Sunday, August 23, 2026

Sri Krishnundu Devaki Vasudevula Chera Manpi Yugrasenuniki Pattamu Kattuta - శ్రీ కృష్ణుండు దేవకీ వసుదేవుల చెఱ మాన్పి యుగ్రసేనునికి పట్టము కట్టుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుండు దేవకీ వసుదేవుల చెఱ మాన్పి యుగ్రసేనునికి పట్టము కట్టుట

తలిదండ్రులైన దేవకీవసుదేవులు తమ కుమారుల్ని చూచి "వీరు లోకాలకు ప్రభువులైన దేవతలే గాని సాధారణ మానవులు కారు" అని ఆలోచిస్తూ, తమ మనసుల్లో సంశయించ సాగారు. అపుడు శ్రీకృష్ణుడు తన అన్న బలభద్రునితో కూడినవాడై జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారితెలివిని తొలగిస్తూ వినయవినమ్రుడై ఇట్లన్నాడు.

ఓ తల్లీ! ఓ తండ్రీ! మమ్ము కన్నారేగానీ మా బాల్యం, పౌగండం, శైశవం అనే ప్రాయాల్లో మమ్ము ప్రీతితో ఎత్తుకుంటూ, దించుతూ, లాలించి పాలించేభాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండికూడా విధివిలాసంవల్ల అది తీరలేదు.

తలిదండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఏ సమయంలో ఏ విధంగా బుజ్జగింపులు పొందుతూ, ఎదుగుతారో అట్టి అద్బ్భష్టం మా కిన్నాళ్ళూ లేకపోయింది. ధర్మార్థకామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి కారణమైన ఈ దేహాలకు కర్త లెవరు? జననీజనకులైన మీరే గదా! నూరేండ్లకయినా మీ ఋణం తీర్చుకోడానికి మాకు శక్యం కాదు.

(ఐదేండ్లనుండి పదేండ్లవరకు గల వయస్సు పౌగండం. పదకొండునుంచి పదిహేను సంవత్సరాల నడిమి వయస్సు కైశోరం. కొందరు పదకొండు మొదలు ఇరవైయేండ్లవరకు అనీ, పండ్లు వచ్చినప్పటినుంచీ మూడేండ్లవరకూ కైశోరం అని కొందరూ చెప్పారు.)

సమర్దుడై ఉండికూడా తన దేహంతో, ద్రవ్యంతో తన తలిదండ్రులకు ఎవడు సేవ చేయడో, అట్టివాడు కష్టుడు. వాడు చచ్చి పరలోకంలో తన శరీరమాంసం తానే తినేవాడవుతాడు.

ఏ మానవుడు తలిదండ్రులనూ, వయో వృద్దులనూ, చిన్నబిడ్డలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులనూ, ఇల్లాలు మొదలైనవారినీ సమర్థుడై ఉండికూడా పోషించక దీనాలాపాలాడుతాడో అట్టివాడు ఈ భూమిమీద బ్రతికియూ చచ్చినవాడే.

జననీ జనకులారా! మీరు చాలా ఓర్పుగలవారు. మా కారణంగా మిమ్ము కంసుడు చెరసాలలో ఉంచి బాధిస్తూ ఉంటే వాణ్ణి వారించే సామర్థ్యం ఉండికూడా వారించని దయమాలినవాళ్ళం. క్రూరులం. కపటవేషధారులం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి.

ఈ విధంగా మాయామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ఆ మాటలకు దేవకీవసుదేవులు మోహం చెందారు. వారు తమ పుత్రుల్ని ఒళ్ళల్లో కూర్చుండ బెట్టుకున్నారు. గట్టిగా కౌగిలించుకున్నారు. కన్నీళ్ళతో వారి శిరస్సులు తడిపారు. ప్రేమాతిశయంతో మాటలు రాక మౌనం వహించారు. 
అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుణ్ణి తిలకించి ఇలా అన్నాడు.

పుణ్యాత్ముడవైన రాజేంద్ర! యయాతి శాపంవల్ల వీరులైనప్పటికిన్నీ యాదవులు రాజపీఠం అధిష్టించడానికి వీలుగాదు. కాబట్టి, ఈ భూమికి నీవే అధిపతివిగా ఉండు. మేము నిన్ను సేవిస్తుంటాము. దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తారని వేరుగా చెప్పడమెందుకు? వేడుకతో ప్రజాపరిపాలనకు సిద్ధపడు.

సత్యమందే ఏకాగ్రతకలవాడూ, దానాలు సల్పడంలో ప్రసిద్దుడూ, కొనియాడబడిన పొగడ్త కాంచినవాడూ, సమరంలో శత్రుసైన్యాలను సంహరించేవాడూ, దర్పం లేనివాడూ అయిన ఉగ్రసేనుణ్జి వాసుదేవుడు సంభావించాడు. మథురానగరానికి రాజును చేశాడు.

ఆ తర్వాత శ్రీకృష్ణుడు పూర్వం కంసుడిభయంవల్ల ఇతరదేశాలలో గాసి చెందుతున్న తన జ్ఞాతులూ, చుట్టాలూ అయిన యాదవులు, వృష్ణులు, భోజులు, మధువులు, దశార్హులు, కుకురులు, అంధకులు, మొదలైనవారి నందరినీ మధురకు పిలిపించాడు. వారి మనసులు సంతసించేటట్లు ధనాదికం బహూకరించి, వారి వారి గృహాలలో నివసించడానికి ఏర్పాట్లు చేశాడు.

కరుణా రసంతో నిండిన మధుసూదనుని మధురమైన కటాక్ష వీక్షణాలతో మనసులోని భీతి తొలగినవారై తీయతీయని సల్లాపాలతో వారూ, మధురాపట్టణంలోని ప్రజలు కలసి మెలసి జీవించారు.

అనంతరం ఒకనాడు గోవిందుడు బలరాముడితో కలిసి నందుని వద్దకు వెళ్ళి ఇట్లన్నాడు.

జనకా! నందమహారాజా! మేము మా తండ్రి వసుదేవుణ్ణి చూడలేదు. మా తల్లి దేవకీదేవిని చూచిన వాళ్ళం కాము. యశోదాదేవీ, నీవూ మా తలిదండ్రులని భావిస్తూ ఉంటిమి. ఇంతకు ముందు ఏ తలిదండ్రులు తమ బీడ్డల్ని ఇంత గారాబంగా పెంచారు? నీ మంచితనంవల్ల ఆ యా వయసులకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంతవారమైనాము.

ఇక్కడ మథురానగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి, అక్కడికి (వ్రేపల్లెకు) మేము వస్తాం. ఈ సంగతి మనవారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతో, దయతో మాకు చేసిన ఉపచారాతిశయాలు మేమెక్కడున్నా మా మనసునుంచి ఎన్నటికీ మరలిపోవు.

ఈ ప్రకారంగా పలికి శ్రీకృష్ణుడు వస్త్రాలూ, ఆభరణాలూ మొదలైన వాటి నిచ్చి ఆదరంతో కౌగిలించుకుని నందుణ్ణి సాగనంపాడు. నందుడు అనురాగంతో వశం తప్పినవాడై కన్నీళ్ళతో నిండిన కన్నులు గలవాడై గొల్లలతో కలిసి వ్రేపల్లెకు వెళ్ళిపోయాడు.

అనంతరం వసుదేవుడు గర్వరహితమైన చరిత్రగల తన కుమారులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణపురోహితులతో యథావిధిగా ఉపనయనసంస్కారం జరిపించాడు.

చంద్రవంశంలో జన్మించినవారిలో అగ్రగణ్యులై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖకమలాలనుంచి ఉపనయన మంత్రోపదేశాలను గ్రహించినవారై. విప్రులు, రాజులు ఆదిగా గల జనులూ, గరుత్మంతుడు, ఆదిశేషుడూ మొదలైనవారూ దీవనలియ్యగా ద్విజత్వం (క్షత్రియత్వం) అందుకున్నారు.

(ద్విజరాజత్వము పొందిరి - శ్రేష్ఠమైన రెండవ జన్మాన్ని పొందారు. ఉపనయనము రెండవ జన్మ. అది వహించిన వారైరి అనుట. తల్లిగర్భంనుంచి వెల్వడటం మొదటిజన్మ ఉపనయన సంస్కారం పొందటం రెండవ జన్మ బలరామకృష్ణులు గాయత్రీమంత్రోపదేశమనే రెండవ జన్మను పొందిన రాజులయ్యారు.)

ఉపనయనమైన తర్వాత వసుదేవుడు పలువురు బ్రాహ్మణులకు దక్షిణలతో కూడా గోదానాలు, హిరణ్యదానాలు చేసి పూర్వం రామకృష్ణులు పుట్టినపుడు తన మనస్సులో దానమిస్తానన్న గోవులను అనుకొన్న విధంగా దానంచేసి యాచకులకు వారు కోరిన వాటినిచ్చి తృప్తి పరిచాడు. ఈ విధంగా ఉపనయనసంస్కారం పొందిన శ్రీకృష్ణ బలరాములు

(బ్రహ్మచారీ - బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారీ= బ్రహ్మమందు చరించేవాడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అని ఆశ్రమాలు నాల్గు. వాటిలో ప్రథమాశ్రమమైన బ్రహ్మచర్యంలో ఉన్నవాడు - బ్రహ్మచారి. బ్రహ్మమంటే వేదం, తపస్సు, సత్యం, తత్త్వం, జ్ఞానస్వరూపం - అని అర్ధాలు. వీటియందు నియమంతో చరించేవాడు బ్రహ్మచారి.)

భూమిలో మానవు లెవ్వరుగానీ గురుకులవాసంచేసి గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా! అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తం తెలిసినవారైనప్పటికినీ, జగద్గురువు లయినప్పటికినీ, పరిపూర్ణు లయినప్పటికినీ వారు ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరారు.

రామకృష్ణులు గొప్ప వైభవాలకు కాణాచి అయిన కాశీపట్టణం చేరుకున్నారు. అక్కడ ఉంటున్న అవంతీపుర వాస్తవ్యుడూ, సమస్త విద్యలచే విరాజిల్లువాడూ అయిన సాందీపని అనే పండితోత్తముణ్ణి సముచితరీతిలో సందర్శించారు. స్వచ్చమైన మనస్సుతో, సత్ప్రవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయనను వారు సేవించారు. ఆచార్యుడు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించి

భూసురోత్తముడని చెప్పదగిన ఆ సాందీపని సంతోషిత స్వాంతుడై రామకృష్ణులకు ఋక్‌, యజుస్‌, సామ, అథరా లనే నాల్డువేదాలు, శిక్ష వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రశాస్త్రం, మనువు మొదలయిన వారు చెప్పిన ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, రాజనీతిశాష్ట్రం మొదలయిన వాటిని తేటతెల్లంగా బోధించాడు.

పరీక్షిన్నహారాజా! రామకృష్ణులు మిక్కిలి నేర్పరులయినందున అరవైనాల్గు కళలనూ అరవైనాలుగు రోజుల్లో చక్కగా, ఒక్కొక్కనాడు ఒక్కొక్క కళవంతున వినికిడి చేతనే నేర్చుకున్నారు.

గురువులకే గురువులయినవారూ, ఇతడు ఎక్కువ, అతడు తక్కువ అనే భేదభావాలు లేకుండా ప్రకాశించే లోకగురువులూ అయిన రామకృష్ణులు సంతోషంతో గురుశిష్యన్యాయంతో ఉపాధ్యాయుడైన సాందీపనిని సేవించారు

ఈ విధంగా కృతార్ధులైన శిష్యుల్ని చూచి, వారి గొప్పతనానికి ఆశ్చర్యపడి, భార్యతో ఆలోచించి, సాందీపని రామకృష్ణులతో ఇట్లన్నాడు.

నాయనలారా! మా కుమారుడు మునుపు సముద్రంలో ప్రభాసమనే స్నానఘట్టంలో స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయాడు. అంతే; మళ్ళీ అగుపించలేదు. దయకు సముద్రంలాంటివారూ, ప్రకాశించే ప్రతాపం గలవారూ అయిన మీరు మాకు శిష్యులైనారు. కనుక మాకు గురుదక్షిణగా, అందరికీ అచ్చెరువు కలిగేటట్లుగా మా కుమారుణ్ణి తెచ్చి, మా కివ్వండి. ఇది మీ కర్తవ్యంగా గుర్తించండి.

శిష్యులు అత్యంత బలవంతులైతే గురువు ఉత్తమస్థితినొంది గౌరవంగా జీవిస్తాడు. ఉత్తమ గుణాలతో, అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీరు శిష్యులై ఉండి గురునికోరిక నెరవేర్చడం న్యాయంకదా!

ఆచార్యుడైన సాందీపనిపలుకులు విని, రామకృష్ణులు గురువుగారికోరిక తీర్చడంకోసం ఎదురులేని రథాన్ని అధోహించారు. తత్‌క్షణం సముద్రుడిసమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు.

ఓ సముద్రుడా! మంచిబుద్ధితో మా గురువుగారి కుమారుణ్ణి తెచ్చి మాకు అప్పగించు. బదులు మాట్లాడితే సహించరాని వేగం గలవీ, రణరంగ భయంకరాలూ అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు దగ్ధమౌతావు.

ఆ విధంగా రామకృష్ణులు పలుకగా వారికి సాగరుడు ఈ రీతిగా సమాధాన మిచ్చాడు.

యాదవేశ్వరులారా! నా మాటలలో మోసం ఏ కొంచెమైనా లేదు. ప్రభాస తీర్ధంలో అందమైన ఆకారం గలవాడూ, సాధువూ అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా తరంగమొకటి పైగసి భయంకర వేగంతో అతణ్ణి లోనికి తీసుకపోయింది. అలా తీసుకొని పోగా మిక్కిలి మంచి స్వభావంగల ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి పంచజనుడనే రాక్షసుడు మింగేశాడు.

అని సముద్రుడు ఆ పంచజనుడు నివసించే ప్రదేశం ఏదో రామకృష్ణులకు తెలిపాడు.

శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖారావం విని పంచజనుడు భయసందేహాలతో కంపించి పోయాడు. శ్రీకృష్ణుడు సాగరజలంలో ప్రవేశించాడు. అగ్నిజ్వాలలతో సమానాలై, బంగారు పింజలతో రంగారు బాణాలతో పంచజనుణ్ణి పడగూల్చి, వాని పొట్టను చీల్చాడు. అచంచల మనస్కుడైన శ్రీకృష్ణుడికి పంచజనుడి కడుపులో బ్రాహ్మణ కుమారుడు కన్పించలేదు. అతడు గురువుపట్లగల ప్రేమచే కార్యతత్పరుడయినాడు.

పరీక్షిన్నరేంద్రా! రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు రక్కసుడైన పంచజనుడి శరీరంనుంచి జనించిన పాంచజన్యమనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్రసహితుడై రథాన్ని అధిరోహించి యముడిపట్టణానికి వెళ్ళాడు.

అలా వెళ్ళి శ్రీకృష్ణుడు 'సంయమని' అనే పేరుగల ఆ యమపురాన్ని చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘంవలె గంభీర ధ్వనితో భీతి గొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖ ఘోషం విని యమధర్మరాజు ఆశ్చర్యపడి

నా భుజబలాన్ని లెక్కచెయ్యక నా మనసునకు క్రోధావేశం కలిగేటట్టు నగరం పొంత ఎవడో శంఖం పూరిస్తున్నాడు. వాడు ఆశ్చర్యకరమైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు - అంటూ యముడు కోపంతో మండిపడుతూ వచ్చాడు.

అలా వచ్చి అంతకుడు బలరామకృష్ణుల్ని అవలోకించాడు. వారు లీలలు నెరపుటకై నరులుగా అవతరించిన నారాయణులని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకలభూత హృదయ నివాసి అయిన ఆ పరమాత్మకు నమస్సులు సమర్పించి నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించుమని అడిగాడు. యమునిమాటలు విని అచ్యుతుడు ఇలా అన్నాడు.

మంచినడవడిగల యమధర్మరాజా! చెపుతాను. విను; మా గురుపుత్రునిలో ఏ తప్పు ఉండడంతో దండించడానికై అతణ్ణి తెప్పించుకున్నావు? ఆ బాలుణ్ణి ఇప్పుడు మాకు అప్పగించు. మాకు అతడు కావాలి.

శ్రీకృష్ణుని మాటలువిని యమధర్మరాజు "ఇదుగో! వీడే! వీణ్ణి తీసుకపొండి' అని భక్తితో గురుపుత్రుణ్ణి ఇచ్చేశాడు. దుర్మార్గులను అణచి వేసేవాడూ, దున్నపై స్వారి చేసేవాడూ, అయిన యముణ్ణి వీడ్కొని శ్రీకృష్ణుడు గురుకుమారుణ్ణి తోడ్కొని బయలుదేరి వెళ్లాడు.

ఈ విధంగా యముని వద్దనుంచి పుత్రుణ్ణి తెచ్చి, గురుడైన సాందీపని కిచ్చి, రామకృష్ణులు 'ఇంకా ఏమి చెయ్యవలెనో సెలవియ్యండి' అని అడిగారు. అపుడు సాందీపని వారితో ఇలా అన్నాడు.

గొప్పశిష్యులారా! గురువుకు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ కీర్తి దిగంతాలలో ప్రకాశింపజేశారు. ఇంతవరకు ఎవడైనా తన గురువుకు అడిగిన ఇలాంటి దక్షిణను దయతో ఈ విధంగా ఇచ్చిన వాడున్నాడా?

యమపురానికి వెళ్ళి, చచ్చిన పిల్లవాణ్ణి తెచ్చి ఇవ్వడం, ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మీరు మాకు మేలు కల్గించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లు గాక!

ఓ పుణ్యాత్ములారా! నేను ధన్యుణ్ణి అయినాను అని సాందీపని వారిని దీవించాడు. గురువు దగ్గర సెలవు తీసుకొని కృతార్థులై రామకృష్ణులు తేరెక్కి మథురానగరానికి వెళ్ళీ శంఖాన్ని పూరించారు. అపుడు ప్రజలు తాము పోగొట్టుకొన్న ధనాన్ని తిరిగిపొందినట్లుగా చందాన సంతోషించారు.

శ్రీ కృష్ణుడు గోపకాంతల చెంతకు నుద్ధవుని బంపుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment