Sunday, April 12, 2026

Chapter 56 Sridevi's residence in Kashi - అధ్యాయము 56 శ్రీదేవి కాశిలో నివసించుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 56

శ్రీదేవి కాశిలో నివసించుట

వ్యాసు డిట్లనెను : ఆ భవానీదేవి హితవు నాలకించి సుబాహువు భక్తి యుక్తితో శ్రీదేవి కిట్లనియెను. "ఒకవంక దేవలోక భూలోకముల విశాల రాజ్యసంపదలు, మరొకవంక నెనలేని నీ దివ్య సందర్శన భాగ్యము. ఓ బ్రహ్మాండ జననీ! ఈ ముల్లోకములందును నీ దివ్య సందర్శనమునకు సాటివచ్చున దేదియును లేదు. నీ దర్శనముచే నేనీభూమిపై ధన్యుడనైతిని. నేనింకేమి కోరుదును? ఐనను నేనొక వరము గోరుచున్నాను. నీ పాద పద్మములందు నా కైకాంతిక ప్రేమభక్తి కుదురుగ నుండుగాక. ఓ మాతా! ఈ పవిత్ర కాశీనగరిలో నీ శక్తిరూపము దుర్గాదేవి నామమున నెల్లకాలము నెలకొని యుండునుగాక! సుదర్శనుని శత్రు సంఘములనుండి మమ్ము సురక్షితముగ రక్షించితివి. అటులే నీ వీ నగరమును నిత్యము బ్రోచుచుండుము. ఓ జగజ్జననీ! ఈ భూమిపై నెంతకాలము కాశీపురి సుస్థిరమై ప్రసిద్ధినంది యలరారుచుండునో యంతకాలము నీవిట నెలకొనియుండి దానిని నీవు ప్రోచుచుండుము. నాకీయొకేయొక వరమిమ్ము. నేనింతకు మించి యేమియును గోరను. అమ్మా! నాకు సకలవిధకామము లొడగూర్పుము. నా వైరులను దునుమాడుము. లోకమందలి యమంగళమును ప్రతిహత మొనరింపుము. ఈ విధముగ తన్ను సంస్తుతించి వరములు పొంది తన సమక్షమున కేలుమోడ్చి నిలుచున్న సుబాహుని గని దుర్గతినివారిణి యగు దుర్గ సుప్రసన్నయై యతని కిట్లనియెను: 

"రాజా! ఈ భూమి నిలుచునందాక నేనీ యవిముక్త క్షేత్రమునందు విశ్వసంరక్షణకై నివసింతును." ఆపిమ్మట సుదర్శనుడు ప్రమోదసంభరితుడై వచ్చి పరమ భక్తితో మోకరిల్లి జగదంబిక నీ విధముగ కొండాడెను.

"ఓహో దేవీ ! నీ దయ నెంతని వర్ణింతును? నేను భక్తి హీనుడనైనను నీచేత గాపాడబడితిని. ఎల్ల దేవతలు భక్తులపై దయజూపుదురు. కాని, నీవు మాత్రము భక్తి లేనివారిపైగూడ దయ జూపుదువు. ఇది నీ ముఖ్యవ్రతము. మహాదేవీ! నీ వీ బ్రహ్మాండము లన్నిటిని పుట్టించి పెంచి తుదకు సంహారమొనర్తు పని నేను వింటిని. అట్టి నీవు నన్నొక్కని బ్రోచుట వింతగాదు. అమ్మా భవానీ! నేను కార్యమూఢుడను. నేనిపుడేమి చేయవలయును? ఎచటి కేగ వలయును? నన్నాదేశింపుమమ్మా! నీయాన తలదాల్చి వెళ్ళుదును. విహరింతును, మనుదును. అపుడు దేవి దయాంతరంగయై యతని కిట్లనియెను. 

"ఓ మహాభాగా! నీ వయోధ్య కేగి నీ కులోచితముగ రాజ్యమేలుము. నన్ను నియతముగ భక్తితోడ సంస్మరించుచు బూజించుచుండుము. నేను నీ రాజ్యమందు నిత్య సుఖశాంతులు నెలకొలుప గలను. నీవష్టమీ నవమీ చతుర్దశులందు నన్ను గుఱించి ప్రత్యేకముగ బలివిధానముతో నా పూజ లొనర్పవలయును. ఓ యనఘా! నా దుర్గా విగ్రహమును నీ నగరమున సుప్రతిష్ఠితము గావించి నన్ను శ్రద్ధాభక్తులతో మూడువేళల నర్చించు చుండుము. ప్రతి శరత్కాలమున నవరాత్ర విధానముగ పరాభక్తి భావముతో నాకు నిత్యము మహాశక్తిపూజ లొనర్పుము. 

చైత్రము-ఆషాఢము-ఆశ్వయుజము-మాఘము- ఈ మాసములందు నన్ను గూర్చి ప్రేమమీర శ్రీదేవీ మహోత్సవములు జరుపవలయును. విశేషించి నవరాత్రములందు హృదయపూర్వకములగు నివాళులతో నిత్యపూజ లొనరింప వలయును. బుధులు విశేషించి కృష్ణపక్షమందలి యష్టమీ చతుర్దశులందు నిశ్చలభక్తి యుక్తులై న న్నారాధింప వలయును.

ఇట్లు దుర్గతి నాశని శ్రీదేవి దుర్గ పలికి సుదర్శనునిచేత సన్నుతింపబడి అదృశ్యయైన పిమ్మట దేవత లింద్రుని జేరునట్లు రాజులు సుదర్శనుని జేరి ప్రణమిల్లిరి. సుబాహువు సైతమతనికి వందన మాచరించి నిలుచుండెను. రాజులందఱును సుదర్శునితో నిట్లనిరో. నీ వయోధ్యాపతివి కమ్ము. మేము నీ సేవకులము. నీవు మా ప్రభుడవు. శాసకుడవు. నీవయోధ్యారాజ్య మేలుము. మమ్ము బాలింపుము. మహారాజా! ఆదిశక్తి - మహాదేవి - చతుర్వర్గఫలప్రదాయిని-విశ్వేశ్వరి-శివ యగు పరాదేవి నీ మూలమున మాకు గోచరయైనది. ఈ భూమిపై నీవు మిక్కిలి ధన్యుడవు-కృతకృత్యుడవు-పుణ్యతముడవు-కావుననే నీ నిమిత్తమున సనాతని యగు జగదంబిక దర్శనభాగ్య మొసంగినది. 

నృపసత్తమా ! మేము మాయామోహితులము. తామసులము. కాన మేము శ్రీ చండికాప్రభావ మెఱుగ జాలకుంటిమి. మేము ధన దార సుతుల చింతలం దగిలి యుంటిమి. కామక్రోధములను మొసళ్ళుగల ఘోర సంసార సాగరమందు నిర్మగ్నుల మైతిమి. నీవు సర్వజ్ఞుడవు-మహామనీషివి. కనుక ఆ పరమశక్తి యెవరో ఎచ్చటి నుండి వచ్చెనో ఆమె మహా ప్రతిభా ప్రభావ మెట్టిదో నీవు చక్కగ నెఱుగుదువు. కాన నిన్నడుగుచున్నాము-దయతో సెలవిమ్ము. కాకుత్థ్స ! సాధులు సర్వభూతహితులును దయామతులును. కనుక నీవు మా దుస్తర సంసార సాగరము దాటించు నావికుడవుగమ్ము. మాకు శ్రీమద్దేవీమాహాత్మ్యము తెలియ బలుకుము. 

నరవరోత్తమా! ఆ మాయాదేవీ నిజస్వరూపమేది? ఆమె యెట్లవతరించినది? ఆమె విమల ప్రభావ మేతీరుది? ఇవన్నియును మాకు వినవేడుకగుచున్నవి. వినిపింపుము'' అని యిట్లు రాజులడుగగా సుదర్శనుడు ప్రమోద మలర నెమ్మదిలో శ్రీదేవిని సంభావించి వారికిట్లనియెను:

"ఓ భూపతులారా! ఏమని చెప్పుదును? ఎంతని చెప్పుదును? బ్రహ్మ రుద్రుడు దేవతలు సైత మా దేవీతత్త్వము తుదముట్ట నెఱుగజాలరు. అట్టి జగదంబిక దివ్యచరిత్రము వర్ణింప నేనెవడను? ఆ శ్రీదేవి యీ సకలమున కాద్య-పరాశక్తి-వరేణ్య-మహాలక్ష్మి-సత్త్వప్రకాశమూర్తి-జగత్పరిపాలన చతుర. ఆ యంబిక యీరేడు లోకాలను రజోరూపమున పుట్టించి సత్త్వరూపమున పాలించి తమోరూపమున సంహరించి త్రిగుణమయియై విరాజిల్లు చుండును. ఆ నిర్గుణ పరమశక్తి బ్రహ్మ మొదలుగాగల దేవతలకు కారణభూతురాలు. సర్వకామఫలప్రదాయిని. ఆ నిర్గుణశక్తి పరమయోగులకును తెలియరాదు. కావున బహురూపములుగల సగుణశక్తిని విబుధులు సేవించి చింతించి తరింతురు. 

రాజు లిట్లనిరి. నీవు బాల్యము నుండియు భయముతో మనములందు తలదాచుకొంటివిగదా! నీవా యుత్తమ పరమశక్తి నెట్లుఱుగ గల్గితివి? నీవా తల్లి నేతీరున పూజించి యుపాసించితివో కాని యాదేవి దయను త్వరలోనే సంపాదింప గల్గితివి' అన 

సుదర్శను డిట్లనెను: ఓ నరేశులారా! నాకు చిఱుత ప్రాయమందే శ్రీ భగవతియొక్క కామరాజ బీజమంత్రము లభించినది. నేను దానిని రేయింబవళ్ళదే పనిగ జపించు చుంటిని. పరమర్షులు నాకంబికా శివతత్త్వ మెఱింగించిరి. నాటినుండి నేనా దేవి నైకాంతిక భక్తితో నిరంతరముగ స్మరించితిని అనెను. అంత రాజులెల్లరు శ్రీదేవీభక్తి తత్పరులై పరమశక్తిని తమ డెందములందు దలంచుచు నిజనివాసముల కరిగిరి. సుబాహువు సుదర్శనుని వీడ్కొని కాశి కేగెను. 

ధర్మాత్ముడైన సుదర్శనుడును కోసలపురికి వెళ్ళెను. రణమున శత్రుజిత్తు మరణించుట సుదర్శనుడు గెలుపొందుట విని మంత్రులెల్లరును సంపూర్ణహర్షము వెలిపుచ్చిరి. సుదర్శనమహారాజేతెంచుట గాంచి సాకేతనివాసులు విలువైన కానుకలు గొని సాదర సమ్మానములతో నతనికెదురేగిరి. ఇట్లు ప్రజలెల్లరును భూరిగ కానుకలు తీసికొని ధ్రువసంధిసుతుని సన్నిధి కరిగిరి. ఈ విధముగ సుదర్శనుడు తనపత్నితో గూడ నయోధ్య కేగి యెల్లరిని గారవించి రాజమందిరమున కరిగెను. 

అపుడు వందిమాగధులు సుదర్శనుని సన్నుతించిరి. మంత్రులు చేతులు జోడించిరి. కన్నెపడుచులు లాజసుమములు గురిపిరి అని వ్యాసమహాముని జనమేజయునితో పలికెను.

అధ్యాయము 57 శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 55 Sridevi appears and saves Sudarshana - అధ్యాయము 55 శ్రీదేవి ప్రాదుర్భవించి సుదర్శనుని గాపాడుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 55

శ్రీదేవి ప్రాదుర్భవించి సుదర్శనుని గాపాడుట

బాదరాయణి యిట్లనియెను: ఆ విధముగ సుబాహు వల్లునకు యథావిధముగ పలువిధములైన భోజ్యపదార్థములను సమకూర్చి ఆరు దినముల వరకు భక్తి పూర్వకముగ భుజింపచేసెను. అట్లు అమిత ద్యుతియగు సుబాహువు వివాహ కార్యములు జరిపించి యల్లునకు బహుమానము లొసంగి మంత్రులతో మంత్రాలోచన మొనరించుచు రాజులెల్లరు నలుత్రోవలు కాచుకొని యున్న విషయమును దూతల వలన విని దుఃఖమున విమనస్కుడయ్యెను. అపుడు సుదర్శనుడు సుబాహునితో "మమ్ము వేగమే సాగనంపుము. మేము నిశ్శంకముగా నేగుదుము. మేము పవిత్ర భారద్వాజాశ్రమ మేగి యచట నన్ని విధముల నిశ్చింతతతో నివసింపగలము'' అని పలికెను. సుబాహు వల్లుని భావ మెఱింగి విపులధనరాసు లొసంగి వారిని సాగనంపెను. 

సుదర్శనుడును త్వరితగతిని బయలుదేరెను. సుబాహువు పెద్ద సైన్యము సాహాయ్యముగా నతని వెనుక వచ్చుచుండెను. సుదర్శనుడు వెఱపు జెందక మార్గమున ముందునకు సాగుచుండెను. రథములు వెంటరాగా భార్య తోడుగాగా ఆ రఘుకులజుడు నరదంబెక్కి పోవుచు రాజుల సేనలను నొక్కసారి కలయజూచెను. సుబాహువు వైరి రాజులను గని చింతాక్రాంతుడయ్యెను. కాని సుదర్శనుడు విధి పూర్వకముగ నా జగదేక మాతను శరణుబొందెను.

అట్లు సుదర్శనుడు పరమము నేకాక్షరము నైన కామరాజమంత్రమును నిర్విరామముగ జపించుచు నూతన వధువు తోడ విగతశోకుడై యొప్పెసగుచుండెను. వెంటనే రాజులెల్లరు పెల్లుగ కోలాహలము చేసి లేచి సైన్యసమేతులై కన్నియను హరింప నెంచిరి. కాశీరాజు వైరి రాజులగను గని వారి నంత మొందింప బూనుకొనెను. కాని సుదర్శనుడతనిని గట్టిగ వారించెను. సుబాహువును మరి ఇతర రాజులును పరస్పరము జయకాంక్షలతో భేరీశంఖము లానక దుందుభులు మ్రోగించిరి. శత్రుజిత్తు సమరసన్నుద్ధుడై నిలుచుండెను. యుధాజిత్తతనికి సాయమొనర్ప సంసిద్ధుడయ్యెను. అందు కొందఱు సేనలను పరికించుచుండిరి. అంతలో యుధాజిత్తు సుదర్శనునిముందేగి నిలుచుండెను. యుధాజిత్తు వెంట శత్రుజిత్తు గూడ తన యన్నను చంప వచ్చెను. అన్నదమ్ము లిరువురును కోపమున పరస్పర బాణఘాతములతో మూర్ఛితులగు చుండిరి. అట్లు వారికి బాణయుద్ధము సాగుచుండగ సుబాహువు తన సేనలను పురికొలిపి కూడదీసికొని తన యల్లునకు సాయమొనర్ప సంసిద్ధుడయ్యెను. ఇట్టు లచ్చెరువుగదుర దారుణ సంగ్రామము సాగుచుండెను. 

అంతలో నెక్కడినుండియో వేవేగమే నానా యుధధారిణి వరభూషణభూషిత సంహవాహనాసీనయగు దేవి భగవతి ప్రత్యక్షమయ్యెను. దివ్య మాల్యాంబరములు మందార సుమమాలికలు దాల్చి ఆ తల్లి విరాజిల్లుచుండెను. ఆ లోకమాతను గాంచి యెల్లరాజులును విస్మయచకితులైరి.

ఈ సింహాసనారూఢ యెవ్వరు? ఎక్కడినుండి యేతెంచినది? అని రాజులు తలపోయుచుండిరి. అపుడు సుదర్శనుడాజగదంబను సందర్శించి సుబాహువుతో నిట్లు పలికెను. "ఓ రాజా! అనురాగమయి యగు తల్లిని దర్శింపుము. ఆ తల్లి మనకు తన దివ్యదర్శనభాగ్య మొసంగ నేతెంచినది. నన్ననుగ్రహింప నా తల్లి దయామృతము చింద నవతరించి నేనిపుడు నిర్భయులలోన నిర్భయుడనైతి'ననెను." వారిరువురు రా భగవతి యగు వరాననను నేత్ర పర్వముగ నవలోకించిరి. వారా దేవి దివ్యదర్శనమునకు హృదయములుప్పొంగ దండవత్‌ ప్రణామము లాచరించిరి. ఆ సింహగర్జనమున కేనుగుల గుంపులు భయకంపితములై చెల్లాచెదరయ్యెను. దెసలు కంపించెను. పెనుగాలులు వీచెను. 

అపుడు సుదర్శనుడు తన సేనాపతి కిట్లనెను. "నీ విపుడు దుష్టచేతస్కులును కుపితులును నైన రాజు లెచట గలరో యేమి చేతురో తెలిసికొనుటకు బయలుదేరుము. నీవీ మహరాజులుండు త్రోవలందు నిర్భయముగ నరుగవచ్చును. మన కా భగవతి తోడునీడయై కరుణ జూపును. మనము ఆమెను స్మరించినంతనే ఈ మహాదేవి మనల గాపాడ నేగుదెంచినది" అను మాటలు విని సేనాపతి బయలుదేరెను. 

యధాజిత్తు రోషాతిరేకమున రాజుల కిట్లనియెను: "మీరు భయకంపితులగుదురేల? ఆ సుదర్శనుని నతని భార్యతో గూడ నంతమొందింపుడు. బలాధికులమైన మనలనవమానించి బలహీనుడైన యితడు జంకుగొంకుతలు లేక కన్నియను గొనిపోవుచున్నాడు. ఈ సింహముపై నున్న యొక కామినిని గని యేల భీతిల్లుదురు! ఈమె నుపేక్షింప దగదు. మనము కలిసికట్టుగ నీమెను చంపుదము. ఈమెను చంపి సుభూషిత యగు ఈ కన్యకను గ్రహింతము. సింహము చేతిలోని వస్తువును నక్క గ్రహించలేనట్లు మనకు తగిన కన్యకను గ్రహించుట కితడు తగినవాడు గాడు.''

అని యుధాజిత్తు కోపోద్రిక్తుడై పలికి శత్రుజిత్తుని సేన వెంట రాగా పోరుసలుప పూనుకొనెను. పిదప వారు లోహకార నిర్మితములై సానపెట్టబడిన వాడి ములుకులు సంధించి ఎక్కుపెట్టిన ధనువు నాకర్ణాంతము లాగి సుదర్శనునిపై నేసిరి. ఆ దుష్టబుద్ధి సుదర్శునునిపై బాణప్రహారము చేయగ సుదర్శనుడు నతనిని తీవ్ర బాణములతో క్షణములో నేల పడగొట్టెను. ఇట్లు పోరుసాగుచుండగ దుర్గాదేవి యగు చండిక తీవ్రకోపమున యుధాజిత్తుపై దారుణ శరములు ప్రయోగించెను. జగదంబిక యగు శివాదేవి నానా రూపములు దాల్చి నానా శస్త్రాస్త్రములతో సమరము సాగించెను. అంత శత్రుజిత్‌ యుధాజిత్తులు నిహతులై రథము నుండి నేల గూలిరి. వెంటనే జయ జయ దుర్గాదేవీ! యను హర్ష నినాదములు మిన్ను ముట్టెను. వారిరువుర చావు గని రాజులు విస్మయావిష్టులైరి. అట్లు రణమున తమ వైరులు నిహతులు గాగా సుభాహువు దుర్గతినాశని యగు దుర్గను పరమప్రతీతితో నీవిధముగ సంస్తుతించెను:

"జగద్ధాత్రీ శివా దుర్గా కామదా భగవతి యగు శ్రీదేవికి నేను ప్రణమిల్లుచున్నాను. శ్రీవిద్య శివ శాంత మోక్షద విశ్వవ్యాపిని యగు జగదేకమాత కంజలి ఘటించుచున్నాను. పరమశక్తివగు విశ్వమాతా ! దివ్యదేవీ! ఈ నా యల్పబుద్ధితో సుగుణ నిర్గుణములలోన నీ మార్గమేదియో యెఱుగలేకున్నాను. నీవు భక్తార్తిభంజనివి. నీ దివ్య సత్ప్రభావమును వినుతింప నేనెవ్వడను? ఓ దేవీ! నీవే వాగ్దేవతవు. సర్వజంతువులకు సర్వగతివి - సద్బుద్ధివి - మతివి నీవే. సకల మనోనియంత్రివి నీవే. నిన్ను సర్వాత్మత్వభావముతో నిత్యము నుతించుట కెటు సాధ్యపడును తల్లీ? అమ్మా! హరిహర బ్రహ్మలును సురవరులును నిన్ను విడువక సంస్తుతించుచున్నను నపారసుగుణవారాశివగు నీపారమెఱుగజాలకున్నారు. విషయగుణబద్ధుడను భిన్నమతిని నగు నేను నీ దివ్యసచ్చరితప్రభావ మెట్లెఱుంగగలను? ఈ చపలచిత్త మొకమట్టుకు నీ సచ్చరిత్రను నీ సత్సాంగత్యమును బడయ నేరదు. నీ సత్కథాప్రసంగముల మహిమవలన నవశ్యము చిత్తశుద్ధి యేర్పడును గదా! నా యల్లుని సత్సంగతి వలన నాకు నీ యద్భుత దివ్యసందర్శన భాగ్యమబ్బెను. దేనిని హరిహర బ్రహ్మలును దేవేంద్రాదిసురలును మునులును తత్త్వార్థ విదులును పరికాంక్షింతురో యట్టి నీ సుదర్లభ దివ్యసందర్శనము శమదమసమాధులు లేకయే నేడు నాకు తెలికగ లభ్యమైనది.

అంబా! మందమతి నగు నేనేడ? అద్వితీయమైన భవభేషజమగు నీ దయామృతవీక్షణము లేడ? భవానీ! దీన భక్తపరాధీనా! నీవు నీ పరమభక్తుల యైకాంతిక ప్రేమభక్తిని గని వారిపై దయామృతము గురిపింతువు. అమర పూజిత పాదపద్మవు నీవు. ఓ పరాదేవీ! నీ యద్భుత మహనీయత నెంతని వర్ణింతును? సుదర్శనుని విషమసంకటస్థితినుండి సముద్ధరించినదానవు. నీ వలన శత్రులు తుదముట్టిరి. భక్తానుకంపనశీల వగు నీ చరిత్రము పరమపవిత్రము. ఈ స్థాపరజంగమాత్మకమైన విశ్వప్రపంచములకు నీవు సర్వాధికారిణివి. పాలనకర్త్రివి. కనుకనే శత్రుల మూకలను చెండాడి ధ్రువసంధి కొడుకును దయతో బ్రోచితివి. ఇందాశ్చర్య మేమున్నది? నీ సేవాతత్పరులగు నీ భక్తుల కీరితి నీ మూలమున విస్తరిల్లినది. ఇట్లు నీవే నీ మహితచరితను రచించితివి. అట్లు కానిచో ననవద్య శీలుడగు సుదర్శనుడు శత్రులను గెలిచి కుశలమున నా సుతను చేపట్టుట సాధ్య మయ్యెడిదా? పాపపుణ్యరహితవు. సుగుణ నిర్గుణ స్వరూపవు. నీవు పరమ భక్తుల చేత నిచ్చట దివ్యమధురగానమున స్తుతి చేయబడుచుందువు. ఓ త్రిభువనేశ్వరీ! నీ సందర్శనమున నేను ధన్యజీవనుడనైతిని. నిన్ను భజించుటకు తగిన సద్బీజమంత్రము నేనెఱుగను. ఐనను నీ మహిమ నేడు విశ్వవిఖ్యాతి నందినది. 

Chapter 54 Sasikala Sudarshan's wedding - అధ్యాయము 54 శశికళా సుదర్శనుల వివాహము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 54

శశికళా సుదర్శనుల వివాహము

వ్యాసమునీశుడిట్లనియెను : ఆ యనిందితాత్ముడగు సుబాహువు తన కూతు పలుకు లాలకించి రాజులచెంతకేగి యిట్లనియె : 

"రాజులారా ! నేటికి మీమీ శిబిరముల కేగుడు. రేపు పెండ్లి జరుగగలదు. మీరు నాయందు దయయుంచి నాయొసంగు నన్నపానీయములు గ్రహించి ప్రసన్నులుగండు. రేపు ప్రభాతవేళకెల్లరు పెండ్లి వేదికకు రండు. అన్ని కార్యములును చక్కబడును. నేడు నా కూతురీ మంటపమునకు వచ్చుటలేదు. నేనేమిచేయుదును ? రేపెట్టులో యామె నొప్పించి రప్పింతును. నేటికి మీమీ విడుదుల కేగుడు. మతిమంతులు తమ యాశితులపట్ల నిగ్రహము బూనరు. మీరు నాపై నా సంతుపై దయపూనవలయును. రేపుదయమున నా కూతు నొప్పించి రప్పింతును. నేటికి యథేచ్ఛగ జనుడు. ఏదైన నిచ్ఛాపణ మేర్పరచి రేపు ప్రభాతకాలమున సకల రాజలోకము సమక్షమున నెల్లర యనుమతితో వివాహ మంగళకార్యము జరుపుదును అను సుబాహువు పలుకులాలకించి అవి నిజమని భావించి రాజులు తమతమ విడుదులకేగిరి. నగర రక్షణ జరిపి మాధ్యందిన కృత్యములు నిర్వహించిరి. 

అంత సుబాహు వార్యజనుల రావించి వేదవిదులగు పురోహితులతో రహస్యమందిరమున తన పుత్రికకు వివాహము జరిపించెను. అందరు నా వరునకు మంగళస్నాన మొనరింపజేసిరి. వివాహ భూషాలంకృతు నొనరించిరి. రాజు వరుని పెండ్లిమంటపమునకు గొనివచ్చి యతనికి తగిన పూజాదివిధు లొనరించెను. మహాసత్త్వుడగు సుబాహువు వరున కాసనాచమనములు అర్య పాద్యములు వస్త్రద్వయము కుండలములు గోవు నొసంగి విధిగ కన్యాదానము సంకల్పము చేసెను. వరుడన్నిటిని నిశ్చలముగ స్వీకరించెను. ఆ సమయమున మనోరమ చిత్తము చింతారహితమయ్యెను. నవనిధిశాలియగు కుబేరుని కన్యవలె నలరు రాచకన్నియను గాంచి యామె తన్ను ధన్యగ నెంచుకొనెను. ఆపుడు మంత్రులెల్లరు భయరహితులై ముదము నిండార సలక వస్త్రభూషణ భూషితుడు పూజితుడు నైన వరోత్తముని కౌతుక మంటపమునకు గొనివచ్చిరి.

అపుడలంకరణ నిపుణలగు నెఱజాణలు రాచకన్నియనలంకరింపజేసి వరవాహన మెక్కించుకొని వేదులతో గూడిన మంటపమున నలరుచున్న వరుని సన్నిధానమునకు గొనివచ్చిరి. ఇట్లు వైవాహిక మంగళములతో సంస్కరింపబడిన వధూవరులను వైవాహిక మండపమునకు రావించిరి. పురోహితు లగ్నిని ప్రతిష్ఠించి హోమములు జరపిరి. దంపతులు లాజహోమము జరిపి విధ్యనుసారముగ నగ్నికి ప్రదక్షిణ మొనరించి తమ కులవంశ సంప్రదాయానుసారముగ నచట జరుగదగు యథోచిత క్రియలు నెరవేర్చిరి. సుబాహువు అల్లుడగు సుదర్శనునకు పెండ్లికట్నము క్రింద గుఱ్ఱములపూన్చిన రెండు నూర్ల రథములను బాణములు గల యమ్ముల పొదిని సువర్ణభూషితములై పర్వత శిఖరాలవంటి నూటయిరువదియైదు మత్తగజములను బంగారముతో నలంకృతములైన దాసీశతమును నూఱాడుఏనుగులను భూషణముల నాయుధముల దాల్చిన వేయిమంది దాసజనమును రత్నములను మేలైన చిత్రములైన యున్ని వస్త్రములను రమ్యములు చిత్రములునైన వాసగృహములను సింధుదేశీయములైన రెండువేల మంచి గుఱ్ఱములను బరువులు మోయుటకు మున్నూరొంటెలను ధాన్యముతో నిండిన రెండువందల బండ్లను సమర్పించెను. ఆ పిమ్మట నాతడు రాజసుతయగు మనోరమకు కేలుమోడ్చి "యోవరిష్ఠా! నేను నీ దాసుడను. నీ మదిలోని యభిప్రాయము వెల్లడింపు" మనెను.

అపుడు మనోరమ మధుర వాక్కులతో రాజున కిట్లనెను "నీకు మేలగుత! నీ కులవృద్ధియగుగాక! నీ కన్యారత్నమును నా కుమారున కొసంగి నన్ను సమ్మానించితివి. రాజా! నిన్ను గొప్పగ పొగడుట కేను వందిమాగధుల పుత్త్రినిగాను. స్వజనమైన మీవంటి పెద్దలను నేనేమి స్తుతింపగలను? నీ యుత్తముడు వియ్యంకుడునగు భూపతిచే నా కొడుకు మేరుతుల్యుడుగ చేయబడెను. నీ చరిత్రమెంతయు పవిత్రము! ఎంతయు నుదాత్తము! ఎంతయు విచిత్రము! నేనేమని పలుకుదును? రాజ్యభ్రష్టుడగు నా సుతునకు యోగ్యమగు నీ కన్య నొసంగితివి. వచ్చిన రాజులనెల్లర త్రోసిరాజని వనవాసి నిఱుపేద పితృశూన్యుడు సేనావిహీనుడు ధనరహితుడు నగు నా కొడుకునకు నీ కూతునొసంగితివి. ఏ రాజైన తన కన్యకను సమాన కులబలధనములు గలవానిని చూచి యిచ్చును. అర్థహీనుడగు నా కొమరునకు రూపగుణ సంపన్నయగు కన్నియ నెవడిచ్చును? మహాబలశాలురగు నిందఱ రాజులతో వైరమూనియు సుదర్శనునకు నీ కూతునొసంగితివి. ఆహా! నీ ధైర్యమెంతయు శ్లాఘనీయము.''

అను మనోరమ మాటలు విని రాజు మర్షమున దొసిలి యొగ్గి మరల నామె కిట్లనియె : ఇదిగో నా రాజ్యము గొమ్ము. నే నీకు సేనాపతిగ నుందును. కానిచో నా సగము రాజ్యము గొని నీ సుతునితో రాజ్యఫల మనుభవింపుము. పవిత్రమైన కాశీ నివాసభాగ్యము వదలి మీరు వనముననో పురముననో యుండుటను నా మన సొప్పదు. ఈ రాజులు రోషాగ్నులు గ్రక్కుచున్నారు. తొలుత వీరిని శాంతింపజేయవలయును. కానిచో దానభేదములు నెఱపవలయును. అవియు లాభము లేనిచో చివరకు మిగిలినది పోరుండనే యున్నది. జయాపజయములు దైవాధీనములు. ఐనను ధర్మమునకే విజయము గలుగును గాని యధర్మమునకు గాదు. కాన నధర్మపరులగు రాజులకు విజయ మెట్లు చేకూరును? అను నర్థవంతములైన రాజు మాట లాలకించి మనోరమ సర్వాత్మత్వభావముతో మోదభరితయై యభిమానముతో మరల హితవచనము లిట్లు పలికెను. "ఓ రాజా! నీకు భద్రము గల్గుగాక! నీవు భయము పాసి నీ సుతులతోగూడి రాజ్య మనుభవింపుము. నా పుత్రుడు సాకేతపురికి రాజయి సుఖముగ నుండగలడు. మమ్ము మా నివాసమునకు సాగ నంపుము. శ్రీభవానీదేవి నీకు మంగళ మొనగూర్చుగాత! నేను నిరంతర మా పరమాంబికదేవిని సంస్మరించుచుందును. ఇంక నాకు చింత యెక్కడిది?'' ఈ రీతిగ వారిరువురి మధురిమ లొలుకు సంభాషణ సాగుచుండగ నంతలో రేయి గడచెను. మరునాడుదయమున రాజు లెల్లరును అప్పటికే పెండ్లి జరుగుట విని రోషముతో నగర బహిఃప్రదేశ మేగి యిట్లు పెద్దగ కేకలు వేసిరి: 

"మన మిపుడు నృపకలంకుడు వివాహమున కయోగ్యుడు నగు సుదర్శనుని వధింతుము. ఆ శశికళను గ్రహింతుము. కానిచో నింత సిగ్గుతో మన యిండ్ల కెట్లేగగలము? ఇదిగో వినుడు. తుముల తూర్య వాద్య రవములు. మృదంగ శంఖధ్వనులు వివిధ గీతానినదంబులు వేదఘోషలు వినిపించుచున్నవి. వీనిని బట్టి రాజు వివాహము జరిపించెనని తెలియుచున్నది. ఇతడు మనకు పెక్కు తీయని మాటలు చెప్పి నమ్మించి మోసగించి వైవాహిక విధులతో యథావిధిగా పెండ్లి జరిపించెను. ఇపుడు మన ప్రస్తుత కర్తవ్య మేమో రాజుల మెల్లర మేకమతితో నాలోచించి యుచితమైన దానిని నిర్ణయింతము."

అట్లు రాజులెల్లరు తమలో తామనుకొండుచుండిరి. అంతలో నప్రతిమ ప్రభావుడగు సుబాహువు వివాహవిధి నెరవేర్చి ప్రసిద్ధ ప్రభావులైన తన మంత్రుతో కూడి రాజుల నాహ్వానింప బయలుదేరెను. తమచెంత కేతెంచు కాశీపతిని గాంచి రాజు లేమియు బలుకక మిన్నకుండిరి. సుబాహువు వారిని జేరి దోయిలించి యిట్లనెను. "నృపతు లెల్లరును మా యింటికి భోజనమునకు రండు. నా కన్య సుదర్శనునే వరించినది. ఇక మంచి చెడ్డలకు నేను కర్తను గాను. మీరు కడు మహాత్ములు. దయాళురు. శాంతి వహింపుడు'' అను సుబాహువు మాటలు విని "రాజా! మేము బాగుగనే భుజించితిమి లెమ్ము. ఇక నీ యింటికి నీవు వెళ్లుము. మిగిలిన కార్యము చక్కగ నొనరింపజేయుము. మీరు మిక్కిలి సుకృతము చేసితిరి. ఇక మేమే మా మా యిండ్ల కేగుదు'' మనిరి. ఆ రాజు మాటలు విని సుబాహువు కోపసముద్విగ్నులైన వీరేమి ముప్పు తల పెట్టుదురో కదా యని యనుమానించుచు తన నివాసమున కరిగెను. అట్లు రాజేగిన పిదప రాజు లెల్లరును గూడి మార్గ మడ్డగించి సుదర్శనుని జంపి కన్యను గొన ప్రతినబూనిరి. అందు కొందఱు మంచివారు 'మన కతనితో నేమి పని? పెండ్లి వేడుక కన్నారగని తిరిగి యేగుద'మనిరి. కాని, యది యంగీరింపని రాజు లెల్లరు త్రోవ నడ్డగించి నిలిచిరి. కాశీపతియు తన గృహమున కేగి తరువాతి కార్యములు యథావిధిగ జరిపించెను.

అధ్యాయము 55 శ్రీదేవి ప్రాదుర్భవించి సుదర్శనుని గాపాడుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 53 Subahu worries about Sasikala's marriage - అధ్యాయము 53 సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 53

సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట

వ్యాసముని తిలకు డిట్లనియె: ఆ విధముగ శశికళ పలుకగ సుబాహు వాలకించి చింతాకులితుడై తన కర్తవ్యమేమని దిగులొందెను. మహాబలశాలురగు భూపాలురు సేనా పరిగ్రహములతో పోరు సలుపవచ్చి యాసనములందు గూర్చుండిరి. ఇట్టి తరుణమున నా కూతురు సభామధ్యమునకు రానని పల్కినచో దుష్టులగు రాజులందఱును కుపితులై నన్ను వధించి తీరుదురు. ఈ రాజుల నందర నోడింపగల సేనాదుర్గబలము నాకడ లేదు. ఈ సుదర్శనుడు బాలుడు - నిర్ధనుడు - ఏకాకి - నిస్సహాయుడు. ఇక నేనేమి చేయుదును? నేనిపుడు కడు దుఃఖసాగరమున మున్గితిని. ఇట్లు చింతావశుడైన సుబాహుడు రాజుల సన్నిధికేగి సవినయముగ చేతులు జోడించి వారికిట్లనియెను : 

"నృపులారా! నేనిపుడేమి చేయుదును? నా భార్యయు నేను నామెకెంతయో నచ్చచెప్పి చూచితిమి. కాని నా కూతురీ సభామంటపమునకు రాననుచున్నది. నేను మీ పాదాలమీద నా తల యుంతును. నేను మీ దాసుడను. మీరు నేచేయు పూజాదికములు స్వీకరించి మీమీ నెలవులకు జనుడు. మీకు పలువిధములైన తేరులను గజములను వస్త్రములను రత్నరాసులను సమర్పింతును. దయచేసి వానిని స్వీకరించి మీమీ నెలవులకు జనుడు. నా బాలిక నా వశము దాటిపోయినది. ఆమె ఖేదపెట్టబడినయెడల మరణించినచో నాకుగొప్ప దుఃఖము కలుగునని చింతాక్రాంతుడనైనాను. మీరలు మహా తేజోవంతులు. దయామయులు. భాగ్యవంతులు. దుర్వినీతయు మందమతియునగు నా కూతుతో మీకేమి ప్రయోజనము? నే నెల్లభంగుల మీ దాసుడను. నన్ననుగ్రహింపుడు. నా కూతును మీ కూతుగ బావింపుడు" అను సుబాహుని దీనవాక్కులు విని యెవ్వరేమియు బలుకక మిన్నకుండిరి. అపుడు యుధాజిత్తు క్రోధతామ్రాక్షుడై యిట్లనెను:

"ఓ రాజ! నీ వెంతటి మూర్ఖుడవు? ఎంత నింద్య మొనరించితివి? నీకు సందిగ్ధముగనున్న విషయమున మోహము కొలది ఇంత గొప్పగ స్వయంవరము నెందులకు చాటించితివి ? నీవు ఇందఱు రాజుల నాహ్వానించితివి. ఇపుడు వారిని వారివారి యిండ్ల కేగుమనిన వారూళ్లకెట్లేగ గలరు? ఇందఱ రాజులను తృణీకరించి సుదర్శనునకే కన్య నీయదలంచితివి. ఇంతకంటె ననార్య కృత్య మింకేమి యుండును? మేలు గొరు నరుడు మొదటనే చక్కగా విచారించి చేయదలచిన కార్యము నారంభింపవలయును. నీ వెఱుగ కిట్లొనర్చితివేల? నీ విపుడు బలవాహనోపేతులగు నిందఱ రాజులను త్రోసిరాజని సుదర్శను నెట్లు వరునిగ గోరుదువు? ఇపుడు మొట్టమొదట పాపిష్ఠుడవగు నిన్ను హతమూర్తును. పిమ్మట సుదర్శనుని తుద ముట్టింతును. ఆ పిదప నామనుమనికి నీ కన్య నిత్తును. ఇది నా నిశ్చయము. నేనుండగ కన్నియను హరింపగల మగధీరుడెవ్వడు? ఆ సుదర్శనుడు నిర్ధనుడు - బాలుడు. నా ముందడాతడెంత? ఆ నాడు భారద్వాజాశ్రమమున ముని వాక్కులచే నా నుండి యతుడు బ్రతికి బయటపడెను. ఇపుడు మాత్రమతని నెల్లవిధముల బ్రతుక నీయను. కనుక నీవిపుడు వెళ్ళి నీ భార్యతో కూతుతో చక్కగ నాలోచించుకుని వరానన యగు నీ గాదిలి కూతును నా మనుమనికిమ్ము. మనోరమ యగు ఈ నీ పుత్రికను మాకిచ్చి మా వియ్యంకుడవుకమ్ము! శ్రేయము గోరువాడెల్లవేళల మాహదాశ్రయము నాచరింప వలయును జుమా! ప్రాణప్రియ యగు నీ గారాబు పట్టిని రాజ్యములేక దిక్కుమ్రొక్కు లేనివానికిచ్చి యేమి సుఖము బడయగోరుదువు? కన్యను కులబల రూపములు మిత్ర రాజ్యవిత్త దుర్గములు గల వానిని జూచి యీయవలయును. కానిచో కన్య సుఖింపజాలదు. నీవు శాశ్వత ధర్మమును రాజనీతిని బాగుగ పరిశీలించి తగిన కార్య మొనరిపుము. ఊరక బుద్ధిని చెడగొట్టుకొనకుము. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవు. కాన నింతగ హితము చెప్పుచున్నాను. నీవు వెంటనే చెలులతో గూడిన నీ కూతు నీ సభామంటపమునకు రప్పింపుము. ఆమె సుదర్శను దక్కఇతరు నెవ్వరినైన వరించవచ్చును. నాకది సమ్మతమే. అపుడు నీ కోర్కిమేరకు పెండ్లి జరుగును. ఇతర రాజులెల్లరు కులీనులు; బలవంతులు; సములు. వారిలో నెవరి నే నొక్కని వరించిన నింక విరోధ మెక్కడిది? అట్లు కానిచో పగబూనుట మంచిదిగాదు. వెళ్ళి కార్యము చక్కబెట్టుము."

ఇట్లు యుధాజిత్తాదేశింపగ సుబాహువు శోకసంతప్తుడై నిట్టూర్చుచు తన భార్యతో - ఇపుడు మనకు ఘోరవిపత్తు సంభవించెనని మన కూతుతో జెప్పుము. నేనిపుడు నీకు వశుడను. నాకు కర్తవ్యము తోచుటలేదు అనెను. రాణి తన పతిమాట లాలించి కూతుచెంత కేగి యిట్లనియెను : 

"పుత్త్రీ ! నీ మూలమున నీ తండ్రి దుఃఖాలపాలయి యున్నాడు. నీ నిమిత్తముగ రాజుల మధ్య పోరాటము సంఘటిల్లనున్నది. కాన సుదర్శనుని దక్క మఱియొక్కని వరింపుము. ఒకవేళ నీవు నీ మొండిపట్టుదలతో సుదర్శనునే వరించినచో యుధాజిత్తు తన బలము నుపయోగించి మనలనందఱ నూచకోతగ కోసివేయును. ఆ యుధాజిత్తు బలమత్తుడు-ప్రతాపి. అతడు సుదర్శనుని కూడ చంపును. అపుడైన నీకు వేరొకపతి కావలసివచ్చును. కనుక నీవు నామేలు గోరుదువేని ఆ సుదర్శనుని దక్కొరుని నృపతి కుమారుని వరింపుము" అని తల్లి బోధించుచున్నంతలో సుబాహువేతెంచి తానునట్లే ఆమెకు నచ్చచెప్పెను. ఆ తల్లిదండ్రుల మాటలాలకించి శశికళ యిట్లనియెను. "పీసరేశ్వర! నీవు పలికిన దంతయు నిజమే కాని నా వ్రతము గూడ నీకు దెలియనది కాదుకదా? నీవు రాజుల వలన భయపడినప్పటికిని నేను మాత్ర మెట్టి పరిస్థితిలోను సుదర్శనుని గాక యితరుని వరింపజాలను. కనుక నీవు నన్ను సుదర్శనునకు ధారపోసి మమ్ము పురము వెడల సాగనంపుము. అతడు నన్ను రథమెక్కించుకొని స్వేచ్ఛగ పయనించగలడు. అనంతర మేది కానున్నదో యది జరిగి తీరును. భవితవ్యమును గూర్చి యింతగ జింతింపవలదు. కానున్నది కాకమానదు. ఇందు సందియ మెందులకు?''

రాజిట్లనియెను: ఓ పుత్రీ! మతిమంతులెప్పుడైన నతిసాహసముగ ప్రవర్తింపరు. పెక్కుమందితో వైరము తగదని వేదవిదులు వచింతురు. ఆ రాచకొమరునకు నిన్నిచ్చి యెట్లు సాగనంపగలను ? వైరభావముగల రాజులేదైన మూర్ఖించి చేయగలరు. కనుక నీకిష్టమైన నేదైన పణమేర్పరతును. తొల్లి జనకుడు సీతాస్వయంవరమునకు శివధనుర్భంగమును పణముగ నుంచలేదా ! ఇపుడు నేను నేదైన కఠినమగు పణమేర్పరతును. దానివలన రాజుల వివాదమణగి శాంతి యేర్పడును. ఒడ్డిన పణము నెవడు గెల్చునో యతడు నీ పతి కాగలడు. అతడు సుదర్శనుడు గావచ్చు ; లేక మరొక్క బలశాలి కావచ్చును ఆ పణములో గెలుపొందినవాడు నిన్ను తప్పక వరించి తీరును. అట్లు జరిగినపుడు రాజుల వివాదమును శాంతించును. ఆ పిమ్మట నీ వివాహము చక్కగ సుఖపూర్వకముగ నొనర్పగలను.

కన్య యిట్లనెను : నేను సందేహములో బడదలంపను. నీవన్నట్లు చేయుట మూర్ఖులపని. నా యంతరంగములో మొట్టమొదట సుదర్శనుని సురూపమును నిశ్చలమతితో నొల్పుకొంటిని. పుణ్యపాపములకు కారణము మనసేకదా! నా యణువణువున మూర్తీభవించి యున్న వానిని వదలి మరొకరినెట్లు వరింపగలను? పణమేర్పరచినచో నేనందఱకును వశవర్తిని గావలసి వచ్చును. ఒకవేళ మన యొడ్డిన పణము నిద్దరు లేక పెక్కురు గెలిచినచో నప్పుడైన వివాదము తలయెత్తునుగద ! అపుడు మన కర్తవ్యమేమి? నా బుద్ధి సంశయాస్పదమైన పనిలో జిక్కుకొనదు. కాన రాజా ! చింతవదలి నన్ను సుదర్శనునకు ధారపోయుము. నీవు మా వివాహమును విధిగ జరిపింపుము. ఏ దేవదేవి మధుర దివ్యనామ సంకీర్తనమున సకల దుఃఖరాసులు నశించిపోవునో యా చండిక మనకు మేలు చేకూర్చును. ఆమెదీవెన మాకు తోడు. ఆ క్రియాశక్తిని నెమ్మదిలో గట్టిగ నమ్మి యప్రమత్తతతో కార్యమునకు బూనుకొనుము. నీవారాజులకు నమస్కరించి యంతయు నిట్లు దెలుపుము : 

ఱేపు రాజులెల్లరు స్వయంవరమునకు రావలయును అని యాదేశించి వారిని వీడ్కొలుపుము. ఈ రాత్రియే వేదోక్తవిధిగ వివాహము జరిపించి యథాశక్తి కానుకలొసంగి సుదర్శనుని వీడుకొలుపుము. ఆ ధ్రువసంధి సుతుడు నన్నుగైకొని యేగునంతలో నొకవేళ రాజులు రోషాతిరేకమున రణముసలుప నిశ్చయించి వత్తురు. ఐనను ఆ చండికాభగవతి మాకు తోడునీడగ నిలిచి కరుణజూపి సాయమొనర్పగలదు. అపుడు సుదర్శనుడు వైరిరాజసుతులతో యుద్ధ మొనరింపగలడు. దైవ దుర్విపాకమున నతడు మరణించినచో నతడితోడ నేనేను చత్తును. కనుక నన్నతనికొసంగి సేనలతో నిశ్చింతగ నుండుము. అతనితోడ నేనొక్కతేనే క్రీడింపగోరి యేగగలను అను తన కూతు మాటలు విని రాజామెకు వివాహమొనరింప దలంచెను.

అధ్యాయము 54 శశికళా సుదర్శనుల వివాహము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 52 Controversies about Swayamvara - అధ్యాయము 52 స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 52

స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు

వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను : ఈ విధముగ కేరళాధిపతి వాదింపగా యుధాజిత్తు మరల నిట్లనియెను : 

"ఓ భూపాలా! ఈ రాజ సమాజమునందు సత్యవాది జితేంద్రియుడు అని పేరొందిన నీవు పలుకునది నీతియేనా? యోగ్యులైన నరపతు లిందఱుండగ కన్యారత్నము విషయమున అయోగ్యుడు తగియుండునా? ఇట్టి న్యాయము నీకు రుచించును. మఱి యితరులకు రుచించదు. సింహము పాలి సొమ్ము నక్క యెట్లనుభవించగలదు? రాజులపాలి యీ కన్యారత్నమును సుదర్శను డెట్లనుభవింపగలడు? విప్రులకు వేదము బలము. క్షత్రియులకు చాపము బలము. కాన నిట నేను అన్యాయ మేమి చెప్పుదును? వివాహముందు రాజులకు వీర్యమే శుల్క మగుట ప్రసిద్ధమేగద! బలవంతుడే కన్యను గ్రహింపవలెను. బలహీనుడెప్పుడును గ్రహింపరాదు. కాన నిపుడు కన్యను పణముగ నుంచుటయే నీతి. కాదేని రాజలోకమున పెద్ద కలవరము బయలుదేరును. ఈ విధముగ రాజుల మధ్య వాద వివాదములు చెలరేగగా నృపోత్తముడగు సుబాహు నృపతి సభామధ్యమునకు బిలువబడెను. తత్త్వవిదులగు రాజులెల్లరు సుబాహుని బిలిచి, ఓ రాజా! నీ వీ వివాహమున జక్కని నీతి పాటింపవలయును. నీవు చేయదలచిన కార్యము మాకు సమాహిత మతితో దెలుపుము. నీ మదిలో నీ పుత్రిక నెవ్వని కీయదలంచితివో నిక్కము బలుకుమనిరి. నా కూతురు తన మదిలో సుదర్శనునే పతిగ వరించినది. నేను వలదని యెంత చెప్పినను నా మాట వినుటలేదు. ఇంక నేనేమి చేతును? నా కూతురు మనసు నా వశమందు లేదు. సుదర్శనుడొంటరిగ నిరాకులుడై యేతెంచెను అని సుబాహుడనెను.

అపుడు శిష్టులైన రాజులందఱు సుదర్శనుని రావించిరి. అతడేకాకియై శాంతుడై రాగా వారతని కిట్లు నెమ్మదిగా బలికిరి : 

"మహాభాగా! రాకుమారా! సువ్రతా! నిన్నెవరు పిలువగ నీ రాజుల సమాజమున కొంటరిగ నురుగుదెంచితివి? నీ చెంత సైన్యముగాని సచివులుగాని కోశముగాని మహాబలముగాని లేదే? మరియేల వచ్చితివో యథార్థము తెల్పుము. ఎల్లరాజులును యుద్ధకాములై సేనాసమేతులై కన్యకార్థము వచ్చిరి. నీవొక్కడవిక్కడ వట్టిచేతుల నేమి చేయవచ్చితివి? నీ సోదరుడు మహాసైన్యము వెంటబెట్టుకొని నిన్ను హతమార్చ వచ్చియున్నాడు. అతనికి యుధాజిత్తు సాయము చేయ వచ్చియున్నాడు. నీవున్న నుండుము. పోయిన పొమ్ము. నిజము చెప్పుము. నీవు బలహీనుడవై యున్నావు. కాన నీకు తగినొట్లనరింపుము. 

సుదర్శుడిట్లు పలికెను : ఇపుడు నా చెంత సుహృన్మిత్రులుగాని రాజభటులుగాని కోశముగాని దుర్గబలముగాని సాయమొనర్చువారుగాని ఎవ్వరును లేరు. ఇచట జరుగు స్వయంవరమును చూచు వేడుకతో నేతెంచితిని. కలలో భగవతి యగు శ్రీదేవి చేత ప్రేరితుడనైతిని. ఇందు సందియము లేదు. నా మదిలో మరెట్టి కోరికయు లేదు. అన్నియు నా తల్లియే నాకు జెప్పెను. నా తల్లి పలికిన పలుకు అక్షరాల జరిగి తీరును. నాకీ ప్రపంచమందంతట శత్రు వెవ్వడును లేడు - నాకెల్లెడల నెల్ల ప్రాణులందాభవానియే ప్రత్యక్షముగ గనంబడుచున్నది. నృపులారా! నాతో నెవడైన బగబూనినచో వానిని ఆ మహావిద్య దండించి తీరును. నేనుమాత్ర మెవ్వనితోడను శత్రుత్వము బూనను. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. వేరుగ జరుగదు. నేను దైవాధీనుడను - నాకింత చింత యెక్కడిది?

సురనరాది సకల భూతములందు నిరంతర మా దివ్య చైతన్యశక్తి విరాజిల్లుచుండును. ఆ శక్తి తలంపునకు భిన్నముగ నేదియును జరుగుటకు వీలులేదు. ఆ తల్లి తలచుకొన్నచో నెవ్వనినైన నిఱుపేదనైన రాజుగ చేయగలదు. నాకింక లేనిపోని చింతయేల? ఆ పరాశక్తి - జనని - దయలేనిచో దేవతలును హరిహర బ్రహ్మలు కూడ కదలశక్తులుగారు. ఇక నాకీ చింత యేటికి? నేనశక్తుడనో సుశక్తుడనో యెట్టివాడనో యట్టివాడను. నేనీ స్వయంవరమునకు ఆ జగన్మాతృ నానతి చేత వచ్చితిని. ఆ తల్లి యేది దలచిన నది చేసితీరును. ఇంక నడుమ నాకెందులకు విచారము? ఈ విషయమై శంకింప పనిలేదు. నేను చెప్పినది అంతయును సత్యము. జయాపజయముల విషయమున లేశమైన నాకు లజ్జ గలుగదు. నేనా తల్లి కధీనుడను. నాకేదైన లజ్జ కల్గిన నది ఆమెకే కలుగును. సుదర్శనుని వచనము లాలకించి నరపతు లొండొరుల మొగములు చూచుకొని నిశ్చితమతులై యతని కిట్లనిరి: 

"ఓ సాధూ! నీ పలికినదంతయు నిజమే. అందులో సందేహమేమియు లేదు. కాని యుజ్జయినీపతి నిన్ను చంపుటకు చూచుచున్నాడు. నీ ఆచరణ చూచి నీమీది దయకొలది చెప్పుచున్నాము. నీకేది యుక్తమని తోచునో యది మనస్సులో చక్కగ విచారించి యాచరింపుము.

సుదర్శనుడిట్లనియె : ఓ నృపతులారా ! కృపాళురు సుహృజ్జనులునైన మీరు నిజము పల్కితిరి. నేనింక పలుక వలసినది లేదు. ఐనను చెప్పుచున్నాను. ఒకనిచావు మరొకని వలన నెన్నడు సంభవింపదు. స్థావర జంగమాత్మకమగు నీజగమంతయును దైవాధీనమే. ఈ జీవుడు సంతతమును స్వవశమునుండక కర్మ పరాధీనుడై యుండును. తత్త్వవిదులగు విబుధులు కర్మ ముత్తెఱంగుల నుండు నందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధము ననబరగును. ఈ బ్రహ్మాండమంతయును కాలము కర్మము స్వభావము వీనితో నిండి యున్నది. దేవడు గూడ కాలము రాని వానిని చంపజాలడు. కాని సనాతనమైన కాలము నిమిత్త మాత్రమున హతుడైన వానిని చంపివేయును. శత్రునిషూదనుడగు నా తండ్రి సింహము చేత నిహతుడయ్యెను. నా మాతామహుడును యుధాజిత్తు చేత చంపబడెను. కోటి ప్రయత్నములు చేయుచున్న వాడును దైవయోగమున వాయువు మూడిన నాడు చచ్చి తీరును. ఒకడు (నేలపై నూకలున్నవాడు) రక్షణ లేకున్నను దైవేచ్ఛచే వేయేండ్లు జీవింపగలడు. ధర్మిష్ఠులగు నృపులారా! యుధాజిత్తునకు నే నేనాడును భయపడుటలేదు. నేనన్నిటికి ఆ దైవమే పరమమని భావించి నిబ్బరముగ నున్నాను. నేను నిరంతరముగ నిత్య మాపరమ భగవతి మధురనామ సంస్మరణము చేయుచున్నాను. ఆ జగదేకమాత దేవి నాకు తప్పక కళ్యాణము జరుపగలదని దృఢముగ నాశించుచున్నాను. జీవుడు శుభమునుగాని - యశుభమునుగాని తన పూర్వార్జిత కర్మఫలమునే - యనుభవించును. అతడు స్వయంకృతము ననుభవించుచుండును. ఇది యెరిగిన జ్ఞానికి శోకమెట్లు గల్గును? బుద్ధిలేని మూఢుడు తన కర్మఫలానుసారముగ దుఃఖము లనుభవించుచు నల్పబుద్ధియగుటచే నా దుఃఖములకు నిమిత్త కారణమైన పరులతో పగ పెంచుకొనును. నాకు వైరమును శోకమును భయమును లేవు. కనుకనే నేను నిశ్శంకముగ నీ రాజన్యుల నడుమకు రాగలిగితిని. నేనీ యుత్తమ స్వయంవరమును వీక్షించు కాంక్షతో శ్రీ చండికాదేవి యనుమతి బడసి యేతెంచితిని. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. నాకు పరమ భగవతి వచనమే యన్నివిధాల ప్రమాణముగ మదిలో నమ్మియున్నాను. ఇంకెవ్వరిని నమ్ముట లేదు. నా తల్లి నాకు కలుగచేసిన సుఖముగాని దుఃఖముగాని వేఱుగ కాదు. నదియు ఆ యుధాజిత్తునే సుఖము బడయనిండు. నాకు మాత్ర మతని పట్ల ఎట్టి వైరము లేదు. నా యందెవ్వనికైన వైరమున్నచో దాని ఫలము నతడనుభవించి తీరును.

సుదర్శనుని మాటలకు రాజులు సంతసిల్లిరి. అతడును తన యాశ్రమమున కేగి సుఖముండెను. మరునాడు శుభసమయమున రాజులెల్లరును తన సుందర భవనమునకు రావలసినదిగ సుబాహువు ఆహ్వానించెను. రాజులందఱును శుభాలంకారములతోనేతెంచి శుభాసనములతో రచింపబడిన పీఠములపై నాసీనులైరి. వారు దివ్యవేషధారులైన విమానములందలి దేవతలో యన విరాజిల్లుచు స్వయంవరము నవలోకించు వేడుకతో నుండిరి. ఆ రాచకూతు రెప్పుడెప్పుడు వచ్చునో యామె శ్రుతకీర్తి భాగ్యవంతుడునైన యేరాచకుమారుని వరించునో యని యెల్లరును దారితెన్నులు చూచుచుండిరి. ఒకవేళ నామె సుదర్శనునే పూలమాలతో నలంకరించినచో రాజలోకమునందు నిస్సంశయముగ కల్లోలము బయలుదేరును. ఇట్టు లాసనములందున్న నరపతులు తలపోయుచున్నంతలో మంగళవాద్యఘోషములు చెలరేగెను. అంత శుచిస్నాతయై శుభ్ర వసనములును సొమ్ములును దాల్చి మధూక పుష్పమాలిక చేతబూని తన కూతురు రాగా లక్ష్మివలె నొప్పుచు వివాహ యోగ్య లక్షణములు గల్గి సువసనములు దాల్చి చింతలో మునిగిన తన కూతును జూచి నగుచు సుబాహువామె కిట్లనియెను : 

"పుత్త్రీ! లెమ్ము. శుభసుమమాల చేబూనుము. ఈ రాజుల సమూహము బాగగ పరికించి చూడుము. ముందునకు సాగుము. ఇందఱిలో గుణవంతుడును కులీనుడును రూపసంపన్నుడునగు నే రాకుమారుడు నీ చిత్తమునకు నచ్చునో యతనినే వరింపుము. దేశదేశాలనుండి వచ్చిన రాజు లున్నతాసములం దుపవిష్టులై యున్నారు. వారినందఱిని చక్కగ గాంచి నీ కిష్టమైనవానినే వరింపుము.

తన తండ్రి మాటలు విని మితభాషిణియగు నా కన్య ధర్మసమ్మతమైన లలిత వచనము లిట్లు పలికెను : "తండ్రీ! కాముకులును సామాన్యులునగు పురుషులను కన్నెత్తియైనను జూడను. తండ్రీ! స్త్రీచే నొక్కరుడే చూడదగినవాడుకాని వేరొకరిని చూడగూడదని ధర్మశాస్త్రమున నేను వింటిని. ఎవ్వతె పెక్కుమందితోడ గూడునో దాని సతీత్వము చెడిపోవును. అట్టి దానిని గని యందఱును నిది నాదిగనైన బాగుగనుండునని లోలోన దలంచుదురు. ఒక స్త్రీ తనచేత పూలమాలగొని యెప్పుడు స్వయంవర మంటపమెక్కెనో యప్పుడామె కులటవలె సర్వ సామాన్యగ తలంపబడును. ఒక వారవనిత వీథికేగి యచట గల నరుల జూచి వారి మంచి చెడ్డలను గూర్చి తనలో భావించుకొనుచుండును. కాముకు ననేక భావములతో వ్యర్థముగ గనుచుండు వారకాంతవలె నేను స్వయంవర మండపమునకు వచ్చి వారకాంతా కృత్యమును చేయవలయునా! పెద్దల చేత నిర్ణీతమైన యిట్టి స్వయంవర ధర్మమును నేను పాటింపజాలను. నేను వ్రతనిష్ఠను పూని ఇపుడు పత్నీవ్రత మాచరింపగలను. ఒక సామాన్యకాంత మండపమున కేతెంచి తన మదిలోన పెక్కురీతుల సంకల్పించుకొని యందొక్కని వరించునట్లు నేనిపుడు పతివ్రతనై యెట్లు చేయగలను? పూర్వము సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించితిని. అతనినిగాక యితరుని వరింపజాలను, తండ్రీ! నీవు నా మేలుగోరు దేనియొక శుభముహూర్తమున వివాహ విధిప్రకారముగ నన్ను సుదర్శనునకు కన్యాదాన మొనరింపుము.

అధ్యాయము 53 సుబాహువు శశికళ వివాహమునుగూర్చి చింతిల్లుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 51 Sudarshana Came to Swayamvara - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 51

సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు చిరుగనవు కల తన చిన్నారి కూతును తొడపై కూర్చుంబెట్టుకొని ఊరడించుచు మృదువచనముల నిట్లు పలికెను. సుదతీ! సువ్రతా! నాకు ప్రీతికరముగాని వ్యర్థపు పల్కు పలికెదవేల? నీ యీ మాటలచేత నీ తండ్రియు మిక్కిలి దుఃఖము పొందుచున్నాడు. ఆ సుదర్శనుడు భాగ్యహీనుడు రాజ్యభ్రష్టుడు నిరాశ్రయుడు బలకోశరహితుడు నిజబంధు పరిత్యక్తుడు. తన తల్లితో వనములందు కందమూలములు తినుచు కృశించుచు బ్రతుకు వెళ్ళబుచ్చుచున్నాడు. వనవాసియు దుర్భాగ్యుడునగు అతడు నీకు దగిన వరుడుగాడు. రాజలక్షణ లక్షితులు రూపప్రజ్ఞా గుణవంతులు ఆదరపాత్రులునగు రాకుమారులితరులెందఱో నీకన్ని విధాల తగినవారు గలరు. ఈ సుదర్శనుని సోదరుడు గలడు. అతడు సకల లక్షణ సంయుతుడు రూప సంపన్నుడు కోసలదేశపతి. నేనింకొక మాట గూడ వింటిని. అది వినుము. యుధాజిత్తు అను రాజు ఈ సుదర్శనుని చంపుటకు పొంచుకొని యున్నాడు. అతడు ఇతని మాతామహుడగు వీరసేనరాజు నంతమొందించి మంత్రులతో మంతనములాడి తన మనుమని రాజుగ చేసెను. అతడు సుదర్శనుని గూడ చంపనుంకించి భారద్వాజశ్రమము జేరెను. కాని, మునివరుడడ్డగింప జేయునదిలేక తన పురకేగెను.''

శశికళ యిట్లు పలికెను : నా మనోరథ విషయమై అన్ని విధముల నా మనసునకు నచ్చిన రాకుమారుడు వనముల నున్ననేమి? మున్ను శర్యాతి వాక్కుల బట్టి పతివ్రతయగు సుకన్య చ్యవనుని భర్తగ బడసి పతిపరిచర్యానిరతయై వెలయలేదా? పరమసతులకు పతిసేవయే స్వర్గ ప్రదము మోక్షప్రదము. నిష్కపటముగ చేసిన పని సతీమణికి నిశ్చయముగ సుఖ ప్రదమేయగును. ఆ యుత్తమ వీరుడే నాకు వరుడని పరమ భగవతి కలలో నాదేశించిన యుత్తమ వరుడగు అతనిని వదలి యితర నృపకుమారులనెటుల నాశ్రయింపగలను? నా చిత్తమనెడు గోడపై నా ప్రియతముడు భగవతిచేత లిఖింపబడెను. అట్టి నా ప్రియుని తప్ప ఇతరుని నేను భర్తగా చేసికొనను. 

వ్యాసుడిట్లనియెను: అనేక నిదర్శనములు చూపి శశికళ తన తల్లిమాటను త్రోసిపుచ్చగా రాణి తన కూతురు చెప్పినదంతయు మిక్కిలిగా తన పతికి విన్నవించెను. వివాహమునకు పూర్వము శశికళ వేదవిదుడు నాప్తుడునగు నొక్క ద్విజుని బిలిపించి యాతనితో తన తండ్రికి తెలియకుండునట్లుగ భరద్వాజాశ్రమమందున్న సుదర్శనుని చెంతకేగుమని పలికి తన మాటగా అతనితో పలుకుమని ఇట్లు చెప్పెను : 

"నా తండ్రి నాకు స్వయంవరము చాటించెను. అందులకు బలవంతులగు పెక్కురు రాజు లేతెంతురు. నేను మాత్రము ప్రీతిపూర్వకముగ నిన్నే నా చిత్తమున వరించితిని. ఓ సుర సమానా! ఆ భగవతియగు దేవి నా కలలో నిన్నే చూసి వరించుమనినది. నీవు కాదననిచో ఇంత విషమైన మ్రింగుదును. మండు మంటేలలోనైన పడి చత్తును. అంతేకాని తల్లిదండ్రులు నాకెంత చెప్పినను నిన్ను దక్కొరుని వరునిగ వరింపను. నా మనోవాక్కాయముల పూర్తిగ నిన్నే వరించితిని. భగవతీ ప్రసాదమున మనకు సుఖము కలుగగలదు. నీవిపుడా దైవమునే బలముగనెంచి యిచ్చోటికి రావలయును. ఈ సకలచరాచరమున కేలోక ధాత్రి ఆధారమో యా జగన్మాతృనాదేశమెట్లు పొల్లు పోగలదు? శంకరాది దేవతలే యా మహాపరాశక్తికి మోకరిల్లి చేతులు జోడింతురుగదా! ఓ బ్రాహ్మణవర్యా! ఆ రాజకుమారుడొంటిగనుండగ జూచి నా యుదంతమునతనిముందుంచుము. అనగా, ఈ కార్యమెట్లు నెరవేరగలదో యట్లొనరింపుము. ఇది నీ కర్తవ్యము సుమా! అని యామె యతనికి దక్షిణాదులొసంగి యతని నాపనికై వీడ్కొలిపెను.

అతడేగి యామెపల్కినదంతయును సుదర్శనునకు నివేదించి మరలి వచ్చెను. సుదర్శనుడంతయునెఱింగి యచ్చటి కేగ నిశ్చయించుకొనెను. భరద్వాజుడు పరమాదరమున సుదర్శనుని ఈ విషయమున ఉత్సాహపరచెను. అట్లు బయలుదేరు తన కొడుకునుగని మనోరమ వడకుచు కన్నుల నీరునిండగ నిట్లనెను : 

"అంత పెద్ద రాజ సమూహమునకు నీవొక్కడవేల యేగుదువు? దేని నాశ్రయముగ చూచికొని స్వయంవరమునందు నీవొంటిగ వైరులమధ్యకేగగలవు? అచ్చటికి యుధాజిత్తు నిన్ను చంపుటకు తప్పక రాగలడు. అచ్చట నీకండగ నిలబడువారెవ్వరును లేరు. కావున నాయనా! వెళ్ళవలదు. నేనేకపుత్రను - దీనను - నిరాధారను - ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకొనియున్నదానను. నీవు నన్ను నిరాశను చేయదగదు. నా తండ్రిని పొట్టబెట్టుకొన్నవాడచ్చటికిని తప్పక రాగలడు. నీవొంటరిగ వచ్చుటజూచి యుధాజిత్తు నిన్ను హతమార్చును. 

సుదర్శను డిట్లనియెను : ఓయమ్మా! కానున్నది కానమానదు. అందులకు విచారమేల? నేనా జగజ్జనని యాదేశముననే స్వయంవరమున కేగుచున్నాను. అమ్మా! నీవు క్షత్రియకుల సంజాతవు వీరమాతవు. దుఃఖపడవలదు. ఆ భగవతీ వరప్రసాదమున నాకెట్టి భయమును లేదు.

అని యిట్లు పలికి స్వయంవరమున కేగ నుద్యుక్తుడయిన సుదర్శనుని తన కొడుకును గని మనోరమ ఆశీర్వచనముల నిట్లతని ననుమోదించెను : 

"ఆ శ్రీ యంబికా దేవి నీ ముందు భాగమును శ్రీదేవి వెనుక భాగమును బ్రోచుగాత! పార్వతీ దేవి నీ యిరుప్రక్కలను శివ సర్వత్ర సర్వకాలములందును గాపడుత. వారాహీదేవి విషమస్థలులందును దుర్గాదేవి దుర్గమ ప్రదేశములందును కాళికాపరమేశ్వరి ఘోర కలహముల మధ్యను నిన్నోముత! మాతంగి మంటపముల మధ్య సౌమ్యస్వయంవరము నడుమ భవ విమోచనియుగు భవాని భూపతుల మధ్య నీకు రక్షయగుగాక. గిరిజ గిరిదుర్గములందు చాముండ చత్వరములందు సనాతనియగు కామగ కాననములందు నిన్ను రక్షించుగాక! ఓ రఘూద్వహా! శ్రీ వైష్ణవీశక్తి వాద వివాదములందు భైరవీశక్తి శత్రుసమాగమములందు నిన్ను గాపాడుగాక! మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందన స్వరూపిణియగు త్రిభువనేశ్వరీదేవి సర్వకాల సర్వావస్థలయందును నీకండయై యుండుగాత! అని యీ విధముగ రక్షజేసి భయాకులయై గడగడలాడుచు నేనును నీవెంట రాగలనని సుతునకు ఆమె మరల నిట్లనెను: 

"నీవు లేక నే నరనిముసమైన బ్రతుకజాలను. నీ వెటకేగ దలచినచో నన్ను నటకు గొంపొమ్ము అని యిట్లు మనోరమ పలికి విప్రుల యాశీస్సులు బడసి తన తనయునితో దాదితో గలిసి తానును బయలుదేరెను. రఘువంశీయుడగు సుదర్శనుడట్లు వెడలి యొక్క యరదమెక్కి వారణాసీపరము జేరెను. అచ్చటి సుబాహురాజది యెఱింగి యతని నుచితరీతిగ నాదరించెను. సుబాహువు వారికి విడుదులేర్పరచి యన్నపానాదులకు వసతులు కల్పించి వారి పరిచర్యలకు సేవకుల నాదేశించెను.

అచటికి యుధాజిత్తును తన మనుమని వెంటగొనివచ్చెను. అచటికి కరూషపతి మద్రపతి మాహిష్మతీపతి సింధుపతి - పాంచాల పర్వతేయులు కర్ణాట చోళవైదర్భపతులును వీరుడగు కామరూపుడు మొదలగు నానాదేశాధీశులు మఱికొందఱు భూపతులు స్వయంవరమును గాంచ నేనుగుల మీద వేడుకలతో నేతెంచిరి. అపుడా నగర మరువది మూడక్షౌహిణుల సేనలతో నెల్లెడల క్రిక్కిరిసి యుండెను. సుదర్శను డేకాకిగ నిరాకులుడై యేతెంచెనని కొందఱు రాకొమరులిట్లు గుసగుసలు వోయిరి: 

అతడొంటరిగ వివాహార్థము రథమెక్కి తన తల్లితో నేగుదెంచెను. ఇందఱు రాజసుతులు సైన్యసమేతులై రాగా వీరందఱిని త్రోసిరాజని యారాకుమారి మహాభుజుడగు సుదర్శనుని వరించును. అంత యుధాజిత్తు 'నేను కన్యార్థమై సుదర్శనుని చంపగలన'ని యచటి రాజులతో ననెను.

అంత నీతిమంతుడగు కేరళాధిపతి యుధాజిత్తున కిట్లనియె : "ఓ రాజా! ఇది ఇచ్ఛా స్వయంవరము. ఇందు యుద్ధము చేయరాదు. ఇది శుల్కముతో గూర్చిన స్వయంవరము కాదు. ఇందు బల్మితో కన్నెను హరింప వీలులేదు. రాజా! నీవు మును సుదర్శను నన్యాయముగ రాజభ్రష్టుని జేసితివి. నీ మనుమనికి రాజ్యమొసగితివి. ఈ కాకుత్థ్సుడు కోసలాధిపతి పుత్రుడు - రాజ కుమారుడు నిర్దోషి, ఇట్టి వానిని నీ వెట్టుల మట్టుపెట్ట చూచెదవు? నీ యవినీతికి నీవు పాపఫలిత మనుభవించి తీరుదువు. ఈ యీరేడులోకాలకొక జగత్పతి విశ్వశాస్త గలడని నమ్ముము. ధర్మమే జయించును. అధర్మమోడిపోవును. కావున దుర్ణయ వృత్తిని పాపమతిని వదలుము. నీ మనుమడు వచ్చెను. అతడు గూడ సురూపి. రాజ్యవంతుడు. శ్రీమంతుడు : మఱి శశికళ యతని నేల వరింపదు? ఇచటికి బలశాలురగు నితర రాజకుమారు లెందఱో వచ్చి యున్నారు. కన్యక ఎవ్వనినేని ఒక్కనినే తప్పక వరించి తీరును. ఎవ్వనినైన వరించినచో నిక వివాదమునకు తావెక్కడిది? కాన బుద్ధిశాలి పరస్పర విరోధము కల్పించుకొనరాదు.

ఇది శ్రీదేవీ భాగవతమున తృతీయస్కంధమందు పందొమ్మిదవ యధ్యాయము.


శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Chapter 50 Description of Sasikala's viraha - అధ్యాయము 50 శశికళ విరహ వర్ణనము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 50

శశికళ విరహ వర్ణనము

వ్యాసభట్టారకు డిట్లనియె : విప్రుని పలుకు లాలకించి యా యువతి తన ప్రియునందు బద్ధానురాగ యయ్యెను. బ్రాహ్మణుడు అట్లు ప్రియవచనములు పలికి యచ్చటినుండి బయలుదేరెను. ఆ ద్విజోత్తముడేగిన మీదట నామె పూర్వానురాగము వలన ప్రేమయందు మునిగినదై కాముని బాణముల దెబ్బ తినినదో యనునట్లు మిగుల చంచలురాలయ్యెను. తన యనుకూల వర్తినియగు నెచ్చెలితో తానెవరిని గూర్చి వినుట వలన మనస్సున కామ వికార ముత్పన్న మయ్యెనో తెలిపెను. శృంగార రసవిజ్ఞానము నేమాత్ర మెరుగనిదియు సత్కుల జాతనగు నాకు సంబంధించినదియు సుకుమారమునగు నా మనస్సును పాపుడగు వలరాజు బాధపెట్టుచున్నాడు. ఇపుడేమి సేతును? ఎక్కడ కేగుదును? ఆనాడు కలలో కనబడిన యా రాకుమారుడు రెండవ కాముడో యన నా మనస్సును విరహాకులితమును కోమలమునగు నా మనస్సును మిగుల తపింపజేయుచున్నాడు. ఓ భామినీ! నా మేన పూయబడిన చందనము విషముగను పూమాల పాముగను జంద్రకిరణము అగ్నిగను తోచుచున్నవి. హర్మ్యమున కాని ఉపవనమున కాని నడబావికడ కాని క్రీడా పర్వతమున కాని పగలు కాని రాత్రికాని ఏ సుఖ సాధనములతో కాని నాకు సుఖము కలుగకున్నది. లోని వలపుమంట లెంతకును చల్లారుటలేదు. సెజ్జ-విడెము - గీత వాద్యములు ఇవేవియు నా మనస్సునకు ప్రీతి గొలుపుట లేదు నా కన్నులును తృప్తి నొందుటలేదు. ఆ శఠుడున్న చోటికే పోవుదునా అనిపించుచున్నది. పితృపరాధీనను కావునను కుల లజ్జవలనను వెఱచుచున్నాను. నా తండ్రి యింకను నా స్వయంవరమును కేర్పాటు చేయుటలేదు. ఏమి చేయుదును? తండ్రి స్వయంవరమును ఏర్పాటు చేసినచో నా అనురాగమును సుదర్శనునికే అర్పింతును. సకల సంపత్‌ సంపన్నులగు నరపతులితరు లెందఱో కలరు. కాని, వారియందు నా మది తగులుట లేదు. ఆ సుదర్శనుడు రాజ్యహీనుడైనను నా కిష్టుడగుచున్నాడు.

వ్యాసుడిట్లనె: ఇట్లు నిర్ధనుడు బలహీనుడు ఫలాహారి వనవాసి యేకాకి యగు సుదర్శనుడే యామె చిత్తమున దృఢముగ నిలిచెను. ఆమెకు ఈ స్థితి వాగ్బీజ జపమువలన కలిగిన సిద్ధియే. ఆ సుదర్శనుడును కామరాజ బీజమును ధ్యాన పరుడై జపించుచుండెను. అతడు కలలో విశ్వమాత - అవ్యక్తరూప-సర్వసంపత్కర-విష్ణుమాయారూప యగు దేవిని - అంబికను సందర్శించెను. శృంగవేరపురపతియగు నిషాదుడొక డా సుదర్శనుని ఆశ్రయించి యతనికి సకల సామగ్రితో నిండినదై నాల్గు గుఱ్ఱములతో టెక్కెముతో నలంకృతమై యొప్పు జైత్రరథమును కానుకగ సమర్పించెను. సుదర్శనుడా నిషాదునితో నేస్తము చేసికొని యరదము స్వీకరించి అతనిని వన్యఫల మూలములతో చక్కగ ఆదరించి సంతుష్టుని జేసెను. అట్లు నిషాదుడాతిథ్యము స్వీకరించి యేగిన పిమ్మట నితర తపస్వులు ఏకాంతమున నెమ్మిగదుర సుదర్శనున కిట్లు పలికిరి: 

ఓ రాజపుత్త్రా! నీవు కొలది దినములకే నిస్సంశయముగ నెల్ల భంగుల నిజప్రతాపమున నీ రాజ్యమును బడయగలవు. ఆ వరదాయిని జగన్మోహిని అగు పరాదేవత నీయందు సుప్రన్నయై నిండియున్నది. ఆ తల్లి నీకన్ని విధముల సాయపడును. ఇక నావంతయు వంతజెందకుండుము. ఆత్మమననశీలురగు మునులు మనోరమతో ఓ శుచిస్మితా! నీ తనయుడు తప్పక నరపతిగా గలడనిరి. ఓ విప్రులారా! మీ వాక్కమోఘము, సత్ఫలప్రదము. ఇతడు మీ దాసుడు. సాధు సంసేవనమువలన రాజ్యప్రాప్తి గల్గుటాశ్చర్యము గాదు. నా కుమారన కొక సైన్యబలము కోశబలము సచివులు సహాయకులు నెవ్వరును లేరు. ఐన నితడు యోగబలమున రాజ్యము సంపాదించుటకు యోగ్యుడు గాగలడు. మీరలు మంత్రవేత్తలు. మీ యాశీర్బలమున నా కొమరుడు తప్పక మహీపతి గాగల'డని మనోరమ యనెను.

వ్యాసు డిట్లనియె : ఆ మేధావియగు సుదర్శను డెక్కడక్కడి కేగునో యక్కడక్కడ నెల్ల నతడు దివ్య తేజమున నక్షౌహిణీ సేనాసమేతుడైనట్లు భాసిల్లుచుండెను. దీనికంతకు నతడు ప్రతి నిత్యము ప్రీతితో జపించు నతని కామరాజ బీజమంత్ర ప్రభావము మూలకారణము. మరేదియు కాదు. కనుక కామరాజబీజమగు దేవీమంత్రమును బడసి యెవడు శుచియై శాంతుడై దానిని నిత్యము జపించునో వాని వాంఛితము లెల్ల నీడేరును. నరోత్తమా! శివా భగవతి సుప్రసన్నయైనచో నీ యీ రేడు భువనాలలో దుర్లభమైనది ప్రాప్యము కానిది ఏదియులేదు. ఎవ్వరి చిత్తమందు శ్రీ జగదం బార్చన చేయుట కాత్మ విశ్వాసము గలుగదో వారు మూఢులు మందులు భాగ్యహీనులు రోగపీడితులు. తొల్లి యుగాదియందే దేవదేవి సకల దేవబృందముచేత విశ్వమాతగ నేకగ్రీవముగ నుతింపబడెనో యా తల్లి యాదిమాతగ పేరెన్నిక గన్నది. ఎల్ల జీవరాసుల కా తల్లి శక్తి శ్రద్ధ బుద్ధి స్మృతి మతి కీర్తిలక్ష్మి - ఈ రూపములతో ప్రత్యక్షముగ నిత్యము భాసిల్లుచుండును. మాయా మోహితులును కుతర్కవాదులు నగు మూఢు లా విశ్వేశ్వరిని శివరూపయగు దేవి నెఱుగలేక దేవిని భజింపజాలరు. బ్రహ్మ విష్ణు మహేశులు ఇంద్రాగ్నియమ వరుణ వాయు కుబేరులు త్వష్ట పూషాశ్వినులు భగుడు వసు రుద్రాదిత్యులు - విశ్వేదేవతలు - మరుద్గణములు నెల్లరు నా సృష్టి స్థిత్యంత కారిణియగు పరాదేవిని ధ్యానింతురు. ఇట్టి పరమాత్మికా దివ్యశక్తిని విబుధుడైన వాడేవాడు సేవింపకుండును? ఆ సర్వార్థప్రదయగు శివాదేవి సుదర్శనునిచేత గుర్తింపబడినది. ఆ పరదాదేవి విద్యా విద్యా స్వరూపిణి మిక్కిలి దుష్ప్రాపయగు బ్రహ్మమే అనగా సంవిద్రూపిణి. పరమయోగగమ్య యగు నాపరాశక్తి ముముక్షువులకు ప్రియమైనది. త్రివిధమైన సృష్టి సలిపి దానిని సర్వప్రాణులకు గోచరింపజేయు ఆ తల్లి దయలేనిచో పరమాత్మ స్వరూపమును నెవ్వడును గ్రహింపజాలడు.

సుదర్శునుడా జగన్మాతను నెమ్మదిలో జింతించుచు రాజ్య లాభమునకంటె మిన్నయగు స్వాత్మ సుఖముబడసి నుడవిలో నుండెను. ఇట శశికళయును మదన బాణములచే మిగుల బాధింపబడినదగుటచే శిశిరోపచారములెన్ని చేసినను దుఃఖాన్వితమగు దేహముతోనే యుండెను. అంతలో సుబాహువును తన కూతురు తనకునచ్చిన వరుని వరింప గోరుచున్నదని తెలిసికొని వెంటనే స్వయంవరము చాటించెను. రాజకుమారులకు వివాహయోగ్యములగు స్వయం వరములు ముత్తెఱంగుల నుండునని పండితులందురు. ఇతరులకు కాదు. అందు మొదటి దిచ్ఛాస్వయంవరము. రెండవది పణము (పందెము) గలది. ఎటులనగా, శ్రీరాముడు శివధనుర్భంగముచేసి సీతను గైకొనెను. మూడవది శూరులకు సంబంధించినది. అది వీర్యశుల్కము గలది. దీనిలో సుబాహు డిచ్ఛాస్వయంవరమును చాటించెను. శిల్పకారులు సభ్యులకొఱకు శుభాసనములు గల మంచెలు వివిధాకార మంటపములు నాయత్త మొనరించిరి. వివాహార్థము వలయు వస్తు సామాగ్రులధికముగ సమకూర్చబడెను. అపుడు చారులోచనయగు శశికళ దుఃఃతమతితో తన చెలికత్తెతో నీవు నా తల్లిచెంతకేగి రహస్యముగ నా మాటగ ధ్రువసంధి తనయునే నేను వరించితినని పలుకుము. ఆ సుదర్శనునిగాక నే నితరుని వరింపజాలను. ఆ నృపసుతుడే నాకు భర్తగాగలడని తొల్లి భగవతి విధించెను అని చెప్పెను.

ఆ మంజుభాషిణియగు చెలియ వేగమే శశికళ తల్లియగు వైదర్భినిజేరి మధుర వచనముల నామెతో ఓ సాధ్వీ! అతి దుఃఃత యగు నీ పుత్త్రి నా నోట తెల్పిన వార్త విని వెంటనే యా కళ్యాణికి కళ్యాణము చేకూర్చుము. నేను భారద్వాజాశ్రమ మందున్న ధ్రువసంధి సుతనే నా భర్తగ మనసున వరించితిని. ఇతరునెవ్వని గోరను అని యామె పలుకుచున్నది అనెను. అంతలో నచటికి వచ్చిన రాజునకు రాణి తన గాదిలి కూతు కోరికను ఉన్నది ఉన్నట్లుగా విన్నవించెను. సుబాహుడామె పలుకు లాలించి విస్మయమంది పకపకనగుచు తన భార్యకిట్లనియెను. ఓ సుభ్రు! ఆ బాలుడు చిన్నప్పుడే రాజ్యభ్రష్టుడై నిర్జన వనమున తన తల్లితో నొంటిగ నివసించుచున్నాడని నీ వెఱుగుదువుగద! ఓ చారులోచనా! యుధాజిత్తువలన వీరసేను డంతమొందెను. అట్టి నిర్ధనుడు మన సులోచనకెట్లు పతిగ తగియుండును? కావున మన పుత్రికకు చెప్పుము. నీ వాక్యమెప్పుడైనను విప్రియమైనదియే. స్వయంవరమునకు స్థితిమంతులగు రాజాధిరాజు లెందఱో విచ్చేతురు.

అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...