Thursday, August 20, 2026

Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకాశవంతమైన, స్వచ్చమైన వస్త్రాలను, హారాలను ధరించారు. చందనం పూసుకొన్నారు. ఆభరణాలు అలంకరించుకొన్నారు. బృందావనానికి వెళ్లి మల్లెలు మొదలైన పూల మకరందాన్ని ఆస్వాదించి మదించిన గండుతుమ్మెదల ఝంకారాలు వింటూ, వెన్నెలలో గోపస్త్రీలు తమచుట్టూ ఉండగా ఇంపుగా గానం చేశారు.

బలరామకృష్ణులు ఆలపించిన ఆ మధురగీతం చెవులు సోకినంతనే తమదేహాలస్పృహ ఏ మాత్రం లేనివారై, ఆ గోపికలు చూడడం, మాట్లాడడం మరిచిపోయి, ఆ బృందావన సీమలో పారవశ్యంలో మునిగిపోయారు.

ఈ విధంగా రామకృష్ణులు సర్వప్రాణులకు సమ్మోహం కలిగించే విధంగా గానంచేస్తూ, మత్తెక్కిన వారిమాదిరి, బృందావనంలో యథేచ్చాసంచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వారిరక్షణలో ఉన్న గోపకాంతలను శంఖచూడుడు అనే కుబేరభటుడు బలవంతంగా ఉత్తరదిక్కునకు తీసుకొని పోసాగాడు. ఆ గోపస్త్రీలు 'రామా!కృష్ణా! అని పిలుస్తూ పులిబారినపడిన గోవులవలె మొరపెట్టారు. వారి మొర విని

బలశాలురైన అన్నదమ్ములు రామకృష్ణులు ఇద్దరూ వెంటనే మద్దిచెట్లను చేత పట్టుకొని కాలమృత్యువులవలె వేగంగా వెళ్తూ 'ఓ ముగ్ధగోపికలారా! భయపడకండి' అని ధైర్యం చెప్పి ఆ యక్షునితో తలపడ్డారు. ఆ గుహ్యకుడు కలతచెంది గోపికలను వదలి, భీతుడై అతివేగంగా ఉత్తరదిశగా పరుగెత్తాడు.

ఈ విధంగా యక్షుని చేతినుండి విముక్తలైన గోపికలను రక్షిస్తూ ఉండమని బలరామునితో చెప్పి

బకాసురసంహారి అయిన శ్రీకృష్ణుడు “ఓరీ! యక్షుడా! పారిపోవద్దు! పారిపోవద్దు” అని క్రోధంగా పలుకుతూ, యక్షుడు ఏ రూపంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో తానూ వానితో అక్కడ ప్రవేశించాడు. అక్కడికి వెళ్లి వానిని పట్టుకొన్నాడు. సాటిలేని తన పిడికిటిపోటుతో వానితల తెగి పడేటట్లు పొడిచాడు. శౌర్యంతో ఆ యక్షవీరుని కిరీటంలో ప్రకాశించేరత్నాన్ని గోపికలు చూస్తూ ఉండగా గ్రహించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు శంఖచూడుణ్ణి చంపి, వాని శిరోరత్నం తెచ్చి బలరాముని కిచ్చి, అగ్రజుణ్ణి ఆనందింపజేశాడు. తర్వాత ఇంకొకరోజు కృష్ణుడు అడవులలోకి వెళ్లాడు. అప్పుడు అతనిలీలలను ఇండ్లలోనే పాడుకొంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు.

మనలను ఏలిన శ్రీకృష్ణుడు ఎడమభుజం పైన చెక్కు ఆనించి, కెమ్మోవిపై మురళిని ఆనించి, మధురస్వరం ఒలికేటట్లు వేణువును వాయిస్తూ తన వేళ్లను వేణురంధ్రాల మీద నేర్పుగా సారించి, చూపుతూ ఉంటే మింట నిలిచి చూస్తున్న అప్పరసలు తమ ప్రాణేశులు తమవద్దనే ఉన్నా పోకముళ్లు ఊడి పోతూ ఉండగా మదనవేదనపొందుతూ ఉంటారు గదా!

