Wednesday, April 8, 2026

Sage Wifes came and gave food to Srikrishna - మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

శ్రీకృష్ణుడు ఈ విధంగా గోపికలను అనుగ్రహించి, బృందావనాన్ని దాటి, దూరంగా తోలుకొనిపోయి ఆవుల్ని మేపుతున్నాడు. ఎండ మెండుగా కాస్తోంది. గొల్లవారు ఆ వేడికి తట్టుకోలేక పోతున్నారు. నీరసించి పోతున్నారు. అక్కడ విశాలంగా విస్తరించి గాడుగులవలె నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. వాటిల్ని చూచి తక్కిన గొల్లవారు శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీదాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు, మొదలయినవారితో ఈ విధంగా అన్నారు.

గోపబాలకులారా! ఈ చెట్లు చూడండి. ఎంత గొప్పవో! తమకు కీడు తలపెడదామని వచ్చినవారికికూడా కీడు చేయవు. ఎవరిసంబంధం లేకుండా ఏకాంతంగా ఉన్నాయి. ఎండ, చలి, వానలనుండి ప్రజల్ని కాపాడుతున్నాయి. వారికి అవసరమైన బెరడు, గంధం, జిగురు, బూడిద, చిగుళ్లు, తేనె, పూలు, పండ్లు, నీడలు ఇచ్చి ఆదుకుంటున్నాయి.

(రాగద్వేషాలు లేని మహాయోగీశ్వరులు ఏకాంతంగా తపస్సు చేసుకొంటూ ఉంటారు. తమను ఆశ్రయించినవారు మంచివారయినా, చెడ్డవారయినా సర్వసమభావంతో ఆదరించి, వారికీడులను తొలగించి మేళ్లు కలిగిస్తారు. అటువంటివి ఈ వృక్షాలు అని సారాంశం.)

అక్కడి చెట్లన్నీ పువ్వులు కాయలు పండ్లు మెండుగా ఉండడంవల్ల వాటి బరువుకు వంగి ఉన్నాయి. వాటి నడుమనుండే దారులగుండా గొల్లవారు ఆలమందలను యమునవద్దకు తోలుకొని పోయారు. ఆ నదిమడుగులలోని చల్లనినీరు త్రాగించి, సమీపంలోని పచ్చికబయళ్లలో మేపుతూ, తమకు ఆకలిగా ఉందని శ్రీకృష్ణునికి విన్నవించారు. బలరామ సహితుడైన శ్రీకృష్ణుడు తనయందు భక్తిగల బ్రాహ్మణభార్యలను అనుగ్రహించాలని సంకల్పించి, గొల్లవారితో ఈ విధంగా అన్నాడు.

ఓ గోపాలకులారా! ఈ అడవిలో వేదాలు వల్లించిన బ్రాహ్మణులు స్వర్గలోకప్రాప్తికయి 'ఆంగిరసము' అనే యజ్ఞం చేస్తున్నారు. మీరు వారివద్దకు వెళ్లి మా అన్నదమ్ముల పేరులు చెప్పి, వారు పంపగా వచ్చామని చెప్పి, అన్నం పెట్టుమని అడగండి. వారు పెడతారు. అలాగే అని గోపబాలకులు బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, నమస్కరించి, అయ్యా! మీరు ధర్మతత్త్వం ఎరిగినవారు. యాచకులు అడిగినవి అనుగ్రహించేవారు! ఆవులను మేపుతూ అలసిపోయిన బలరామకృష్ణులు ఆకలితో అన్నం పెట్టమని మీ వద్దకు పంపారు. కాబట్టి అన్నం పెట్టండి. ఆకలితో నకనకలాడేవారిని పిలిచి మరీ అన్నం పెడతారు కదా మీవంటి పెద్దలు!

ఓ పుణ్యాత్ములారా! యజ్ఞదీక్ష వహించిన యజమానుడు పశువిశసనం జరిగిన పిమ్మట, సౌత్రామణి క్రతువు పూర్తి అయిన పిమ్మట భోజనం చేయవచ్చు. ఇతరులకు పెట్టవచ్చు. అది దోషం కాదు. కావున మాకు అన్నం పెట్టండి.

ఈ విధంగా గొల్లవారు అన్నం పెట్టండి అని బ్రాహ్మణులను యాచిస్తే

అజ్ఞానంతో కూడినవారు, దుర్బుద్ధి కలిగినవారు అగు బ్రాహ్మణులు, సమస్తానికీ ప్రభువయినవాడు శ్రీకృష్ణుడని గ్రహించ లేకపోయారు. వాస్తవానికి యజ్ఞం, మంత్రాలు, దేశకాలధనాలు, యజ్ఞం చెయ్యడంవల్ల కలిగే పుణ్యఫలం (అపూర్వం), అన్నీ కూడ శ్రీవిష్ణుస్పరూపాలే. అటువంటి శ్రీ కృష్ణుణ్ణి సామాన్యమైన గొల్లపిల్లవాడు అని భావించి, అతని మాటలను గౌరవించకుండా, అన్నం లేదు లేదు వెళ్లిపొండి అని తిరస్కరించి పంపించారు.

అపుడు గోపాలకులు నిరాశతో శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, జరిగిన విషయం వివరించారు. అంతట శ్రీకృష్ణుడు లోకవ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ గొల్లవారితో మీరు వెళ్లి ఆ బ్రాహ్మణులను గాకుండగా వారిభార్యలను దర్శించి, వారికి మా రాకను చెప్పండి. వారు తప్పక అన్నం పెడతారు, అని పంపించాడు. వారు వెళ్లి యజ్ఞవాటికలో ఉన్న బ్రాహ్మణ భార్యలను దర్శించి, నమస్కరించి వారిచే సత్కారం పొంది, వారితో ఈ విధంగా అన్నారు.

బుద్ధిమతులయిన ఓ అమ్మలారా! శ్రీకృష్ణుడు ఆవులను మేపుతూ, ఆకలి గొన్నవాడయి మిమ్మల్ని అడిగి అన్నం తెమ్మని ఈరోజు మమ్మల్ని పంపించాడు. కావున వెంటనే అన్నం పట్టుకొనిరండి.

గొల్లల మాటలు విన్న బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణుణ్ణి చూడాలనే కుతూహలంతో, సంతోషం, తొట్రుపాటు అధికం కాగా, భక్ష్య భోజ్య చోప్య లేహ్య పానీయాలనే భేదాలతో కూడుకొని ఉన్న ఆహారపదార్జాలను పాత్రలలో నింపుకొని, సముద్రం చేరడానికి తొందరపడే నదులవలె (బయలుదేరారు)

పిల్లలు, మగలు, అన్నదమ్ములు అడ్డం వచ్చి వెళ్లవద్దని వారించారు. అయినా ఆ బ్రాహ్మణస్త్రీలు వారిని లక్ష్య పెట్టక, ఎదిరించి, మాదారికి అడ్డురాకండి తొలగిపొండని గద్దించి, ఆహారపదార్థాలు తీసికొని వేగంగా శ్రీకృష్ణుణ్ణి సమీపించారు.

బ్రాహ్మణస్త్రీలు ఈ విధంగా వెళ్లి, యమునకు సమీపంలో కొత్తచిగుళ్లతో కూడిందీ, తన క్రిందికి చేరినవారి బడలికను పోగొట్టేదీ అయిన అశోకవృక్షచ్చాయలో ఒకమంచి చోట

అపుడు శ్రీకృష్ణుడు ఒక స్నేహితుని భుజంమీద ఒక చేయివైచి, రెండచేతితో వేడుకగా తామరపూవును ఇటు అటు త్రిప్పుతున్నాడు. తలమీది ముడికి అందని కొన్ని ముంగురులు చెక్కిళ్లమీద చిందులాడుతున్నాయి. కురుచగా కుచ్చెళ్ళువచ్చేలాగున బంగారు రంగుబట్ట కట్టుకొని ఉన్నాడు. తలచుట్టు గుండ్రంగా అమరి ఉండునట్లుగా దట్టంగా కుట్టిన నెమలీకలదండ ధరించాడు. చెవిసందున కలువపూవు పెట్టుకొన్నాడు. పారవశ్యం కలిగించేటంతటి చక్కటి నటవేషంతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి బ్రాహ్మణవనితలు కన్నుల కరువెల్ల తీరేలా కనుగొన్నారు.

సన్ననినడుములు గల ఆ బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణుని సుందరమైన రూపాన్ని కన్నులతో హృదయంలోనికి క్రమంగా ఆకర్షించుకొన్నారు. మనస్సులలోని తాపాలు హరించే విధంగా అతణ్ణి తమ మనస్సులతోనే కౌగిలించుకొన్నారు.

ఈరీతిగా ఆ బ్రాహ్మణస్త్రీలు ఐహికమైన అన్నికోరికలను వదలుకొని తనను దర్శించడానికి వచ్చిన సంగతిని గ్రహించిన శ్రీకృష్ణుడు, చిరునవ్వు నవ్వి, నిశ్చలదృష్టితో వారిని చూస్తూ, వారితో ఈ విధంగా అన్నాడు.

గొప్పవారయిన ఓ పడతులారా! నా దగ్గరకు రండి. మీ యిండ్లలో అందరు క్షేమమే కదా! ఏ ప్రయోజనాన్ని కోరి నావద్దకు వచ్చారో చెప్పండి. పతిపుత్రాదులపట్ల ఉన్న ప్రేమనుకూడా కాదని నన్ను చూడాలనే వేడుకతో వచ్చారు. ఏ విధమైన ఫలాసక్తి లేకుండా వచ్చారని నాకు తెలుసు. యోగీశ్వరులుకూడ మీలాగుననే నన్ను ఆశ్రయించి, సేవించి, సమస్త ప్రయోజనాలు పొందుతూ ఉంటారు.

“మీ భర్తలు గృహస్థధర్మాలను పాటించేవారు. వారు మీతో కలిసి యాగం పూర్తి చేస్తారు. కావున మీరు వెంటనే యాగశాలకు వెళ్లండి” అని శ్రీకృష్ణుడు చెప్పగా బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణునికి ఈ విధంగా సమాధానం చెప్పారు.

ఓ లక్ష్మీపతీ! మాతో ఇటువంటి తీక్ష్ణమైన మాటలు మాటాడవచ్చునా? ఇది నీకు న్యాయమా! మా భర్తలు, బిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు వద్దని అడ్డగిస్తూ ఉన్నా, వారిని కాదని నీ మీది వ్యామోహంతో నీ దగ్గరకు వచ్చాము. ఇపుడు ఇంటికి తిరిగి వెళితే వారు స్వీకరిస్తారా? కావున ఇపుడు నువ్వు చెప్పినమాటలు మాకు నచ్చవు. మేము నీ వద్దనే ఉంటాము. మమ్మల్ని నీ సేవకురాండ్రుగా భావించి కాపాడు.

అని బ్రాహ్మణస్త్రీలు పలుకగా శ్రీకృష్ణుడు వారికి నచ్చ జెప్పాడు. మీరునా దగ్గర ఉన్నారని మీ చుట్టాలు, అన్నదమ్ములు, మగలు, బిడ్డలు ఎవ్వరూ కోపపడరు, సరికదా - దేవతలయినా మిమ్మలను మెచ్చుకోవలసిందే. నా దేహంతోడి సంబంధం కామసౌఖ్యాన్ని, కామభావాన్ని కలిగించదు. పైగా ముక్తిని ప్రసాదిస్తుంది. నన్ను గూర్చి స్తుతించడం, దర్శించడం, వినడం, ధ్యానం చేయడం, మీ మనస్సులను నా యందే లగ్నం చేయడం అనే వాటివల్ల, కర్మసంబంధంతో ఏర్పడిన ఈ శరీరం విడిచి తగినకాలంలో నాలో ఐక్యమైపోతారు. నా మాటలు నమ్మండి అని పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు వారు తెచ్చిన ఆహారహూర్జాలను తన ఆప్తవర్గంవారితో కలిసి ఆరగించాడు.

ఓ పరీక్షిన్మహారాజా! పరమేశ్వరభావంతో సామాన్యజనునికి భిక్ష పెడితే పరమపదం అయిన వైకుంఠం సిద్ధిస్తుంది. మరి, స్వయంగా పరమేశ్వరుడే శ్రీకృష్ణరూపంలో వచ్చి భీక్ష స్వీకరించినందువల్ల కలిగే ఫలం ఎంతటిదో ఎవరు చెప్పగలరు?.

ఈ విధంగా పరమేశ్వరుడయిన శ్రీకృష్ణునికి ఆహారం సమర్పించి, తమ భార్యలు ఆయనచేత ధన్యురాండ్రయిన సంగతి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు తమలో తాము పశ్చాత్తాపం పొందారు.

అయ్యయ్యో! మనం ఎంత మోసపోయామో గదా! ఆడవారికున్నవాటి బుద్ధికూడ మనకు లేదు. దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి వెళ్లి దర్శించలేక పోయామే! మన మనస్సులు మంచివి కావు. మనం ఎంతో పాపం చేసుకొన్నాము. విష్ణువును పూజించనివారితెలివితేటలు, తపస్సు, సదాచారం, తీర్ధయాత్రలు, యాగాలు వ్యర్థములే గదా!

ఆడవారు జపాలు, హోమాలు, వేదాధ్యయనాలు, తపస్సులు, వ్రతాలు, ఏమీ ఎరుగరు. అయినప్పటికినీ భక్తి కలిగి శ్రీకృష్ణునిదయకు పాత్రలయ్యారు. జపహోమాదులు అన్నీ చేస్తూ ఉండికూడ భక్తిలేని కారణంగా చాంచల్యానికి లోనయి, శ్రీకృష్ణుని అనుగ్రహానికి నోచుకొనలేక పోయాము గదా!

విష్ణుమాయ దేవతలకు గురువులయిన మహాయోగీశ్వరులనే మోహంలో ముంచేస్తుంది. ఇక సామాన్యమానవులకు గురువులమై అజ్ఞానులమయిన మమ్మల్ని మోహింప జేయడంలో ఆశ్చర్యం ఏమి ఉంది?

యజ్ఞాలు, మంత్రాలు, తంత్రాలు, పుణ్యం, ధనం, కాలం, దేశం, దేవత, త్రేతాగ్నులు, బ్రాహ్మణులు అంతా విష్ణుమయమే! అట్టి పరమేశ్వరుడు భూమిని రక్షించడంకోసం శ్రీకృష్ణుడుగా అవతరించాడు అనే సంగతి తెలుసుకొన లేకపోయాం. లక్ష్మీదేవికి భర్త, సృష్టి స్థితిలయాలకు కర్త భూమండలానికి ఉద్ధర్త, రాక్షసరాజులకు సంహర్త అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాము.

నందాదు లింద్రయాగము సేయ శ్రీకృష్ణునితో నాలోచించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The taking of the clothes of the Gopikas - గోపికా వస్త్రాపహరణము

గోపికా వస్త్రాపహరణము

ఒకనాటి ఉదయం గోపికలు మేలుకొని, ఒకరినొకరు రండురండని ప్రియంగా పేర్లు పెట్టి పిలుచుకొంటూ, శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ, బరువైన చనుగవలవల్ల సన్నని నడుములు అల్లలాడుతూ ఉండగా గజగమనంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకొని యమున ఒడ్డుకు చేరుకొన్నారు.

గజగమనలయిన ఆ గోపికలు ఈ విధంగా యమునానదీతీరానికి చేరుకొన్నారు. ఒక ఏకాంత ప్రదేశంలో తాము కట్టుకొన్న బట్టలు విడిచి పెట్టి, మనస్సులో ఏ సంకోచం లేకుండా స్నానం చేయడంకోసం నీళ్లలోకి దిగారు.

ఆ గోపికలు శ్రీకృష్ణుణ్ణి గురించి గానం చేస్తూ వినోదంగా, ఇచ్చానుసారంగా జలవిహారాలు సాగించారు. వారి విహారాలకు లోకంలో సాటి లేదు.

అలాంటి వేళలో

ఓ రాజా! దూరంగా ఉన్న శ్రీకృష్ణునికి గోపికలు యమునానదిలో స్నానం చేస్తున్నారనే సంగతి తెలిసింది. వెంటనే తన సావాసగాండ్రతో కలిసి అక్కడకు చేరుకొన్నాడు.

శ్రీకృష్ణుడు తనతోవచ్చిన గొల్లవారిని కదలకుండ నిలబడండి అని కంటితో సైగ చేశాడు. తాను మెల్లమెల్లగా పొదల మాటున నుండి నక్కి దాగి నడచుకుంటూ వచ్చి, గోపికల వస్త్రాలను అపహరించాడు.

ఈ విధంగా గోపికల వస్త్రాలను దొంగిలించినవాడై,

ఆదిపురుషుడు, విశ్వభర్త అయిన శ్రీకృష్ణుడు లీలాబాలకుడయి, తనతోటివారితో వచ్చి, గోపికల వస్త్రాలు అపహరించాడు. యమునానదికెరటాల మీదనుండి వచ్చే చల్లనిగాలి అతనికి హాయి కలిగిస్తోంది. ఏనుగులాగ విలాసంగా నడుచుకుంటూ వెళ్లి, సమీపంలో ఉన్న కడిమిచెట్టును ఎక్కినాడు. ఆ చెట్టు వృక్ష జన్మ ఎత్తినందువల్ల కలిగిన సంతాపాన్ని ఆ క్షణంలోనే విడిచిపెట్టి, తన జన్మ ధన్యమయిందని భావించింది.

ఆ సమయంలో గోపికలు ఇలా అన్నారు.

కృష్ణా! వద్దు వద్దు. మా వస్త్రాలు అపహరించి మా అభిమానాన్ని పాడు చేయవద్దు. మా మనస్సులు అపహరించి మాకు మైమరపు కలిగించవద్దు.

ఓ కృష్ణా! నీవు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్క్యివతారాలెత్తి, లోకాలను రక్షించావు. అటువంటి నీవు మంచిజీవిక కలిగి ఉండాలి. ప్రేమతో నీ వంశంవారిని సాకుతూ ఉండాలి. ప్రభుత్వాన్ని వహించి భూమిని పాలిస్తూ ఉండాలి. ఇతడు సింహంవంటివాడు అనే ప్రశస్తిని పొందాలి. 'వయసున చిన్నవాడవయినా నీకంటె బలవంతుడయిన వాణ్ణి వంచి లోకానికి మేలు చేశాడనే' కీర్తిని పొందాలి. లోకంలో దుర్మార్గులయిన రాజులను జయించాలి. మంచిబుద్ధి కలవాడవు అనిపించుకోవాలి. నీ కులం వారిని ఆదుకోవాలి. స్వపరభేదం లేకుండా ప్రవర్తించాలి. ఇటువంటి కొంటెపనులు నీ వంటివాడు చేయకూడదు. మా వస్త్రాలు మాకు ఇవ్వు,

శ్రీకృష్ణా! మా మనస్సులను, మానాభిమానాలను, సిగ్గును, చివరకు బట్టలను కూడా నీవు అపహరించావు. ఇంకా ఏమేమి చేయదలచుకొన్నావో గదా! నీవు కొంటెవాడివికదా! నీ సంగతి బాగా తెలుసుకొన్నాము.

ఓ కృష్ణా! నీవు రాచఠీవితో లోకాతీతమైన కార్యాలు సాధిస్తూ ఉంటావు. బలవంతుడవై ఇతరులను శిక్షిస్తూ ఉంటావు. కోపంతో లోకాలు కూల్చివేస్తూ ఉంటావు. మాయలమారివై ఒక తీరుగా ఉండవు. నీ తీరుతెన్ను లేమిటి? నీ పరిమితి ఏమిటి? ఒక్కగుణం కూడ నీలో లేదు. ఏనాడు ఒకచోట నిలకడగా ఉండవు. మా బట్టలు మా కిచ్చివేయుము.

అర్భాంతరం : కృష్ణా! నీవు పరమాత్మవు. రజోగుణాన్ని ఆశ్రయించి విశ్వసృష్టిని, సత్త్వగుణాన్ని ఆశ్రయించి స్థితినీ, తమోగుణాన్ని ఆశ్రయించి లయాన్నీ కొనసాగిస్తూ ఉంటావు. సమస్తరూపుడవు. అపరిచ్చిన్నుడవు. గుణాతీతుడవు. దేశకాలాలకు లోబడనివాడివి.

ఓ కృష్ణా! నీకు రాజులసంగతి తెలియదు. నువ్వేమీ ఈ రాజ్యానికి రాజువు కావు. మా చీర లియ్యకపోతే నందమహారాజుకు నీ ఆగడాల్ని గురించి, చెప్తాం.

శ్రీకృష్ణుడు గోపికల మాటలు విన్నాడు. ముసి ముసి నవ్వులు నవ్వుతూ, తన సావాసుల చేతులలో చేతులు వేసి, చతురుడైన కృష్ణుడు నేర్పుగా వారితో ఇలా అన్నాడు.

స్త్రీలు రాజులతో ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? కేవలం నన్ను నిందిస్తున్నారు. కానీ మీ తప్పు మీరు తెలిసికోవడం లేదు. చంద్రబింబాననల్లారా అయిన మీరు నీటినుండి బయటకు వచ్చి మీ బట్టలు తీసికోండి. వెంటనే ఇచ్చేస్తాను.

శ్రీకృష్ణుని మాటలు విన్న గోపికలు ఒకరి మొగం ఒకరు చూచి నవ్వుకొన్నారు. మర్మాలు నాటే ఆ మాటలకు తిరిగి జవాబు చెప్పడానికి సిగ్గుపడ్డారు. గొంతులోతు నీటిలో నిలబడి చలికి వణకిపోతూ నిలకడలేని మనస్సుతో ఇలా అన్నారు.

దుందుడుకు తనంతో మా బట్టలు ఎందుకు అపహరించావు. నీవేమైన తక్కువవాడవా! కాదు గదా! నీకు తెలియని ఏదైనా విషయం ఉందా? ప్రజలందరిలోను నీవు గొప్ప ధర్మాత్ముడవు గదా!

ఓ కృష్ణా! ఆడవాళ్లు స్నానం చేస్తూ ఉండగా మగవారువచ్చి ఎక్కడైనా చూస్తారా! పొరపాటున వచ్చినా, చీరలు ఎత్తుకొని పోవడంలాంటి తప్పుడు పనులు దయమాలినవారయి చేస్తారా? ఇటువంటి కూడని పనులు నీకే తగినవి కానీ, ఇంకెవరూ ఇలాగ చేయరు. నీ సేవ చేసుకొంటాం. మా చీరలు మాకివ్వండి.

కృష్ణా! నీవు రమ్మంటే వచ్చేస్తాం. నీ వేది కోరినా ఇచ్చేస్తాం. నీ వెక్కడికి వెళ్లమన్నా వెళ్లిపోతాం. ఇపుడు మాత్రం మా చీరలు మాకిచ్చి మమ్ము ఏలుకో.

అని గోపికలు ప్రాధేయపడగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు మోముతో ఇలా అన్నాడు.

ఏ యువకుణ్ణి భర్తగా కోరి మీ రీవ్రతం చేస్తున్నారో చెప్పండి. చెప్పకపోతే మీ మీద ఒట్టే. ఇటువంటి ప్రేమ లోకసహజమైందే కదా!

మీరు ఎవణ్ణి చూచి మోహించారు? మీ మానధనాలు హరించిన వాడెవడు? మీకు ఎవరిమీద ప్రేమ పుట్టింది? నేను అన్యుణ్ణి కాను. నేను మీవాడనే. నాకు చెప్పవచ్చు కదా!

ఈ మాటలు విని గోపికలు ఒకరి నొకరు చూచుకొన్నారు. వారిని కామభావం కల్లోలపరుస్తూంది. నవ్వుతూ మిన్నకుండి పోయారు. అప్పుడు లోకపూజ్యుడయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.

ఓ గోపికలారా! మీరు నా యింటిలో సేవచేస్తూ నా ఆనతిప్రకారం నడుచుకొంటామంటే మీ కోకలు మీకిస్తాను.

శ్రీకృష్ణునిమాటలు విన్న గోపికలు నీళ్లలో నిలబడలేక చలికి భయపడి

ఓ పరీక్షిన్మహారాజా! గోపికలలో కొందరు బయటికి వెళ్దాం అంటారు. మరికొందరు బయటకు వెడితే మన మానం పోతుంది అంటారు. ఇంకొందరు చలికి వణకిపోతూ ఆందోళన చెందుతున్నారు.

గోపికలు చివరకు ఎలాగో మనస్సుల్ని గట్టిచేసికొని నీటినుండి బయటకు వచ్చి,

ఆ గోపికలు, కదలుతున్న చిగురుటాకులవలె కోమలమయినవి, నవరత్నాలు పొదిగిన బంగారపు కంకణాలు కలిగిన చేతులతో తమ మర్మాంగాలను మాటు పరచుకొని నీటినుండి వరుసగా (బయటకు వచ్చారు)

మెల్లమెల్లగా నడిచే గొల్లపడుచులు తమలో గడుసరులయిన వారిని ముందుంచుకొని మడుగులోనుండి బయటకు వచ్చి శ్రీకృష్ణునిముందు నిలువగా అతడు వారితో ఇలా పలికాడు.

గోపికలారా! మీ కీ సిగ్గెందుకు? చిన్నప్పటినుండి మీలో ఒకడుగా మీతో పెరిగివాణ్ణే కదా! నేను చూడని రహస్య స్థానాలు మీలో ఏమి ఉన్నాయి? మీరు కాత్యాయనీ వ్రతదీక్ష పూని ఇలా దిగంబరంగా యమునలో దిగి స్నానం చేయవచ్చునా? ఇది నియమం తప్పి ప్రవర్తించడం కాదా? దేవి విషయంలో అపరాధం చెయ్యడం కాదా? ఇలాగ అపమార్గంలో నోములు నోచేవారు ఎక్కడయినా ఉంటారా? మీకు వ్రతఫలం దక్కాలని మీరు అనుకొంటే, మీ రెండు చేతులు ఎత్తి నాకు నమస్కరించండి. నా వద్దకు వచ్చి మీ కోకలు తీసికోండి. సిగ్గులేకుండగా వాదించడం ఎందుకు? మోసపుమాటలు మాట్లాడడం ఎందుకు?

అని పలికిన శ్రీకృష్ణుని మాటలను వినిన గోపికలు తమలో తాము

నోములు నోచేవారు ఏ పరమాత్మను ధ్యానం చేస్తే చాలో, వ్రతాల ఆటంకాలు అన్నీ తొలగిపోతాయో అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపికలు చూశారు. కట్టుబట్టలు విడిచి, దిగంబరంగా స్నానం చేయడం తమ తప్పే అని తెలిసికొన్నారు. తమ చేతులను ఎత్తి నుదుట చేర్చి అందరూ శ్రీకృష్ణునికి నమస్కారం చేశారు.

శ్రీకృష్ణుడు దయ గలవాడు. భక్తులను రక్షించే స్వభావం కలవాడు. అందులకే చలికి గజగజ వణకిపోతూ, పశ్చాత్తాపంతో నుదిటిపై చేతులెత్తి మొక్కుతున్న గోపికలకు వస్త్రాలు ఇచ్చివేశాడు.

కోకలు దొంగిలిస్తే దొంగిలించాడు, సిగ్గులు పోగొడితే పోగొట్టాడు, వేళాకోళం చేస్తే చేశాడు. కానీ మన వ్రతానికి లోపం రాకుండా ఆదుకొన్నాడు అని భక్తిభావంతో గోపికలంతా శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు.

ఓ రాజా! మనస్సు నొచ్చేలా మాటాడినా, మోసగించినా, వేళాకోళం చేసినా, కలతను కలిగించినా ప్రియులు చేసే పనులు ప్రియురాండ్రకు బాధ కలిగించక పోగా, ఎంతో ఇష్టంగా ఉంటాయి.

ఈ విధంగా శ్రీకృష్ణుడు చీర లియ్యగా గోపికలు కట్టుకొని గాఢమైన అనురాగంతో, కలతపడక, రెప్పవేయక చూస్తూ ఉండగా నేర్పరి అయిన శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్లి ఈ రీతిగా అన్నాడు.

మంచి గుణాలుకల ఓ గోపికలారా! మీరు సిగ్గువల్ల చెప్పలేకుండా ఉన్నారు. కానీ మీ మనస్సులోని గుట్టులు బయటపడ్డాయి. మీరు నన్ను మగనిగా పొందడం కోసం ఈ కాత్యాయనీవ్రతం చేస్తున్నారు. నా అనుగ్రహంవల్ల మీ నోము పండుతుంది. నన్ను సేవించినవారికి మోక్షమే సిద్ధిస్తుంది. ఇంక మిగిలిన ధర్మార్థకామాలగురించి చెప్పేది ఏముంది? మీరు ఈ వ్రతం పూర్తిచేయండి. రాత్రులలో నా కలయిక లభిస్తుంది. నా మాటలు నమ్మి మీరు ఇండ్లకు వెళ్లిపొండి అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ మాటలు విన్న గోపికలు తమ తపస్సు ఫలించిందని సంతోషిస్తూ శ్రీకృష్ణుని పాదపద్మాలు మనస్సులో ధ్యానించుకొంటూ, వ్రేపల్లెకు వెళ్లిపోయారు.

మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Description of the autumn season - హేమంత ఋతువర్ణనము

హేమంత ఋతువర్ణనము

శ్రీమంతమైన హేమంతం ఒక్కసారిగా వచ్చిపడింది. చేమంతిపూల దండలు ధరించిన యువతుల స్తనాల వేడిమిచేత పురుషులకు చలిబాధ తీరింది. మన్మథుడు విరహులైన జనాన్ని వేధించాడు.

ఓ రాజా! ఉత్తరపు గాలులు వీచాయి, ఆకాశంలో చంద్రుడు బాధ కలిగిస్తున్నాడు. విడివిడిగా ఉన్న దంపతులు కలిసికొంటున్నారు. తామరపూలకు శోభ తరిగింది. అంతటా మంచు అలముకొంది.

ఓ రాజా! పగళ్ల పరిమాణం తగ్గింది. రాత్రులు పెరిగాయి. చలిమంటలు హాయి కలిగిస్తున్నాయి. చలివల్ల లోకం అంతా గజగజ వణికిపోతోంది.

ఆ చలికాలంలో చెలులచన్నులఅండ చూచుకొని, మగవారు బ్రదికిపోయారు కాని, ఆ చెలులచన్నులే వద్దనే పక్షంలో బ్రహ్మాదులయినా సరే చలికి తట్టుకొని బ్రదుకగలరా?

చలికి తట్టుకోలేక తిరిగేవారు గబగబా వెళ్లి, వెచ్చని చోటుకు చేరడం లోకసహజం. అదేవిధంగా లోకబాంధవుడయిన సూర్యుడు కూడ తూరుపుకొండమీద పొడిచింది మొదలు ఎక్కడ ఆగకుండా పరుగెత్తి గబగబా పడమటికొండ మరుగులో దూరిపోయాడు. కానీ అలా కాకుండ ఆలస్యం చేస్తూ మధ్యలో ఆగినపక్షంలో చలికి చిక్కి చిక్కులపాలయి ఉండేవాడు కదా!

ఓ పరీక్షిన్మహారాజా! ఎఱ్ఱ కలువల సువాసనను తనివితీరా ఆస్వాదించే తుమ్మెదలు పైకి రేగి, మన్మథాగ్నినుండి దట్టంగా వెలువడే పొగలలాగా ఉన్నాయి.

గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అనే మూడింటిలో ఒకటి శివుని కంటిలోను, మరియొకటి సముద్రంలోను, మరియొకటి మనుష్యుల ఇండ్లలోను తలదాచుకొన్నాయి. లేకపోయినట్లెతే ఆ అగ్నులు భయపడి, చలికి దాస్యం చేసేవే.

ఈ హేమంత ఋతువు చలిని జయించాలని అంటే భార్యల బిగికౌగిళ్లు తప్ప మరో మార్గం లేదని భావించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాణీ లక్ష్మీపార్వతులను తమ శరీరాలలో చేర్చుకొన్నారు. కాకపోతే ఈ త్రిమూర్తులకు భార్యలతో విడదీయరాని సంబంధం ఎందుకు ఏర్పడుతుంది?

చలికాలం వచ్చేసింది. ఎలాగ గడపడం అని విష్ణువు భయపడుతూ ఉండగా లక్ష్మీదేవి స్తనాలు మేము ఉన్నాం కదా నీ కేవిధమైన భయమూ అక్కరలేదని ధైర్యం చెప్పాయి.

ఇటువంటి హేమంత ఋతువులో మొదటిదయిన మార్గశీర్షమాసంలో మొదటిరోజు శుక్షపక్షంలోని పాడ్యమినాడు, వ్రేపల్లెలోని గొల్లపడుచులు వేకువనే లేచి, యమునకు వెళ్లి స్నానంచేసి, ఒడ్డున ఇసుకతో పార్వతీదేవి బొమ్మను చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి,

షడ్గుణైశ్వర్య సంపన్నురాలవయిన ఓ పార్వతీ! మేము నిన్నీనాడు పూజించి నమస్కరిస్తున్నాము. మా కందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుడు భర్త అయ్యేటట్లు అనుగ్రహించు.

