Sunday, April 12, 2026

Chapter 50 Description of Sasikala's viraha - అధ్యాయము 50 శశికళ విరహ వర్ణనము

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 50

శశికళ విరహ వర్ణనము

వ్యాసభట్టారకు డిట్లనియె : విప్రుని పలుకు లాలకించి యా యువతి తన ప్రియునందు బద్ధానురాగ యయ్యెను. బ్రాహ్మణుడు అట్లు ప్రియవచనములు పలికి యచ్చటినుండి బయలుదేరెను. ఆ ద్విజోత్తముడేగిన మీదట నామె పూర్వానురాగము వలన ప్రేమయందు మునిగినదై కాముని బాణముల దెబ్బ తినినదో యనునట్లు మిగుల చంచలురాలయ్యెను. తన యనుకూల వర్తినియగు నెచ్చెలితో తానెవరిని గూర్చి వినుట వలన మనస్సున కామ వికార ముత్పన్న మయ్యెనో తెలిపెను. శృంగార రసవిజ్ఞానము నేమాత్ర మెరుగనిదియు సత్కుల జాతనగు నాకు సంబంధించినదియు సుకుమారమునగు నా మనస్సును పాపుడగు వలరాజు బాధపెట్టుచున్నాడు. ఇపుడేమి సేతును? ఎక్కడ కేగుదును? ఆనాడు కలలో కనబడిన యా రాకుమారుడు రెండవ కాముడో యన నా మనస్సును విరహాకులితమును కోమలమునగు నా మనస్సును మిగుల తపింపజేయుచున్నాడు. ఓ భామినీ! నా మేన పూయబడిన చందనము విషముగను పూమాల పాముగను జంద్రకిరణము అగ్నిగను తోచుచున్నవి. హర్మ్యమున కాని ఉపవనమున కాని నడబావికడ కాని క్రీడా పర్వతమున కాని పగలు కాని రాత్రికాని ఏ సుఖ సాధనములతో కాని నాకు సుఖము కలుగకున్నది. లోని వలపుమంట లెంతకును చల్లారుటలేదు. సెజ్జ-విడెము - గీత వాద్యములు ఇవేవియు నా మనస్సునకు ప్రీతి గొలుపుట లేదు నా కన్నులును తృప్తి నొందుటలేదు. ఆ శఠుడున్న చోటికే పోవుదునా అనిపించుచున్నది. పితృపరాధీనను కావునను కుల లజ్జవలనను వెఱచుచున్నాను. నా తండ్రి యింకను నా స్వయంవరమును కేర్పాటు చేయుటలేదు. ఏమి చేయుదును? తండ్రి స్వయంవరమును ఏర్పాటు చేసినచో నా అనురాగమును సుదర్శనునికే అర్పింతును. సకల సంపత్‌ సంపన్నులగు నరపతులితరు లెందఱో కలరు. కాని, వారియందు నా మది తగులుట లేదు. ఆ సుదర్శనుడు రాజ్యహీనుడైనను నా కిష్టుడగుచున్నాడు.

వ్యాసుడిట్లనె: ఇట్లు నిర్ధనుడు బలహీనుడు ఫలాహారి వనవాసి యేకాకి యగు సుదర్శనుడే యామె చిత్తమున దృఢముగ నిలిచెను. ఆమెకు ఈ స్థితి వాగ్బీజ జపమువలన కలిగిన సిద్ధియే. ఆ సుదర్శనుడును కామరాజ బీజమును ధ్యాన పరుడై జపించుచుండెను. అతడు కలలో విశ్వమాత - అవ్యక్తరూప-సర్వసంపత్కర-విష్ణుమాయారూప యగు దేవిని - అంబికను సందర్శించెను. శృంగవేరపురపతియగు నిషాదుడొక డా సుదర్శనుని ఆశ్రయించి యతనికి సకల సామగ్రితో నిండినదై నాల్గు గుఱ్ఱములతో టెక్కెముతో నలంకృతమై యొప్పు జైత్రరథమును కానుకగ సమర్పించెను. సుదర్శనుడా నిషాదునితో నేస్తము చేసికొని యరదము స్వీకరించి అతనిని వన్యఫల మూలములతో చక్కగ ఆదరించి సంతుష్టుని జేసెను. అట్లు నిషాదుడాతిథ్యము స్వీకరించి యేగిన పిమ్మట నితర తపస్వులు ఏకాంతమున నెమ్మిగదుర సుదర్శనున కిట్లు పలికిరి: 

ఓ రాజపుత్త్రా! నీవు కొలది దినములకే నిస్సంశయముగ నెల్ల భంగుల నిజప్రతాపమున నీ రాజ్యమును బడయగలవు. ఆ వరదాయిని జగన్మోహిని అగు పరాదేవత నీయందు సుప్రన్నయై నిండియున్నది. ఆ తల్లి నీకన్ని విధముల సాయపడును. ఇక నావంతయు వంతజెందకుండుము. ఆత్మమననశీలురగు మునులు మనోరమతో ఓ శుచిస్మితా! నీ తనయుడు తప్పక నరపతిగా గలడనిరి. ఓ విప్రులారా! మీ వాక్కమోఘము, సత్ఫలప్రదము. ఇతడు మీ దాసుడు. సాధు సంసేవనమువలన రాజ్యప్రాప్తి గల్గుటాశ్చర్యము గాదు. నా కుమారన కొక సైన్యబలము కోశబలము సచివులు సహాయకులు నెవ్వరును లేరు. ఐన నితడు యోగబలమున రాజ్యము సంపాదించుటకు యోగ్యుడు గాగలడు. మీరలు మంత్రవేత్తలు. మీ యాశీర్బలమున నా కొమరుడు తప్పక మహీపతి గాగల'డని మనోరమ యనెను.

వ్యాసు డిట్లనియె : ఆ మేధావియగు సుదర్శను డెక్కడక్కడి కేగునో యక్కడక్కడ నెల్ల నతడు దివ్య తేజమున నక్షౌహిణీ సేనాసమేతుడైనట్లు భాసిల్లుచుండెను. దీనికంతకు నతడు ప్రతి నిత్యము ప్రీతితో జపించు నతని కామరాజ బీజమంత్ర ప్రభావము మూలకారణము. మరేదియు కాదు. కనుక కామరాజబీజమగు దేవీమంత్రమును బడసి యెవడు శుచియై శాంతుడై దానిని నిత్యము జపించునో వాని వాంఛితము లెల్ల నీడేరును. నరోత్తమా! శివా భగవతి సుప్రసన్నయైనచో నీ యీ రేడు భువనాలలో దుర్లభమైనది ప్రాప్యము కానిది ఏదియులేదు. ఎవ్వరి చిత్తమందు శ్రీ జగదం బార్చన చేయుట కాత్మ విశ్వాసము గలుగదో వారు మూఢులు మందులు భాగ్యహీనులు రోగపీడితులు. తొల్లి యుగాదియందే దేవదేవి సకల దేవబృందముచేత విశ్వమాతగ నేకగ్రీవముగ నుతింపబడెనో యా తల్లి యాదిమాతగ పేరెన్నిక గన్నది. ఎల్ల జీవరాసుల కా తల్లి శక్తి శ్రద్ధ బుద్ధి స్మృతి మతి కీర్తిలక్ష్మి - ఈ రూపములతో ప్రత్యక్షముగ నిత్యము భాసిల్లుచుండును. మాయా మోహితులును కుతర్కవాదులు నగు మూఢు లా విశ్వేశ్వరిని శివరూపయగు దేవి నెఱుగలేక దేవిని భజింపజాలరు. బ్రహ్మ విష్ణు మహేశులు ఇంద్రాగ్నియమ వరుణ వాయు కుబేరులు త్వష్ట పూషాశ్వినులు భగుడు వసు రుద్రాదిత్యులు - విశ్వేదేవతలు - మరుద్గణములు నెల్లరు నా సృష్టి స్థిత్యంత కారిణియగు పరాదేవిని ధ్యానింతురు. ఇట్టి పరమాత్మికా దివ్యశక్తిని విబుధుడైన వాడేవాడు సేవింపకుండును? ఆ సర్వార్థప్రదయగు శివాదేవి సుదర్శనునిచేత గుర్తింపబడినది. ఆ పరదాదేవి విద్యా విద్యా స్వరూపిణి మిక్కిలి దుష్ప్రాపయగు బ్రహ్మమే అనగా సంవిద్రూపిణి. పరమయోగగమ్య యగు నాపరాశక్తి ముముక్షువులకు ప్రియమైనది. త్రివిధమైన సృష్టి సలిపి దానిని సర్వప్రాణులకు గోచరింపజేయు ఆ తల్లి దయలేనిచో పరమాత్మ స్వరూపమును నెవ్వడును గ్రహింపజాలడు.

సుదర్శునుడా జగన్మాతను నెమ్మదిలో జింతించుచు రాజ్య లాభమునకంటె మిన్నయగు స్వాత్మ సుఖముబడసి నుడవిలో నుండెను. ఇట శశికళయును మదన బాణములచే మిగుల బాధింపబడినదగుటచే శిశిరోపచారములెన్ని చేసినను దుఃఖాన్వితమగు దేహముతోనే యుండెను. అంతలో సుబాహువును తన కూతురు తనకునచ్చిన వరుని వరింప గోరుచున్నదని తెలిసికొని వెంటనే స్వయంవరము చాటించెను. రాజకుమారులకు వివాహయోగ్యములగు స్వయం వరములు ముత్తెఱంగుల నుండునని పండితులందురు. ఇతరులకు కాదు. అందు మొదటి దిచ్ఛాస్వయంవరము. రెండవది పణము (పందెము) గలది. ఎటులనగా, శ్రీరాముడు శివధనుర్భంగముచేసి సీతను గైకొనెను. మూడవది శూరులకు సంబంధించినది. అది వీర్యశుల్కము గలది. దీనిలో సుబాహు డిచ్ఛాస్వయంవరమును చాటించెను. శిల్పకారులు సభ్యులకొఱకు శుభాసనములు గల మంచెలు వివిధాకార మంటపములు నాయత్త మొనరించిరి. వివాహార్థము వలయు వస్తు సామాగ్రులధికముగ సమకూర్చబడెను. అపుడు చారులోచనయగు శశికళ దుఃఃతమతితో తన చెలికత్తెతో నీవు నా తల్లిచెంతకేగి రహస్యముగ నా మాటగ ధ్రువసంధి తనయునే నేను వరించితినని పలుకుము. ఆ సుదర్శనునిగాక నే నితరుని వరింపజాలను. ఆ నృపసుతుడే నాకు భర్తగాగలడని తొల్లి భగవతి విధించెను అని చెప్పెను.

ఆ మంజుభాషిణియగు చెలియ వేగమే శశికళ తల్లియగు వైదర్భినిజేరి మధుర వచనముల నామెతో ఓ సాధ్వీ! అతి దుఃఃత యగు నీ పుత్త్రి నా నోట తెల్పిన వార్త విని వెంటనే యా కళ్యాణికి కళ్యాణము చేకూర్చుము. నేను భారద్వాజాశ్రమ మందున్న ధ్రువసంధి సుతనే నా భర్తగ మనసున వరించితిని. ఇతరునెవ్వని గోరను అని యామె పలుకుచున్నది అనెను. అంతలో నచటికి వచ్చిన రాజునకు రాణి తన గాదిలి కూతు కోరికను ఉన్నది ఉన్నట్లుగా విన్నవించెను. సుబాహుడామె పలుకు లాలించి విస్మయమంది పకపకనగుచు తన భార్యకిట్లనియెను. ఓ సుభ్రు! ఆ బాలుడు చిన్నప్పుడే రాజ్యభ్రష్టుడై నిర్జన వనమున తన తల్లితో నొంటిగ నివసించుచున్నాడని నీ వెఱుగుదువుగద! ఓ చారులోచనా! యుధాజిత్తువలన వీరసేను డంతమొందెను. అట్టి నిర్ధనుడు మన సులోచనకెట్లు పతిగ తగియుండును? కావున మన పుత్రికకు చెప్పుము. నీ వాక్యమెప్పుడైనను విప్రియమైనదియే. స్వయంవరమునకు స్థితిమంతులగు రాజాధిరాజు లెందఱో విచ్చేతురు.

అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 58 Sridevi Navratri Puja Method - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 58 శ్రీదేవీ నవరాత్ర పూజా విధానము జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : ఓ ద్విజోత్తమా! నవరాత్రము...