Friday, April 10, 2026

Chapter 16 Vyasa instructs Shuku the Bhagavata of Sridevi - అధ్యాయము 16 వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 16

వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట


వ్యాసుడిట్లనియె : ఈ ప్రకారముగ క్షీరసాగరశయనుడు వటపత్రశాయి పరమాశ్చర్యమందుచుండ శ్రీదేవి సుధలుచిందు చిరునవ్వు వెన్నెలలతో విష్ణుని గాంచుచు ననియెను : 

"నీకిదంతయును వింతగ నున్నదా? నీవు మహాశక్తి ప్రభావమున మున్ను నన్ను విస్మరించితివి. ప్రళయము గడచినప్పుడెల్ల నీవు మరల మరల నుద్భవించుచుందువు. ఆ పరామూలశక్తి నిర్గుణురాలు. నీవును నేనును సగుణులము. నన్ను సాత్వికశక్తిగ నెఱుంగుము. నీ నాభికమలమునందుండి ప్రజాపతియగు బ్రహ్మ యుద్భవించగలడు. అతడు రజోగుణముతో నెల్లలోకములు మరల సృజించును. అతడంతట నుగ్రతవ మొనర్చి యుత్తమ రాజసశక్తిని బడసి రజోరాగప్రభావమున ముల్లోకములను రజోరాగముతో నింపివేయును. బ్రహ్మ త్రిగుణమయములగు పంచభూతముల నుత్పత్తిచేయును. ఆ పిదప నింద్రియములను ఇంద్రియాధిష్ఠాన దేవతలను మనస్సును సృజించును. ఈ విధముగ విధి సృష్టిరచన పూర్వమువలెనే కొనసాగించును. కావుననే బ్రహ్మ సృష్టికర్త యనంబరగును. 

ఓ మహాశక్తీ! విష్ణూ! ఈ సకల విశ్వమునకు నీవే పరిపాలకుడవు. నీ కన్బొమల మధ్యనుండి కోపకారణముగ రుద్రు డావిర్భవించును. అతడు మహోగ్రతపమొనర్చి తామసశక్తిని వశము చేసికొనును. ఆ రుద్రుడే కల్పాంతమున సర్వమును పొలియజేయును. నీ సన్నిధానమున కరుగుదెంచిన నన్ను సాత్త్వికశక్తిగ నెఱుగుము. మధుసూదనా! నేను పెన్నిధివైన నీ సన్నిధి యందే యుందును. నీ హృదయకమలమందే యిల్లు కట్టుకొని నిముసమైన నినుబాయక నివసింతును."

విష్ణువిట్లనియె : 'నేను మునుపు చమత్కారముగొల్పు శబ్దార్థములుగల శ్లోకార్థము వింటిని. అది పరమమై శివవై రహస్యమై రస్యమై యలరుచున్నది. ఆ వాక్కునెవరు వక్కాణించిరో తెలిపి నా యీ సందియము తొలగింపుము. నిఱుపేద ధనముకొఱకు నిరంతరముగ చింతించుచుండునట్లు నేనా శ్లోకార్థమందలి గమ్యార్థమును మాటిమాటికి సంస్మరించుచున్నాను. 

వ్యాసుడిట్లనియె: విష్ణుని యాపలుకు లాలకించి చారుహాసినియగు నిత్యకల్యాణి పరమప్రీతితో విరిసిన లేనగవుతో హరికిట్లనియెను: 

"శౌరీ! నన్ను చతుర్భుజగ నిర్గుణగ నెఱుంగుము. నేను సగుణ నిర్గుణములుగల దాననని నీకు దెలియదా? ఆ శ్లోకార్థ మా మహాశక్తిది. నీవా మూలశక్తినే నమ్ముము. ఆ యద్భుతశక్తిచేతనే శుభకరము వేదసారమునగు పుణ్యపురాణము వెలసినదని తెలిసికొనుము. ఆ కరుణామయియగు దేవికి నీపై నెక్కడలేని వాత్సల్యము గలదని భావింతును. ఆమెయే నీ యోగక్షేమములు చూచు తల్లి. కావుననే యామె నీకా పరమరహస్యమైన వాక్యము వినిపించినది. దానిని నీ యెడదలో నిల్పుకొని యెన్నడును మరువకుము. ఆ మహావిద్యా స్వరూపిణి నీకు సర్వశాస్త్రరసాయన మెఱుకపఱచినదని యెఱుగుము. ఈ భువనత్రయమందును దానిన మించి గ్రహించవలసినది మరొండులేదు. నీవన్న నామె కెంతయో యిష్టము. కనుకనే యాయె నీకా దివ్యవాక్కు వినిచెను."

వ్యాసుడిట్లనియె : అట్టి దేవి దివ్యవాణి నాకర్ణించి భగవానుడు దానినే పరమమంత్రరాజముగ నెంచి హృదయకమలమందు దరించెను. కొంతకాలము పిదప విష్ణుని నాభికమలమునుండి బ్రహ్మ యుద్భవించెను. అతడు దానవభయభీతుడై శరణు వేడుకొనగా హరి మధుకైటభులతో బోరి వారి నంతమొందించి బ్రహ్మభయము బాపెను. పిదప కూడా హరి దివ్యరసమయమైన యాశ్లోకార్థమునే జపించుచుండెను. అది వినిన కమలజుడగు బ్రహ్మ హరిని ఓ పుండరీకాక్షా! నీవేమి జపించుచున్నావు? నీకంటె నధికుడెవడు గలడు? నీవనుస్మరించుచు ముదమందు నామంత్రమేమి? అని ప్రశ్నించెను. హరి యిట్లు పలికెను : 

"మహాభాగా! నీలో నాలో సర్వములోగల కారయిత్రిశక్తిని భగవతిగ జగదంబగ భావింపుము. ఈ మహాజలరాశియు నెల్లలోకములు నే తల్లి యాధారముగ నొప్పుచున్నవో యా తల్లినే సాకారగ ననంతశక్తిగ సనాతనగ నెఱుంగుము. ఆ మహాశక్తియే యెల్లప్రాణుల జీవనాడులు స్పందింపజేయు నిత్యనూతన చైతన్యశక్తి - చరాచర విశ్వకర్త్రి-ఆమె సుప్రసన్నురాలయ్యెనా - కోరిన కోర్కులు గురియు వరదాయిని యగును. ముముక్షులకు ముక్తిప్రదాయిని యగును. ఆ తల్లియే పరావిద్య - మోక్షహేతుభూతురాలు - సంసార బంధన కారణురాలు - సర్వవిశ్వేశ్వరి. ఈ విశ్వవిశ్వమును నీవును నేనును సత్యశివసుందరశక్తివలన సంభవించిన వారమని భావింపుము. ఇది నిజము. నిజము. ఇందు సందేహము లేశమైనను లేదు. ఆమె నాకు వచించిన శ్లోకార్థమే మహాభాగవత పరమ సారము. ఆ యర్థశ్లోకమే రాబోవు ద్వాపరయుగాదిని వ్యాసభగవానునిచే భాగవతముగ వ్రాయబడును."

వ్యాసుడిట్లనియె : "ఆ మహామంత్రమును విష్ణువునుండి బ్రహ్మ గ్రహించి తన తనయుడగు నారదునకు సమ్మతితో నుపదేశించెను. నారదునివలన నేను విని దానిని పండ్రెండు స్కంధముల శ్రీమహాభాగవతముగ విస్తరించితిని. ఆ పురాణము బ్రహ్మ సమ్మితము. అది పంచలక్షణ లక్షితము. శ్రీదేవీ మహిమాన్వితమునై యలరారును. అది తత్త్వజ్ఞాన రసామృతము - సర్వోత్తమము - ధన్యము - పుణ్యము - ధర్మశాస్త్రసమము - సాహితీరససంభరితము - వేదార్థప్రతిపాదకము. వృత్రాసుర కథాభరితము - నానాఖ్యానక సంకలితము-బ్రహ్మవిద్యా నిధానము-సంసారార్ణవతారకము. ఓ మహామతీ! ఓ పురుషవర్యా! నీవా పరమపుణ్య పురాణ మెఱుంగుము. దానిని చదువుట కెల్ల విధముల నీవే యోగ్యుడవు. అది పదునెనిమిదివేల శ్లోకములతో కూడి అజ్ఞానపుకఱకు చీకట్లకు దివ్యజ్ఞానభాస్కర శుభోదయమైనది. సుఖశాంతులు వర్ధిల్లచేయును. దన్యము. దివ్యము. శివంకరము. విను-చదువు-వారలకు చిరాయుఃపుత్త్రపౌత్ర సౌభాగ్యముల చేకూర్చును. సూతుడు రోమహర్షణసుతుడు అతడు పరమధార్మికుడు. నా ముఖ్య శిష్యుడు. అతడు నీకు తోడుగా నీపుణ్యపురాణసంహిత పఠించగలడు.

