Monday, March 30, 2026

History of Bharat - భరతుని చరిత్ర

భరతుని చరిత్ర

ఈ విధంగా అమోఘమైన తేజస్సుగల దుష్యంతుడు శకుంతలకు గర్భాన్ని నిలిపి తన పురం చేరాడు. శకుంతల కొంత కాలానికి కుమారుని కన్నది. కణ్వమహర్షి దుష్యంత సుతునకు వైదికయుక్తమైన జాతకర్మ మొదలైనవి చేయించాడు. ఆ దుష్యంత సుతుడు రోజురోజుకు బాలచంద్రునివలె పెరుగుతూ

ఆ దుష్యంత కుమారుడు తన బాల్యంలోనే కణ్వమహర్షి ఆశ్రమంలో తిరిగే పెద్ద పెద్ద సింహాల కంఠాలను పట్టుకొని వాటి గర్వాన్ని అణగగొడుతూ, వాటిని చెట్లకు కట్టేవాడు, విడిచేవాడు.

బాల్యంలోనే పరాక్రమాన్ని చూపుతున్న దుష్యంత సుతుణ్ణి చూచి కణ్వమహర్షి శకుంతలతో ఇలా అన్నాడు.

నీ భర్త చక్రవర్తి. నీ కుమారుడు అతనికంటె అన్ని విధములా గొప్పవాడు. గౌరవంతో నీవు పట్టపురాణివై ఉండాలి గాని ఈ తాపసులతో ఈ పర్వతారణ్య ప్రదేశాలలో పాట్లు పడవలసిన పనిలేదు. భర్తను విడిచి చిరకాలము పుట్టింట్లో ఎవరైనా ఉంటారా? నీవు నీ భర్త ఇంటికి తరలిపోవచ్చును గదా!

అలా అనేసరికి అంగీకరించి

శకుంతల సాటిలేని క్రియలు చేస్తున్న వానిని, గొప్పవానిని, విష్ణుని అంశతో జన్మించినవానిని, చూపుతానని తన పుత్రుని గైకొని రాజైన దుష్యంతుని వద్దకు వచ్చింది.

శకుంతల తన కుమారుని తీసికొని దుష్యంత మహారాజు ఉన్న సభామండపం వద్దకు వెళ్ళి నిలిచి ఉన్న సమయంలో

ఆ సుతుడు కుడిచేతిలో పద్మరేఖ, పాదాలలో పద్మరేఖలు కలిగి ఉన్నాడు. అతడు ఆ సభా భవనానికి వచ్చిన శ్రీనాథుడైన విష్ణువులా కాంతితో అతిశయించి ఉన్నాడు. అలా ఉన్న మన్మథ సమానాకారుడైన తన కుమారుని చూచి దుష్యంతుడు శకుంతల తొట్రుపాటుతో బాధపడగా ఏమి మాట్లాడలేదు.

ఆ సమయంలో, ఓ దుష్యంత మహారాజా! ఈమె నీ భార్య, ఇతడు నీ కుమారుడు. యోగ్యులైన నీ సతీసుతులను విడువదగదు, అలనాడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి శకుంతలను వివాహమాడిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకో. శకుంతల పలికిన పలుకులన్నీ యథార్దాలు. గౌరవింపదగినవి. దయతో వీరిని స్వీకరించు అంటూ ఆకాశవాణి పలుకులు ధ్వనించాయి.

ఈ విధంగా ఆకాశవాణి లోకంలో అందరికి సత్యం అర్ధం అయేలా 'భరింపుము' అన్న కారణంగా ఆ కుమారుడు భరతు డయ్యాడు. ఆ తరువాత దుష్యంతమహారాజు చంద్రునివంటి మొగంగల శకుంతలను భార్యగా స్వీకరించి కొంతకాలం రాజ్యపాలన చేసి పరలోకం చేరాడు. ఆ తర్వాత

భరతుడు రెండవ హరియా అనునట్లు తన భుజాదండంపై భూమండలాన్ని నిలిపి యుద్ధంలో ఎదురులేక ప్రకాశించాడు.

అంతేకాక, ఆ దుష్యంతసుతుడు భరతుడు, యమునాతీరంలో దీర్ఘతపుని పౌరోహిత్యంలో డెబ్బై ఎనిమిది, గంగానదీతీరంలో నూట ముప్ఫై మూడు అశ్వమేధ యాగాల్ని చక్కటి దక్షిణలతో నిర్వహించి మహేంద్ర వైభవాన్ని మించినాడు. పదమూడు వేల ఎనబై నాలుగు గోవుల సముదాయాన్ని ద్వంద్వం అంటారు. అటువంటి వేయి ద్వంద్వాలు దూడలతో గూడిన ఆవులను అలంకారాలతో అలంకరించి వేయిమంది బ్రాహ్మణులకు దానం చేశాడు. మష్కార నదీతీరంలో బ్రాహ్మణోత్తములకు రత్నాల ఆభరణాలతో కూడిన తెల్లని దంతాలు గల నల్లని ఏనుగులను పదునాలుగు లక్షలు దానం చేశాడు. దిగ్విజయవేళ శక, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్చ దేశాల రాజులను జయించి, రసాతలంలో రాక్షసుల చెరసాలల్లో మగ్గుతూ ఉన్న దేవతాస్త్రీలను విడిపించి వారి వారి భర్తల దగ్గరకు పంపించాడు. త్రిపురాసురులను జయించి వారి అధీనంలో ఉన్న దేవతలను వారి వారి ఇళ్ళకు పంపాడు. అతని రాజ్యంలో భూమ్యాకాశాలు ప్రజలు ఏమి కోరితే అవి చేకూర్చేవి ఈ విధంగా

ఓ పరీక్షిన్మహారాజా! చక్కటి నడవడిలో, పట్టుదలలో, బలంలో, సంపదలో దిక్పాలకులను మించిన వైభవంతో ఇరవై ఏడువేల సంవత్సరాలు భరతుడు భూమిని పాలించాడు.

ఓ పరీక్ష్మిన్మహారాజా! భరతుడు కుబేరునికంటె ఎక్కువ ధనం పొంది, సాటిలేని పరాక్రమం కలిగి ఉండి కూడా 'అర్థప్రాణాలు అశాశ్వతాలు' అని గుర్తించి ప్రశాంతుడయ్యాడు.

ఓ పరీక్షిన్మహారాజా! భరత చక్రవర్తికి గల ముగ్గురు భార్యలు క్రమంగా కొడుకులను కన్నారు అయితే ఈ సుతులు తమ భర్త భరతునితో ఏ విషయంలోను తులతూగరని తమ సుతుల శిరస్సులను ఖండించారు.

భరతుని భార్యలు విదర్భరాజసుతలు ఈ విధంగా తమ శిశువులను ఖండించి వేయగా భరతుడు పిల్లలు లేనివాడయ్యాడు. కొడుకులను కోరి మరుత్‌ స్తోమం అనే యాగాన్ని చేసి దేవతలను మెప్పించాడు ఆ సమయాన

ఒకసారి బృహస్పతి తన అన్నభార్య, గర్భవతి అయిన మమతను చూచి రతిక్రీడకు పూనుకోగా గర్భంలో ఉన్న శిశువు భయపడి వద్దు; ఇది నీకు తగదు - అని మొరపెట్టుకొన్నాడు. అప్పుడు బృహస్పతి తమకంతో వాణ్ణి గుడ్డివాడివై పో అని శపించాడు. వాడు కోపించి యోనిలోపల ఉన్న బృహస్పతి వీర్యం ఊడిపడేలా తన్నాడు. అది బిడ్డగా నేలమీద పడింది. అప్పుడు మమత ఆ బిడ్డను వదలలేక బృహస్పతితో వీణ్ణి పెంచు. ఇద్దరు కొడుకులు కలిగారు. బాగా మనేట్లు చేయి అన్నది. ఆ బృహస్పతి “నేను పెంచలేను. నీవే సాకు ఈ ద్వాజుణ్ణి నీవే భరించు” అంటూ ఆమెను వదలి వెళ్ళాడు.

ఈ విధంగా ఉచథ్యుని భార్య మమత, బృహస్పతి శిశువును చూచి ఈ ద్వాజుణ్ణి నీవు భరించు అంటే నీవు భరించు అని వాదులాడుకోవడంవల్ల అతడు భరద్వాజుడయ్యాదు. మమత గర్భంలో ఉన్నవాడు బృహస్పతి శాపంవల్ల గ్రుడ్డివాడయ్యాడు. అతడు దీర్ఘతముడు. అంతట బృహస్పతి, మమత ఇరువురు కూడా ఉదయించిన బిడ్డను విడిచి వారి వారి ఇష్టానుసారం వెళ్ళిపోయారు. మరుత్తులు ఆ బిడ్డను పోషించి పుత్రుని కోరుకొన్న భరతునకు ఇచ్చారు. భరతుడు ఆ బిడ్డను స్వీకరించాడు. సంతులేని భరత వంశానికి భరద్వాజుడు వంశకర్తయై వితథుడు అని పిలువబడ్డాడు. వితథునకు మన్యువు, మన్యువునకు బృహత్‌క్షత్ర, జయ మహావీర్య, నర, గర్గులనే ఐదుగురు సంతానం కలిగారు. ఆ ఐదుగురిలో నరుడు అనేవానికి సంకృతి, సంకృతికి గురుడు, రంతిదేవుడనే ఇరువురు పుత్రులు జన్మించారు.

రంతిదేవుని చరిత్రము

No comments:

Post a Comment