Wednesday, August 19, 2026

Ashta Mantrinulu - అష్ట మంత్రిణులు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - అష్ట మంత్రిణులు

ఇంద్రనీలప్రాకారాన్ని గడిచివెడితే ముక్తామయప్రాకారం. ఎత్తు దశయోజనాలు. కక్ష్యలో సమస్తమూ ముక్తామయం. ఇక్కడ అష్టదళపద్మం ఉంటుంది. ముక్తామణిగణాకీర్ణం. అతివిసృతం. సకేసరం. 

దీనిలో అష్టమంత్రిణులుంటారు. మహాదేవీ సమానాకారాలలో ఆ తల్లి ఆయుధాలు ఎనిమిదింటినీ ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తుంటారు. దేవికి ఇంగితజ్ఞలు. పండితలు. సర్వకార్యనిర్వహణ దక్షలు. స్వామికార్యపరాయణలు. 

దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో నేర్పరులు, అతి సుందరలు. నానాశక్తి సమన్వితలు. ప్రతీ బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతీప్రాణికి సంబంధించిన ప్రతీసమాచారాన్నీ జ్ఞానశక్తితో ప్రతీక్షణమూ తెలుసుకుంటూ ఉంటారు.

మహాదేవికి మంత్రిణులైన ఈ ఎనమండుగురి పేర్లూ ఏమిటంటే - అనంగకుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, ఆనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ.

వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాశ - అంకుశ - వర - అభయహస్తలు. విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తుంటారు.

షట్కోణ పద్మం





shodashadala padmam - షోడశదళ పద్మం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - షోడశదళ పద్మం

వైదూర్యప్రాకారం గడిస్తే ఇంద్రనీలప్రాకారం. ఇదీ దశయోజనోత్తుంగమే. కక్ష్యలో మధ్యభాగమంతా ఇంద్రనీలమణిమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతం. షోడశారం(పదహారు రేకలుంటాయి). షోడశకోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూంటుంది. 

ఇందులో పదహారు శక్తులకూ పదహారు సౌధాలున్నాయి. అన్ని సౌకర్యాలతో అన్ని సౌందర్యాలతో అన్ని సమృద్దులతో తులతూగుతుంటాయి. 

ఈ షోడశశక్తుల పేర్లు ఏమిటంటే - కరాళి, వికరాళి, ఉమ. సరస్వతి, శ్రీ, దుర్గ, ఉష, లక్ష్మి, శ్రుతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. 

వీరంతా నీలమేఘాల్లాగా ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు. ఆఖేటక ధారిణులు (కూడా వేటకుక్కలుంటాయని), యుద్ధప్రియలు. వీరు జగన్మాతకు సేనానులు. ప్రతిబ్రహ్మాండశక్తులకు నాయికలు. 

దేవీశక్తిని ఆవహింపజేసుకుని బ్రహ్మాండాలను క్షోభపెడుతుంటారు. నానా రథసమారూఢలు. నానాశక్తి సమన్వితలు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు.

అష్ట మంత్రిణులు





Ashta Matrukas - అష్ట మాతృకలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - అష్ట మాతృకలు

వజ్రప్రాకారం గడిచివెళ్ళాక వైదూర్యప్రాకారం. ఎత్తు పదియోజనాలు. గోపురద్వారాలు యథాపూర్వంగానే. వైదూర్యభూమి, వైదూర్యమందిరాలు, వైదూర్యవీథులు, వైదూర్యరథ్యలు. 

వాపీకూప తటాక స్రవంతుల గట్టులూ ఒడ్డులూ వైదూర్యమయాలు. వాటిలో ఇసుకకూడా వైదూర్యమయమే. వృక్ష వితర్దికలు వైదూర్యనిర్మితాలు. ఈ కక్ష్యలో ఎనిమిదిదిక్కులా అష్టమాతృకల మహాసౌధాలుంటాయి. వీరు ప్రతి బ్రహ్మాండమాతృకల సమష్టిరూపాలు. బ్రాహ్మి - మాహేశ్వరి - కౌమారి - వైష్ణవి - వారాహి - ఇంద్రాణీ - చాముండ - వీరు సప్తమాతృకలు.

ఎనిమిదవ మాతృకపేరు మహాలక్ష్మి, బ్రహ్మరుద్రాది దేవతలకు వీరు సమాకారలు. జగత్కల్యాణకారిణులు. సేనాసమావృతలై పరిచారికాగణ సేవితలై విరాజిల్లుతుంటారు. 

ఈ ప్రాకారం నాలుగు ద్వారాలదగ్గరా సాలంకృతాలై మహేశ్వరీవాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. కోటి ఏనుగులు, కోటి గుర్రాలు, కోటి పల్లకీలు, హంస - సింహ - మయూర - గరుడ - వృషభాదులూ - వీటిని పూన్చిన రథాలూ కోటికోటిసంఖ్యలో జెండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పార్‌ష్ణిగ్రాహులు సిద్ధం. వివిధ చిహ్నాలతో వాద్యవిశేషాలతో కోటి విమానాలు వేచిఉంటాయి.

షోడశదళ పద్మం





Devi Parichaarikalu - దేవీ పరిచారికలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దేవీ పరిచారికలు

గోమేధిక ప్రాకారం గడిచాక వజ్రమయసాల. ఇదీ అంతే ఎత్తు. గోవురాలూ ద్వారాలూ యథాతథం, కవాటాలూ వాటి గొలుసులూ గడియలూ వజనిర్మితాలే. ఈ కక్ష్యలో ఉన్న సమస్త వస్తుజాలమూ మందిరాలూ జంతుపక్షి బృందమూ వాపీ కూపతటాకాదికమూ - అంతా వజ్రమయం.

ఇక్కడ శ్రీభువవేశ్వరి పరిచారికలు నివసిస్తుంటారు. ఒక్కొక్క పరిచారిక చేతికిందా లక్షమంది దాసీజనం ఉన్నారు. అందరూ మదగర్వితలు. తాళవృంతధరలు. కొందరి చేతుల్లో చషకాలు (పానపాత్రలు) ఉంటాయి. కొందరి చేతుల్లో తాంబూలపాత్రలు. కొందరు ఛత్రధారిణులు. చామర ధారిణులు. వస్త్ర థారిణులు. పుష్పమాలికా ధారిణులు. ఆదర్శ ధారిణులు(అద్దాలు). కుంకుమ లేపన ధారిణులు. కజ్జల ధారిణులు. సిందూరచషక ధారిణులు.

మహాదేవికి కావలసిన అలంకరణసామగ్రిని సర్వసన్నద్ధంచేసి పట్టుకుని పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరిలో కొందరు మకరికాపత్ర నిర్మాణంలో నేర్పరులు. కొందరు పాదసంవాహనలో కొందరు భూషాకరణంలో కొందరు పుష్పమాలికాకరణంలో కొందరు వుష్పాలంకరణలో - ఇలా ఒక్కొక్క విద్యలోనూ కొందరు కొందరు నేర్పరులు. 

అందరూ బహువిలాస చతురలే. అందరూ యువతులే. చీరలు కట్టుకుని కొంగుబిగించి కళకళలాడుతుంటారు. దేవీకృపాలేశానికి నోచుకుని జగత్త్రయాన్నీ తుచ్చీకరించిన గర్వం ఠీవి వీరి ముఖాల్లో కదలికల్లో కనపడుతుంటుంది,

వీరే అమ్మవారికి దూతికలు. శృంగారమదగర్వితలు. వీరిపేర్లు చెబుతాను. విని ఆనందించు. అనంగరూపా - అనంగమదనా - మదనాతురా - భువనవేగా - భువనపాలికా - సర్వశిశిరా - అనంగవేదనా - అనంగమేఖలా నామధారిణులు. మెరుపుతీగల్లాంటి సుందరీమణులు. 

కాంచీకంకణకింకిణీగణ ఝణత్కారాలతో మంజు మంజీర శింజానాలతో ఇటూ అటూ పరుగులు తీస్తుంటారు. సర్వకార్య నిపుణలు. వేత్రహస్తలు. వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూసి తీరవలసిందే. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు! అడుగడుగునా ఖడ్గధారిణుల కావలి.

అష్ట మాతృకలు





Devi Shaktulu - దేవీ శక్తులు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దేవీ శక్తులు

పింగలాక్షి విశాలాక్షి సమృద్ధి వృద్ది శ్రద్ధా స్వాహా స్వధా మాయా వసుంధరా త్రిలోకధాత్రీ సావిత్రీ గాయత్రీ త్రిదశేశ్వరి సురూపా బహురూపా స్కందమాతా అచ్యుతప్రియా విమలా అమలా అరుణీ (20) 

ఆరుణీ ప్రకృతి వికృతి సృష్టి స్థితి సంహృతి సంధ్యామాతా సతీ హంసీ మర్దికా వజ్రికాపూరా దేవమాతా భగవతీ దేవకీ కమలాసనా త్రిముఖీ సప్తముఖీ సురాసురవిమర్దినీ లంబోష్ఠీ(40) 

ఊర్థ్వకేశీ బహుశీర్షా వృకోదరీ రథరేఖా శశిరేఖా అపరా గగనవేగా పవనవేగా భువనపాలా మదనాతురా అనంగా అనంగమథనా అనంగమేఖలా అనంగకుసుమా విశ్వరూపా సురాదికా క్షయంకరీ శక్తిః అక్షోభ్యా సత్యవాదినీ (60)బహురూపా శుచివ్రతా ఉదారా వాగీశ్వరీ నామాలతో మహాశక్తి కళారూపాలు చతుష్షప్టి.

వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలు చప్పరిస్తూ అగ్నులు వెళ్ళగక్కుతుంటారు. సప్తసముద్రాలనూ తాగేస్తాం. సృష్టినంతటినీ సంహరిస్తాం. అగ్నిదేవుణ్ణి చప్పరిస్తాం. వాయువును స్తంభింపజేస్తాం. అఖిలజగత్తునూ భక్షిస్తాం - అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ, ధనుర్భాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధమంటూ ఉరకలు వేస్తుంటారు.

వీళ్ళు దంష్ట్రల్ని పటపటలాడిస్తుంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్ళది పూర్తిగా రాగిజుట్టు. రాగితీగల్లాగా నిక్కబొడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికీ శతాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్కశక్తీ లక్ష బ్రహ్మాండాలను నాశనం చెయ్యగలదు. 

వీళ్ళ సైన్యంకూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చెయ్యలేనిదంటూ ఏమీలేదు. యుద్ధసామగ్రి అంతా ఈ కక్ష్యలో నిలవ ఉంటుంది. గజాశ్వరథాలకు లెక్కలేదు.

పద్మరాగప్రాకారం దాటగానే గోమేధికప్రాకారం కనపడుతుంది. ఆదీ పదియోజనాల ఎత్తే జపాకుసుమకాంతుల్ని విరజిమ్ముతుంటుంది. ఈ కక్ష్యలో నేలానింగీ చెట్టూపుట్టా సమస్త వస్తుసామగ్రి - అంతా గోమేధికమయం. భవనాలూ స్తంభాలూ చెరువులూ నూతులూ అన్నీ గోమేధిక నిర్మితాలే. 

ఈ కక్షలో ముప్పయిరెండు మంది మహాదేవీశక్తులు నివసిస్తుంటారు. వారి చేతుల్లో గోమేధికలు పొదిగిన భీషణాయుధాలు ఉంటాయి. వారి భూషణాలూ గోమేధిక నిర్మితాలే.

వీరికీ ప్రత్యేకలోకాలున్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడనే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాలుదువ్వుతుంటారు. పిశాచవదనలు. స్వర్లోకవాసులు వీరిని పూజిస్తుంటారు. ఆయుధాలు ధరించి తాండవంచేన్తూ కొట్టు కొట్టు - తన్ను తన్ను - చింపు చింపు - కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు. రణప్రియలు.

