Wednesday, March 25, 2026

Sri Rama Charitra Story - శ్రీరామచరిత్ర

శ్రీరామచరిత్ర

పోతనగారు భాగవతాన్ని శ్రీరామచంద్రుని కంకితం చేశాడు. ఈషదున్మీలిత ధ్యానలోచనుడైన ఆయనకు రాముడు సాక్షాత్కరించాడు. స్కంధాది పద్యాల్లో శ్రీరామునే ఆయన సోత్రం చేశాడు. అటువంటి భగవదవతారమూర్తి శ్రీరాముని చరిత్ర ఈ స్కంధంలో చెప్పబడుతోంది.

తూర్పున నిండుచంద్రుడు ఉదయించినట్లు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించడంలో నేర్పరి అయిన శ్రీరాముడు నారాయణుని అంశతో, అసమాన నిర్మలత్వంలో సాటిలేని సాధ్వీరత్నం, జనన మరణ సంసారచక్రంనుండి సాఫల్యం పొందిన కౌసల్యాదేవికి జన్మించాడు.

యాగరక్షణకోసం తండ్రి పంపగా విశ్వామిత్రుని వెంటవెళ్ళి బాలుడైన రాముడు ఎంతమాత్రం దయతలచక బంగారువర్ణ కేశకాంతి కలిగి, మోసపు మాటలతో నటిస్తూ, సూర్యరథాశ్వాల వేగంకల, చేతిలో ఆయుధమున్న తాటకను చంపాడు.

ఆ రాముడు విశ్వామిత్రుని యాగాన్ని కాపాడేందుకు యుద్ధంలో సుబాహుడనే రాక్షసుని చంపి, కపటమూ మంజులమైన కాంతిగల నీచుడైన మారీచుణ్ణి పారద్రోలాడు.

సుగుణాల ప్రోవైన సీతకోసం ఆ రాముడు జనకరాజన్యుని ఇంటిలో మూడు వందల మంది కదలించి తెచ్చిన శివుని చాపాన్ని చిన్నఏనుగు చెరుకుగడను విరిచినట్లు భుజబలంతో సునాయాసంగా విరిచాడు.

భూనాయకుడైన రామచంద్రుడు గుణవంతురాలు, అదృష్టవంతురాలు, చంద్రునికంటె అధికమైన ముఖతేజస్సు కలిగిన సీతాదేవిని ప్రీతితో పెండ్లాడాడు.

శ్రీరాముడు తన భుజబలంతో గండ్రగొడ్డలి కలిగిన గండరగండడు, రాజుల తేజస్సును రూపుమాపినవాడు, రణరంగ భయంకరుడు అయిన పరశురాముని ఓడించాడు.

దశరథుడు పూర్వం తాను కైకకు ఇచ్చిన వరాల కారణంచేత, మాట తప్పకుండా రావణుని ముఖ కమలాలకు చంద్రుడైన రాముని అడవికి పంపాడు.

(కమలానికి సూర్యుడు మిత్రుడు, చంద్రుడు శత్రువు. రావణుని ముఖకమలానికి రాముడు చంద్రుడు. అనగా శత్రువని అర్ధం.)

తండ్రి ఆజ్ఞను పాటించి శ్రీరాముడు రాజులకు పూజనీయమై శత్రువులకు దుర్భేద్యమైన అయోధ్యానగరాన్ని విడిచి వెళ్లాడు.

రాజశ్రేష్ఠుడైన రాముడు నిజసేవానిరతుడైన భరతుని రాజ్యంలో ఉంచి కులపర్వతాన్ని అవమానించగల సుందరమైనకాంతులతో విరాజిల్లే చిత్రకూటపర్వతాన్ని అధిరోహించాడు.

పుణ్యాత్ముడైన రామచంద్రుడు ఆవిధంగా వెళ్ళి ఋషులకు శరణ్యము, గొప్ప పింఛాలు కలిగిన ఆడునెమళ్ళ శోభ కలది, గోదావరి నది నీటి తుంపురులచేత పుట్టిన ఆహ్లాదము కలది, గొప్ప చెట్లతో పొదరిండ్లతో కూడినదైన దండకమనే పేరుగల అడవిని సంతోషంగా చూశాడు.

ఆ అడవిలో రాముడు తమ్ముడితో, భార్యతో ఒక కుటీరంలో ఉండగా, రావణుని చెల్లెలైన శూర్చుణఖ రాముని కామించి వచ్చింది. అపుడు లక్ష్మణుడు ఆమె ముక్కును కోయగా, అది విన్న ఖరదూషణాదులు పద్నాలుగు వేలమంది రాక్షసులు వచ్చారు. రాముడు వారి నందరిని యుద్ధంలో తన బాణాగ్నితో భస్మం చేశాడు. సీతాదేవి చక్కదనాన్ని విన్న రావణుడు మన్మథపరవశుడై మారీచుని పంపాడు. వాడు బంగారు లేడిగా కపటవేషాన్ని ధరించి రాగా రాముడు వాణ్ణి వధించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళాడు.

ఆ విధంగా రావణుడు ఆకాశమార్గంలో సీతాదేవిని అధర్మంగా దయావిహీనుడై తీసుకొని పోతున్నాడు. అపుడు అసహాయుడైన రామకార్యం కోసమే ప్రసాదింపబడిన ఆయుస్సు కలవాడు, గాలికంటె వేగంకలవాడు అయిన జటాయువు అడ్డగించాడు. రావణుడు అప్పుడు కఠోరమైన కత్తితో జటాయువును ఖండించాడు.

('అన్యాయముసేసి' అనడంలో అధర్మంగా అపహరించాడని భావం. దత్తాయువు అనడంలో రామకార్యం కోసమే ఆయువు కలవాడని అర్ధం. గాలిని మించిన వేగవంతుడు కాబట్టే ఆకాశంలో వెళ్ళే రావణుని అనుసరించగలిగాడు.)

అపుడు ఆ రామచంద్రుడు లక్ష్మణునితో కలిసి, సీతను వెదుకుతూ, తన పనికోసం ప్రాణాలర్పించిన జటాయువునకు సంస్కారాదులు చేసి, ఋశ్యమూక పర్వతానికి వెళ్ళి

'ఇక మీదట నీకు నిర్బంధం అక్కర లేదు. మీ అన్న వాలిని చంపుతాను' అని ధర్మబద్ధంగా పాదాలరాపిడి చేతనే కొండలను పిండి చేయగల సుగ్రీవుని ముఖ్యునిగా స్వీకరించాడు.

గొప్ప నీతిశాలి, మంచిశీలం కలవాడు; ఈశ్వర సేవకుడు, ఇంద్రుడిచ్చిన వరమాలను ధరించినవాడు, రావణ గర్వ భంజకుడు అయిన వాలిని, శ్రీరాముడు ఒకే బాణంతో కూల్చి వేశాడు.

మహానుభావుడైన శ్రీరాముడు భూమి మీద సీతను వెదకటానికి వేగవంతుడు, బుద్దిమంతుడు, శక్తిమంతుడు, సుగుణవంతుడు అయిన హనుమంతుని పంపాడు.

నదులసమూహానికి బంధువు, భూమ్యాకాశాల మధ్యభాగాన్ని నీటితో నింపినది అయిన సముద్రాన్ని అలవాటుమేరకు ఆ హనుమంతుడు అత్యంత లాఘవంతో దాటాడు.

ఆంజనేయుడు ఆ విధంగా సముద్రాన్ని దాటి, సీతను చూచి, తిరిగి వచ్చేటప్పుడు అక్షకుమారుడు మొదలైన వారిని సంహరించాడు.

రాక్షసులు తన తోకకు పెట్టిన నిప్పుతో ఆటంకం లేనిదీ, గర్వించిన రాక్షసభటులచేత అనుమానం లేనిది అయిన లంకా నగరాన్ని హనుమంతుడు బూడిద చేశాడు.

(రాక్షసులు హనుమంతుని వాలానికి నిప్పు పెట్టారు. దాన్ని ఆయన హస్తాగ్నిగా ఉపయోగించాడు. రాక్షస భటులచేత వారి వీరత్వంచేత ఆపద కలుగుతుందనే శంక లేనిది లంక. అదికూడా హనుమంతునిముందు నిర్వీర్యమైంది.)

ఈ విధంగా లంకను కాల్చివచ్చి హనుమంతుడు సీతా వృత్తాంతాన్ని విన్నవించగా విన్న శ్రీరాముడు వానర సైన్యాలతో బయలుదేరి వెళ్ళి

రాజశ్రేష్ఠుడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి దగ్గరగా అనేక విధాలైన రత్నాలు కలిగింది, చేపలు, తిమింగలాలు, మొసళ్లతో భయంకరమైంది. విశాలమై గంభీరమైంది, ఆకాశానికి ఎగసిపడే భయంకరమైన అలల ఒరిపిడిచేత పుట్టిన శబ్దాలతో కాంతివంతమైన నీటికణాలతో ఆకాశపు అంచుల్ని స్పృశించే లవణ సముద్రాన్ని చూశాడు.

తనకు దారి ఇమ్మని శ్రీరాముడు సముద్రాన్ని కోరగా అది దారి ఇవ్వకపోగా ఆకాశాన్ని తాకి ఉప్పొంగింది. అపుడు ఆ రాజకుమారుడు కోపంతో

చిరునగవుతో, రెప్పలల్లార్చి ధనుర్భాణాలు ధరించినంత మాత్రం చేతనే ఆ సముద్రం నత్తగుల్లలతో, నాచుతో, ముత్తెపుచిప్పలతో, బురద గడ్డలతో పెద్ద బీడుగా మారింది.

ఇలా ఆపదలపాలైన సముద్రుడు నదులతో కలిసి ఆకారం ధరించి రాముని పాదాలను శరణుజొచ్చి ఈ విధంగా స్తుతించాడు.

ఓ కాకుత్థ్సవంశాగ్రణీ! ఓ గుణనిధానమా! ఓ దీనమందారా! పరమాత్మా! నీ కోపం ముందు నేనెంత? జడుణ్ణి. నీవేమి సామాన్యమైన భూలోకంరాజువా? లోకాలకే ప్రభువువు. ఆది నాయకుడివి. ఈ లోకాలు నీయందే పుడతాయి, జీవిస్తాయి, నశిస్తాయి. ఇది నిజం.

ఓ గుణగణాలంకారా! నీవు ప్రజాపతులను రజోగుణంచేత, దేవతలను సత్వగుణంచేత, ప్రాణిలోకాన్ని తమోగుణంచేత సృష్టిస్తావు. కాని నీవు గుణాతీతుడవు.

(నిత్యం జరుగుతున్న సృష్టి స్థితి లయాలన్నీ భగవానునివే. త్రిగుణాత్మక ప్రభూతమైన ఈ సృష్టికి కర్మ భగవానుడే. కాని ఆయనను ఈ గుణాలు ఏవీ అంటవు. ఆయన గుణాతీతుడు.)

కాబట్టి ఓ రామా! నాపై వారధి నిర్మించు. లంకను చుట్టుముట్టు. నీ బాణాగ్నిచేత రావణుని తలలు భూమిపై రాలగొట్టు. అధిక భాగ్యప్రభలతో నీ ఇల్లాలిని చేపట్టు.

ఓ సూర్యకులాధినాథ! నేను విష్ణువునకు మామను. ఆ మీద లక్ష్మిదేవికి తండ్రిని. ఊరకే నన్ను బాధించడం ఎందుకు? నీ కీర్తికి తగినట్లు సేతువు కట్టి సముద్రాన్ని దాటు.

అని విన్నవించుకోగా రామచంద్రుడు సముద్రుని వెనుకటిలాగా యథాస్థితిలో ఉండుమని పంపాడు. అప్పుడు

వానర వీరులు దేవేంద్రాది దేవతలు ప్రశంసించేటట్లు పెద్ద కొండలను, వృక్షాలను వేగంగా పెకలించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మించారు.

ఈ విధంగా సముద్రాన్ని దాటి రామచంద్రుడు, రావణుని తమ్ముడైన విభీషణుడు తన్ను శరణుకోరగా అతనికి అభయమిచ్చాడు. అతడితో కలిసి లంకకు వెళ్ళి విడిసి, పట్టణాన్ని చుట్టుకొని ముట్టడించగా

ఆ సమయంలో వానరులు లంకలోకి ప్రవేశించి ఏనుగులు మడుగులో జొరబడి కలచివేసినట్లు ప్రాకారాలను త్రవ్వి, అగడ్తలను పూడ్చి, కోటకొమ్మలను కూల్చి, బురుజులను పగులగొట్టి, వాకిండ్లను ఊడబెరికి, తలుపులను విరిచి, యంత్రాలను నాశనంచేసి, ముంజూరులనువిరిచి, గోపురాలను పడదన్ని మకరతోరణాల్ని మట్టిపాలుచేసి, జెండాలను చింపి, మెట్లను కదలించి, ఇండ్లనుచీల్చి, భవనాల్ని త్రవ్వి, బంగారు కలశాలను విసిరివేసి కలచి వేశారు.

అప్పుడు రావణుడు పంపించగా కుంభ, నికుంభ, ధూమ్రాక్ష విరూపాక్ష సురాంతక, దుర్ముఖ, ప్రహస్త మహాకాయ ముఖ్యులైన రాక్షసవీరులు ధనుర్బాణాలు, గదలు, కత్తులు, శూలాలు, ఇనుప ఆయుధాలు; అడ్డకత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు, రోకళ్ళు మొదలైన ఆయుధాలను ధరించి ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలతో వచ్చి యుద్ధంచేశారు. సుగ్రీవ, ఆంజనేయ పనస, గజ, గవయ, గంధమాదన, నీల, అంగద, కుముద, జాంబవదాదులు ఆ రాక్షసులను ద్వంద్వయుద్ధంలో ఎదుర్కొని చెట్లతో, కొండలతో, పిడికిటి పోట్లతో నాశనం చేశారు.

అప్పుడు లక్ష్మణుడు తేజోవంతమైన బాణాలతో కొండంతవాడు, దేవతలకు అజేయుడు, మాయలతో నయగుణాలతో వర్తించేవాడు అయిన ఆ అతికాయుణ్ణి కూల్చివేశాడు.

శ్రీరామచంద్రుడు యుద్ధంలో గొప్పశౌర్యవంతుడు, నల్లని మేఘవర్ణం కలవాడు, గొప్ప భుజబలం కలవాడు, దిగ్గజాల చెవులు దిమ్మెక్కేటట్లు సింహనాదం చేసిన కుంభకర్ణుని నరికివేశాడు.

రణరంగంలో లక్ష్మణుడు అనాయాసంగా, యుద్ధమంటే ప్రీతికలవాడు, ఇంద్రుని జయించడంతో వినోదించినవాడు, తన బలంతో దేవతాసైనికులకు దుఃఖం కలిగించేవాడు అయిన మేఘనాదుని కూల్చివేశాడు.

అంత తనవారందరూ మరణించగా రావణుడు పుష్పకవిమానమెక్కి యుద్ధరంగానికి వచ్చి రామునితో వీరావేశంతో యుద్ధం చేశాడు.

అప్పుడు దేవేంద్రుని ఆజ్ఞమేరకు మాతలి గొప్ప దేవరథాన్ని తేగా రాముడు సూర్యుడు ఉదయపర్వత మెక్కినట్లు ఆ రథం అధిరోహించాడు.

ఇట్లా దివ్యరథాన్నెక్కి రామచంద్రుడు రావణునితో ఇలా అన్నాడు.

ఓ రావణా! నీచత్వంతో దాగుగొని బంగారుజింకను సంతోషంగా పంపడమనుకున్నావా? కపట బ్రాహ్మణుని వేషంతో అడవిలో ఉన్న అబలను మోసగించడం అనుకున్నావా? వాడియైన నా దివ్యబాణంవల్ల కలిగే తాపాన్ని ఎలా సహిస్తావు. ఇది అంతంలేని పర్యవసానం.

ఓ నీచాత్ముడా! నువ్వు చేసిన పాపాలకు నిన్ను శిక్షించటానికి యముడవసరం లేదు. ఆకాశచరులు, భూచరులు వినోదిస్తుంటే ఈ రోజు ఇక్కడ నా బాణాలతో నిన్ను ఖండిస్తాను.

రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు గొప్పవింటినుండి టంకారం వ్యాపిస్తుండగా, ప్రళయాగ్నితో సమానమైన బాణాన్ని కూర్చి పరుషవాక్కులు కలవాడు, దేవతా సైన్యాన్ని పారద్రోలేవాడు, శత్రురాజుల స్త్రీలకు గర్భశోకాన్ని కలిగించేవాడు అయిన రావణుని పై కొట్టాడు.

రాముడు వేసిన బాణం హృదయంలోకి దూరగా స్వాధీనం కోల్పోయి పది ముఖాలనుండి నెత్తురు కారుతుంటే రావణుడు నేలకొరిగాడు.

అంతట ఆ రావణుడు మరణించడం విని

రావణుని మరణవార్త విన్న రాక్షస స్త్రీలు కొప్పులు జారి పూలదండలు భుజాలపై పడుతుండగా, పాపట ముత్యాలు చెదరగా, చెవికమ్మలు ఊడిపోగా, కంఠహారాలు చిక్కుపడగా, ముఖాలు వాడిపోయి, పెదవులు ఎండిపోయి, కన్నీళ్లు వరదలై శరీరాలను తడుపుతుండగా, సన్నటి నడుములు పాలిండ్ల బరువుచే నకనకలాడుతుండగా, పైటలు జారి తలబాదుకుంటూ తడబడుతున్న అడుగులతో భూత బేతాళాలకు నిలయమైన యుద్ధభూమికి వచ్చారు.

ఈ విధంగా వచ్చి తమ తమ భర్తలను చూచి దుఃఖించారు. వారిలో మండోదరి రావణుని చూచి-

'హా రాక్షసశ్రేష్ఠుడా! హా దేవాంతకా! హా మనోనాయకా! నీవు దేవతలను జయించి పుష్పబాణుని బాణాలను సహించలేకపోయావు. రాముని భార్యను ఎందుకు తెచ్చావు? అయ్యో! అపుడు నేను వద్దని చెప్పినా వినక ఇప్పుడీ విధంగా కాలగతికి చిక్కావుగదా!

ఓ నాథా! ఇంతవరకు లంకపై ఎండకాయడానికి సూర్యుడు భయపడేవాడు. చంద్రుడు వెన్నెల కాయడానికి భయపడేవాడు. గాలి వీచేందుకు భయపడేది. ఈ రోజు అలాంటి లంకానగరమూ, మేమూ అనాథలమైపోయాము.

క్షణిక సుఖాలకోసం పాపమని ఆలోచించరు. పాపమని చూడరు. ఎంతవరకైనా ప్రవర్తిస్తారు. పరస్త్రీ, పరధనాలను కోరేవారికి ఇహపరాలుండవు.'

అని దుఃఖించింది. అపుడు విభీషణుడు రాముని అనుమతిని పొంది రావణునికి పరలోక క్రియలు నిర్వర్తించాడు. అపుడు రాముడు అశోక వనానికి వెళ్ళి ఇరుగుడుచెట్టు సమీపంలో

రాక్షస స్త్రీల కాపలాలో ఉన్నది, చాలా భయపడుతున్నది, ముడులుగా పెనగొన్న ముంగురులు కలిగింది, తన నిశ్వాసము, కన్నీరు చేత ఉద్యానవన వృక్షాలను పెంచుతున్నది, ఎండిపోయిన చెక్కిలిపై చేయి చేర్చినది, బాగా కృశించడంచేత ప్రాణాలు మాత్రమే మిగిలిన సీతను చూశాడు.

(సీత ఒక ఏడాది కాలం అశోకవనంలో దుర్భరమైన వేదన అనుభవించింది. ఆమె నిరంతరం కన్నీరు కార్చింది. నిట్టూర్పులు తప్ప ఆమెకు ఓదార్పులు లేవు. ఆమె విడిచిన గాలిని, కార్చిన కన్నీటిని - చమత్కారంగా పోతన వర్ణించాడు. ఆమె ఉన్న వనంలోని చెట్లు ఆ గాలిని పీల్చుకొన్నాయి. ఆ కన్నీటిని ఆరగించాయి అని. ఇందులోను మరొక చమత్కారం ఉంది. మనం విడిచిన గాలే చెట్లకు ఉపయోగం కదా! అలాగే - కన్నీరు కూడా చెట్లకు ప్రయోజనమే. ఇంతేకాదు పద్యంలో మరొక సొగసు కనిపిస్తుంది. ఆ రామభూజాత - పదబంధాన్ని ఆ రామభూజాత అని విడగొట్టితే - సీత “ఆ రాముని సీత” అనియు తెలుస్తుంది. సీత గడిపింది అశోకవనంలో అయినా ఆమెకది శోకవనమే అయింది. ఆమె భూజాత, ఆయన భూమీశుడు చక్కని సమన్వయం.)

రామచంద్రుడు సీతను చూచి దుఃఖపడి, భార్య వలన దోషం లేదనే విషయాన్ని అగ్నిద్వారా ప్రకటించి దేవతల అనుజ్ఞమేరకు దేవి సీతను స్వీకరించాడు.

దానవుని చంపిన రాజచంద్రుడు రామచంద్రుడు అప్పుడు యాచకులను సంతోషపెట్టేవాడు, పాప, దోష రహితుడు, కోపం లేనివాడు, నిండుదనంతో కూడిన మితమైన మాటకారితనం కలవాడు. పెద్దలను సంతోషపెట్టేవాడు, దయాగుణశీలి అయిన విభీషణుని రాక్షసాధిపత్యం అనే ఐశ్వర్యంతో కల్పాంతం ఉండమని సింహాసనంపై నిలిపాడు.

ఈ విధంగా విభీషణుని లంకారాజ్యంలో ప్రతిష్టించి, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి, హనుమదాదులతో పుష్పకాన్నెక్కి దేవతలు కురిపించు పూలవానలో తడుస్తూ, పూర్వం తాము వచ్చిన దారి గుర్తులను సీతకు చెబుతూ నందిగ్రామానికి వచ్చాడు.

అపుడు శ్రీరామచంద్రుని రాకను ఆనందంగా విన్న భరతుడు ఉత్సాహంగా, పురజనులందరూ కలసి రాగా పాదుకల్ని తలపై ధరించి సోదరుని కెదురు వచ్చాడు.

అలా వచ్చి పాదుకలను ముందుపెట్టుకొని మధ్యమధ్య సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మెల్లగా సమీపించి, రాముని పాదాలను తన నుదిటికి తగిలించి, ఆ పాద ధూళిని తుడిచి నెత్తిపై చల్లుకొని, అంతటితో తృప్పిపొందక ఆతని పాదాలను అక్కున మోపుకొని, ఆనంద బాష్పాలతో కడిగి క్షేమా లడిగాడు. అప్పుడు సీతాలక్ష్మణులతో ఉన్న రాముడు తనకెదురుగా వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించి, మిగిలిన వారిచేత ఆదరింపబడి వాళ్లను తాను ఆదరించాడు. అపుడు

“ఓ రాజా! చాలరోజులనుండి నిన్ను చూడలేని మేము ఈ రోజు చూడగలిగాం. మా తపసులు ఫలించాయి. కృతార్థుల మయ్యాం.” అంటూ ప్రజలు వస్త్రాల్ని తిప్పుతూ ఆడుతూ పాడుతూ, నృత్యం చేస్తూ నగరమంతా మిక్కిలిగా వేడుక చేసుకున్నారు.

సుగ్రీవుడు, విభీషణుడు జతగా ఇరువైపులా వింజామరలు వీస్తుండగా, మారుతి తెల్లగొడుగు పట్టగా, భరతుడు పాదుకల్ని భక్తితో తేగా, శత్రుఘ్నుడు ధనుర్భాణాలు తీసుకొని రాగా, లక్ష్మణుడు సేవకుడై సన్నిహితత్వాన్ని చూపించగా, సీతాదేవి జలపాత్ర తీసుకొని వెంట నడవగా, అంగదుడు బంగారు ఖడ్గాన్ని, జాంబవంతుడు బంగారు డాలును మోస్తూ సేవిస్తుండగా; సమస్త గ్రహాలు కొలుస్తున్న పూర్ణ చంద్రునివలె శ్రీరామచంద్రుడు పుష్పక విమానమెక్కి ప్రకాశించాడు.

ఇట్లా పుష్పకాన్నెక్కి వానరసైన్యాలు తనను సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్య చేరాడు. అంతకు ముందే ఆ నగరంలో

పౌరులు వీథుల్ని శుభ్రపరచి, నీళ్లు చల్లి, అరటిస్తంభాలను నిలబెట్టి, పట్టువస్త్రాలను చుట్టి, తోరణాలను, వేలాడే పూదండలను, చాందినీలను కట్టి, అరుగులను అలికించి, రత్నాలతో రంగవల్లులు తీర్చి, గోడలపై అంతటా రామకథలను వ్రాయించి, భవనాల, దేవాలయాల, గోపురాల మీద బంగారు కలశాలను అమర్చి, వాకిళ్ళలో కానుకలు పెట్టీ, అలంకరించుకొని నగర ప్రజలు ఆ రఘువంశతిలకుని కెదురు వెళ్ళారు.

భర్తరాకకు కరగిపోయే భార్యలాగా ఆ నగరం మదపుటేనుగుల మదజలంతో బాగా తడిసిన రాజమార్గాలతో మనోజ్ఞమయింది.

చంద్రుడు కనిపించగా జలచరాలతో, అలలతో తిరుగుడుపడే సముద్రంలాగా, ఆ నగరం రామచంద్రుని రాకతో మంగళవాద్య శబ్దాలతో, రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, సైనిక సమూహంతో విలసిల్లింది.

ఈ విధంగా విలసిల్లుతున్న ఆ నగరంలో ప్రవేశించి, రాజమార్గంలో రామచంద్రుడు వస్తున్న సమయంలో

'ఇతడే రాముడు. ఈమే సీత. ఈ అబల కోసమే రాముడు రావణుని చంపాడు. అదిగో ఆయనే లక్ష్మణుడు. అతడే సుగ్రీవుడు. ఆ దగ్గర ఉన్నవాడు హనుమంతుడు. ఆ సమీపంలో విభీషణుడు' అని అంటూ చేతులతో నిర్దేశిస్తూ నగరంలోని భవనాలపై నుండి స్త్రీలందరు పరీక్షించి చూచారు.

ఈ విధంగా ప్రజలు తిలకిస్తుండగా రామచంద్రుడు రాజమార్గంలో వెళ్ళి, స్ఫటికపు గోడలు, పగడాల వాకిళ్ళు, ఇంద్రనీలమణులు పొదిగిన అరుగులు కలిగి, వైడూర్యాలు పొదిగిన స్తంభాలతో మకరతోరణాలతో విలసిల్లేది, పూలదండల వాసనలతో, అనేక ధూప దీపాలతో ప్రకాశిస్తున్నది, దేవతా మూర్తులవలె ఉన్న స్త్రీ పురుషుల సంచారంవల్ల సందడిగా ఉండేది, అంతులేని ధనరాశులకు నిలయమైనది అయిన రాజప్రాసాదంలో అడుగుపెట్టాడు.

ఈ విధంగా రాజభవనం ప్రవేశించి, రాముడు క్రమంగా తల్లులందరికి నమస్కరించి, తన తల్లి కౌసల్యకు మొక్కి పండితులయందు వినయుడై, స్నేహితులను, తమ్ముళ్లను ఆదరంతో చేరదీసి, మంత్రులను, పూర్వ సేవకులను దయాభావంతో గౌరవించాడు.

(రాముడు విభిన్నమైన వ్యక్తులతో ఎలా మెలిగాడో చెప్పబడింది. తల్లులకు వందనం, పండితులపట్ల వినయం, స్నేహితులపట్ల ఆదరం, మంత్రులు, సేవకులపట్ల గౌరవం - ఇది శ్రీరాముని వ్యక్తిత్వ ఔన్నత్యం. అందుకే ఆతడు సర్వుల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయన చరిత్ర వాల్మీకి వంటి వారెందరో రాశారు. ఆయన చరిత్ర సర్వమానవాళికి అనుసరణీయమైంది.)

అపుడు కౌసల్య మొదలైన తల్లులు, కొడుకులు, పెద్దకోడలు గౌరవంతో నమస్కరించగా లేవనెత్తి, వారిని చేతులతో తడుముతూ, ముఖాలను తలలను ముద్దులాడుతూ, నవ్వుతూ ఒడిలోకి తీసికొని పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి అంటూ పొంగిపోతూ, కన్నీటితో వారిని తడిపి వేశారు.

అప్పుడు వసిష్ఠుడు శ్రీరామచంద్రుని సిగముడిని విప్పి, కులవృద్ధులు, తాను మంత్ర పూర్వకంగా దేవేంద్రుని మంగళస్నానం చేయించే బృహస్పతివలె సముద్ర నదీ జలాలతో అభిషేకం చేయించాడు. శ్రీరామచంద్రుడు సీతతో కూడి మంగళస్నానం చేసి, మంచి వస్త్రాలను పరిమళ పుష్పాలను ధరించి, గంధాలను రాసుకొని, ఆభరణాలు ధరించి, తనకు భరతుడిచ్చిన సింహాసనంపై కూర్చుని, అతనిని మన్నించి, కౌసల్యకు సంతోషం కలిగిస్తూ లోకం మెచ్చుకొనేటట్లు రాజ్యం చేయసాగాడు. అప్పుడు

(వసిష్టుడు బృహస్పతి సదృశుడని సూచన. రామపట్టాభిషేకం కౌసల్యకు ఆనంద దాయకం. రామపరిపాలనను లోకం ప్రశంసించింది.)

రాజేంద్రుడైన రామచంద్రుడు భూభారాన్ని వహిస్తుండగా సప్తసముద్రాలకు అలజడి లేదు. భూమండలానికి కంపం లేదు. శ్రీమహావిష్ణువునకు జాగరూకత లేదు. దిక్పాలురకు దీనత్వం లేదు. సూర్యచంద్రులకు మసక లేదు. దిగంతాలకు కావి వర్ణం లేదు. చెట్లు మోడువారలేదు. త్రేతాగ్నులు ఆరిపోలేదు. దిగ్గజాలకు, కులపర్వతాలకు, వరాహానికి, శేషనికి, కూర్మానికి బరువు తీరింది. ప్రజలకు దుఃఖం లేకుండా పోయింది.

(రామరాజ్యం ప్రజానందకరంగా సాగిందని భావం. సప్తసముద్రాలకు అలజడి, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు లేవు. నిరంతరం జాగ్రత్త అవసరమైన విష్ణువునకు అట్టి స్థితిలేదు. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులు. తేజోవంతులయ్యారు. త్రేతాగ్నులు నిరంతరం తేజోవంతమై ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ భూమియొక్క భారాన్ని అది వరకే అష్టదిగ్గజాలు, కులపర్వతాలు, ఆదివరాహం, ఆదికూర్మం, ఆదిశేషుడు మోస్తున్నారు. ఇప్పుడు శ్రీరాముడు ఆ భారాన్ని వహించుటంచేత వీరికి విశ్రాంతి లభించింది.

అష్టదిగ్గజాలు: ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం.

సప్త కులపర్వతాలు: మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం.)

అంతేగాక ఆ రామచంద్రుడు పరిపాలించే రాజ్యంలో చంచలత్వం స్త్రీల వాలు చూపులలోనే, పేదఱికం ముగ్ధల నడుములోనే, కుటిలంగా సంచరించడం స్త్రీల కేశాలలోనే, మందత్వం; స్త్రీల నడవడికలోనే పీడించడం స్త్రీల కాగిలింతలలోనే, యుద్ధం స్త్రీల స్తనాల విషయంలోనే, బంధనం స్త్రీలతో కలయికలోనే, జ్వరం భార్యల ఎడబాటులోనే, దొంగతనం ప్రియుడు ప్రియురాండ్ర మనసులను దోచుకొనే విషయంలోనే, అక్రమం భర్తలు భార్యల జడలుపట్టుకొని ఆపడంలోనే ఉండేవి.

(రాజ్యంలో సంపదల అస్థిరత, పేదఱికం, కుటిల ప్రవర్తన, చైతన్యరాహిత్యం, యుద్ధం, తాపం, దొంగతనం, అక్రమం వంటి విషయాలు సాధారణంగా ఉంటాయి. రామరాజ్యంలో స్త్రీపురుషుల కలయిక విషయంలోనే ఉన్నాయి ఇవన్నీ. అంటే ప్రజలు ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించారని భావం.)

తండ్రిలాగా శ్రీరాముడు కన్న తండ్రులను సైతం మరపించి, ప్రజలను (రక్షించాడు) పరిపాలించాడు. వారు శ్రీరాముడే తమ తండ్రి అంటూ కన్న తండ్రులను మరచిపోయారు.

(బిడ్డల పాలన తండ్రి ధర్మం. తండ్రి స్థానం విశిష్టమైంది. రాముడు ప్రజల కష్టసుఖాలను గుర్తెరిగి కన్న బిడ్డలవలె పరిపాలించాడు.)

అంతేగాక ఆ రామచంద్రుడు రాజర్షులవంటి నడకతో, తన ధర్మంపట్ల అభినివేశంతో, ఏకపత్నీవ్రతంతో, సర్వులకు అంగీకారయోగ్యంగా, ధర్మానికి హాని కలుగనివ్వకుండా, ఇష్టకామ్యార్థసిద్ధితో, త్రేతాయుగమైనా కృతయుగధర్మాలను పాటిస్తూ శిశుమరణాలవంటి అరిష్టాలు ప్రజలకు కలుగనివ్వక రాజ్యం చేశాడు. అప్పుడు

అపుడు సీతాదేవి బిడియం, శృంగారం కలిగి, భయం భక్తి కలిగి, నయమూ ప్రియమూ కలిగి భర్త మనస్సును ఆకట్టుకుంది.

అని చెప్పగా పరీక్షిన్మహారాజు ఇట్లన్నాడు. ఆ శ్రీరాముడు రాజత్వం వహించి సోదరులపట్ల, బంధువులపట్ల, ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాడు? పరమేశ్వరుడైన తనను గూర్చి తానే యజ్ఞాలు ఏ విధంగా చేశాడు?

(సాధారణంగా రాజులు భగవంతుని గూర్చి యజ్ఞాలు చేస్తారు. ఇక్కడ చేయవలసింది ఆ భగవానుడే కదా! అవి ఎలా చేశాడని పరీక్షిత్తు ప్రశ్న)

అని పరీక్షిత్తు ప్రశ్నిస్తే శుకుడిలాగన్నాడు. ఓ పాండవ శ్రేష్ఠుడా! భగవానుడైన రామచంద్రమూర్తి సంతోషంగా దేవతాశ్రేష్ఠుడు, సర్వదేవతామయుడు అయిన తనను గూర్చి తానే యజ్ఞాలు చేశాడు: అప్పుడు హోతకు తూరుపుదిక్కు; సామగాయకునికి ఉత్తరదిక్కు; బ్రహ్మకు దక్షిణదిక్కు; అధ్వర్యునికి పడమర దిక్కు మిగిలింది గురువునకు క్రమంగా దానం చేశాడు. తన రెండు వస్త్రాలు, తన భార్య మంగళసూత్రాలు తప్ప అన్ని సొమ్ములను బ్రాహ్మణులకు వితరణ చేశాడు. ఆ రాముని దానగుణాన్ని ఏమని ప్రశంసించగలం?

(యజ్ఞక్రియలో దేవతలను ఆహ్వానించేవాడు హోత. యజుస్సులద్వారా యజ్ఞక్రియను సంపన్నం చేసేవాడు అధ్వర్యుడు. తనకున్నదంతా యజ్ఞసమయంలో దానంచేశాడు రాముడు. తన రెండు వస్త్రాలు, భార్య మంగళసూత్రం తప్ప అన్నీ దానం చేయడం వితరణకు పరాకాష్ట శ్రీరాముడు తాను రాజ్యం చేస్తున్నా - ఆయనకున్నవి ఉంచుకొన్నవి రెండు వస్త్రాలు మాత్రమే.)

అపుడు రామచంద్రుని దానశీలానికి మెచ్చి బ్రాహ్మణ శ్రేష్ఠులు తమకు దానంచేసిన భూములను తిరిగి రామునికే ఇచ్చి ఇట్లన్నారు.

ఓ రాజశ్రేష్ఠుడా! మునులకు భూములతో పనియేమి? మాకవసరం లేదు. నీవు సర్వేశ్వరుడవైన శ్రీహరివి. మా మనసులలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని నీ దయాకాంతులతో పోగొట్టు.

