Thursday, August 20, 2026

Rasa Cridaabhivarnanamu - రాస క్రీడాభివర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - రాస క్రీడాభివర్ణనము

ఆ శరత్సమయంలో లోకేశ్వరుడు, అనంతుడు అయిన శ్రీకృష్ణుడు చిత్రాకారుడై గోపకాంతలతో రాసక్రీడ సలపడానికి ప్రారంభించాడు. గోపరమణులు కృష్ణుని చుట్టూ వలయాకారంగా ఏర్పడి, ఒకరిచేతులు మరొకరు సవిలాసంగా పట్టుకొని తిరిగారు. 

ఎన్నోవిధాలుగా స్ఫురించే ముఖవిన్యాసాలతోను, కరవిన్యాసాలతోను, పాదవిన్యాసాలతోను ఆ రాసక్రీడ పరిఢవిల్లింది. గోపికా గోవిందుల రాసక్రీడను దర్శిస్తూ ఉన్న దేవతలకండ్లకు, మనస్సులకు వికాసం కల్గించి ఆనందం నింపింది.

ఈ విధంగా పలువిధగతులలో, తిరగడంలో నేర్పరి అయిన శ్రీకృష్ణుడు విజ్బంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు. 

మచ్చలేని చంద్రబింబంవంటి ఇద్దరు ముగ్ధలు అలంకరించుకొని వీణలు చేతబట్టారు. వారిద్దరూ వీణను వాయించడంలో మిక్కిలి ప్రావీణ్యం కలవారు. మనోజ్ఞంగా, ఇంపుగా వీణ వాయిస్తూ ఆనందప్రవాహాన్ని వెల్లిగొలిపే గీతం గానం చేశారు. 

శ్రీకృష్ణుడు నిరంతర నిశ్చలమైన వేడుకతో సమ్మోహనమైన మురళిని సవిలాసంగా చేతబూనాడు. దాన్ని తన మధురమైన కెమ్మోవికి గదియించాదు. గోపభామలు తమ కొప్పులలో చెరువుకొన్న కలువపూల కమ్మని సువాసనను వీడని తన చిగుళ్లవంటి చేతివేళ్లను లయబద్ధంగా ఆ మురళీరంధ్రాల మీద సారిస్తూ వేణువు ఊదాడు. 

తామర రేకుల మధ్యన ఉండే దుద్దువలె గోపాంగనల మధ్యలో కృష్ణుడు మువ్వంపులతో మురిపెం ఒలికిస్తూ నిలుచున్నాడు.

ఎందరు గోపసుందరులో అందరికీ తాను ఒక్కడే అందరయ్యాడు. గోపికపక్క తానూ, తన పక్కన గోపిక ఉండే విధంగా నిలిచి రాసమండలం కల్పించాడు.

అది నృత్యవిద్యాసముద్రానికి చుట్టూ ఏర్పడిన చెలియలికట్టవలె సాంపు నింపింది. ఆ రాసమండలం సహస్రనేత్రుడైన దేవేంద్రుడికి సైతం ఆశ్చర్యం గొలిపింది. దేవతలు ఆనందంతో ఆకాశవీథినుండి పూలజల్లులు కురిపించారు. ఆ పూలగుత్తులలో తిరుగాడే తుమ్మెదల రంగును హేళనచేస్తూ పలువురు కృష్ణులు విరాజిల్లారు.

బంగారుమణులమధ్యలో ఉన్న ఇంద్రనీలమణులవలె విలసిల్లారు. ఆడఏనుగులతో విహరించడంలో అత్యాసక్తి వహించిన మగ ఏనుగుల అందాన్ని వారు చిందించారు.

చిగురించి పూచినతీగలతో ఆవరించబడిన కానుగచెట్ల అందచందాలను ఆ గోపాలమూర్తులు అంది పుచ్చుకున్నారు. మెరుపుతీగలతో కూడిన కరిమబ్బులవలె మెరిశారు.

జలజలా ప్రవహించే సెలయేళ్లతోనిండిన రోహణగిరి శిఖరాల పోలికతో వారు విరాజిల్లారు.

లోకాలను మోహింపజేసే కృష్ణుడు కెందామరలవలె ఎర్రనైనవీ, చంద్రరేఖలవలె గోళ్లు కలిగినవీ, వేదరమణులకు ఆభరణాలైనవీ- అయిన తన పాదాలను ఒకదానితో ఒకటి చేర్చాడు. అతడు సమంగా నిలిచి దోసిటితో పూలు విరజిమ్మాడు. 

ఎంతో సుందరాలై, పద్మాలవలె ప్రశస్తాలైన తన రెండుచేతులనూ తనకు ఈ వైపునా ఆ వైపునా ఉన్న గోపికల మెడలపై చేర్చాడు. పాటకు అనుగుణంగా, ఆశ్చర్యకరంగా అడుగులు వేశాడు- వలయాకారంలో ఉన్న రాసబంధాలతో అతడు నాట్యం చేశాడు.

శ్రీకృష్ణుడు ఆగోపసుందరులతో కలిసి శంఖం, పద్మం, వజ్రం, కందుకం, చతుర్ముఖం, చక్రవాళం, చతుర్భద్రం, సౌభద్రం, నాగం, నంద్యావర్తం, కుండలీకరణం, ఖురరీబంధం మొదలైన విశిష్ట రాసబంధాలతో నర్తించాడు.

ఆ రాసక్రీడలో వారు ఏకపాదం, సమపాదం, నివర్తితం, వినివర్తతం, గతాగతం, వలితం, వైశాఖం, మండలం, త్రిభంగి మొదలైన భంగిమలతో నిలిచారు. వారి పాదాలలోని బంగారుగజ్జెల చప్పుడు, మనోజ్ఞాలైన అందెలరవళులు జగత్తులోని జనులకందరికీ వీనుల విందులు చేశాయి. 

ఆ రాసక్రీడలోవారు ఘటితం, మర్దితం, పార్శ్వగం మొదలైన పాదవిన్యాసాలు ప్రదర్శించారు. సమపాద, శకట, వదన, మతల్లీశుక్తి మొదలైన పార్ధివచారి విశేషాలను, అపక్రాంతం, డోలాపాదం, సూచి మొదలైన గగనచారి విన్యాసాలను ప్రకటించారు. 

కల్పవృక్షం కొమ్మలవలె మనోహరాలైనవీ, దిగ్గజాల తొండాలను పరిహసించేవీ. మూడులోకాలకు శుభకరాలైనవీ అయిన వారి హస్తాలలోని రత్నకంకణకాంతులు గగనవీథి నలుమూలలా వ్యాపించాయి.

ఇంకా, ఆ రాసక్రీడలోవారు అర్ధచంద్రం, కర్తరీముఖం, కపిత్ధం, కటకాముఖం, శుకతుండం, లాంగూలం, పద్మకోశం, పతాక మొదలైన హస్తాభినయాలను తమతమ మనోభావాలు ప్రతిబింబించే విధంగా ప్రదర్శించారు.

వారు తమ నడుములమీద ధరించిన బంగారురంగు పట్టు వస్త్రాల అంచులకాంతులు దిక్కులనే ముదితల ముఖాలకు పసుపు పూతలనే ముద్రలు వేశాయి, ఆస్కందితం, భ్రమరం, శకటాసనం మొదలైన జానుమండల భేదాలను; అలాతం, దండలాతం, లలితం, విచిత్రం మొదలైన దేవతల మండలాకారనృత్యాలను వారు ప్రదర్శించారు.

మనోహరాలైన శంఖాలవంటి మెడలకు అందాన్ని సమకూర్చేవీ, మిక్కిలి కాంతిపుంజం కలిగినవీ, ఇంద్రనీలాలు, వజ్రాలు, వైడూర్యాలలో కూర్చబడినవీ అయిన హారాలశోభలు లక్ష్మీ నివాస స్థానాలుగానున్న తమ వెడద వక్షస్థలాలపై సంచలించి, చిక్కుపడగా-వారు అంగాంతరం, బాహ్యలగ్నం, ఛత్రం మొదలైన భ్రమణ విధాలతో విరాజిల్లారు. 

తమ కాంతిచేత చంద్రమండలాన్ని జయించిన కుండలాల కాంతులు అద్దాలవలె నును పైన వారిచెక్కిళ్లపై తొణికిసలాడాయి.

ఆ రాసక్రీడలలో వారు కటిభ్రాంతం, దండరచితం, లలాటం, తిలకం, మయూరం, లలితం, చక్రమండలం, నికుంచితం, గంగావతరణం మొదలైన కరణాలను ఆచరించారు. 

తెల్లతామరలశోభతో ఒప్పారే వారిచూపులు దరిద్రులదైన్యాన్ని పారదోలుతూ ముగ్ధల కన్నులనే మీనాలకు వలలై ఆవరించగా లలితం, కుంచితం, వికాసం, ముకుళం మొదలైన చూడ్కులతో విలసిల్లారు. బహుపూర్ణ చంద్రబింబాల అందానికి గృహాలుగా అందగించిన తమ ముఖాలలో నిర్మలమైన అనురాగాన్ని వారు ప్రస్ఫుటీకరించారు.

ఒప్పిదమైన నెమలిఫించపుకాంతులు అకాలంలో కనిపించిన హరివిల్లుల అందాన్ని వెలువరించగా వారు నికుంచితం, ఆకుంచితం, కంపితం, ఆకంపితం, పరివాహితం, పరావృత్తం అనే శిరోభావాలను ప్రదర్శించారు. 

కస్తూరితిలకాలు దిద్దిన పలకలవంటి నుదుళ్లపై ముంగురులు ముసురుకొంటూ ఉండగా వారు అపరాజితం, సూచికావిద్ధం, పరిచ్చిన్నం, విష్కంభం, రేచితం మొదలైన అంగవిన్యాసాలు ప్రదర్శించారు.

అందుకు తగినట్లు అడుగులు, నడుములు, చేతులు, మెడలు ఆడించారు. అలా ఆరాసక్రీడ వీక్షకుల మనస్సులకు ఉత్తేజాన్ని కలిగించింది. అది దీప్తిగల ద్రవంతోడి క్షీరసాగరంవలె శృంగారరసంతో పొంగారింది. 

అనురాగభరితమైన రామరాజ్యంవలె శ్రీరాగం మొదలైన రాగాలతో నిండిపోయింది. కలువలకు ఆనందం సమకూర్చే నిండుచంద్రునివలె భూమండలానికి సంతోషాన్ని కలిగించింది.

భ్రమరం మొదలైన హస్తాభినయాలతో తుమ్మెదలగుంపుతో నందనవనంవలె విలసిల్లింది. అభ్యుదయంతో కూడిన అభిమానధనుని మనస్సువలె ఉత్తరోత్తరాభివృద్ధితో విరాజిల్లింది. 

బహువిధాలుగా ప్రబంధాలు కూర్చే నేర్పరి అయిన కవి విలాసంవలె ప్రకృష్టాలైన నాట్యబంధాలతో విలసిల్లింది. వసువులతో, దేవతలతో నందనవనంతో అలరారే దేవలోకంవలె వసుదేవనందనునితో పూజనీయమైంది.

సదాచారవంతుని నడవడివలె భూమండలానికి, ఆకాశమండలానికి భూషణమైంది. శరీరంపైన హారందాల్చిన సుందరివలె అవయవాలచలనంతో మనోహరమైంది.

గౌరీనిలయమైన హిమవంతంవలె నానావిధానాలుగల సంభారాలతో శోభిల్లింది. గుణవంతుడైన కుమారునివల్ల కులంప్రకాశించినట్లు వేణువిలాసంతో ఆ రాసక్రీడ భాసించింది.

గోపరమణులు నడుములు జవజవలాడగా, చిరునవ్వులు వ్యాపించగా, హారాలు మెలిపడగా, మొలనూళ్లు సడలగా చూపుల నిగ్గులు పాలయగా, చెమటలు కమ్మగా, ముంగురులు చెదరగా, చెవికమ్మలు ప్రకాశించగా, నీలిమబ్బుల నడుమ మెరుపుతీగెల కాంతితో దీపిస్తూ కృష్ణునితో కూడి ఉల్లాసంగా ఆడుతూ, పాడారు.

మచ్చలేని చంద్రునివంటి ముఖాలు గల ఆ గోపికలు కమలనేత్రుడైన కృష్ణునితో కూడి మనోహరంగా నాట్యం సలిపేవేళ- వారి నడుముల చిరుగంటలు, కాలిఅందెలు, కరకంకణాలు గల్లు గల్లుమని శబ్దంచేస్తూ వీనులవిందు చేశాయి.

పరీక్షిన్మహారాజా! లేడికన్నులవంటి కన్నులున్న ఆ గోపయువతులతో శ్రీకృష్ణుడు నిర్వహించిన ఆ రాసక్రీడను ఆకాశవీధిలో దేవతాశ్రేష్ఠులు వారిభార్యలతో కలసి బారులుదీరి విమానాలెక్కి దర్శించారు.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు పువ్వులవానలు కురిశాయి. భేరులుమోగాయి. ఆకాశంలో తమ భార్యలు తమ సరసనుండగా గంధర్వపతులు శ్రీకృష్ణుని స్తుతిస్తూ గానం చేశారు.

(సంగీతానికి గంధర్వులు ప్రసిద్ధి. సంగీతానికి “గాంధర్వం” అనే పేరు అందుకే వచ్చింది. వారు కృష్ణుని గుణగణాలను గానం చేయడం ఎంతైనా సమంజసంగా ఉంది.)

రాజేంద్రా! శ్రీకృష్ణుడు గోపభామినులతో రాసక్రీడ సలుపగా చూచి, స్వామిపై మోహంచెంది, ఖేచరస్త్రీలు పారవశ్యంతో తమ ప్రాణేశ్వరులమీద మూర్చిల్లి వాలిపోయారు

చంద్రునితో సామ్యం వహించిన ముఖాలు గలిగిన ఆ గొల్లభామలు, చంద్రవంశంలో జన్మించిన శ్రీకృష్ణునితో చేరి నటించగా, చుక్కలతోకూడి చంద్రుడు ఆ నాట్యాన్ని వీక్షిస్తూ ఉండడంచేత రాత్రి ఆలస్యంగా గడిచింది.

యమునానది నీటితుంపరలను చిలికిస్తూ, తామరపూల సురభిళాల్ని విరజిమ్ముతూ, సుందరీమణుల చెమటల్ని తగ్గిస్తూ రాసక్రీడవలన మదవతులకు కలిగిన శ్రమను పోగొడుతూ, రమణీమణుల మనసుల్లో కొత్తదైన, మేలైందైన సుఖం అనే సంపదను కలిగించేదై, పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఆనందించేట్లుగా, మంగళకరంగా మలయమారుతం వీచింది.

అపుడు ఒక గోపికారమణి శ్రీకృష్ణుడు పాడుతుండగా, వీణను చేతబట్టి సవిలాసంగా తీగెలుమీటింది. అతడు ఔను ఔను అని మెచ్చుకోగా, ఎండినచెట్లు చిగురించగా, నిలుకడగా ఒక స్వరస్థాయినందుకొని ఒకరాగాన్ని రమ్యంగా ఆలపించింది.

ఆ గోపరమణులలో ఒక రమణి కాలిఅందెలు గల్లుగల్లుమని మనోహరంగా ధ్వనిస్తూ ఉండగా ఆడుతూ పాడుతూ, పిరుదుల బరువుచేత అలసట గలిగిందై, శ్రీకృష్ణుని హస్తాన్ని తన కుచద్వయం సమీపానికి లాగింది.

ఓ రాజా! మంచిగంధంపూతతో, పద్మపరిమళంతో ఒప్పారుతూ ఉన్న తన బలమైన భుజాన్ని శ్రీకృష్ణుడు ఒక గోప రమణి భుజంమీద ఉంచగా, ఆమె చలించి పులకరించింది.

ఒక తరుణి కృష్ణునిచెక్కిలితో తన చెక్కిలి చేర్చగా అతడు తన పుక్కిటిలోని తాంబూలాన్ని ఆమె నోట ఉంచాడు. ఒక సుందరి ఆడుతూ అలసిపోగా, ప్రాణేశుడు స్తంభంవంటి ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఆధారంగా చేశాడు. 

ఒక చక్కనిచుక్క చెమట కమ్మి తన దగ్గరికి చేరగా ఆమె చనుదోయిపై కమ్మిన చెమట బిందువులను ప్రియుడైన కృష్ణుడు కొనగోట చిమ్మాడు. ఒక బాలిక నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను నాథుడైన కృష్ణుడు పక్కకు తీసి, కురులు దువ్వాడు. 

ఒక పడతి పాటపాడి అలసిపోగా ప్రాణేశుడైన కృష్ణుడు తన అధరామృతాన్ని ఇచ్చి సమాదరించాడు. ఒక చెలువకు హారం మూపున చిక్కుపడగా, ఆ హారాన్ని చక్కదిద్ది సుందరుడైన కృష్ణుడు దగ్గరకు లాక్కొని కౌగిలించుకున్నాడు.

రాజేంద్రా! గోవిందుడు రాసక్రీడలో అలసిన గోపరమణులను తన చిరునవ్వులతో, హస్తవిన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో దయతో ఆదరించాడు.

ఆ గోపసుందరులు గోవిందుని తనూసంగమసుఖంతో మిక్కిలి పరవశలై తమ పైటలు, ధరించిన వస్త్రాలు జారిపోవడం కూడా గమనించలేక పోవడం ఆశ్చర్యం కాదు. దేవతాస్త్రీలు ఆకాశంనుండి ఆ రాసక్రీడావిలాసమంతా వీక్షించి కరిగి సమ్మోహితలయ్యారు.

ఈ విధంగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడైనా గోపసుందరులు ఎందరుంటే అందరికీ అంతమంది కృష్ణులై తన ప్రతిబింబాలతో ఆడుకునే పిల్లవాడువలె, రాసక్రీడ సాగించాడు.

గోపికలు నందనందనుడైన కృష్ణుడు తమతో కలసిమెలసి నవ్వుతూ, చూస్తూ, సల్లాపాలు సలుపుతూ మెలిగాడని కృష్ణుని మీది గౌరవంతో, తమపూర్వజన్మపుణ్యాలను మెచ్చుకున్నారు.

జలక్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment