Thursday, July 30, 2026

The Story of Mangala chandi - మంగళ చండీ వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - మంగళచండీ వృత్తాంతం

నారదా! ఇక మంగళచండీ వృత్తాంతం విను. కల్యాణాలూ మంగళాలూ కలిగించడంలో అత్యంత సమర్థ. కనక మంగళచండి అనేపేరు ఏర్పడిందిట. మంగళుడు అర్చించి అభీష్టాలు పాందాడు. అప్పటినుంచీ ఈపేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళమహారాజు ఆరాధించి సప్తద్వీపధరాధిపతి అయ్యాడనీ అందుచేత మంగళచండి అయ్యిందనీ ఇంకొందరి కథనం. ఎవరు ఏమి చెప్పినా ఒకటిమాత్ర నిజం - ఆవిడ దుర్గ, మూలప్రకృతి. మూర్తిభేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణీ. స్త్రీలకు ఇష్టదేవత.

ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చెయ్యబోతూ బ్రహ్మదేవుడి ఉపదేశం మేరకు మంగళచండీపూజ నిర్వర్తించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి రథం ఆకాశంనుంచి నేలకు కూలిపోబోతోంటే - మంగళచండి ప్రత్యక్షమై అభయమిచ్చింది. నువ్వు వృషవాహనుడివి. సర్వేశుడవు. నేను యుద్ధ శక్తి స్వరూపను. నీవెంట ఊన్నాను. అధైర్యపడకు, శత్రువును సంహరించు - అని ప్రోత్సహించి అంతర్థానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మనువులూ మానవులూ ఋషులూ మునులూ స్తుతించారు. శంకరుడు భక్తినమ్రుడయ్యాడు. బ్రహ్మవిష్ణువులు ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌతవస్త్రాలు ధరించి వచ్చి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళకలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజాద్రవ్యాలతో నైవేద్యాలతో జంతుబలులతో షోడశోపచారాలతో నృత్యగీతాదులతో మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోత్సవంగా మహోన్నతంగా మహోద్దృతంగా పూజలు చేశాడు.

“ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్‌ స్వాహా” అనేది ఏకవింశాక్షర మహామూలమంత్రం. ఇది భక్త కల్పద్రుమం. పదిలక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యానశ్లోకాలు-

దేవీం షోడశవర్షీయాం శశ్వత్‌ సుస్థిరయౌవనామ్‌

బింబో
ష్ఠీం సుదతీం శుద్దాం శరత్పద్మనిభాననామ్‌

శ్వేతచంపకవర్ణాభాం సునిలోత్పలలోచనామ్‌

జగద్దాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యస్సర్వసంపదామ్‌ ॥

సంసారసాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే


ఇవి పఠించి మూలమంత్రంతో పూజచెయ్యాలి. శంకరుడు చేసిన స్తోత్రం - సర్వవేద సమ్మతం. యథాతథంగా గ్రహించు.

రక్ష రక్ష జగన్మాతర్ధేవి మంగళచండికే ।
హారికే విపదాం రాశేః హర్షమంగళకారికే ॥

హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే ।
శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే ॥

మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే

సతాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే ॥

పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే ।
పూ
జ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్‌ ॥

మంగళాధిష్ఠాతృదేవి మంగళానాం చ మంగళే

సంసార మంగళాధారే మోక్షమంగళదాయిని ॥

సారే చ మంగళాధారే సారే చ సర్వకర్మణామ్‌ ।
ప్రతిమంగళవారే చ పూజ్యే మంగళసుఖప్రదే ॥

అటుపైని ప్రతి మంగళవారంనాడూ ఈ మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నాడు. మొదటిపూజ శివుడు చేశాడు. రెండవపూజ మంగళుడు (అంగారకగ్రహం). మూడవపూజ మంగళమహారాజు. నాల్గవ పూజ ప్రతిమంగళవారమూ దేవతాస్త్రీలు ఆందిస్తున్నారు. అటుపైని మానవకాంతలందరూ చేస్తున్నారు.

ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలూ కలుగుతాయి. పుత్రపౌత్రాభివృద్దిగా కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతుంది.

మానసాదేవి పూజ


The Story of Shashthi Devi - షష్ఠీదేవి చరితం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ష్ఠీదేవి చరితం

నారదా! అయితే చెబుతున్నాను. ఆలకించు. ప్రకృతిమాతలో ఆరవ అంశగా అవతరించింది కనక ష
ష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకూ బాలబాలికలకూ అధిష్టాత్రి. బలవర్ధని. విష్ణుమాయా స్వరూపిణి. మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ. స్కందుడి భార్య, ఆయుఃప్రద, బాలబాలికలకు పెంపుడుతల్లి, రక్షణకారిణి యోగమాయారూపంలో పురిటింట శిశువుల పజ్జ ఉంటుంది. ఆవిడ పూజావిధానం తెలుసుకోదగింది.

స్వాయంభువ మనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. యోగీంద్రుడు. చాలాకాలం వివాహం చేసుకోలేదు. తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మప్రయత్నంమీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు.దంపతులకు ఇష్టిఫలంగా చరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. పన్నెండేళ్ళు మోసింది. బంగారంలాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడుగానీ మృతశిశువు. కళ్ళు తేలవేశాడు. దంపతులూ బంధుగణమూ రోదించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్చిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ ఆడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరిత్యజించడానికైనా సిద్దపడ్డాడు తప్ప మృతశిశువును ఖననం చేయ్యడానికి ఇచ్చగించలేదు. చెయ్యలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో. శోకాతురుడైపోయాడు.

అంతలోకీ ఒక దివ్యవిమానం కోటిసూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలలో పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు. స్తుతించాడు. పూజలు జరిపాడు.

మహాదేవి! నువ్వు ఎవరు? ఎవరి ఇల్లాలివి? ఎవరి అమ్మాయివి? స్త్రీరత్నంలాగా భాసిస్తున్నావు.

ప్రియవ్రతా! నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆపేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను. స్కందుడికిచ్చి వివాహం చేశాడు. మాతృకలలో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో ఆరవ అంశగా అవతరించాను. కనక ష
ష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రను అందిస్తాను. దరిద్రులకు ధనం కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఃఖాలూ భయశోకాలూ శుభాశుభాలూ సంపద్విపత్తులూ అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రలయ్యేదీ ఒకరు వంశహినులయేదీ కర్మఫలమే. కొందరికి మృతశిశువులు లభించినా కొందరికి చిరంజీవులు కలిగినా కర్మవిపాకమే. గుణవంతులూ గుణహీనులూ రూపవంతులూ కురూపులూ అంగవికలులూ బహుభార్యావంతులూ భార్యావిహీనులూ ఆరోగ్యవంతులూ రోగపీడితులూ - అందరూ కర్మఫలస్వరూపులే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది. అన్నింటికన్నా బలియం. ఇది వేదాలు చెప్పినమాట - అంటూనే మృతశిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునరుజ్జీవితుణ్ణి చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యంనుంచీ ఆనందంనుంచీ తేరుకోలేకపోతున్నాడు దేవసేన ఆ బాలకుడితోనహా విమానం అధిరోహించింది. బయలుదేరబోయింది. రాజు తేరుకుని మరొక్కసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది.

ప్రియవ్రతా! నువ్వు ముల్లోకాలకీ రాజువు. స్వాయంభువ మనువు పుత్రుడవు. కనక సకల లోకాలలోను నా పూజలు జరిపించు. నువ్వూచెయ్యి. ఆలా అయితేనే నీకు ఈ కులవర్దనుడైన పుత్రుణ్ణి ఇస్తాను. ఇతడ సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడూ పండితుడూ అవుతాడు. ఇతడు నారాయణకళ. జాతిస్మరుడు యోగీంద్రుడూ అవుతాడు. నూరు యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలూ అందుకొంటాడు. లక్షమదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకూ జ్ఞానులకూ తపస్వులకూ సిద్దిప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంత్ప్రదుడుగా వెలుగొందుతాడు.

పూజలు జరుపుతాననీ జరిపిస్తాననీ దేవసేనాదేవికి మాటఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగివచ్చాడు. మాలతీదేవికీ బంధువర్గానికీ అమాత్యులకూ పరివారానికీ ప్రజానీకానికీ - జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు. పండగ జరిపారు. అప్పటినుంచీ ప్రతినెలా శుక్షషష్టినాడు ఇంటింటా ష
ష్ఠీదేవీ మహోత్సవాలు జరిపించాడు. పురిటిళ్ళల్లో ఆరవరోజున పదకొండవరోజున అన్నప్రాశనరోజునా ప్రతిశుభకార్యమప్పుడూ షష్ఠీదేవీ పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు.

కాథుమశాఖోక్తంగా ధ్యాన పూజావిధాన స్తోత్రమంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు. నేను నీకు చెబుతున్నాను. నారదా! వింటున్నావా? సాలగ్రామంలోనో మంగళకలశంలోనో వటవృక్షం మూలనో గోడమీద బొమ్మగీసిగానీ బొమ్మ చేసిగానీ ష
ష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి. ధ్యానించాలి.

సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూమ్‌

శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణ భూషితామ్‌ 


పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాం భజే ॥

పుష్పాలతో పూజించాలి. షోడశోపచారాలూ శ్రద్ధగా చెయ్యాలి. నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం ష
ష్ఠీదేవ్యె స్వాహా అనేది మూలమంత్రం. ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జరిపించాలి. లక్షసార్లు జపిస్తే అపుత్రకులు పుత్రవంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇంక స్తోత్ర మేమిటంటే -

నమో దేవ్యై మహాదే
వ్యై సిద్ధ్యై శాంత్యై నమోనమః
శుభాయై దేవసేనాయై ష
ష్ఠ్యై దేవ్యై నమోనమః ॥

వరదాయై పుత్రదాయై ధనదాయై నమోనమః

సుఖదాయై మోక్షదాయై ష
ష్ఠ్యై దేవ్యై నమోనమః ॥

ష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్దాయై నమోనమః ।
మాయాయై సిద్దయోగిన్యై ష
ష్ఠీదేవ్యై నమోనమః ॥

పారాయై శారదాయై చ పరాదే
వ్యై నమోనమః
బాలాధిష్ఠాతృదేవ్యై చ ష
ష్ఠీదేవ్యై నమోనమః ॥

కల్యాణదాయై కల్యాణ్యై ఫలదాయై చ కర్మణామ్‌ ।
ప్రత్యక్షాయై స్వభక్తానాం ష
ష్ఠ్యై దేవ్యై నమోనమః ॥

పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు ।
దేవరక్షణకారిణ్యై ష
ష్ఠీదేవ్యై నమోనమః ॥

శుద్దసత్త్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా ।
హింసాక్రోధవర్జితాయై ష
ష్ఠీదేవ్యై నమోనమః ॥

ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి

మానం దేహి జయం దేహి ద్విషో జహి మహే హాశ్వరి ॥

ధర్మం దేహి యశో దేహి ష
ష్ఠీదేవ్యై నమోనమః ॥
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే ॥

కల్యాణం చ జయం దేహి ష
ష్ఠీదేవ్యై నమోనమః ॥

నారదా! ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు ష
ష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడూ బలవంతుడూ యశస్వంతుడూ పరిపాలనాదక్షుడూ కాగలిగాడు.

ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సరంపాటు పఠించినా విన్నా అపుత్రకులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాదిపాటు ఈపూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్ళల్లో ఆరోగ్యం చేకూరుతుంది.

మంగళచండీ వృత్తాంతం


Dakshinadevi Puja - దక్షిణాదేవిపూజ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దక్షిణాదేవిపూజ

మహర్షీ! దక్షిణాదేవి కథ చెప్పావు. ధ్యాన స్తోత్ర మంత్ర పూజావిధానాలు చెప్పలేదు. అవికూడా వినిపించు.

బ్రహ్మతనయా! ఆలకించు. అది అంతా కాణ్వశాఖోక్తం. అలనాడు యజ్ఞుడు చేసిన దక్షిణాస్తోత్రమేమిటంటే -

కార్తికపూర్ణిమనాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంసంనుంచి ఆవిర్భవించావు కనక నువ్వు దక్షిణాదేవివయ్యావు. అంతకుముందు గోలోకంలో నువ్వు సుశీలవు. శ్రీకృష్ణుడి ప్రేయసివి. రాధాసమానవు. రాధాదేవి శాపంవల్ల గోలోకం విడిచిపెట్టి తపస్సుచేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు. ఇప్పుడు భాగ్యవశాన నాకు లభించావు. దక్షిణాదేవీ! దయచూపించు. నన్ను భర్తగా స్వీకరించు. కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించే దేవివి నువ్వే. నువ్వు లేకపోతే అందరి సత్కర్మలూ నిష్ణలమవుతాయి. నువ్వు తప్ప మరింకెవ్వరూ - బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగానీ దిక్సాలాది దేవతలుగానీ కర్మఫలాన్ని ఇవ్వలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి. ఫలరూపి మహేశ్వరుడు. యజ్ఞరూపి విష్ణుమూర్తిని నేను. మా అందరికీ సారరూపిణివి నువ్వు.

కర రూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః ।
యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ ॥

నువ్వు నిర్గుణవు. పరాప్రకృతివి. శక్తివి. నీవల్లనే శ్రీకృష్ణపరమాత్మ శక్తుడయ్యాడు. జన్మజన్మలకూ నువ్వు నాతో ఉండి నన్నూ శక్తుణ్ణి చెయ్యి - అని స్తుతించి ఎదుట నిలబడ్డాడు. దేవి సంతుష్టయై వరించింది.

ఇది యజ్ఞాడు చేసిన దక్షిణాస్తోత్రం. యజ్ఞకాలంలో పఠిస్తే యజ్ఞాలు విశేషఫలితాలను ఇస్తాయి. రాజసూయ - వాజపేయ - గోమేధ - నరమేధ - అశ్వమేధ - లాంగలయజ్ఞ - విష్ణుయజ్ఞ - కుబేరయజ్ఞ - ధనదాన - భూమిదాన - ఇష్టాపూర్తనిర్మాణ - ఫలదాన - గజదాన - గోమేధకదాన - లోహదాన - స్వర్ణదాన - రత్నదాన - తామ్రదాన - శివయజ్ఞ - రుద్రయజ్ఞ - శక్రయజ్ఞ - వరుణయాగ - వైరిమర్దన కండకయజ్ఞ - శుచియజ్ఞ - ధర్మయజ్ఞ - పాపమోచన యజ్ఞ - యోనియాగ - వాణీయాగాది సమయాలలో దీన్ని తప్పక పఠించాలి. నిర్విఘ్నంగా శీఘ్రంగా అత్యధిక ఫలదాయకాలు అవుతాయి. ఇక ధ్యానపూజావిధులు ఎమిటంటే -

సాలగ్రామంలోగానీ మంగళ కలశంలోగానీ దక్షిణాదేవిని ఆరాధించాలి, రెండు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. మూలమంత్రమూ ఉంది.

లక్షీ దక్షాంససంభూతాం దక్షిణాం కమలాకళామ్‌ ।
సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణామ్‌ ॥

విష్ణోః శక్తిస్వరూపాం చ పూజితాం వందితాం శుభామ్‌ ।
శుద్దిదాం శుద్దిరూపాం చ సుశీలాం శుభదాం భజే ॥

ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహా అనే మూలమంత్రం జపిస్తూ పూజలు చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులతో షోడశోపచారాలూ శ్రద్ధగా నిర్వహించాలి. ఇలాచేస్తే దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్నిపనులూ ఫలవంతమవుతాయి. పుత్రార్థులకు పుత్రులూ ధనార్థులకు ధనాలూ విద్యార్థులకు విద్యలూ వివాహార్థులకు వివాహాలూ - ఎది కోరుకున్నవారికి అది లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడూ బంధువియోగం జరిగినప్పుడూ ఆపదలు వచ్చినప్పుడూ బంధనాలలో ఇరుక్కున్నపుడూ ఒక నెలపాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేసినా పురాణంగా విన్నా ఇబ్బంధులన్నీ తొలగిపోయి శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయి.

నారాయణమహర్షీ! నీ దయవల్ల దేవీస్వరూపాల కథలూ గాథలూ చాలామటుకు తెలుసుకోగలిగాను. తక్కినవారి చరితలుకూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అనుగ్రహించు.

నారదా! దేవీచరితలన్నీ వేదపురాణాలలో దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. దేవీప్రధాన రూపాలు ఎమిటో కళాంశావతారాలు ఏమిటో తొట్టతొలిగానే నీకు తెలియజెప్పాను. వాటిలో ఇంకా ఎమైనా మిగిలిపోయి ఉన్నాయేమో గుర్తుతెచ్చుకో. అవికూడా చెబుతాను విందువుగాని.

మహర్షీ! షష్ఠీ - మంగళచండీ - మానసాదేవి - వీరు ఆదిపరాశక్తి కళాంశరూపాలన్నావు. వీరి చరితలు చెప్పావుగావు.

షష్ఠీదేవి చరితం


Wednesday, July 29, 2026

chaturmasa dvitiya ashoonya sayana vratam - చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం

చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం

దంపతుల మధ్య పరస్పర అనురాగం దైవదత్తమైన మహాభాగ్యం. అది ఎప్పుడు క్షీణించినా, అది ఒకరి స్వంత ప్రారబ్ధం లేదా పూర్వపాపం కారణంగా కలి ప్రభావం పనిచేస్తోందనడానికి సూచన. పరిణతి చెందిన వ్యక్తి దీని కోసం ఎవరినీ నిందించడు. దీనికి పరిహారం 'అశూన్య శయన వ్రతం'.

ప్రతి చాతుర్మాస మాసంలో కృష్ణ పక్ష ద్వితీయ నాడు ఒక రోజు పూజ చేయండి. వీలైతే సాయంత్రం చంద్రోదయ సమయంలో చేయండి. ఇది కుదరదు అని అనుకుంటే ఉదయమే పూజ చేయండి. సాయంత్రం సాధారణ 'పూజ' చేసినా సరిపోతుంది. స్వామివారి కోసం ఒక చిన్న కొత్త పడకను సిద్ధం చేయండి. ఆ పడకపై స్వామివారి ప్రతిమతో పాటు లక్ష్మీదేవిని కూడా ఉంచండి.

సాధ్యమైతే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజను చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే, వారిలో ఎవరైనా తమ తమ ఇళ్లలో చేసుకోవచ్చు. ఈ పూజ కేవలం పరస్పర అపార్థాలతో బాధపడే దంపతుల కోసం మాత్రమే ఉద్దేశించినది కాదు. కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి దంపతులు ఈ పూజను చేయవచ్చు.

అశున్య శయన వ్రతంలో విష్ణు శయనోత్సవం ప్రధానమైనది. ఈ వ్రతం సందర్భంగా, విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని షోడశోపచారాలతో (16 రకాల పూజా కార్యక్రమాలతో) పూజిస్తారు.

Acts of charity without Dakshina - దక్షిణ లేని దానధర్మాలా

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దక్షిణ లేని దానధర్మాలా?

నారదా! దానధర్మాలుగానీ యజ్ఞయాగాదులుగానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి. తక్షణం ఫలం లభిస్తుంది. అని వేదం చెబుతోంది. అజ్ఞానంవల్లగానీ ఆటంకంవల్లగానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తంసేపు ఆలస్యమైతే రెండురెట్టు, ఒక రాత్రి గడిస్తే మూడుకోట్ల రెట్లూ, మూడు రాత్రులు గడిస్తే శతకోటిరెట్లూ, ఏడురోజులు గడిస్తే దానికి రెండు రెట్లూ, నెల గడిస్తే లక్షరెట్లూ, సంవత్సరం ఆలస్యమైతే మూడుకోట్లరెట్లూ అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్పలమవుతుంది. బ్రాహ్మణుల సామ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరింక జీవితంలో ఏ సత్కర్మకూ అతడు అర్హుడు కాడు. దరిద్రుడూ వ్యాధిగ్రస్తుడూ అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటినుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధతర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు, అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు.

దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడూ, ప్రతిగ్రహీతనుంచి తిరిగి యాచించి తీసేనుకున్నవాడూ ఇద్దరూ తాడు తెగిన తప్పేలాల్లాగా నరకకూపంలో పడిపోతారు.

బ్రాహ్మణుడు అడిగినా దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాకనరకానికి పోతాడు. లక్ష సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానా హింసలూ అనుభవిస్తాడు. అటుపైని దరిద్రుడుగా వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతడి వంశంలో ఇటూ అటూ ఎడుతరాలవారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది.

నారదా! విన్నావుకదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏవైనా సందేహాలూ సత్కథలూ కావాలంటే అడుగు. చెబుతాను అని ముగించాడు నారాయణమహర్షి నారదుడు వెంటనే అందుకున్నాడు.

మహర్షీ! దక్షిణతో ప్రసక్తిలేని సత్కర్మలు లేవా? ఉంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇదొక చిలిపి సందేహమే అయినా నువ్వు తీర్చాల్సిందే.

నారదా! దక్షిణలేని కర్మకు ఫలమే ఉండదు. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలమూ ఫలితమూను. దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటు చేశాడు. అశ్రోత్రియంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చినదానం, అపరిశుద్దుడు చేసిన యజ్ఞం, అశుచి చేసిన పూజ, అభక్తుడి అర్బన - ఇలాంటి కర్మలనన్నింటినీ బలి అనుభవిస్తాడు.

దక్షిణాదేవిపూజ


The Story of Dakshinadevi - దక్షిణాదేవి వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దక్షిణాదేవి వృత్తాంతం

నారదా! ఇప్పుడింక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను. అదికూడా శ్రద్ధగా వినేసెయ్‌. గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూపయౌవన సౌందర్యాదులన్నింటా రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి. చక్కని పలువరుస కలిగిన సుందరీమణి(సుదతి). కమలలోచన. అవయవాల పాందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండులాంటి పెదవి, యౌవనమధ్యస్థ(శ్యామ), లేడిచూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు. కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వరసోత్సుక, కృష్ణప్రియభామిని.

ఒకనాడు ఈ సుశీల ఒక పాదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలిసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అధరం వొణుకుతోంది. శరీరం కోపం పట్టలేక ఊగిపోతోంది. తిట్టలేదు. కొట్టలేదు. చుర్రున చూసి గిర్రున తిరిగి విసవిసా నడచుకుంటూ వెళ్ళిపోయింది.

శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపగోపీజనం మూడులక్షల కోట్లమంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి. తమ నాథుడు. తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరున విలపిస్తూ వెంటబడ్డారు.

పారిపోతున్న కృష్ణుడినీ వెంటబడిన సుశీలనూ చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈరోజునుంచీ సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది - అనేసింది.

ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ ఎంతకీ అంతుబట్టలేదు. ఉస్సురంటూ అందరూ తిరిగి వచ్చారు రాధమ్మను శరణువేడారు. కృష్ణుణ్ణి రప్పించమనీ కోపం ఉపసంహరించుకోమనీ పాదాలుపట్టి ప్రార్థించారు.

రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటీ కోటియుగాలై బరువుగా సాగుతోంది.

హేకృష్ణ! ప్రాణనాథా! ప్రాణేశా! చేరరావయ్యా! ప్రాణాధిక ప్రియా! ప్రాణాధిష్ఠానదేవతా! దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సొభాగ్యంవల్లన కదా స్త్రీలకు గౌరవమూ గర్వమూ పెరిగేది! అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పత్తిని సేవించాలి. కులస్త్రీలకు మగడే బంధువు. ప్రాణాధిదేవత. సకల సంపత్స్వరూపుడు. మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు. సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు మగడే. కోపాన్నీ అవమానాన్నీ తొలగించేవాడూ మగడే. సంసారంలో సారం మగడే స్వామి మగడే. బంధువుల్లోకల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటివచ్చె బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనక భర్త, పాలిస్తాడు కనక పతి. శరీరానికి అధిపతి కనక స్వామి, కోరికలు తీరుస్తాడు కనక కాంతుడు. సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనక బంధువు. ప్రీతి కలిగిస్తాడు కనక ప్రియుడు. ఐశ్వర్యం కలిగిస్తాడు కనక ఈశ్వరుడు. ప్రాణాలకు ప్రభువు కనక ప్రాణేశ్వరుడు. రతి సుఖం పంచుతాడు కనక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువుకు మరొకడు లేడు. ఉండడు. మగడి శుక్లంవల్ల జన్మిస్తాడు కనక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు వందమంది బిడ్డలకన్నా మగడే ప్రియుడు. అతడిమీద ప్రేమ అంత అధికం.

అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకలతీర్థాలలోనూ స్నానాలు చేసినఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వతపస్సులూ వ్రతాలూ దానాలూ ఉపవాసాలూ గురు విప్ర వేదసేవలూ చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం - ఇవన్ని కలిపినా పతిపాదసేవా ఫలంలో పదహారవవంతుకి సరితూగవు. గురువుకన్నా విప్రుడికన్నా ఇంద్రుడికన్నా దేవుడికన్నా మగడే గొప్పవాడు. ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపగోపీజనాలకూ అసంఖ్యాక బ్రహ్మాండాలకూ వాటిలో ఉన్న జీవరాశులకూ విశ్వాది సమస్తగోళాలకూ అధినాయికను కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణపరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీస్వభావం అటువంటిది. ఎంతటివారికైనా దురతిక్రమంకదా !

రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికీ మంటికీ ఏకధారగా విలపించింది. నాథా! నాథా! అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది.

ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన ఆ సుశీల గోలోకంనుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సుచేసి మహాలక్ష్మి శరీరంలో లీనమయ్యింది.

ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్ఠలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తి అయ్యిందిగానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పాందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ శరీరంలో దక్షిణాంసంనుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరుపెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలుచేసి స్తుతించాడు.

కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటిచంద్రులకాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య, కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగసముద్భవ. కమలాసన పూజిత(బ్రహ్మార్చిత), వహ్నిశిఖలాంటి వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరుస, మాలతీపుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందరవేషం. సుస్నాత(తలంటుపోసుకుంది), మునీశ్వరుల మనస్సులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరిబొట్టు, చందనపు చుక్క, పాపట సిందూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తయిన వక్షస్థలం. కామదేవుడికి ఆధారదేవతలాగా ఉంది. కామబాణపీడిత.

ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్చిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. నూరేళ్ళు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతి అయ్యింది. పన్నెండేళ్ళు మోసింది. సర్వయజ్ఞకర్మలకూ ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞకర్మఫలాలను అందిస్తుంటాడని వేదాలూ వేదవేత్తలూ చెప్పేమాట. ఆ ప్రకారం దేవతలకు యజ్ఞఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకూ నెలవులకూ వారు వెళ్ళారు.

దక్షిణ లేని దానధర్మాలా


The Story of Svadha - స్వధా వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వధా వృత్తాంతం

నారదా! ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. శ్రాద్ధాన్నఫలాన్ని వృద్ధిపాందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలూ శ్రాద్దాన్నమూ ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణపర్యంతమైన స్నానమూ, దేవపూజనపర్యంతమైన శ్రాద్దమూ త్రిసంధ్యాంతమైన ఆహ్నికమూ వేదవిహిత కర్మలు, ముప్పాద్దులా శ్రాద్ధతర్పణాలు చెయ్యాలి. బలిప్రదానం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞ (వేదపఠన) చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే. ఏ కర్మాచరణకూ అర్హుడు కాడు.

బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రాహ్మణులు నిత్యమూ తర్పణాలు విడిచి పెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారుగానీ ఎక్కడ ఏలోపం జరుగుతోందో అవి పితృదేవతలకు అందడంలేదు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు.

చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూపయౌవన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేతచంపకంలాగా నిగనిగలాడుతోంది. రత్నభూషలు ధగధగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతిశక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. అవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు. తృప్తి చెందారు.

అటుపైని బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్దాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటినుంచీ విప్రులందరూ అలాగే చెయ్యనారంభించారు. అవి పితృదేవతలకు ఆందనారంభించాయి. వారు ఆకలిదప్పులు తీరి ఆనందించారు.

దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగ ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం. మృతప్రాయం.

శరదృతువులో కృష్ణత్రయోదశినాడుగానీ మాఘమాసంలోగాని శ్రాద్దసమయాలలోగానీ ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైని పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా శ్రాద్దాన్నం (పిండం) పెట్టినా అది పితృదేవతలకు అందదు. కర్తకు ఫలం దక్కదు.

బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్‌ సుస్థితయౌవనామ్‌ ।
పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్దానాం ఫలదాం భజే ॥

ఇది స్వధాధ్యానశ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలోగానీ మంగళకలశంలోగానీ స్వధాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా - అనే మూలమంత్రంతో పూజచేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతాలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు.

పితౄణాం ప్రాణతుల్యా త్వం ద్విజజీవనరూపిణీ

శ్రాద్దాధిష్ఠాతృదేవీ చ శ్రాద్దాదీనాం ఫలప్రదా ॥

నిత్యా త్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే

ఆవిర్భావ తిరోభావౌ సృష్టౌ చ ప్రళయే తవ ॥

ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా ।
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ॥

కర్మపూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మితాః 


స్వధాదేవీ! నువ్వు పితృదేవతలకు ప్రాణసమానవు. బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్ఠాన దేవతవు, శ్రాద్ధతర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రతా! సృష్టివేళ నువ్వు
ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠులకోసం నువ్వూ స్వాహాదక్తిణలూ ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడంకోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు.

ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించినవారికి సర్వవాంఛలూ నెరవేరతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నానఫలం దక్కుతుంది. సర్వపాపాలూ తొలగిపోతాయి. వాజపేయఫలం లభిస్తుంది. 
స్వధా స్వధా స్వధా అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ - బలి - తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వధాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధఫలం దక్కుతుంది. ముప్పొద్దులా స్వధా స్వధా స్వధా అని మూడేసిసార్లు ధ్యానిస్తే ప్రియాసంగమ పుత్రప్రాప్తులు ఫలాలుగా చెబుతున్నారు. స్వధా స్తోత్రపఠనంవల్ల సకల తీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యం తప్పక లభిస్తుంది - అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్యరాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు.

దక్షిణాదేవి వృత్తాంతం


Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...