శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -
శ్రీ కృష్ణుడు గోపకాంతల చెంతకు నుద్ధవుని బంపుట
ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఇలా తలపోశాడు. వ్రేపల్లెలోని గొల్లమగువలు నా మీదనే మనసు లగ్నంచేస్తారు. నా ఆగమనాన్ని ఎదురుచూస్తారు. నా పేరు ఆత్మలో ధ్యానిస్తారు. ప్రణయ పారవశ్యంతో తమ రహస్య గృహాలలో అనేక విధాలుగా వగ చెందుతుంటారు. పాపం! వారెంత దైన్యం పాలవుతున్నారో! నాపై ఎంత కినుక వహించారో! నన్నెంతగా దూషించుతున్నారో!
నిశ్చితమైనభావాలు కలవాడూ, గంభీరుడూ, పెద్దలు మెచ్చదగినవాడూ, వృష్ణివంశస్థులలో ఉత్తముడూ, బుద్ధికి గనివంటివాడూ, దేవతాగురువైనబ్బహస్పతితో సమానుడూ అయిన ఉద్ధవుణ్ణి పిలిపించి, అతనితో శ్రీకృష్ణుడు మెల్లగా ఇట్లన్నాడు.
ఉద్ధవా! ఇలారా! ప్రణయమూర్తులైన గోపికలు నా రాకను ఎదురు చూస్తూ, నా మీది వ్యామోహంతో అన్నీ మరచిపోయి ఎంతగా దుఃఖిస్తున్నారో! నమ్ముకున్న తమ్ము విడవడం ధర్మం కాదని వారంటూ ఉండేవారు. వేగంగా వెళ్ళు. పెచ్చరిల్లుతున్న వియోగమనే అగ్నిజ్వాలలతో వారెలా ప్రాణాలు ధరించి ఉన్నారో!
లోకధర్మాలను దిగవిడచి నా యందు చూపునిలిపి నాకు ప్రపత్తి చేసేవారికి నేను లోబడి దయామయ దృష్టులతో వారిని కాపాడుతాను. ఆశ్రయించినవారిని ఆదుకోవడం నాకు స్వభావ సిద్ధమైన గుణం.
(ఈ పద్యంలో స్వామికిగల శరణాగతత్రాణపరాయణత్వం ఎలాంటితో తెల్పబడింది.)
కమలాలవంటి కన్నులుగల కాంతలారా! సంశయం మానండి. మిమ్ము విడిచిపెట్టను. బృందావనానికి వస్తాను - అని శ్రీకృష్ణుడు వార్త పంపినాడని నీవు రహస్యంగా గోపికలకు చెప్పు.
అని చిరునవ్వుతో అందమైన కమలంవంటి మోముగల గోవిందుడు ఉద్ధవునిచేతిని తన చేతితో పట్టుకొని, రసవంతాలైన మాటలు మాట్లాడుతూ సాగనంపాడు. ఉద్ధవుడు ఆ రథాన్నెక్కి రవి అస్తమించే వేళకు వ్రేపల్లెకు చేరాడు. అడవులలో మేతమేసి వచ్చే ఆలమందల పాదధూళులు అతని రథాన్ని కప్పివేస్తుండగా చొచ్చి, ఉద్ధవుడు గోకులం చేరి నందుని మందిరంలో ప్రవేశించాడు.
నందుడు ఆనందంతో ఆ పుణ్యాత్ముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఇతడు మా పాలిటికి గోపాలకృష్ణుడంటూ సాదరంగా పూజించాడు. కోరిక తీరేటట్లు కమ్మనిభోజనం పెట్టాడు. ప్రయాణంవల్ల కలిగినశ్రమ పోగొట్టాడు. అతణ్ణి చూచి ముచ్చటించ గోరి ఎంతో సంతోషంతో ఇట్లన్నాడు.
ఉద్ధవా! నా చెలికాడు వసుదేవునికి క్షేమమే కదా! గర్వాంధుడైన కంసుడు మరణించిన తరువాత తన కుమారుల "సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు గదా!
అన్నా! ఉద్ధవా! అక్కడ అందరికీ కుశలమేనా? శ్రీకృష్ణుడు తలిదండ్రులమైన మమ్ము సంతోషంతో తలచుకొంటూ ఉంటాడా? తనకు దూరమైన గోపకులనూ, గోపికలనూ, చెలికాండ్రనూ, ఆలమందలనూ, ఎల్లప్పుడూ స్మరిస్తాడా? ఇక్కడి వనాలనూ, నదులనూ, పొలాలనూ గూర్చి ముచ్చటిస్తుంటాడా? ఇక్కడి మా వ్రేపల్లెకు కృష్ణుడు ఎప్పుడు వస్తాడయ్యా!