సూతుడిట్లనియె : ఈ విధముగ వ్యాసుడు తన పుత్త్రునకు దెలుప నతనితోబాటు ఈ విశాలపురాణ సంగ్రహతత్త్వ మెఱిగితిని. శుకుడును దీనిని గ్రహించి వ్యాసాశ్రమమందే యుండెను. కాని బ్రహ్మకు పుట్టని యపరనారదునివలె యతడు ఆత్మశాంతిని బడయకుండెను. ఆత డేకాంతప్రియుడయ్యెను. విషయశూన్యునివలె దోచుచుండెను. తన యునికిలోనే తానుండెను. అతనికి భోజనము రుచించకుండెను. ఉపవాసమనిన నిష్టమేలేదు. ఇట్లాత్మ చింతాపరవశుడగు తన సుతునిగని వ్యాసుడిట్లు పలికెను: 

"కుమారా! నీవింత వింతగ ఏల యేకాగ్రతతో నదేపనిగ నూరక విచారించుచున్నావు? ఋణగ్రస్తుడైన కటికదరిద్రుడు చింత్రాగ్రస్తుడగును. నీవునట్లే యేదో పరధ్యానమందున్నావు. నీ తండ్రినగు నేను బ్రతికియే యుండగ నీకీలేనిపోని లోని చింతయేల? నీవు కోరినకోర్కులన్నియు తనివార ననుభవింపుము. మదిలోన శోకముడుగుము. శాస్త్రోక్తజ్ఞాన మెఱుగుము. హృదయాంతరజ్యోతివలె విజ్ఞానమయుడవుగమ్ము. నా యీ మాటలవలన నీకైకాంతిక శాంతి చేకూరనిచో మిథిలకేగి జనకుని సన్నిధానము జేరుము. ఆ జనకుడు విదేహుడు - ధర్మమూర్తి; సత్యసంధుడు. జనకనామమున ప్రసిద్ధికెక్కెను. అతడే నీలోని మోహపు మంచుతెరలను పటాపంచలు చేయగలవాడు. నీవా రాజునుజేరి నీలోని సందేహమును బాపుకొనుము. అతనితో యథాయోగ్యమైన వర్ణాశ్రమధర్మములగూర్చి ముచ్చటించుము. అతడు రాజర్షి; జీవన్ముక్తుడు. బ్రహ్మజ్ఞానమూర్తి-శుచి-యథార్థవాది. సత్యవస్తునిష్ఠుడు. సిద్ధయోగరతుడు. బ్రహ్మతేజోబలమున మహోజ్ఞ్వలుడు. నిరంజనుడు."

ఆ మహాతేజస్వియగు వ్యాసుని వచనము లాకర్ణించి అరణిజుడగు శుకుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను : ఓ జనకా ! నాకా జనకుడు దంభాచారిగ దోచుచున్నాడు. ఏలయన, ఆ విదేహుడు జీవన్ముక్తుడుగద! మరి సుఖశాంతులతో నెట్టు రాజ్యమేలుచున్నాడు? నాకతడు వంధ్యాపుత్రుడుగ దోచుచున్నాడు. కానిచో విదేహుడు బ్రహ్మజ్ఞాని రాజ్యమెట్లు ఏలగలడు? ఇది నాకు అద్భుతమును గల్గించుచున్నది. ఈ దురంతమైన మాయా సంసారసాగరమందు నీటియందలి పద్మమువలె నా విదేహరాజెట్లు మనుగడ సాగించుచున్నాడు? విదేహ జనకుని విషయమున నందియము నాకే లొకోకలుగుచున్నది. ఆతని ముక్తిబౌద్ధుల నాస్తికత్వమువంటిదేనా? ముక్తుడు అముక్తుడెట్లగును? కర్త అకర్తయెట్లగును? ఇంద్రియ వ్యాపారముల బెడద నెట్లు వదలించుకొనవచ్చును. తల్లి-కొడుకు-భార్య-సోదరి-వారాంగన-వీరిలో పరస్పరము భేదములు గలవు గదా? ఇన్ని భేదములుండగ నభేదమైన ముక్తియెట్లు సాధ్యము? చేదు కారము వేడిమి తీపి ఉప్పు మొదలగువానిలోని రుచిని నాలుక తెలిసికొని తృప్తిజెందును. శీతోష్ణములు సుఖదుఃఖములు ననుభవించుచున్నంతకాల మాత్మముక్తి యేరీతి గల్గును? ఇదంతయు విడ్డూరమే. నాకెందులకో యిందు అద్భుతమగు సందేహము గల్గుచున్నది. వీడు శత్రువనుకొనినచో వైరము పెరుగును. వీడు మిత్రుడనుకొనినచో ప్రేమ గలుగును. మరి యారాజు ద్వంద్వముల నడుమ నుండుచు నిష్క్రియుడై యెట్లు మనుచున్నాడు? ఆ రాజు చోరుని తాపసుని నొకే రీతిగ నెట్లు చూడగలడు? బుద్ధితో స్థితప్రజ్ఞత సమతలేనిచో ముక్తి యెట్లు గల్గును? జీవన్ముక్తుడైన నరపతిని నేనింతవఱకును చూడలేదు. ఇంటియందే యుండుచు ముక్తుడయ్యెననగ నాకిందేదో సందేహము తోచుచున్నది. ఆ జనకుని గుఱించి నీవింతగ వింతగ జెప్పుటవలన నాకతనిని చూడవేడుకగుచున్నది. నా సందేహము బాపుకొనుటకు మిథిలకేగగలను.

అధ్యాయము 17 శ్రీ శుకుడు మిథిలకు జనుట

పంచాంగం

Chapter 15 The influence of Sri Shakuni's dispassion - అధ్యాయము 15 శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 15

శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

శ్రీ
శుకుడి డిట్లు పలికెను: తండ్రీ! ఎల్లభంగుల దుఃఖమూలమైన గృహస్థాశ్రమమును నేను స్వీకరింపజాలను. వలత్రాళ్లవలె నిది దేహుల కురివంటిది. ధనాశాపీడితు లాత్మసుఖమునకు నోచుకొనరు. లేనివాడు పేరాసగలవాడు తన కుటుంబము వారిచేతనే బాధింపబడును. ఏ కోర్కెలునులేని బిచ్చగాడు పొందు సహజ సుఖము నింద్రుడు సైతమందజాలడు. త్రైలోక్యభోగ్యములు బొందినప్పటికి ప్రాణులు సుఖింపజాలరు. దేవేంద్రుడంతటివాడే తపించు తాపసులనుగాంచి దుఃఖితుడై యీసున వారికి బహుభంగుల భంగములు గల్గించుచుండును బ్రహ్మయు నిత్యానందరహితుడే. శ్రీహరియును తన మనోహారిణి యగు శ్రీ మహాలక్ష్మిని చేపట్టినప్పటికిని రక్కసుల యక్కడగించుచు మాటిమాటికి ఖేదపడుచుండను. ఆ శ్రీమంతుడగు విష్ణువెన్నియో యిక్కట్టులకు గురియై కఠిన తపమాచరించెను. శ్రీపతియే యిట్లుండ నిక సామాన్యుల గతి యెట్లుండును? రుద్రుడు సతతము తపము చేయుచు రాక్షసులను చెండాడుచునుండును. అతడును పాపమెన్నియో వెతలకు గురి యగు చుండును. కలవానికి భయమున కంటినిండుగ కూర్కురాదు. ఇక లేనివాడులేనవాడే గద! వాడు సుఖమునకు మొదలే నోచుకొనలేదు. నీ కౌరసపుత్త్రుడనగు నన్నే నీవీ ఘోరనరకతుల్య సంసారమందే మునుగుమని యేల నియోగింతువు? ఎల్ల ప్రాణులకు మాటిమాటికి జన్మదుఃఖము జరాదుఃఖము మరణదుఃఖము మలమూత్రమయమగు గర్భవాసమున దుఃఖము గల్గుచుండును.

మహాలోభిత్వమును దురాశయు దుఃఖము చేటు. యాచన మరణదుఃఖముకంటెను చేటును బాధాకరమునైనది. విప్రులు ప్రతి గ్రహమువలననే తమ జీవితములు వెళ్లబుత్తురు. వారు బుద్ధిబలముగల జీవులుగారు. పరాశ పరమదుఃఖము. అది దిన మొక గండమువంటిది. ఎల్ల వేదశాస్త్రార్థములను చక్కగ తుదిముట్ట చదివిన పండితప్రకాండులే ధనమదాంధుల పజ్జచేరి వారిని పెక్కు రీతుల పై కెత్తుచు పొట్టపోసికొందురు. ఈ జానెడు చిఱుతపొట్టకింత చింత యెందులకు? దీనిని ఫలాదులతో ఆకులములతో నేదేనుపాయముతో నింపి తనపవచ్చును. 

తండ్రీ ! భార్యవలన కొడుకులును వారివలన మనుమండ్రును పుట్టుదురు. కుటుంబపు భారము పెద్దదగును. వారి పోషణభారము దుఃఖభారమగును. ఇక నాత్మసౌఖ్య మెక్కడిది? ఓ తండ్రీ! కావుననే భేదాలు మాయామోహాలు పుణ్యపాపాలు లేని పరిపూర్ణము సత్యవస్తునిష్ఠము నగు బ్రహ్మకాండను యోగ శాస్త్రమును గుఱించి నాకు దెలుపుము. విభేదాలు పుట్టించునట్టి కర్మ బాహుళ్యమందు నా మదియెన్నడును చొరకున్నది. కర్మలు ప్రారబ్ధము సంచితము వర్తమానమునని మువ్విధములు గద! అది సమూలముగ క్షయించు తెఱంగెఱింగింపుము. జవరాలు జలగమాదిరి నరజాతి వీర్యమంతయును పీల్చిపిప్పి చేయును. ఆ వలపులాడి వన్నె చిన్నెలకు మత్తచిత్తుడైన నరుడీ విషయము నెఱుగనేలేడు. స్త్రీలు భోగములతో ధన వీర్యములను కుటిలవచనములతో మనస్సును మరింతురు. అట్టి స్త్రీ నెవడుకోరును? మూర్ఖుడే భార్యను చేపట్టును. సౌఖ్యము బోగొట్టుకొనును. ఫలితముగ మిగులునది దుఃఖమేకాని సుఖముగాదు. ఇట్లు మూర్ఖుడు విధిలీలకు మోసపోవును.

సూతుడిట్లనియె : అని శుకుడు విరాగియై పలుకు ఈ పలుకులు విని వ్యాసుడు చింతాగ్రస్తుడై యిపుడేమి చేతునని తలపోయసాగెను. వ్యాసుని కన్గొలకులు దుఃఖముచే చెమర్చెను. నెమ్మేను గడగడలాడెను. మనస్సు గ్లానమయ్యెను. ఇట్లతి దీనముగ శోకాతురుడై వెతలబొగులు వ్యాసునకు వింతగదుర విప్పాదిన నేత్రములతో శుకుడిట్లు పలుక దొడగెను: 

"ఆహా! ఈ మాయ యెంత బలవత్తరమైనది! ఇది వేదాంతకారుడు వేదసమ్మతుడు వేదవిదుడునైన పండితోత్తమునిగూడ మోహింపజేయుచున్నదే! ఆ మాయ సత్యవతీసుతుడు విద్వాంసుడునైన వ్యాసునకుగూడ మోహము గల్గించుచున్నది. కనుక మాయ దుస్త్యజ. ఆ మాయ రూపెట్టిదో యెతవారికిని దెలియరాదు. వేదవిభాగకర్త విపులపురాణవక్త భారత గ్రంథ నిర్మాతయగు వ్యాసుని సైతము మోహభ్రాంతి యావరించెనే! కావున నే యద్భుతశక్తి యీ ముజ్జగములను పెనుభ్రమలో ముంచెత్తునో యే యత్కృష్టశక్తి బ్రహ్మవిష్ణుహరులను సైతము మోహపెట్టునో నేనా పరాశక్తినిపుడు శరణు వేడుచున్నాను. ఆ శక్తిచే అంతటివారే మోహితులుగా నితరు లెంతటివారలు? ఆ మహాద్భుతమాయాశక్తి బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే మోహింపజేసినది. ఆ మహాశక్తికి వారే తలలు వంచిరి. ఇక నాశక్తి భ్రమలో పడనివాడే లేడు. ఆహా! ఆ సర్వశక్తి వీర్యపటిమ యెంతన వలయును! ఆ శక్తి తేజోబలమెంతని చెప్పగలము!! ఆ శక్తులు మహాద్భుతశక్తులు. ఇంత యేల? సర్వజ్ఞుడగు శంకరుడే శక్తియుక్తుడు గానిచో నేమియు చేయజాలడు గద! వ్యాసుడు విష్ణ్వంశసంజాతుడని పౌరాణికులు నుడువుదురు. మరి యంతటివాడే భగ్ననౌకలోని వ్యాపారివలె మోహసాగరమందు మునిగిపోయెనే! ఈ సమయమందే వ్యాసుడే ప్రాకృతమనుజుని పగిది వివశుడై కన్నీరొలుక బోయుచున్నాడు. 

పండితులు సైతము మాయాబలమునుండి విముక్తులు కాజాలరు. నేనెవరను? ఇతడెవరు? ఈ వీడనిభ్రమ యెక్కడిది? ఈ తండ్రికొడుకుల వాసనల సంబంధ మీ పాంచ భౌతిక దేహమునకు మాత్రమే యుండును. ఈ మాయశక్తి యెంతయో బలవత్తరమైనది. ఇది మాయికులను సైతము తన మాయలో ముంచివేయును. వ్యాసుడంతటి వాడే నేడు మాయామోహునకు వశుడై పలవరించుచున్నాడు.

సూతు డిట్లనియెను : అంతట శుకుడు సకల దేవతలకే మాతృ దేవతయు బ్రహ్మాదుల కీశ్వరియు సకల కారణ కారణయునగు దేవిని నెమ్మదిలో భావించి నమస్కరించెను. పిదప నరణి సంజాతుడగు శుకుడు మోహసాగరమున మునింగిన తన తండ్రి వ్యాసునకు సహేతుకములుగ బ్రహ్మవాక్కులు ఇటులు పలికెను : 

"ఓ మహామనీషీ ! ఎల్లరకు నీవే తెలియజెప్పువాడివే! నీవే యిప్పుడొక సామాన్యుని పగిది విషాదమునంద నేల! ఇపుడు మాత్రమే నేను నీ కుమారుడను. వెనుకటి జన్మలో నీవెవరవో నేనెవరనో యెఱుగము. సర్వాత్మదృష్టితో చూడగా దండ్రికొడుకుల సంబంధము భ్రమ మాత్రమే యగును. ఆత్మధైర్యము బొందుము. సావధానుడవు గమ్ము. డెందమందు దౌర్బల్యమందకుము. ఇదంతయును మోహజాలమని గుర్తెఱుంగుము. వైక్లబ్యమందకుము. తినుటవలన నాకలి చల్లారును. త్రాగుటవలన దప్పిక తీరును. కాని పుత్త్రదర్శనమున నాకలి దప్పికలు తీరవు. నెత్తావి వలన ఘ్రాణతర్పణము గల్గును. మంచి వినికిడిచే చెవికింపగును. స్త్రీ వలన కామసుఖము లభించును. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు? 

పూర్వ మజీగర్తుడు తన కొమరుని హరిశ్చంద్రునకు యాగపశువుగ వెలకమ్మెను. ద్రవ్య మెల్లసుఖములకు సాధనము. ఈ ధనమువలన సుఖములు గల్గును. నీకు స్వార్థబుద్ధిగలదేని డబ్బు సంపాదించుము. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు! నీవు దైవజ్ఞుడవు. కావున నన్ను స్థిత ప్రజ్ఞుని చేయుము. నన్నీ గర్భవాసనరకమునుండి విముక్తుని జేయుము. ఇది కర్మభూమి. ఇట మనుజ జన్మ కడుంగడు దుర్లభము. అందు నుత్తమకులమున బ్రహ్మతత్త్వ మెఱింగిన బ్రాహ్మణుడై జన్మించుట యెంతెంతో దుర్లభము. నేను వేరు - బ్రహ్మము వేరు అను భేదభావమున బద్ధుడనైతిని. నన్నీ భేదబుద్ధి వీడుట లేదు. ఇట్టి సంసారవాసన ముసలితనమందును వదలక అంటిపెట్టుకొనియే యుండును.

సూతు డిట్లనియె : ఈవిధముగ సర్వకర్మ సంన్యాసమునే చిత్తమందిచ్చగించు శాంతుడగు శుకుని వ్యాసుడిట్లు ప్రబోధించెను: 

"మహాభాగ! నీవు నా వ్రాసిన శ్రీ మహాభాగవతము చదువుము. ఆ పురాణము బ్రహ్మసమ్మితము. అనతి విస్తృతము. అది పండ్రెండు స్కంధములతో పంచలక్షణములతో సకల పురాణముల కలంకార ప్రాయమై అలరారుచున్నది. అది నా మదికెంతయో ప్రియమైనది. ఆ భాగవతమొక్కసారి విన్న మాత్రమున సదసద్వివేకము ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానము గల్గును. కావున నీవు దానిని శ్రద్ధగ చదువుము. 

పూర్వము పాలసంద్రముపై పటప్రతముమీద పరుండియున్న బాలరూపుడగు శ్రీవిష్ణువు తనలో నేనే సచ్చిదానందరూపముచేత నీ బాలరూపమందితిని. నేనే నిత్యవస్తువువలన నీ రీతిగ జన్మించితిని. ఈ సర్వవిశ్వము నేనెట్లు దెలిసికొనగలను? అని తలంచెను. అంతలోనే దయామయియగు భగవతి సకలార్థసాధకమైన వాక్యమును శ్లోకార్థమున నిట్లు పలికెను : 

'ఈ కనంబడు జగమంతయు నేనే; పూర్ణఘనానందమున నిండియున్నాను. నాకన్న మిన్నయగు సనాతన వస్తువు మరేదియును లేదు.' విష్ణువు నెమ్మదిలో ఈ ధ్వని యెవరిదో ! ఈ పలికినది నరుడా? నారియా? పేడియా? నేనెట్లు గుర్తించగలనని విచారించెను. ఆ శ్లోకార్థరూపమగు భాగవతమునే అతడు తన యెడదలో మననము చేయదొడగెను. ఆ బాలుడా వటపత్రమందే పరుండి మాటిమాటికి నా దేవి పలికిన వాక్యార్థము విషయమును తన హృదిలో నాలోచించు చుండెను.

అంతట నా భగవతీ దేవి విష్ణునకు ప్రత్యక్షమయ్యెను. ఆ దేవి శంఖము చక్రము గద పద్మము వరాయుధములు దాల్చి తేజరిల్లు సత్యస్వరూపిణి. చతుర్భుజ. దివ్యాంబరధారణి-దివ్యభూషణ భూషిత-తన దివ్యవిభూతులను బోలిన నెచ్చెలులతో గూడి అచ్చెరువుగ నుండెను. ఆ దేవి తన ప్రసన్న వదనమున చిరునగవుసిరులు చిందులాడగ శ్రీమహలక్ష్మీరూపముతో తేజోనిధియగు విష్ణుని సన్నిధిని ప్రత్యక్షమైనది. 

సూతు డిట్లనియె : ఆ మున్నీటియందు నిరాధారయై కలుములీను కమలను మనోరమను శ్రీవిష్ణువు తన హృదయకమలము నిండుగ దర్శించి విప్పారిన నయనకమలములతో నొప్పారెను. అపుడు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహా క్షుధ నిద్ర దయ గతి పుష్టి తుష్టి జృంభ తంద్ర క్షమ లజ్జ మున్నగు దివ్యశక్తులా శ్రీమహారాజ్ఞికి నల్గడలం జేరి ప్రేమ నివాళు లర్పించుచుండిరి. వారిలో ప్రతి యొక్కరును దివ్యవరాయుధములు నానా దివ్యభూషలు మందారమాలికలు జాతిముత్యాలహారాలు దాల్చి దివ్యశోభలు వెలార్చుచుండిరి. మహాసాగర మధ్యమం దా దివ్యాంగనలను కలయ వీక్షించిన జనార్దనుని డెందమాశ్చర్యపులకితమయ్యెను. ఆ విశ్వభూతాత్మకూడా మహామాయకచ్చెరువంది యిట్లు తలంపసాగెను: 

"ఈ యందచందాలు విరజిమ్ము కాంతలెక్కడి వారలొకో! ఈ మఱ్ఱియాకు సెజ్జపై నున్న నేనెక్కడి వాడనో! ఇది అంతుపంతులేని మహాజలరాశియే. ఇందీ మహావటవృక్షమునకు కారణమేది? నేనెవరి మూలమున నిటుల ముద్దులుగారు బాలుడనై యుంటిని? ఈ దేవి నాకు జననియా! లేక దురంతమైన మాయయా!! ఏ కారణమున పుణ్యవిశేషమున నా కీమె దర్శనభాగ్యము చేకురినదో! నేనిపుడేమి పలుకవలయును? ఎట కేగవలయును? బాలభావముననే యప్రమత్తుడనై మౌనభాషతో నుండవలయునా?"

అధ్యాయము 16 వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

పంచాంగం

Chapter 14 The birth story of Shri Shuka Maharshi - అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 14

శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ నావేద వ్యాసుడా దేవకన్యకను ఘృతాచినిగాంచి ఇపుడేమి చేతును? ఈ దేవకన్యక నాకు దగినది గాదు అని తన మదిలో విచారించు చుండెను. అట్టి వ్యాసునిగని యితడు నన్ను శపించునేమోయని యామె భయభీతయై వెంటనే శుకీ రూపముదాల్చి యచ్చోటుపాసి వెడలినది. పచ్చని చిలుక పక్షియందము ఱప్పవాల్చక వ్యాసుడు వింతగ గాంచుచుండెను. దాని సోయగము చూడగానే ముని మనము విస్మితమయ్యెను. ఆ ముని వర్యుడు మనసును ధీరతతో నిలువ జూచెను. కాని భవితవ్యతా బలమున మహాతేజస్వియగు వ్యాసుడు సైతము తన మనస్సును నిగ్రహించుకొనలేక ఘృతాచీ వశుడయ్యెను. ఆ సంయమి అగ్నికై యరణిని మధించుచుండ ఆ యరణి యందతని వీర్యము పడినది. అతడు తన శుక్ర పాతము సైతమెఱుంగక అరణి మథనము చేయుచునే యుండెను. అంత మునిరూపమునే సంతరించుకొని యొక చక్కని శుకరూప మరణినుండి యుద్భవించినది. జన్నమునందు నేతివేలిమిచేత నగ్నికాంతిమంతుడై ప్రజ్వరిల్లునట్లే శుకబాలుడరణి నుండి వింత కాంతులీనుచు ఆవిర్భవించెను. అపుడు వ్యాసుడు తన సుతు నవలోకించి యిదేమి వింతయని మదిలో విస్తుపోయి ఇదంతయు నా పరమేశ్వరుని ప్రసాదఫలమే యని తలచెను. ఆ శుకుడరణి గర్భసంభూతుడు. మహాతేజస్వి - నిజతేజమున రెండవ యగ్నివలె ప్రజ్వలించుచున్నాడు. వ్యాసుడు గార్హపత్యాగ్ని బ్రహ్మ తేజమున తేజరిల్లు తన పుత్రుని కన్నులపండువుగ తిలకించెను. వ్యాసుడంత గిరినుండి దిగి పావనగంగలో తనయుని స్నానమాడించెను. దేవతలపుడు పూలజల్లు గురిసిరి. అచ్చరలు నర్తించిరి. దివి దేవదుందుభులు మ్రోసెను. ముని యా బాలునకు జాతకర్మాది విదులు నిర్వర్తించెను. గంధర్వపతులు ప్రమదమున బాడిరి. అరణిజుండగు శుకుని జన్మవృత్తాంతము విని నారద తుంబురులు విశ్వావసులు విద్యాధరాదులు ప్రహర్షమున శుకుని దర్శించ నేతెంచిరి. ఆ యరణిజుండగు శుకుని సందర్శించి విద్యాధరాదిదేవత లతనిని సంస్తుతించిరి. అంతలో నంతరిక్షమునందుండి శ్రీ శుకునికొఱకు దివ్యకృష్ణాజినము దండకమండలువులు నేలపై బడినవి.

అతడు పుట్టిననాటి నుండి విజ్ఞాననిధియై బుద్ధిమంతుడై జ్యోతిష్మంతుడై ప్రవర్ధిల్లుచుండెను. అంత విద్యా విధానవిదుడగు వ్యాసుడతని కుపనయన సంస్కార మొనరించెను. వ్యాసునకువలెనే శ్రీ శుకునకు సైతము పుట్టిన వెంటనే యెల్లవేదములను సార్థములుగ సరహస్యములుగ నవగతములైనవి. శుకీ రూపమునందున్న ఘృతాచియందలి కామాతిరేకమున తనకు సుతుడు గల్గుటచేత వ్యాసుడు తన తనయునకు శుకుడని నామకరణము చేసెను. శుకుడు దేవగురుడగు గురుని తన గురువుగ నంగీకరించి బ్రహ్మచర్యవ్రతమును విధిగ బాటించెను. గురుకులమందు వేదములన్నిటిని సరహస్యములుగ ససంగ్రహములుగ నధ్యయనము చేసెను. సకల ధర్మశాస్త్రము లెఱింగెను. పిమ్మట గురునకు దక్షిణ సమర్పించి సమావర్తనముచేసి తన తండ్రియగు వ్యాసుని సన్నిధి కరుగుదెంచెను. అట్లు తిరిగి వచ్చిన శుకునిగాంచి వ్యాసుడు పరమానంద మంది లేచి యతని నక్కునజేర్చి శిరంబు మూర్కొనెను. తన తనయుని కుశలప్రశ్న లడిగి యతని చదువునుగూర్చి ప్రశ్నించి తన యాశ్రమమందుండ నియమించెను. పిమ్మట వ్యాసుడు తన కుమారునకు వివాహము సేయదలంచి ఒక చక్కని మునికన్నియను వధువుగ నిశ్చయించి శుకునితో నిట్లు పలికెను : 

"మహామతీ! నీవు గట్టిగ వేదములు చదివితివి. దర్మశాస్త్రము లెఱింగితివి. ఇపుడింక చక్కగ గార్హస్థ్యము నెఱపుము. దేవపితృయాగము లొనర్చుము. నన్ను ఋణముక్తుని జేయుము. అపుత్త్రకులకు స్వర్గాది సద్గతులు లేవు. నీవు గృహాశ్రమము నడపి నా కోర్కె దీర్చుము. నాకు సుఖము గల్గించుము. నే నాచరించిన యుగ్రతపః ఫలితముగ నీవు నా కయోనిజుడవై జనియించితివి. నీ తండ్రినగు నా మాట పాలించుము.

సూతుడిట్లయె : ఈ విధముగ ననురాగియగు వ్యాసుడు పలుకగా విరాగియగు శుకుడు తన తండ్రికిట్లు మారుపలికెను: 

"మీరేమి పల్కుచున్నారు? నన్ను మీ శిష్యునిగ గ్రహించి తత్త్వముపదేశింపుడు. మీ యాన జవదాటను." 

"ఓ పుత్ర! నీ కొఱకు నేను నూరువర్షములు ఘోరమైన తప మొనర్పగా శివుని ప్రసాదమున నతికష్టముమీద నీవు గల్గితివి. నేనే రాజు నైన నభ్యర్థించి నీకు విత్తము సమకూర్తును. నీవిక పరువమునకు తగిన సుఖములనుభవించుము" అని వ్యాసుడనెను. 

శుకుడిట్లనియె : తండ్రీ! నిత్యసత్యమైన యానంద మీనరలోకమున నెక్కడనున్నది? ప్రాజ్ఞులు దుఃఖముతో ముడివడినసుఖము సుఖముగ దలంపరు. నేను భార్యను బడసినచో నామెకు వశుడనై యాత్మ స్వాతంత్య్రమును గోల్పోవవలసి వచ్చును. నారి చెప్పుచే తల నడుచు నరునకు సుఖమెక్కడిది? నరుడు లోహకాష్ఠములచే బిగింపబడిన యంత్ర బంధములనుండి యొక వేళ విముక్తుడైన గావచ్చును. కాని భార్యామాయబంధములనుండి విముక్తుడేనాటికిని గాలేడు. ఈ శరీరము మలమూత్రములకొంప! ఈ కొంప కంపుతో కులుకు కలికితో నరుడు బద్ధుడగును గద! అట్టి హేయమైన దానియందు విబుధులకు ప్రీతియెట్టు గల్గును ? అయోనిజుండనగు నాకింక యోని విషయమై రక్తియెట్లు గల్గును? ఇక ముందును నేను యోనిజుడ నగుటకెన్నడును గోరుకొనను. సత్యజ్ఞానానంతమై పరమైన యాత్మానందమే నా స్వరూపము. ఇక మలమాత్రముల మురికిలో నెట్లు సుఖింతును? నేనాత్మారాముడను. మరల కృపణుడను కాగోరను. నీవు ప్రపంచించిన వేదములెల్ల నేను చదివితిని. అవన్నియును కర్మ మార్గము బోధించునవే; హింసామయములే.

బృహస్పతి నాకు గురువుగ లభించెను. పాపము! అతడును మాయా సంసారమందే మున్కలు వేయుచున్నాడు. అజ్ఞానాంధహృదయు డీ దుస్తర సంసారము నెట్లు తరింపనోపును? రోగగ్రస్తుడగు వైద్యుడితర రోగుల కుపయోగపడనట్లు ముముక్షుడనగు నాకును బాహ్యగురు డుపయోగపడడు. ఇదంతయు లోకుల విడ్డూరమే సుమా! ఆ గురువునకొక్క నమస్కారముచేసి నీ సన్నిధి కరుగు దెంచితిని. నేను సంసార ఘోర విషసర్పాల దంష్ట్రలకు వెఱతును. నన్ను స్వాత్మ ప్రబోధామృతమున పరిరక్షింపుము. ఆకాశవీథిలో నహోరాత్రములు సూర్యుడు చక్రమట్లు పరిభ్రమించునట్లే ఈ ఘోరమైన కోర్కులనెడు మొసళ్లు తిరుగాడు సంసార సాగరమందు జీవుడు విశ్రాంతి లేక పరిభ్రమించును. పెండపురుగు మలమందే సుఖమందునట్లు మందమతులీ సంసారమాయలందు తగుల్కొనుటయందే సుఖమున్నదనుకొందురు. వేదశాస్త్రములు చక్కనెఱిగి మన్ననలందిన హిరణ్యగర్భునివంటివాడే. శక్తిహీనునిజేయు విషయ విషమందే సంరక్తుడగునే! అట్టివాని కంటె మూర్ఖుడింకొక్కడుండునా? అయ్యయో! వాని నడతలు పందినడతలు. వాని ధర్మము కుక్కధర్మము. చిత్ర చిత్రము సృష్టి చిత్రము. మానవ జన్మము మరి దుర్లభంబు. వేదశాస్త్రములబ్బుట మరింత దుర్లభము. అట్టివాడే యట్టి విషయ సంసార సంబద్ధుడైనచో నింక ముక్తినందు దీరాత్ముడెవ్వడు? తన్ను నమ్ముకొనిన భార్యను బిడ్డలను మమతతో బోషించువాడే తెలివైనవాడని లోకులందురు. ఈ లోకాన నింతకుమించిన వింతయేముండును? ఏ మానవుడీ దుర్భరమైన సంసార మందుజిక్కి స్త్రీల త్రిగుణకృత మాయాబంధములచేత భగ్న హృదయుడుగాడో వాడే విద్వాంసుడు; వాడే మేధావి; వాడే శాస్త్రపారంగతుడు. హృదయగ్రంధులు దృఢపరచు చదువులు వృథలు. ఇక్కడనే సమత్వమున భవబంధముక్తి గల్గించు చదువే చదువు. పురుషుని గ్రహించునది గృహమనబడును. బంధములకు పుట్టిల్లగు గృహమందేమి సుఖముండును? నేను దీనికి బిట్టు వెఱతురు. మందమతులు బోధరహితులు విదివంచితులునైన నరులీ దుర్లభ మానవజన్మమెత్తియును మరల మరల బంధనములచే కట్టువడుదురు.

వ్యాసు డిట్లనియెను : గృహము బంధించు కారాగారముగాదు. ఇందు బంధన కారణమును లేదు. కామవాసనల నుండి ముక్తుడైన విమలహృదయుడు గృహస్థుడైనను బంధరహితుడైనవాడే. న్యాయార్జితధనముగలవాడు వేదవిహితము లొనర్చువాడు సత్యవాది శుచి శ్రాద్ధకారియైనవాడు గృహస్థుడైనను ముక్తుడైనవాడే. బ్రహ్మచారి యతి వ్రతి వానప్రస్థుడు అను వారలు మధ్యాహ్నము దాటగనే గృహస్థుని జేరుదురు. గృహస్థాశ్రమవాసులు ధర్మపరులు - శ్రద్ధతో నన్నదానమొనర్చువారు - సత్యవచనులు - పరోపకారపరాయణులు నగుదురు. గృహస్థాశ్రమ ధర్మమునకు మిన్నయగు ధర్మమింతవఱకును కన-విన-బడ లేదు. వసిష్ఠాది జ్ఞానులు ఆచార్యులు దీనిని చక్కగ నాచరించిరి. వేదోక్తమార్గమున నడచుకొనువాని కసాధ్యమైనదేదియును లేదు. స్వర్గము - మోక్షము - ఉత్తమజన్మము - ఏది కోరిన నతని కది లభించితీరును. ఒక యాశ్రమమునుండి వేరొండాశ్రమమున కేగవలయునని ధర్మవిదులు పేర్కొందురు. కనుక నీవగ్నిని వేల్చి తెలివితో వేదోక్తకర్మలు నడుపుము. కుమారా! మానవుడైనవా డీ విధముగ విధ్యను సారముగ దేవపితృ మనుజులను దనిపి సత్పుత్త్రులనుబడసి వారినొక యింటివారిని జేయవలయును. పిదప నిల్లువదలి యడవికేగి నియమముతో వానప్రస్థాశ్రమము స్వీకరించి, తరువాత సంన్యాసి గావలయును. ఈ యింద్రియములు మదించిఉండి మనస్సునుగూడి దురంతములై యుండును. ఇవి భార్యతోడులేని వానిలో మరింతగ బాధ గల్గించును. కనుక వీనిని జయించుటకై దారను పరిగ్రహింపుము. వార్ధకమున తపమొనరింపుము. ఇది శాస్త్రోక్తవచనము. విశ్వామిత్రుడును మున్ను మూడువేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై దుశ్చరతప మాచరించెను. అంతటి తపోధనుడే వనమందు మేనకను గాంచినంతనే విమోహితుడయ్యెను. అతని వీర్యమున శకుంతల జననమందినది. నా తండ్రియగు పరాశరుడును దాశకన్యయగు కాళిని గాంచినంతనే మన్మథాగ్నివశుడై నావయందే యాకన్నియను ననుభవించెను. బ్రహ్మయును తన కొమరిత సొబగును గాంచినంతనే మదనావేశ మూర్ఛితుడై పరుగులెత్తుచుండగ రుద్రుడతనిని వారించెను. కావున నీవును నా హితము నాలించి కులీనయగు నొక పడుచుకన్నెను పెండ్లియాడి వేదమార్గానుసారముగ నడచుకొమ్ము.

అధ్యాయము 15 శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

పంచాంగం

Chapter 13 History of the Urvashi Pururavas - అధ్యాయము 13 ఊర్వశీ పురూరవుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 13

ఊర్వశీ పురూరవుల చరిత్ర

ఆ విదముగ సుద్యుమ్నుడు దివికేగెను. ఇటు భువిపై సుగుణవంతుడు ప్రజారంజకుడు సుందరుడునగు పురూరవుడు రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్ఠాన పురమందు సర్వసమ్మానితుడై రాజ్యమేలు చుండెను. అతడు ధర్మజ్ఞుడు. ప్రజా పాలన దక్షుడు. అతని మంత్రశక్తి ఇతరుల కెఱుక పడక రహస్యముగ నుండెను. అతని యుత్సాహ ప్రభుశక్తులును శ్రేష్ఠములైనవి. సామదానాదులారాజు వశమందుండెను. అతడు చక్కగ వర్ణాశ్రమ ధర్మములు పాటించుచు ఏలుబడి సాగించు చుండెను. ఆ నరపతి యొక్క నిరూప సుగుణ సందలను విక్రమౌదార్యములను గుఱించి ఊర్వశి విని రాజునందు అనురక్త యయ్యెను. బ్రహ్మశాపమున మనుజ రూపమున భువికి దిగివచ్చి ఆ నరపతి సుగుణాలగని యని యెఱింగిన యూర్వశి అతనితో ఇట్లు పలికెను : 

"ఈ మేకల జంట నీయొద్దనుంతును. నీవు దీనిని కాపాడుము. నేను నిన్నుచేరి వర్తింతును. నాకాహారము నేయి మాత్రమే, ఇంకేదియు నారగించను. మైథున సమయమున గాక మరెప్పుడు నిన్ను దిసమొలతో నుండగ చూడను. ఇది నా నియమము. నా యీ నియమమును భంగమొనర్చినప్పుడు నేను నిన్ను వదలి వెళ్ళుదును." రాజా కామిని పలుకుల నొప్పుకొనెను. ఆ యూర్వశియు తన శాపము దీఱునందాక నతనిని గూడి విహరించు చుండెను. రాజును తొంటి ధర్మకర్మముకు స్వస్తి చెప్పి ఊర్వశీ మద మోహితుడై పెక్కులేండ్లూర్వశితో నుండెను. ఆ పుడమిఱడట్లు తీరని మోహాతిరేకమున నొక్క నిముసమేని వదలిపెట్టక యావరారోహ మీద మరులు గొని యుండెను.

ఇట్లు పెక్కులేండ్లు గడచెను. ఎంతకునూర్వశి స్వర్గసీమను జేరుటలేదు. అంత దేవరాజింద్రుడు గంధర్వులతో నిట్లు పలికెను : 

"ఓ గంధర్వులారా! మీరు రాజునింట గల మేకల జంటను అపహరించుటద్వారా ఊర్వశిని తీసికొనిరండు. ఊర్వశి లేని యింద్ర సభ ఏమియు శోభించుట లేదు. కావున నెటులేని ఊర్వశినిటకు కొనిరండు. ఇంద్రుని వాక్యములు విని విశ్వావసువు మున్నగు గంధర్వులు కటిక చీకటిలో రాజున్నచోటి కరిగిరి. ఊర్వశి పురూరవునితో కూడి యుండగా గంధర్వులు మేకలనుగొని నింకికెగసిరి. ఆ మేకలు మేమే యని యరచినవి. వాని యర వూర్వశికి తన కొమరుల యేడ్పువలె వినబడెను. అపుడామె కోపమున రాజుతో రాజా! నీతో మున్ను నేను ప్రతిన జేసితిని. ఆ ప్రతిన నేడు భగ్నమైనది. నీయందు నాకు నమ్మకము దొలగినది. ఈ మేకలు నాకు పుత్ర సమములు. వానిని దొంగ లపహరించిరి. ఐనను నీవు స్త్రీవలె నిద్రించుచున్నావు. నీవు శూరమానివి. కునాథుడవు. నీచేత నేను వంచింపబడితిని. నాకు ప్రాణ నమములగు మేకలు పోయినవి అని వాపోవుచు పలుకుచు వెడలి పోవుచుండెను. రాజోపలేని మోహావేశమున దిగంబరముగ నామెను వెనుదగిలెను. అదే సమయమని గంధర్వులా రాజమందిరమున తళుక్కను మెఱుపు మెఱసిరి. అపుడూర్వశి దినమొలతో నరుగుదెంచు రాజును జూచినది. గంధర్వులా మేకలను త్రోవలోనే వదలి వెళ్ళిరి. దిగంబరుడగు ఆ చక్రవర్తి యా మేకలను గొని తన యింటి మొగము పట్టెను. తన పతి నగ్నుడుగ నుండగగాంచి యావరవర్ణిని రాజును వీడ్కొనినది. తన్ను విడనాడి వెళ్ళిన యూర్వశీ మోహమున పరవశుడై రాజు బిట్టు వలవరించెను. రాజు నూర్వశి మీది ప్రకామమోహమున విహ్వలుడై దిగులొందుచు రోదించుచు దేశ దేశములు గుమ్మరు చుండెను.

ఇట్లా భూపతి భూమియందెల్లెడల పరిభ్రమించుచు తుదకు కురుక్షేత్రమునందు మరల నూర్వశిని గాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో నామెకిట్లనియెను : 

'కఠినురాలా ! కాంతా ! నిలునిలుము. నేను పాపమెఱుగని వాడనే! నీ ప్రియకాంతుడనే! ఏనీకు వశ్యుడనే! నిన్నే నమ్ముకొని యున్నాడనే! నన్ను నీవు విడనాడి యెట్లు వెళ్ళితివి? నీవే నన్ను వదలి వెళ్ళినచో నా మేనిచ్చోటనే పడిపోగలదు. కాకులు, తోడేళ్ళు నన్ను కడుపార నారగించును,' 

ఈ రీతిగ రాజ కామార్తుడై కృపణుడై వివశుడై శ్రాంతుడై దిక్కులేని పక్కిచందమున బావురుమని యేడ్చెను. అపుడూర్వశి రాజుతో నిట్లనెను : 

"ఓ నృపశార్దూలా! నీవు మూఢుడవైతివి. నీ జ్ఞానమేమైనది? స్త్రీలతోడి చెలిమి తోడేళ్ళతోడి చెలిమియే. అది తగదు. రాజెప్పుడును దొంగలను స్త్రీలను నమ్మియుండరాదు. కనుక నీవిక నింటికేగి దిగులుమాని సుఖముండుము," అని యిట్లెంతగ నూర్వశి యూరడించినను రాజు మోహాతిరేకమును వదలకుండెను. ఆ స్వైరిణి యొక్క వలపు తమిన రాజు కట్టుబడెను. కాన నతిశోకార్తుడయ్యెను. ఈ విధముగ మీకూర్వశీ పురూరవుల చరిత్ర సంక్షేపముగ చెప్పితిని. ఇది వేములందు విస్తరించి యభివర్ణింపబడినది.

అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

పంచాంగం

Chapter 12 Sudyumna Sthuthi - అధ్యాయము 12 సుద్యుమ్నస్తుతి

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 12

సుద్యుమ్నస్తుతి

సూతుడిట్లనియెను : పిమ్మట బుధునకిలయందు పురూరవుడు జన్మించెను. ఆ పురూరవుడు దర్మాత్ముడు. పెక్కు యజ్ఞము లొనరించినవాడు. దానశీలుడు. అట్టి పురూరవుని జన్మవృత్తాంతము వివరింతును, వినుడు. పూర్వము సుద్యుమ్నుడను భూపతి యుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, ఒకనాడతడు సింధు దేశోద్భవమగు నశ్వమెక్కి మంత్రులతో గూడి కవచధారియై యందమైన కుండలములు దాల్చి అజగవమను ధనువును బాణములను చేపట్టి వేటకై యడవి కేగెను. ఆ రాజు పెక్కు రురుమృగములు, కుందేళ్ళు, పందులు, గవయములు, ఖడ్గమృగములు, శరభములు, మహిషములు, సృమరములు, వనకుక్కుటములు మున్నగు పవిత్ర వన్యములను యజ్జియములగు పశువులను పక్షులను జెండాడుచు కుమార వనమందు ప్రవేశించెను. ఆ వనమందు మేరుగిరికి దిగువలో మందార తరువులు, పొగడ చెట్లు, అశోక లతలు, సాల, తమాల, చంపక, పనసవృక్షములు మామిడి, కడిమి, ఇప్ప, గురివింద వృక్షములు మాధవీలతా మండపములతో శోభిల్లుచుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్ల సముదాయమును అడవిమొల్ల మాలతి కుంద పూదీవియలును కనుల పండువుగ నుండెను. ఆ వనము హంస కారండవ పక్షులతో వ్యాప్తమై వేదధ్వనులతోను గండుతుమ్మెదల ఝంకారముతోను చెవుల పండువు సేయుచుండెను. అట్టి సుందర వనమందు సుద్యుమ్నుడు స్వేచ్ఛగ విహరించుచు రంగురంగుల పువ్వులను గనుచు మత్తకోకిల మధురగానములు వినుచు సంతసిల్లుచుండెను. ఆ రాజట్లు తన సేవకులతో వనమును దర్శించుచు పోవుచునే ప్రమోదము నిండార వనమందు జేరగనే ప్రమదగ మారెను. ఆతని మగగుఱ్ఱ మాడుగుఱ్ఱమయ్యెను. ఆ వింతగని రాజు చింతాక్రాంతుడయ్యెను. ఈ వింతకు కారణమేమో యని మాటిమాటికి వంతంజెందుచు తన నారీ రూపమునకు తలవంచుకొనుచు ఈ యాడుదనంబుతో నేనింకేమిజేతును? ఇంటి కెట్టులేదగుదును? రాజ్యమేలుట యెట్లో? వంచించిన దెవ్వరో?' యని రాజు లోలోననే తెలుపరాని బాధ పడుచుండెను.

ఋషులిట్లనిరి : ఓ సూతా! ఆ దేవసన్నిభుడగు సుద్యుమ్నుడు పడతిగనెట్లు మారెను? ఇదంతయును వింతగ నున్నది. రాజా సుందరవనమందు గ్రుమ్మరుటచే నట్లు జరుగుటకు కారణమేమి? ఆ తరువాత నతడేమి చేసెనో తెల్లమొనర్పుము. 

సూతుడిట్లనియెను : పూర్వము సనకాదియోగి పుంగవులు తమలోని దివ్యకాంతిపుంజములు దెసలను వెలిగించు చుండగ శివసందర్శనమున కరిగిరి. అత్తఱి శివుడు పార్వతితో క్రీడించుచుండెను. గిరిజయు వివస్త్రయై శివుని తొడపై క్రీడాసక్తురాలై యుండెను. దిగంబరయై యుండెను. ఆ మానవతి ఋషులను గాంచి తలవంచుకొని వెనువెంటనే శివునంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. ఆ పార్వతీ పరమేశ్వరులట్లొక్కటై శృంగార క్రీడలో మునింగి ఉండుటగని ఋషులచ్చోటు వదలి గ్రక్కున నరనారాయణాశ్రమ మేగిరి. ఆ పార్వతి లజ్జించుట గాంచి శంకరభగవానుడామెతో నీవేల లజ్జాతురవగుదువు? నీ మదిలోని కుందు బాపుదును. ఈ వనమెవడేని ప్రవేశించినచో నతడు స్త్రీరూపమందును. ఈ వనమీవిధముగ వపింపబడెనని విన్నవాడెవడైనను దోషభూయిష్ఠమైన యీ వనమును ప్రవేశింపరాదు అని పలికెను. ఆ సుద్యుమ్నున కీ శివశాపము తెలియకపోవుటచే తన మంత్రులం గూడి యందు ప్రవేశించి స్త్రీ భావము నందెను. అతడు చేయునది లేక తలవంచుకొని తన భవనమునకేగక వనమందే యటునిటు గ్రుమ్మరుచుండెను. ఆ నారిగ మారిన మహాత్ముడు 'ఇల' యను పేర బరగెను. అంతలో చంద్రుని కుమారుడగు బుధుడు విహరించుచు నచ్చటి కేతెంచి ఆ యిలాకామినిని పెక్కురు చెలికత్తియల నడుమ మనోహరిణిగనున్న దానిని జూచి కామించెను. ఆ యిలయును చంద్రుని కుమారునే తన కాంతునిగ తంచెను. వారిరువుర సంయోగ ఫలితముగ బుధునకా యిలయందు పురూరవుడను కుమారుడు జనించెను.

అటులు ఇల వనమందే తనయుని గని చింతాకులయై తనకులాచార్యుడు మునిసత్తముడగు వసిష్ఠుని నెమ్మదిలో స్మరించినది. ఆ సుద్యుమ్నుని దీనదశ జూడగనే జాలి కలిగి వసిష్ఠుడు లోకశంకరుండగు శంకరుని ప్రార్థించెను. పరమ శివుడు ప్రసాదభావము నొందుట గని రాజునకు మరల పురుషత్వము గలుగవలయునని ముని శివుని వేడుకొనెను. మహేశ్వరుడు తన పలికిన వాక్యము సత్యము జేయుటకై యితడొక నెల పురుషుడుగను నొకనెల స్త్రీగను నుండునని పలికెను. ఇట్లు రాజు వసిష్టుని దయవలన వరము బడసి తన గృహమేగి ధర్మానుసారము రాజ్యమేలుచుండెను. ఆ రాజు స్త్రీగ మారినపుడంతఃపుర మందే యుండును. పురుషుడైనపుడు రాజ కార్యములు చక్కబెట్టుచుండును. దీనికి ప్రజలుద్విగ్నులై సంతోషము జెందకుండిరి. కొంతకాలమునకు తన కుమారుడగు పురూరవుడు యువకుడు కాగా నతనికి ప్రతిష్ఠానపురము రాజధానిగ రాజ్యమొసంగి రాజు వనమున కరిగెను. పలు వృక్షములతో నుల్లము పల్లవింపజేయు రమ్యవనమందా రాజు నారదమునివలన పావనమైన నవాక్షరమంత్రము నుపదేశమంది ఆ శ్రీదేవీ మంత్రమునే భక్తిశ్రద్ధలతో నిరంతరముగ జపించుచుండెను. అంత సర్వగుణోపేతయు తరింపజేయునదియు మంగళరూపిణియు సింహారూఢయు దివ్యరూపిణియు మనోహారిణియు మద్యపానముచే మత్తయు మదముచే నాకులములైన లోచనములు గలదియునగు దేవి యతని యెడ ప్రసన్న యయి సాక్షాత్కరించెను. రాజా దివ్యమంగళమూర్తిని తన యెదుట సందర్శించగనే యతని హృదయము నుండి ప్రేమ భక్తి పెల్లుబికి యా జగదంబికను భక్తితో నీ విధముగ సంస్తుతింప దొడంగెను.

"భగవతీ! దివ్యమయి విశ్వ ప్రసిద్ధమై అఖిల జగములకు మేలునకనుకూలించు నీ రూపసందర్శన భాగ్యము నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్యచరణములే నాకు శరణములు. నీ పదకమలములు కామ ప్రదములు ముక్తి ప్రదములు. నీ దివ్యస్వరూపము సురలను మునులను మోహింపజేయును. సామాన్య మానవుడెట్లెరుగ గలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనునిపై దయ దలచితివి. ఎల్లకలుములు ప్రసాదించితివి. ఇదంతయు నా కచ్చెరువు గొల్పుచున్నది. హరి, హరుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, రవి, వరుణుడు, పవనుడు, సోముడ, వసువులను వారియందెవ్వరును నీ దివ్యసుగుణ ప్రభావమెఱుగజాలరు. ఇంక గుణహీనుడగు నరుడెట్లు తెలిసికొనగలడు? మహాద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్త్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదాయినియు కడలిపట్టియునగు లచ్చిగనే యెఱుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తిగను రుద్రుడు తామసశక్తి యగు నుమగను దలంతురు. కాని వారును నీ నిర్గుణశక్తి స్వరూపమెఱుగ నేరరు. మందమతియై యల్ప ప్రభావముగలనే నెక్కడ? నాపై ప్రవహించు నీ మధుర దయాపూరమెక్కడ? ఓ భవానీ! నీ మహోజ్జ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతుము. నిన్నెవరు గొలుతురో యా సేవకులపై నీవు దయ గురిపింతువు. పద్మాలయవైన యో పద్మా! నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత తన పదము లొత్తించుకొనుటకు దగనని దలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములనొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదాహతిని గోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్తుడై నీ పదములకు మ్రొక్కినను నీవు రోషమున నతనిని పాదాతాడన మొనర్తువు. నీలాల మేఘమాలలో మెఱుంగు తీగె శోభిల్లును. నీవా విష్ణుని యెడందసెజ్జపై కలకాలము కాంతులీనుదవు. నీకా జగత్పతియును వాహనముగ నయ్యెను గదా! ఒకవేళ నీవు కోపమున నా మధుసూదనుని విడనాడినచో నపుడా సర్వనుతుడగు హరియును శక్తిహీనుడే యగును. శాంతి శ్రీని గోల్పోయి గుణహీనుడైన వానిని తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ యనంత శక్తీ! బ్రహ్మాది దేవతలును రేబవళ్లు నీ భవ్య పాదపద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము జేరి యువతులుగ మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగ మారుదురని తలంతును. ఇట్టి నీ మహాశక్తి నేమని వర్ణింపగలను? నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గలదానవే కావు. సగుణపు నిర్గుణవు నిరంజనపు కనుక నిన్నే భక్తి ప్రపత్తులతో సంస్మరించుచు మ్రొక్కులు చెల్లింతురు. నాకు నీయందు నిశ్చల భక్తి యున్న చాలు. నాకు మరే కోర్కెయు లేదు. 

సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ నా రాజు సంస్తుతించగనే శ్రీదేవి సుప్రసన్నయై యతనికి బ్రహ్మ నిర్మాణము ప్రసాదించినది. ఇట్లు సుద్యుమ్నుడు దేవీ ప్రసాదమున మునులకును దుర్లభమైన ధ్రువ పరమపదమును జెందెను.

అధ్యాయము 13 ఊర్వశీ పురూరవుల చరిత్ర

పంచాంగం

Chapter 11 The story of the birth of the planet Mercury - అధ్యాయము 11 బుధుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 11

బుధుని జన్మవృత్తాంతము

ఋషులిట్లనిరి : అపురూరవ మహారాజెవరు? దేవకన్యక యూర్వశి యెవర్తుక? ఆ మహారాజునకు కష్టములెట్లు గలిగెను? ఆ కథ మాకు వినిపింపుము. నీ ముఖకమలమునుండి వెడలు మధురసామృత మెంత గ్రోలినను తనివితీరదు. నీ వాక్కుల నుండి యమృతరసమే కురియును. అమృతములో లేని దివ్యరసము నీ వాక్కులందు గలదు. అమరుల మృతమున దనియరు. అట్లే మేము నీ వాగమృతమున దనియకున్నాము. 

సూతుడిట్లనియెను : మునులారా ! మున్ను శ్రీ వ్యాసునిచే చెప్పబడిన సుమనోహర దివ్యకథ నా బుద్ధికి దోచినట్లు వివరింతును వినుడు. దేవగురుడు బృహస్పతి. అతని భార్య తార. ఆమె సురూపమును ¸ వనమును కలది. అందమగు అవయవములు కలది. మదన పరవశ. ఒకనాడు రూప¸ వనశాలిని యగు ఆ భామిని ఆ కాలమున యజ్ఞము నాచరించున్న చంద్రుని గృహమునకేగి అతని కంటబడెను. ఆ రాజముఖిని గాంచగనే చంద్రుడు కామాతురుడయ్యెను. ఆమెయును చందురుని చూచి మిక్కిలిగా కామపీడిత యయ్యెను. ఇట్లు తారాశశాంకులు పరస్పరా సురాగమున కామార్తులైరి. మదోన్మత్తులగుచు కామబాణ పీడితులైరి. కామమదమత్తులును పరస్పరానురాగాన్వితులునగు వారిరువురును అట్ల క్రీడించుచు ఎన్నియో దినములు గడిపిరి. ఇది తెలిసి గురుడు విచారగ్రస్తుడై తారను ఇంటికిదోడ్కొని రమ్మని తన శిష్యునంపెను. కాని చంద్రునిచే వశీకృతయగు నామె రాలేదు.

అట్లే మాటిమాటికి గురుడు పంపుశిష్యులను చంద్రుడు తిరుగ బంపుచుండెను. కడకు ఆ యుదారమతి యగు బృహస్పతి తానే బయలుదేరి సోమునింటికేగి మదాన్వితుడై నవ్వు చంద్రుని గని పట్టరాని రోషమున నతని కిట్లనియెను: 

"చంద్రా ! ధర్మనిందితమైన పనిజేసితివేమి? సుందరియగు నా భర్యను నీవట్టె పెట్టుకొని యంటివేమి? దేవతలలోని వాడవగు చంద్రా! నీకు గురుడను. నీవు యాగముచేయుచున్న వాడవు గదా! ఓరీ మూఢా! నీవు గురుభార్య ననుభవించితివే! మీదుమిక్కిలి ఇపుడును వదలకున్నావు. బ్రహ్మహంత సువర్ణాపహారి సురాపాయి గురుతల్పశాయి వారి సంసర్గము కలవాడు అను వీరు పంచమహాపాతకులు. నీవు మహాపాపివి. దురాచారివి. అతినిందితుడవు. నీవు నా యంగన ననుభవించి నందున దేవలోకార్హుడవు కావు. ఇకనైన నా యసితేక్షణను వదలిపెట్టుము. నా యింటికామెను గొనిపోదును. కానిచో నీవు దుష్టాత్ముడవని గురుభార్యనే కూడినవాడవని లోకమున కెలుగెత్తి చాటుదును" అని పలుకుచున్న క్రుద్ధుడును భార్య యొక్క యెడబాటుచే దుఃఖితుడునైన గురునితో 

చంద్రుడిట్లనియెను: "బ్రాహ్మణులు కోపముననే యపూజ్యులగుదురు. దర్మశాస్త్రము లెఱింగిన వారు పూజార్హులు. క్రోధయుక్తులు పూజయందు విడువదగినవారు. అనఘా! నీ భార్య నీ యింటికే రాగలదు. ఆ చిన్నది నా యింటిలోనే యున్నను నీకు గల్గునష్టమేమి? ఆమె తన యభీష్టము ననుసరించి కామ సుఖార్థినిగదా! ఇచట కొన్ని నాళ్లిట్టులే యుండి తన యిష్టముననుసరించి యింటికి వచ్చును. పాతకము చేసినను ఋతుమతియైన పిదప స్త్రీ దుష్టురాలుగాదనియు, పాతకియైనను వేదకర్మలాచరించుటచే విప్రుడెన్నడును నింద్యుడుగాడు అనియు గురు వర్యులగు మీరు దర్మశాస్త్ర సమ్మతమైన పలుకు మున్ను పల్కితిరి, అని చంద్రుడు పలుకగనే గురుడు మరింత దురపిల్లెను. అతడు చేయునదిలేక స్మరాతురుడై చింతావశుడై తన యింటి మొగము పట్టెను. ఇట్లు కొన్ని దినములు గడచిన పిదప గురుడు చింతాపరవశుడై మరల త్వరితగతితో నోషదీపతి యింటికేగెను. ద్వారపాలు రడ్డగించుటచేత గురుడు బయటనే యుండెను. చంద్రెడంతకును బయటికా రాలేదు. గురునకంతకంతకును కోపము మితిమీరు చుండెను. ఇతడు నాకు శిష్యుడు. గురుపత్ని తల్లియేయగును. ఐన నితడు ధర్మముతో నా దానిని బల్మితో తానే యుంచుకొనెను. ఇపుడు నేనితనిని శిక్షింతును.

గురుడు ద్వారము చెంతనే నిలుచుండి యిట్లు కేకలు పెట్టుచుండెను : 

"ఓరీ మందా! పాపీ! సురాధమా! ఇంకను లోననే పండుకొని యున్నావా! వేగమే నా ప్రియకామినిని నాకిమ్ము. లేనిచో నిన్ను శపింతును. నా ప్రియను నా కీయనిచో నిన్ను భస్మమొనర్పగలను."

సూతుడిట్లనియెను : ఇట్లు గురుని పరుషవాక్కులు విని వెంటనే చంద్రుడింటిలోనుండి వెలుపలకు వచ్చెను. చంద్రుడు పక పక నవ్వుచు గురున కిట్లనియెను : 

"ఏమో యెక్కువగ పలుకుచున్నావే? సర్వశుభలక్షణ లక్షితయగు ఈ అసితా పాంగి నీకు యోగ్యురాలుగాదు. నీకు తగిన కురూపను చేపట్టుము. ఒక్క బిచ్చగాని యింట నిట్టివరవర్ణిని యుండదగదు. మందమతీ! స్త్రీకి తనకు సాటివాడగు ప్రియునివలన రత్యానందము కలుగును. నీ వీ కామశాస్త్ర మర్మము లెఱుగవు. దుర్మతీ! ఇంక నీవు యథేష్టముగ పోవచ్చును. నేను ఆ కామినిని ఈయను. నీ చేతనైనది చేసికొమ్ము. ఈ వరవర్ణిని నీయను కామార్తుడవగు నీవు శపించినను నాకదితగులదు. గురూ! ఈ కాంతను నేనీయను. నీ కిష్టమైనది చేసికొమ్ము.'' 

సూతుడిట్లనియెను: చంద్రుడట్లు పలుకగా గురుడు చేయనదిలేక కిన్కబూని పెల్లుదురపిల్లి వేగనింద్రుని కడకరిగెను. క్రుంగిన మదితో చింతం బొగులుచుండిన గురుని దర్శించి ఇంద్రుడు అర్ఘ్యపాద్యాదివిధుల బూజించెను.

పరమోదారు డింద్రుడు దీనదశలో నున్న గురునకిట్లనియెను : 

"మహాభాగా! మీ మోము విన్నబోయియున్నదే! శోకార్తుడవైతివేమి? మీ చింతవేమి? నీవు నా గురుడవు. నా యేలుబడిలో నిన్నెవ్వడవమానించెను? ఈ లోకపాలురతోడి నా సైన్యమంతయును నీ యధీనము. బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలెల్లరు నీకు సాయమొనర్పగలరు. మీ చింతయేమో వేగిరమే వెల్లడించుడు'' 

గురుడిట్లనియెను : "సులోచనయగు నా పత్ని తారను తారేశుడు తన చేజిక్కించుకొనెను. ఎన్ని మారులు వేడికొన్నను ఆ దుష్టాత్ముడు తిరిగి యామెను నా కిచ్చుటలేదు. ఇపుడు నేనేమిచేతును? నీవే నాకు శరణము. నేను మిక్కిలి క్లేశపడుచున్నాను. నాకీ విషయమున సాయమొనర్పుము.

ఇంద్రుడిట్లనియెను : "ధరజ్ఞా! సువ్రతా! మహామతీ! నీ వింక దుఃఖించకుము. నేను నీ దాసుడను. నీ కాంతను తప్పక తెప్పించి యిత్తును. నేనిపుడే నా దూతనంపుదును. ఆ మదమత్తుడప్పటికిని నీ భార్యనీయనిచో సురసైన్యముతో నతని మార్కొని యుద్ధము చేయుదును. అని యిటుల నింద్రుడు గురునోదార్చి విచారదర్శియు చతురుడునగు దూతను వార్త నందించుటకై చంద్రునికడ కంపెను. సువిచక్షణుడగు ఆ దూత వెంటనే చంద్రలోకమేగి రోహిణీ పతితో నిట్లు పలికెను : 

"మహాభాగా! మహామతీ! ఇంద్రుడు నీ కొకమాట చెప్పుమని నన్నంపెను. నా ప్రభువనిన పలుకులు పలుకుచున్నాను. నీవు దర్మజ్ఞుడవు నీతివిదుడవు. నీ తండ్రి అత్రియును ధర్మాత్ముడు. కాన నీవు నింద్యమైన కార్యము చేయదగదు. ఎల్లరును తమ తమ భార్యలను యథాశక్తిగా ఎచ్చరికతో గాపాడుకొనవలయును. ఈ విషయమున కలహముకూడ జరుగునకాశము కలదు. అందు సందియము లేదు. నీవు నీ భార్యనెటుల రక్షించుకొనదలతువో గురుడును తన భార్య నటులే రక్షించుకొన దలచును. సుధానిధీ! ఎల్లభూతములను స్వాత్మభావమున జూడుము. నీ కిరువదెనమండ్రుగురు దక్షకన్యకలు గలరు. వారినందఱిని స్వేచ్ఛగ ననుభవింపుము. గురు భార్యను మాత్రము విడిచిపెట్టుము. నీవంటి గొప్పవాడే యహంకరించి నింద్య కార్యము సేయుటకు పూనుకొన్నచో నిక మూర్ఖుడునట్లే ప్రవర్తించును గదా. దాని వలన ధర్మము నశించును. మనోరమ యగు గురు నిల్లాలిని వదలిపెట్టుము. నీ నిమిత్తమున విబుధులలో కలహము చెలరేగకుండుగాక!"

ఆ యింద్రుని సందేశమాలించి చంద్రుడించుక కినుకబూని ఇంద్రుని దూతతో వక్రభంగి నిట్లు పలికెను. 

"ఓ మహాబాహో! నీవును ధర్మజ్ఞుడవే! దేవేంద్రుడవే! నీ పురోహితుడు నీతో సమానుడే. మీ యిద్దఱి బుద్ధులును సమానములే. చాలమంది పరోపదేశమున పండితులు. ఏ పనియైన తామే చేయవలసి వచ్చినపుడు అట్లే యాచరించువారు దుర్లభులు. ఎల్లరును బృహస్పతి రచించిన ధర్మశాస్త్రమును ప్రమాణముగ నంగీకరింతురు గదా! తన్నువలచిన కామినిని అనుభవించుట దోసముగాదని దాని యందే కలదు. ఇంతకు వీర్యవంతున కందఱును తనవారే. పాపము! బలహీనున కొక్కడును తనవాడునువాడు లేడు. ఈమె స్వీయ - ఆమె పరకీయ యను భేదములు మందమతుల భ్రమలే. ఈ తారకు నా యందనురాగమున్నంతగా బృహస్పతియందు లేదు. అనురాగవతిని వదలిపెట్టుటేమంత ధర్మము గాదు. న్యాయమును గాదు. అనురాగముగల దానియందే సంసారముగాని విరక్తురాలియందు కాదుగదా! ఆ గురుడు తనయన్న భార్య యందనురక్తుడైన నాటనుండియే యీమె కతనియందు విరక్తి గిగినది. దూతా! ఇక నీవు వెళ్లవచ్చును. నే నీ వరారోహన గురున కీయను. నీవు నా మాటగ స్వయముగ నింద్రునకిట్లు దెల్పుము: 

"ఓ యింద్రా! నీవు దేవపతివి. నీకు తోచినది చేసికొనుము." 

సూతుడిట్లనియెను : అని చంద్రుడు పల్కగా విని దూత యింద్రుని చెంతకేగి చంద్రుని మాటలతనికి వినిపించెను. అదివిని యమరపతి కోపాతిరేకమున తన గురునకు సాయము సేయ సేననాయత్త పరచెను. శుక్రునకు గురునకు సరిపడదు. ఆ ద్వేషముతో శుక్రుడు చంద్రునిజేరి తారను మరల గురునకీయ వద్దని యిట్లు చెప్పెను. 

"ఓ మహామతీ ! ఆర్యా ! ఆ యింద్రునితో నీకు పోరాటము సంఘటిల్లినచో నా మంత్రశక్తిచేత నేను నీకు సాయపడుదును. చంద్రుడు గురుదారను బొందెననియును శుక్రుడు గురునకు శత్రువనియు శివుడెఱింగి బృహస్పతికి తానండగ నిలిచెను.

ఆ సమయమున తారకాసుర సంగ్రామమువలె సురాసురుల నడుమ పెక్కేండ్లు ఘోరమైన పోరు సంఘటిల్లెను. ఆ దేవదానవ సంగ్రామము గూర్చి విని వారిని శాంతింప జేయుటకు బ్రహ్మయును హంసవాహనమెక్కి యక్కడి కేతెంచెను. అపుడు బ్రహ్మ చంద్రునితో నిట్లు పలికెను : 

"నీవా గురుపత్నిని వదలుము. కానిచో శ్రీ విష్ణువునకు జెప్పి నిన్ను నశింపజేతును. 

పిమ్మట బ్రహ్మశుక్రుని వారించి యిట్లనియెను : "ఓ మహామతీ! దైత్యుల సహవాస దోషమున నీ మతియు నన్యాయమే తలపెట్టుచున్నదా? 

అంత శుక్రుడు చంద్రుని వారించి "ఆ గురునాలినింక విడనాడుము. నీకిట్లు చెప్పుమని నీ తండ్రియే నన్నంపెను." అనెను. 

సూతుడిట్లనియెను : శుక్రుని మాటలు విని చంద్రుడు అప్పటికి గర్భవతి యగు గురుని యిల్లాలిని తిరిగి గురునకు నప్పగించెను. గురుడు తన భార్యను మరల గ్రహించి, సంతసించి తన యింటి కరిగెను. దేనదానవులును దమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మ తన లోకమేగెను. శంకరుడు కైలాసము జేరెను. గురుడు తన మనోరమ దార యగు తారను మరల బడసి సంతసించెను. కొన్ని నాళ్లకొక శుభ దినమున శుభ తార యందు తార యందొక సుపుత్రుడుదయించెను. ఆ శిశువు గుణములలో తారాపతినే పోలియుండెను. గురుడు సంతుష్టుడై యా కుమారునకు జాతకర్మ మున్నగు కార్యములు యథావిధిగ జరిపెను. 

మహామతి చంద్రుడునపుడు పుత్త్ర జననము విని "ఈ శిశువు నీ కుమారుడు గాడు. మద్వీర్య సంజాతుడు. జాతకర్మాది విదులను నీ వొనర్చితివేమి ?" అని దూతచే గురునకు వార్త నంపెను.

దూతవాక్కులు విని గురుడు "నను బోలి యున్నందున ఇతడు నా కొడుకు. ