Wednesday, August 19, 2026

Viprula Paschathapam - విప్రుల పశ్చాత్తాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - విప్రుల పశ్చాత్తాపం

గౌతముడి శాపానికి గురియైన ఆ విప్రులందరికీ వేదాలు మరుగునపడ్డాయి. సంధ్యవారుద్దామంటే అక్షరం పెగలడంలేదు. గాయత్రీమంత్రం గుర్తుకి రావడంలేదు. ఆశ్చర్యమనిపించింది. మళ్ళీ ఆందరూ గుమికూడారు. గౌతముడి శాపం పనిచేస్తోందని గుర్తించారు. 

చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందారు. పరుగుపరుగున వచ్చి మహర్షి కాళ్ళమీద పడ్డారు. సిగ్గుతో తలలు దించుకుని నిలబడ్డారు. వెక్కి వెక్కి విలపించారు. ఏమి మాట్లాడడానికీ ముఖం చెల్లక క్షమించు క్షమించు క్షమించు అంటూ లెంపలు వేసుకున్నారు.

చుట్టూ చేరారు. మాటిమాటికీ ఇదేమాట. మరొక మాటలేదు. కరుణాపూర్ణ హృదయుడు మునీశ్వరుడు మెల్లగా పెదవి కదిపాడు.

విప్రులారా! నా శాపానికి తిరుగులేదు. కృష్ణావతారపర్యంతం మీ అందరి ఉనికీ మనికీ కుంభీపాకనరకం లోనే. అటు పైని కలియుగం వస్తుంది అప్పుడు ఆ నరకంనుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వేదమార్గవిముఖులై పతితులవుతారు. ఇది తప్పదు.

నిజంగా తప్పించుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ జన్మలోనైనా గాయత్రీపాదపద్మాలను భక్తితో సేవించండి. వెళ్ళిరండి - అని నిష్కర్షగా చెప్పి సాగనంపాడు. ఇదంతా ఒక ప్రారబ్ధంగా భావించి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకున్నాడు.

జనమేజయా! గౌతముడి శాపం కారణంగా ఆ విప్రులందరూ ద్వాపరాంతం వరకూ కుంభీపాకనరకం అనుభవించారు. కలియుగం ప్రారంభంకాగానే ఆ నరకంనుంచి బయటపడి భూలోకంలో జన్మించారు. ఆ విప్రులూ వారి సంతతి వారే ఇప్పటికీ సంధ్యాత్రయ విహీనులై గాయత్రీవివర్జితులై వేదవిదూరులై పాషండమతాలను అనుసరిస్తున్నారు.

అగ్నిహోత్రాది సత్కర్మలనూ స్వాహా స్వధాదులనూ విముఖులై నిరసిస్తున్నారు. అవ్యక్త మూలప్రకృతి గురించి వారికి ఏమి తెలియదు. కొందరు తప్తముద్రాంకితులై కొందరు కామాచారులై కొందరు కాపాలికులై కొందరు కౌలికులై(వామాచారులు) బౌద్దజైనాది ఆవైదికమతానుయాయులై దురాచార ప్రవర్తకులు అవుతున్నారు. 

ఉద్దండపండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధిమాత్రం ఉండటంలేదు. పరకాంతాలంపటులై సకల దుశ్చేష్టాపరాయణులై భ్రష్టుపడుతున్నారు. మళ్ళీ మళ్ళీ కుంభీపాకానికే వెదుక్కుతూ వెడుతున్నారు.

అందుచేత, ఓ రాజా! పరమేశ్వరిని సర్వాత్మనా సేవించాలి. హరి - హరాదుల ఉపాసనలు నిత్యాలు కావు. శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన. ఇది చెయ్యనివారికి అధఃపతనం తప్పదు.

ఇక అత్యంత సుందరమూ మహాదేవికి స్థిరనివాసమూ హరిహర హిరణ్యగర్భాదులకుకూడా అత్యంత దుర్లభమూ - మణిద్వీపవర్దన వినిపిస్తాను. శ్రద్దగా విను. భవారణి భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరీ ఆలకించు - అని ఆరంభించాడు వ్యాసుడు.

మణిద్వీప వర్ణన





Monday, August 17, 2026

Uttarabhadra Nakshatra - ఉత్తరాభాద్ర నక్షత్రము

ఉత్తరాభాద్ర నక్షత్రము

నక్షత్రం - ఉత్తరాభాద్ర
అధిపతి - శని
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - వేప
జంతువు - గోవు
నాడి - మధ్య
పక్షి - మయూరము
అధిదేవత - అహిర్పద్రువ్యుడు
రాశి - మీనం
ధు/శ్చం/చా/ధా

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ఉత్తరాభాద్ర నక్షత్రము 26వ నక్షత్రము. ఈ నక్షత్రానికి శాంతి లేదు. కానీ, గ్రహాణాది దోషములలో శాంతి చేయవలెను. ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యాధిపతి గురువు, మానవ గణం, జంతువు ఆవు.

ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది.

చక్కటి వ్యూహరచనతో పొదుపుగా జీవితాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు.

కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు.

ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. ముప్ఫై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే, వీరి ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. వీరు, విజ్ఞానవంతులు, తెలివైనవారు మరియు సున్నిత మనస్కులు.

ఎవరి పట్లా ప్రవర్తనలో మార్పు ఉండదు, ప్రతి ఒక్కరిని ఒకేవిధంగా చూస్తారు. వీరు ఎవరికి నొప్పిని కలిగించడానికి ఇష్టపడరు, అదేవిధంగా ఎవరైనా సమస్యల్లో ఉండటాన్ని వీరు చూడలేరు. వీరి కోపం ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకొంటారు. అయితే వీరికి ఎప్పుడు కోపం వచ్చినా కూడా స్వల్పకాలంలో తగ్గిపోతుంది. వీరు ఎంతో కోమలమైనవారు మరియు వీరి హృదయం ఎంతో శుద్ధిగా ఉంటుంది.

వీరి స్వరం మధురంగా ఉంటుంది మరియు చక్కటి ప్రసంగాలు చేస్తారు. వీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఒకేసారి అనేక విషయాల్లో నైపుణ్యం సాధించే లక్షణం వీరికి ఉంటుంది. వీరు పెద్దగా చదువుకోకపోయినా, తెలివితేటలు సమర్థత కలిగినవారికి తెలివి తేటలతో సమానంగా ఉంటాయి.

కళల రంగంలో ఆసక్తి ఉంటుంది మరియు వివిధ రకాల పుస్తకాలు వీరు రాయగలుగుతారు. అసాధారణ సామర్థ్యాలు మరియు తెలివితేటల వల్ల, అన్ని రంగాల్లో వీరు నైపుణ్యం సాధించవచ్చు. వీరి జీవితంలో బద్దకానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీరు దానిని చేస్తారు.

ఏదైనా వైఫ్యలాల వల్ల వీరు నిరుత్సాహపడరు. వర్తమానాన్ని మరియు జీవితంలో సత్యాన్ని వీరు విశ్వసిస్తారు, గాలిలో మేడలు కట్టడానికి ఇష్టపడరు. వ్యక్తిత్వం పరంగా వీరు బలంగా ఉంటారు.

చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారు మరియు చెప్పింది చేస్తారు. దయార్థ భావన వీరిలో నిండి ఉంటుంది, ఒక బలహీనమైన వ్యక్తి మీ వద్దకు వచ్చినట్లయితే, వీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వీరు దానిలో విజయాన్ని సాధిస్తారు. కష్టపడి పనిచేయడం వల్లనే వీరు విజయం సాధిస్తారు.

కష్టపడి పనిచేయడం ద్వారా, వీరు విజయం అంచుల్ని తాకుతారు. వీరికి సైన్స్, తత్వశాస్త్రం, మరియు రహస్యమైన విషయాల్లో లోతైన ఆసక్తి ఉంటుంది. సామాజిక సంస్థలతో అనుబంధం ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.

త్యాగ పూర్వక స్వభావాలుంటాయి మరియు దానాలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిత్వం కారణంగా మీరు సమాజంలో అపరిమితమైన గౌరవమర్యాదలు పొందుతారు.


ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదము
ఉత్తరాభద్ర నక్షత్ర మొదటి పాదము సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని. ఈ జాతకుల మీద సూర్య శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రం.

సూర్యుని ప్రభావం కారణంగా వీరికి సహజంగానే నాయకత్వ గుణం ఉంటుంది. ఏ రంగంలోనైనా ముందుండి నడిపించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. శ్రమించి పనిచేయగలరు. సోమరితనం లేకుండా తమ లక్ష్య సాధన కోసం ఎంతో కష్టపడతారు. వీరికి తండ్రితో వ్యతిరేకత ఏర్పడవచ్చు.

విపరీతమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వీసమెత్తు కూడా తగ్గదు. వీరు తమ జ్ఞానం, పనితీరుతో సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఆచరణాత్మక ఆలోచనలు (Practicality) కలిగి ఉంటారు. కొన్నిసార్లు పట్టుదల, కోపం కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది

వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. పరిశ్రమలు, కర్మాగారాలు ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు ఉంటుంది. ఇక ఈ జాతకులకు సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 17 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. శని దశ కాలంలోవిద్య కాస్త మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అనుకూలత ఏర్పడి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.

34 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, విదేశీ ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి.

41 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగానే సాగుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదము
ఉత్తరాభాద్ర నక్షత్ర రెండవ పాదము జాతకుల మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రము. ఈ జాతకులకు సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది.

వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వ్యాపారం అనుకులిస్తుంది కూడా. వీరికి విద్యా సంబంధిత, పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు.

ఈ జాతకులకు 13 సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది.

30 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసివస్తాయి.

37 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగా గడిచిపోతుంది.

ఉత్తరభద్ర నక్షత్రము మూడవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం  ఉంటుంది. వీరు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి నౌకలలో ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు తొమ్మిది సంవత్సరాలు శని దశ  ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 

26 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడిఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 

33 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

ఉత్తరాభద్ర నక్షత్రము నాలుగవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. భావోధ్వేగాల విషయంలో తమ మీద తమకు నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం ఉద్యోగం అనుకూలిస్తాయి. సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు కూడా అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు ఐదు సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 14 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 

22 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 

29 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. 

72 సంవత్సరాల వచ్చే18 సంవత్సరాల రాహు దశ కాలంలో కాస్త ఒడిదుడికులు ఎదుర్కొంటారు.


ఉత్తరాభద్రా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలుఫలం

జన్మ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర శరీరశ్రమ

సంపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ధన లాభం

విపత్తార అశ్విని, మఖ, మూల కార్యహాని 

సంపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ క్షేమం

ప్రత్యక్ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ప్రయత్న భంగం

సాధన తార రోహిణి, హస్త, శ్రవణం కార్య సిద్ధి, శుభం

నైత్య తార మృగశిర, చిత్త, ధనిష్ట బంధనం

మిత్ర తార ఆరుద్ర, స్వాతి, శతభిష సుఖం

అతిమిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం, లాభం

అంశ గుణాలు :
1) తీక్షణాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు జ్ఞానవంతులు, సౌమ్యమైన గుణం కలవారు.

2) అభయాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు జ్యోతిష శాస్త్ర పండితులుగా గాని, పంచాంగ కర్తలుగా గాని ఉంటారు.

3) అభయాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు, ధనవంతులు అవుతారు.

4) దీనాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ధనం సంపాదించువారు అవుతారు.

నక్షత్ర శాంతి: 
కోవాను ప్రత్యేకంగా తయారు చేయించి 8 మంది వృద్ధ బ్రాహ్మణులకు శివాలయంలో దానం ఇవ్వండి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అహిర్బుద్ధ్నియః ప్రథ’మా న ఏతి ।
శ్రేష్టో' దేవానా'ముత మాను'షాణామ్ ।
తం బ్రా”హ్మణాస్సో' మపాస్సోమ్యాసః' ।
ప్రోష్ఠపదాసో' అభిర’క్షంతిసర్వే” ।
చత్వార ఏక'మభి కర్మ' దేవాః ।
ప్రోష్ఠపదా స ఇతి యాన్, వదంతి ।
తే బుధ్నియం' పరిషద్యగ్గ్' స్తువంతః' ।
అహిగ్మ్' రక్షంతినమ’సోపసద్య' ॥

నక్షత్ర గాయత్రి
ఓం అహిరబుధ్నాయ విద్మహే 
ప్రతిష్ఠాపనాయ ధీమహి 
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం - డంగేరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
రెండవ పాదం - కుడుపూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.
మూడవ పాదం - గుడిగళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి.
నాలుగవ పాదం -శివలలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి.

Sunday, August 16, 2026

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణగణాలను పాడుకుంటూ వచ్చాడు. మునులంతా ఆనందంతో ఎదురువెళ్ళి ఆహ్వానించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపి సభామధ్యభాగంలో సముచితాసనంమీద కూర్చుండబెట్టారు. 

నారదుడు శాంతచిత్తుడై సంతోషం ప్రకటించాడు. గౌతముని కీర్తిప్రతిష్టలను ముల్లోకాలలోనూ వింటున్నానని ప్రశంసించాడు. ఇంద్రలోకంలో శచీపతినోట ప్రత్యేకంగా విని నిన్ను చూడాలనిపించి వచ్చానన్నాడు. గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రుడవై ధన్యుడవయ్యావన్నాడు. 

మందిరానికి వెళ్ళి గాయత్రీదేవిని దర్శించాడు. కన్నులు వికసించాయి. దివ్యానుభూతితో పరవశించి కీర్తనలు ఆలపించాడు. మరికొంతసేపు గౌతముడితో మునులతో విప్రులతో గడిపి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు.

నారదుడంతటివాడు రావడమూ గౌతముణ్జి ప్రశంసించడమూ ఇంద్రాది దేవతలుకూడా మెచ్చుకుంటున్నారని చెప్పడమూ - ఇదంతా అక్కడి బ్రాహ్మణులకు కంటకింపుగా మారింది. రోజూ ఎవరో ఒకరు రావడమే. గౌతముణ్జి ఓహో ఓహో అనడమే. తట్టుకోలేకపోయారు. 
ఆసూయ బయలుదేరింది. ఆందరూ చెవులు కొరుక్కుని ఒకనాడు ఒకచోట గుమికూడారు. తగిన సమయం చూసి వాతపెట్టాలి. ఇతడి యశస్సుకి అడ్డుకట్ట వెయ్యాలి - అని నిశ్చయంచుకున్నారు.

పదిహేనేళ్ళు గడిచాయి. వానలు పడ్డాయి. నేలపచ్చబడింది. పంటలు పండాయి. కరువు తీరింది. దేశం సుభిక్షంగా ఉంది. నాలుగువైపులనుంచీ వార్తలు చేరాయి. బ్రాహ్మణులు మళ్ళీ రహస్యసమావేశం జరుపుకున్నారు. ఏదోఒక వంకతో గౌతముణ్జి శపించి మనమన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. 

ఆహా! ఎంత అందంగా ఉందో చూశావా జనమేజయా! ఇలాంటి వాళ్ళని కన్న తల్లిదండ్రుల జన్మ నిజంగా ధన్యం అనాలి కదూ !! కాలమహిమ అటువంటిది. దాన్ని తెలుసుకోవడం ఎవడితరం!

సరే - అందరూ కూడబలుక్కుని ఒక మాయ ఆవును సృష్టించారు. అది కూర్చుంటే లేవలేదు. లేస్తే నడవలేదు. అంతటి ముసలిది. ఇవ్వేళో రేపో అన్నట్టుంది దాని పరిస్థితి. అలాంటి ఆవును సృష్టించి గౌతముడి పర్ణశాలదగర వదిలిపెట్టారు.

లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఇది గుమ్మంనుంచి లోపలికి రాబోయింది. మహర్షి చూశాడు. హుం హుం అంటూ మెల్లగా అదిలించాడు. లేచి బయటికి తోలడం అగ్నిహోత్రానికి విఘ్నమవుతుందని కూర్చున్నచోటునుంచి కదలకుండానే హుంకారంతో అదిలించాడు. ఆ మాత్రానికే ఆ ముసలి ఆవు ప్రాణాలు వదిలేసింది. నేలకు ఒరిగిపోయింది.

ఇంకేముంది - బ్రాహ్మణులు అరుపులూ కేకలూ మొదలుపెట్టారు. అయ్యో! అయ్యో! ఆవును చంపేశాడు గౌతమమహర్షి గోహత్యామహాపాతకి - అంటూ గుండెలు బాదుకున్నారు. గౌతముడికి ఇదంతా వింతగా అనిపించింది. అలాగే హోమం పూర్తి చేసుకుని ఇవతలికి వచ్చాడు.

అసలు సంగతి ఏమిటా అని ఒక్కసారి దివ్యదృష్టి సారించాడు. విషయం అర్థమయ్యింది. బ్రాహ్మణుల పన్నాగమని తెలిసిపోయింది. అసూయాగ్రస్తులై ఇంతకు తెగిస్తారా! కుట్రలు పన్నుతారా! కోపం భగభగలాడింది. ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయాడు. కన్నులు నిప్పులు కురిసాయి. కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు.

బ్రాహ్మణాధములారా! వేదమాతపట్ల గాయత్రీధ్యానంపట్ల తన్మంత్రజపంపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఎర్పడుగాక! వేదంపట్ల వేదోక్తయజ్ఞాలపట్ల తద్వార్తలపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! శివుడిపట్ల శివమంత్రంపట్ల శివశాస్త్రంపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! 

మూలప్రకృతి శ్రీదేవిపట్ల తన్మంత్రధ్యానాలపట్ట తత్కథలపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడు గాక! దేవీమహోత్పవ దిదృక్షపట్ల దేవీనామానుకీర్తనపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! దేవీభక్తుల సాన్నిధ్యంపట్ల దేవిభక్తులను అర్చించడంపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక!

