Friday, May 8, 2026

Tulasi Puja - తులసీ పూజ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ పూజ

నారాయణమహర్షీ! తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రంకదా! మరి ఆ తులసీ పూజావిధానం ఎమిటి? స్తోత్రం ఎమిటి? లోగడ ఎవరెవరు అర్చించి ఏమేమి ఫలాలు పొందారు? మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు? అంటూ నారదుడు ప్రశ్నలవర్షం కురిపించాడు.

శౌనకాది మహామునులారా! నారదుడి ప్రశ్నలకి అంతులేదు. నారాయణుడికి విసుగూ విరామం లేదు. ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు. ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు. సరే - నారాయణమహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలుపెట్టాడు. చెబుతున్నాడు. శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు కొనసాగించాడు.

నారదా! తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమా గంగా సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలనూ గౌరవాదరాలనూ అనుభవిస్తోంది. నవసంగమలోలుడై శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు. దీన్ని గమనించినా రమాగంగలు ఓరిమి వహించారు. సరస్వతిమాత్రం ఈర్ష్యను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగి జుట్టుపట్టుకుని కొట్టింది. అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడే అంతర్థానం చెందింది. సర్వసిద్దేశ్వరి, సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమయ్యిందో ఎవరికి తెలియలేదు. శ్రీహరికూడా ఆవిడజాడ కనుక్కోలేకపోయాడు. సరస్వతీదేవికి చెయ్యవలసిన బోధలు అన్ని చేసి అనుజ్ఞ తీసుకుని తులసీవనానికి వెళ్ళాడు. సుస్నాతుడై మడికట్టుకుని తులసీ తరుపూజ చేశాడు. భక్తితో ధ్యానమూ స్తోత్రమూ చేశాడు,

ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలను అయిదింటిని ముందుచేర్చి “బృందావన్యె స్వాహా” అనే అయిదింటితో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు. నారదా! ఇది మంత్రరాజం, కామితాలను ప్రసాదించడంలో కల్పతరువు. దీనితో విధివిధానంగా తులసీపూజ చేస్తే సర్వసిద్ధులూ కలుగుతాయి. ఇలా అర్చించి ధూపదీపనైవేద్యాలతో షోడశోపచారాలూ చేశాడు. తులసి సంతుష్టురాలై తరువునుంచి ఆవిర్భవించింది. శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది.

తులసీ! ఈ నాటినుంచీ నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్పుమీదా వక్షఃస్థలంలోనూ ధరిస్తాను. సకలదేవతలూ మానవకోటులూ నిన్ను శిరసావహిస్తారు - ఇది నా వరం - అని బుజ్జగించి ఆవిడను తీసుకుని మందిరంలోకి ప్రవేశించాడు.

నారాయణమహర్షి ఇంత క్లుప్తంగా చెబితే నారదుడికి తృప్తి కలుగుతుందా! ధ్యానమూ స్తవమూ పూజావిధానమూ సవివరంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ మహర్షిశ్రీహరిచేసిన తులసీస్తవాన్ని యథాతథంగా వినిపించాడు.

తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది. కనక బృంద అనిపేరు. గుంపుగా ఉంటాయి కనక బృందావనం. నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను. ఒకప్పుడు నాదేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమనే ఖ్యాతి లభించింది. ఆ సౌభాగ్య స్వరూపిణిని సేవిస్తున్నాను. అసంఖ్యమైన విశ్వాలలో పూజలు అందుకుంటోంది కనక విశ్వపూజిత అనే కీర్తి పొందింది. ఆ తులసిని సేవిస్తున్నాను. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే యశస్సు గడించిన తులసిని విరహాతురుడనై స్మరిస్తున్నాను. ఎన్ని పుష్పాలున్నా తులసీపుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు. పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక! భక్తులకు ఆనందాన్ని కలిగించడంవల్ల నందినీ నామధేయాన్ని సంపాదించుకున్నతులసి నాపట్ల సంప్రీత అగుగాక! జగత్తులో తనకు తులలేని కారణంగా (సాటి) తులసి అనే పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరిని శరణువేడుతున్నాను. కృష్ణుడికి ప్రాణస్వరూపిణియై కృష్ణజీవని అనిపించుకొన్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక!

శ్రీహరి ఇలా స్తుతించేసరికి తులసీవృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసింది. కన్నుల్లో నీళ్ళు కుక్కుకుంటూ తలవంచుకుని నిలబడింది. శ్రీహరి లాలనగా కౌగిలించుకున్నాడు. మందిరంలోకి తీసుకువెళ్లాడు. సరస్వతిదేవితో చెయ్యికలిఫించి చెలిమి చేయించి ఇద్దరినీ ఆనందపరిచాడు. సర్వపూజ్యత్వమూ సర్వవంద్యత్వమూ సర్వశిరోధార్యత్వమూ తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగింది. అవమానభారం తొలగిపోయింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది. లక్ష్మీగంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు.

బృంద - బృందావని - విశ్వపూజిత - విశ్వపావని - పుష్పసార - నందిని - తులసి - కృష్ణజీవని ఆనే సార్థకనామాష్టకాన్ని నిరంతరం భక్తితో పఠించేవారికి అశ్వమేధఫలం కచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం లేదు.

బ్రహ్మనందనా! తులసి చెట్టునుంచి తులసీదేవి ఆవిర్భవించినదీ శ్రీకృష్ణుడి పూజలు అందుకొన్నద్దీ కార్తికపూర్ణిమనాడు. కనక ఆరోజున విశ్వపావనిని అర్చించినవారికల్లా మోక్షమూ వైకుంఠనివాసమూ లభిస్తాయి. కార్తికమాసంలో తులసిపత్రాన్ని విష్ణుమూర్తికిగానీ విష్ణుభక్తుడికిగానీ సమర్పిస్తే వేనవేల గోవులను దానంచేసినంత పుణ్యం. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకు బంధువులు దొరకుతారు. తులసీస్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగబంధవిముక్తి కలుగుతుంది. భయాలూ పీడలూ పాపాలూ తొలగిపోతాయి.

నారదా! ఇదీ తులసీ పూజావిధానం. కణ్వశాఖోక్తం. తులసి చెట్టుని ఏ ఆవాహనమూ లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరం విడిదిచేసే ఉంటుంది. ధ్యానమూ షోడశోపచారాలూ చాలు సర్వపాపసంహరణాలు. తులసీపుష్పం పుష్పజాతిలోకే రత్నం. పాపకాష్ఠాలను దహించివెయ్యడానికి అది అగ్నిశిఖ. వేదాలుకూడా తులసీపుష్పానికి సాటివచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతున్నాయి. సర్వాత్మనా పవిత్రరూప. అందరికీ శిరోధార్యం. సర్వజనేప్సితం. జీవన్ముక్త, ముక్తిప్రద, హరిభక్తి ప్రదాయిని తులసికి వందనాలు. ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారదా! ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకా ఎమి కావాలో అడుగు.

నారాయణమహార్షీ! లక్ష్మి సరస్వతి గంగ తులసి - ఇలా అందరి ఉపాఖ్యానాలూ చెప్పావు అతి మధురంగా అమృతంకన్నా రుచిగా ఉన్నాయి. సావిత్రీ వృత్తాంతంకూడా నీ ముఖతః విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు.

సావిత్రీ పూజ


Salagrama Mahimalu - సాలగ్రామ మహిమలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సాల గ్రామ మహిమలు

శిలారూపివి కమ్మని నన్ను శపించావుకదా! ఆలాగే. గండకీతీరంలో సాలగ్రామశిలగా మారి నీ సాన్నిధ్యాన్నీ నీ స్పర్శనూ నిరంతరం అనుభవిస్తాను. ఆ తీరపర్వతగుహల్లో కోటినంఖ్యల్లో కీటకాలు చేరి దంష్ట్రలతో శిలలను తొలిచి సుదర్శన చక్రాలూ ద్వారాలూ ఏర్పరుస్తాయి. వాటినిబట్టి సాలగ్రామాలలో భేదాలు ఏర్పడతాయి. ఒక ద్వారమూ నాలుగు చక్రాలూ ఒక వనమాల ఉండి నీలమేఘశ్యామంగా ఉంటే అది లక్ష్మీనారాయణమనే సాలగ్రామం. వనమాల లేకపోతే లక్ష్మీజనార్దనం. రెండు ద్వారాలూ నాలుగు చక్రాలూ ఒక ఆవుడెక్కగుర్తూ ఉండి వనమాలా రహితమైతే అది రఘునాథం. రూపంలో చిన్నదై రెండు చక్రాలే ఉండి వనమాల లేకుండా నీలనీరదంలాగా ఉండేది వామనాభిదం. ఆకారంలో చిన్నదై ద్విచక్ర - వనమాలాసహితం శ్రీధరం. ఇది గృహస్థులకు లక్ష్మీప్రదం. పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాలా రహితమై ద్విచక్రయుతమైతే దానిపేరు దామోదరం. అంత చిన్నదీకాక పెద్దదీకాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగానూ ద్విచక్ర - బాణతూణ చిహ్నితమై ఉంటే దాన్ని రణరామం అంటారు. ఆకారంలో ఇలాగే ఉండి సప్తచక్ర - ఛత్ర చామర భూషణ చిహ్నితమైతే అది రాజరాజేశ్వరం. రాజులకూ ప్రజలకూ సంపత్ప్రదం. మరీ పెద్దదిగా ఉండి పధ్నాలుగు చక్రాలతో నీలమేఘం రంగులో ఉంటే దాన్ని అనంతం అంటారు. ఇది ధర్మార్థకామమోక్షాలను ఇస్తుంది. చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాంకితమై శ్రీ చిహ్నితమై ఆవుడెక్క ముద్రతో మేఘవర్ణంలో ఉండేదాన్ని మధుసూదనం అంటారు. ఏకచక్ర విరాజితానికి సుదర్శనమనీ, గుప్తంగా చక్రచిహ్నం ఉంటే గదాధరమనీ, గుర్రపు తల ఆకారంలో ఉండి ద్విచక్రాన్వితమైతే హయగ్రీవమనీ, అగ్రభాగం విశాలంగా ఉండి ద్విచక్రాంచితమై చూపులకి వికటంగా ఉంటే వైరాగ్యప్రదమైన నారసింహమని, విస్తృతాగ్రమై ద్విచక్ర వనమాలా విరాజితమై ఇలాగే వికటంగా ఉంటే గృహస్థులకు సుఖప్రదమైన లక్ష్మీనరసింహమనీ, (అగ్రభాగాన) ద్వారదేశంలో ద్విచక్రాంకితమై స్ఫుటంగా కనిపించే శ్రీగుర్తుతో ఉంటే సర్వవాంఛాప్రదమైన వాసుదేవమనీ, చిల్లులు ఎక్కువగా ఉండి సూక్ష్మచక్రాంచితమై మేఘం రంగులో ఉంటే ప్రద్యుమ్నమని, రెండు చక్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండి పృష్ఠభాగం వెడల్పుగా ఉంటే సంకర్షణమనీ, వర్తులాకారంలో ఉండి పీతవర్ణంలో శోభలీనుతూ ఉంటే అనిరుద్ధమనీ పేర్లు. ఎదైనా సాలగ్రామశిల అంటే సాక్షాత్తూ నారాయణ స్వరూపం. అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. సకలతీర్థాలూ వేంచేసి ఉంటాయి. సాలగ్రామార్చన సర్వపాప ప్రణాశకం. బ్రహ్మహత్యాది దోషాలుకూడా తొలగిపోతాయి.

ఈ శిలలు రూపంలో ఛత్రాకారంలో ఉంటే రాజ్యప్రదాలు, వర్తులంగా ఉంటే మహాసంపత్ప్రదాలు, శకటరూపంలో ఉంటే దుఃఖదాయకాలు, శూలాగ్రరూపంలో ఉంటే మృత్యుప్రదం, ముఖభాగం వికృతంగా ఉంటే దారిద్య్రప్రదం, పింగళవర్ణంలో ఉంటే హానికరం, చక్రం చిదికి ఉంటే వ్యాధికారకం, విరిగి ఉంటే మరణదాయకం. తులసీ! సాలగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతం దానం ప్రతిష్ట శ్రాద్ధం దేవవూజ ఇవన్నీ ప్రశస్తాలూ అధిక ఫలదాయకాలూ అవుతాయి. సాలగ్రామ శిలార్చనతో సర్వవేద పఠనఫలం సర్వయజ్ఞవ్రతఫలం సర్వతీర్ణస్నాన దాన ఫలం సర్వతపఃఫలం నిశ్చయంగా లభిస్తాయి. సాలగ్రామ శిలోదకాన్ని నిత్యం సేవిస్తే సకలదేవతానుగ్రహం లభిస్తుంది. మహాపవిత్రుడవుతాడు. ఆతడి స్పర్శను సకలతీర్థాలూ కోరుకుంటాయి. జీవన్ముక్తుడవుతాడు. హరిసన్నిధికి చేరుకుని హరిదాసుడవుతాడు. తడి పాదధూళి సోకి వసుంధర పవిత్రురాలవుతుంది. అతడి వంశంలో పుట్టి గతించినవారూ పుట్టబోయే వారూ అందరూ తరిస్తారు. కర్మబంధాలనుంచి విముక్తి పొందుతారు. విష్ణుపదంలో లీనమవుతారు.

సాలగ్రామశిలను ధరించి అసత్యాలు పలికితే వాడు కుంభీపాక నరకానికి పోతాడు. నియమాలను ఉల్లంఘిస్తే అసిపత్ర నరకంలో పడతాడు. సాలగ్రామపూజలో తులసీవిచ్చేదం చేస్తే(తులసి రహితంగా పూజచేస్తే) భార్యా వియోగమూ స్త్రీహత్యామహాపాతకమూ చుట్టుకుంటాయి. శంఖపూజలో చేసినా ఇదే దుష్ఫలితం. సాలగ్రామ తులసీ శంఖాలను ఒకేచోట ఉంచి అర్పిస్తూ కాపాడేవాడు మహాజ్ఞానియై శ్రీహరిసన్నిధికి చేరుకుంటాడు. శ్రీహరికి ఇష్టుడవుతాడు.

తులసీ! ఇప్పటికి నీకోపం చల్లారిందనుకుంటాను. శంఖచూడునితో నీ కలయికకు కేవలం ఒక మన్వంతరమే అవధి. అది ముగిసిపోయింది. మీ ఇద్దరి శాపాలూ ముగిశాయి. కనక ఇద్దరూ ఇప్పుడు గోలోకవాసులూ నాకు అత్యంతాప్తులూ అయ్యారు. బృందావనంలో రాసమండలంలో ఇక మనం విహరిద్దాం - అని శ్రీహరి ఆప్యాయంగా ఊరడించాడు.

తులసి మౌనంగా ఉండిపోయింది. క్షణంలో దేహం రాలిపోయింది. దివ్యతేజోమయమైన లక్ష్మీస్వరూపం ఆవిర్భవించింది. శ్రీమన్నారాయణుడితో కలిసి దివ్యవిమానం అధిరోహించి వైకుంఠానికి తరలిపోయింది.

నేలపై పడిఉన్న తులసీదేహం గండకీనదిగా మారింది. శ్రీహరి దాని తీరాన పర్వతంగా మారాడు. అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాలలో తొలిచి నదిలోకి దొర్లిస్తాయి. అవే సాలగ్రామ శిలలు. నదీజలంలో పడినవి అత్యధిక ఫలప్రదాలు. గట్టున ఉండి పోయినవి సూర్యుడి వేడిమితో పింగళవర్ణంలోకి మారతాయి.

నారదా! నీ సందేహాలన్నీ తీరాయికదా! ఇంకా ఏమైనా మిగిలిఉన్నాయా? సంశయించకుండా
అడుగు. చెబుతాను - అన్నాడు నారాయణమహర్షి.

తులసీ పూజ


Tulasiki Srihari Varalu - తులసికి శ్రీహరి వరాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసికి శ్రీహరి వరాలు

కల్యాణీ! నా కోసమేకదా నువ్వు చిరకాలం తపస్సు చేశావు. నీకోసమేకదా శంఖచూడుడు తపస్సు చేసింది. అతడి తపస్సుకి ఫలితంగా నువ్వు లభించావు. నీతో ఇంతకాలమూ ఆనందాలు అనుభవించాడు. మరి నీ తపస్సుకి ఫలితం మాట ఏమిటి? నేనే దక్కాలికదా నీకు! అందుకే వచ్చాను. నీ తపస్సులు పండించాను. ఈ శరీరం విడిచిపెట్టి ఇక దివ్యదేహం ధరించు. గోలోకానికి వచ్చి రమాసదృశవై నాతో విహరించు. ఇప్పటి నీ శరీరం నదీరూపాన్ని పొందుతుంది. గండకీనామంతో విఖ్యాతి వహిస్తుంది, శాశ్వతమై పుణ్యప్రదగా కీర్తిగడిస్తుంది. నీ సుదీర్ఘమూ మనోహరమూ అయిన కేశపాశం పావన వృక్షరూపాన్ని ధరిస్తుంది. తులసిగా ప్రఖ్యాతమవుతుంది. దాని పువ్వులూ ఆకులూ ముల్లోకాలలోనూ పూజాద్రవ్యాలు అవుతాయి. అదే ప్రధానతరువు అవుతుంది. సకల పుణ్యస్థలాలలోనూ నదీనద తీరాలలోనూ విస్తరించి పరమపావనమూర్తిగా మన్ననలు పొందుతుంది. తీర్థాధిష్టానంగా పరిగణన పొందుతుంది. నువ్వున్నచోట సకలదేవతలూ ఉంటారు. తులసీ పత్రంకోసం నేనుకూడా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. తులసితీర్థంతో స్నానం చేసినవాడు సకలతీర్ధాలలోనూ స్నానంచేసినటే. సర్వయజ్ఞాలూ నిర్వర్తించినట్టే. నాకు వెయ్యి అమృతభాండాలు నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక్క తులసీపత్రం సమర్పిస్తే కలుగుతుంది. కార్తికమాసంలో నాకు తులసీపత్రం సమర్పిస్తే వేనవేల గోవులను దానంచేసిన ఫలం దక్కుతుంది. ప్రాణావసాన సమయంలో తులసితీర్ధం పుచ్చుకున్నవాడు సర్వపాపవిముక్తుడై విష్ణులోకంలో విరాజిల్లుతాడు.

భక్తితో రోజూ తులసితీర్థం సేవించేవారికి లక్ష ఆశ్వమేధయాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. తులసిని చేతిలో పట్టుకునిగానీ శరీరంమీద ధరించికానీ మరణించినవాడు వైకుంఠానికి వెడతాడు, తులసీకాష్ఠంతో చేసిన పూసలపేరును అలంకరించుకుంటే ఆశ్వమేధఫలం అడుగడుగునా లభిస్తుంది.

తులసి సాక్షిగా మిథ్యాశపథాలు చేసేవాడు కుంభీపాక నరకానికి పోతాడు. మరణసమయంలో తులసితీర్థం ఒక్కబిందువు దక్కితే అతడికి దివ్యరత్నవిమానం లభిస్తుంది. వైకుంఠానికి చేరుస్తుంది. పూర్ణిమ అమావాస్య ద్వాదశి సంక్రాంతి రోజుల్లోనూ తైలాభ్యంగనస్నానం చేసిననాడూ సంధ్యా - మధ్యాహ్న రాత్రివేళల్లోనూ మైలరోజులలోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసిదళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినంతటి మహాపాపం.

తులసిదళం మూడురాత్రులదాకా పవిత్రమే. నిద్రచేసిన దళం మరింత మంచిది. వ్రతాలలోనూ దానధర్మాలలోనూ విగ్రహప్రతిష్టలలోనూ సురార్చనలలోనూ దీని వినియోగం శ్రేయోదాయకం. నేలమీద పడినా నీళ్ళల్లో పడినా తులసిదళానికి అపవిత్రత లేదు. క్షాళనచేసి పూజలకు ఉపయోగించుకోవచ్చు. పూజ చేస్తుండగా చెయ్యిజారి నేలపైపడితే నారాయణార్పణం ఆంటే సరిపోతుంది.

తులసీ! ఈనాటినుంచి నువ్వు వృక్షాధిష్ఠానదేవతవు. గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు. గండకీనదిగా సకలనదీనదాధిష్ఠానదేవతవై మన్ననలు పొందు. నా అంశావతారమైన సముద్రుడితో ఆనందించు. నువ్వు స్వయంగా మహాసాధ్వివై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు.

సాల గ్రామ మహిమలు


Srihari's deception - శ్రీహరి చేసిన వంచన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శ్రీహరి చేసిన వంచన

ఒకనాడు ఒక వృద్ధబ్రాహ్మణుడు రణరంగానికి వచ్చాడు. దానవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దానవరాజేంద్రా! నేను విప్రుణ్ణి. నువ్వు ప్రభువువు. సర్వసంపదలకూ దాతవు. నాకు పెద్దగా కోరికలు లేవు. నిరీహుడను. పైగా వృద్ధుడను. చాలా దప్పికగా ఉంది. ఆట్టే మాట్లాడలేను. నువ్వు ఊం అంటే  అడుగుతాను - చిన్నకోరిక తీర్చు - అన్నాడు. శంఖచూడుడు ప్రసన్నుడై ఊం, అడగండి తీరుస్తాను అన్నాడు. అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి, ఇయ్యి. అడగడమే తడవుగా దానవేంద్రుడు తీసి ఇచ్చేశాడు. అది పుచ్చుకుని ఆ వృద్ధబ్రాహ్మణుడు శ్రీహరి అంతలోనే అంతర్ధానం చెందాడు. నారాయణ కవచధారియై శంఖచూడుని రూపంలో తులసీదేవిముందు ప్రత్యక్షమయ్యాడు. మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్యాధానం చేశాడు.

సరిగ్గా ఆదే సమయానికి రణరంగంలో శివుడు తనకు శ్రీహరి అందించిన శూలాన్ని తీశాడు. అది గ్రీష్మమధ్యాహ్న మార్తాండమండలంలాగా ప్రళయకాలాగ్నిశిఖలాగా దుర్నిరీక్ష్యంగా దుర్నివార్యంగా ప్రజ్వరిల్లుతోంది. సుదర్శన చక్రంలాగా సర్వశస్త్రాస్త్రసారంలాగా తేజరిల్లుతోంది. వేయి ధనుస్సుల పొడుగుంది. నూరుబారల వెడల్పుంది. సర్వబ్రహ్మాండమండలాన్నీ సంహరించడానికి సమర్ధమనిపిస్తోంది. ఆ శూలాన్ని ఒకసారి గిర్రున త్రిప్పి శంఖచూడుడి మీదికి విసిరాడు. దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనుస్సు వదిలేశాడు. మనస్సులో శ్రీకృష్ణుడి పాదపద్మాలను ధ్యానించాడు. యోగాసనాసీనుడు అయ్యాడు, శూలం గిరికీలు కొట్టుకుంటూ వచ్చి అతడిమీద పడింది. పడటమేమిటి రథంతోసహా భస్మమైపోయాడు,

ఆ భస్మరాశినుంచి కిశోరగోపవేషంలో సుదాముడు ఆవిర్భవించాడు. ద్విభుజుడు. మురళీహస్తుడు రత్తభూషణభూషితుడు. గోపకోటీపరివేష్టితుడు. బాల సూర్యప్రభలతో వెలిగిపోతున్నాడు. అంతలోకీ గోలోకంనుంచి దివ్యవిమానం వచ్చింది. అతడూ గోపకులూ అందులోకి అధిరోహించారు. అది ఆకాశమార్గాన గోలోకానికి సాగిపోయింది. అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణులకు సవినయంగా సభక్తికంగా నమస్కరించాడు. సాష్టాంగ పడ్డాడు. రాధాకృష్ణులు ప్రసన్న వదనారవిందులై బాలసుదాముణ్ణి తిలకించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు.

శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడుడి అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది. అప్పటినుంచీ శంఖం దేవతార్చనలకు యోగ్యమయ్యింది. శంఖంలో పోసిన తీర్ధం చాలా ప్రశస్తం, దేవతలకు ప్రీతిపాత్రం. పవిత్ర తీర్థోదకాల్లాగా పరమపవిత్రం. శంఖశబ్దం వినిపించినచోట లక్ష్మీదేవి ఉంటుంది. శంఖజలంతో స్నానంచేస్తే సకల తీర్జాలలోనూ స్నానంచేసినటే. శంఖం శ్రీహరికి అధిష్టానం, అది ఉన్నచోట విష్ణుమూర్తి ఉన్నట్టే. అక్కడే లక్ష్మీదేవీ ఉంటుంది. అమంగళాలు అన్నీ పటాపంచలవుతాయి.

దానవసంహారంతో శివుడు సంతుష్టి చెందాడు. వృషభారూఢుడై తన లోకానికి వెళ్ళిపోయాడు, దేవతలు తమ రాజ్యాన్నీ తమ అధికారాలనూ తిరిగిపొంది విజయోత్సవం చేసుకున్నారు. దేవదుందుభులు మిన్నంటి మ్రోగాయి. గంధర్వ కిన్నరులు గొంతెత్తి పాడారు. పుష్పవృష్టి ధారాళంగా కురిసింది. మహర్షులూ మునీంద్రులూ శివుడినీ ప్రమథులనూ దేవవీరులనూ కాళికామాతనూ ప్రశంసించారు.

నారదా! తులసీగర్భంలో శ్రీహరి వీర్యాధానం ఎలా చేశాడు అనేదేకదా నీ శంక. చెబుతున్నాను విను. తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తేనేకానీ శంఖచూడుడు మరణించడు. అందుకని శ్రీహరి దానవప్రభువు రూపంలో తులసీమందిరానికి వెళ్ళాడు. మందిరద్వారం దగ్గర దుందుభి ఉంది. దాన్ని మోగించాడు. అది జయశబ్దం చేసింది. ఆ ధ్వని విని పరమానందభరితురాలై ఆ సాధ్వీమణి మందిరకవాటం తెరిచి ఈవలికి వచ్చింది. ఎట్టయెదుట తన మనోహరుణ్ణి చూసింది. సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. బ్రాహ్మణులకూ వందిమాగధులకూ స్వస్తివాచకులకూ ధన కనక మణి మాణిక్యాలను దోసిళ్ళకొద్దీ దానం చేసింది. అర్ఘ్యపాద్యాలను తెచ్చి మనోహరుడి పాదాలను కడిగింది. నమస్కరించి ముద్దాడింది. ఎందుకో ఏదో తెలియని దుఃఖం కట్టలు తెంచుకుంది. వలవలా విలపించింది. సాదరంగా తీసుకువచ్చి ఏకాంతమందిరంలో రత్ససింహాసనంమిద కూర్చోబెట్టింది. చందనచర్చలు చేసింది. కస్తూరికా తాంబూలమిచ్చింది.

నాథా! ఇప్పటికి నా ప్రాణాలు కుదుటబడ్డాయి. రణరంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగివచావు. ఇంతేచాలు. నా తపస్సు ఫలించింది. నా జన్మ చరితార్థమయ్యింది నా జీవితం సఫలమయ్యింది. ఇలా పలవరిస్తూ కామభావపరిప్లుతయై సవిలాసంగా వాలుచూపులు విసిరింది. స్పర్శసుఖాన్ని అనుభవిస్తూ పులకించింది. గుండెలు నిమురుతూ - 

స్వామీ! అసంఖ్య విశ్వసంహర్తతో యుద్ధంకదా! ఎలా జరిగింది? విజయం ఎలా లభించింది? దయచేసి వివరించవూ! అని గోముగా అడిగింది.

శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు. కాంతామణీ! మా ఇద్దరికీ యుద్ధం నిండా నూరేళ్ళు జరిగింది. మన దానవవీరులందరూ మరణించారు. నేనుమాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు. మా ఇద్దరికీ ప్రీతికరంగా సయోధ్య కుదిర్పాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగివచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది - అంటూనే తులసిని శయనంమీదకు వాల్చాడు.

ఆ ఆకర్షణకూ ఆ సంభోగసుఖాధిక్యానికీ అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. శంఖచూడుడు కాదని నిర్ధారించుకుంది. చివాలున లేచింది. మాయావీ! నువ్వు ఎవడివో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు. నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో శపిస్తాను - అంటూ గాండ్రించింది.

శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. దేవదేవుడు. సనాతనుడు. నవీన నీరదశ్యాముడు. శరత్పంకజలోచనుడు. కోటికందర్పసుందరాకారుడు. నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్చిల్లింది. వెంటనే తేరుకుంది.

జగన్నాథా! నీకు దయలేదు. పాషాణనదృశుడివి. మోసగించి ధర్మభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. నాభర్తను సంహరించావు. ప్రభూ! ఇంతటి దయాదూరుడివి ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇకనుంచీ నువ్వు పాషాణరూపుడివి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివనీ కృపానిధివనీ పాగిడేవారు వట్టి ఆమాయకులు. భ్రాంతచిత్తులు. నీది గుండెకాదు. బండరాయి. ఏ అపరాధమూ చెయ్యని నీ భక్తుణ్ణి పరులకోసమని పొట్టబెట్టుకోడానికి నీకు మనసు ఎలా ఒప్పింది?

పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ దారుణంగా రోదించింది. గుండెలు బాదుకుంటూ విలపించింది పడీపడీ దుఃఖించింది. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిలుచుండిపోయాడు శ్రీహరి. మెల్లగా పెద్ది విప్పాడు.

తులసికి శ్రీహరి వరాలు


Chandrachuda - Shankhachuda Sangramam - చంద్రచూడ - శంఖచూడుల సంగ్రామం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - చంద్రచూడ - శంఖచూడుల సంగ్రామం

శివుడు తన సేననూ సేనాధిపతులనూ ఉత్సాహపరిచాడు. దేవదానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలయ్యింది. మహేంద్రుడు వృషపర్వుడితో భాస్కరుడు విప్రచిత్తితో చంద్రుడు దంభుడితో కాలుడు కాలస్వరుడితో హుతాశనుడు గోకర్ణుడితో కుబేరుడు కాలకేయుడితో విశ్వకర్మ యముడితో మృత్యువు భయంకరుడితో యముడు సంహారుడితో వరుణుడు వికంకణుడితో వాయువు చంచలుడితో బుధుడు ఘృతపృష్ఠునితో శనైశ్చరుడు(శని) రక్తాక్షుడితో జయంతుడు రత్నసారుడితో అశ్వినులు దీప్తిమంతుడితో విసవుడు వర్చసుడితో నలకూబరుడు ధూమ్రుడితో ధర్ముడు ధురంధరుడితో మంగళుడు ఉషాక్షుడితో భానుడు శోభాకరుడితో మన్మథుడు పిఠరుడితో ఇంకా ఇలాగే గోధాముఖ - చూర్ణ - ఖడ్గ - ధ్వజ - కాంచీముఖ - పిండ - ధూమ్ర - నంది - విశ్వ - పలాశాది దానవులతో ద్వాదశాదిత్యులు, ఏకాదశభయంకరులతో ఏకాదశరుద్రులూ, ఉగ్రచండాదులతో మహామారీ నందీశ్వరాదులూ ముఖాముఖి తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయంకన్నా భీషణంగా జరుగుతోంది. శివుడుమాత్రం ఆదే వటమూలంలో అదే యోగాసనంలో కాళీసుతుడు తోడుగా కూర్చున్నాడు.

శంఖచూడుడుకూడా సంగ్రామోచితవేషధారియై సభామంటపంలో కోటిదానవపరివృతుడై రత్నసింహాసనంమీద కూర్చున్నాడు, ఎప్పటికప్పుడు యుద్ధవార్తలు వింటున్నాడు. శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్నాడు.

దానవుల ధాటికి తట్టుకోలేక దేవసైన్యాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. సేనాపతి కుమారస్వామి గమనించి తానే స్వయంగా అగ్రభాగాన నిలిచి సేనలను ఉత్సాహపరిచాడు. తన తేజశ్ళక్తితో సేనాబలాన్ని వృద్దిపాందించాడు. ఒంటిచేతితో నూరు అక్షౌహిణుల దానవ సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. కాళికాదేవి మూర్తీభవించిన క్రోధంగా సమరాంగణాన స్వేచ్చగా తిరుగుతూ దానవవీరుల రక్తం తాగుతోంది. లక్షలాదిగా ఏనుగులనూ గుర్రాలనూ చేతజిక్కించుకుని అవలీలగా నోట్లో కుక్కుకుంటోంది. శిరస్సులు తెగిపడిన మొండేలు కరాళనృత్యం చేస్తున్నాయి. హతశేషులైన దానవ మహావీరులకు గుండెలు జారిపోయాయి. ఎవరికి వారుగా పలాయనం చిత్తగించారు. కానీ వృషపర్వ - విప్రచిత్తి - దంభ - వికకంకణులుమాత్రం నలుగురూ ఒకటై కుమారస్వామితో పోరాడుతున్నారు. రణరంగంలో ప్రవేశించింది మొదలు మరింక వెనుదిరిగి చూడకుండా మహామారి దానవులను చంపుకుంటూ పోతోంది.

కట్టకడపటికి స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. వృషపర్వాదులు నలుగురూ దానిని అడ్డుకోలేక సంక్షుబ్ధులై నిలబడ్డారు. అంతేకానీ భయార్తులై పారిపోలేదు. ఆకాశంనుంచి పుష్పవృష్ఠి కురిసింది.

స్కందుడి మహావిజృంభణం విన్న శంఖచూడుడు తక్షణం తన దివ్యవిమానం అధిరోహించాడు. తిన్నగా రణరంగానికి వచ్చాడు. వస్తూనే మేఘంలా శరవర్షం కురిపించాడు. సంగ్రామస్ధలి అంధకారబంధురమయ్యింది. మరుక్షణంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. నేల మండుతోంది. భయవిహ్వలులై దేవసైనికులు దశదిశలకూ పారిపోయారు. మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెనుదిరిగారు. కార్తికేయుడొక్కడే మండుతున్న సమరభూమిలో ధైర్యంగా నిలబడ్డాడు.

శంఖచూడుని ఉత్సాహం ఉప్పాంగింది. స్కందుడిచుట్టూ శిలావర్షం కురిపించాడు. అవి పర్వతవలయమయ్యాయి. వృక్షశ్రేణితో ఆచ్చాదించాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతిలో ఉన్న ధనుస్సును నడిమికి రెండుగా విరగ్గొట్టాడు. దివ్యరథాన్నీ రథపీఠాన్నీ నుగ్గునుగ్గు చేశాడు. మయూరవాహనాన్ని తూట్లు పొడిచాడు. శక్తి ఆయుధాన్ని గుండెలకు గురిపెట్టి విసిరాడు. ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్చపోయాడు. వెంటనే తేరుకుని విష్ణుదత్తమైన దివ్యధనుస్సు అందుకొని వజ్రనిర్మితమైన రథం అధిరోహించి దిక్కులు పిక్కటిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు. మహోల్బణుడై శస్త్రాస్త్రాలను ప్రయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలనూ వృక్షాలనూ సర్పాలనూ ధ్వంసం చేశాడు. కమ్ముకున్న మంచుతెరలనుంచి బయటపడ్డ భాస్కరుడిలా ప్రకాశించాడు. పర్జన్యాస్త్రం ప్రయోగించి దవానలంలాగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేశాడు. శంఖచూడుడి రథాన్ని ధనుస్సునూ తుత్తునియలు చేశాడు. సారథిని సంహరించాడు. రథాశ్వాలను చీల్చిచెండాడాడు. కిరీటాన్ని పడగొట్టాడు. శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించాడు. అది సరాసరివెళ్ళి దానవేంద్రుడి వక్షఃస్థలాన్ని బలంగా ఢీకొట్టింది. క్షణకాలం మూర్చపోయి వెంటనే తెప్పరిల్లాడు. మరోరథాన్ని అధిరోహించి మరోధనుస్సు ధరించి మాయా శరజాలం కురిపించి గుహుణ్ణి కప్పివేశాడు. ఇదంతా నిమేషమాత్రంలో జరిగింది. విష్ణుతేజోవృతమై శతసూర్యసంకాశమై ప్రళయాగ్నిశిఖాసదృశమై ధగద్ధగలాడుతున్న శక్తి శరాన్ని సంధించి వదిలాడు. తిరుగులేని దానిదెబ్బకు షాణ్మాతురుడు మూర్చపోయాడు. కాళికాదేవి వెంటనే వచ్చి అతడిని చేతుల్లోకి ఎత్తుకుని శివుడిదగ్గరదించి తాను మళ్ళీ రణరంగానికి దూసుకువెళ్ళింది,

శివుడు తన దివ్యశక్తితో కుమారస్వామిని పునరుజ్జీవితుడిని చేశాడు. అనంతంగా బలాన్ని ప్రసాదించాడు. స్కందుడు ప్రతాపవంతుడై లేచికూర్చున్నాడు. 

రణరంగానికి దూసుకువెడుతున్న కాళికాదేవి వెంట మధుభాండాలతో గంధర్వయక్షకిన్నర వీరులు తరలివెళ్ళారు. కాళికాదేవి సింహనాదం చేసింది. వికటాట్టహాసం చేసింది. మధుభాండాలు సేవించి కరాళనృత్యం చేసింది. దానవవీరులు భయకంపితులై మూర్భపోయారు. ఉగ్రదంష్ట్రా - ఉగ్రదండా - కోటకీ - యోగినీ - డాకినీ గణాలు మధుభాండాలు సేవిస్తూ వికృతంగా అరుస్తూ వికటాట్టహాసాలు చేస్తూ భీషణంగా గంతులు వేస్తున్నాయి. శంఖచూడుడు ఇటువైపు దృష్టిసారించాడు. దానవులకు అభయం ఇచ్చి కాళికాదేవితో కయ్యానికి కాలుదువ్వేడు. కాళిక అగ్నులు కురిపించింది. దానవరాజు పర్జన్యాస్త్రంతో చటుక్కున చల్లార్చాడు. వారుణాస్త్రాన్ని గాంధర్వంతోఅణిచివేశాడు. మాహేశ్వరాన్ని వైష్ణవంతో మట్టికరిపించాడు. కోపం పట్టలేక కాళికాదేవి నారాయణాస్త్రం ప్రయోగించింది. దానవప్రభువు వినయంగా రథందిగి భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. ప్రళయాగ్నిశిఖలాగా వస్తున్న ఆ అస్త్రం దారిమళ్ళి ఆకాశంలో కలిసిపోయింది. ఆశ్చర్యచకితయైన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది. బదులుగా బ్రహ్మాస్తాన్నే ప్రయోగించి విజయదరహాసం చేశాడు దానవేశ్వరుడు. దివ్యాస్త్రాలన్నీ అయిపోయాయి. యోజనాయతమైన శక్తి ఆయుధాన్ని విసిరింది. శంఖచూడుడు దాన్ని దివ్యాస్త్రాలతో శతఖండాలు చేశాడు, ఉక్రోషం ఆపుకోలేక కాళికాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించబోయింది. అంతలోకీ అశరీరవాణి వినిపించింది - 

కాళీ! ఎందుకు ఈ వృధాప్రయాస. శంఖచూడుడి మృత్యువు ఏ అస్త్రంలోనూ లేదు. ఏ శస్త్రంలోనూ లేదు. అతడి మెడలో ఆ నారాయణ కవచం ఉన్నంతవరకూ, అతడి భార్య శీలానికి భంగం కలగనంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అజయ్యుడు. జరామృత్యువులకు అతీతుడు. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం.

