Saturday, August 22, 2026

Suryodaya Varnanamu - సూర్యోదయ వర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - సూర్యోదయ వర్ణనము

సూర్యుడనే సింహం గోళ్ళతో చీల్చగా దట్టమైన చీకటి అనే గజరాజుయొక్క కుంభస్థలమనే కొండకొమ్మునుండి వెలువడ్డ నెత్తుటితోగూడిన ముత్యాలో అన్నట్లు తూర్పుదిక్కులో ఎర్రదనంతో చుక్కలు ప్రకాశించాయి.
(ఏనుగుల కుంభస్థలాల్లో మంచి ముత్యాలుంటాయని పెద్దలు చెప్తారు.)

సూర్యబింబం తూర్పు కొండమీద ఉదయించింది. శచీదేవి తన పిల్లవాడి పానుపుమీద కనిపించేటట్లు చిలుకల పందిరికి అమర్చిన పగడాల బంతియా అన్నట్లుంది. ఆయుస్సనే ధనం వ్యయమై పోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరుడిచేతిలోని గంటా అన్నట్లుంది. 

బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాశుల్ని కొలవడానికి ఎత్తిన బంగారు కుంచమా అన్నట్లుంది. పడమటిదిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవ పిట్టల పరితాపం మాన్పే దివ్యమైన మందుగుళికయా అన్నట్లుంది. పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లుంది.

సూర్యోదయ సమయంలో చల్లని గాలులు వీచాయి. పద్మాలు పూచాయి. చీకట్లు పటాపంచలై గుహలలో దూరాయి. తుమ్మెదలు తమ్మిపూదేనెను తాగి ఆనందించాయి.

తూరుపు కొండమీద ఉదయించిన సూర్యుని కిరణాల అరుణిమతో నిండినదై బ్రహ్మాండం కుంకుమ నీటితో కూడిన బుడ్డివలె శోభిల్లింది.

ఆ తరువాత

కంసభూపతి మల్లయుద్దానికి సిద్ధపరచిన క్రీడారంగం రాళ్ళు, పుట్టలు, బురదలేనిదై, మెత్తని బంగారు వన్నె మట్టితో ఒప్పింది. అది కమ్మనికస్తూరిజలంతో తడుపబడింది. దానికి చుట్టూ గందపుకర్రలతో కంచె ఏర్పరచబడింది. గొప్ప పూలదండలతో, పతాకలతో, తోరణాలతో ఆ క్రీడారంగం అలంకరించబడింది. ఎత్తైన ఆసనాలమధ్య ఆ రంగం నిర్మించబడింది. 

బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన పురప్రజల కోలాహలంతో రంగస్థలం నిండిపోయింది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యద్వనులతో ఆ ప్రదేశం ఎసలారింది. అది పుణ్యపురుషుని మనస్సు మాదిరి మాలిన్యం లేనిదై, సమమై, కంటక రహితమై శోభిల్లింది. కంసుడి సైన్యంతో ఉన్నతమై వన్నెమీరింది. జనుల హృదయాలకు సంతోషం సమకూరుస్తున్నది.

ఆ మల్లరంగానికి చేరువలో ఉన్న ఉన్నతాసనంలో భోజరాజేంద్రుడైన కంసుడు మాన్యులగు మంత్రులతోగూడి సామంతరాజులు తన్ను సేవిస్తుండగా దుఃఖపడుతూ కూర్చుని ఉన్నాడు.

సమస్త సముద్రాలు మొలనూలుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకొని, నడిచి వస్తున్న దిగ్గజాలలాగా, కులపర్వతాల మాదిరి ఒప్పుతూ, తగినట్లు అలంకరించుకొని చాణూరుడూ, ముష్టికుడూ, శలుడూ, తోసలుడూ తమ ఉపాధ్యాయులను కొలుస్తూ, నానావిధాలైన వాద్యశబ్దాలకు బహువిధాలఉద్రేకం చెలరేగగా రంగస్థలానికి వచ్చారు.

(కుల+అగంబులు= కులపర్వతాలు. ఇవి ఏడు. మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం అని.)

నందుడు మొదలైన గోపాలకు లందరూవెళ్ళి, కంసరాజును సందర్శించి, కానుకలు సమర్పించి, ఆతనిఅనుజ్ఞతో పెద్దపెద్ద ఆసనాలమీద వరుసగా కూర్చున్నారు.

అంతట బలరామకృష్ణులు అలంకరించుకొని జెట్టీల భేరీ నినాదాలు విని, మల్లరంగం చూడటానికి ఉబలాటపడ్డారు.

రామకృష్ణులు జంకూ గొంకూ లేకుండా రంగస్థలం వాకిలిదగ్గరకు వెళ్ళి మదంతో కూడిన కువలయా పీడమనే ఏనుగును చూచారు. అది గ్రొచ్చి కోరాడటంలో ఇతర గజాలను క్రిందుపరుస్తుంది. ఆ మత్తేభం అధికమదంతో గగుర్పొడిచిన ముందల కలది.

అరిభయంకరుడైన శ్రీహరి ఆ మదగజాన్ని అవలోకించి, మేఘగర్జనంవలె గంభీరమైన కంఠంతో మావటివాళ్ళకు నాయకుడైనవాణ్ణి చూచి ఇట్లన్నాడు.

శ్రీ కృష్ణుడు కువలయాపీడ మను గజంబును వధించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment