Wednesday, April 8, 2026

The taking of the clothes of the Gopikas - గోపికా వస్త్రాపహరణము

గోపికా వస్త్రాపహరణము

ఒకనాటి ఉదయం గోపికలు మేలుకొని, ఒకరినొకరు రండురండని ప్రియంగా పేర్లు పెట్టి పిలుచుకొంటూ, శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ, బరువైన చనుగవలవల్ల సన్నని నడుములు అల్లలాడుతూ ఉండగా గజగమనంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకొని యమున ఒడ్డుకు చేరుకొన్నారు.

గజగమనలయిన ఆ గోపికలు ఈ విధంగా యమునానదీతీరానికి చేరుకొన్నారు. ఒక ఏకాంత ప్రదేశంలో తాము కట్టుకొన్న బట్టలు విడిచి పెట్టి, మనస్సులో ఏ సంకోచం లేకుండా స్నానం చేయడంకోసం నీళ్లలోకి దిగారు.

ఆ గోపికలు శ్రీకృష్ణుణ్ణి గురించి గానం చేస్తూ వినోదంగా, ఇచ్చానుసారంగా జలవిహారాలు సాగించారు. వారి విహారాలకు లోకంలో సాటి లేదు.

అలాంటి వేళలో

ఓ రాజా! దూరంగా ఉన్న శ్రీకృష్ణునికి గోపికలు యమునానదిలో స్నానం చేస్తున్నారనే సంగతి తెలిసింది. వెంటనే తన సావాసగాండ్రతో కలిసి అక్కడకు చేరుకొన్నాడు.

శ్రీకృష్ణుడు తనతోవచ్చిన గొల్లవారిని కదలకుండ నిలబడండి అని కంటితో సైగ చేశాడు. తాను మెల్లమెల్లగా పొదల మాటున నుండి నక్కి దాగి నడచుకుంటూ వచ్చి, గోపికల వస్త్రాలను అపహరించాడు.

ఈ విధంగా గోపికల వస్త్రాలను దొంగిలించినవాడై,

ఆదిపురుషుడు, విశ్వభర్త అయిన శ్రీకృష్ణుడు లీలాబాలకుడయి, తనతోటివారితో వచ్చి, గోపికల వస్త్రాలు అపహరించాడు. యమునానదికెరటాల మీదనుండి వచ్చే చల్లనిగాలి అతనికి హాయి కలిగిస్తోంది. ఏనుగులాగ విలాసంగా నడుచుకుంటూ వెళ్లి, సమీపంలో ఉన్న కడిమిచెట్టును ఎక్కినాడు. ఆ చెట్టు వృక్ష జన్మ ఎత్తినందువల్ల కలిగిన సంతాపాన్ని ఆ క్షణంలోనే విడిచిపెట్టి, తన జన్మ ధన్యమయిందని భావించింది.

ఆ సమయంలో గోపికలు ఇలా అన్నారు.

కృష్ణా! వద్దు వద్దు. మా వస్త్రాలు అపహరించి మా అభిమానాన్ని పాడు చేయవద్దు. మా మనస్సులు అపహరించి మాకు మైమరపు కలిగించవద్దు.

ఓ కృష్ణా! నీవు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్క్యివతారాలెత్తి, లోకాలను రక్షించావు. అటువంటి నీవు మంచిజీవిక కలిగి ఉండాలి. ప్రేమతో నీ వంశంవారిని సాకుతూ ఉండాలి. ప్రభుత్వాన్ని వహించి భూమిని పాలిస్తూ ఉండాలి. ఇతడు సింహంవంటివాడు అనే ప్రశస్తిని పొందాలి. 'వయసున చిన్నవాడవయినా నీకంటె బలవంతుడయిన వాణ్ణి వంచి లోకానికి మేలు చేశాడనే' కీర్తిని పొందాలి. లోకంలో దుర్మార్గులయిన రాజులను జయించాలి. మంచిబుద్ధి కలవాడవు అనిపించుకోవాలి. నీ కులం వారిని ఆదుకోవాలి. స్వపరభేదం లేకుండా ప్రవర్తించాలి. ఇటువంటి కొంటెపనులు నీ వంటివాడు చేయకూడదు. మా వస్త్రాలు మాకు ఇవ్వు,

శ్రీకృష్ణా! మా మనస్సులను, మానాభిమానాలను, సిగ్గును, చివరకు బట్టలను కూడా నీవు అపహరించావు. ఇంకా ఏమేమి చేయదలచుకొన్నావో గదా! నీవు కొంటెవాడివికదా! నీ సంగతి బాగా తెలుసుకొన్నాము.

ఓ కృష్ణా! నీవు రాచఠీవితో లోకాతీతమైన కార్యాలు సాధిస్తూ ఉంటావు. బలవంతుడవై ఇతరులను శిక్షిస్తూ ఉంటావు. కోపంతో లోకాలు కూల్చివేస్తూ ఉంటావు. మాయలమారివై ఒక తీరుగా ఉండవు. నీ తీరుతెన్ను లేమిటి? నీ పరిమితి ఏమిటి? ఒక్కగుణం కూడ నీలో లేదు. ఏనాడు ఒకచోట నిలకడగా ఉండవు. మా బట్టలు మా కిచ్చివేయుము.

అర్భాంతరం : కృష్ణా! నీవు పరమాత్మవు. రజోగుణాన్ని ఆశ్రయించి విశ్వసృష్టిని, సత్త్వగుణాన్ని ఆశ్రయించి స్థితినీ, తమోగుణాన్ని ఆశ్రయించి లయాన్నీ కొనసాగిస్తూ ఉంటావు. సమస్తరూపుడవు. అపరిచ్చిన్నుడవు. గుణాతీతుడవు. దేశకాలాలకు లోబడనివాడివి.

ఓ కృష్ణా! నీకు రాజులసంగతి తెలియదు. నువ్వేమీ ఈ రాజ్యానికి రాజువు కావు. మా చీర లియ్యకపోతే నందమహారాజుకు నీ ఆగడాల్ని గురించి, చెప్తాం.

శ్రీకృష్ణుడు గోపికల మాటలు విన్నాడు. ముసి ముసి నవ్వులు నవ్వుతూ, తన సావాసుల చేతులలో చేతులు వేసి, చతురుడైన కృష్ణుడు నేర్పుగా వారితో ఇలా అన్నాడు.

స్త్రీలు రాజులతో ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? కేవలం నన్ను నిందిస్తున్నారు. కానీ మీ తప్పు మీరు తెలిసికోవడం లేదు. చంద్రబింబాననల్లారా అయిన మీరు నీటినుండి బయటకు వచ్చి మీ బట్టలు తీసికోండి. వెంటనే ఇచ్చేస్తాను.

శ్రీకృష్ణుని మాటలు విన్న గోపికలు ఒకరి మొగం ఒకరు చూచి నవ్వుకొన్నారు. మర్మాలు నాటే ఆ మాటలకు తిరిగి జవాబు చెప్పడానికి సిగ్గుపడ్డారు. గొంతులోతు నీటిలో నిలబడి చలికి వణకిపోతూ నిలకడలేని మనస్సుతో ఇలా అన్నారు.

దుందుడుకు తనంతో మా బట్టలు ఎందుకు అపహరించావు. నీవేమైన తక్కువవాడవా! కాదు గదా! నీకు తెలియని ఏదైనా విషయం ఉందా? ప్రజలందరిలోను నీవు గొప్ప ధర్మాత్ముడవు గదా!

ఓ కృష్ణా! ఆడవాళ్లు స్నానం చేస్తూ ఉండగా మగవారువచ్చి ఎక్కడైనా చూస్తారా! పొరపాటున వచ్చినా, చీరలు ఎత్తుకొని పోవడంలాంటి తప్పుడు పనులు దయమాలినవారయి చేస్తారా? ఇటువంటి కూడని పనులు నీకే తగినవి కానీ, ఇంకెవరూ ఇలాగ చేయరు. నీ సేవ చేసుకొంటాం. మా చీరలు మాకివ్వండి.

కృష్ణా! నీవు రమ్మంటే వచ్చేస్తాం. నీ వేది కోరినా ఇచ్చేస్తాం. నీ వెక్కడికి వెళ్లమన్నా వెళ్లిపోతాం. ఇపుడు మాత్రం మా చీరలు మాకిచ్చి మమ్ము ఏలుకో.

అని గోపికలు ప్రాధేయపడగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు మోముతో ఇలా అన్నాడు.

ఏ యువకుణ్ణి భర్తగా కోరి మీ రీవ్రతం చేస్తున్నారో చెప్పండి. చెప్పకపోతే మీ మీద ఒట్టే. ఇటువంటి ప్రేమ లోకసహజమైందే కదా!

మీరు ఎవణ్ణి చూచి మోహించారు? మీ మానధనాలు హరించిన వాడెవడు? మీకు ఎవరిమీద ప్రేమ పుట్టింది? నేను అన్యుణ్ణి కాను. నేను మీవాడనే. నాకు చెప్పవచ్చు కదా!

ఈ మాటలు విని గోపికలు ఒకరి నొకరు చూచుకొన్నారు. వారిని కామభావం కల్లోలపరుస్తూంది. నవ్వుతూ మిన్నకుండి పోయారు. అప్పుడు లోకపూజ్యుడయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.

ఓ గోపికలారా! మీరు నా యింటిలో సేవచేస్తూ నా ఆనతిప్రకారం నడుచుకొంటామంటే మీ కోకలు మీకిస్తాను.

శ్రీకృష్ణునిమాటలు విన్న గోపికలు నీళ్లలో నిలబడలేక చలికి భయపడి

ఓ పరీక్షిన్మహారాజా! గోపికలలో కొందరు బయటికి వెళ్దాం అంటారు. మరికొందరు బయటకు వెడితే మన మానం పోతుంది అంటారు. ఇంకొందరు చలికి వణకిపోతూ ఆందోళన చెందుతున్నారు.

గోపికలు చివరకు ఎలాగో మనస్సుల్ని గట్టిచేసికొని నీటినుండి బయటకు వచ్చి,

ఆ గోపికలు, కదలుతున్న చిగురుటాకులవలె కోమలమయినవి, నవరత్నాలు పొదిగిన బంగారపు కంకణాలు కలిగిన చేతులతో తమ మర్మాంగాలను మాటు పరచుకొని నీటినుండి వరుసగా (బయటకు వచ్చారు)

మెల్లమెల్లగా నడిచే గొల్లపడుచులు తమలో గడుసరులయిన వారిని ముందుంచుకొని మడుగులోనుండి బయటకు వచ్చి శ్రీకృష్ణునిముందు నిలువగా అతడు వారితో ఇలా పలికాడు.

గోపికలారా! మీ కీ సిగ్గెందుకు? చిన్నప్పటినుండి మీలో ఒకడుగా మీతో పెరిగివాణ్ణే కదా! నేను చూడని రహస్య స్థానాలు మీలో ఏమి ఉన్నాయి? మీరు కాత్యాయనీ వ్రతదీక్ష పూని ఇలా దిగంబరంగా యమునలో దిగి స్నానం చేయవచ్చునా? ఇది నియమం తప్పి ప్రవర్తించడం కాదా? దేవి విషయంలో అపరాధం చెయ్యడం కాదా? ఇలాగ అపమార్గంలో నోములు నోచేవారు ఎక్కడయినా ఉంటారా? మీకు వ్రతఫలం దక్కాలని మీరు అనుకొంటే, మీ రెండు చేతులు ఎత్తి నాకు నమస్కరించండి. నా వద్దకు వచ్చి మీ కోకలు తీసికోండి. సిగ్గులేకుండగా వాదించడం ఎందుకు? మోసపుమాటలు మాట్లాడడం ఎందుకు?

అని పలికిన శ్రీకృష్ణుని మాటలను వినిన గోపికలు తమలో తాము

నోములు నోచేవారు ఏ పరమాత్మను ధ్యానం చేస్తే చాలో, వ్రతాల ఆటంకాలు అన్నీ తొలగిపోతాయో అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపికలు చూశారు. కట్టుబట్టలు విడిచి, దిగంబరంగా స్నానం చేయడం తమ తప్పే అని తెలిసికొన్నారు. తమ చేతులను ఎత్తి నుదుట చేర్చి అందరూ శ్రీకృష్ణునికి నమస్కారం చేశారు.

శ్రీకృష్ణుడు దయ గలవాడు. భక్తులను రక్షించే స్వభావం కలవాడు. అందులకే చలికి గజగజ వణకిపోతూ, పశ్చాత్తాపంతో నుదిటిపై చేతులెత్తి మొక్కుతున్న గోపికలకు వస్త్రాలు ఇచ్చివేశాడు.

కోకలు దొంగిలిస్తే దొంగిలించాడు, సిగ్గులు పోగొడితే పోగొట్టాడు, వేళాకోళం చేస్తే చేశాడు. కానీ మన వ్రతానికి లోపం రాకుండా ఆదుకొన్నాడు అని భక్తిభావంతో గోపికలంతా శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు.

ఓ రాజా! మనస్సు నొచ్చేలా మాటాడినా, మోసగించినా, వేళాకోళం చేసినా, కలతను కలిగించినా ప్రియులు చేసే పనులు ప్రియురాండ్రకు బాధ కలిగించక పోగా, ఎంతో ఇష్టంగా ఉంటాయి.

ఈ విధంగా శ్రీకృష్ణుడు చీర లియ్యగా గోపికలు కట్టుకొని గాఢమైన అనురాగంతో, కలతపడక, రెప్పవేయక చూస్తూ ఉండగా నేర్పరి అయిన శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్లి ఈ రీతిగా అన్నాడు.

మంచి గుణాలుకల ఓ గోపికలారా! మీరు సిగ్గువల్ల చెప్పలేకుండా ఉన్నారు. కానీ మీ మనస్సులోని గుట్టులు బయటపడ్డాయి. మీరు నన్ను మగనిగా పొందడం కోసం ఈ కాత్యాయనీవ్రతం చేస్తున్నారు. నా అనుగ్రహంవల్ల మీ నోము పండుతుంది. నన్ను సేవించినవారికి మోక్షమే సిద్ధిస్తుంది. ఇంక మిగిలిన ధర్మార్థకామాలగురించి చెప్పేది ఏముంది? మీరు ఈ వ్రతం పూర్తిచేయండి. రాత్రులలో నా కలయిక లభిస్తుంది. నా మాటలు నమ్మి మీరు ఇండ్లకు వెళ్లిపొండి అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ మాటలు విన్న గోపికలు తమ తపస్సు ఫలించిందని సంతోషిస్తూ శ్రీకృష్ణుని పాదపద్మాలు మనస్సులో ధ్యానించుకొంటూ, వ్రేపల్లెకు వెళ్లిపోయారు.

మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

Sage Wifes came and gave food to Srikrishna - మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట

మునిభార్యలు అన్నము దీసికొని వచ్చి శ్రీకృష్ణుని ఆరగింప జేయుట శ్రీకృష్ణుడు ఈ విధంగా గోపికలను అనుగ్రహించి, బృందావనాన్ని దాటి, దూరంగా తోలుకొనిపో...