కాళికాదేవి పాశుపతాన్ని ఉపసంహరించుకొంది. ఆకలిగొన్న పులిలాగా చెలరేగి దానవవీరులను పదిలక్షలమందిని దోసిటబట్టి నోట్లో వేసుకుంది. శంఖచూడుణ్ణికూడా అలాగే పట్టుకుని మింగేద్దామనుకుంటూ ముందుకు వచ్చింది. దానవచక్రవర్తి అగ్నిశిఖలవంటి విశిఖాలతో నిలవరించాడు. గ్రీష్మసూర్యకాంతిలా తళతళలాడుతున్న ఖడ్గాన్ని విసిరింది. దాన్ని నూరుముక్కలు చేశాడు. ఈసారైనా పట్టుకుని మింగేద్దామని మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఆ యోగసిద్దుడు అందకుండా తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని రథంమీద చూపించింది. పిడిగుద్దుతో తునాతునకలు చేసింది. సారథిని పిడికిటబట్టి పిసికి ముద్దచేసింది. దానవరాజుకు గురిచూసి శూలం విసిరింది. అతడు దాన్ని లీలావిలాసంగా ఎడంచేత్తో పట్టుకొన్నాడు. కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలించింది. పిడుగుపడ్డంత పనిఅయ్యింది. విలవిలలాడాడు. తూలిపోయాడు. మూర్చిల్లాడు. క్షణంలో తేరుకుని లేచి నిలబడ్డాడు. కాళికాదేవి బాహాబాహికి దిగింది. శంఖచూడుడు నమస్కరించాడు. ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాల నన్నింటినీ ఊడలాక్కున్నాడు. విరిచిపారేశాడు. కానీ తానై ఆ దేవిమీదికి ఏ ఆయుధాన్నీ ప్రయోగించలేదు. భక్తుడు. వైష్ణవుడు. మాతృభక్తి పరాయణుడుకదా శంఖచూడుడు.

కాళికాంబ చేతులు సాచి దానవప్రభువును పట్టుకుంది. ఆకాశానికి ఎత్తింది. గిరగిరా తిప్పి విసిరేసింది. అంత ఎత్తునుంచి నెలకుపడ్డా శంఖచూడుడు చెక్కుచెదరలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. భద్రకాళికకు శిరసువంచి నమస్కరించాడు. తన దివ్యవిమానం అధిరోహించి యుద్దం కొనసాగించాడు. భద్రకాళి దానవవీరులను పిండి కడుపునిండా రక్తంతాగి నేలను మట్టుకుంటూ శివుడి దగ్గిరికి వెళ్ళింది. రణవృత్తాంతాన్ని యథాక్రమంగా వివరించి చెప్పింది. శంభూ! నేను పాశుపతం ప్రయోగించబోతే అశరీరవాణి వినిపించింది. దానితో ఉపసంహరించుకున్నాను. శంఖచూడుడు మహాబలశాలి. మహాపరాక్రమశీలి. నా బాణాలనూ అస్త్రాలనూ ఖండించాడే తప్ప తనంత తానుగా నామీదకి ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. పైగా భక్తితత్పరుడై నమస్కరించాడు. నిజంగా అతడు మహాజ్ఞాని. జితేంద్రియుడు - వింటున్న శంకరుడు మృదువుగా నవ్వాడు.

తత్త్వజ్ఞాన విశారదుడైన శివుడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు. అతనివెంట ప్రమథగణాలు నడిచాయి. అల్లంత దూరాన చూసి దానవప్రభువు విమానం దిగి శిరసువంచి నమస్కరించి సాష్టాంగపడ్డాడు. తిరిగి విమానం అధిరోహించి ధనుస్సు ఎక్కు పెట్టాడు.

నారదా! చంద్రచూడ శంఖచూడుల యుద్ధం పూర్తిగా వందసంవత్సరాలు సాగింది. జయమూ లేదు పరాజయమూ లేదు. శస్త్రాలకి శస్త్రాలూ అస్త్రాలకి అస్త్రాలుగా నడిచింది. రథంమీద శంఖచూడుడు, వృషభం మీద చంద్రచూడుడు. హెచ్చుతగ్గులు లేని ద్వంద్వయుద్దం నూరేళ్ళు సాగింది.

శ్రీహరి చేసిన వంచన


Thursday, May 7, 2026

Shiva - Shankhachuda conversation - శివ - శంఖచూడ సంవాదం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శివ - శంఖచూడ సంవాదం

బ్రాహ్మీముహూర్తంలో శంఖచూడుడు తల్పంమీద లేచి కూర్చున్నాడు. శ్రీ కృష్ణపరమాత్మను మనస్సులో ధ్యానించాడు. శయ్యదిగాడు. రాత్రి కట్టుకున్న వస్త్రాలను విడిచి పెట్టాడు. శుద్దోకాలతో స్నానం చేశాడు. దౌతవస్త్రాలు ధరించాడు. తిలకం దిద్దుకున్నాడు. ప్రాతఃకాలపూజలు అన్నీ నిర్వహించాడు. పెరుగు నెయ్యి తేనె పేలాలు వంటి మంగళవస్తువుల్ని దర్శించాడు. మణులూ రత్నాలూ వస్త్రాలూ బంగారమూ రోజూలాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు. రాజగురువును దర్శించి అమూల్యరత్నహారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీస్పులు పొందాడు. గజాశ్వధనరత్నరాశుల్ని బీదబ్రాహ్మణులకు కానుకలుగా పంచిపెట్టాడు. వెయ్యి భాండారాలూ లక్ష నగరాలూ శతకోటి గ్రామాలూ పండితులకు సర్వాధికారాలతో సమర్పించాడు. దానవరాజ్యానికి తన పుత్రుణ్ణి రాజును చేశాడు. తల్లినీ రాజ్యాన్నీ భాండాగారాలనూ వస్తువాహనాదులనూ తన అనుచరులనూ రక్షించే బాధ్యత అప్పగించాడు. తూణీరాలు కట్టుకుని కవచం ధరించి ధనుష్పాణియై యుద్దానికి సన్నద్ధుడయ్యాడు. లక్ష గజ సైన్యం, మూడు లక్షల అశ్వ సైన్యం, అయుతరథ సైన్యం సిద్ధమయ్యింది. మూడుకోట్ల ధానుష్కులు బారులుతీరి నిలబడ్డారు. వర్మధారులు మరో మూడుకోట్టూ శూలధారులు మరో మూడుకోట్లూ యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఒక్కొక్క సైన్యానికీ ఒక్కొక్కడిని అధిపతినిచేసి సర్వసన్నద్ధంగా ఉంచాడు. మనస్సులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్తమణిమయ విమానం అధిరోహించాడు. ప్రధాన గురు మంత్రులను తనతో తీసుకుని శంకరుడి సమీపానికి బయలుదేరాడు. చంద్రభాగా నదీతీరాన (పుష్పభద్రానది) శుభప్రదమైన అక్షయవటవృక్షం కనిపించింది. (చంద్రభాగ = పుష్పభద్ర = పుణ్యభద్ర). 

అది సిద్దాశ్రమం. సిద్ధులకు సిద్ధిక్షేత్రం. కపిలుడు తపస్సు చేసినచోటు. భారతదేశంలో పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. మలయపర్వతానికి పశ్చిమంగా శ్రీశైలానికి ఉత్తరంగా గంధమాదనానికి దక్షిణంగా అయిదుయోజనాల వెడల్పూ అయిదువందల యోజనాల పొడవూ ఉన్న సువిశాల సమతల ప్రదేశమది. శుద్ధస్ఫాటికంలాగా మెరిసిపోతోంది. ప్రక్కనే జలపూర్ణంగా పుష్పభద్రానది ప్రవహిస్తోంది. శరావతితో కలసి హిమాలయాలనుంచి ప్రవహిస్తూ వస్తోంది. సముద్రుడికి ప్రియభార్య. సౌభాగ్యసంయుక్త. గోమతీనదిని ఎడమవైపున నిలుపుకుంటూ వెళ్ళి పశ్చిమసముద్రంలో కలుస్తోంది.

వటమూలంలో సమాసీనుడై ఉన్న చంద్రశేఖరుణ్ణి శంఖచూడుడు దర్శించాడు. యోగాసనంలో సూర్యకోటిసముడై విరాజిల్లుతున్నాడు. ముఖమంటపాన చిరునవ్వు తళుకులీనుతోంది. శుద్ధన్ఫటిక వర్ణంలో బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. వ్యాఘచర్మాంబరధారి. త్రిశూల పట్టిశధారి. శాంతుడు. గౌరీకాంతుడు. మనోహరుడు. భక్తమృత్యుహరుడు. తపఃఫలదాత. సర్వసంపత్ప్రదాత. ఆశుతోషుడు (ఉబ్బులింగడు). ప్రసన్నవదనుడు. భక్తానుగ్రహకాతరుడు. విశ్వనాథుడు. విశ్వబీజుడు. విశ్వరూపుడు. విశ్వజుడు. విశ్వంభరుడు. విశ్వవరుడు. విశ్వసంహారకరుడు. కారణకారణుడు. నరకార్ణవతారణుడు. జ్ఞానప్రదుడు. జ్ఞానబీజుడు. జ్ఞానానందుడు. సనాతనుడు.

శంఖ చూడుడు విమానం దిగాడు. గురుబృందంతో కలిసి భక్తినమ్రుడై శిరసా నమస్కరించాడు. శివుడికి ఎడమవైపున భద్రకాళి. ముందుభాగాన స్కందుడు - వీరికీ నమస్కరించాడు. కాళిస్కందశంకరులు ముగ్గురూ అతడికి ఆశీన్సులు అందించారు. అతడి రాకను చూసి నందీశ్వరాదులందరూ లేచి నిలబడ్డారు.

పరస్పరం కుశలప్రశ్నలు వేసుకున్నారు. పరస్పరం సంభాషించుకున్నారు. శంఖచూడుడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై -

శంఖచూడా! బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించారు. దక్షప్రజాపతి ఈ కశ్యపుడికి తన పదముగ్గురు కూతుళ్ళను ఇచ్చి వివాహం చేశాడు, వారిలో ఒక సాధ్విపేరు దనువు. ఈమెకు సౌభాగ్యాతిశయంవల్ల ఇరవైనలుగురు పుత్రులు కలిగారు. అందరూ తేజోబలశాలులే. ఆ దానవులలో ఒకడు విప్రచిత్తి అతడి పుత్రుడు దంభుడు. పరమధార్మికుడు. విష్ణుభక్తుడు. జితేంద్రియుడు. పుష్కరక్షేత్రంలో శ్రీకృష్ణమహామంత్రాన్ని జపిస్తూ లక్షసంవత్సరాలు తపస్సుచేశాడు. (శుక్రాచార్యుడు ఇతడి గురువు). ఆ తపఃఫలంగా నువ్వు జన్మించావు. పూర్వజన్మలో గోపకుడవు. గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడివి. రాధికాశాపంవల్ల ఈ దానవవంశంలో ఆవిర్భవించావు. నువ్వు వైష్ణవోత్తముడవు. పరమ ధార్మికుడవు. నీవంటి విష్ణుభక్తులు హరిసేవను తప్ప తక్కినవాటిని నీచాలుగా తుచ్చాలుగా పరిగణిస్తారు. హరిసేవ తప్ప మరింకేదీ కోరుకోరు. బ్రహ్మత్వమూ అమరత్వమూకూడా వారికి తుచ్చాలే. ఎవరి దగ్గరా దానం పట్టరు. ఎవరినుంచీ ఎదీ ఆశించరు. తీసుకోరు. అటువంటిది కృష్ణభక్తుడవయ్యుండి నువ్వు దేవతలనుంచి రాజ్యం కొల్లగొడతావా! తప్పుకాదూ! వారి రాజ్యం వారికి ఇచ్చేసెయ్యి. నేను సంతోషిస్తాను. శ్రీహరి ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు ఏలుకో. ఎవరి పదవుల్లో వారు సుఖంగా ఉండండి. కశ్యపుడి వంశంలో పుట్టావు. భూతవిరోధం దేనికీ! ఇక చాలించు. మహాపాపాలు అన్నీ ఒక ఎత్తయితే జ్ఞాతిద్రోహం ఒక్కటీ ఒక ఎత్తు అన్నారు. ఇది బ్రహ్మహత్యా మహాపాతకంకన్నా పదహారు రెట్లు మహాపాపం. దీనివల్ల సర్వసంపదలూ నశిస్తాయి. అంచేత దాయాదులతో వైరం పెట్టుకోకు. దేవతలతో సఖ్యంగా ఉండు. నీజోలికి వారు రారు. వారి జోలికి నువ్వు పోవద్దు. మీరంతా కశ్యపవంశజులేకదా!

అదీగాక - అందరికీ అన్నిరోజులూ ఒక్కలాగా గడవవు. బ్రహ్మదేవుడంతటివాడికే ప్రళయంలో వినాశం తప్పడంలేదు. ఈశ్వరేచ్చతో మళ్ళీ ఆవిర్భవిస్తున్నాడు. తపస్సుతో జ్ఞానం సంపాదిస్తున్నాడు. దానితో పునస్సృష్టి చేస్తున్నాడు. అంతదాకా ఎందుకు, ధర్మంమాట చూడు. కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటోంది. త్రేతాయుగంలో మూడువంతులు నిలుస్తోంది. ద్వాపరం వచ్చేసరికి రెండువంతులకు క్షీణీస్తోంది. కలియుగారంభంలో ఒక వంతుకి చిక్కిపోయి రానురాను కళామాత్రంగా దృశ్యాదృశ్యంగా మిగులుతోంది. ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెబుతాను. విను. సూర్యుడున్నాడు. గ్రీష్మంలో ఉన్నట్టు శిశిరంలో ఉంటున్నాడా ? మధ్యాహ్నవేళలో ఉన్నట్టు ప్రాతస్సాయం సంధ్యల్లో ఉండగలుగుతున్నాడా ? ఉదయం బాలుడిగా ఉండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్దిపాంది సాయంకాలానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడు. ఒక్కొక్కసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్నసమయాల్లోకూడా అదృశ్యమవుతున్నాడు. గ్రహణం రోజున ఎంతటి దీనావస్థకి గురిఅవుతున్నాడో చూస్తూనే ఉన్నాంకదా ! అలాగే చంద్రుడూను. పదిహేను రోజుల వృద్ది, పదిహేనురోజులు క్షయమూను. దుర్దినాలూ గ్రహణాలూ సరేసరి.

ఒకనాడు ముల్లోకాలూ నావేనని ఎగబడ్డ బలిచక్రవర్తి ఇవ్వేళ పాతాళానికి దిగబడ్డాడు. కాలప్రభావం అటువంటిది. కలిసివచ్చినవేళ భూగోళం సస్యసంపన్నం అవుతుంది. కానివేళ ప్రళయజలధిలో మునిగిపోతుంది. కాలప్రభావంతోనే విశ్వాలు పుడుతున్నాయి. కాలప్రభావంతోనే గిడుతున్నాయి, చరాచర జీవజాలమంతా ఇంతే. ఒక్క పరాత్పరుడైన పరమాత్మమాత్రమే ఈ కాలప్రభావానికి అతీతుడు. తక్కిన సమస్తమూ బ్రహ్మాదిస్తంభపర్యంతమూ వృద్ధిక్షయాలకు లోనయ్యేదే. కాలప్రభావానికి లాంగినడిచేదే.

పరమాత్మ ఒక్కడే మహాపురుషుడనీ ప్రకృతి స్వరూపుడని నానారూపధారిఅనీ త్రిమూర్తులను నియమించి సృష్టి స్థితి లయాలు లీలావినోదంగా జరిపిస్తున్నాడనీ గ్రహించి నామ గుణ సంకీర్తన చేసే జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ రోగ జరా మృత్యు భయాలను జయిస్తాడు. నేను అలాగే జపిస్తూ ఉంటాను. ఆ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది. మృత్యుంజయుణ్ణి అయ్యాను. మృత్యుభయం పోతే మృత్యువు పారిపోతుంది - గరుడుణ్ణి చూసిన పాములాగా.

శంకరుడు ఇంతగా ఉపదేశించి శంఖచూడిడి ముఖంలోకి చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరఃకంపం చేశాడు. సవినయంగా మధురంగా మనసులోనిమాట బయటపెట్టాడు.

పరమేశ్వరా! నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది. కాదనడానికి ఏమీ కనిపించడం లేదు. అయినా నాదొక మనవి. వాస్తవం చెబుతున్నాను. చిత్తగించు. జ్ఞాతిద్రోహం మహాపాపమన్నావుకదా! మరి - సంపదలన్నీ ఊడగొట్టి బలిచక్రవర్తిని పాతాళానికి ఎందుకు తొక్కినట్టు? అతడి ఐశ్వర్యాలనన్నింటినీ నేను శత్రువులనుంచి ఉద్ధరించి తేగలిగాను గానీ అతడినిమాత్రం పాతాళంనుంచి ఉద్దరించలేకపోయాను. నాశక్తి సరిపోలేదు. ఇది ఒక్కటే కాదు - సోదరసహితంగా హిరణ్యాక్షుణ్ణీ హింసించారు దేవతలు, శుంభనిశుంభాది దానవులను నిర్ధాక్షిణ్యంగా మట్టుబెట్టారు. ఇంకా తరచుకుంటూ వెనక్కి వెడితే - సముద్రమథనానికి శ్రమపడింది మేమైతే అమృతం మింగింది దేవతలు. చాకిరీమాది, సౌఖ్యం వారిది. సరే - ఈ పాతపురాణాలకేమిగాని ఒకటిమాత్రం నిజం. ఈ విశ్వమంతా ప్రకృతిస్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడాభాండం, ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. వాడు ఆలా ఐశ్వర్యవంతుడవుతాడు.

దేవతలనీ దానవులనీ కయ్యాలనీ నెయ్యాలనీ - ఇదంతా వట్టి బూటకం. కేవలం నిమిత్తమాత్రం. పరమాత్ముని ఇచ్చయే అన్నింటికీ కారణకారణం. జయమో పరాజయమో కాలక్రమంలో మాకో వారికో లభిస్తూ ఉంటుంది. కాలమే కర్త. విరోధాలూ యుద్దయాత్రలూ అన్నీ నిష్ఫలాలూ నిష్ప్రయోజనాలూను. కానీ - సమసంబంధులమూ బంధువులమూ అయిన మాతో యద్ధం చెయ్యడానికి ఇవ్వేళ నువ్వే స్వయంగా వచ్చావు. సిగ్గనిపించడంలేదూ? జయం వరిస్తే మంచిదే. గొప్పకీర్తి లభిస్తుంది. పరాజయం వచ్చిపడితేనో! అపకీర్తి చుట్టుకోదూ? ఇది ఆలోచించావా?

శంఖచూడుడు సూటిగా ప్రశ్నించాడు. త్రిలోచనుడు పెద్దగా నవ్వి యథోచితంగా బదులు పలికాడు. దానవేంద్రా! బ్రహ్మవంశసంభూతులైన మీతో యుద్ధం చెయ్యడానికి నాకు సిగ్గెందుకు? పరాజయం వచ్చిపడితేమాత్రం నాకు చుట్టుకునే అపకీర్తి ఎమిటి? అసలు ఆదిలో మధుకైటభులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు శ్రీకారంచుట్టింది శ్రీమన్నారాయణుడేకదా! బలి హిరణ్యాక్ష హిరణ్యకశిపులతోనూ జబ్బచరిపించింది అతడే. ఒక్క త్రిపురాసురులతోమాత్రం నేను తలపడ్డాను. అదెప్పుడో చాలా కాలంక్రితం. ఇక శుంభనిశుంభాదులతోనంటావా జగన్మాత పరమేశ్వరి కలహించింది. ఇలా అందరూ మీతో యుద్దాలు చెయ్యగాలేనిది నేను నీతో చెయ్యడానికి సిగ్గుపడాల్సింది ఎముంది ? అదీకాక - నువ్వు సాధారణ దానవుడవా! గోలోకవాసి గోపకుడివి. శ్రీహరికి పార్షదుడివి. ఇప్పటికి సంహరింపబడిన ఏ దానవుడూ నీకు సాటిరాడు. అందుచేత నేను సిగ్గుపడవలసింది ఎమీ లేదు. ఒకవేళ పరాజయమే సంభవించినా అపకీర్తి కానేకాదు. పైగా సకలదేవతాశరణ్యుడైన శ్రీహరి స్వయంగా శూలం అందించి నీమీదకి పంపించాడు. కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేసెయ్యి. లేదంటే నాతో యుద్దానికి దిగు - అని స్పష్టంగా తేల్చిచెప్పాడు.

శంఖచూడుడు మరింక మాట్టాడలేదు. లేచి నిలబడ్డాడు. మంత్రులూ గురువులూ లేచారు. శివుడికీ పరివారానికీ వినయంగా శిరసువంచి నమస్కరించాడు. త్వరత్వరగా వెళ్ళి విమానం అధిరోహించాడు. రాజధానికి చేరుకున్నాడు. వెంటనే యుద్దానికి సైన్యాన్ని కదిలించాడు.

చంద్రచూడ - శంఖచూడుల సంగ్రామం


Sivaduta Rayabaram - శివదూత రాయబారం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శివదూత రాయబారం

అటుపైని బ్రహ్మదేవుడు శంఖచూడుణ్డి సంహరించడానికి శివుణ్ణి నియోగించి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. దేవతలూ తమ తమ నెలవులకు నిష్క్రమించారు.

శివుడు బాధ్యత భుజాన వేసుకుని చిత్రరథుడు అనే గంధర్వ ప్రియమిత్రుణ్ణి వెంటబెట్టుకుని భారతభూమికి దిగాడు. చంద్రభాగా నదీతీరాన ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో విశ్రమించాడు. శంఖచూడుడి దగ్గరికి చిత్రరథుణ్ణి దూతగా పంపించాడు. అతడు ఆ దానవేంద్రుడి రాజధానిలోకి ప్రవేశించాడు.

అది అయిదు యోజనాల వెడల్పూ పదియోజనాల పొడవూ ఉన్న మహానగరం. మహేంద్రుడి అమరావతికన్నా అన్నివిధాలా అత్యుత్తమంగా ఉంది. ఎటుచూసినా కుబేరభవనాలే. వీథులు తీర్చిదిద్దినట్టున్నాయి. నగరానికి చుట్టూ ఏడు కందకాలున్నాయి. రథాశ్వాలు అనుక్షణం ప్రయోగానికి సన్నద్ధంగా ఉన్నాయి. ప్రతిభవనంమీదా రత్నకోటులు ధగధగలాడుతున్నాయి. నూరు వీథులు. చత్వరాలలో వీథిమొగలలో మణివేదికలు. వివిధ వస్తు సంపన్నమై వణిజుల వీథి వ్రత్యేకం. తరులతావిరాజితమైన ఉద్యానవనాలు. వాటిలో ఆశ్రమాలు. 

నగరసౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్ళి చిత్రరథుడు రాజప్రాసాదం చేరుకున్నాడు. అది వలయాకారంలో పూర్ణచంద్రబింబంలా ఉంది. చుట్టూ నాలుగు అగడ్తలున్నాయి. అవి అగ్నిజ్వాలలతో భగభగలాడుతున్నాయి. అది శత్రువులకు దుర్గమం. మిత్రులకు సుగమం.

మణిమయ ప్రాసాద శిఖరాలు(కోటబురుజులు) ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి. చుట్టూ పన్నెండు కక్ష్యలున్నాయి. పన్నెండు రజతద్వారాలున్నాయి. ప్రతిద్వారం దగ్గరా దానవవీరులు జాగరూకులై కాపలా కాస్తున్నారు. కక్ష్యాంతరాలలో ఉన్న వాటితో కలిపి మొత్తం లక్ష భవనాలున్నాయి. అన్నీ మణిమయాలే అన్నింటా రత్సస్తంభాలూ రత్నసోపానాలూ.

చిత్రరథుడు (పుష్పదంతుడు) పన్నెండవ కక్ష్యదాటి రాజమందిర సింహద్వారం చేరుకున్నాడు అక్కడ శూలం ధరించి చిరునవ్వులు చిందిస్తూ పింగలాక్షుడూ తామ్రవర్ణుడూ అతిభయంకరుడూ ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతడికి వృత్తాంతమంతా చెప్పి అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించాడు దూతరూపంలో వచ్చాడు కనుక ఎవరూ పెద్దగా అడ్డుకోలేదు. అభ్యంతరమందిర ద్వారం చేరుకున్నాడు అక్కడి ద్వారపాలకుడికి తాను వచ్చిన పనినీ రణవృత్తాంతాన్నీ తెలియపరిచి మీ ప్రభువుకి నివేదించి రమ్మని పంపించాడు. అతడు లోపలికి వెళ్ళి తిరిగివచ్చి చిత్రరథుణ్ణి వెంటతీసుకువెళ్ళి శంఖచూడుని ముందు హాజరు పరిచాడు.

రాజమండల పరివృతుడై సమున్నత స్వర్ణసింహాసనంమిద ఠీవిగా దర్పంగా విరాజిల్లుతున శంఖచూడుడి మనోహరరూపాన్ని చూడటంతోనే చిత్రరథుడి కన్నులు జిగేలుమన్నాయి. దివ్యమందిరం మణీంద్ర నిర్మితం, రత్నదండసమన్వితం, రత్నమయ కృత్రిమపుష్ప విభూషితం. బంగారు సింహాసవం వెనక నిలబడి ఒక భృత్యుడు బంగారుగొడుగు పట్టుకున్నాడు. ఇరువైపులా పార్షదులు వింజామరలు వీస్తున్నారు. సముచిత వస్త్రాభరణాలతో సుందరమాల్యానులేపనాలతో త్రికోటి దానవవీర సంవేష్టితుడై శంఖచూడుడు కన్నులవిందై కనిపించాడు. శతకోటి దానవవీరులు ఆయుధపాణులై కావలి తిరుగుతున్నారు. ఆశ్చర్యంనుంచీ ఆనందంనుంచీ తేరుకుని చిత్రరథుడు (పుష్పదంతుడు) మెల్లగా పెదవి విప్పాడు.

దానవేంద్రా! నేను శివుడి భృత్యుడిని. నాపేరు పుష్పదంతుడంటారు. ప్రభూ! శంకరుడు నీతో చెప్పమన్నది యథాతథంగా చెబుతాను, సౌమ్యంగా ఆలకించు - “దేవతల రాజ్యాన్ని విడిచి పెట్టు. వారి అధికారాలను వారికి తిరిగి అప్పగించు. దేవతలంతా వెళ్ళి శ్రీహరిని శరణువేడారు. శ్రీహరి స్వయంగా శూలాన్ని అందించి నన్ను పంపించాడు. నేను వచ్చి చంద్రభాగా(పుష్పభద్రా) నదీతీరంలో వటవృక్షం క్రిందే విడిది చేశాను. రాజ్యమైనా అప్పగించు లేదా యుద్ధమైనా చెయ్యి” - ఇదీ త్రిలోచనుడు నీకు వినిపించి రమ్మన్న సందేశం. నేను దూతను నువ్వు ఏది చెప్పమంటే అది వెళ్ళి మహేశ్వరుడికి చెబుతాను.

గంధర్వుడి మాటలు వింటూనే శంఖచూడుడు పెద్దపెట్టున నవ్వాడు. రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళు - అన్నాడు. గంధర్వుడు చిత్తం అని వెంటనే పరుగుపరుగున వెళ్ళి వటమూలంలో కూర్చున్న శివుడికి ఆ రెండుముక్కలూ చెప్పాడు.

అంతలోకీ సేనాపరివృతుడై కుమారస్వామి అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు నంది మహాకాలుడు సుభద్రకుడు విశాలాక్షుడు బాణుడు పింగలాక్షుడు వికంపనుడు విరూపుడు వికృతి మణిభద్రుడు బాష్కలుడు కపిలుడు దీర్ఘదంష్ట్రుడు వికటుడు తామ్రలోచనుడు కాలకంఠుడు బలిభద్రుడు కాల జిహ్వుడు కుటీచరుడు బలోన్మత్తుడు రణశ్లాఘి దుర్జయుడు దుర్గముడు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు దేవేంద్రుడు ద్వాదశాదిత్యులు చంద్రుడు అగ్నిదేవుడు విశ్వకర్మ అశ్వినీ దేవతలు కుబేరుడు యముడు జయంతుడు నలకూబరుడు వాయువు వరుణుడు బుధుడు మంగళుడు ధర్ముడు శని ఈశానుడు కామదేవుడు ఉగ్రదంష్ట్ర ఉగ్రదండ కోటర కోటభి -  ఇత్యాదులందరూ వచ్చారు. అష్టభుజావిరాజమానమై స్వయంగా భద్రకాళీదేవి అరివిరభయంకరంగా వచ్చింది. ఇంద్రనీలమణి నిర్మితమైన విమానం అధిరోహించి వచ్చింది. రక్తవస్త్రాలూ రక్తమాల్యానులేపనలతో నృత్యం చేస్తూ గానం చేస్తూ వికటాట్టహాసాలు చేస్తూ వచ్చి నిలబడింది. యోజనం పొడవున్న అగ్నిజ్వాలలాంటి నాల్కను భీకరంగా కదలాడిస్తోంది. శంఖచక్ర గదాఖడ్గధనుర్భాణాది భీషణాయుధాలను ధరించింది. వర్తులాకారమూ యోజన విస్తీర్ణమూ అయిన ఖర్పరం ఉంది. చేతిలో మిన్ను తాకుతున్న త్రిశూలం. యోజనాయతమైన శక్త్యాయుధం. ముద్గరముసల వజ్రిఖేట ఫలకాలతో విచ్చేసింది. వైష్ణవ - వారుణ - వాహ్నేయ - నాగపాశ - నారాయణ - గాంధర్వ - గారుడ - పర్జన్య - పాశుపత - జృంభణ - పార్వత - మాహేశ్వర - వాయవ్య - సమ్మోహన - బహ్మాద్యస్త్రాలు సన్నిధి చేసుకుంది. యోగినీ ఢాకినీ భూత ప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మరాక్షస బేతాళరాక్షస యక్ష కిన్నర సమూహాలతో వచ్చింది. ఇందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలిచాడు.

దూతగా వచ్చిన గంధర్వుణ్ణి సాగనంపి శంఖచూడుడు కొలువు చాలించి అంతఃపురంలోకి నిర్గమించాడు. అక్కడ తులసికి ఈ రణవార్తను చెప్పాడు. వింటూనే నోరు ఎండిపోయింది. పెదవులు తడి ఆరాయి. క్షణకాలం అవాక్కుగా నిలిచిపోయింది.

ప్రాణబంధూ! క్షణకాలం నా గుండెలపై విశ్రమించు. ప్రాణాధిష్ఠానదేవతా! క్షణకాలం నా ప్రాణాలు కాపాడు. నామాట మన్నించు. క్షణకాలం సాదరంగా ఈ కన్నులతో నిన్ను ఇలా చూడనీ. గుండెలు దహించుకుపోతున్నాయి. ప్రాణాలు ఆందోళన పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాములోనే నాకొక దుస్వప్నం కూడా వచ్చింది.

తులసి మాటలు విని శంఖచూడుడు మందహాసం చేశాడు. మదిర సేవించి విందు ఆరగించాడు. మెల్లగా హితవచనాలు పలికాడు. ప్రాణప్రియా! ఈ జగత్తులో సమస్తమూ కాలాధీనమే. సుఖమూ దుఃఖమూ భోగాలూ ఆనందాలూ మంగళాలూ అమంగళాలూ అన్నింటికీ కాలమే కర్త. వృక్షాలు చూడు కాలవశాన కొమ్మలు తొడుగుతున్నాయి. పువ్వులు పూస్తున్నాయి. అవి కాయలవుతున్నాయి, పండ్లవుతున్నాయి. కాలవశాన రాలిపడుతున్నాయి. విశ్వాలు ఏర్పడేదీ నశించేదీ కాలప్రభావంతోనే. సృష్టి స్థితిలయాలు కాలంవల్లనే జరుగుతున్నాయి. త్రిమూర్తులకూ పైని మరొక పరమాత్మ ఉన్నాడు, అతడు కాలనర్తకుడు. అతడు వీరిని ఆడిస్తుంటాడు. తన ఇచ్చప్రకారం తనకు అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాలనూ చరాచరజీవజాలాన్నీ సృష్టించి కాలవశంగా క్రీడిస్తుంటాడు. వినోదిస్తుంటాడు. అతడు సర్వాత్మ సర్వరూపధారి. పరమేశ్వరుడు. జనంతో జనాన్ని సృష్టింపజేసి, జనంతో జనాన్ని రక్షింవజేసి, జనంతో జనాన్ని సంహరింపచేస్తుంటాడు.

ప్రియా! ఇప్పుడింక అతడిని సేవించు. ఈ సృష్టిలో గాలివీచినా, సూర్యుడు ప్రకాశించినా, ఇంద్రుడు వర్షించినా, మృత్యువు కబళించినా, అగ్ని దహించినా, చంద్రుడు వెలుగొందినా అంతా అతడి ఆజ్ఞప్రకారమే, అతడు మృత్యువుకి మృత్యువు. కాలానికి కాలం. యముడికి యముడు. సృష్టికర్తకు సృష్టికర్త. మాతకు మాత. సంహర్తకు సంహర్త. ఆ దేవాదిదేవుణ్ణి శరణువేడుకో. అతడే అందరికీ నిజమైన బంధువు. ఆత్మబంధువు.

నిజానికి నేనెవరో, నువ్వెవరో! విధి మనల్ని ఇలా కలిపింది. అలాగే విడదీస్తోంది. ఈ రహస్యం తెలిసిన పండితుడు ఆపదలు వచ్చినప్పుడు అజ్ఞానిలా భయపడిపోడు. సుఖదుఃఖాలను రెండింటిని సమానంగా భావించి కాలనేమిక్రమంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు.

తులసీ! ఈ జన్మ ముగియడంతోనే నువ్వు నిశ్చయంగా నారాయణుడిని చేరుకుంటావు బదరికావనంలో తీవ్రంగా తపస్సు చేశావుగదా! నేనూ చేశాను. ఆ తపస్సుకి ఫలంగానే నువ్వు దక్కావు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉండనే ఉంది. కానీ నీ తపస్సు శ్రీహరికోసం కనక అతడిని నువ్వు పాందితీరతావు. గోలోక బృందావనంలో గోవిందుణ్ణి త్వరలోనే కలుసుకుంటావు. ఈ దానవదేహం విడిచి నేనూ గోలోకానికే వస్తాను. మళ్ళీ ఆక్కడ నన్ను చూద్దువుగాని. నేనూ నిన్ను చూస్తాను. రాధాదేవి ఇచ్చిన శాపంవల్ల ఈ భారతభూమిలో ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ తనువు రాలిపోగానే మళ్ళీ తిరిగి గోలోకానికేగదా వెళ్ళవలసింది. ఇక ఇందులో నువ్వుగానీ నేనుగానీ దుఃఖించవలసింది ఏమీ లేదు. త్వరగా గోలోకానికి వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాం. బాధపడకు.

శంఖచూడుడు ఇలా ఓదార్చి తులసికి ధైర్యం చెప్పాడు. రత్నమందిరంలో హంసతూలికా తల్పంమీద తులసీదేవిని గాఢంగా ఆలింగనం చేసుకుని పడుకున్నాడు. క్రీడా కౌతుక మంగళవాక్యాలు ఎన్నెన్నో పలికాడు. తులసీదేవిని ఉత్సాహపరిచి ఉల్లాసంగా ఉంచడానికి శతవిధాల ప్రయత్నించాడు.

కానీ ఆ కృశోదరి అలా దుఃఖిస్తూనే ఉంది. ఆహారం ముట్టలేదు. రెప్పవాల్చలేదు. కన్నీరు ఆగలేదు. అతడి వక్షస్థలంమీద తల అన్ని శోకిస్తూనే ఉంది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు భాండీరంలో తనకు ఉపదేశించిన దివ్యజ్ఞానాన్ని అంతటినీ మెల్లమెల్లగా తులసికి మళ్ళీ నూరిపోశాడు శంఖచూడుడు. సర్వశోకహరమైన తెలివిని కలిగించాడు. దానితో తులసి తేరుకుంది. ముఖమూ చూపులూ తేటపడ్డాయి. ప్రసన్నత చిగురించింది. సమస్తమూ నశ్వరమే అనే ఎరుక కలిగింది. దుఃఖం తొలగిపోయింది. అప్పుడు శంఖచూడుడితో చెయ్యి కలిపింది. క్రీడాపరవశులై దంపతులు సుఖసాగరంలో ఈదులాడారు. అర్థనారీశ్వరుడన్నట్టు బిగియార కౌగిలించుకున్నారు.

ఇద్దరూ ఒకరికొకరు ప్రాణాధికప్రియులు. ఇద్దరూ సమానరూపయౌవన సంపన్నులు. క్షణకాలం అవ్యక్తమధురంగా మాట్టాడుకుంటున్నారు. క్షణంలో రతిక్రీడా పరాయణులవుతున్నారు. క్షణకాలం మైమరచి యౌవన గర్వంతో విలాసంగా నవ్వుతున్నారు. ఆ శృంగారపండితుల రతికి విరతి లేదు. ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు. ఓడిపోవడం లేదు.

శివ - శంఖచూడ సంవాదం


Sthandila Kunda Samskaralu - స్థండిల కుండ సంస్కారాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - స్థండిల కుండ సంస్కారాలు నారదా! ఇక్కడ చెయ్యవలసిన స్థండిల కుండసంస్కారాలు చెబుతాను. తెలుసుకో. మూలమంత్రంతో వీక...