ఒక్కొక్క శక్తిదగ్గరా దశాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తీ లక్షబ్రహ్మాండాలను మట్టుపెట్టగలదు. సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టం. రథగజాశ్వశస్త్రాస్త్రాలకు లెక్కలేదు. సర్వయుద్ధ సమారంభాలూ ఇక్కడినుంచే. వీరి పేర్లుకూడా చెబుతాను. వినేసెయ్యి. పాపాలు నశిస్తాయి.

విద్యా - హ్రీ - పుష్టిః - ప్రజ్ఞా - సినీవాలీ - కుహూః - రుద్రా - వీర్యా - ప్రభా - నందా (10) - పోషిణీ - బుద్ధిదా - శుభా - కాళరాత్రిః - మహారాత్రిః - భద్రకాళి - కపర్దినీ - వికృతిదండి - ముండినీ - సేందుఖండా (20) 

శిఖండినీ - నిశుంభశుంభ మథినీ - మహిషాసురమర్దినీ - ఇంద్రాణీ - రుద్రాణీ - శంకరార్ధశరీరిణీ - నారీ - నారాయణీ - త్రిశూలినీ - పాలినీ - అంబికా - హ్లాదినీ (32) నామధేయలు. వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే. ఎప్పుడూ ఎక్కడా పరాజయమంటూ ఎరగరు.

దేవీ పరిచారికలు





Dhikpalaka Nagaralu - దిక్పాలక నగరాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దిక్పాలక నగరాలు

ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులుంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరు సమష్టిరూపాలు. తూర్పుదిక్కున ఉన్నత సౌధశిఖరాలతో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువుతీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగంకన్నా ఇక్కడ భోగం వెయ్యిరెట్లు ఎక్కువ.

ఇతడు సమష్టి శతనేత్రుడుగదా! ఐరావతం అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవసైన్యపరివృతుడై విరాజిల్లుతుంటాడు. దేవాంగనా సేవ్యమానయై శచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది.

ఆగ్నేయకోణంలో వహ్నిపట్టణం: అందులో స్వాహా స్వధాయుక్తుడై అగ్నిదేవుడు(సమష్టిరూపం) ప్రకాశిస్తుంటాడు. నిజవాహనభూషాఢ్యుడై నిజసైన్యగణ పరివృతుడై దర్శనమిస్తాడు.

దక్షిణ దిక్కున యమపురి. అక్కడ దండధరుడు, యమభటులు, చిత్రగుప్తుడు. యముని మహిషం - అన్నీ సాక్షాత్కరిస్తాయి.

నైరృతి కోణంలో రాక్షసగణ పరివృతుడై నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడె నిర్భతి నివసిస్తుంటాడు. ఇతడు ఖడ్గధారి.

పశ్చిమదిక్కున పాశధారి వరుణుడు మహాఝష వాహనారూఢుడై వారుణీమధువిహ్వలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగణ పరివృతుడై వరుణానీరతాకులుడై విహరిస్తుంటాడు.

వాయవ్యకోణంలో వాయులోకం. వాయుదేవుడుంటాడు. వాయుసాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారం. ధ్వజహస్తుడు. విశాలాక్షుడు. మృగవాహనుడు. మరుద్గణ నిజశక్తి పరివృతుడై కదలాడుతుంటాడు.

ఉత్తరదిక్కున యక్షలోకం ఉంది. వృద్ధి - బుద్ది శక్తులతో యక్షరాజు కుబేరుడిక్కడ అధినాయకుడు. నవనిధులకు అధిపతి. ఇతడు తుందిలుడు(పాట్ట పెద్దది). ధనాధిపతి. మణిభద్ర - పూర్ణభద్ర - మణిమాన్‌ - మణికంధర - మణిభూషణ - మణిస్రగ్వీ - మణికార్ముకధరాది యక్షసేనానులు ఇతడిని పరివేష్టించి ఉంటారు. నిజశక్తిధరుడై వెలుగొందుతుంటాడు.

ఈశానకోణాన రుద్రలోకం ఉంది. మహత్తరం. అనర్ఘరత్నఖచితం. మహారుద్రుడు దీని అధినేత. ఇతడు కోపిష్ఠి, దీప్తనయనుడు. వీపున ఎప్పుడూ అమ్ములపాదులు, ఎడమ చేతిలో నారి ఎక్కుపెట్టిన ధనుస్సు. శతకోటి ధానుష్కులు పరివేష్టించి ఉంటారు. 

తనతో సమాన బలసంపన్నులై శూలాయుధ పాణులై అసంఖ్యాక రుద్రులతో సన్నద్ధుడై ఉంటాడు. వాళ్ళంతా వికృతాస్యులు. కరాళాస్యులు. నిప్పులు కక్కుతుంటారు. కొందరు దశహస్తులు. కొందరు శతకరులు. కొందరు సహస్రభుజులు. దశపాద - దశగ్రీవ - త్రినేత్రోగ్రమూర్తులు మరికొందరు. 

అంతరిక్షచరులు. భూమిచరులు. రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకం. భద్రకాళీ ప్రముఖ మాతృకలతో పరివృతయై రుద్రాణీకోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. డామర్యాది గణాలూ వీరభద్రాది సేనానులూ - వీరితో మహారుద్రుడు విరాజిల్లుతుంటాడు. 

రుండమాలాధరుడై సర్పభూషా విభూషిత కర - కంధరుడై వ్యాఘ్ర చర్మపరీధానుడై గజచర్మం ఉత్తరీయంగా చితాభస్మవిలిప్త సర్వశరీరుడై ప్రమథగణ సంస్తూయమానుడై ఢమరుధ్వనులతో దిక్కులను బధిరీకరిన్తూ(చెవిటిపరుస్తూ), ఆట్టహాస - ఆస్ఫోటిత(జబ్బచరుపులు) ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్లజేస్తూ భూతసంఘంతో కొలువుతీరిన - భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. పేరుకూడా ఈశానుడే.

ఈ పుష్యరాగప్రాకారం దాటాక పద్మరాగప్రాకారం. అదీ కుంకుమకాంతులే వెదజల్లుతుంటుంది. ఇదీ పదియోజనాల ఎత్తే. ఈరెండింటి నడుమాఉన్న నేలా చెట్టూ చేమలూ సమస్తమూ - ఇందాకటిలాగానే - పద్మరాగమయం. 

ఈ ప్రాకారంలో నానాయుధ ధారిణులూ రత్నభూషావిభూషితలూ చతుష్షష్టి వీరవనితలుంటారు. వీరిలో ఎవరిలోకం వారికి ఉంది. ఎవరి నాయకుడు వారికున్నాడు. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే స్వస్వవాహన - స్వస్వలోక జనసహితలై గుమికూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కళాంశరూపాలు. వారిపేర్లు చెబుతాను - జనమేజయా! గ్రహించు.

దేవీ శక్తులు





Manidweepa Varnana - మణిద్వీప వర్ణన

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన
జనమేజయా! బ్రహ్మలోకానికి ఊర్థ్యభాగాన సర్వలోకం ఉందని విన్నావుగదా! అదే మణిద్వీపం. మహాదేవీ నివాసం. సర్వలోకాలకన్నా సర్వవిధాలా అధికం కనక దీన్ని సర్వలోకం అన్నారు. 

పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్చానుసారం మనస్సుతో కల్పించుకొంది. అన్ని లోకాలకన్నా ముందు తనకోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది.

ఇది కైలాసంకన్నా వైకుంఠంకన్నా గోలోకంకన్నా అత్యధికం. దీనికన్నాసుందరమైనది ముల్లోకాలలోనూ మరెక్కడా లేదు. ఇది ముజ్జగానికీ గొడుగువంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతున్నాయి. ఇది భవసంతాపనాశకం.

ఈ మణిద్వీపానికి చుట్టూ సుధాసముద్రముంది. అది బహుయోజన విస్తీర్ణం. అత్యంత గంభీరం. గాలితాకిడికి ఎగసిపడే తరంగాలు. రత్నాలు దొరికే ఇసుకతిన్నెలు. శంఖాలకూ మత్స్యజాతులకూ లెక్కలేదు.

సంఘర్షించుకొంటున్న తరంగాలనుంచి గాలిలో తేలివస్తున్న నీటితుంపురులతో మణిద్వీపమంతా ఎప్పుడూ సుఖశీతలంగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటూ ఇటూ ప్రయాణం చేస్తున్న నావలు, కనువిందు చేస్తాయి.

దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది. రత్నద్రుమం. దానిమీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారం(కోటగోడ). ఆది అయోధాతునిర్మితం. ఇనుముతో ధాతుశిలలతో దృఢంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తుసప్తయోజనాలు. 

నానావిధ శస్త్రప్రహారణాలు ధరించి నానావిధ యుద్ద విశారదులైన రక్షకభటులు ఆ ప్రాకారంమీద అంతటా కావలి తిరుగుతుంటారు. విధి నిర్వహణలో ఆనందిస్తుంటారు.

ఆ మహాప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలున్నాయి. నూరుమంది ద్వారపాలకులున్నారు. ఒక్కొక్కరి అధీనంలోనూ అనేక గణాలున్నాయి. అందరూ దేవీభక్తులే.

దేవీదర్శనంకోసం దేవతలు వస్తూ ఉంటారు. వారివెంటవచ్చే గణాలూ వారి వారి వాహనాలూ ప్రతిద్వారం దగ్గరా కనపడుతుంటాయి. 

శతాధిక విమానాలు. వాటి ఘంటాఘోషలు, అసంఖ్యాక హయ హేషలు, ఖురాఘాతాలు దిక్కుల చెవులు చిల్లులుపడతాయి. గణాల కిలకిలారావాలు. నేత్రహస్తుల తాడనాలు. దేవీసేవక - దేవసేవక బృందాలతో క్రిక్కిరిసిపోయిన ఆ ప్రాంతాల్లో ఎవరిమాటా ఎవరికీ వినిపించదు. అంతటా హోరెత్తే కోలాహలమే. నానాధ్వని సమాకులమే.

ప్రాకార ద్వారం దాటి లోపలికి వెడితే అడుగడుగునా సరస్సులు స్వాదుజలపూర్ణాలు. వివిధ రత్నద్రుమవాటికలు. వాటిని గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారం ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షం శతగుణాధికం. దీనిమీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతుంటాయి.

ఈ రెంటినడుమా ఉన్న వృక్షజాతులకు లెక్కలేదు. సృష్టిలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉన్నాయి. నిరంతరం చిగురులు తొడుగుతాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఆ పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. 

పనస - వకుళ - లోధ్ర - కర్ణికార- శింశుప - దేవదారు - కాంచన - ఆమ్ర - సుమేరు - లికుచ - హింగుళ - ఏలా - లవంగ - కటుఫల - పాటల - ముచుకుంద - ఫలినీ - జఘనేఫల - తాళ - తమాల - సాల - కంకోల - నాగ - భద్రక - పున్నాగ- పీలవ - సాల్వక - కర్పూర - అశ్వకర్ణ - హస్తికర్ణ - తాళపర్ణ - దాడిమ - గణికా - బంధుజీవ - జంబీర - కురండక - చాంపేయ - కనకద్రుమ - కాలాగురుద్రుమ - చందన - ఖర్చూర - యూథికా - ఇక్షు - క్షీరవృక్ష- ఖదిర - చించ - భల్లాతక - రుచక - కుటజావృక్ష - బిల్వవృక్ష - తులసీవన - మల్లికావన - ఇత్యాదిగా తరులతావనాలున్నాయి. 

ఉపవనాలున్నాయి. రకరకాల బావులూ దిగుడుబావులూ మిలమిలలాడుతుంటాయి. కోకిలారావాలూ భ్రమరనినాదాలూ మారుమోగుతుంటాయి. ప్రతితరువునుంచీ పుష్పమకరందమో పరిపక్వఫలరసమో ఓడికలుకడుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలుముకుని ఉంటుంది. 
ఎటుచూసినా ఫలరసాల ప్రవాహాలు. ఎటువిన్నా శకుంతగానాలు.