మచ్చలేనిచంద్రుని వలె అందాలు చిందుతూ కాంతులు వెదజల్లే ఆ కమలాక్షునిముద్దులముఖం అడ్డులేకుండా స్వేచ్చగా ఆలోకించే అదృష్టం ఈ జన్మలో నాకు లభిస్తుందా?
ఈ విధంగా గోపాలవరేణ్యుడైన నందుడు శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యాలన్నింటినీ పలుమారు చెప్పి, బొంగురు పోయిన కంఠంతో మాట్లాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు గలవాడై మిన్నకున్నాడు.
ఈ విధంగా తన భర్త గోపాలకృష్ణునిగుణాలు ఉగ్గడిస్తుండగా యశోద ప్రేమతో పరవశించిన మనసుగలదై, చనుమొనలనుంచి పాలుజాలువారగా, కనుగొనలనుంచి కన్నీటిధారలు కారగా చలించిపోయింది.
ఈ విధంగా శ్రీకృష్ణసందర్శనం లేకపోవడంతో కలతచెందిన యశోదానందులతో ఉద్ధవు డిట్లన్నాడు.
తలిదండ్రులైన మిమ్ము దర్శించడానికి కమలాక్షుడు త్వరలోనే వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్ము చూచి మీకు శుభాలు చేకూరుస్తాడు, చింతించకండి.
రామకృష్ణులు సామాన్యమానవులా? మోక్షానికి అధినేత అయిన శ్రీమహావిష్ణువు భూభారాన్ని తొలగించడానికి రామకృష్ణుల రూపాలలో భూమిమీద అవతరించాడు. ఏ మానవుడు జ్ఞానవంతుడై ప్రాణప్రయాణకాలంలో సర్వానికి ప్రభువైన ఆ భగవంతుణ్ణి సంస్కరిస్తాడో అట్టివాడు బ్రహ్మ స్వరూపుడై సూర్యునివలె తేజోవిరాజితుడై నిత్యత్వంపొంది ముక్తి రూపమైన శ్రేయస్సును చూరగొంటాడు.
అట్టినారాయణుడు అన్ని ప్రాణులందునూ ఆత్మగా ఉన్నాడు. కారణవశంగా మనుష్యరూపం గైకొన్న ఆయనపై మీరు మనసులు చేర్చి కొలిచారు. మీరు పరమధన్యాత్ములు. కట్టెలలో నిప్పున్నట్లు అత డెప్పుడూ సకలప్రాణుల్లోనూ ప్రకాశిస్తుంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టం, విరోధి, ఇష్టుడు, అనిష్టుడు అంటూ ఎవ్వరూలేరు. జననమరణాలు లేవు. సజ్జనుల్ని సంరక్షించడానికై త్రిగుణరహితుడైనా గుణాలు గైకొని, సృష్టిస్థితిలయాలు అనే లీలలు సాగిస్తుంటాడు.
అని పలువిధాల ఉద్ధవుడు శ్రీకృష్ణుడి మహిమలుగూర్చి ముచ్చటిస్తూ, ఆ రాత్రి గడిపాడు. వేకువనే పెరుగుచిలికే చప్పుళ్లు విని నిద్రలేచాడు. సంధ్యావందనాదినిత్యానుష్ఠానాలు నెరవేర్చుకుని ఒక ఏకాంతస్థలంలో ఉన్న సమయంలో
ఆ సమయంలో గొల్ల చెలువలు అక్కడికి వచ్చారు. వారు "పద్మాలవంటి కన్నులుగలవాడు; అందమైన వదనం కలవాడు, విశాలమైన వక్షం కలవాడు, పచ్చనిపట్టువస్త్రం కట్టినవాడు, మోకాళ్ళవరకు వ్రేలాడే చేతులుకలవాడు, కమలమాలా విభూషితుడు, మెరుగారు కుండలాలు ధరించినవాడు అయిన ఒకానొక పురుష పుంగవుడు మా మాధవునివలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు." అని చెప్పుకుంటూ చంద్రవంశ్యుడైన ఉద్ధవుణ్ణి చూచారు.
అలా చూచి సిగ్గుతో కూడిన నవ్వులు, చూపులు తమ వదనాలకు సొంపు సంపాదించగా ఆ గోపకాంతలు ఉద్ధవుడితో ఇలా అన్నారు.
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment