శిలారూపివి కమ్మని నన్ను శపించావుకదా! ఆలాగే. గండకీతీరంలో సాలగ్రామశిలగా మారి నీ సాన్నిధ్యాన్నీ నీ స్పర్శనూ నిరంతరం అనుభవిస్తాను. ఆ తీరపర్వతగుహల్లో కోటినంఖ్యల్లో కీటకాలు చేరి దంష్ట్రలతో శిలలను తొలిచి సుదర్శన చక్రాలూ ద్వారాలూ ఏర్పరుస్తాయి. వాటినిబట్టి సాలగ్రామాలలో భేదాలు ఏర్పడతాయి. ఒక ద్వారమూ నాలుగు చక్రాలూ ఒక వనమాల ఉండి నీలమేఘశ్యామంగా ఉంటే అది లక్ష్మీనారాయణమనే సాలగ్రామం. వనమాల లేకపోతే లక్ష్మీజనార్దనం. రెండు ద్వారాలూ నాలుగు చక్రాలూ ఒక ఆవుడెక్కగుర్తూ ఉండి వనమాలా రహితమైతే అది రఘునాథం. రూపంలో చిన్నదై రెండు చక్రాలే ఉండి వనమాల లేకుండా నీలనీరదంలాగా ఉండేది వామనాభిదం. ఆకారంలో చిన్నదై ద్విచక్ర - వనమాలాసహితం శ్రీధరం. ఇది గృహస్థులకు లక్ష్మీప్రదం. పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాలా రహితమై ద్విచక్రయుతమైతే దానిపేరు దామోదరం. అంత చిన్నదీకాక పెద్దదీకాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగానూ ద్విచక్ర - బాణతూణ చిహ్నితమై ఉంటే దాన్ని రణరామం అంటారు. ఆకారంలో ఇలాగే ఉండి సప్తచక్ర - ఛత్ర చామర భూషణ చిహ్నితమైతే అది రాజరాజేశ్వరం. రాజులకూ ప్రజలకూ సంపత్ప్రదం. మరీ పెద్దదిగా ఉండి పధ్నాలుగు చక్రాలతో నీలమేఘం రంగులో ఉంటే దాన్ని అనంతం అంటారు. ఇది ధర్మార్థకామమోక్షాలను ఇస్తుంది. చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాంకితమై శ్రీ చిహ్నితమై ఆవుడెక్క ముద్రతో మేఘవర్ణంలో ఉండేదాన్ని మధుసూదనం అంటారు. ఏకచక్ర విరాజితానికి సుదర్శనమనీ, గుప్తంగా చక్రచిహ్నం ఉంటే గదాధరమనీ, గుర్రపు తల ఆకారంలో ఉండి ద్విచక్రాన్వితమైతే హయగ్రీవమనీ, అగ్రభాగం విశాలంగా ఉండి ద్విచక్రాంచితమై చూపులకి వికటంగా ఉంటే వైరాగ్యప్రదమైన నారసింహమని, విస్తృతాగ్రమై ద్విచక్ర వనమాలా విరాజితమై ఇలాగే వికటంగా ఉంటే గృహస్థులకు సుఖప్రదమైన లక్ష్మీనరసింహమనీ, (అగ్రభాగాన) ద్వారదేశంలో ద్విచక్రాంకితమై స్ఫుటంగా కనిపించే శ్రీగుర్తుతో ఉంటే సర్వవాంఛాప్రదమైన వాసుదేవమనీ, చిల్లులు ఎక్కువగా ఉండి సూక్ష్మచక్రాంచితమై మేఘం రంగులో ఉంటే ప్రద్యుమ్నమని, రెండు చక్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండి పృష్ఠభాగం వెడల్పుగా ఉంటే సంకర్షణమనీ, వర్తులాకారంలో ఉండి పీతవర్ణంలో శోభలీనుతూ ఉంటే అనిరుద్ధమనీ పేర్లు. ఎదైనా సాలగ్రామశిల అంటే సాక్షాత్తూ నారాయణ స్వరూపం. అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. సకలతీర్థాలూ వేంచేసి ఉంటాయి. సాలగ్రామార్చన సర్వపాప ప్రణాశకం. బ్రహ్మహత్యాది దోషాలుకూడా తొలగిపోతాయి.
ఈ శిలలు రూపంలో ఛత్రాకారంలో ఉంటే రాజ్యప్రదాలు, వర్తులంగా ఉంటే మహాసంపత్ప్రదాలు, శకటరూపంలో ఉంటే దుఃఖదాయకాలు, శూలాగ్రరూపంలో ఉంటే మృత్యుప్రదం, ముఖభాగం వికృతంగా ఉంటే దారిద్య్రప్రదం, పింగళవర్ణంలో ఉంటే హానికరం, చక్రం చిదికి ఉంటే వ్యాధికారకం, విరిగి ఉంటే మరణదాయకం. తులసీ! సాలగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతం దానం ప్రతిష్ట శ్రాద్ధం దేవవూజ ఇవన్నీ ప్రశస్తాలూ అధిక ఫలదాయకాలూ అవుతాయి. సాలగ్రామ శిలార్చనతో సర్వవేద పఠనఫలం సర్వయజ్ఞవ్రతఫలం సర్వతీర్ణస్నాన దాన ఫలం సర్వతపఃఫలం నిశ్చయంగా లభిస్తాయి. సాలగ్రామ శిలోదకాన్ని నిత్యం సేవిస్తే సకలదేవతానుగ్రహం లభిస్తుంది. మహాపవిత్రుడవుతాడు. ఆతడి స్పర్శను సకలతీర్థాలూ కోరుకుంటాయి. జీవన్ముక్తుడవుతాడు. హరిసన్నిధికి చేరుకుని హరిదాసుడవుతాడు. తడి పాదధూళి సోకి వసుంధర పవిత్రురాలవుతుంది. అతడి వంశంలో పుట్టి గతించినవారూ పుట్టబోయే వారూ అందరూ తరిస్తారు. కర్మబంధాలనుంచి విముక్తి పొందుతారు. విష్ణుపదంలో లీనమవుతారు.
సాలగ్రామశిలను ధరించి అసత్యాలు పలికితే వాడు కుంభీపాక నరకానికి పోతాడు. నియమాలను ఉల్లంఘిస్తే అసిపత్ర నరకంలో పడతాడు. సాలగ్రామపూజలో తులసీవిచ్చేదం చేస్తే(తులసి రహితంగా పూజచేస్తే) భార్యా వియోగమూ స్త్రీహత్యామహాపాతకమూ చుట్టుకుంటాయి. శంఖపూజలో చేసినా ఇదే దుష్ఫలితం. సాలగ్రామ తులసీ శంఖాలను ఒకేచోట ఉంచి అర్పిస్తూ కాపాడేవాడు మహాజ్ఞానియై శ్రీహరిసన్నిధికి చేరుకుంటాడు. శ్రీహరికి ఇష్టుడవుతాడు.
తులసీ! ఇప్పటికి నీకోపం చల్లారిందనుకుంటాను. శంఖచూడునితో నీ కలయికకు కేవలం ఒక మన్వంతరమే అవధి. అది ముగిసిపోయింది. మీ ఇద్దరి శాపాలూ ముగిశాయి. కనక ఇద్దరూ ఇప్పుడు గోలోకవాసులూ నాకు అత్యంతాప్తులూ అయ్యారు. బృందావనంలో రాసమండలంలో ఇక మనం విహరిద్దాం - అని శ్రీహరి ఆప్యాయంగా ఊరడించాడు.
తులసి మౌనంగా ఉండిపోయింది. క్షణంలో దేహం రాలిపోయింది. దివ్యతేజోమయమైన లక్ష్మీస్వరూపం ఆవిర్భవించింది. శ్రీమన్నారాయణుడితో కలిసి దివ్యవిమానం అధిరోహించి వైకుంఠానికి తరలిపోయింది.
నేలపై పడిఉన్న తులసీదేహం గండకీనదిగా మారింది. శ్రీహరి దాని తీరాన పర్వతంగా మారాడు. అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాలలో తొలిచి నదిలోకి దొర్లిస్తాయి. అవే సాలగ్రామ శిలలు. నదీజలంలో పడినవి అత్యధిక ఫలప్రదాలు. గట్టున ఉండి పోయినవి సూర్యుడి వేడిమితో పింగళవర్ణంలోకి మారతాయి.
నారదా! నీ సందేహాలన్నీ తీరాయికదా! ఇంకా ఏమైనా మిగిలిఉన్నాయా? సంశయించకుండా
అడుగు. చెబుతాను - అన్నాడు నారాయణమహర్షి.
No comments:
Post a Comment