Sunday, March 29, 2026

Parashurama Story - పరశురాముని చరిత్రము

పరశురాముని చరిత్రము

ఓ ముని చంద్రమా! శుకమహర్షీ! ఇరువది ఒక్కమార్లు జమదగ్ని కుమారుడు రాముడు రాజులను ఏ కారణంగా చంపాడు? రాజులు చేసిన తప్పేమిటి? బ్రాహ్మణుడైయుండి కూడా రజోగుణ తమోగుణాలను అతడెందుకు పొందాడు? భూభారం ఏ విధంగా నివారింపబడింది? నా యీ మాటకు సమాధానం స్పష్టంగా చెప్పు.

పరీక్షిత్తు వేసిన ప్రశ్నలను విని శుకమహర్షి రాజుతో ఇలా అన్నాడు.

హైహయ వంశంలోని అర్జునుడు రాజులలో ఎన్నదగినవాడు. అతడు పురుషోత్తముని అంశావతారమైన దత్తాత్రేయుని ఆరాధనచేసి ఆయన దయవలన శత్రుజయం, వేయిచేతులు, అణిమాది గుణాలు, కీర్తి, బలం, యోగీశ్వరత్వం, ఓజస్సు, తేజం, వసివాడని ఇంద్రియాలు, ధనం పొందాడు. గాలి అడ్డులేకుండా నిరాటంకంగా అన్నిలోకాలలో ఎలా సంచరిస్తుందో అలా తాను ఎక్కడికైనా వెళ్ళేవిధంగా, వచ్చేవిధంగా తిరుగుతూ; ఎక్కడైనా తన ఆజ్ఞ చెల్లుబడి అయేవిధంగా; వినువీధిలో సూర్యునిలా భూమిపై ప్రకాశించాడు.

(దేవతారాధనను సక్రమపద్ధతిలో చేసేవారికి ఈ అష్టసిద్ధులు లభిస్తాయని ప్రతీతి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, ఈ ఎనిమిదింటిని అష్టసిద్ధులు అంటారు.)

ఒకనాడు కార్తవీర్యా
ర్జునుడు తన కాంతులతోగూడి, బలగర్వితుడై; తన పట్టణాన్ని విడిచి రేవానదీ తీరానికి వెళ్ళి, తన భార్యలతో రేవానదీ స్వచ్చజలాలతో జలక్రీడలాడుతూ, తన పొడవైన హస్తపద్మాలతో నదీజలాలకు అడ్దుకట్టవేయగా; ఆ నదీజలం పొంగి ముందు భాగానకు ఉబికి, అక్కడ యుద్ధసన్నద్ధుడై ఉన్న రావణునిపై పడగా

ఈ విధంగా దిగ్విజయం చేయడంకోసం వచ్చిన రావణాసురుడు; ఆ కార్త వీర్యా
ర్జునునిచే నదీజలం కట్టివేయబడి పొంగడాన్ని సహించక, రోసంతో వీరునివలె, ఆ గొప్ప పరాక్రమశాలి అయిన కార్తవీర్యార్జునునితో యుద్దానికి తలపడగా; ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురుని బలాన్ని లెక్కచేయక, తన బాహుబల పరాక్రమంతో రావణాసురుని జుట్టు పట్టుకొని మోకాళ్ళతో కుమ్మి కోతిలా కట్టి భటులచే చెరసాలలో వేయించాడు.

అటుపిమ్మట కార్తవీర్యా
ర్జునుడు తన నగరమైన మహిష్మతీపురానికి వచ్చి

ఆ కార్తవీర్యా
ర్జునుడు రావణాసురునితో "ఓరీ ఇకపై మౌనంగాఉండు. ప్రపంచంలో నేనే వీరుణ్ణి అని విర్రవీగకు, రక్షించాను పో" అని సిగ్గుపడే మాటలు పలికి రావణుని పంపించాడు.

అటుపిమ్మట, ఒకరోజున కార్తవీర్యా
ర్జునుడు దైవప్రేరితుడై అడవికి వేటకువెళ్ళి, వేటాడి అలసి, జమదగ్నిముని ఆశ్రమానికి వచ్చి, మునికి మొక్కి నిలబడగా, ఆ జమదగ్నిమహర్షి రాజైన కార్తవీర్యార్జునుని ప్రేమతో పూజించి, రాజునకు రాజభటులకు తన హోమధేనువుద్వారా మృష్టాన్నాలు సమృద్ధిగా పెట్టించాడు. ఆరగించినరాజు హోమధేనువు మాహాత్మ్యాన్ని చూచి దాన్ని సొంతం చేసికోవలెననే కోరికతో "నాకెన్ని సంపదలున్నా ఈ ఆవుముందు తక్కువే. నాకు సంపదలెందుకు? ఈ ఆవు చాలు. ఇటువంటి గోవులను మున్ను నేను ఎరుగను" అని అనుకుంటూ "ఈ హోమధేనువును పట్టితెండ" ని తన భటులకు ఆజ్ఞాపించాడు.

(కార్తవీర్యా
ర్జునుడు సామాన్యుడుకాదు నారయణాంశజుడైన దత్తాత్రేయస్వామి ఉపాసనతో అణిమాది సిద్దులు పొందినవాడు. వేయిచేతులు, ఓజస్సు, తేజస్సు సంపదలుగలవాడు. తన ఆజ్ఞ అన్నిలోకాలలో చెల్లేటట్లు చేసికొన్న ప్రతాపశాలి.

ఐనా విచిత్రం ఏమంటే బడలిన తనకు తన భటులకు ఒక మహర్షి సేదతీర్చి ఇష్టాన్నాలు పెడితే, భుజించి, ఆనందపడి, కృతజ్ఞత చూపక జమదగ్ని అతిథిసత్కారాలకు ఆలంబనమైన హోమధేనువును కైవసం చేసికోవాలనుకొన్నాడు. అష్టసిద్దులున్నా అంతరంగం అదుపులో లేకపోతే అనర్దాలు తప్పవు.)

ఆ విధంగా కార్తవీర్యా
ర్జునుడు ఆజ్ఞాపించగా అతని భటులు గర్వంతో వెళ్ళి.

"నా దూడను నాకు దూరంచేయకండి; నేను ఆపదలోపడ్డాను; రాజులు ఎదుటివారి గొప్పతనాన్ని ఓర్వరు కదా" అని తల్లి ఆవు అంబా అని ఆక్రోశిస్తూ బాధపడుతుండగా ఆ కామధేనువును కార్తవీర్యా
ర్జునుని భటులు తమ పట్టణానికి తీసికొని వచ్చారు.

ఆ విధంగా కామధేనువుతో కార్తవీర్యా
ర్జునుడు మాహిష్మతీపురానికి వచ్చాడు. అక్కడ పరశురాముడు తన తండ్రి ఉన్న ఆశ్రమానికి వచ్చాడు

ఔరార! మా యింట మృష్టాన్నం భుజించి, నా తండ్రి "వద్దువద్దు" అంటున్నా వినకుండా, ఆశ్రమాన్ని ఆక్రమించి, మా గోవును ఆ రాజు కార్తవీర్యా
ర్జునుడు తీసికొనిపోయాడు. ఆ రాజు నేను పరశురాముడనని ఎరుగడు కాబోలు.

ఈ విధంగా పలికి

పరశురాముడు ప్రళయకాలాగ్నిలాగా, ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడానికివచ్చే సింహంలాగా, భూమి అంతా అదిరిపోయేలా గొడ్డలి, కవచం, కోదండం, బాణం, మృగచర్మం, అమ్ములపొది ధరించి సాహసంతో కార్తవీర్యా
ర్జునుని వెంటపడాడు.

పరశురాముడు క్రోధంతో వెళ్ళి మాహిష్మతీపురాన్ని చేరి నిలబడ్డసమయంలో

కార్తవీర్యా
ర్జునుడు తనముందు, కయ్యాన్ని, విజయాన్ని కోరివచ్చినవాడు, విల్లు అమ్ములపొదులతో గండ్రగొడ్డలితో భయంకరాకారుడు, తీవ్రమైన కోపంతో కదిలే కనుబొమ్మలు కడచూపులుగలవాడు, జింక చర్మాన్ని మరెన్నో కంఠహారాలను ధరించినవాడు, గర్వించే రాజుల భార్యల మంగళసూత్రాలు లేకుండా చేసేవాడు అయిన పరశురాముణ్ణి చూచాడు.

కార్తవీర్యా
ర్జునుడు చూచి కోపించి

ఈ పరశురాముడు వెర్రి బ్రాహ్మణుడు. ఇతడు బ్రహ్మజ్ఞానం కలిగి సాత్వికమైన ప్రవృత్తిగల బ్రాహ్మణునిలా ఉండక, బలంగల రాజులతో భయంలేకుండా యుద్దానికివచ్చాడు. ఇక మనకు పాపం అంటదు. క్షమించే పనిలేదు. ఈ బ్రాహ్మణుని కొట్టడానికి, నరకడానికి భూమిపై కూల్చడానికి లెండి!

(పరశురాముడు బ్రాహ్మణజాతికి చెందినవాడు. కార్తవీర్యా
ర్జునుడు క్షత్రియజాతికి చెందినవాడు. సాత్త్విక ప్రవృత్తితో బ్రాహ్మణులు, రాజసప్రవృత్తితో క్షత్రియులు ఉండాలి. పరశురాముడు సత్త్వస్థితిలో ఉండక తనంత తానుగా క్షత్రియుల పైకి అందునా బలమైన క్షత్రియులపైకి యుద్దానికి వచ్చాడు. యుద్దానికి వచ్చిన బ్రాహ్మణుని హింసించడం దోషం, పాపం అనుకోవలసిన పనిలేదు. కాబట్టి మీరందఱు ఈ బ్రాహ్మణుని చంపడానికి లేవండి అంటూ తనని తాను కార్తవీర్యార్జునుడు సమర్థించుకుంటున్నాడు.)

ఈ విధంగా పలికి, సేనానాయకుని ఉత్సాహపరచగా, వాళ్ళు రథగజతురగపదాతిసమూహంతో, పదిహేడు అక్షౌహిణుల సంఖ్యతో ఎదుర్కొని బాణం చక్రం గద మొదలైన ఆయుధాలతో పరశురాముని బాధించగా, ఆ బ్రాహ్మణుడైన పరశురాముడు కన్నులనే సరస్సులలో నిప్పులు రాలగా అధికమైన కోపంతో ఎగిరిపడి, జందెము సరిచేసికొని, బొబ్బపెట్టి, గట్టిగా అదలిస్తూ, పరుషమైన గొడ్డలి చాచి, కార్తవీర్యా
ర్జునుని సైన్యంపైకి ఉరికి, తొలకరిలో బీడు నేలను చదును చేసే రైతువలె శత్రుసేనలపాదాలు తెగగొట్టి, తోటమాలి అరటిబోదెలను నరికినట్లు సేనల నడుములు తెగగొట్టి, తాటిపళ్ళు రాల్చే వృక్షారోహకుడిలా శత్రుసేనల తలలు తెంచి, జంతువులను ఖండించి వండే వంట వాడివలె శత్రుసేనల అవయవాలుకోసి అంతటితో తృప్తిపడక ప్రళయకాలాగ్నిలా మంటలు క్రక్కుతూ, ధనుస్సుతో పిడుగుల వర్షాన్ని కురిపించే పెద్ద మేఘంలా బాణాలు కురిపిస్తూ, బలమైన భటుల సముదాయాన్ని బాధించి, అడ్డులేని పరాక్రమంతో తన కోపాగ్నిలో బాణాలవర్షం అనే నేతితో గుఱ్ఱపు రౌతులను ఆహుతి చేస్తూ గుఱ్ఱల కాళ్ళు తలలు నరికి, రథములు విరగగొట్టి, ఏనుగులను రథాలపైకి తోలి ఈ విధంగా శత్రుసేనలను బాణవర్షంలో ముంచి రూపుమాపగా

(21870 ఏనుగులు, 21870 రథాలు, 65610 గుర్రాలు, 109350 కాలిబంట్లు కలిగిన సేన అక్షౌహిణి (గురుబాలప్రబోధికవ్యాఖ్య - పుట 512).)

భూతాల గుంపులు మత్తెక్కి ఆనందనాట్యాలు చేసే విధంగా ఆ యుద్ధరంగమంతా నెత్తురు, కొవ్వు, మాంసఖండాలతో ఎర్రబారింది.

అప్పుడు, అరె బాగు బాగు. ఈ బాపడు ఒక్కడే నా సేనాసమూహాన్ని నేలకూల్చాడు. ఇక ఉపేక్షించకూడదు. నా భుజపరాక్రమంతో ఈ పరశురాముని విజ్బంభణం నిర్మూలిస్తాను.

అని పలికి, కార్తవీర్యా
ర్జునుడు ఉత్సాహంతో ఐదువందల చేతులతో ధనుస్సులను పట్టుకొని, మిగిలిన ఐదువందల చేతులతో వింటినారుల చప్పుళ్ళతో, క్రూరమైన వాడిబాణాలను సమకూర్చి ఓ బాపడా నీ గొడ్డలితో సహా నిన్ను కూలగొడతాను చూడు మంటూ బాణపరంపరను పరశురామునిపై ఎడతెరిపి లేకుండా వేసి బాధించాడు.

వేగంగా వేసిన ఐదువందల బాణాలు గుండ్రంగా ఏర్పడగా వాటిమధ్యనున్న కార్తవీర్యా
ర్జునుడు పరివేష మండలం మధ్యలో ప్రచండసూర్యుడిలా అందగించాడు.

ఈ విధంగా కార్తవీర్యార్దునుడు తన బాణప్రయోగంలో సొంపు చూపగా.

ప్రపంచంలోనే మేటి విలుకాడు, గొప్పవాడు, బాపడైన పరశురాముడు, ఒక ఉగ్రమైన ధనుస్సున బాణాన్ని సంధించి, కార్తవీర్యా
ర్జునుని ధనుస్సులను విరుగగొట్టాడు. కార్తవీర్యార్జునుడు అంతటితో ఊరుకోక వేగంగా పరశురామునిపై చెట్లను విసిరాడు. తీక్ష్ణమైన గొడ్డలి అంచుతో పరశురాముడు కార్తవీర్యార్జునుని చేతులను నరికివేశాడు.

కార్తవీర్యా
ర్జునుని చేతులు తెగగా, కొండ శిఖరంలా అతని శిరస్సు మాత్రం మిగిలింది. శత్రుజనులకు సంతాపం కలిగించే పరశురాముడు వేగంగా అతని తలనుకూడ తెగనరికాడు.

తండ్రి కార్తవీర్యా
ర్జునుడు నేలకూలగా అతని పదివేలమంది కొడుకులు పరశురాముని ఎదుర్కొనలేక యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోయారు. శత్రు భయంకరుడైన ఆ పరశురాముడు ఆపై దూడతో సహా ఆవును తీసికొని వెళ్ళాడు.

ఈ విధంగా హోమధేనువును తిరిగితెచ్చి ఇచ్చి తండ్రికి, తోడబుట్టిన వారికి తన పరాక్రమాన్ని తెలియజెప్పేసరికి జమదగ్ని పరశురామునితో ఇలా అన్నాడు.

ఓ కుమారా! దేవత లందరూ తమ తమ పరాక్రమాన్ని తెచ్చి ఒకచోట పెట్టి రాజును చేస్తారు. ఆ విధంగా గొప్పవేలుపైన రాజును పట్టుదలతో వెళ్ళి ఎందుకు చంపావు?

ఓర్పు మనకుండవలసిన ధర్మం, అన్ని ధర్మతత్త్వాలకు ఓర్పే మూలం. అటువంటి ఓర్పు ఉందనే ఈశ్వరుడు మనల్ని బ్రహ్మపదాన్నంతటిని పాలించేలా చేస్తాడు.

ఓ కుమారా! ఓర్పు ఉన్నవారికి సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య లభిస్తుంది. అన్ని సౌఖ్యాలు ఓర్పుతోనే లభిస్తాయి. సదయుడైన విష్ణువు క్షమ కలిగినవారిని మెచ్చుకుంటాడు.

ఓ కుమారా! మహారాజును చంపుట అనేది కోపంతో బాపని చంపినదానికంటె ఎక్కువ పాపం. ఇక నీవు మారుమాటాడక, ఈ పాపం పోయేలా తీర్థయాత్రలకు వెళ్లు.

ఓ పరీక్షన్మహారాజా! ఆ విధంగా తండ్రి ఆజ్ఞాపించగా, మహాప్రసాదం అని ఆ పరశురాముడు శీఘ్రంగా ఒక సంవత్సరం ప్రయాణం చేసి ప్రయత్నపూర్వకంగా తీరయాత్రలను సేవించి తిరిగివచ్చాడు.

ఒకరోజున జమదగ్ని భార్య రేణుక నీటికోసం గంగానదికి వెళ్ళి, ఆ గంగాప్రవాహంలో అప్పరఃకాంతా సమూహంతో సాగసుగా జలవిహారం చేస్తున్న వానిని; చూడవీలుగానివానిని పద్మమాలికలు ధరించిన చిత్రరథుణ్ణి, తన భర్త ఆజ్ఞను మరచి ఆసక్తితో చూస్తూ ఉండిపోయింది.

ఈ విధంగా గంధర్వరాజైన చిత్రరథుణ్ణి చూచిన కారణంగా ఆలస్యంచేసి

అయ్యో! గంగకు వచ్చి చాల జాగైంది. హోమ సమయంకూడా దాటిపోయింది. నేనిక్కడ ఇలా ఉండి పోయానేమిటి? మునీశ్వరుడు జమదగ్ని ఏమంటాడో అనుకుంటూ వెంటనే నీటి కడవను తలకెత్తుకొని వచ్చి అక్కడపెట్టి నమస్కరించి చేతులు జోడించి భర్తముందు నిలబడగా చూచి

అప్పుడు, తపస్వి అయిన జమదగ్ని తన భార్య ఎందుకు ఆలస్యంగా వచ్చిందో అన్న విషయాన్ని దివ్యదృష్టితో గ్రహించి, మదించిన దీనిని చచ్చేలా కొట్టండి అని తన సుతులకు చెప్పగా ఆ కుమారులు దుఃఖిస్తూ తమ తల్లిని చంపలేకపోయారు.

జమదగ్ని మహర్షి తన భార్యను చంపని కొడుకులను, తన భార్య రేణుకను చంపుమని పరశురాముని ఆజ్ఞాపించగా అతడు తండ్రి అడుగులకు మొక్కి వెనకాడక అన్నలను తల్లిని ఖండించాడు.

పరశురాముడు తన తల్లిని సోదరులను చంపుమని తండ్రి ఆజ్ఞాపించగా, "తాను చంపకపోతే కీడు కలిగేలా జమదగ్ని శపిస్తాడు. అలాకాక తండ్రి ఆజ్ఞను పాటిస్తే, తపోధనుడైన తండ్రి, తల్లిని, సోదరులను, తప్పక బ్రతికించగలడు" అని భావించి వెంటనే తల్లిని సోదరులను చంపాడు. తన తండ్రి గొప్పతనం తెలియకపోతే తండ్రిపై అంత నమ్మకం లేకపోతే చంపడానికి పరశురామునికి చేయాడుతుందా? ఆడదు కదా!

పరశురాముడు ఎదురుచెప్పకుండా గొడ్డలితో జమదగ్ని భార్యను, సుతులను వధింపగా జమదగ్ని తల ఊపుతూ మనస్సులో మెచ్చుకొన్నాడు.

మెచ్చుకొన్న తండ్రిని చూచి పరశురాముడు వెంటనే 'ఈ చచ్చిపడి ఉన్న వారి ప్రాణాలను ప్రసాదించాన'ని చెప్పు అని తండ్రి పాదాలకు నమస్కరించాడు. ముని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించగా వాళ్ళు ఎప్పటిలాగా లేచి నిలిచారు.

తన తండ్రి జమదగ్ని - చనిపోయిన తన తల్లిని, సోదరులను బతికింపగల సామర్థ్యం గలవాడని తెలిసి పరశురాముడు వారిని చంపాడు. అత డలాచంపాడు కదా అని తన తండ్రి ఆజ్ఞాపించినా ఎవ్వరూ తల్లిని సోదరులను చంపకూడదు.

(లోకంలో కొంతమంది మహాత్ములు ఉంటారు. వారు నిగ్రహానుగ్రహసమర్థులు. వారు ఏ పనైనా చేయగలరు. అలాంటి సమర్థుడు జమదగ్ని, ఈ విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం కొడుకు పరశురామునకు ఉన్నది. అందుకే తండ్రి ఆజ్ఞను పాలించి కన్నతల్లిని సోదరులను కుఠారంతో నరికి వేశాడు. తండ్రిని తిరిగి బతికించమని ప్రార్ధించాడు. సమర్ధుడైన జమదగ్ని తన భార్యను పిల్లలను తిరిగి బ్రతికించాడు. దీనిని ఉదాహరణగా తీసికొని నా తండ్రి చంపమన్నాడంటూ లోకంలో మిగిలినవారు తల్లిని సోదరులను సంహరిస్తారేమో, పితృవాక్య పరిపాలనకు కట్టుబడ్డామంటారేమోనని కవి ఈ అంశాన్ని గూర్చి స్పష్టంగా అందరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏ గ్రంథానికైనా ప్రయోజనం ప్రపంచ శ్రేయస్సు. చారిత్రక విషయాలను, సత్యాలను, స్పష్టంగా సూటిగా కవి చెప్పవలసి ఉంటుంది. ఎవరో ఏదో చేశారని అవన్నీ మనం చేయలేము. చేయకూడదు కూడా. అందుకే పరశురామ కథాప్రసంగంలో అపూర్వ ప్రయోజనాన్ని ఆశించి కొసమెరుపుగా ఈ పద్యాన్ని చెప్పాడు కవి.)

పరశురాముని ముందు నిలబడలేక ఓడి పారిపోయిన కార్తవీర్యా
ర్జుని సుతులు, తమ తండ్రి మరణించినందులకు చాల బాధపడి, తగిన సమయంకోసం ఎదురుచూస్తూ, ఒకరోజు పరశురాముడు తన అన్నలతో అడవికి వెళ్ళిన వేళ పగ తీర్చుకోవడానికి ఇదే అదనని వచ్చి, హోమశాలలో నిశ్చలంగా కూర్చొని, తన చిత్తంలో పరమేశ్వర ధ్యానం చేస్తున్న జమదగ్ని మహర్షిని, రేణుక అడ్డువచ్చి ఆపు చేస్తున్నా ఆగక, కదలకుండా గట్టిగా పట్టుకొని అతని తల నరికి వెళ్ళారు.

అంతేకాక, కార్తవీర్యా
ర్జునసుతులు తమ తండ్రిని నీవు చంపిన వైరం మరచిపోకుండా, ఈనాడు వచ్చి మీ తండ్రిని చంపారు. ఓ పరశురామా! ఈ శత్రువులను శిక్షించుటకురా అంటూ ఆ ముని కళేబరం పైపడి రేణుక బాధాతప్తహృదయంతో పరశురాముడు వచ్చి చూచేసరికి ఇరవై ఒక్కమార్లు గుండెపై మోదుకొన్నది.

ఈ విధంగా రోదిస్తున్న తల్లి మొరవిని జమదగ్ని సుతులు అక్కడకు వచ్చి ఇలా దుఃఖించారు.

ఓ తండ్రీ! నీ కొడుకులు తోడు రాకుండా వాకిలి నుండి కూడా కదలవు గదా! అలాంటి నీవు కార్తవీర్యా
ర్జునుని కొడుకులవల్ల శ్రమపడి స్వర్గానికి (ఒంటరిగా) ఎలా వెళ్ళగలిగావు?

ఈ ప్రకారంగా దుఃఖిస్తూ ఉన్న సోదరులతో పరశురాముడు ఇలా అన్నాడు.

అన్నలారా! దుఃఖించకండి. మన తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను పగతీర్చుకొని వస్తాను అంటూ తన చేతి గండ్రగొడ్డలి అంచుకాంతి అధికంకాగా భయంకరుడై పరశురాముడు కోపంతో కార్తవీర్యా
ర్జునుని కొడుకులున్న పట్టణానికి వెళ్ళి బ్రహ్మఘాతులైన ఆ అర్జున పుత్రులను పట్టి చంపాడు.

ఓ పరీక్షన్మహారాజా! పరశురాముడు శత్రువుల శిరస్సులు తెగగొట్టి కొండలుగా పోగులు పెట్టాడు. ఆ యుద్ధంలో రాజులు శత్రువులు భయపడేలా పెద్ద రక్తనదులు పొంగిపారాయి.

పరశురాముడు అంతటితో ఆగకుండా

తన తండ్రిని చంపిన రాజపుత్రులపై పగతీర్చుకొనే నిమిత్తం, లోకంలో క్షత్రియ శబ్దం లేకుండా ఇరవై ఒక్కమార్లు పరశురాముడు క్షత్రియులనందరిని వెదకి వెదకి చంపాడు. పగ తీర్చుకోకపోతే అతడు కొడుకేనా?! ప్రతీకారం తీర్చుకొని పరశురాముడు నిజమైన కొడుకు అనిపించుకున్నాడు.

ఆ పరశురాముడు శత్రురాజులను దునుమాడిన రక్తంతో శమంతకపంచకమనేచోట తొమ్మిది మడుగులుచేసి, తన తండ్రియొక్క తెగిన శిరస్సును శరీరంతో కలిపి, తాను సర్వదేవ స్వరూపుడు కాబట్టి తనను ఉద్దేశించి యాగాన్ని నిర్వహించి హోతకు తూర్పు భాగాన్ని బ్రహ్మకు దక్షిణ భాగాన్ని అధ్వర్యునకు పశ్చిమభాగాన్ని, ఉద్గాతకు ఉత్తరదిక్కును మిగిలినవారికి మిగిలిన విదిక్కులను, కశ్యపునకు అన్నిదిక్కుల మధ్యలో గల భూమిని, ఉపద్రష్టకు ఆర్యావర్త ప్రాంతాన్ని సదస్యులుగా వచ్చిన బ్రాహ్మణ సభ్యులకు తక్కిన ప్రాంతాలను దానంగా ఇచ్చి, బ్రహ్మనదిగా పేరు పొందిన సరస్వతీనదిలో అవభృథ స్నానంచేసి పాపరహితుడై మేఘాలనుండి వెలువడ్డ సూర్యునిలా గొప్పకాంతితో ప్రకాశించాడు. అంతలో

(యజ్ఞయాగాది క్రియలలో అన్ని వేదాలకు సంబంధించిన క్రియాకలాపాలు జరుగుతాయి. అందుకొరకు ఋగ్వేదాన్ని చదువుతూ ఆ ఋగ్వేదంలో చెప్పబడ్డ క్రియలు ఆచరించే వ్యక్తిని హోత అని, యజుర్వేదాన్ని చదువుతూ తత్క్రియలను నిర్వహించే వానిని అధ్వర్యుడని, సామవేదాన్ని గానంచేస్తూ యజ్ఞక్రియను నడిపేవానిని ఉద్గాత అని, మొత్తం యజ్ఞక్రియనంతటిని పర్యవేక్షించే వానిని ఉపద్రష్ట అని అంటారు. అంతేగాక ఈ యజ్ఞానికి ఆధ్యక్షం వహించి నిర్వహింపచేసేవాడు బ్రహ్మ అనే పేరుగల స్థానంలో ఉండేవాడు. యాగాన్ని నిర్వహించేవేళ ఎందరెందరో బ్రాహ్మణోత్తములు చూచే నిమిత్తం ఆహూతులై, అనాహూతులై కూడా వస్తారు. వారు సదస్యులు. ఇలా యజ్ఞనిర్వహణ చాల ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇంత జరిగినా ఎక్కడైన మంత్రంలోగాని, స్వరంలోగాని, అక్షరాల ఉచ్చారణలోగాని, ద్రవ్యాల నిర్వహణలోగాని తక్కువతనం లేదా ఎక్కువతనం - దీనినే న్యూన అతిరిక్తదోషం అంటారు. ఇది ఏర్పడితే ఆ దోషనిమిత్తం యజ్ఞాంతంలో ఒక పవిత్రస్నానాన్ని మంత్రపూతంగా యజ్ఞ దీక్షలో ఉన్నవారు నిర్వహిస్తారు. దానినే అవభృథ స్నానం అంటారు.)

రాజా! ఆప్తుడైన పరశురామునివల్ల శరీరాన్ని పొందిన జమదగ్ని తన తపోబలంతో ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలంలో ఏడవ నక్షత్రంగా వెలుగులు చిమ్ముతున్నాడు.

(సప్తర్షి మండలంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని అనేవారున్నారు)

జమదగ్ని మహర్షి పుత్రుడు, గొప్పవాడు, పద్మాక్షుడు అయిన పరశురాముడు కీర్తి గలవాడై రాబోయే మన్వంతరంలో సప్తర్షులలో ఒకడై ప్రకాశిస్తాడు.

(డెబ్బది యొక్క దివ్య యుగాల కాలం ఒక మన్వంతరం. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతర కాలంలో ఉన్నాం.)

పరశురాముడు ప్రశాంతచిత్తుడై, బంధాలు విడివడినవాడై, యోగ్యుడై, గంధర్వులు, సిద్దులు మొదలగువారు కీర్తిస్తుండగా మహేంద్ర పర్వతంపై ఉన్నాడు.

ఓ పరీక్షన్మహారాజా! భగవంతుడైన విష్ణువు ఈ విధంగా భృగువంశంలో పరశురాముడై జన్మించి పగతో యుద్ధంలో రాజులందరిని భూభారం తగ్గేవిధంగా పలుమార్లు చంపాడు.

(భగవంతుడు - షడ్గుణైశ్వర్య సంపన్నుడు. షడ్గుణాలు: ఐశ్వర్య, బల, శక్తి , వీర, జ్ఞాన, తేజస్సులు ఆరూన్నూ కలవాడు భగవంతుడు.)

విశ్వమిత్రుని చరిత్రము

No comments:

Post a Comment