Friday, May 29, 2026

Sundarakanda Parayana Vidhanam - సుందరకాండ పారాయణ విధానం

సుందరకాండ పారాయణ విధానం

సుందరకాండ పారాయణ పద్ధతులు అనేకంగా ఉన్నాయి. వారి వారి అనుకూలతలను అనుసరించి పద్ధతిని ఎంచుకోవచ్చు. కొందరు నిత్య పారాయణగా సుందరాకాండను అనుష్ఠిస్తారు.

ప్రతి రోజు ఏడు సర్గల చొప్పున సంవత్సరం వరకు సుందరాకాండను పఠించడం ఒక పద్ధతి. రోజుకి ఇరవై అయిదు సర్గలుగా నిత్యానుష్ఠానం చేసే పద్ధతి శాస్త్రం చెబుతోంది.

అభీష్టసిద్ధికోసం, అనిష్ట పరిహారం కోసం పారాయణ చేసే విధానాలు చాలా ఉన్నాయి.

ముప్పయి రెండు పర్యాయములు పారాయణ ఒక పద్ధతి. మొదటి రోజున సీతాదేవి ఆంజనేయునకు చూడామణినివ్వడం వరకు చదవాలి.

రెండోరోజున మిగిలిన కాండ పారాయణ చేయాలి. అలా 64 రోజుల్లో 32 పర్యాయాలు పూర్తవుతుంది.

72 దినాలలో 24 పర్యాయాలు పారాయణ చేసే విధానముంది. హనుమంతుడు సీతమ్మను చూసేవరకు మొదటి రోజున పఠించాలి.

రెండవరోజున హనుమంతుడు అశోకవన ధ్వంసం చేసిన ఘట్టం వరకు చదవాలి. మూడవ రోజున మిగిలి కాండను పూర్తి చేయాలి. ఇలా 72దినాలు చేస్తే 24 పర్యాయాలు పూర్తి అవుతాయి.

48 దినాలలో 12 ఆవృత్తులు పఠించే విధానముంది. మొదటి రోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించే ఘట్టం వరకు, రెండవరోజు విశ్వరూపం సందర్శనం వరకు, మూడవరోజు హనుమ రావణునకు హితోపదేశం చేసే సన్నివేశం వరకు, నాలుగవరోజు కాండాంతం చదవాలి. ఇలా 48 రోజులు చేస్తే 12 పర్యాయాలవుతుంది.

మొదటిరోజున సీతా సందర్శన ఘట్టం వరకు, రెండవరోజున త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు, మూడవ రోజున చూడామణీ ప్రదానం వరకు, నాల్గవరోజున లంకాదహనం వరకు, ఐదవరోజున మిగిలిన భాగం-పాంచాహ్నిక పారాయణ విధి.

ఇలా వివిధ ఆవృతుల విధానాలు ఉన్నాయి. ఇంతే కాకుండా - ఒక్కరోజు మొత్తం సుందరకాండ పారాయణ చేయవచ్చు.

అలా చేసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదికాలు చేసి అపరాహ్ణాత్పూర్వమే (మధ్యాహ్నం లోపల) పూర్తి చేయాలి. దీనికి శక్తి లేకపోతే రెండు రోజులు పారాయణ చేయవచ్చు.

అలాగే మూడు రోజుల పాటు రోజుకు కొన్ని సర్గల చొప్పున విభజించుకొని పారాయణ చేయొచ్చు. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది దినములు పారాయణ చేయవచ్చు.

ఎప్పుడు పారాయణ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజచేసి, సంకల్పం చెప్పుకొని శ్రీసీతారామాంజనేయులను షోడోపచారాలతో అర్చించి, పుస్తకాన్ని పూజించి, పారాయణ ప్రారంభించాలి.

మధ్యలో ఇతరులతో సంభాషించడం కానీ, లేవడంగానీ చేయరాదు. పారాయణాంతంలో క్లుప్తంగా పునః పూజచేసి మంగళ హారతి ఇచ్చి, మంగళ శ్లోకాలు చదవాలి.

పారాయణకు ముందు గురూపదేశం ద్వారా లభించిన శ్రీ సీతారామమంత్రం, ఆంజనేయ మంత్రం జపించడం మంచిది.

ఉపదేశం లేనట్లయైతే 'శ్రీరామయనమః' లేదా 'శ్రీరామ జయరామ జయజయరామ' - అనే మంత్రాన్నీ,'శ్రీ హనుమతేనమః' లేదా 'శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' అనే మంత్రాన్నీ జపించడం మంచిది.

పటిక బెల్లం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అప్పాలు నివేదించి పారాయణ చేయడం మంచిది.


సుందరకాండ పారాయణ అద్భుత పలితాలు:
రామాయణం గొప్ప గ్రంథం. అందులో మొత్తం ఏడు కాండలు ఉన్నాయి. ఆ ఏడు ఆ సందర్బాలకు అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి. కానీ ఆ ఏడింటిలో విశిష్టమైనది సుందరకాండ. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని, సీతను వెతికి, కనుకొని తరువాత లంకను దహనం చేసి, సీత ఎక్కడుంది అనే విషయాన్ని రాముడికి తెలియజెప్పడం ఈ సుందరకాండ సారాంశం. రామాయణం అంతా రాముడి గురించి అయితే, సుందరకాండ ఆంజనీయుడి అద్భుత విన్యాసాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. అందుకే సుందరకాండకు అంత ప్రత్యేకత. అయితే సుందరకాండ పారాయణ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని అందరి నమ్మకం.

68 రోజుల పారాయణం చేస్తే కొడుకులు పుట్టలేదని బాధపడేవారికి కొడుకులు పుడతారు. అలాగే పెళ్లికాని ఆడపిల్లల పెళ్లి తొందరగా జరుగుతుంది. రోజూ సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటే వర్షాలు చక్కగా కురిసి, పంటలు పండి, కరువు మాయమవుతుంది. నిత్య పారాయణం చేస్తే అన్ని పనులలో విజయం కలుగుతుంది, అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది.

సుందరకాండ చదివేచోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే రాముడి గురించి పూజలు జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. కాబట్టి సుందరకాండ పారాయణ చేయగానే ఆవు పాలు బాగా కాచి గోరువెచ్చగా ఉన్న పాలలో చక్కెర కలిపి నైవేద్యంగా పెట్టాలి. ఇది ఎంతో గొప్ప నైవేద్యం. ఇలా చేస్తుంటే సకల సమస్యలు తొలగిపోతాయి.

సుందరకాండలో ఏది చదివితే ఏ సమస్య తీరిపోతుందని కూడా పండితులు వివరించారు. సుందరకాండలో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమై ఉంటుంది. అంతే కాదు అదంతా చందస్సులో కూర్చబడి ఉంటుంది. సుందరకాండను భక్తితో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా, బాధలు కష్టాలు తొలగిపోతాయి. రోగాలు నయమౌతాయి, భయాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. మృత్యు భయం పోతుంది.

లంకా విజయం చదివితే భూత-ప్రేతాదుల భయంతో ఉన్నవాళ్లను హనుమంతుడు రక్షిస్తాడు.

హనుమ నిర్వేదం చదివితే బుద్దిమాంద్యం సమస్యలున్నవారికి ఆ సమస్య తొలగుతుంది.

లంకలో సీతాన్వేషణ ఘట్టం చదివితే ఇతరులు వల్ల మనపై కలిగే దోషాలు తొలగిపోతాయి.

లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

త్రిజటా స్వప్న వృత్తాంతం చదివితే చెడ్డ కలల వల్ల కలిగే దోషాలు పోతాయి.

సీతారావణ సంవాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది.

సీతా హనుమ సంవాదం చదివితే దూరమైపోయిన బంధువులు తిరిగి కలుస్తారు.

అంగుళీయక ప్రదానం చదివితే కష్టాలు తగ్గుతాయి.

కాకానుగ్రహం చదివితే తెలిసీ తెలియక ఎప్పుడైనా రాముడి విషయంలో ఏదైనా తపోయూ చేసి ఉంటే అవి తొలగిపోతాయి.

చూడామణి ప్రదానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

కిమ్కరాది రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు చదివితే శత్రువుల మీద విజయం సాధిస్తారు.

లంకాదహన ఘట్టం చదివితే ఇంట్లోనూ, వ్యవసాయ పనుల్లో అభివృద్ధి కలుగుతుంది.

మధువన ధ్వంసం చదివితే ఆ పుణ్యం వల్ల మరణం తరువాత బ్రహ్మలోకానికి వెళతారు.

సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి.

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...