పావురాలూ చిలుకలూ గోరువంకలూ హంసలూ గుంపులుకట్టి ఎగురుతూంటే వాటి రెక్కలగాలికి చెట్ల చిటారుకొమ్మలూ రెమ్మలూ ఊగిసలాగుతుంటాయి. వనమంతటా సుగంధపరిమళమే. 
లేడికూనలు కదుపులు కదుపులుగా చెంగనాలు పోతుంటాయి. నాట్యం చేస్తున్న నెమళుల క్రేంకారాలు - నేత్రాలకూ శ్రోత్రాలకూ హాయిగొల్పుతాయి.

మొదటిది అయోమయ ధాతుశిలానిర్మిత ప్రాకారం. అటుపైని కేవల కాంస్యప్రాకారం. ఆ తరవాత తామ్రసాల. తామ్రప్రాకారం చతురస్రాకారం. ఎత్తు కాంస్యప్రాకారంలాగానే సప్తయోజనాలు. ఈ రెండుసాలలకూ నడుమ కల్పవృక్షవాటిక. వాటి పువ్వులు బంగారుకాంతులీనుతుంటాయి. 

పత్రాలూ అంతే. ఫలాలలో గింజలు రత్నాలు. వాటి సుగంధం పదియోజనాలవరకూ వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలమూ వసంతుడే సంరక్షిస్తుంటాడు. అతడే వనపాలకుడు. పుష్పసింహాసనం మీద కూర్చుంటాడు. పుష్పకిరీటం ధరిస్తాడు. వుష్పచ్చత్రంఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్పాసవ ప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా విఘూర్ణిస్తుంటాయి. మధుశ్రీ - మాథవశ్రీ అని అతడికి ఇద్దరు భార్యలు. చిరునవ్వులు. చిందిన్తూ పూలగుత్తులతో బంతులాడుకుంటుంటారు.

అన్నివైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలూ గంధర్వులూ తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనపడతారు. పదియోజనాలదూరం వ్యాపించే ఆ సుమగంధమన్నా ఆ వనమన్నా వారికి వల్లమాలిన ప్రేమ. వసంతలక్ష్మికి అది ఆటపట్టు. కాముకులకు కామప్రవర్ధకం(వసంతకుసుమాకరం).

తామ్రసాల దాటాక సీసనిర్మిత ప్రాకారం కనిపిస్తుంది. ఇదీ ఏడుయోజనాల ఎత్తే. తామ్ర - సీససాలలకు నడుమ సంతానవనవాటిక. దాని పువ్వులూ దశయోజనగంధులే. బంగారు పువ్వులు. ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదళ్ళల్లో అమ్మతరసపూర్ణ ఫలాలుంటాయి. 

గ్రీష్మర్తువు ఇక్కడ తోటమాలి. అతడికి శుకశ్రీ - శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు. ఎండ వేడిమి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానకవృక్షాల నీడకు చేరుతుంటాయి. దేవతలూ సిద్ధులూ విలాసినీమణులతో కలిసి చందన చర్చలు జరుపుకుని ఆ వనంలో విశ్రమిస్తుంటారు. పుష్పమాలికలు దండిగా అలంకరించుకుని తాళవృంతాలు విసురుకుంటూ శీతలపానీయాలు సేవిస్తూ సేదదీరుతుంటారు.

సీససాల తరవాత ఆరకూట ప్రాకారం(ఇత్తడి). ఇదీ ఏడుయోజవాల ఎత్తే. ఈ రెండు సాలలకూ మధ్య హరిచందన వృక్షవాటిక. వర్షర్తువు ఇక్కడ వనపాలకుడు. ఇతడి కన్నులు మెరుపులా పింగళవర్ణంలో తళతళలాడుతుంటాయి. జీమూతకవచం(మేఘకవచం) ధరించి ఉంటాడు. 

ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. నహస్రముఖాలుగా వారిధారలు కురిపిస్తూ వనాన్ని పెంచిపోషిస్తుంటాడు. ఇతడు నభఃశ్రి - నభస్యశ్రీ - స్వరస్యా - రస్యమాలినీ - అంబా - (అ)తులా - నితత్ని - అభ్రమంతీ - మేఘయంతికా - వర్షయన్తీ - చిపుణికా - వారిధారా - ఆనే పన్నెండుమంది మదవిహ్వాలశక్తులతో వినోదిస్తుంటాడు.

ఈ హరిచందనవవంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురుతొడిగే ఉంటాయి. కొత్త తీగెలు అల్లుకుంటుంటాయి. నేలంతా చిప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీనదాలు పోటెత్తి హోరెత్తుతుంటాయి. కాముకహృదయాల్లా సరస్సులలో కలుషితజలాలు. దేవతలూ సిద్ధులూ. దేవీపూజాతత్పరులూ ఈ వనంలో ధర్మపత్నులతో కలిసి నివసిస్తుంటారు.

ఆరకూటసాల గడిచాక పంచలోహప్రాకారం. ఇదీ అంతేఎత్తు. ఈ రెండింటికీ నడుమ మందారతరువాటిక. నానా పుష్పలతాకీర్ణ. నానా పల్లవశోభిత. శరదృతువు దీని అధిష్టాత. ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అని ఇద్దరు భార్యలు. ఈ వనంలో సిద్ధదంపతులు నివసిస్తుంటారు.

పంచలోహసాల దాటాక రజత నిర్మిత ప్రాకారం దర్శనమిస్తుంది. ఇదీ ఏడుయోజనాల ఎత్తే. దీని శృంగాలు (బురుజులు) మిలమిలలాడుతుంటాయి. ఈ రెండు ప్రాకారాలకూ మధ్యన పారిజాత వనవాటిక. దాని పువ్వులు దశయోజనగంధులు. దేవీపరిచారికలు ఈ వనంలో విహరిస్తుంటారు. హేమంతర్తువు తోటమాలి. ఇతడికి సహశ్రీ సహస్యశ్రీ అని ఇద్దరు ఇల్లాండ్రు. ఈ తోటలో సిద్ధులూ దేవీవ్రతులూ సంచరిస్తుంటారు.

రజతసాల తరవాతది సౌవర్ణప్రాకారం. బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు. ఎత్తు ఏడుయోజనాలే. ఈరెండింటి నడుమా కదంబవనవాటిక. పుష్పపల్లవ సంశోభిత. కదంబమదిరాధారలు ప్రవాహాలు కడుతుంటాయి. ఆ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందం అనుభూతికి అందుతుంది.

శిశిరర్తువు దీనికి అధినేత. తపఃశ్రీ - తపస్యశ్రీ అని ఇద్దరు భార్యలు. వీరితో ఆనందిస్తుంటాడు. ఈ వనంలో మహాసిద్ధులూ దేవీదానాలు చేసినవారూ ధర్మపత్నీ సమేతులై పరివార సహితులై మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.

స్వర్ణసాల గడీచాక పుష్పరాగప్రాకారం కుంకుమారుణ కాంతులు విరజిమ్ముతూ కనపడుతుంది. రెంటికీ నడుమ నేల ఆంతా పుష్యరాగమయమే. వనాలూ ఉపవనాలూ వృక్షాలూ వృక్షాలవాలాలూ ఎగిరే పక్షులూ కదిలే జంతువులూ పారే నీళ్ళూ అన్నీ పుష్యరాగమయాలే.

మండపాలూ మండపస్తంభాలూ సరస్సులూ కమలాలు ఒక్కటేమిటి ఈ ప్రాకారంలో సమస్తమూ పుష్యరాగమయమే. సువర్ణసాలకన్నా ఇది తేజస్సులో లక్షరెట్లు అధికం. 

జనమేజయా! ఇటుపైని చెప్పబోయే రత్నప్రాకారాలకు అన్నింటికీ ఇదే పద్ధతి.

దిక్పాలక నగరాలు





Sridevibagavatham - Phalashruthi - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి శౌనకాది మహామునులారా! మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది. ఆదిలో ఈ దేవీభాగవతం సా...