Sunday, August 23, 2026

Bhramara Gitalu -భ్రమర గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - భ్రమరగీతలు

అయ్యా! ఉద్ధవా! మేము నిన్ను తెలుసుకొన్నాము. నీవు కమలాలవంటి కన్నులుగల శ్రీకృష్ణుని నెచ్చెలికాడవు. ఆయన తనక్షేమం తలిదండ్రులకు తెలుపగోరి నిన్నిక్కడికి పంపగా నీవు ప్రస్ఫుటమైన భక్తితో వచ్చావు. ప్రియుడైన యదుపతి తన జననీ జనకులనయినా మరచిపోలేదు. అదెంతో నయం! ఈ వ్రేపల్లెలో ఆ రాజావారికి సంభావింపదగినవారు మరెవ్వరున్నారో మాకు తెలియదు.

('మఱి మాన్యులు రాజున కెవ్వ రిచ్చటన్‌- ఆదరింపదగినవారు రాజుకు ఎవ్వరూ ఇక్కడ లేరు. శ్రీకృష్ణునికి బదులుగా రాజుకు అని గోపికలు దెప్పిపొడుస్తున్నారు.)

సర్వసంగ పరిత్యాగులైన మునిసత్తములుగూడా బంధువులతోడి స్నేహానుబంధం వదులు కోలేరు. మరి శ్రీకృష్ణుడు తన తలిదండ్రులకు ప్రియం ఆచరించడంలో వింత ఏముంది? ఇతరులతో చేసే చెలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రయోజనం తీరగానే ఆ స్నేహబంధం కూడా వదలిపోతుంది. ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా? (విడుస్తున్నాయి కదా!)

అని ఈ ప్రకారం గొల్లవనితలు పలుకుతుండగా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణచరణధ్యాన పరవశురాలయింది. ఆమె తన సమీపంలో విధివశాన చురుకైన తెలివితేటలుగలదీ, పూదేనెను తాగి మత్తిల్లినట్టిదీ, తన మధురమంజుల ఝంకార ధ్వనితో కాముకులను కలవరపరచేదీ అయిన ఒక గండుతుమ్మెదను చూచింది.

ఆ విధంగా తుమ్మెదను చూచిన ఆ గోపిక తన్ను వేడుకొనేందుకై ప్రియుడు పంపిన దూతగా కల్పించుకొని, ఉద్ధవునికి అన్యాపదేశంగా తాకునట్లు ఆ భ్రమరంతో ఇట్లనింది.

దుష్టునికి మిత్రుడవైన ఓ మధుపా! నీవు మా పాదపద్మాలు స్పృశించవద్దు. మథురాపురకాంతలస్తనకుంకుమం అంటుకొన్న మా ప్రాణవల్లభుని పుష్పమాలికలోని మకరందం గ్రోలి, ఆ కుంకుమచేత ఎర్రబడిన ముఖం గలవాడివి గదా నీవు! మమ్ము విరహబాధకు గురిచేసి పౌరాంగనల శోభనగ్భహాలలో నిత్యం కులుకుతున్న మా ప్రాణేశ్వరుడు నిన్ను మన్నించునేమోగాని మేముమాత్రం నిన్ను మన్నించం.

ఓయీ! మధుపా! ఒక పువ్వులోని మకరందాన్ని పానంచేసి, దాన్ని వదలివేసి ఉత్సాహంతో మరొక్క పువ్వును నీవు ఆశ్రయించినట్లే - శ్రీకృష్ణుడు తన అధరసుధారసాన్ని ఒకసారి మమ్మల్ని గ్రోలనిచ్చి - మా అచ్చమైన పచ్చి యౌవనం కొల్లగొని, ఇతర స్త్రీలందు ఆసక్తుడయ్యాడు. అయ్యయ్యో! అతడు ఉత్తమశ్లోకుడనే బూటకపుమాటలు నమ్మి, శ్రీమహాలక్ష్మి అటువంటి చంచలచిత్తునికి కైవసమయింది.

ఓ భృంగరాజా! శ్రీకృష్ణుడు మంచివాడని అతణ్ణి ఎంతో సంతోషంతో కీర్తిస్తున్నావు. నీ గానం విని, మేము సొక్కి సోలిపోతా మనుకున్నావా? అతనికథలు మాకు క్రొత్తవా ఏమి? నీ సంగీతం మేము అంగీకరించం. ఆ మధురానగరిలోని మగువలఎదుట నీ విద్య ప్రదర్శించు. వారు మెచ్చుకొని నీకు అభిమతార్థాలిస్తారు.

ఓ తుమ్మెదల రాయడా! మనోహరుడైన శ్రీకృష్ణునిమందహాసకాంతులకూ, బొమముడి విలాసాలకూ కరగిపోని కాంతలు స్వర్గమర్త్యపాతాళలోకాలలో కలరా? లేరు. స్త్రీ రత్నమైన ఆ కమలాదేవియే అతనిచరణ కమలాలను సేవిస్తుండగా, ఆ దయాసాగరుణ్ణి అనుగ్రహించడానికి మేము ఏ పాటివాళ్ళం? (మాకు అట్టి అర్హత లేదని భావం).

ఓ చంచరీకమా! రాయబారం నడపడంలో నీవు చాల గడుసరివి. నీ నేర్పు లిక చాలు. మా చరణపద్మాలను విడిచిపెట్టు. మా భర్తలను, పుత్రాదులను చులకనగా వదలి, సద్గతిమాట తలపెట్టక, తనతో కలసిపోయిన మమ్ము, మీదొర ఏల పరిత్యజించాడు? ధర్మాత్ములు ఇలాంటి ప్రవర్తనలు మెచ్చుతారా?

తాను వేటకానివలె వంచించి వానరరాజైన వాలిని వధించాడు. తనమీద మరులుగొన్న రావణునిచెల్లెలు శూర్పణఖను ముక్కుచెవులు కోసి విరూపను చేశాడు. పేరాసతో బలిచక్రవర్తిని బంధించి మోసపుచ్చి ముల్లోకాలూ ఆక్రమించాడు. లక్ష్మీవల్లభుడగు ఆ శ్రీకృష్ణుడు ధర్మమెరిగినవాడా? మా వల్ల తప్పేముంది? మా యందు దోషం ఆరోపించడం ఎందుకు?

స్వేచ్చగా గగనతలంలో ఎగిరిపోయే పక్షులుసైతం చెవులారా తనపేరును ఒక్కమారు వింటే - ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, మొదలయినవారిని దూరంచేసి, ధనం మొదలయినవాటిని విసర్జింపజేసి, సంసారమార్గం పోకార్చే ఆ కృష్ణుడు - ఎడతెగని కోరికలతో న్యాయం తప్పకున్న మా బ్రతుకులు సహిస్తాడా?

ఓ భ్రమరమా! ఆడుజింకలు ఆకర్షణీయమైన వేటగానిపలుకులు ఆలకించి, పారవశ్యంతో చెంతకు చేరి, వాని బాణాలకు గురియై అతిదారుణమైన బాధను పొందేవిధంగా - శ్రీకృష్ణుని మాయమాటలు నమ్మి, మన్మథశరాల తాకిడికి స్రుక్కి మేము దుఃఖాల పాలయ్యాము.

ఓ షట్పదా! చుట్టాలనూ, సుతులనూ, భర్తలనూ, అన్నదమ్ములనూ, తలిదండ్రులనూ కామాంధత్వంతో విడనాడి తన్న శరణుజొచ్చాము. ఇలాంటి మమ్మల్ని విరహసాగరంలో త్రోసివేసి, మా చెంతకు చేరరాకుండటం న్యాయంకాదని ప్రభువైన శ్రీకృష్ణునికి పాదప్రణామంచేసి గట్టిగా నొక్కి చెప్పు.

లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుడికి మా పూరిగుడిసెలు బంగారంతో, మణులతో నిర్మితమైన మేడలా? యదువంశానికి అలంకారమైన వెన్నుడికి మా పల్లెటూరు, వ్రేపల్లె పలువురు రాజులచే సేవింపబడే ముఖ్యపట్టణమా ఏమి? సింహం నడుంవంటి నడుం కల్గిన శ్రీహరికి మా బృందారణ్యం సువాసనలీను చెట్లతో పూలతీగలతో శోభిల్లే ఉద్యానవనమా? కంసమర్దనుడైన కృష్ణునికి మా గోవులు సర్వశుభలక్షణలక్షితాలైన ఏనుగులా? గుర్రాలా? మన్మథుడికి మన్మథుడైన ఆ వన్నెకాడికి గొల్లపడతులమైన మేము రూపవిభ్రమవిలాసాలతో గణుతించదగిన కాంతామణులమా ఏమి? కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ముగురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు మమ్మల్ని స్మరిస్తాడు? లోకంలో ప్రభువులు నవ ప్రియులుగదా!

అని ఇంకా అనేక విధాలుగా కృష్ణసందర్శనంపై ఆశగల్గి మాట్లాడుతున్న గోపికలమాటలు కృష్ణసచివుడు ఉద్ధవుడు విన్నాడు. విని తీయటిమాటలతో వారిని ఊరడిస్తూ ఇలా అన్నాడు.

జపాలు, దానాలు, వ్రతాలు, హోమాలు, అంతరింద్రియబహిరింద్రియనిగ్రహం, తపస్సు, వేదపఠనం మొదలైన సత్కార్యాలు ఆచరిస్తూ, నేర్పరులైన మహనీయులు సర్వవ్యాపకుడైన ఏ స్వామిని తమ హృదయాలలో నిలుపు కొనలేరో, అట్టి గొప్ప స్పరూపం కలవాడూ, మహామహిమలు కలవాడూ, ప్రపంచ నాయకుడూ అయిన శ్రీకృష్ణభగవానుడి మీద ఎడతెగకుండా మీ ధ్యానాలు ఇట్లు కొనసాగడం వింత గదా! అమ్మలారా! మీ చరిత్రలు పరమాశ్చర్య కరాలు!

తామరరేకులవంటి కన్నులుగల గోపికలారా! శ్రీకృష్ణుడు నన్నుమీ కడకు కార్యార్థంగా పంపేటప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరిస్తాను. వగపు మాని సావధానంగా ఆలకించండి

అని ఉద్ధవుడు హరి చెప్పినమాటలన్నీ వారికిలా వినిపించాడు.

గోపికలారా! సృష్ట్యాది సమస్త కార్యాలకు కారణభూతుణ్ణి నేనే. కాబట్టి నాయెడబాటు మీకు కలుగదు. కలిగినట్లుతోచడం మాయాకార్యం. స్థావరజంగమాత్మకాలైన సకలప్రాణుల్లో పృథివ్యప్తేజోవాయ్వాకాశాలు అనే పంచమహాభూతాలు అణగి ఉండేటట్లు - నేను సమస్తంలోనూ ఉంటాను. మనస్సుకు, పంచప్రాణాలకు, బుద్ధికి, త్రిగుణాత్మిక అయిన ప్రకృతికి, ఇంద్రియవృత్తులైన శబ్దస్పర్శ రూప రస గంధాలకు, జ్ఞానకర్మేంద్రియాలకు నేను ఆధారభూతుడినై ఉన్నాను. నాయందే, నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మరూపంలో అణగియున్న చరాచరప్రపంచాన్ని స్థూలరూపంతో సృజిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను.

స్వరూపంచేత నిర్మలుడూ, జ్ఞానస్వరూపుడూ అయిన జీవునికి ప్రపంచస్వరూపం సత్త్వాది గుణాలు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతున్నది. మాయాకార్యాలైన జాగ్రత్స్వప్నసుషుప్తులనే మనోవృత్తులందు అతడు దేవమనుష్యాది రూపాలతో కన్పిస్తున్నాడు.

నిద్రించి మేలుకొన్నవాడు తాను స్వప్నంలో చూచిదంతా అసత్యమని భావించునట్లు, తత్త్వవేత్త మనస్సనే పదార్థంతో శబ్దస్పర్శాదిసకలవిషయాలనూ దృఢంగా నిరోధించి తనకన్న భిన్నంగా ప్రపంచం లేదని చెపుతాడు. ఆ మనస్సును పండితులు వేసట చెందక అరికట్టగా, ఆ మీదట భేదభావం పొడసూపదు.

మనస్సు ప్రపంచవిషయాకారంగా పరిణమించడమే బంధం. బ్రహ్మాకారంగా పరిణమించడమే మోక్షం. ఈ బంధమోక్షాలు రెండింటికీ కారణం మనస్సే గనుక అట్టి మనస్సును ప్రపంచవిషయాసక్తం కానీయక, బ్రహ్మంకంటే వేరొక పదార్థం లేనే లేదు అనేవృత్తిని పొందేటట్లు చేయాలి.

కమలాలవంటి కన్నులుగల గోపికలారా! నదులన్నీ కదలిపోయి కడకు సముద్రాన్ని చేరేటట్లు ఆత్మానాత్మవిచార రూపమైన సాంఖ్యం, యమనియమాదికమైన అష్టాంగయోగం, వేదం, సత్యం, తపం, ఇంద్రియ నిగ్రహమైనదమమూ ఈ నిష్టలన్నీ మనోనిగ్రహమందే పరిసమాప్తి చెందుతున్నాయి.

స్త్రీలు సమీపంలో ఉన్నవారికంటె దూరంలో ఉన్న ప్రియులపట్ల తహతహపాటుతో మనసులందు అనురక్తి గలవారై ఉంటారు. అంతేగాక, మీ రెల్లప్పుడు నన్నే స్మరిస్తూ ఉండాలి అని మీకు దూరంలో ఉన్నాను. భయపడకండి. నిరంతరధ్యాన పారంగతలై మీరు నన్నే పొందగలరు.

అని మీకు చెప్పుమని శ్రీకృష్ణుడు నాకు చెప్పిపంపాడు అని ఉద్ధవు డన్నాడు. ఆ పలుకులు విని గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు.

శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడు ఇక్కడికి వస్తానంటే ఆ మధురా పట్టణంలోని అతివలు అడ్డగిస్తారేకాని సహిస్తారా? అయ్యయ్యో! దయమాలిన బ్రహ్మ మమ్మల్ని మన్మథబాధలకు గురిచేశాడు గదా!

లక్ష్మీవల్లభుడగు శ్రీకృష్ణుడు యమునానది ఒడ్డున కమ్మని సువాసనలు వెదజల్లే పూపొదరిండ్లలో దాగిన మమ్మల్ని పొంచి చూచేవాడు. అతడు పొదరిండ్లనీడలకు మమ్ము చేర్చి వలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథక్రీడలలో తేల్చిన ఘట్టాలు మరచునా యేమి?

ఉద్ధవా! మేమందరం ఆయన పిల్లనగ్రోవి పాటలకు ఆకర్షితలమై యమునాతీరానికి రాగా మమ్ము మన్మథక్రీడలలో తృప్తి పొందించేవాడు. ఆ మీదట మా మనోగతులు తెలుసుకోడానికి విలాసతంత్రజ్ఞుడుగనుక ఎక్కడో దాగిఉండి మెల్లగా మా పలుకులు ఆలకించేవాడు. ఈ సంగతులన్నీ నీతో ఏకాంతంలో చెపుతాడా?

శ్రీకృష్ణుడు నీతో ముచ్చటాడు వేళలో కాత్యాయనీవ్రతం కావించడానికి మేము వివస్త్రలమై స్నానార్థం యమునా నదినీళ్లలో ప్రవేశించిఉన్నప్పుడు మా వలువలు దొంగిలించి, మళ్ళీ మా ప్రార్ధనలపై చీరలిచ్చిన ఉదంతము అంతా చెపుతాడా?

నీవూ, హరీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ భుజం మీదికి వ్రాలి నీతో ఏవో రహస్యసంభాషణలు సలిపేటప్పుడు పున్నమ వెన్నెలరేయి యమునానదీమధ్యభాగంలో మాతో రాసక్రీడలు నెరపుతూ బంధరతులొనర్చిన నేర్పులు అతడు ఉగ్గడిస్తాడా?

ఓ మహానుభావా! ఉద్ధవా! మా మాటలుగా ప్రాణేశ్వరునికి ఇలా విన్నవించు. నను విడిచి ఇటమీద ఇంచుక సేపైన మా దేహాలు ఉర్విపై ఉండవని చెప్పు. నేలపై మా శరీరాలు నిలువకమునుపే ఒక్కసారిగా మా మనోధైర్యాలు తొలగిపోతాయని చెప్పు. మా మనోధైర్యాలు ఒక్కసారిగా తొలగిపోయిన పిదప మా మనసు లిక్కడ ఉండవని చెప్పు. ఇక్కడ మనసులు నిలువకపోగా మా ప్రాణాలు ఎగిరిపోవునని చెప్పు. మా ప్రాణాలు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరుడగు తాను వచ్చినా జీవరక్షకుడైన తనను జీవులందరూ గుమిగూడి నిందించగా ఏమిచేయగలడు? నీవీ సంగతి వెంటనే అతనికి విన్నవించు.

స్త్రీలు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తన్ను ప్రేమించలేదా? న్యాయం వీడియు తనను ప్రేమించిన ఇంతుల్ని వీడటం తగదు అనే న్యాయాన్ని దామోదరుడికి తెల్పడానికి నీవే తగినవాడివి.

మా ప్రియతముడు వ్రేపల్లె వీథులకు రాగా ఒకనాడైనను కనులపండువుగా మేము కనగలుతామా? మా ప్రభువు మాతో ప్రియభాషణాలు భాషించగా ఒకనాడైనా వీనులవిందుగా వినగల్గుతామా? వల్లభుడు చెంతకురాగా ఒకనాడైనా ఒడలు గగుర్పొడవగా కౌగిలించుకునే భాగ్యం మాకు కల్గుతుందా? ఓ ప్రాణనాయకా! మమ్మెందుకు ఎడబాశావు అని తొట్రుపడుతూ తనను దూషించేందుకు ఒకనాడైనా మాకు అవకాశం కల్గుతుందా? హరి ఏనాటికైనా మేమున్న ఈ వనానికి చూడడానికైవస్తాడా? మా మనోవల్లభుడైన శ్రీకృష్ణుడు తనకు మాతో ఉన్న సంబంధాన్ని స్మరిస్తాడా? మాచేత తిట్టువడకముందే బ్రహ్మ మానాథుణ్ణి మా చెంతకు తెస్తాడా? ఓ మహాత్మా! ఇన్నీ నీకు తెలిసే ఉంటాయి కనుక మాకు వివరంగా చెప్పు.

ఇందిరానాథా! దుఃఖమనే సముద్రంలో మునిగినట్టి గోకులాన్ని ఉద్ధరించుమా! అంటూ ఉద్ధవునిముందు గోపికలు శోకించారు. అటుపిమ్మట ఉద్ధవుడు తెల్పిన శ్రీకృష్ణసందేశం ఆలకించి, వారు విరహ వేదనలు విడిచి అతణ్ణి పూజించారు. ఇలా శ్రీకృష్ణలీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు వ్రేపల్లెలో గడిపాడు. పిదప నందాదియాదవపుంగవులను వీడ్కొని రథమెక్కి మథురకు బయలుదేరి వెళ్ళాడు.

ఆ విధంగా స్థిరచిత్తంతో శ్రీహరిసంకీర్తనం కావిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పటాపంచలు చేసేవాడూ, మదికి ఇంపు గల్గించేవాడూ, శత్రుజనులమదం అణచేవాడూ, మధురాపురిలో విహరించేవాడూ, శూరునిమనుమడూ అయిన శ్రీకృష్ణుణ్ణి చూశాడు.

ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి సందర్శించి అతనితో తగురీతిగా మాట్లాడుతూ తనచేత నందుడు మొదలయినవారు ఇచ్చిపంపిన బహుమానాలు కృష్ణబలరాములకు, ఉగ్రసేనమహారాజుకు వేరువేరుగా సమర్పించాడు - అని పలికి శుకయోగీంద్రుడు మళ్ళీ పరీక్షిన్నరేంద్రునితో ఈ విధంగా అన్నాడు.

శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో జేరి కుబ్జా గృహంబునకు నరుగుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment