనరించి యా తల్లి నారాధించుము. ఆ దేవిని భక్తితో బూజింపవలయును. ఆ తల్లియే శ్రీమహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి రూపములతో నిత్యపూజలందు కొనుచుండును. ఆమెయే సర్వభూతేశ్వరి సర్వకారణకారణ సర్వకామార్థద శాంత దయామయి సుఖసంసేవ్య. తన పవిత్రశుభనామ ముచ్చరించి నంతమాత్రముననే యా తల్లి తన భక్తుల వాంఛితార్థము లీడేర్చును. ఆ శ్రీమాతృదేవి పూర్వము హరిహరబ్రహ్మలచేత నారాధింపబడినది. ముముక్షులు జితాత్ములు తాపసులునగువా రామెను బూజించి తరించిరి. ఎవ్వడైన ప్రసంగవశముననైన నా దేవతనామ మొకేయొకసారి యుచ్చరించిన చాలును. దేవిదయదలచి వాని కోర్కులెంత దుర్లభములైనను తీర్చివేయును. ఎవడేని భయార్తుడై కాఱడవిలో క్రూరమృగములను గాంచి ''ఐ-ఐ'' యని దలంచినచో ''ఐ-ఐ'' వర్ణములందు బిందువు లేనప్పటికి దయామయియగు దేవి వాని భయముబాపి కోర్కులు కురియును. దీనికి సత్యవ్రతుని చరిత్ర తార్కాణము. అతని చరిత్ర నాకును ప్రత్యక్ష ప్రమాణమే. ఆ సత్యవ్రతుడు మహితాత్ములగు స్వాత్మవిచారులకు బాగుగ తెలియును. బ్రాహ్మణ సమాజమందా సత్యవ్రతుని చరిత్ర కీర్తింపబడుచుండును. నే నాతని చరిత్రయంతయు చక్కగ వింటిని. అదేమన- పూర్వము మహామూర్ఖుడు నిరక్షరకుక్షి యగు సత్యవ్రతుడను బ్రాహ్మణు డుండెను. అతడొకనా డొక కోలము (వరాహము) నోటినుండి ''ఐ'' కారము విని దానినే యుచ్చరించి మహా పండితు డయ్యెను. దయామృత తరంగిణియగు పరమేశ్వరి 'ఐ' కార ముచ్చరించినతనే యతనియెడ సంతుష్టయై యతని నొక కవిరాజుగ నొనరించెను.

అధ్యాయము 42 సత్యవ్రతుని చరితము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 40 Explanation of the triguna form - అధ్యాయము 40 త్రిగుణ స్వరూప వివరణము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 40

త్రిగుణ స్వరూప వివరణము

బ్రహ్మ యిట్లనియె: నారదా! ఈ ప్రకారముగ సృష్టి క్రమమును గుఱించి నీవడుగగా జెప్పితిని. ఇపుడు త్రిగుణముల స్వరూపమును వాని యవస్థలును వెల్లడింతును, ఏకాగ్ర మనస్కుడవై యాలకింపుము. సత్వము ప్రీత్యాత్మకమని యెఱుగుము. ఆర్జవము-సత్యము-శౌచము-శ్రద్ధ-క్షమ-ధైర్యము-దయ-లజ్జ-శాంతి-సంతోషము అనునవి సత్త్వగుణము యొక్క లక్షణములు. ఇది తెల్లని వర్ణము గలది. ఇది ధర్మమునందు ప్రీతిని సచ్ఛ్రద్ధను నివారించును. తత్వదర్శనులగు మునులీ శ్రద్ధను సత్వరజస్తమో భేదములచే ముత్తెఱంగుల బేర్కొనిరి. రజోగుణము రక్తవర్ణమున చెన్నొందును. ఇది దుఃఖ సంయోగమున గల్గును. ఇది అద్భుత శక్తి గలది. దుఃఖరూపమైనది. ఈ రజోగుణమునకు ప్రద్వేషము ద్రోహచింత మచ్చరము స్తంభముఉత్కంఠ నిద్ర అనునవి గల్గును. ఇది రాజసశ్రద్ధ. మదము-గర్వము ఇవి రజో గుణ లక్షణములు. తమోగుణమునల్లనివన్నె గలది. మోహము-విషాదము-అజ్ఞానము-ఆలస్యము-నిద్ర-ధైన్యము-భయము- వివాదము-కృపణత్వము కుటిలత్వము - వైషమ్యము - అతినాస్తికత - పరదోషదర్శనము వీటన్నిటిని బుధులు తమోలక్షనములుగ నెఱుగవలయును. ఈ తామసశ్రద్ధవలన తనకును పరులకును మనోవ్యథ గలుగును. తనకు శుభము గోరుకొను మనుజుడు సత్వగుణము ప్రకాశింపజేయవలయును. రజోగుణము నట్టడుగున నణచిపెట్ట వలయును. తమమును సంహరించవలయును.

ఈ త్రిగుణములందు ప్రతిది రెండవదానిని గడ్డిపోచగ కించపరచుచు వ్యతిరేకించుచుండును. ఐననునివి స్వతంత్రముగనుండక పరస్పర మాశ్రయించుకొనియే యుండును. కేవలము సత్త్వముగాని రజముగాని తమముగాని నిలువజాలదు. ఇవెల్ల యెల్లవేళల కలిసి అన్యోన్యపూరకములై ముందునకు సాగుచుండును. ఇవి పరస్పర సమ్మేళనమున తమకు తాము వ్యాపించియుండును. 

వీని వివరింతును వినుము. దానినెఱిగినచో భవబంధము తీరిపోవును. ఇదేదో నా మాటయే గదయని సందేహింపకుము. ఏదైన ఫలమనుభవమునకు వచ్చినప్పుడే దాని వాస్తవికత బట్టబయలగును. ఏదైననొక విషయము చూచుటవలనను వినికిడివలనను స్వానుభవమునను తెలియును. కానిదాని ఫలితమెఱుగనిచో నది వ్యర్థమేయగును. ఎట్లన నొకడొక పుణ్యతీర్థ కథ వినెను. కాని దాని ఫలితమతడు తెలిసికొనలేదు. అందువలన నతనిలో రాజసశ్రద్ధ పెచ్చు పెరిగెను. అతడేది వినెనో దానినే కనెను. తీర్థమందు స్నానమాడెను. రజోగుణముతో దానము లొసంగెను. అతడు కొంతకాలము రజోగుణముతో నచ్చటనే కడపెను. అతని యెడద రజోగుణఫలితముగ కామ క్రోధములతో కన్నుమిన్ను గానకుండెను. అతని గుండెలోని రాగద్వేషములా మంటలు గ్రక్కుచుండెను. అతడు తీర్థముగూర్చి వినెనుగాని దాని ఫలితము గూర్చి వినలేదు. కాన నతడు తీర్థ సంసేవన ఫలితమందలేదు. అతడు వినియు విననివాడేయయ్యెను. అతడనుభవశూన్యుడని యెఱుగము.

వ్యవసాయము చేసినందులకు ఫలితముగ లోకమున పుష్కలముగ నన్నము దొరకును. అటులే తీర్థసంసేవనకు ఫలముగ పాపనాశమగునని తెలిసికొనుము. ఈ దేహ వికారములగు కామక్రోధములు లోభమోహములు తృష్ణామదములు రాగద్వేషములు ఘోరపాతకములు అసూయ ఈర్ష్య అసహనము అశాంతి యనునవన్నియు పాప ఫలితములని తెలిసికొనుము. ఇవి యీ పాపిష్ఠతనువున గూడుకట్టుకొని పేరుకొని యుండును. వీనిమూలమున నరుడు పాపాత్ముడగును. ఆ నరుడెంతటి మహాపుణ్యతీర్థములో గ్రుంకినప్పటికి నీద్వంద్వ శత్రువులతని గుండెలో చోటుచేసికొని బయలువెడలకుండును. అపుడు జాగరూకత లేని కర్షకుని పగిది నతని శ్రమయంతయు వ్యర్థమగును. ఒక సేద్యగాడు పనికిమాలిన శ్రమయనుకొనక దుక్కిదున్ని పారవంతమొనర్చును. అతడందులో మేలైన విత్తనములు వేయును. ఈరీతిగ శ్రమించి వ్యవసాయము చేసిన కర్షకునకు మంచి ఫలము చేతికందును. ఇట్లాతడెక్కువ దిగుబడి నాశించి రేయింబవళ్లెండయనక వానయనక కష్టించి తన పొలమును కంటికిరెప్పగా జూచికొనును. కాని చలికాలమున పంటసిద్ధమైనపుడతడు నిదురించినచో పొలములో పులులుచేరి పంట చెఱచును. మిడుతలదండు వచ్చి పంట పొలమును తినివేయును. అపుడు రైతు హతాశుడై మిక్కిలిగ వగచును. అట్లే గుండెనిండ పాపరాసులు విషమువలె బాధలు పెట్టు చుండగ నెన్ని తీర్థములందు గ్రుంకిడిన నేమి ఫలితము? ఫలము సున్న; శ్రమ మిన్న.

ఉత్తమశాస్త్ర మెఱుగుటవలన సత్త్వము తేజరిల్లి వర్ధిల్లును. అపుడు తమము విరియును. వైరాగ్యము రూపుదాల్చిన బ్రహ్మజ్యోతిగ వెలుగొందును. ఇది సత్త్వగుణ ప్రకాశమునకు దృష్టాంతము ఇక రజస్తమస్సులు బలిమిని నరుని గుండెలో సులువుగచోటు చేసికొనును. ఈ రజము లోభముతో చేతులు గలిపి నాయంతవాడు లేడని మిట్టిపడును. అపుడా రజము సత్వతమోగుణముల రెంటిని మించి యెసంగును. తమస్సు ప్రమోహముతో బాసచేసి గ్రుడ్డి దగును. అది సత్త్వరజోగుణముల నతిక్రమించి మైమఱచియుండును. ఈ తమోగుణ ప్రాబల్యముగూర్చి విపులీకరింతును. వినుము: సత్వతేజమందు నెలకొన్నవాని కెల్లెడల నిర్మలసత్త్వమే వెలుగుబాట చూపుచుండును. అతడు సత్యధర్మమందే తన యమరజీవనము సాగించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సుభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజ ముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సులభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. ఇట్టి పుణ్యాత్ము డెల్లవేళల సర్వసంగపరిత్యాగ ధర్మమును పాటించును. ఇతరుల సుఖదుఃఖములను తనవిగ భావించును. మోక్షార్థియైన సాత్త్వికుడు రజోగుణమునకు రాగిల్లడు. దానికి దాసుడుగాడు. అంధతమస్సులో నేల బాధపడును? ఓ పుత్రా! ఇట్లు తెలివిగలవాడు మొదట రజమును పిదప తమమును త్రోసిరాజన వలయును. అపుడు శుద్ధమగు సత్త్వ మొక్కటియే వెలుగొందును. ఎవనియందు రజోగుణము ప్రబలునో యతడు సనాతన ధర్మములకు స్వస్తి చెప్పును. రాజసశ్రద్ధతో దేహాత్మభ్రాంతితో నధర్మము లొనర్చుచుండును. ఎవ్వనిలో రజోగుణము ప్రబలరూపము దాల్చునో యత డనర్థములవంటి యర్థములను సమకూర్చుకొనును. భోగములకు బానిస యగును. అపుడతనినుండి సత్త్వప్రకాశము చెప్పక పారిపోవును. అతని గుండెనిండ తమములు ముసురును. ఎవని యందు తమోగుణము తీవ్రరూపము దాల్చునో యతనియందు వేదముల-ధర్మముల-విషయమున విశ్వాసము సమసిపోవును. అతడు తామసశ్రద్ధతోకూడి దురభ్యాసములకు లొంగిపోవును. ధనము నిష్టము వచ్చినట్లు దుర్వ్యయము చేయును. ఎల్లెడల ద్రోహచింత దల పెట్టును. అట్టి వాని కాత్మశాంతి కరవగును.

క్రోధము ద్వేషము దుర్మతి శఠత్వముగల తామసుడు సత్త్వరజోగుణములను మంటగలిపి విషయలంపటుడై కామచారుడై తిరుగును. ఎక్కడను సత్త్వముగాని రజముగాని తమముగాని యొక్కటే నిలుకడజెంది యుండజాలదు. ఇవి యొండొంటితో గలిసి మిథునభావముగలవై జంటగ నుండును. సత్త్వమును బాసి రజము రజమునుబాసి సత్త్వము తమమును బాసి యీ రెంటిలోనే యొక్కటియు నెప్పుడును మనజాలవు. అట్లే తమ మీ రెంటినిబాసి యొంటిగ నిలువజాలదు. ఇవన్నియు మిథున ధర్మమున గలిసిననే తమ తమ కార్యప్రభావములు జూపగల్గును. ఈ త్రిగుణములు మూడు నొండొంటి నాశ్రయించుకొనియుండును. విడివిడిగ గడుపజాలవు. ఇవి పరస్పరముకూడి యొకటి రెండవ దానిని ప్రకటించుకొనుచుండును. ఒక్కొక్కప్పుడు సత్త్వమునుండి రజస్తమములు మరొకప్పుడు రజమునుండి సత్త్వతమములు గలుగుచుండును. మరొకప్పుడు తమమునుండి సత్త్వరజములు జనించును. మన్ను నుండి కుండ సిద్ధమగు చందముగ నివి పరస్పర మొకదానినుండి మరియొకటి పుట్టుచుండును. ఈ విధముగ త్రిగుణములును దేవదత్తుడు యజ్ఞదత్తుడు మున్నుగువారి బుద్ధి యందు సమావేశమై జంటలై యుండును. స్త్రీ పురుషులు పరస్పరము కలిసి మిథునధర్మమున లోకప్రవృత్తికి మూలమగునట్లే యీ గుణములు జంటలుగా నేర్పడి లోకప్రవర్తకము లగును. రజముతోగలిసి సత్వము సత్త్వముతోగలిసి రజము ఈ రెంటితోగలిసి తమమును జంటలు జంటలుగ వ్యవహరించునుండును. ఈ విధముగ నా తండ్రియగు బ్రహ్మత్రిగుణ స్వరూపములను తెల్లముగ వెల్లడించెను. అదంతయు విని నేను మరల నా తండ్రి నిట్లు ప్రశ్నించితిని:

అధ్యాయము 41బ్రహ్మ నారదునకు త్రిగుణ స్వరూపము వివరించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 39 Description of the Panchabhuta form - అధ్యాయము 39 పంచభూత స్వరూప వివరణ

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 39

పంచభూత స్వరూప వివరణ

నారదా! ఇట్టి విచిత్ర చరిత్రగల శ్రీదేవిని హరిహరులును నేనును వేరువేరుగ సందర్శించితిమి అని బ్రహ్మ పలుకగా విని దేవర్షియగు నారదుడు పరమప్రీతుడై తన తండ్రియగు ప్రజాపతిని మరల నిట్లు ప్రశ్నించెను: 

నారదుడు యిట్లనియె: ఆద్యుడు-అచ్యుతుడు-అవ్యయుడు- నిర్గుణుడునగు పరమపురుషుని దర్శించి యనుభవించిన నీ స్వానుభవము నాకు తేటతెల్లముగ బలుకుము. నీవు త్రిగుణ మూలశక్తి రూపము గాంచితినంటివి. ఆ స్వరూప మెటువంటిది? మఱి నిర్గుణశక్తి స్వరూపమును పురుష స్వరూపమును కన్నులకు గట్టినట్లు వివరించుము. నే నేప్రణవస్వరూపుని గాంచుటకు శ్వేతద్వీపమున మాటిమాటికి తపమొనర్తునో దేనికై ప్రణవము జపింతునో మహాత్ములు కోపరహితులు తాపసులు నెవరినిగాంతురో ఆ పరమాత్ముడు నాకు గోచరుగడుటలేదు. ఆ విశ్వాత్ముని జెందుటకు మాటిమాటికి నాత్మ విచారమున తపమొనరింతును. నీవు సగుణరూపయగు మహాశక్తిని సందర్శించితివి. నిర్గుణశక్తి నిర్గుణస్వరూప పరమాత్ముడు నెట్టివారలో నాకు తెలియబలుకుము. ఇట్లు నారదుడడుగగా బ్రహ్మ నవ్వుచు నతనితో యథార్థ విషయము నీవిధముగ బలుకదొడంగెను: 

బ్రహ్మ యిట్లనియె:నారదా! నిర్గుణ స్వరూపమెప్పుడు నెవ్వరికిని గోచరముగాదు. ఏలయన, నాదృశ్యమంతయు మిథ్యయే. నశ్వరమే. నిర్గుణబ్రహ్మమే సత్యము. రూపరహితమెట్లు గోచరమగును? ఆ నిర్గుణశక్తి దుర్గమమైనది. ఆ నిర్గుణపురుషుడు దుర్గముడు. వారు మనోవాక్కులకు గోచరింపరు. పరమమును లహంకార మడచుకొని భావనచే జ్ఞాన జ్యోతితో నిర్గుణతత్త్వము గందురు. ప్రకృతి పురుషు లనాది నిధనులని యెఱుంగుము. వారి నాత్మ విశ్వాసముచేతనే గుర్తింపవలయును. కాని, విశ్వాసము గుదురనివా డెఱుగజాలడు. సర్వభూతములందలి చైతన్యశక్తిని పరమాత్మశక్తిగ భావింపుము. ఆ సత్యతేజము సర్వవ్యాపకము. నిత్యము. అది పెక్కు రూపులు దాల్చును. ఆత్మచైతన్యము-శక్తి- రెండు భిన్నములు. సర్వవ్యాపకములు. వీని యునికిలేక జగమందలి యే పదార్థమును లేదు. ఈ రెండును ప్రతి దేహమునందును కలిసిమెలిసి యుండును. ఆ రెండు నొకేరూపము గలవి; నిర్గుణములు-నిర్మలములు-సచ్చిదానంద స్వరూపములు.

ఆ శక్తియే పరమాత్మ. పరమాత్మయే శక్తి. వీరి భేదము నెవ్వరు నెఱుగలజాలరు. సాంగవేదములను నిఖిల శాస్త్రములను చదివినప్పటికిని ఆత్మానాత్మవివేకము లేనివాడు ఈ సూక్ష్మభేద మెఱుగజాలడు. ఈ చరాచరజగము లన్నియు సహంకార మమకారమయములు. కాని, వీని ప్రభావమున నరుడు నూఱువేల కల్పములకైన నహంకృతిని బాయలేడు. సగుణమును నిర్గుణమును కన్నులతో జూడజాలదు. కనుక ముమ్మొదట నెమ్మదిగ సగుణరూపముగూర్చి చింతింపవలయును. ఈ నాలుకయు కన్నులును పిత్తముచే నావరింపబడియుండును. నాలుక కారము మున్నగు రసములను తెలిసికొనును. కన్ను రూపములను గాంచును. కాని, నాలుక రూపము నెన్నటికిని తెలిసికొనజాలదు. గుణావృతమగు చిత్తము నిర్గుణమును తెలిసికొనజాలదు. అహంకారములో బుట్టిన మనస్సునుండి యహంకార మెట్లు తొలగగలదు? గుణ వికారములు దొలగిపోనంతవఱకు బ్రహ్మదర్శన మసంభవము. అహంకారము తొలగిన వెంటనే చిత్తవికారము లణగును. అపు డాత్మతేజము నేను నేనని తానుగ వెల్గుచుండును. కనుక నహంకారలయ మావశ్యకము అను బ్రహ్మవాక్కులు విని నారదుడు మరల బ్రహ్మ నిట్లు ప్రశ్నించెను: 

నారదుడు యిట్లనియె: ఓ దేవేశా! త్రిగుణముల-త్రివిధాహంకారముల-నిజస్వరూపమును నాకు తేటతెల్ల మొనరింపుము. సాత్త్వికము రాజసము తామసమునను వాని భేదములను రూపములను గుఱించి నాకు మరింత వివరించి తెలుపుము. ఏ సత్యదర్శనజ్ఞానమున నేను సంసార వ్యామోహములనుండి విముక్తుడనగుదునో నాకు దానిని దెలుపుము. గుణముల లక్షణములను వాని విభాగములను గూర్చి సవిస్తరముగ నాకు ప్రబోధింపుము అన-

బ్రహ్మయిట్లనియె: అనఘా! ఈ త్రివిధగుణములకు త్రివిధశక్తు లుండును. అవి జ్ఞానశక్తి క్రియాశక్తి అర్థశక్తి నా బరగును. జ్ఞానశక్తి సత్వగుణమునకు క్రియాశక్తి రజోగుణమునకు అర్థశక్తి తమోగుణమునకును సంబంధించి యుండును. ఈ త్రిగుణముల కార్యములను విపులీకరింతును. వినుము. తమోగుణమగు ద్యవ్యశక్తివలన తన్మాత్రలు గల్గును. శబ్దము-స్పర్శము-రూపము- గంధము ననబడునవి తన్మాత్ర లగును. ఆకాశముయొక్క ధర్మము శబ్దము. వాయు గుణము స్పర్శము. అగ్నిగుణము రూపము. జల గుణము రసము. భూమి గుణము గంధము. ఇవి సూక్ష్మతన్మాత్రలనబడును. ఈ భూతపంచకమును తన్మాత్రలును మొత్తము పదియు ద్రవ్యశక్తితో గలిసియుండును. ఇట్టి తామసాహంకారవృత్తి వలన బ్రహ్మాండసృష్టి జరుగును. ఇక రజోగుణముగల క్రియాశక్తివలన నుత్పన్నమైన వానిని దెలుపుదు నాలింపుము: చర్మము-కన్ను-చెవి-నాలుక-ముక్కు-ఈయైదను జ్ఞానేంద్రియము లనబడును. నోరు-చేయు-కాలు-పాయువు-ఉపస్థయనునవి కర్మేంద్రియములు. ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము- సమానము ననునవి పంచవాయువులు. ఈ పదునైదును గలసిరజోగుణమువలన నుత్పన్నమగు నని చెప్పబడును. వీని సాధనము లన్నియును క్రియాశక్తికి సంబంధించి యుండును. వీని కన్నిటికిని చిద్వృత్తి యుపాదానకారణ మగును. వాయువు సూర్యుడు దిశలు వరుణుడు అశ్వినులు అను దేవతలు సత్త్వగుణ సంభూతులు జ్ఞానశక్తియుక్తులు. వీరు పంజ్ఞానేంద్రియములకు వరుసగ నధిష్ఠానదేవతలు. చంద్రుడు - బ్రహ్మ - క్షేత్రజ్ఞుడు - రుద్రుడు - ననువారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనువాని కధిష్ఠాతృదేవతలు. ఇవన్నియు మనస్సుతో గలిసి పదునైదగును. వీరందఱును సత్వగుణప్రధాను లగుటవలన నిది సాత్త్వికసృష్టి యనంబరగును. ఆ పరమాత్మకు స్థూలము సూక్ష్మము నను భేదుములతో రెండు రూపములు గలవు. మొదటిది నిరాకారము. జ్ఞానరూపము. వివర్తముల కన్నిటికిని కారణము. రెండవది సాకారము సగుణము.

పరాధ్యాన సమయమునందు దేవియొక్క దయామూర్తి నుపాసించవలయును. అది దేవి స్థూలరూపము. ఆ పరమాత్మునిలోని స్వరూపమును సూక్షముగ నెఱుంగవలయును. ఆ సూక్ష్మ శరీరమునే సూత్రాత్మకమనియు విబుధులు నుడువుదురు. ఆ పరమాత్మయగు బ్రహ్మయొక్క రెండవరూపము స్థూలశరీరము. దానిని గూర్చి తెల్పుదును: దేనిని వినుట వలన బంధవిముక్తి గలుగునో దానిని వక్కాణింతును. భూత సూక్ష్మములగు తన్మాత్రలను మొదటనే వివరించితిని. వీని పంచీకరణమువలన పంచభూతములు సముద్భూతము లయ్యెను. ఆ పంచీకరణ రహస్య మెఱింగింతును. మొదట రస తన్మాత్రను తీసికొనవలయును. దానిని రెండుగ విభజించవలయును. అందొక భాగము వేరగును గద! ఇటులనే తక్కిన నాలుగు భూతములను రెండు రెండుగ వేరువేరుగ విభజింపవలయును. ప్రతి రెండవ భూతాంశమున తక్కిన నాల్గింటి భాగములను గలుపవలయును. అనగ నొక సగము నీటి భాగమునకు తక్కిన ప్రతి సగము భూతాంశముయొక్క నాల్గవ భాగము గలుపవలయును. అపుడొక్క జలభూత మేర్పడును. ఇట్లు భూత పంచీకరణము జరుగును. పిదప ప్రతి భూతాంశమందును చైత్యశక్తి ప్రతిబింబించును. అపు డందుండి మనోమయమైన యహంవృత్తి ప్రకటితమగును. ఆ వృత్తి విశేష మభిమానముతో ప్రద్యోతిత మగును. అపుడా శక్తి యాదినారాయణుడగు వైశ్వానర భగవానుడుగ బిలువబడును.

ఈ విధమగు పంచీకరణముచే ఆకాశాది భూతపంచకము సుస్పష్టముగ ప్రద్యోతితమగును. ఏకైక గుణవృద్ధిచే నొక్కొక్క భూతస్వభావము స్థూలతరమగు చుండును. ఎట్లన నాకాశమునకొకే శబ్దగుణము, వాయువునకు శబ్దస్పర్శములను రెండు గుణములు, అగ్నికి శబ్దస్పర్శ రూపములనబడు మూడు- జలమునకు శబ్దస్పర్శ రూపరసములను నాలుగు- భూమికి శబ్దస్పర్శ రూపరసగంధములను నైదుగుణములుగలవు. వీని పరస్పర సమ్మేళమున బ్రహ్మాండము సముత్పన్నమైనది కనుక సకల జీవులు బ్రహ్మాండాంశ సంభూతులు. ఈ జీవజాతు లెనుబదినాల్గు లక్షలని పేర్కొనబడుచున్నవి.

అధ్యాయము 40 త్రిగుణ స్వరూప వివరణము

Chapter 38 Sridevi explaining the order of creation with the trimurthi - అధ్యాయము 38 శ్రీదేవి త్రిమూర్తులతో సృష్టి క్రమమును తెల్పుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 38

శ్రీదేవి త్రిమూర్తులతో 
సృష్టి క్రమమును తెల్పుట

బ్రహ్మ యిట్లనియె: నే నీ ప్రకారమున సవినయముగ ప్రశ్నింపగ మహామాయాదేవి భగవతి మధురభాషలతో నాతో నిట్లు పలికెను: 

ఓ బ్రహ్మా! వాస్తవమున సద్వస్తు వొక్కటియే కలదు. అదే బ్రహ్మము. రెండవది లేదు. ఆ బ్రహ్మమే నేను. నేనే బ్రహ్మము. మతి విభ్రాంతివలన శక్తిమంతులకు భేదమున్నట్లు గన్నట్టును. అది సరికాదు. కాని మా యిరువురి భేదమతి సూక్ష్మతమమై తెలియరాకుండును. దాని నెఱింగిన స్థితప్రజ్ఞుడే దుస్తర సంసరణమును తేలికగ దాటగలుగును. ఇందు సందియము లేదు. బ్రహ్మ మేకము. అద్వితీయము. నిత్య భావమును పొందును. ఒకే దీపకాంతి యుపాధి భేదములతో ననేక విధములుగ నొప్పును. ఒకే ముఖము పలు విధముల యద్దాలలో పలురీతుల ప్రతిబింబించును. అదే తీరున మేము విశ్వరూపములు దాల్తుము. ప్రపంచమంతయు ప్రళయ సమయమున మాయలో లయమగును. అది సృష్ఠికాలమున మరల భిన్నభిన్నముగ పొడగట్టును. ఈ భేదము దృశ్యమునను నిరు తెఱగులుగ నుండును. నాకు ప్రళయకాలమున స్త్రీ పున్నపుంసక భేదము లుండవు. మరల సృష్టి సమయమందీ వై విధ్యము గోచరించును. ఈ భేదమంతయును బుద్ధిచే గల్పింపబడినదే. ఈ వ్యక్తమగుచున్న ధృతి స్మృతి శ్రద్ధ బుద్ధి మేధ దయ కీర్తి శ్రీ క్షమ లజ్జ క్షుధ తృష్ణ క్షమ కాంతి శాంతి పిపాస నిద్ర తంద్రజం అజర విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి మజ్జ చర్మము వర్షము వాక్కు సత్యము అసత్యము పర పశ్యంతి మధ్యమ వైఖరి మున్నగునవియు వివిధ నాడులును నేనే. ఈ జగములందణువణువున నేనే వెలసియున్న దేవతను. నేను లేని వస్తువే లేదు. ఇది నిజమని చక్కగ నెఱుంగుము. అన్ని రూపములు నా శక్తి స్వరూపములే. నా యీ శక్తికి భిన్నముగ నేదే నున్నదేమో చెప్పుము. నా శక్తిచేతనత్వమే యీ సృష్టియందంతటను వ్యాపించియున్నది.

ఎల్లదేవతలందు నే నొక్కతెను పెక్కు నామ రూపముల నలరుచుందును. నేను శక్తి రూపముదాల్చి నా విక్రమము జూపుదును. బ్రాహ్మి వైష్ణవి రౌద్రి గౌరి శివ నారసింహి వాసవి వారుణి కౌబేరి మొదలుగాగల రూపములన్నియు నావే. సకల కార్యములుత్పన్నముగాగ నేను వానిలో ప్రవేశింతును. ఆ కారణమున నీ కార్యములన్నింటిని నేనే చేయింతును. నీటియందలి చల్లదనము అగ్నియందలి వేడిమి సూర్యుని యందలి ప్రకాశము చందురు నందలి చల్లని వెన్నెల నేనయి యొప్పుచున్నాను. నా శక్తి తోడులేనిచో బ్రహ్మ యణువంతగూడ కదలజాలడు. ఇక ప్రాణులమాట చెప్పనేల? ఇదంతయు నిజమని నీతో పలుకుచున్నాను. 

ఆ శివునియందు శక్తిలేనిచో నతడు దనుజులను దునుమాడ జాలడు. ఈ భూమిపై శక్తిరహితుని లోకులు చవట యందురు. అట్టి చవటను వీడు విష్ణుహీనుడనికాని రుద్రహీనుడనికాని లోకులు పలుకరు. మరేమన వీడు శక్తిహీనడని తెగ తెగడుదురు. పతితుడు స్ఖలితుడు భీతుడు శాంతుడు శత్రువశుడు నగువానిని జనము శక్తిహీనుడనునుగాని రుద్రహీనుడనరు. ఇంతకు నీ సృష్టికంతటికిని మూలకారణము శక్తియని యెఱుంగుము. నీవును శక్తియుక్తుడవైననాడే సృష్టికార్యము చేయజాలుదువు. అదేవిధముగ హరి శివుడు ఇంద్రుడు రవి చంద్రుడు అగ్ని వరుణుడు వాయువు యముడు శక్తిసంపన్నులై యెప్పుచున్నారు.

ఈ భూమిలో గొప్ప ధారణశక్తి గలదు. కాననే ధరణి సర్వమును మోయుచున్నది. కానిచో భూమి యొకచిన్న రేణువునుగూడ మోయజాలదు. అట్లే మహాశేషుడు కూర్మము దిగ్గజములు మున్నగువాని యందలి భరించు శక్తి నాదే. ఆ శక్తి వలననే వారు సర్వము భరించి సర్వకార్యములు సాధింప సమర్థులగుచున్నారు. నేను నీరుగ్రోలినచో నెంతటి పెనుమంటలైన చల్లారిపోవును. నేనే తలచుకొన్నచో గాలినెక్కడికక్కడ స్తంభింప జేయగలను. కావున దైవతత్త్వమువలన సత్తులుగ భావించి యెన్నడును సందేహింపరాదు. 

ఏ వస్తువునకైన ప్రాగభావము ప్రధ్వంసాభావము గలుగవచ్చును. ఎట్లన మట్టిముద్దయందు కుండ ఘటరూపముగనబడదు. ఇపుడిచట భూమిలేదు. ఈ భూమి యెచట గలదని విచారింపగ నది పరమాణురూపమున నెచటనో కలదని తెలిసికొనవలయును. ఈ జగము శాశ్వతము క్షణికము శూన్యము నిత్యము అహంకారయుతమునను సప్త భేదములతో నుండును. పరమేష్ఠీ! ఇపుడు నీవీ మహత్తత్త్వము స్వీకరింపుము. దీనినుండి యహంకారముత్పన్నమగును. దానివలన వెనుకటివలె సర్వభూతసృష్టి కొనసాగింపుము. ఇపుడు మీరు మీమీ లోకములు నిర్మించుకొని యందు సుఖనివాసము చేయుడు. మీమీ కార్యములను యథాయోగ్యమున దైవ ప్రేరితముగ కొనసాగింపుడు. నీవీ మహాసరస్వతీ శక్తిని పరిగ్రహింపుము. ఈమె సురూప- రజోగుణాత్మిక - చారుమృదుహాసిని. శుభవస్త్రాన్విత దివ్యసంస్కృతభూషణ వరాసనాసీన. ఈమె నీ సహధర్మచారిణియై నీ విలాసములందు నీకు చేదోడు వాదోడుగ నుండగలదు. ఈమె నావాగ్విభూతి. ఈమె నెన్నడు నవమానింపకుము. సరసధ్వనిగ విశ్వమాన్యగ విశ్వపూజ్యగ విశ్వప్రియగ భావింపుము. నీవీమెనుగూడి సత్యలోకమేగుము. సర్వవిధముల ప్రజల నందుండి సృజింపుము. జీవులందరును తమతమ కర్మానుసారముగ కారణరూపముననుందురు. తమతమ వెనుకటి కర్మలతో లింగకోశమునందున్న జీవులను తగినకాలమునందు మునుపటివలెనే మరల సృజింపుము.

అన్ని జీవులను వాని స్వభావము-కాలము-కర్మమునకు దగినట్లుగా పూర్వమువలె మరల సృష్టించుము. ఈరీతి నీరేడులోకములను విరచించుము. శ్రీమహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు. అందువలన నతడు నీకంటె శ్రేష్ఠుడు. నీకెల్ల వేళల మాననీయుడు పూజనీయుడునగును. నీవు దుస్తరకార్యము లొనరించినప్పుడెల్ల హరి ధర్మసంరక్షణ కవతరించును. అ జనార్దనుడు నరతిద్యగ్యోనులందు జన్మించి దానవులను వినాశమొనరించుచు సాధువులకు పరితోష మొనరించుచుండును. 

మహాబలశాలి యగు శివుడు నీకు తోడుగనుండును. అపుడు నీవీసకల ప్రపంచములను సృజియించి స్వేచ్చగా విహరింపుము. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు విధివిధానముగ సమభావముతో భూరిదాన దక్షిణలతో మీ యాగములొనరింతురు. దేవతలు యాగములందమృత మధురమైన నా నామ జపమొనరించుచు సంతుష్టలైయుందురు. సోముడగు పరమశివుడు తమోగుణ ప్రధానుడు. అతడెల్ల యాగములందు పూజ్యుడు మాన్యుడునగుచు మహారుద్రాభిషేకములందు కొనుచుండును. దేవతలకు దైత్యులవలన నుపద్రవములు సంభవించునపుడెల్ల నా దివ్యశక్తులెల్లెడల నుత్పన్నములై సురలకు భయము బాపి యసురుల పీచమడంచును. వారాహి నారసింహి వైష్ణవి గౌరి సదాశివ మున్నగువారు నా శక్తి స్వరూపిణులు, లోకాతీత కార్యము, లొనరింపజాలుదురు. ప్రణవాత్మకమైన నా గుహ్య నవాక్షరమంత్రమును సబీజముగ ధ్యానయుతముగ నిరంతరము జపించుచు నీ పనులన్నియు చక్కబెట్టుకొనుచుండుము. ఈ మంత్రరాజము సర్వమనోరథములు నెరవేర్పగలదు. దీనిని చక్కగ నేమఱుపాటులేక హృదయంబున నిలుపుకొనుము."

అని యిట్లు జగనాత్మ బ్రహ్మతో బలికి పిదప లేతనగవున సుధలు చిందగ హరితో నిట్లు పలికెను: 

"ఓ విష్ణూ! నీ వీ మనోహరయగు రమాదేవిని గైకొని చనుము. ఈ యమ నీ వక్షఃస్థలమును నివాసముగ జేసికొని వసించును. ఈమె సిరిసంపదలకు పెన్నిధి. నీ విలాసార్థ మీ కల్యాణిని నీ కొసంగితిని. ఈమె లోకాలకు దీపాంకుర. ఈమెను నీ వేనాడును దూలనాడకుము. మన్నించి గారవింపుము. నేను మీ కిట్లు యోగము విధించితిని. దీనికి తిరుగులేదు. దేవతల మనుగడకు యజ్ఞములు విధించితిని. మీలో మీరలు పోట్లాటలు మాని క్షమతాసమతలతో వర్తింపుడు. నీవు సదాశివుడు బ్రహ్మయును నా స్వాంశవలన జన్మించితిరి. మీర లెల్లవారలచేత మాననీయులై నిత్యపూజ లందుకొందురు. ఇందు ఆవంతయు సందియము లేదు. మీ మువ్వురి యెడలను భేదము పాలించు మూఢమతులు నరకముల పాలగుదురు. ఇది ముమ్మాటికి నిజము. శివుడే స్వయముగ విష్ణువు. విష్ణువే స్వయముగ శివుడు. వీరికి భేదము గలదను వారు నిశ్చితముగ నరకయాతన లందగలరు. బ్రహ్మను సైత మిటులే యభేదభావమున గాంచవలయును. హరీ! ఇంక గుణభేదములయందలి యంతరము చెప్పుదును వినుము. ఆ పరమాత్మను తన యెదలో జింతించుటకు సత్త్వగుణము కావలయును. నీకు రజస్తమస్సులు ప్రధానమైనవి గావు. పలు వికారములు భేదములు గలిగినప్పుడు రజోగుణముతో ఈ లక్ష్మితోగూడి వర్తింపుము. వాగ్బీజము మాయాబీజము కామబీజమునను త్రిబీజములుగల మంత్రము సకలార్థప్రదాయకము. దీనిని నీకు ప్రసాదించితిని. ఈ దివ్యప్రణవ మంత్రమును గ్రహించి పాటించి నియమించి జపించుము. యథాసుఖముగ సంచరింపుము. నీ కిక మృత్యుభయముగాని కాలభీతికాని కలుగనేరదు.

నే నీ మాయాశక్తితో విహరించు నంతకాలము జగము లుండును. తుద కీ చరాచరవిశ్వము నాయందు లయ మందును. ఆనాడు మీరును నాయందే లయమందుదురు. అంతదనుక కామదము ముక్తిప్రదమునైన నా యీ రహస్యమంత్రమును నిత్యము జపించుచుండుము. శుభములు బడయగోరువాడీ మంత్రమునకు పణవము జేర్చి జపింపవలయును. నీ వింక వైకుంఠము నిర్మించుకొని యందు సుఖనివాస మొనరించుచుండుము. సనాతన భగవతినగు నన్నును చింతించుచు స్వైరవిహారము సల్పుము." అని త్రిగుణ ప్రకృతి యగు పరాభట్టారికా దేవి వాసుదేవునితో బలికె నని బ్రహ్మ పలికెను. 

పిదప ఆ నిర్గుణ స్వరూప శంకర భగవానునితో నమృతము గురియుచు నిట్లు పలికెను: 

ఓ మహాదేవ! హర! నీ వీ సర్వశక్తిమయి శ్రీమహాకాళియగు గౌరిని జేపట్టుము. నీవు కైలాసము నిర్మించుకొని యందుస్వేచ్ఛగ సంచరింపుము. నీకు తమోగుణము ప్రధానము-సత్వరజస్సులప్రధానములుగ నుండును. నీ రజస్తమోగుణములచేత రాక్షసవంశ నాశమగును. ఆ పరమాత్ముని నిత్యము సంస్మరించుటకు జాగరూకతతో తమ మొనరించుము. నీవు శాంతభావమున సత్త్వగుణుడవై శర్వరూపము నాశ్రయించి యుందువు. ఇట్లు మీరు మువ్వురును త్రిగుణులై సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. జగముల కన్నిటికి త్రిగుణములే మూలస్తంభములు. ఈ ప్రపంచమున ప్రతి వస్తువు త్రిగుణమయమై యొప్పెసగును. ఈ సారహీనమైన ప్రపంచమందు నిర్గుణతత్వమును నేను జూచితి నన్నవాడుగాని చూచువాడుగాని చూడగలవాడుగాని లేడు. నిర్గుణ మా పరమాత్మయే. అతడు దృక్కేకాని దృశ్యతత్త్వము కాడు. శంకరా! నేను సృష్టి కాలమున సగుణను-లయమున నిర్గుణనై వెలుగొందుదును. నే నెప్పుడును కారణరూపమున నుందునుగాని కార్యరూపమున నుండను. నేను కారణరూపమున నిర్గుణను. పరమ పురుషు నానందసంగమంబునందు సగుణనై యుందును. మహత్తత్త్వము - అహంకారము - శబ్దాదిగుణములు - కార్యకారణ రూపములు ననువానితో జేరి నేను రేబవళ్ళు వ్యవహరింతును. నేను సదుద్భూతమైన యహంకార స్వరూపను. కాన సర్వకారణురాలను - శివరూపను.

అహంకారము నాకు కార్యము. అది త్రిగుణములను గూడియుండును. అహంకృతినుండి మహత్తత్వము గల్గును. అది బుద్ధి సమష్టి యనబరగును. అహంకారము కారణము. మహత్తత్వము కార్యము. ఆ యహంకృతినుండి పంచతన్మాత్రలు గల్గును. వాని నుండి పంచమహాభూతముల యుత్పత్తి జరుగును. పంచజ్ఞానేంద్రియములు-పంచకర్మేంద్రియంబులు-పంచమహాభూతములు-ఇవన్ని గలిసి పదారగును. ఇది కార్యములును కారణములు నగు షోడశాత్మక స్వరూపము. పరమాత్ముడు పురుషోత్తముడు-ఆద్యుడు-కార్యకారణ రహితుడు. ఈ విధముగ సృష్టి మొదట నా వలన నీ వికారములన్నియు క్రమముగ గలుగుచుండును.

ఇట్లు మీకు సంక్షేపముగ సృష్టి క్రమమును వెల్లడించితిని. ఇంక మీదట మీరలు మీ మీ విమానములమీద మీ మీ స్థానములకేగి యాత్మకార్యములు నిర్వహింపుడు. మి మ్మాపద లనెడి పెంజీకట్లు ముసరినప్పుడెల్ల నన్ను మదిలో సంస్మరింపుడు. నేను మీ బాధలు కూకటివేళ్లతో బెకలించి మీకు శుభోదయము గల్గింతును. దేవతలారా! నన్ను పరాత్మనుగ సనాతననుగ నిత్యము సంస్మరింపుడు. సర్వశక్తులమగు మాలో నెవరిని తలంచినప్పటికిని నిక్కువముగ మీకు కార్యసిద్ధి చేకూరును. మీరు మా మీదనే విశ్వాసము ప్రేమ ఉంచుడు. బాహ్యవస్తులను నమ్ముకొని మోసపోకుడు. అవి నురుగుల వంటివి.

బ్రహ్మ యిట్లనియె: ఈ ప్రకారముగ నా మహాశక్తి మాతో బలికి మా యాత్మలు సంస్కరించి శ్రీమహాలక్ష్మిని శ్రీవిష్ణునకు శ్రీమహాకాళిని శివునకు శ్రీమహాసరస్వతిని నాకు నప్పగించి యా జగదంబ మమ్ము వీడ్కొనెను. ఆ చోటు వదలిన వెంటనే మేము పురుషరూపములతో వెలుగొందితిమి. అపుడిదంతయును శ్రీదేవియొక్క యతిమానుషమతి లౌకిక మత్యద్భుతమైన ప్రభావమని మేము గ్రహించితిమి. మేము మరల నాదివ్యవిమాన మధిరోహించితిమి. అపుడు మాకాదేవికాని ద్వీపముగాని సుధాసింధువుగాని కనబడలేదు. ఆ విమానమున మేము మాత్రమే మిగిలితిమి. అట్లు మేమా విమానమునెక్కి మురారి చేతిలో దుర్దాంతులైన మధుకైటభులు హతులైన సాగరమందలి మహాపద్మము చెంతకేగితిమి.

అధ్యాయము 39 పంచభూత స్వరూప వివరణ

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Saturday, April 11, 2026

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 37

శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జగదంబను సంస్తుతించి విరమించిన పిమ్మట శర్వుడగు శంకరుడా తల్లి మ్రోల చేతుల జోడించి యిట్లు నుతించెను: 

శంకరుడు యిట్లనియె:సకలలోకవిధాన నిపుణవగు ఓ శివా! బ్రహ్మయు విష్ణువును నీ సత్ప్రభావము వలననే జన్మించి సగుణరూపుడ నైతిని. విశ్వజననీ! నీవే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నియును నీవే. తల్లీ! తెలియనివారు బ్రహ్మవిష్ణుమహేశులే యీ జగములనెల్ల రచించిరందురు. కాని, యది సరిగాదు. నిజముగ నీ ముమ్మూర్తులను పుట్టించినది నీవే కదా తల్లీ! నీ దయామృతశక్తివలననే వారీ జగములను నిర్మింపజాలుదురు. ఈ చరాచర జగములెల్ల పంచతన్మాత్రలు త్రిగుణములు నింగి గాలి యగ్ని నీరు నేల అను పంచభూతములతో మాత్రమే సృజింపబడుచున్నవందుమా? అది సరిగాదు. మరేమన - వానిలో నీ చైతన్యజ్యోతి లేనిచో వానికి జీవన తత్త్వము గలుగ నేరదు. హరిహర బ్రహ్మలు నీ దయచేతనే యీ చరాచర జగములు నిర్మించిరి. అందు నీవు బహు నామరూపములలో నీ నచ్చిన వేషము దాల్చి భూతములతో స్వేచ్ఛగ రమింతువు. విరమింతువు. లోకైక జననీ! హరిహరబ్రహ్మ లీ లోకాలను సృష్ట చేయదలచి నీ పదపద్మము లందలి ప్రేమ మధు కణములు గ్రోలుదురు. పిదప వారీ సర్వమును చిత్రవిచిత్రగతుల నిర్మింపజాలుదురు. తల్లీ! నీవు నిత్యసత్యస్వరూపపు దయామృతలహరివి! మఱి హరిని సత్వగుణునిగ బ్రహ్మను రజోగుణయుతునిగ నన్ను తమోగుణిగ నిట్లు భిన్నరూపులనుగ నేల సృజించితివి? అమ్మా! నీ బుద్ధి విషమముగ నున్నదని తలతుము. కానిచో నీ జగములను రాజు మంత్రి సేవకులు ధని దరిద్రుడు నను వై విధ్యముతో నేల సృజింతువు! నీ సత్వరజస్తమోగుణములచే హరి విధి శివులు సృజింపబడిరి. వారు పాలన సృష్టి సంహారము లొనరింతురు. ఈ ముజ్జగములకు వారు కారణభూతులు. హరిహరబ్రహ్మలమగు మేము నీ దివ్యవిమానమున బయనించునపుడు మార్గమధ్యమున మే మనంతపుణ్యలోకములు గంటిమి. అవి నిత్యసవ్యములుగ నున్నవి. వాని నెవ్వరు నిర్మించిరో మాకు దయతో తెలియబలుకుము. నీవు నీ యమృతకళలతో నెల్ల భువనములను బుట్టించి పెంచి త్రుంపదలతువు. నీవాత్మ పతితో పూర్ణసంయోగ మంది నిత్యానంద మనుభవింతువు. మాకు మాత్రము నీ దివ్యమార్గము లెట్టివో బోధపడుట లేదు.

మే మాడుదనమున నున్నవారము. మాకు నీ చరణ కమల ములందలి భక్తి ప్రసాదమిమ్ము. పురుషుడైనను నీ పదాంబుజంబులు నిక్కము భజింపని వాడు నిత్యసుఖములకు నోచుకొనడు. ఈ జగములందు నా మనస్సు నీ పదపద్మ సేవకు తప్ప మరెచ్చటికిని బోదు. నేను పురుషత్వమందినను త్రిభువనాధిపత్య మందినను నీ పదకమలములు పాసి యుండుటుకు నా మనసొప్పుటలేదు. నీ పాదపద్మముల సన్నిధినుండగ నా కెట్టి కొఱతయులేదు. నీ పదపద్మములు నా కన్నుల కెల్లవేళల గనబడుచున్న నదే పదివేలు-నేను పురుషత్వమును గోరుకొనను. యువతిగ నున్న నేను నీ చరణకమలము లాశ్రయించినచో నాకీ ముల్లోకములందు శాశ్వతయశము చేకురును! భవబంధములు తెగును! ఈ భూమిపై నీ పదసన్నిధి సౌభాగ్యమును గాలదన్ని నిష్కంటకమైన రాజ్యము గోరుకొను వాడెవ్వడు? ఒకవేళ నెవడేని నీ పదాంబుజములను తూలనాడినచో వాడు యుగములవఱకు జన్మ పరంపర లెత్తవలసిన వాడే యగును. ఏ మునులు నీ పదకమల మందలి భక్తి వదలి నిర్మలతప మొనరింతురో వారుగూడ విధివంచితు లగుదురు. ఏలన-వారు త్రిగుణమయులు. నీ సదమలభక్తిలేమిచే వారు ముక్తికి దూరులగుదురు. ముక్తిలక్ష్మి తపమునగాని దమమునగాని సమాధిచేగాని యాగాదులవలనగాని సాధ్యముగాదు. నీ పదజలములం దాత్యంతిక భక్తి యున్నప్పుడే మోక్షము కరతలామలక మగును.

ఓ సర్వ మంత్రాత్మికా! నా యెదలో నీ దయామృతరేణువు కొంత చిందింపదలచినచో నుత్తమము పావనము నగు నీ నవార్ణ మంత్ర రాజము నాకు ప్రసాదింపుము. నేను దానిని నిత్యము జపింతును. ఆత్మ చింతన సుఖమున నిత్యమోలలాడుదును. భవతారిణీ! జననీ! పూర్వజన్మమున నేను నవాక్షర మంత్ర మెఱింగితిని. కాని, యిపుడు నాకది స్ఫురించుట లేదు కనుక, నీభవార్ణవము దాటుటకు ఆ నవార్ణ మంత్ర ముపదేశింపుము. 

ఈ ప్రకారముగ మహాతేజస్కుడగు శివుడు పలుకగనే కరుణామయిదేవి శివునకు నావాక్షర మంత్రము స్పష్టమున నుపదేశించెను. శివుడు దేవివలన నవాక్షర మంత్రము స్వీకరించి యమితానందభరితుడై దేవీ పాదపద్మములకు వినయాంజలులు ఘటించి యచ్చోగూరుచుండెను. ఆ మంత్రము కామమోక్షప్రదము. దానిని బీజాక్షరములతో దీకగ చక్కగ శివుడు జపించుచు వెలుగొందుచుండెను. అట్లు లోకశంకరుడగు శంకరుడు మంత్రప్రభావమున శోభిల్లుటగని నేనును మహామాయా సన్నిధికేగి యామెతో నిట్లంటివి! 

బ్రహ్మ యిట్లనియె : ఓ జనయిత్రి! లోకధాత్రి! వేదములుగూడ నిన్ను గుఱించి సమగ్రముగ నభివర్ణింపనోపవు. ఓ యజ్ఞరూపిణి! నీవు యాగము లందు వేల్చునపుడు స్వాహానామమున పిలువబడుదువు. ఈ త్రిభువనములందు నీ వొక్కతెవే సర్వజ్ఞురాలవు! ఈ వింతలు గొల్పు ముల్లోకములకు నేను కర్తను. ఈ చరాచర జగములందు నాకంటె నితరుడెవ్వడును సమర్థుడు లేడు. నేనే కడు ధన్యుడను. సర్వశ్రేష్ఠుడనని గర్వాతిరేకమున దలచుచు నీ సంసార జలధిలో మునుకలు వేయుచున్నాను. ఓ ముక్తిప్రదాయినీ! భయనివారిణీ! ఈశ్వరీ! నేడు నీ సుప్రసాదమున నీ పదపద్మ సన్నిధి జేరిన నే నెంతయో ధన్యుడనని గర్వపడుచున్నాను. నాలోని మోహము గడియదీసి వెలుగుబాట జూపించుము అని నిను సవినయముగ వేడుకొనుచున్నాను. కావున నోమాతా! నీ చరణకమల ప్రభావమున నా మదినిండ శాంతికాంతులు నిండినవి. ఓ శివంకరి! ఇంక నీ యాన జవదాటను. నీ కింకరుడను. మోహ జలధిలో మునిగిన నన్ను గాపాడుము! నీ మహనీయ పవిత్ర చరిత్ర నెఱుంగని మూర్ఖులు నన్ను ప్రభువని తలంతురు. యాజకులు స్వర్గముగోరి యాగములు చేతురు.

ఆదిదేవీ! నాలుగు వర్ణములుగల ప్రజలను బుట్టింపుమని నీవు నన్ను జ్యేష్ఠునిగ బ్రహ్మగ నేర్పరచితివి. కాని, నా కంటె నితరుడెవ్వడు గలడను నహంకారముతో కన్ను మిన్ను గానకున్నాను. నా యపరాధము క్షమించుము! అష్టవిధయోగమార్గములలో శ్రమించి సమాధినిష్ఠులైనవారు సైతము నీ నామ మహిమ నెఱుగలేరు. కాని నీ దివ్యనామము కపటముగ బల్కినను సరే, అది ముక్తికి సోపానమగును. సాంఖ్యులు నీ దివ్యనామము పరిత్యజించి మూఢులై వర్తిల్లుదురు. అట్టి వారిని భవవారిధి నుండి దాటించి యుమృతత్వ మొసగుతల్లివి నీవే. ఆద్యులగు హరి హరులను గొల్చినను నీ పరమతత్వ మెఱింగినవారు నీ నామ మహిమ నెఱుంగగలరు. వారు నిన్ను మహాశక్తీ శివా ఈశ్వరీ అంబికా యని నీ దివ్యనామమును నిమిషమైన వదలక జపించుచుందురు. విశ్వజననీ! నీ కటాక్ష వీక్షణము మాత్రనే నీ వీ నలు తెఱుంగుల నున్న జగములను నిర్మింపజాలుదువు. ఐనను నన్ను సృజించి నాచేత సృష్టి విదింపజేయుట చూడగ నిదంతయు నీ వినోదలీలగ భాసించుచున్నది. శ్రీహరి విశ్వపాలకుడు. అతడు జలధి మధ్యమున నుండగ మధుకైటభ దానవుల బారినుండి యాహరిని బ్రోచిన తల్లివి నీవే. ఆ శివుడును నీ చేత హరింపబడి మరల ప్రళయాంతమున నీ కనుబొమల నడుమనుండి యుద్భవించును. ఓ విశ్వమాత! నీ పావన జన్మమునకు మూలమేదో మేమింతవఱకు కనివిని యెఱుగము. ఓ భవాని! నీ వొక్కతెవే యాద్య శక్తివి. సర్వతంత్ర స్వతంత్రవని మేము నిన్ను సంబోధింతుము. నీ శక్తి తోడున్ననే హరి విశ్వరక్షణమును రుద్రుడు సంహారమును నేను సృష్టిని చేయగల్గుచున్నాము. నీ చైతన్య శక్తి తోడులేనిచో నెంతటివాడైన నేమియు జేయజాలడు. హరి శివుడు నేనువలెత్రిమూర్తులు మరెవ్వరేనిగలరా? పూర్వముండిరా? ఇదంతయు సత్తు, అసత్తను వితర్కమును మూఢమతులే యొనరింతురు.

నీ యీ విచిత్రలీలా వినోదముల నాద్యదేవుడు నిర్గుణుడు నిర్వికల్పుడు నిరుపాధికుడు విశ్వేశ్వరుడునగు విశ్వుడే యవలోకింపగలడని విధిజ్ఞులు పలుకుచుందురు. చరాచర భేదములుగల యీ రేడు లోకములందు నీ కంటె నన్యుడెవ్వడును లేడు. వేదవాక్కెప్పుడును రిత్తగ బలుకదు. అదియ ద్వైతమునే వక్కాణించును. కాని నేడు నా యెదలో ద్వైతము భాసించుచున్నది. ద్వైతము వేద విరుద్ధము. దీనిని గూర్చి నాకు సంశయము గల్గుచున్నది. ఒకటియే. రెండవ వస్తువు లేదు అని వేదము లుద్ఘోషించును. నీవట్టి బ్రహ్మవా? లేక ఆదిశక్తివా? నా యీ సందియ ముడుపుము. నాది క్షుద్రబుద్ధి. నీ వాస్తవికత నెఱుంగ లేక నా మది కొట్టుమిట్టాడుచున్నది. నా యీ తీరని సంశయము సంప్రాప్తించినది. తల్లీ! నీవు నిజముగ పురుషుడవా? యువతివా?! నా కింతకు నిజము పలుకుము. పరాశక్తివగు నీ దయకు పాత్రుడనై నేనీ మహా మాయాసాగరమునుండి విముక్తుడనగుదును.

అధ్యాయము 38 శ్రీదేవి త్రిమూర్తులతో సృష్టి క్రమమును తెల్పుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 36 Lord Vishnu praising Sridevi - అధ్యాయము 36 శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 36

శ్రీదేవిని శ్రీవిష్ణువు సంస్తుతించుట

బ్రహ్మ యిట్లనియె: ఆ జనార్దనుడు మరల నీ విధముగ నుద్బోధించెను. 'మన మెల్లరమిపు డీ దేవి సన్నిధి కరిగి యా తల్లి పదపద్మముమీద పదేపదే మన తలలుంచుదము. ఈ మహామాయ మన కోరిన కోరిక లెల్ల తీర్చగలదు. మన మీ దేవి సమక్షమునకేగి నిశ్చింతగ నామెను సన్నుతించుదము. ఒకవేళ ద్వారపాలురు మనల నడ్డగించినచో మన మచటనే నిలుచుండి తదేకచిత్తముతో శ్రీమహాదేవీ స్తోత్రము పఠించుదము.' ఈ ప్రకారముగ విష్ణువు పలికినమీదట మేమందఱము హర్షము వెలిపుచ్చి ఆ జగదంబ సన్నిధానమున కేగదలంచితిమి. మేము విమానము దిగి శంకించుచునే దేవిద్వారము చెంత కేగితిమి. 

మేము ద్వారము ముందునకు జేరగనే దేవి మమ్ము చూచి చిరునగవు నగి మమ్ము స్త్రీ రూపిణులుగ మార్చెను. మేమంతట సురూపములతో చెలగు చక్కని పడుచుకన్నెలమైతిమి. మా రూపములు చూచుకొని మాలో మే మాశ్చర్య మందుచు శ్రీదేవి సమక్షమున కేగి ఆ యతిలోకసుందరాంగి పదకమలముల మ్రోల స్త్రీరూపములతోనే మేము నిలుచుంటిమి. ఆ దేవి మమ్ము ప్రేమపూర్ణమైన చూపులతో గాంచెను. స్త్రీ రూపిణులమగు మే మా మహాదేవికి భక్తిప్రపత్తులతో వినయాంజలు లర్పించి ఒకరి మొగము లొకరము చూచుకొంటిమి. ఆ శ్రీదేవి పాదపీఠము నానా మణిగణ విభూషితము సూర్యకోటి ప్రతీకాశమునై కాంతులు విరజిమ్ముచుండెను. మే మా మణిపీఠమును నేత్రపర్వముగ దర్శించుచు కైమోడ్చి నిలుచుంటిమి.

ఆ దేవి సన్నిధానమునందు దేవి చెలికత్తియలు వేనకువేలు గలరు. వారిలో గొందఱు రక్తాంబరములు కొందరు పీతాంబరములు దాల్చిరి. ఆ జ్యోతిర్మయులగు దేవతలెల్లరు విచిత్ర వస్త్రభూషణములు దాల్చి శోభలు వెలార్చుచు ఆ శ్రీమాతను జేరి సంసేవించుచుండిరి. కొందఱు నర్తించుచుండిరి. ఇంక కొందఱు దేవి నుపాసించుచుండిరి. ఇతరుల హృదయములు పులకరింప మధురముగ వీణలు మీటిరి. వేణువులూదిరి. 

ఓ దేవర్షీ! ఇంతయేల? అచట మేముగన్న మహాద్భుతము వక్కాణింతును వినుము. ఆ విశ్వజనని పదకమలములందలి నఖములనెడి చరణములలో చరాచరమైన బ్రహ్మాండములు విష్ణువు రుద్రుడు నేను రవి వహ్ని యముడు వాయువు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు మున్నగు దిక్పతులు పర్వతాలు సాగరాలు నదులు అప్సరసలు విశ్వావసువు చిత్రకేతువు శ్వేతుడు చిత్రాంగదుడు నారద తుంబురులు అశ్వినులు వసువులు సిద్ధులు సాధ్యులు పితరులు శేషాదినాగులు కిన్నరులు రాక్షసులు బ్రహ్మలోకము వైకుంఠము పర్వతోత్తమమైన కైలాసము సమస్తము ప్రతిబింబించుచుండెను. నేను నా జన్మకారణమగు మహా పద్మమును ఆ పద్మమందున్న బ్రహ్మను శేషశాయి యగు శ్రీహరిని మధుకైటభులను గంటిని. ఇట్లా జగదంబ పదకమలముల కొనగోళ్ల వెల్గులందు సర్వవిశ్వముగని యెంతకు నంతుపట్టనివింతతో నే నాశ్చర్యమందితిని. శివవిష్ణువులును విస్మయ భరితులైరి. మేమంత నాదేవిని విశ్వమాతగ నొక్కుమ్మడిగ నంగీకరించితిమి. ఆ ప్రకారముగ నా యమృత కాంతులీను ద్వీపమందు మేము స్వేచ్ఛగ విహరించితిమి. ఆ దేవి మహనీయత గనుటలో మాకు నూరేండ్లు నిండెను. అచట మేలిమి సొమ్ములతో జిగజిగమని మెఱయుచు ప్రమోదమందుచున్న దేవాంగనలు మమ్ము తమ చెలికత్తియలుగ చూచుకొనిరి. మేమును వారి యందచందములకు లీలావిలాస వినోదములకు విభ్రాంతులమై సంతసిల్లి లోలోన వారి దివ్యభావములు దలపోయుచుంటిమి.

అప్పుడొకసారి స్త్రీ రూపమందున్న శ్రీ విష్ణువా శ్రీ త్రిభువనేశ్వరీదేవిని గూర్చి యిట్లు మహాద్భుతముగ స్తోత్రము చేయదొడగెను: 

శ్రీదేవికి ప్రకృతి విధాత్రి అమృతత్వ రూప కల్యాణి కామద వృద్ధి-సిద్ధి-శ్రీ సచ్చిదానంద స్వరూపిణి సంసారారణి పంచకృత్య విధాత్రి త్రిభువనేశి అగు దేవికి నమస్సులు. సర్వాధిష్ఠాన స్వరూప కూటస్థ అర్ధమాత్రార్థ రూప హృల్లేఖ అగు దేవికి వినయాంజలులు సమర్పింతును. జనయిత్రీ! ఈ విశ్వబ్రహ్మాండములు నీయందుండి యుద్భవించి నీవలన నెలవైయుండి మరల నీయందే లయమగునని నే నెఱింగితిని. ఇవి అన్నియు చేయు విధాత ప్రభావము నీ శక్తికే కలదనియు సకల లోకమయి వనియు నెరింగితిని. ఆకాశ వాయువులు నీ సద్రూపములు అమూర్తములు. అగ్ని జల భూములు నీ యసద్రూపములు మూర్తములు. వీనినన్నిటిని నీవు జీవరూపుడైన పురుషునకు తగిన సమయమున జూపింతువు. నీవు మా సంతోషమునకు పదారు సాంఖ్యతత్త్వములను నేడు మహదాదులను కల్పింతువు. ఇదంతయు నీ యింద్రజాలమని మాకు భాసించుచున్నది. నీ యనుగ్రహశక్తి లేనిచో నెంత వస్తువైనను చలింపదు. నీ చైతన్య శక్తియే యెల్ల పదార్థములందు నిండి నిబిడీకృతమై యున్నది. నీ శక్తిలేనిచో పురుషుడుగూడ శక్తిరహితుడే యగునని ధీమంతులు వచింతురు. నీవేనీ చైతన్య ప్రభావమున విశ్వమంతటిని ప్రకాశ శక్తితో నింపుదువు. నీ విశ్వాత్మ తేజముతో సమస్తమును వెల్లడి చేయుదువు. కల్పాంతమందీ విశ్వము నంతమొందింతువు. ఇట్టి నీ యద్భుత చరిత్ర వైభవమెవ్వడెఱుగగలడు? జననీ ! భవానీ ! అలనాడు మధుకైటభుల బారినుండి మమ్ము బ్రోచితిని. మాకు దయతో నీ విశాల దివ్యలోకములు జూపితివి. మమ్ము దివ్యానంద ధామములకు జేర్చితివి. నీ దివ్యదర్శనము మహా ప్రభావసంపన్నమైనది. తల్లీ! బ్రహ్మయు శివుడును నేనును నీ దుర్విభావ్యమైన పవిత్రచరిత్రము తెలిసికొనలేకున్నాము. ఇంక సామాన్యుడేమి తెలిసికొనగలడు? నీ విశ్వరచనా కళా కలాపమునందెన్నెన్ని భువనాలు రవణిల్లుచున్నవో చెప్పగలవాడెవ్వడు?

మే మీ భువనమునందు ప్రసిద్ధ ప్రభావములుగల హరిహరబ్రహ్మలను గంటిమి. ఈ త్రిమూర్తు లితర లోకాలలో గూడ నుందురా యేమి? మనోవాక్కుల కందని నీ విచిత్ర ప్రతిభా ప్రభావ సంపదలు మా కేనాటికి నంతుజిక్కుటలేదు. ఈ మా దీనులదొకే యొక విన్నపము అవధరింపుము. ఆనందనిలయమగు నీ దివ్యమంగళ విగ్రహము మా హృదయ పీఠములందు నిచ్చలు నివాళులందుకొననిమ్ము. నీ హ్రీంకారతారక నామామృతము తనివితీర మా నాల్కలపై నిత్యము ప్రవహింపనిమ్ము. నన్ను నీ దాసునిగ భావించుము. నిన్ను నా స్వామినిగ నేలికగ నెమ్మదిలో నిత్యము దలంతును. ఇట్టి తల్లికొడుకుల ప్రేమలు తెగకుండనిమ్ము. మమ్ము నీ కన్నబిడ్డలవోలె గాపాడుము. జగన్మాతా! ఈ యెల్లభువనముల రహస్యము నీకే తెలియును. నీవు సర్వజ్ఞవు. సర్వము నీయందే పరిసమాప్తమగును. నేను వట్టి పామరుడను. నీకు చెప్పగలవాడను గాను. నీవు మాకేది యుక్తమని తోచునో దానినే యొనరింపుము. బ్రహ్మ యీ లోకాలను పుట్టించును, విష్ణువు బ్రోచును, రుద్రుడు సంహరించునను నానుడి జగములందు ప్రసిద్ధమై యున్నది. ఇదంతయు నిజమేనా? ఏది యేమైన మేము మాత్రము నీ దివ్యశక్తితో యుక్తులమై నీ యిష్టప్రకారము వ్యవహరించువారము. పార్వతీ! ఈ సమస్తమును భూమి మోయుటలేదు. నీ ఆధారశక్తియే సర్వభారమును మోయుచున్నది. ఆ సూర్యుడుగూడ నీ స్వయంప్రకాశము గ్రహించియే జగములు వెలిగించుచున్నాడు. ఇటులెల్లవేళల నెల్లెడల నీవే నిర్మల రూపమున ప్రతిభాసించుచున్నావు.

ఓ జననీ! బ్రహ్మ శివుడు నేను నీ సత్ప్రభావమువలన నీ దయవలన జన్మించితిమి. మే మనిత్యులము. ఇక శతక్రతువగు నింద్రాదులు నిత్యు లెట్లగుదురు? నీవే సత్యవు; నిత్యవు; పురాణ ప్రకృతివి. శాశ్వతవు. నీవే పురాణపురుషుని కనికరింతువను సంగతి యిన్నాళ్లు నీ సామీప్యమున నండుటవలన గ్రహింపగలిగితిని. తెలియని ప్రతివాడును నన్నే విభుడని యాద్యుడని యీశుడని నిరీహుడని విశ్వాత్ముడని తలచి యహంకారమయమైన తమఃప్రకృతి గలవాడగును. పండితుల యందలి విద్య శక్తిమంతులయందలి శక్తి మనుజలోకమందలి కీర్తి-కాంతి-తుష్టి నీవే. ముక్తిప్రదవు కమలవు విశ్రాంతి ప్రదాయినివి నీవే. వేదమాతయగు గాయత్త్రి అర్ధమాత్ర స్వాహా స్వధా భగవతియగు సగుణనీవే. దేవతలు మొదలగు జీవుల బ్రతుకుదెరువునకు నీవే వాదాలు నిర్మించితివి. ఎల్లజీవులు నీ యనుగ్రహమునకు పాత్రులై తరించుటకే నీ వీ ప్రపంచములను లీలగ సృజింతువు. అనాదినిధనుడు అనఘుడు పరిపూర్ణుడునైన పరమాత్మయొక్క యంగమే యీ జీవాత్మ. ఈ సకలమును తుదకు నీవే యంతమొందింతువని నీ మహామహిమ నెఱింగిన జీవుడు శాంతుడగును. చమత్కారమయమైన నాటకమందొక నటుడాడి యాడి తుదకు విశ్రమించును. ఈ జీవులందఱు నటులే చివరకు నీ చెంతనే విశ్రమింతురు. ఈ కాలము సుఖదుఃఖములతో దాగుడుమూత లాడును. ఈ దుఃఖదాయకమైన కాలమునుండి మోహసాగరమునుండి మమ్ము వెన్నంటి గాపాడుము. తల్లీ! మేము నీ శ్రీచరణములకు శరణార్థులము. మహావిద్యా! శివస్వరూపా! సర్వార్థప్రదాయినీ! దేవాధిదేవీ! నీ పదకమలములమీద మా తలలుంతుము. మమ్మీ మోహసాగర మీద నిమ్ము. నీ విజ్ఞానమను వెలుగుబాట చూపుము. మము బ్రోచు భారము నీదే!

అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...