ఓ పడతీ! కొత్తరుచి కలిగిన కృష్ణునిమురళీనాదం అనే అమృతధారలు చెవులలో ప్రవేశించి, హృదయాల లోపల చేరగానే దూడలతో కూడా గోవులసమూహాలు తక్కిన జంతువులు అత్యాసక్తితో ఆకాశంవైపు మోరలెత్తి దేహానికి సంబంధించిన ఇంద్రియవ్యాపారాలన్నిటినీ వదలి వేస్తాయి.

ఓ పద్మనయనా! శ్రీకృష్ణుడు తళతళలాడే ముత్యాలహారం ధరించి, గాంధర్వవిద్యలో కుతూహలం అతిశయించగా, మనోజ్ఞంగా మురళిని వాయించినపుడు ఆ మురళీధ్వానం విన్న మేటినెమళ్లసమూహాలు కృష్ణుని మెరుపుతో కూడి శబ్దించే నల్లనిమేఘంగా భావించి పరవశంతో కేకారవాలు చేస్తాయి గదా!

ఓ యువతీ! ఎందుకు తెల్లవారిందే? తూర్పుకొండపైన సూర్యుడు ఎందుకు ఉదయించాడే? పగళ్లన్నిటినీ తెల్లవారని రాత్రులుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడే? మదనుడుకూడా దయలేని వాడయ్యాడు. చిలుకలు వారింపరానివిగా ఉన్నాయి. ఎలాగే? రాత్రివేళ వస్తుందంటావా? పద్మనేత్రుడితో సుఖపడే అదృష్టం లభిస్తుందా?

ఓ సుందరీ! పొద్దు ఎప్పుడు కుంకుతుంది? ఆవులను మేపుకొని గోవిందుడు ఎప్పుడు గోకులానికి వస్తాడు? ఎప్పుడు నాకు ఆ స్వామి ముఖపద్మదర్శనం అవుతుంది? దగ్గరకు చేరి అతడు నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు? నా విరహాగ్నిరాశికి అంతం ఎప్పుడు? చెప్పవమ్మా! మన్మథునిచేతలవల్ల నా హృదయం తల్లడిల్లిపోతూ ఉంది.

ఓ చెలీ! శ్రీకృష్ణుడు నన్ను వదిలిపెట్టి వనానికి వెళ్లినప్పుడు ఆయా క్షణాలు, అంతకంతకూ కొనసాగుతూ జాములై, దినాలై, పక్షాలై, నెలలై, సంవత్సరాలై, మహాయుగాలై, కల్పాలై నామనసులో తోస్తూ ఉన్నాయి.

ఈ విధంగా ఇంకా కృష్ణవియోగశోకంతో పలురీతులుగా పశ్చాత్తాపడుతూ గోపికలు సహనం కోల్పోయి ఎలాగో పగలు గడపి,

ఆ సాయంసంధ్యాసమయంలో “అదిగో! సూర్యుడు పడమటికొండకు చేరాడు. ఇదిగో సాయంకాలం అయింది. అల్లదే! గోధూళి ఒప్పిదంగా రేగుతోంది. బృందావనమార్గంలో ఎద్దులరంకెలు వినిపిస్తున్నాయి. మన ప్రియుడు వచ్చేశాడు. రండి” అని ఒకరినొకరు పిలుచుకొంటూ, సాయంవేళ తొట్రుపాటుగల హృదయాలతో తమ ప్రియుడైన కృష్ణునికి ఎదురేగుతారు.

ఇలా గోపికలు తనకెదురు రాగా, ఆసక్తితో వారిని కృష్ణుడు వారి ఇష్టానుసారంగా ప్రణయ సల్లాపాలతో ఆదరించాడు. ఆ తర్వాత ఒకనాడు

వృషభాసుర సంహారము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment