Sunday, April 12, 2026

Chapter 51 Sudarshana Came to Swayamvara - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 51

సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు చిరుగనవు కల తన చిన్నారి కూతును తొడపై కూర్చుంబెట్టుకొని ఊరడించుచు మృదువచనముల నిట్లు పలికెను. సుదతీ! సువ్రతా! నాకు ప్రీతికరముగాని వ్యర్థపు పల్కు పలికెదవేల? నీ యీ మాటలచేత నీ తండ్రియు మిక్కిలి దుఃఖము పొందుచున్నాడు. ఆ సుదర్శనుడు భాగ్యహీనుడు రాజ్యభ్రష్టుడు నిరాశ్రయుడు బలకోశరహితుడు నిజబంధు పరిత్యక్తుడు. తన తల్లితో వనములందు కందమూలములు తినుచు కృశించుచు బ్రతుకు వెళ్ళబుచ్చుచున్నాడు. వనవాసియు దుర్భాగ్యుడునగు అతడు నీకు దగిన వరుడుగాడు. రాజలక్షణ లక్షితులు రూపప్రజ్ఞా గుణవంతులు ఆదరపాత్రులునగు రాకుమారులితరులెందఱో నీకన్ని విధాల తగినవారు గలరు. ఈ సుదర్శనుని సోదరుడు గలడు. అతడు సకల లక్షణ సంయుతుడు రూప సంపన్నుడు కోసలదేశపతి. నేనింకొక మాట గూడ వింటిని. అది వినుము. యుధాజిత్తు అను రాజు ఈ సుదర్శనుని చంపుటకు పొంచుకొని యున్నాడు. అతడు ఇతని మాతామహుడగు వీరసేనరాజు నంతమొందించి మంత్రులతో మంతనములాడి తన మనుమని రాజుగ చేసెను. అతడు సుదర్శనుని గూడ చంపనుంకించి భారద్వాజశ్రమము జేరెను. కాని, మునివరుడడ్డగింప జేయునదిలేక తన పురకేగెను.''

శశికళ యిట్లు పలికెను : నా మనోరథ విషయమై అన్ని విధముల నా మనసునకు నచ్చిన రాకుమారుడు వనముల నున్ననేమి? మున్ను శర్యాతి వాక్కుల బట్టి పతివ్రతయగు సుకన్య చ్యవనుని భర్తగ బడసి పతిపరిచర్యానిరతయై వెలయలేదా? పరమసతులకు పతిసేవయే స్వర్గ ప్రదము మోక్షప్రదము. నిష్కపటముగ చేసిన పని సతీమణికి నిశ్చయముగ సుఖ ప్రదమేయగును. ఆ యుత్తమ వీరుడే నాకు వరుడని పరమ భగవతి కలలో నాదేశించిన యుత్తమ వరుడగు అతనిని వదలి యితర నృపకుమారులనెటుల నాశ్రయింపగలను? నా చిత్తమనెడు గోడపై నా ప్రియతముడు భగవతిచేత లిఖింపబడెను. అట్టి నా ప్రియుని తప్ప ఇతరుని నేను భర్తగా చేసికొనను. 

వ్యాసుడిట్లనియెను: అనేక నిదర్శనములు చూపి శశికళ తన తల్లిమాటను త్రోసిపుచ్చగా రాణి తన కూతురు చెప్పినదంతయు మిక్కిలిగా తన పతికి విన్నవించెను. వివాహమునకు పూర్వము శశికళ వేదవిదుడు నాప్తుడునగు నొక్క ద్విజుని బిలిపించి యాతనితో తన తండ్రికి తెలియకుండునట్లుగ భరద్వాజాశ్రమమందున్న సుదర్శనుని చెంతకేగుమని పలికి తన మాటగా అతనితో పలుకుమని ఇట్లు చెప్పెను : 

"నా తండ్రి నాకు స్వయంవరము చాటించెను. అందులకు బలవంతులగు పెక్కురు రాజు లేతెంతురు. నేను మాత్రము ప్రీతిపూర్వకముగ నిన్నే నా చిత్తమున వరించితిని. ఓ సుర సమానా! ఆ భగవతియగు దేవి నా కలలో నిన్నే చూసి వరించుమనినది. నీవు కాదననిచో ఇంత విషమైన మ్రింగుదును. మండు మంటేలలోనైన పడి చత్తును. అంతేకాని తల్లిదండ్రులు నాకెంత చెప్పినను నిన్ను దక్కొరుని వరునిగ వరింపను. నా మనోవాక్కాయముల పూర్తిగ నిన్నే వరించితిని. భగవతీ ప్రసాదమున మనకు సుఖము కలుగగలదు. నీవిపుడా దైవమునే బలముగనెంచి యిచ్చోటికి రావలయును. ఈ సకలచరాచరమున కేలోక ధాత్రి ఆధారమో యా జగన్మాతృనాదేశమెట్లు పొల్లు పోగలదు? శంకరాది దేవతలే యా మహాపరాశక్తికి మోకరిల్లి చేతులు జోడింతురుగదా! ఓ బ్రాహ్మణవర్యా! ఆ రాజకుమారుడొంటిగనుండగ జూచి నా యుదంతమునతనిముందుంచుము. అనగా, ఈ కార్యమెట్లు నెరవేరగలదో యట్లొనరింపుము. ఇది నీ కర్తవ్యము సుమా! అని యామె యతనికి దక్షిణాదులొసంగి యతని నాపనికై వీడ్కొలిపెను.

అతడేగి యామెపల్కినదంతయును సుదర్శనునకు నివేదించి మరలి వచ్చెను. సుదర్శనుడంతయునెఱింగి యచ్చటి కేగ నిశ్చయించుకొనెను. భరద్వాజుడు పరమాదరమున సుదర్శనుని ఈ విషయమున ఉత్సాహపరచెను. అట్లు బయలుదేరు తన కొడుకునుగని మనోరమ వడకుచు కన్నుల నీరునిండగ నిట్లనెను : 

"అంత పెద్ద రాజ సమూహమునకు నీవొక్కడవేల యేగుదువు? దేని నాశ్రయముగ చూచికొని స్వయంవరమునందు నీవొంటిగ వైరులమధ్యకేగగలవు? అచ్చటికి యుధాజిత్తు నిన్ను చంపుటకు తప్పక రాగలడు. అచ్చట నీకండగ నిలబడువారెవ్వరును లేరు. కావున నాయనా! వెళ్ళవలదు. నేనేకపుత్రను - దీనను - నిరాధారను - ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకొనియున్నదానను. నీవు నన్ను నిరాశను చేయదగదు. నా తండ్రిని పొట్టబెట్టుకొన్నవాడచ్చటికిని తప్పక రాగలడు. నీవొంటరిగ వచ్చుటజూచి యుధాజిత్తు నిన్ను హతమార్చును. 

సుదర్శను డిట్లనియెను : ఓయమ్మా! కానున్నది కానమానదు. అందులకు విచారమేల? నేనా జగజ్జనని యాదేశముననే స్వయంవరమున కేగుచున్నాను. అమ్మా! నీవు క్షత్రియకుల సంజాతవు వీరమాతవు. దుఃఖపడవలదు. ఆ భగవతీ వరప్రసాదమున నాకెట్టి భయమును లేదు.

అని యిట్లు పలికి స్వయంవరమున కేగ నుద్యుక్తుడయిన సుదర్శనుని తన కొడుకును గని మనోరమ ఆశీర్వచనముల నిట్లతని ననుమోదించెను : 

"ఆ శ్రీ యంబికా దేవి నీ ముందు భాగమును శ్రీదేవి వెనుక భాగమును బ్రోచుగాత! పార్వతీ దేవి నీ యిరుప్రక్కలను శివ సర్వత్ర సర్వకాలములందును గాపడుత. వారాహీదేవి విషమస్థలులందును దుర్గాదేవి దుర్గమ ప్రదేశములందును కాళికాపరమేశ్వరి ఘోర కలహముల మధ్యను నిన్నోముత! మాతంగి మంటపముల మధ్య సౌమ్యస్వయంవరము నడుమ భవ విమోచనియుగు భవాని భూపతుల మధ్య నీకు రక్షయగుగాక. గిరిజ గిరిదుర్గములందు చాముండ చత్వరములందు సనాతనియగు కామగ కాననములందు నిన్ను రక్షించుగాక! ఓ రఘూద్వహా! శ్రీ వైష్ణవీశక్తి వాద వివాదములందు భైరవీశక్తి శత్రుసమాగమములందు నిన్ను గాపాడుగాక! మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందన స్వరూపిణియగు త్రిభువనేశ్వరీదేవి సర్వకాల సర్వావస్థలయందును నీకండయై యుండుగాత! అని యీ విధముగ రక్షజేసి భయాకులయై గడగడలాడుచు నేనును నీవెంట రాగలనని సుతునకు ఆమె మరల నిట్లనెను: 

"నీవు లేక నే నరనిముసమైన బ్రతుకజాలను. నీ వెటకేగ దలచినచో నన్ను నటకు గొంపొమ్ము అని యిట్లు మనోరమ పలికి విప్రుల యాశీస్సులు బడసి తన తనయునితో దాదితో గలిసి తానును బయలుదేరెను. రఘువంశీయుడగు సుదర్శనుడట్లు వెడలి యొక్క యరదమెక్కి వారణాసీపరము జేరెను. అచ్చటి సుబాహురాజది యెఱింగి యతని నుచితరీతిగ నాదరించెను. సుబాహువు వారికి విడుదులేర్పరచి యన్నపానాదులకు వసతులు కల్పించి వారి పరిచర్యలకు సేవకుల నాదేశించెను.

అచటికి యుధాజిత్తును తన మనుమని వెంటగొనివచ్చెను. అచటికి కరూషపతి మద్రపతి మాహిష్మతీపతి సింధుపతి - పాంచాల పర్వతేయులు కర్ణాట చోళవైదర్భపతులును వీరుడగు కామరూపుడు మొదలగు నానాదేశాధీశులు మఱికొందఱు భూపతులు స్వయంవరమును గాంచ నేనుగుల మీద వేడుకలతో నేతెంచిరి. అపుడా నగర మరువది మూడక్షౌహిణుల సేనలతో నెల్లెడల క్రిక్కిరిసి యుండెను. సుదర్శను డేకాకిగ నిరాకులుడై యేతెంచెనని కొందఱు రాకొమరులిట్లు గుసగుసలు వోయిరి: 

అతడొంటరిగ వివాహార్థము రథమెక్కి తన తల్లితో నేగుదెంచెను. ఇందఱు రాజసుతులు సైన్యసమేతులై రాగా వీరందఱిని త్రోసిరాజని యారాకుమారి మహాభుజుడగు సుదర్శనుని వరించును. అంత యుధాజిత్తు 'నేను కన్యార్థమై సుదర్శనుని చంపగలన'ని యచటి రాజులతో ననెను.

అంత నీతిమంతుడగు కేరళాధిపతి యుధాజిత్తున కిట్లనియె : "ఓ రాజా! ఇది ఇచ్ఛా స్వయంవరము. ఇందు యుద్ధము చేయరాదు. ఇది శుల్కముతో గూర్చిన స్వయంవరము కాదు. ఇందు బల్మితో కన్నెను హరింప వీలులేదు. రాజా! నీవు మును సుదర్శను నన్యాయముగ రాజభ్రష్టుని జేసితివి. నీ మనుమనికి రాజ్యమొసగితివి. ఈ కాకుత్థ్సుడు కోసలాధిపతి పుత్రుడు - రాజ కుమారుడు నిర్దోషి, ఇట్టి వానిని నీ వెట్టుల మట్టుపెట్ట చూచెదవు? నీ యవినీతికి నీవు పాపఫలిత మనుభవించి తీరుదువు. ఈ యీరేడులోకాలకొక జగత్పతి విశ్వశాస్త గలడని నమ్ముము. ధర్మమే జయించును. అధర్మమోడిపోవును. కావున దుర్ణయ వృత్తిని పాపమతిని వదలుము. నీ మనుమడు వచ్చెను. అతడు గూడ సురూపి. రాజ్యవంతుడు. శ్రీమంతుడు : మఱి శశికళ యతని నేల వరింపదు? ఇచటికి బలశాలురగు నితర రాజకుమారు లెందఱో వచ్చి యున్నారు. కన్యక ఎవ్వనినేని ఒక్కనినే తప్పక వరించి తీరును. ఎవ్వనినైన వరించినచో నిక వివాదమునకు తావెక్కడిది? కాన బుద్ధిశాలి పరస్పర విరోధము కల్పించుకొనరాదు.

ఇది శ్రీదేవీ భాగవతమున తృతీయస్కంధమందు పందొమ్మిదవ యధ్యాయము.


శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 58 Sridevi Navratri Puja Method - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : ఓ ద్విజోత్తమా! నవరాత్రము...