(భగము కలవాడు 'భగవంతుడు', భగము కలది 'భగవతి'. 'భగము' అనగా పరిమితం లేని, సమగ్రమైన జ్ఞానం, ఐశ్వర్యం, యశస్సు, వీర్యం, వైరాగ్యం, సంపదలు అని అర్థం. కత్యయనుని కూతురు - కాత్యాయని. మోక్షమార్గాలు ఎన్ని ఉన్నాయని విచారించేవాడు - కత్యయనుడు. కాత్యాయని బ్రహ్మవిద్యాస్వరూపిణి - పార్వతి. ఈమె ఒక జన్మలో కత్యయనుని పుత్రిక అయింది.)

ఓ తల్లీ! శ్రీకృష్ణుడు మాకు భర్తగా లభించిననాడు నీకు నేతితో వసంతాలాడుతూ భక్తితో జాతర చేస్తాము.

ఈ విధంగా కాత్యాయనీ దేవికి మ్రోక్కికొని పవిత్రమైన ఆహారం నియమంగా స్వీకరిస్తూ నెలనాళ్లు వ్రతం చేశారు. ఆ రోజులలో ఒకనాడు

(వ్రతమంటే - ఉపవాసంతో లేదా శాస్త్రం విధించిన ప్రకారం పాలు, పండ్లు మొదలైనవి స్వీకరించి, నియమంగా చేసే పూజ.)

గోపికా వస్త్రాపహరణము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Autumn Description - శరదృతు వర్ణనము

శరదృతు వర్ణనము

ఆ శరత్కాలంలో అడవులన్నీ గుబురులు గుబురులుగా పెరిగాయి. బురదలు ఎండిపోయాయి. నెమళ్లగుంపుల కేకలు ఆగిపోయాయి. ఉరుముల మెరుపుల అలజడలు ఆగిపోయాయి.

ఆ శరత్కాలంలో బ్రతుకుతెరువులు విడిచి, ఆత్మజ్ఞాన సిద్ధిచేత జీవన్ముక్తులయి యథేచ్చగా దేశాటనం చేసే యోగీశ్వరులవలె, మేఘాలు నీటిని జారవిడిచినందువల్ల మునుపటినలుపు విరిగి తెల్లబడి, గాలితాకిడికి చెల్లాచెదరై పోతున్నాయి. మేఘావరణం తొలగిపోవడంచేత అగస్త్యనక్షత్రంతో కూడిన ఆకాశం ఆత్మజ్ఞానం అనే దీపంతో ప్రకాశించే యోగీశ్వరుని హృదయంవలె చక్కగా ప్రకాశిస్తోంది. ఆకాశంలో ఉదయించిన నక్షత్రాలు నల్లనిమేలుకట్టుకు (చాందినీ) కూర్చికుట్టిన ముత్యాలవలె ప్రకాశిస్తున్నాయి. ఆ నక్షత్రాలకాంతుల్ని మించి ప్రకాశిస్తూ, బ్రహ్మాండమనే పెట్టెలో పేర్చిన కర్పూరపు పలుకుల్లాగ చంద్రకిరణాలు చెలువారుతున్నాయి. వెన్నెల సోకి నిండుగా పండిన పైరుల వెన్నులు పొట్టలు విచ్చి, పంట బరువుకి, చప్పుడు చేస్తూ వీచే పైరగాలి తాకిడికి, నేలమీదకు ఒరగిపోయాయి. అప్పుడు అవి తమను కోయబోయే రైతుల కరకు కొడవళ్ల పదును తలచి భయపడి, తమను రక్షించమని మొరపెట్టుకుంటూ తమ తల్లి అయిన భూదేవికి ప్రణామం చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చిలుకలు ఓపినన్ని పైరుల వెన్నులను సంకోచం లేకుండ ముక్కులతో త్రుంచి నోటితో కరచి పెట్టుకొని, గూళ్లకు చేరి తమ పెంటులతోను, పిల్లలతోను కలిసి కడుపార మెక్కి చొక్కి పొగరెక్కి పంటచేలలోని ఎత్తైన మంచెలమీద వ్రాలుతున్నాయి. ఆ మంచెలమీదనుండి పైరులను కాచే కాపుపడుచుల కెమ్మోవులను చూచి అవి ఆరబండిన దొండపండ్లు అనుకొని కొరికాయి. వారు హఠాత్తుగా చేతిచరుపులతో ఎగురగొట్టగా కిలకిల చప్పుళ్లు చేస్తూ ఎగిరిపోయాయి. తేటనీటితో నిండిన సరస్సులలో కలహంసలు, చక్రవాకాలు, బెగ్గురుపక్షులు కలకలధ్వనులు చేస్తూ సంచరిస్తున్నాయి. తరిగిపోయే తమ ఆయుస్సును పట్టించుకోకుండగా భార్యాపిల్లలమీది వ్యామోహంతో సంచరించే మనుష్యులవలె ఇంకిపోయే నీటిని గుర్తించకుండ సరస్సులలో చేపలు మొదలయిన జలచరాలు సంచరిస్తున్నాయి. జలచరాలకు భయం కలిగిస్తూ నదులలోని నీరు ఎండిపోతోంది. ఆ నదులలో వేరు వేరు ఆకృతులుగా మేట వేసిన ఇసుకతిన్నెలు కర్పూరమండపాలవలె, మణులు పొదిగిన నేలలవలె, మేడమెట్ల మాదిరి కనబడుతున్నాయి. ఆ ఇసుక తిన్నెలమీద ఉదయసమయంలో మునులు స్పానసంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానంలో నిమగ్నులయ్యారు. అక్కడి తపోవనాలలోని గున్నమామిడిచెట్లపాదులలో మునికన్యకలు తమ చేతులతో బిందెలతో నీళ్లు మోసికొని వచ్చి పోస్తున్నారు. ఆ వనంలో సూర్యకిరణాలు గాని, గాలికెరటాలు కాని ప్రవేశించడానికి వీలుకానంత దట్టంగా మద్దిచెట్లు, అడవిమొల్లలు అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి. అడవిలోని చెట్ల చివరలనుండెడి లేతఆకులను అలములను మేసిన అడవియేనుగులు పొగరెక్కి దంతాగ్రాలతో ఏటిగట్లు పెల్లగించి కోరాడుతున్నాయి. అచటి చెంచెతల సన్ననినడుములు - ఏనుగుల కుంభస్థలాలవలె, బంగారుకుండలవలె బరువైన వారి స్తనాలను భరించడం ఎలాగ అనే భయంతో వణుకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చెంచితలకరకుటమ్ములు గుచ్చుకొనడంచేత సత్తువ చెడి కాళ్లు తడబడుతూ ఉండగా అడవిపందులు పెద్దపులులు పెద్ద పెద్ద గోతులలో పడిపోతున్నాయి. తామరలు కలువలు గోరంటలు మొదలైన పూవులలోని తేనెలు త్రాగి మత్తెక్కి సొక్కిన తుమ్మెదల గుంపులు జుంజుమ్మని రొద చేశాయి. కామంతో మదించిన మగజింకలు, ఆబోతులు తమ తమ మందల్ని విడిచిపెట్టి, వెదకి వెదకి ఎదకువచ్చిన ఆడలేళ్లను, ఆవుల్ని మన్మథతాపంతో దాటి చూలు కట్టిస్తున్నాయి. ఆ శరదృతువు కుందం, పద్మం అనే నిధులతో నిండిన కుబేరునిగృహంలాగ మొల్లలు, తామరలతో చూడ చక్కనిదయింది. శివశబ్దం వినడానికి నోచుకోని భాగ్యహీనుని చెవిలాగ నెమళ్లకేకలు లేనిదయింది (వర్షాకాలంలో మదించిన నెమళ్లుకేకలు పెడతాయి. శరత్కాలంలో వానిమదంతోబాటు కేకలు తగ్గుతాయి. వ్యాకరణశాస్త్రవేత్త హృదయంవలె సమస్త ప్రపంచము తేటతెల్లం అయినందువల్ల ఒప్పిదమయ్యింది (వర్షాకాలంలో కారుమబ్బులు కమ్ముకొని ఉండడంవల్ల భూమిమీద వస్తువులన్నీ తమ సహజకాంతుల్ని పూర్తిగా ప్రసరింపజేయలేవు. వర్షాకాలం గడచి మబ్బులు మాయమవడంవల్ల ప్రపంచంలోని వస్తువులన్నీ తమ తమ సహజగుణంతో ప్రకాశిస్తున్నాయి. అలా ప్రకాశింపజేసింది శరదృతువు). వింటితో విజృంభించిన రాముని యుద్ధంలాగ నల్లగోరింట వేగిసచెట్లతో వెలసింది. పాపచింతలేని యముని హృదయంలాగ బురద లేనిదయ్యింది. మహాపుణ్యం చేసినందువల్ల సత్యలోకం చేరిన మహారాజులతో కూడిన బ్రహ్మదేవుని సభామందిరంలాగ రాజహంసలతో విరాజిల్లింది. పాపసంపర్కం లేని ఉత్తమపురుషుని ప్రవర్తనలాగ బురదలేని నీటితో అలరారింది. కొండలనుండి పుట్టే నదులు వచ్చి చేరడంవల్ల సందడించే సముద్రంలాగ దండయాత్రలకు బయలుదేరే రాజుల చతురంగ బలాల కోలాహలంతో కూడిందయ్యింది. ఉత్తమురాలయిన ఇల్లాలి స్తనములు కనబడనట్లు మబ్బులు కనబడనిదయింది. ఆ శరదృతువు భూమండలానికి భూషణం అయింది. ఆ తర్వాత

ఓ పరీక్షిన్మహారాజా! శరదృతువు రాగానే రాజులందరు దిగ్విజయయాత్రకు బయలుదేరబోతూ తమ తమ వాహనాలకు హారతు లెత్తుతున్నారు. విజయయాత్రలు సాగిస్తున్నారు. లక్ష్మీపూజలు, దేవతలకు ఉత్సవములను జరిపిస్తున్నారు.

(దండయాత్రకు బయలు దేరేటప్పుడు గుఱ్ఱాలు మొదలయిన వాహనాలకు హారతులిస్తారు. ఆ సమయంలో జ్వాలలు ప్రదక్షిణక్రమంగా వెలిగాయంటే దాన్ని శుభసూచనగా భావిస్తారు.)

మన్మథుడు చేవగల తన చెఱకువింటియందు నల్లకలువ అనే తన అమ్మును సంధించి వియోగంతో ప్రజలను వడిగా బాధించసాగినాడు.

(మన్మథునికి ఉన్న అయిదు పుష్పబాణాలలో నల్లకలువ ఒకటి. మిగిలిన నాలుగు అరవిందం, అశోకం, చూతం (మామిడిపూవు), నవమల్లిక.)

ఈ విధంగా ఆ శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణుడు బృందావనంలో చక్కగా ఆలమందలను మేపుతూ

చక్కగా నటించే నేర్పుగల ఆ శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి చేతబట్టి స,రి,గ,మ,ప,ద,ని అనే సప్తస్వరాలు చక్కగా వ్యక్తమయ్యే విధంగా వేదసంబంధమయిన గంధర్వగీతం ఆలపించాడు. సిగలో నెమలిపించెం, మెడలో పూలదండ అందంగా అలరిస్తున్నాయి. చెవులలోని కొండగోగుపూలరంగు చెక్కిళ్లమీద అంతట వ్యాపించి వానిశోభను ఇనుమడింపజేసింది. కనుబొమ్మల సొబగుతో ఎడమవైపునకు వంచబడిన మొగం లోకానికి మైమరపు కలిగిస్తోంది. సుకుమారమైన కుడిచేతివ్రేళ్లు పిల్లనగ్రోవిరంధ్రములమీద నటిస్తూ సప్తస్వరాలకు ధ్వనిరహస్యాలు నేర్పుతున్నాయి. ఎడమకాలిమీద అడ్డంగా చాచి ఉంచిన కుడికాలిగోళ్ల కాంతి నేలమీద అంతటా వ్యాపించింది.

ఈ విధంగా శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదాడు. కామోద్దీపకమైన ఆ పాట విన్న గోపికలు సిగ్గులు విడిచిపెట్టెశారు. వలపులు ఊరడంచేత సహనం కోల్పోయారు. తమ చెలికత్తెలతో కలిసి, అయిదుగురు, పదిమంది చొప్పున గుంపులు గుంపులుగా చేరి ముద్దుముచ్చట్లలో

ఓ చెలీ! శ్రీకృష్ణుడు చెవిలో కొండగోగుపువ్వును ధరించాడు. పసిడివన్ని బట్ట కట్టాడు. సిగలో నెమిలి పింఛం తురుముకున్నాడు. మెడలో తామరపూలదండ ధరించాడు. వేణువు నూదుతూ అడవిలో ఆవులవెంట తిరిగే శ్రీకృష్ణుణ్ణి చూచావా! ఎంత చక్కగా ఉన్నాడో!

ఓ సుందరీ! ఇటురా! చెలీ! నే చెప్పేది శ్రద్ధగా విను. శ్రీకృష్ణుడు బృందావనంలో విహరిస్తూ, ఎడమవైపునకు వంచిన ముఖంతో కనుబొమలు కదిలిస్తూ, వేణువుమీద వేళ్ల స్వరవిన్యాసాలు నెరపుతూ, ఆరితేరిన నటుని లాగ షడ్జస్వరప్రధానంగా గాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.

ఓ చెలీ! శ్రీకృష్ణుని తీయని వేణుగానం చెవులలో బడిన వెంటనే నా మనస్సు వశం తప్పింది. ఇంక భయం ఎందుకు? దీన్ని గురించి ఆలోచించవే.

నా తోడ రావడానికి భయపడ వద్దు. నీ తోటివారు నిన్ను మెచ్చుకొనే విధంగా నిన్ను తీసికొని పోయి, శ్రీకృష్ణునితో మాటాడిస్తాను. నీమీద ఒట్టు సుమా!

ఈ విధంగా గొల్లపడుచులు తమలో తాము చెప్పుకొంటూ, మాటి మాటికీ శ్రీకృష్ణుణ్ణి తమ మనస్సులోనే కౌగిలించుకొంటూ, బలరామ కృష్ణుల గురించి

ఓ చెలులారా! ఈ బలరామకృష్ణులు మామిడిచిగుళ్లు, నల్లకలువలు, నెమలిపింఛాలు, తామరపూలు దండలుగా చేసుకొని ధరించారు. మంచిబట్టలు కట్టుకొన్నారు. వేణువులు ఊదుతూ, అనేకవేషాలు వేస్తూ వినోదం కలిగిస్తూ సంతోషంతో బహువిధాలైన నాట్యాలు చేస్తున్నారు. చూడండి.

ఓ సుందరులారా! చక్కగా వినండి! వీరిని వర్ణించడానికి వందమాటలు పలకడం ఎందుకు? కళ్లున్నందుకు ఈ బలరామకృష్ణుల్ని చూడడమే ప్రయోజనం.

ఈ విధంగా మాటాడుకొన్నారు. వారిలో కొందరు శ్రీకృష్ణుణ్ణి గురించి

ఓ చెలియా! ఈ పిల్లనగ్రోవి అద్భష్టం ఎంతటిదో కదా! గోపికలకు కొంచెంకూడ మిగుల్చకుండ శ్రీకృష్ణుని అధరామృతం అంతా తనొక్కతే త్రాగేసోంది. చక్కగా మ్రోగుతోంది. తన పర్వాలను నేత్రపర్వంగా చూచుకొంటూ మిడిసిపడుతోంది. ఇది పూర్వం ఎంత తపస్సు చేసిందో కదా!

ఓ చెలీ! ఈ వేణువు పూర్వం ఏ నదీజల బిందువులవల్ల పెరిగి ఇంతటి మహాభాగ్యాన్ని పొందిందో కదా! కాని ఆ నదికి కలిగే సంతోషాన్ని వర్ణించగలమా? ఆ నది మంచి కొడుకును గన్న తల్లిలాగ తనలో విహరించే హంసల కల కల ధ్వనులే పాటగా, తన కెరటాల కదలికలే హస్తాభినయంగా నాట్యం చెయ్యదా! తప్పక చేస్తుంది.

తమ కులంలో పుట్టిన గొప్ప విష్ణుభక్తుణ్ణి చూచి, ఆ కులంలోని వారంతా సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చెవిధంగా, శ్రీకృష్ణునిచేతిలోని వేణువు యొక్క రమణీయ రవళిని విని సంతోషించిన చెట్లు మకరందాన్ని వర్షిస్తున్నాయి.

అయ్యో! నేనెంత మోసపోయానో గదే! సఖీ! నేను పూర్వజన్మంలో నోములు నోచేటప్పుడు రాబోయేజన్మలో భూలోకంలో యమునానది ఒడ్డున వెదురుగా పుట్టాలని కోరుకున్నా బాగుండేది. అలా కోరుకొని ఉంటే నాకు శ్రీకృష్ణుని మోవితేనె దక్కేది కదా!

ఓ చెలీ! యమునాతీరంలో శ్రీకృష్ణుని అధరసుధను పానం చేసే వెదురుగా పుట్టాలంటే ఏమి నోము నోచాలో నాకు చెప్పు.

శ్రీకృష్ణుణి చూచి నల్లనిమేఘం అనీ, వేణురవం విని అది ఉరము చప్పుడు అనీ సంతోషంతో కేకలు వేస్తూ నెమళ్ల గుంపులు నాట్యం చేస్తున్నాయి చూచావా?

ఓ సఖీ! కొండలలో తిరిగే దేవ గంధర్వాది జాతులకు చెందిన దంపతులు శ్రీకృష్ణుని పాదముద్రలచే పవిత్రీకరింపబడి అందంగా కనిపించే బృందావనాన్ని అమరావతికంటె గొప్పదిగా భావిస్తూ చూస్తూ ఉండిపోతున్నారు.

ఓ సఖీ! అటు చూడు. దేవతాశ్రేష్ఠుల భార్యలు విమానాలమీద ఆకాశంలో విహరిస్తూ వెడుతూ మంగళకరమైన శ్రీకృష్ణునిరూపం చూశారు. ఆతని మురళీగానం మరీమరీ విన్నారు. అంతే! మన్మథావేశానికి లోనయి కోకముడులు వీడి పోతుండగా భర్తలకౌగిళ్లలో వాలిపోయారు.

ఓ సఖీ! ఈ అడవిలోని మృగాలజంటలు రసవంతమయిన శ్రీకృష్ణునివేణుగానాన్ని వింటున్నాయి. ఆ పాటలో స్వారస్యం గుర్తించే వివేకం వాటికి లేదు. అయినప్పటికీ పరవశించిపోయి, ఒళ్లుమరచి, మేతలు విడిచి, తిన్ననయిన చూపులతో శ్రీకృష్ణుణ్ణి అభినందిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. గమనించు.

చెలులారా! లేగలు తల్లులపాలు త్రాగే సమయంలో, తమ చెవులలో తమకు ఇష్టమయిన శ్రీకృష్ణుని మురళీరవం అనే అమృతధార ప్రవేశించింది. అంతే, పరవశించిపోయి అవి, త్రుళ్లిపాటు విడిచిపెట్టి, పాలు త్రాగడం మాని, పొదుగులు కుమ్మకుండా చూపులు కృష్ణునిమీద లగ్నం చేసి నిలబడిపోయాయి. చూశారా!

తామరపూలవంటి కన్నులుగల ఓ చెలీ! ఆవులు మమకారంతో శ్రీకృష్ణునిరూపం మనస్సులో నిల్పుకొని, శ్రీకృష్ణుని మురళీగానామృతాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయి, మోరలు చాచి, మేతలు మాని, ఆనందబాష్పాలు రాలుస్తూ బొమ్మలవలె నిలబడి పోయాయి. అదిగో చూశావా?

ఓ సఖీ! ఈ పక్షులు చెట్లకొమ్మలమీద కూర్చుండి, శ్రీకృష్ణునిమురళీగానామృతాన్ని చెవులారా ఆస్వాదిస్తూ, కళ్లు మూసుకొని పరవశించిపోతున్నాయి. ఆ కనులమూతలు తమ మనస్సులో లగ్నమైన శ్రీకృష్ణునిదివ్యసుందరరూపం బయటికి పోకుండగా బంధించి యోగీశ్వరులవలె బ్రహ్మానందం అనుభవిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూశావా?

ఓ యువతీ! నదులన్నీ శ్రీకృష్ణుని వేణురవం విని, మన్మథవేదనకు లోనయ్యాయి. తమలోని సుడిగుండాలు మన్మథ బాణాల తాకిడివల్ల కలిగిన గాయాలా అన్నట్లుగా ఉన్నాయి. ఆ వేదననుండి బయటపడడానికి హంసలకలధ్వనులనే మిషతో శ్రీ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అలలనే చేతులతో శ్రీ కృష్ణుణ్ణి దగ్గరకు లాగికొని తామరపూల సమర్పణలతో శ్రీకృష్ణునిపాదాలు పూజిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూశావా

రమణీ! నేడు శ్రీకృష్ణుని మురళీగానం విని మేఘం పూలవాన కురిపించింది. దానితో తెల్లబడి తన శరీరాన్నంతటినీ వెల్లగొడుగుగా మార్చి, శ్రీకృష్ణునికి ఎండ తగులకుండా నీడ కల్పించింది. చూశావా.

ఓ చెలీ! ఆ చెంచితలను చూడు. వారు నెమలియీకలు, చెట్లఆకులు కోకలుగా కట్టుకున్నారు. బాగా మాగిన పండ్లు తెచ్చి శ్రీకృష్ణుని చేతుల నిండా నింపి, ఆపైన ఆతనిచేతులు పట్టుకొని ఆనందంతో ఆడుతున్నారు.

ఓ సఖీ! అటు చూడు. ఒక ఆటవిక స్త్రీ బరువయిన తన పాలిండ్లను మోయలేక, నడుము జవజవలాడుతూ తొట్రుపాటుతో వచ్చి, ఒక చక్కని పూలదండను శ్రీకృష్ణునికి సమర్పిస్తోంది.

ఓ ముద్దలారా! శ్రీకృష్ణుని మురళీనాదామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరయ్యాయి. చెట్లన్నీ చిగురించాయి. దేవతలు మానవులు అందరు పరవశించిపోయారు. చూశావా?

ఓ పద్మముఖీ! ఎదురుగా ఉన్న ఈ కొండను చూడు. బలరామకృష్ణుల పాదన్యాసములచేత తనను ధన్యమైన దాన్ని భావించుకొంటోంది. పండ్లు పువ్వులు అనే కానుకలు వారికి సమర్పిస్తోంది. సంతోషంతో మిన్ను ముట్టుతోంది. నీటిని, గద్దిని సమృద్ధిగా కలిగించి ఆవులకు ఆప్యాయనం కలిగిస్తోంది. చక్కనైన చెట్లు అనే పులకాంకురాలతో అందగిస్తోంది.

ఈ విధంగా గొల్లపడుచులు బృందావనంలో విహరిస్తూ ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, కామవికారానికి లోనయి ఏకాంత ప్రదేశాలలో అతణ్ణే ధ్యానం చేస్తూ ఉండిపోయారు.

హేమంత ఋతువర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Tuesday, April 7, 2026

Ksheeraramam - Palakollu - క్షీరారామం - పాలకొల్లు

క్షీరారామం - పాలకొల్లు

పంచారామాలలో ఒకటైన క్షీరారామం - పాలకొల్లు

క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు వెలసిన పుణ్య క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో వుంది. దీనినే క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం అంటారు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపైనున్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం, ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశె శూలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

ఆలయ ప్రశస్తి
ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీమహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.

చరిత్ర
వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక 1157లో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి 1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని 1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. 1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.

స్థలపురాణం
పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం.

రవాణాసౌకర్యం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుండి నర్సాపూర్ లేదా భీమవరం వైపు వెళ్లే బస్సులు పాలకొల్లుకు అందుబాటులో ఉంటాయి.

రావులపాలెం దాటిన తర్వాత, నర్సాపూర్ వెళ్లే మార్గం నుండి సిద్ధాంతం మరియు మార్తేరు (మార్టేరు) మీదుగా పాలకొల్లుకు కేవలం 45 నిమిషాల ప్రయాణం. 

రావులపాలెం మరియు వైజాగ్ మధ్య దూరం 230 కి.మీ మరియు రాజమండ్రి నుండి 70 కి.మీ.

కాకినాడ, యానం మరియు అమలాపురం మీదుగా రాజోలు. అక్కడ నుండి పాలకొల్లు. 
కాకినాడ నుండి, రామచంద్రపురం మరియు రావులపాలెం మీదుగా కూడా పాలకొల్లు చేరుకోవచ్చు. గోదావరి నదిని దాటడానికి కేవలం రెండు వంతెనలు మాత్రమే ఉన్నాయి, ఒకటి యానం వద్ద, మరొకటి రావులపాలెం సమీపంలో.

రైలు మార్గం:
కోల్‌కతా వైపు నుండి వచ్చే రైళ్లు భీమవరం (జంక్షన్) మీదుగా పాలకొల్లు చేరచ్చు. నర్సాపూర్‌ వెళ్లే రైళ్లు కొన్ని ఆగుతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు నిర్ధారించుకోండి. పర్యాటకులు భీమవరంలో దిగి, పాలకొల్లు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనంలో గానీ లేదా బస్సులో గానీ ప్రయాణించాలి. విశాఖపట్నం నుండి పాలకొల్లుకు బస్సులో ప్రయాణించడానికి మొత్తం 7 గంటల సమయం పడుతుంది. నర్సాపూర్ మరియు భీమవరం మధ్య పాలకొల్లు మీదుగా ప్రైవేట్ బస్సు రవాణా సౌకర్యం ఉంది.

ఆలయ సమయాలు ఉదయం 5.30 నుండి 11.30 వరకు మరియు సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.30 వరకు. 

ఇతర దేవాలయాలు:
భీమవరం, ద్రాక్షారామ, అన్నవరం, తలుపులమ్మ తల్లి, రాజమండ్రి, అంతర్వేది, ర్యాలి మరియు వాడపల్లి వంటి పాలకొల్లు చుట్టుపక్కల అదనపు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో పర్యాటకులు బస చేసేందుకు వసతి  సౌకర్యం అందుబాటులో ఉంది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నది. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

Daksharamam - Bhimeswara temple - ద్రాక్షారామ - భీమేశ్వరాలయం

ద్రాక్షారామ - భీమేశ్వరాలయం

పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామం

పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామ ఆలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన మూర్తి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి

వ్యుత్పత్తి శాస్త్రం
ఈ పట్టణాన్ని పూర్వం ధక్షతపోవన మరియు ధాక్షవాటిక అని పిలిచేవారు. దక్ష ప్రజాపతి అయిన దక్షుడు "నిరీశ్వర యాగం" అనే యజ్ఞం చేసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం యొక్క పూర్వపు నామం 'దక్ష ఆరామం'. దీని అర్థం 'దక్ష నివాసం'. '
దక్ష ఆరామం' గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. ఈ ప్రదేశాన్ని జగద్గురు ఆది శంకరాచార్య మహాశక్తి పీఠ శ్లోకంలో 'మాణిక్యే దక్షవాటిక' 'ద్రాక్షారామ మాణిక్యాంబ దేవి' ని సూచించే దక్షవాటిక అని కూడా పేర్కొన్నారు. దక్షుడు 'నీరీశ్వర యాగం' చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ ఇక్కడ భక్తులు సందర్శిస్తారు.

ఈ నిరీశ్వర యజ్ఞానికి తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమాన పడిన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడి తల నరికించాడు.

సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివ క్షేత్రంగానూ, శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది.

ఆలయ చరిత్ర
ఆలయంలోని శాసనాలు 9వ మరియు 10వ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల రాజు భీమునిచే నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి. దేవాలయం యొక్క పెద్ద మండపాన్ని ఒడిశాకు చెందిన తూర్పు గంగా రాజవంశ రాజు నరసింగ దేవ I యొక్క కోడలు గంగా మహాదేవి నిర్మించారు. వాస్తుపరంగా మరియు శిల్పపరంగా, ఈ ఆలయం చాళుక్యుల మరియు చోళ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ ఆలయం చారిత్రాత్మకంగా ప్రముఖమైనది. ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులు దీనిని నిర్మించారు. ఇది 892 CE మరియు 922 CE మధ్య నిర్మించబడిన సామర్లకోట (సామల్కోట్) లోని భీమేశ్వరస్వామి ఆలయానికి పూర్వం నిర్మించబడిందని నమ్ముతారు.

పురాణం
దక్షారామం దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వీరభద్రుడు ఈ ప్రదేశంలో చేసిన విధ్వంసం మరియు మారణహోమం తరువాత శివుడు ఈ స్థలాన్ని పవిత్రం చేశాడు.

పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించాడు. ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు, ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెబుతాడు. మన్మథ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా, ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేసినప్పుడు, స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై, అది భూమి మీద అయిదు చోట్ల పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి. వాటిలో ఒకటి ద్రాక్షారామం.

ఆలయ స్వరూప విశేషాలు
ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. రెండు అంతస్తుల పాటు లింగం విస్తరించి ఉంటుంది. ఒక మెట్ల మార్గంతో గర్భగుడి పై అంతస్తుకు చేరుకోవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం.

భీమేశ్వర స్వామి దేవాలయం 
7–8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఆలయంలో "సప్త గోదావరి" అని పిలువబడే పుష్కరిణి ఉంది, ఇక్కడ సప్త ఋషులు ఏడు వేర్వేరు నదుల నుండి నీటిని తీసుకువచ్చారు. సప్త గోదావరి పుష్కరిణిలో ఉన్న చిన్న మంటపంలో సప్తఋషులను చూడవచ్చు. వ్యాసుడు నిర్మించిన కాశీ విశ్వేశర ఆలయాన్ని మరియు అగస్త్య మహర్షి పూజించిన అగస్త్యేశ్వర స్వామిని సందర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో కూడా కొన్ని మంటపాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయం చుట్టూ నాలుగు గోపురాలు మరియు ఆలయ ప్రాంగణం లోపల కాల భైరవ, వీర భద్ర మరియు వటుక భైరవ ఆలయాలు వంటి కొన్ని ఆలయాలను ఉన్నాయి.

మాణిక్యాంబా దేవి శక్తి పీఠం
ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది.

శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది.

శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి "ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు.

శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.

అష్ట సోమేశ్వరములు
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.

రవాణా సౌకర్యం 
ద్రాక్షారామము అమలాపురం నుండి 25 కిమీ , కాకినాడ నుండి 28 కిమీ , రాజమండ్రి నుండి 50 కిమీ దూరంలో ఉంది. రైలులో రాజమండ్రి మరియు కాకినాడ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో దాక్షారామం చేరుకోవచ్చు. రాష్ట్ర రహదారి భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలు మరియు నగరాలతో కలుపుతుంది. తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం.

రోడ్డు మార్గం:
రాజమండ్రి చేరుకుని బస్సులో రామచంద్రపురం వెళ్లవచ్చు లేదా రావులపాలెం చేరుకుని రామచంద్రపురం వరకు బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుండి కోటిపల్లి లేదా యానాం మరియు ఇతర బస్సులలో ద్రాక్షారామ చేరుకోవాలి.

రైలు మార్గం:
ఒకరు కాకినాడ చేరుకుని ద్రాక్షారామకు రైలులో ప్రయాణించవచ్చు కానీ ఇప్పుడు ఒక రైలు బస్సు మాత్రమే నడుస్తోంది మరియు అది నిరంతరం నడవదు.

వాయు మార్గం:

రాజమండ్రి వరకు ప్రయాణించి, విమానాశ్రయం నుండి క్యాబ్లో ఒకటిన్నర గంటలో ద్రాక్షారామ చేరుకోవచ్చు.

ఉత్సవాలు:
ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ. ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం. ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం.

ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం. ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు
ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి, అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతాయి.

ప్రతీ మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతాయి
కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు.

వసతి సౌకర్యాలు, అన్నదాన సత్రాలు అందుబాటులో ఉన్నాయి.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Samalkota Kumara Bhimarama - సామర్లకోట - కుమారభీమారామం

సామర్లకోట - కుమారభీమారామం

పంచారామాలలో ఒకటైన కుమారభీమారామం - సామర్లకోట

పంచారామాలలో ఒకటయిన ఈ 'కుమారభీమారామం' క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.

చరిత్ర
సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

ఈ మందిరం నిర్మాణం సా.శ. 892 లో ప్రారంభమై సుమారు సా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.

ఆలయం
ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. (ఇదే కథ ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలోని పెదబ్రహ్మదేవం పొలాలలో నెలవైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోను వినబడుతూ ఉంది.) ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు.

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడింది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.

ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుంటుంది.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివుంది.ప్రాకారాపు గోడలు ఇసుక రాయి (sand stone) చే కట్టబడ్డాయి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమారారామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తుంది

ఉత్సవాలు పూజలు
ఇక (చైత్రమాసం) (చైత్ర) వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.

ప్రయాణ వసతులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...