శివోత్సవ దిదృక్షపట్ల శివభక్తార్చనపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! రుద్రాక్ష బిల్వపత్రాలపట్ల పరిశుభ్ర విభూతిపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! శ్రాతస్మార్త సదాచార జ్ఞానమార్గాలపట్ల బ్రాహ్మణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక!

అద్వైతజ్ఞాననిష్ఠపట్ల శాంతిదాంత్యాది సాధనపట్ల బ్రాహ్మణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! నిత్యకర్మానుష్ఠానంపట్ల అగ్నిహోత్రంపట్ల బ్రాహ్మాణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! స్వాధ్యాయ ప్రవచనలపట్ల గోదానాది సత్కర్మలపట్ల పితృశ్రాద్దాలపట్ల కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతాలపట్ల ప్రాయశ్చిత్తాలపట్ల బ్రాహ్మణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఎర్పడుగాక! 

శ్రీదేవిపట్ల కాక ఇతరదేవతలపై శ్రద్ధాసక్తులు పుట్టి శంఖచక్రాది చిహ్నాంకితులై బ్రాహ్మణాధములారా! మీరు ధర్మభ్రష్టులగుదురుగాక! కాపాలిక మతాసక్తులై బౌద్దశాస్త్రరతులై పాషండాచార నిరతులై పితృమాతృ సుతా భ్రాతృకన్యాభార్యా విక్రయణ తత్పరులై వేద తీర్ధ ధర్మవిక్రయులై బ్రాహ్మణాధములారా ! మీరు సర్వదా పతితులగుదురుగాక!

పాంచరాత్ర కామశాస్త్ర కాపాలికమత బౌద్ధమతాల పై శ్రద్ధకలిగిన వారగుదురుగాక! మాతృకన్యాగాములూ భగినీగాములూ పరస్త్రీలంపటులూ అయి సదాచారభ్రష్టులగుదురుగాక! ఓ బ్రాహ్మణాధములారా! మీరూ మీ వంశాల్లో పుట్టే స్త్రీపురుషులందరూ - మద్దత్తశాపాగ్ని దగ్గులగుదురుగాక! 

ఇన్ని శాపాలతో పని ఏముంది! గాయత్రీదేవి మూలప్రకృతి పరమేశ్వరి - మీమీద కోపాగ్నులు సర్వదా కురిపించుగాక! ఇక అంధకూపాది నరకకుండాలలోనే మీ ఆందరి ఉనికి అని తెలుసుకోండి. పొండి - అని బ్రాహ్మణులమీద వాగ్దండం ప్రయోగించి నీళ్ళు స్పృశించి దేవీదర్శనం కోసమని గాయత్రీమందిరానికి వెళ్ళాడు. 

సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవికూడా ఆ బ్రాహ్మణుల దుశ్చేష్టితానికి ఆశ్చర్యపోయింది. జనమేజయా! అందుకే ఇప్పటికీ ఆ దేవి ముఖం స్మయయుక్తంగానే - ఆశ్చర్యపోతున్నట్టే  - ఉంటుంది.

తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతముణ్ణి ఆ స్మయమానముఖాంబుజ గాయత్రీమాత ఓదార్చింది. వత్సా! పాముకి పాలుపోసినట్టయ్యింది. విషంగానే మారుతుంది. ఆది సహజం. వాళ్ళ కర్మ అలా కాలింది. నువ్వేం చేస్తావ్‌. మహాభాగా! శాంతించు.

ఈ మాటలతో గౌతముడు తేరుకున్నాడు. ఆశ్రమం చేరుకున్నాడు. యథాపూర్వకంగా తపస్సు సాగించాడు.

విప్రుల పశ్చాత్తాపం





Gayatri Mahima - Goutamudi Katha - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

జనమేజయా! ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన పదిహేను సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే. లెక్క పెట్టటం ఎవరితరమూ కాలేదు. ఆకలి తట్టుకోలేక చనిపోయినవారు చనిపోగా మిగిలినవారు పందుల్నీ కుక్కల్నీ గుర్రాల్నీ ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపుకుని తిన్నారు. 

కొందరు మానవశవాలనే భక్షించారు. తల్లి కొడుకునీ, మగడు భార్యనీ భక్షించే భయంకర దుర్భిక్షమది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రీ జపమహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని సుభిక్షంగా ఉందనీ వింటున్నాం. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుందనీ సుఖంగా జీవిస్తోందనీ తెలిసింది.

కనక మనంకూడా వెళ్ళి ఆ మహర్షినే ఆశ్రయిద్దాం - అని నిశ్చయించుకుని అగ్నిహోత్రాలతో కుటుంబాలతో గోవులతో దాసదాసీజనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అన్ని దిక్కులనుంచీ ఒక్కసారిగా తరలివెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు. ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. ఆగమనకారణం తెలుసుకున్నాడు. అందరికీ అభయమిచ్చాడు.

ఇది మీ ఇల్లే అనుకోండి. నేను మీ దాసుణ్ణే అనుకోండి. ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏమిటి! మీవంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణి అయ్యాను. మీ దర్శనభాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతాలన్నీ సుకృతాలైపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు.

నాకంటే ధన్యుడెవడు! ఇక్కడే అందరూ హాయిగా ఉండండి. మీ మీ సంధ్యావందన జపాదికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి - అని అందరినీ ఊరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తరవాత తాను లోపలికి వెళ్ళి గాయత్రిని ప్రార్థించాడు.

నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే ।
వ్యాహృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి ॥

మహావిద్యా! వేదమాతా! పరాత్పరా! వ్యాహృతి త్రయంతో (భూర్భువః స్వః) మహామంత్రస్వరూపా! ఓంకార రూపిణీ! సామ్యావస్థాత్మికా! హ్రీంకారరూపిణీ! స్వాహా - స్వధా స్వరూపా! సకలార్థప్రదాయిని! నమో నమః. నమో నమః. భక్తకల్పలతా! అవస్థాత్రయ సాక్షిణీ! తుర్యాతీతస్వరూపా! సచ్చిదానంద రూపిణీ! సర్వవేదాంతసంవేద్యా! సూర్యమండలవాసినీ! ప్రాతఃకాలంలో రక్తవర్ణంలో బాలారూపిణివై, మధ్యాహ్న సమయంలో యువతివై, సాయంవేళలో కృష్ణవర్ణంలో వృద్ధవై అలరారే జగన్మాతా! నమో నమః. సర్వభూతసృష్టికీ అరణివంటిదానా! పరమేశ్వరీ! అనుగ్రహించు.

గౌతముని ప్రార్థనకు సంతోషించి గాయత్రీమాత ప్రత్యక్షమయ్యింది. అందరినీ అన్నపానాలతో పోషించడానికి విలుగా పూర్ణపాత్రను ప్రసాదించింది. మహర్షీ! నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ పాత్ర. స్వీకరించు - అని అందించి అంతర్థానం చెందింది.

అన్నరాశులు పర్వతాకారంగా ఆవిర్భవించాయి. షడ్రసోపేతంగా వంటకాలు ఆవిర్భవించాయి. కోరుకున్న భూషణాలూ వస్త్రాలూ యజ్ఞసామగ్రి పాత్రసామగ్రి సంబారాలూ - గౌతముడు ఏక్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్దిగా అందించింది ఆ గాయత్రి పూర్ణపాత్ర. విప్రులకు ఆయా వస్తువుల్ని పుష్కలంగా వంచిపెట్టాడు. 

గోమహిషాది పశువులుకూడా ఆవిర్భవించాయి. వాటినీ విప్రులకు బహూకరించాడు. వాటికి కావలసిన ఆహారమూ అందింది. గౌతముడి సూచనప్రకారం అందరూ కలిసి అక్కడ అనేక యజ్ఞాలు నిర్వర్తించారు. ఆశ్రమప్రాంతం స్వర్గసీమను తలపించింది. సమస్త సమృద్దులతో కళకళలాడింది. ముల్లోకాలలోనూ ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవించింది. 

వస్త్ర చందన, భూషలతో విప్రులందరూ దేవపురుషుల్లాగా ఉంటే వారి స్త్రీలందరూ దేవతాస్త్రీలే ఆనిపించారు. ఆ దివ్యవస్త్రాలుగానీ ఆ దివ్యభూషణాలుగానీ అలా ఉన్నాయి. ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తోంది. రోగ - రాక్షస - చోర భయాలు లేవు. 

శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమమండలం ఇంకా రకరకాల ప్రాణికోటిని ఆకర్షించింది. ఎవరు వచ్చినా ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు ఆదరించి పోషించాడు.

యజ్ఞయాగాలు నిరంతరంగా పుష్కలంగా జరగుతూండటంతో దేవతలూ సంతోషించారు. మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి కోరికలు తీరుస్తున్నట్టుంది. లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతోంటే వీరికి ఈ సమృద్ది ఎలా సాధ్యం అనుకున్నాడు.

పన్నెండేళ్ళు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగని ఏ కొంచెమూ గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్యమందిరం కట్టించాడు. మునివిప్రులంతా అక్కడచేరి భక్తిశ్రద్ధలతో ముప్పొద్దులా అర్చించారు. మంత్ర పురశ్చరణలు సాగించారు. 

జనమేజయా! ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది. గాయత్రీమాత బాలగా యువతిగా వృద్దురాలిగా త్రిసంధ్యల్లోనూ దర్శనమిస్తోంది. 

బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం





Mahadevi Aatmavishkaram - మహాదేవి ఆత్మావిష్కారం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - మహాదేవి ఆత్మావిష్కారం

భాస్వజ్జపాకుసుమాభ, బాలకోటిరవిప్రభ, బాలశీతాంశుమకుట, వస్త్రాంతర్వ్యంజితస్తని. వర - పాశ
- అంకుశ - అభయ హస్తాలు నాలుగు, రమణీయాంగి, కోమలాంగలతిక, శివ, భక్తకల్పద్రుమం, అంబిక, నానాభూషణ భూషిత, త్రినేత్ర, మల్లికామాలికా కబరీజూట విరాజిత. ఆమెకు నాల్గువైపులా నాలుగువేదాలూ రూపుదాల్చి నిలబడి స్తుతిస్తున్నాయి.

ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంతమేరా నేల పద్మరాగాలు తాపించినట్టు అవుతోంది. ప్రసన్న స్మేరవదన, కోటి కందర్పసుందర, రక్తాంబరపరీధాన, రక్తచందన చర్చిత, ఉమాదేవి, హైమవతి, నిర్వ్యాజకరుణామూర్తి, సర్వకారణకారణ - మహేంద్రుడు దర్శించాడు.

భక్తినిర్ఝరులు గుండెల్లో పొంగులెత్తాయి. కన్నులు చెమ్మగిల్లాయి. గొంతు గద్గదమయ్యింది. తనువు
పులకించింది. ఉక్కిరిబిక్కిరి అవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులూ నుతులూ జాలువారాయి. అమ్మా! ఆ యక్ష రూపం ఏమిటి? ఎందుకు ఆలా అవతరించావు? ఇప్పటికీ ఆర్థం కావడంలేదు. అనుగ్రహించు తల్లీ! - అని అభ్యర్థించాడు. కరుణసముద్రం పలికింది -

ఇంద్రా! నా రూపమే పరబ్రహ్మం. సర్వకారణకారణం. మాయాధిష్ఠానం. సర్వసాక్షి, నిరామయం.
సర్వవేదాలూ ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వతపస్సులూ సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వతపస్వులూ దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిన్తున్నారో - ఆ పదాన్ని ఒక్కముక్కలో నీకు చెబుతున్నాను. గ్రహించు - 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీమ్మయమ్‌

ద్వే బీజే మమ మంత్రే స్తో ముఖ్యత్వేన సురోత్తమ ॥

సురనాయకా! ఓమ్‌ అనే ఒక్క అక్షరమే పరం బ్రహ్మ, దాన్నే హ్రీమ్‌ మయంగానూ పలుకుతున్నారు.
ఇవి రెండే నా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకుని జగత్తులు
సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం (ఓమ్‌) సచ్చిదానందనామకం. రెండవది మాయాప్రకృతి సంజ్ఞితం, ఆ మాయయే (హ్రీమ్‌) పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని, జాబిల్లి వెన్నెలల్లాగా నేనూ మాయా అవిభాజ్యలం, అభిన్నలం. ఈ మాయ నాదే. సామ్యావస్థాత్మిక. 

ప్రళయంలో సకలజగత్తులూ నాలో లీనమై అభిన్నంగా ఉంటాయి. కర్మపరిపాకవశాన ప్రాణికోటికి పునస్సృష్టిలో పునర్జన్మలూ పునారూపాలూ నానుంచి అభివ్యక్తమవుతుంటాయి. అంతర్ముఖమైన అవస్థను 'మాయ' అంటారు. బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దానినుంచే ప్రాణికోటి సంభవిస్తుంది.

సృష్టి సమయంలో అదే రజోగుణమవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులయ్యారు. 

త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ సత్త్వగుణాధికుడు విష్ణువు. తమోగుణాధికుడు రుద్రుడు.
స్థూలదేహం - బ్రహ్మ. లింగదేహం(సూక్ష్మదేహం) శ్రీహరి. కారణదేహం రుద్రుడు. తురీయావస్థను నేనే.

సామ్యావస్థ అన్నానే అది. సర్వాంతర్యామిరూపిణి. అటుపైని పరంబ్రహ్మమైన నా రూపం -
రూపవర్జితం. అందుకనే నారూపం నిర్గుణమూ సగుణమూ అని రెండు విధాలు. వీటిలో నిర్గుణరూపం మాయారహితం. సగుణరూపం మాయాసహితం. 

నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడినా ఆజ్ఞగా గాలివీస్తున్నాడు. సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్జలే. 

కనక నేను సర్వోత్తమను. నా అనుగ్రహం వల్లనే రాక్షసయుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మలుగా (కొయ్యబొమ్మలుగా - కాష్ఠపుత్తలికోపమాన్‌) ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకూ ఒక్కొక్కప్పుడు దైత్యులకూ విజయం అందిన్తుంటాను. నేను స్వతంత్రను. నా ఇచ్చయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తుంటాను.

సురోత్తమా! సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయగర్వంతో విర్రవీగారు. అది అంతా మీ
ప్రయోజకత్వమే అని అహంకరించారు. మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహబుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపజేశాను. 

మీ అహంకారాలను అణిచివేశాను. మీ శక్తిహానత మీకు తెలిసివచ్చేట్టు చేశాను. కనక ఇకనుంచీ నిరహంకారులై సచ్చిదానంద రూపిణిని నన్ను శరణువేడండి - అని చెప్పి అంతర్ధానం చెందింది.

జనమేజయా! అప్పటినుంచీ ఇంద్రాదిదేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరీ
పాదపద్మాలను ఉపాసించ నారంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడం, యజ్ఞభాగాలను మహాదేవికి నివేదన చెయ్యడం - ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. 

ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రీ జపతత్పరులూ తారహృల్లేఖా జపనిష్ణాతులూ అయ్యారు. తక్కిన హరి - హరోపాసనలు ఏవీ నిత్యకర్మలు కాదు. గాయత్రీ ఉపాసన ఒక్కటే నిత్యవిధిగా వేదాలు అన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇది ఒక్కటి చేస్తే చాలు ద్విజులకు కృతకృత్యత్వమే. 

తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రీమాత్రనిష్ణాతుడైతే చాలు ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు.

అంతటి శక్తి సంపన్నమూ వేదత్రయప్రతిపాదితమూ అయిన గాయత్రీ ఉపాసనను విడిచిపెట్టి హరి - హరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొట్టతొలి కృతయుగంతో ద్విజోత్తములందరూ గాయత్రీ రూపాన దేవీ పాదపద్మాలను ఉపాసించారు.

గాయత్రీ మహిమ - గౌతముడి కథ





Indraadi Devatalaku Devi Gunapatham - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

పూర్వకాలంలో మదోద్దతులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది నూరేళ్ళు సాగిన మహాయుద్ధం. మహావిస్మయ కారకం. నానాశస్త్ర ప్రహరణాన్వితం. నానామాయా విచిత్రితం. జగద్వినాశకరం. ఎట్టకేలకు పరాశక్తి కృపావిశేషంవల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్నీ భూగోళాన్నీ విడిచి పాతాళానికి పారిపోయి తలదాచుకున్నారు. 

అప్పుడు దేవతలు అది అంతా తమ ప్రయోజకత్వమే అనుకుని పరాక్రమాలను పరస్పరం ప్రశంసించుకొన్నారు. మోహవిభ్రాంతిలోపడి చంకలు కొట్టుకుంటూ తమనుతాము తెగ పాగుడుకున్నారు.

మనకు జయం కలగక చస్తుందా! మన మహిమ అటువంటిది. మనం సర్వోత్తరులం. మహావీరులం. మనముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు. పామరులు, పిరికి పందలు, పరాక్రమహీనులు. మనమో - మహాయశస్వులం, తేజస్వులం, సృష్టిస్థితిలయకారకులం. దైత్యులు మనకొక లెఖ్ఖా!

ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మరిచిపోయి చిందులు తొక్కుతున్న దేవతలను చూసి జగదంబిక జాలిపడింది. కరుణిద్దామనిపించి యక్షరూపంలో అవతరించింది. ఆ రూపం - కోటిసూర్య ప్రతీకాశం. చంద్రకోటిసుశీతలం. విద్యుత్కోటి సమానాభం. హస్తపాదాదివర్జితం. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నదికాదు. ఆ రూపం ఆ తేజస్సు పరమసుందరంగా అద్భుతావహంగా ఉంది.

ఏమిటిది? ఏమిటిది? దైత్యుల దుశ్చేష్టకాదుగదా! ఏదో తెలియని మహామాయ కాదుగదా! దేవతలం - మనకే ఇంత విస్మయాన్ని కలిగిస్తున్నదే దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపి ఉంటారు చెప్మా!

దేవతలంతా గుమికూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడగాలి. పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. బలాబలాలు తేల్చుకోవాలి. అప్పుడు ప్రతిక్రియ చెయ్యాలి - అని ఒక వ్యూహం నిర్ణయించారు.

వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు. వహ్నీ! దేవతలకు నువ్వేకదా ముఖస్థానీయుడివి అంచేత నువ్వే వెళ్ళు. అదేమిటో తెలుసుకో - అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరత్వరగా వెళ్ళాడు.

ముందుగా ఆ యక్షరూపమే - నువ్వెవడవు అని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంతో చెప్పమంది. నేను అగ్నిని. జాతవేదసుడను. అన్నింటినీ దహించివెయ్యగల శక్తి నన్ను నమ్మి నాలో ఉంది - అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో! అలాగా! అయితే ఈ గడ్డిపరకను దహించు. నువ్వు ఉంది అని చెప్పుకుంటున్న శక్తి నీలో ఉందో లెదో చూస్తాను - అంటూ ఆ యక్షతేజోరూపం ఒక గడ్డిపరకను అగ్నిదేవుడి ముందుకి విసిరింది. 

వహ్నిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకుని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఆ గడ్డిపరకను ఏమీ చెయ్యలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకేమయ్యింది ఇవ్వేళ? అంతుబట్టలేదు.

దేవతల దగ్గరికి పరుగుపెట్టాడు. దేవతలంతా ఒక్కసారిగా మీదపడ్డారు. ఎవరో ఏమిటో తెలుసుకువచ్చావా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు. వృధాభిమానంతో విర్రవీగుతున్నాం. ఛీ - ఛీ అని ముగించి తొలగిపోయాడు.

ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుణ్ణి పిలిచాడు. జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీ కదలికలతోనే అన్నీ కదిలేది. నువ్వు ప్రాణరూపివి. ప్రాణికోటికి సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తెలుసుకునిరా. నీకన్నా సమర్థుడెవడు? - అని గాలిదేవుడికి కాస్త గాలికొట్టి పంపించాడు. 

వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్నవేసింది. నేను వాయువును. సర్వశక్తి సంపన్నుడను. దేనినైనా ఎగురగొట్టగలను. నావల్లనే ఈ జగత్తు బతుకుతోంది - అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గడ్డిపరక కదుపు - అంది యక్షరూపం. లేకపోతే తలదించుకుని నోరుమూసుకుని వచ్చినదారినే వచ్చినచోటుకే ఫో - అనికూడా అనేసింది.

వాయుదేవుడికి అభిమానం పొడుచుకు వచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డిపరకను కదిలించలేకపోయాడు. శృంగభంగమయ్యింది. తలదించుకుని నోరుమూసుకుని పరుగుతీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అస్సలు తెలియడం లేదు. మనం అసమర్దులం. మిథ్యాభిమానులం. అదేదో అలౌకిక యక్షతేజస్సు. పరమదారుణ తేజస్సు - అనేసి తానూ జారుకున్నాడు.

ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుణ్ణి ఎగద్రోశారు. నువ్వు దేవనాయకుడవు. యక్షుల్ని బాగా ఎరుగుదువు. కనక నువ్వే వెళ్ళు అంటే వెళ్ళు అన్నారు. సరే, తెలుసుకుని వస్తాను - అంటూ దేవేంద్రుడు సగర్వంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజోరూపం ఇంద్రుణ్ణి తరిమింది. చాలాదూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమయ్యింది. 

మాటా మంతీ వినపడటం లేదు. ఇంద్రుడికి దిక్కుతోచలేదు. దారుణమైన అవమానమనిపించింది. తననే మాయ చేసిందా? కనుగప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖంపెట్టుకుని వెళ్ళను! ఏమి చెప్పను! దేవతలముందు ఎంత అవమానం! మహాత్ములకు అభిమానమే ధనమన్నారు. అది పోయాక బతికి ఏమి లాభం? చావుతో సమానం. కనక నాకిక మరణమే శరణం - అని నిశ్చయించుకుని ఆ పని చెయ్యబోయాడు.

సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. సహస్రాక్షా! మాయాబీజాక్షరం జపించు, సుఖపడతావు - అంది. వెంటనే అక్కడే తపస్సుకి కూర్చున్నాడు. కన్నులన్నీ మూసుకుని మాయాబీజాక్షరాన్ని లక్షసంవత్సరాలు నిరాహారుడై జపించాడు.

ఒక చైత్ర నవమినాడు సూర్యుడు నడినెత్తికి వచ్చినవేళ మళ్ళీ అదే యక్షరూపం అదే తేజఃపుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యింది. అయితే ఈసారి ఆ తేజోమండలానికి మధ్యలో నవయౌవనంలో ఉన్న కుమారీ రూపం కనిపించింది.

మహాదేవి ఆత్మావిష్కారం





Deeksha Svikaram - దీక్షా స్వీకారం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దీక్షా స్వీకారం

అటుపైని గురువుగారు శిష్యుణ్ణి ఆగ్నికుండం దగ్గరకి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణం దాల్చి కొత్త కమండలువు చేతబట్టి సిద్ధంగా ఉండాలి. గురుసన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకూ కులదేవతకూ నమస్కరించాలి. పీటమీద కూర్చోవాలి. 

అప్పుడు అతణ్ణి గురువుగారు కృపాదృష్టులతో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్లు భావించాలి. హోమం చెయ్యడంవల్ల లభించిన దివ్యదృష్టితో అధ్వసంశోధన చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాడా? దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా? పరిశీలించాలి. 

శిష్యుడి శరీరంలో షడధ్వ పరిశీలన చెయ్యాలి. పాదాలలో కళాధ్వాన్నీ సంధిబంధాల్లో తత్త్వాధ్వాన్నీ నాభిలో భువనాధ్వాన్నీ హృదయంలో వర్ణాధ్వాన్నీ ఫాలభాగంలో పదాధ్వాన్నీ మూర్ధంలో మంత్రాధ్వాన్నీ విశోధించాలి.

ఒక్కొక్క అధ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చతో తాకుతూ, శోధయామ్యముమధ్వానం స్వాహా అంటూ - నేతితో తడిపిన తిలలు తారాఢ్యంగా ఎనిమిదేసిసార్లు హోమం చెయ్యాలి. ఇలా ఆరింటికీ చేశాక ఆ షడధ్వాలూ బ్రహ్మలో లీనమైనట్టు భావించాలి.

మళ్ళీ వాటిని సృష్టిమార్గాన పునరుత్పాదన చెయ్యాలి. అప్పుడు మళ్ళీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చెయ్యాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్ఠాన దేవతను కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి ఆంగాహుతులిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి.

శిష్యుడి కళ్ళకు గుడ్డకట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ ఆగ్నికుండంనుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజెయ్యాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్తవిధంగా శిష్యదేహంలో భూతశుద్ది చెయ్యాలి. న్యాసాలు జరపాలి. 

అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఆ కుంభోదకాలతో స్నానం చేయించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీజలం చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. 

భస్మావలేపనం చేసుకోవాలి. గురుసన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడై గురువుగారు తన హృదయంనుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్టు భావించాలి. ఆ ఉభయదేవీ మూర్తులకూ ఐక్యాన్ని భావిస్తూ గంధపుష్పాదులతో పూజచెయ్యాలి. తన కుడిచేతిని శిష్యుడి శిరన్పుపై ఉంచి కుడిచెవిలో - మహాదేవీ మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాలి. 

వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని నూటయెనిమిదిసార్లు జపించాలి. దేవతారూపుడైన గురువుగారికి సాష్టాంగనమప్కారం చెయ్యాలి. తన సర్వస్వమూ సమర్పించాలి. యావజ్జీవితమూ అనన్యబుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. 

సువాసినులకూ కుమారీమణులకూ వటువులకూ దీన అనాథ దరిద్రులకూ లోభించకుండా బట్టలూ భోజనాలూ పెట్టాలి. ధనసువర్ణాదులుకూడా యథాశక్తిగా ఇవ్వవచ్చు. తన కృతార్థతను గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యమూ ఉపాసించాలి.

నారదా! ఉత్తమోత్తమమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవిపాదపద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మంలేదు. వేదమార్గానుయాయులు వారివారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశాలు చెయ్యవచ్చు, పొందవచ్చు. 

ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రికరీతి. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు నేను చెప్పాను. పరాంబికను సేవించు. త్రికరణశుద్ధిగా ఉపాసించు. నిత్యమూ నేను అలా ఆరాధించి ఇలా పరనిర్వృతిని (అత్యంత మనశ్శాంతి) పొందుతున్నాను - అని నారాయణమహర్షి సంభాషణ ముగించాడు. 

కన్నులు మూసుకుని దేవీపాదపద్మాలను ధ్యానిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినయవినమితగాత్రుడై ఆ మునిశిఖామణికి ఆ జ్ఞానస్వరూపునికి ఆ కృపాజలనిధికి ఆ అమృతాంతరంగునికి ఆ శిష్యవత్సలునికి ఆ నిష్ఠానిధికి సాష్టాంగనమస్కారం చేసి, దేవీ దర్శనలాలసుడై వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు.

శౌనకాది మహామునులారా! నారదనారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాసభగవానుడు జనమేజయమహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకుమించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు - అన్నాడు సూతమహర్షి.

సూతమహర్షి! వినయశీలివి కనక నువ్విలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు! ఎంతెంత సందేహాలు తీర్చావు! నీ జ్ఞానం నీ పరిజ్ఞానం అమోఘం. అనన్యం. ఇంతా విన్నాక జనమేజయు డేమన్నాడు? వ్యాసుడు ఇంకా ఏమి చెప్పాడు? అది కూడా తెలియజెయ్యి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది - అన్నారు శౌనకాది మహామునులు. సూతుడిప్పుడింక వ్యాసజనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు.

హే భగవన్‌! వ్యాస! సర్వధర్మజ్ఞా! సర్వశాస్త్ర విదాంవరా! ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లో నేమిటి ఇతర సమయాల్లో నేమిటి జగన్మాతనే నిత్యమూ ఉపాసించాలి. మరి ఆలాంటప్పుడు కొందరు ద్విజులు దేవీ వరివస్యను(సేవ) విడిచిపెట్టి ఇతరదేవతలను ఆరాధిస్తున్నారెందుకని?

కొందరు వైష్ణవులు కొందరు గాణపత్యులు కొందరు కాపాలికులు కొందరు బౌద్దులు కొందరు దిగంబరులు - ఇలా రకరకాలవారు కనిపిస్తున్నారు. వేదవాక్కుపట్ల వీరికి శ్రద్ధలేనట్టేనా? ఈ సందేహం నువ్వే తీర్చాలి. బుద్ధిమంతులూ పండితులూ నానాతర్కవిచక్షణులూ అయ్యుండీ వేదాలపట్ల శ్రద్ధలేకపోతే ఎలాగ? స్వీయశుభపరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరచుకోడే. 

అటువంటిది వీరంతా దేవీసేవను విడిచి పెట్టేశారంటే కారణమేమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సందేహం తెముల్చు. ఆలాగే నీ ప్రసంగంలో మణిద్విపమహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవీ నివాసమన్నావు. దాన్ని సవిస్తరంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి. శ్రద్దగా వింటున్నవాణ్ణి. నాలాంటివారికి గురువులు ప్రసన్నులై గుహ్యాతి గుహ్యాలను సైతం ప్రకటం చేస్తారుగదా! (ప్రసన్నాస్తు వదంత్యేవ గురవో గుహ్యమప్యుత 8 - 8)

జనమేజయమహారాజా! అడగవలసింది అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడవు. వేదాలపట్ల శ్రద్ధ కలవాడవు. కనక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను. విను.

ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం





Sridevibagavatham - Phalashruthi - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి శౌనకాది మహామునులారా! మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది. ఆదిలో ఈ దేవీభాగవతం సా...