రామాయణం సుందరకాండ 41వ సర్గ - అశోకవన విధ్వంసం
ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.
ఈ రాక్షసులు క్రూరప్రవృత్తి కారణంగా సామమార్గాన లొంగిరారు, ఇంత సిరిసంపదలతో వున్నవారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు.
ఇక మిగిలింది దండనీతియే. అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు.
అందుచేత ఈ రాక్షసయోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగి రావచ్చు.
కార్యసాధకుడైె న దూత ముందు వెనుకల భంగంకాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించిన యితర కార్యాలు కూడా పూర్తిచెయ్యాలి.
ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్టవుతుంది.
ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి.
రావణుని మంత్రి, సేనానుల బలాబలాలు, వాని సర్వశక్తులూ గ్రహించి వెళ్ళాలి.
దానికి ఒకటే దారి కనిపిస్తున్నది.
నందన వనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ, గజ, రథ బలాలను పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను, అని నిశ్చయించుకుని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు.
చెరువుల గట్టు తెగగొట్టేశాడు.
ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలు ముక్కలయాయి.
రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా తయారయింది. రావణునికి హృదయక్షోభ కలిగించి, తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్దానికి సన్నద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు.
సేనా నాశనం
No comments:
Post a Comment