అని చెప్పి, బ్రహ్మణ్యదేవుడైన రామచంద్రుని వినయంతో పూజించి మునులు వెళ్ళారు. ఈ విధంగా చాలకాలం పరిపాలన చేసి ఒకనాడు శ్రీరామచంద్రుడు

ఒకరోజు రాజ్యంలోని విశేషాలను స్వయంగా తెలియడంకోసం రాముడు మారువేషంలో నగరసంచారం చేస్తున్నాడు. అపుడు నగరపౌరుడొకడు తన భార్యను ఇష్టపడక “పరాయివాడింట్లో కాపురమున్న చపలత్వంకల స్త్రీని వదులుకోకుండా స్వీకరించడానికి నేనేమి వెఱ్ఱిరాముడినా” అన్నాడు. ఆ మాట విని లోకంలో కూడ అదే విషయం వ్యాప్తిలో ఉన్నదని చారులవల్ల తెలిసికొన్న రాముడు రాత్రి సీత నిద్రపోతుండగా, ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు.

గర్భవతి అయిన సీత కుశలవులనే కుమారులను కన్నది. వాల్మీకి మహర్షి వారికి జాత కర్మలు చేశాడు. అయోధ్యలో లక్ష్మణునికి అంగదుడు, చంద్రకేతుడు, భరతునికి తక్షుడు, పుష్కలుడు; శత్రుఘ్నునికి సుబాహుడు, శ్రుతసేనుడు అనే పుత్రులు పుట్టారు.

అప్పుడు బలశాలియైన భరతుడు గంధర్వులను జయించి బంధువులు, తల్లులు, ప్రజలు ప్రశంసించగా కనకాది సంపదలను అన్నకు సమర్పించాడు.

మధురభాషణుడైన శత్రుఘ్నుడు తన అన్న శ్రీరామచంద్రుడు మెచ్చుకొనేటట్లు భుజబలంతో మధువు అనేవాడి కొడుకైన లవణుని చంపి, మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు.

తరువాత కొంతకాలానికి రామచంద్రుని కొడుకులైన కుశలవులు వాల్మీకివల్ల వేదవిద్యల్లో ప్రావీణ్యం గడించి, అనేక సభల్లో రామకథాశ్లోకాల్ని తానస్వరబద్ధంగా పాడుతూ, ఒకరోజు శ్రీరాముని యజ్ఞశాలకు వెళ్ళి

మ్రోళ్లు చిగురించేటట్లు, ఎడతెగని అమృత ప్రవాహం జాలువారినట్లు వారు పాడిన పాటకు రాజు, ప్రజలు ప్రేమతో ఆనందబాష్పాలు రాలుస్తూ, తలలూపుతూ వారిపై ప్రేమ కలుగగా మిక్కిలి సంతోషం పొందారు.

ధన్యులైన ముద్దుకుర్రలార! చంద్రుని వంటి వదనం, తామర రేకులవంటి విశాల నయనాలు కలిగినవారలారా! తియ్యని వాక్కులు పలికేవారలారా! మీ తల్లిదండ్రులెవరు?

అని అడుగగా వాళ్లు 'మేము వాల్మీకి మహర్షి మనుమలం. శ్రీరాముని యాగాన్ని చూడటానికి వచ్చాం'. అన్నారు. రాముడు చిరునవ్వు నవ్వి 'రేపు ఉదయం మీతండ్రిని గూర్చి తెలుసుకుంటారు ఇక్కడే ఉండమని వారికొక నివాసం ఇచ్చి ఆదరించాడు. మరుసటిరోజు సీతను, కుశలవులను తోడ్కొని వాల్మీకి వచ్చి శ్రీరాముని చూచి అనేక విధాల సంస్తుతించి ఇట్లా అన్నాడు.

సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి రామచంద్రా! సీతాదేవి పవిత్రురాలు, త్రికరణశుద్ధిగా సత్యనిష్ట కలది. స్వచ్చమైన నడవడిక కలిగినది. పుణ్యాత్మురాలు. అట్టి సాధ్విని విడువకు. స్వీకరించు.

అని వాల్మీకి పలుకగా, రాముడు కొడుకులను గూర్చి విచారించాడు. నిరాశచెందిన సీత కుశలవులను వాల్మీకికి అప్పగించి రామపదస్మరణ చేస్తూ భూమిలో ప్రవేశించింది. అప్పుడు

(సీత నిరాశ ఐనది. నిరాశ అంటే ఆశలేనిది. ఆమెకోరిక లింకేమీ లేవు. రాముని కిల్లాలైంది. ఆయనతో జీవించింది. సంతానాన్ని కని వంశవృద్ధికి తోడ్పడింది.

ఆశ అంటే దిక్కు అని అర్ధం ఉంది. అంటే దిక్కులేనిదయింది. సీత రామునివెంట కష్టాలనుభవించింది. లంకలో తాను పవిత్రనని నిరూపించుకొంది. అయోధ్యకు వచ్చింది. నిండు చూలాలయింది. మళ్లీ కారణంలేని నిందకు గురయింది. కట్టుకున్నవాడు కారడవులకు పంపాడు. రాముని వంశాంకురాల్ని అప్పగించి దిక్కులేనిదిగా తన దారిన వెళ్లిపోయింది. భూమినుండి వచ్చింది. భూమిలోకే వెళ్లిపోయింది.)

“ఓ కాంతా! నీవు ఎందుకు భూమిలో క్రుంగిపోయావు? మనమధ్య అనురాగాన్ని తలచలేదా? నీ ముఖారవిందాన్ని ఒక్కసారి చూపించు. నీ తియ్యని వాక్కులు వినిపించు. ఇట్లా ముగింపు పలకడం బాగాలేదు” అంటూ శ్రీరామచంద్రుడు తాను భగవంతుడై ఉండి కూడా విలపించాడు. ప్రియురాలి వియోగం ఎవరికైనా దుఃఖహేతువే కదా!

(శ్రీరాముడు తాను భగవదవతారమూర్తి అయినా ప్రాకృతజనునివలె విలపించాడు. ప్రియురాలి వియోగం ఎవరికైనా దుఃఖహేతువే అని కవి సమర్థన. ధర్మబద్ధుడైన రాముని విలాపం కవి కరుణ రసభరితంగా వర్ణించాడు.)

ఆ విధంగా దుఃఖించి, శ్రీరాముడు బ్రహ్మచర్యాన్ని పాటించి, పదుమూడువేల సంవత్సరాలు అగ్నిహోత్రాలను ప్రవర్తింపజేసి, తానే భగవంతుడైనందువల్ల తన పూర్వపుస్థానమైన పరమపదానికి వెళ్ళాడు. ఈ విధంగా

దేవతాశిరోమణి అయిన ఆ శ్రీరామచంద్రునికి సముద్రంమీద వారధి నిర్మించడం, రాక్షసులగుంపును నాశనం చేయడం, వానరుల సాయం పొందడం ఏ పాటిది? కాకపోతే తన లీలలను దేవతలకోసం ప్రదర్శించాడంతే.

(లీలామానుషవిగ్రహుడైన శ్రీరామచంద్రుని భగవత్తత్త్వాన్ని కవి సూచించాడు.)

లవణ సముద్రపు అహంకారాన్ని నివారించిన వానికి, దిక్పాలుర కిరీటకీలితమణిదర్చణాల్లో ప్రకాశించే విశిష్టకీర్తికలవానికి, వేయిసూర్యుల మూర్తిమత్వం కలవానికి, అమృతోపమానమైన భాషణంకలవానికి, సజ్జన పోషకునికి, రావణుని సంహరించినవానికి శ్రీరామచంద్రునికి నేను (శుకమహర్షి) వినయంగా నమస్కరిస్తున్నాను.

నల్లని మేనిఛాయ కలవాడు, కమలనేత్రుడు, గొప్పధనుర్బాణాలను ధరించినవాడు, విశాలవక్షము కలవాడు, శుభములను అందరికి ప్రసాదించేవాడు, ఎగు భుజాలు కలవాడు, కీర్తి దిగంతాలవరకు వ్యాపింపజేసినవాడు అయిన రాఘవుడు మాకోరికలను తీర్చుగాక!

(ఇలాంటి పద్యమే శ్రీకృష్ణునిగూర్చి దశమస్కంధంలో పోతనగారు వ్రాశారు. ఒక స్కంధం ముందే ఉన్న ఈ పద్యం కంటె శ్రీకృష్ణుని గూర్చి చెప్పిన పద్యమే విశేషంగా ప్రాచుర్యం పొందింది. విశాల వక్షఃస్థలం, ఎగుభుజాలుండడం ఉత్తమ పురుషుల లక్షణం 'వ్యూఢోరస్కో వృషస్కంధః' అని రఘువంశంలో దిలీపుని గూర్చిన వర్ణన. పోతనకు రాముడన్నా కృష్ణుడన్నా ఒక్కటే. భాగవతం శ్రీకారం చుడుతూ మహానందాంగనా డింభకుడు కృష్ణుణ్ణి స్తుతించాడు. ఆ తరువాత భాగవతాన్ని శ్రీరాముని సంబోధిస్తూ చెప్పాడు. రామకృష్ణులు వేర్వేరు కాదని చెప్పేందుకే నవమ దశమస్కంధాల్లో ఒకే పద్యాన్ని రచించాడు.)

ఆ రామచంద్రునితో రాక పోకలతో కలిసి తిరిగేవారు, ఆయనను చూచినవారు, ఆయనను ప్రేమతో తాకిన ఆ కోసల దేశప్రజలు ఆదియోగులు వెళ్ళిన సద్గతిని పొందారు.

శ్రీరామనామ మంత్రస్మరణలు మోక్షార్ధులకు విచారణీయాలు. గొప్ప పుణ్యాలకు నిలయాలు. ప్రస్తుతం, పూర్వకాలాల్లో చేసిన గొప్ప పాపాలకు నిష్కృతి దాయకాలు.

(శ్రీరామ చరితాన్ని వర్ణించిన కవి ఫలశ్రుతిని చెబుతున్నాడు. రామనామం మోక్షదాయకం, పాపహరణమని భావం.)

ఆ రామచంద్రునికి కుశుడు, కుశునికి అతిథి, అతిథికి నిషధుడు, నిషధునికి నభుడు, నభునికి పుండరీకుడు, పుండరీకునికి క్షేమధన్వుడు, క్షేమధన్వునికి దేవానీకుడు, దేవానీకునికి అహీనుడు, అహీనునికి పారియాత్రుడు, పారియాత్రునికి బలుడు, బలునికి చలుడు, చలునికి సూర్యసంభవుడైన వజ్రనాభుడు, వజ్రనాభునికి శంఖణుడును, శంఖణునికి విధృతి, విధృతికి హిరణ్యనాభుడు జన్మించారు. ఆ హిరణ్యనాభుడు జైమిని శిష్యుడైన యాజ్ఞవల్కముని వల్ల బ్రహ్మవిద్యను గ్రహించి కలతలు పోయి సద్గతిని పొందాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు, పుష్యునికి ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుడు, సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రుడు, శీఘ్రునికి మరువు అనే రాజవరుడు జన్మించారు. ఈ రాజయోగి సిద్దుడయి కలాప అనే గ్రామంలో ఉన్నాడు. కలియుగం చివరలో అంతరించే సూర్యవంశాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాడు. ఆ మరువుకు ప్రశుశుక్రుడు, ప్రశుశుక్రునకు సంధి, అతనికి అమర్షణుడు, అతనికి మహస్వంతుడు, ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు, విశ్వసాహ్యునికి బృహద్బలుడు జన్మించారు. ఆ బృహద్బలుడు మహాభారతయుద్ధంలో మీ తండ్రియైన అభిమన్యునిచేత చంపబడ్డాడు. విను. (అంటూ శుకుడు విన్పించాడు)

(శ్రీరాముని వంశం సవిస్తరంగా చెప్పబడింది. (త్రేతాయుగంనుండి క్రమంగా కలియుగ ప్రారంభంవరకు ఉన్న సూర్యవంశ రాజులు ప్రస్తావింపబడ్డారు. పంచలక్షణశోభితమైన పురాణం కాబట్టి వంశానుచరితం ప్రస్తావించబడింది. ఇక్ష్వాకుడు మొదలుకొని బృహద్బలుని వరకు ఉన్న రాజులు ప్రస్తావించబడ్డారు. తరువాత జన్మించబోయే రాజులను గూర్చి ప్రస్తావించబోతున్నాడు.

భవిష్యద్రాజేతిహాసము

No comments:

Post a Comment

రాములోరికి గోటి తలంబ్రాలు

రాములోరికి గోటి తలంబ్రాలు సీతారాముల కల్యాణం, కమనీయంగా జరుగుతుంటుంది. ఏటా చైత్ర నవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకగా కల్యాణ ఘట్టం జరుగుతుంది. అయ...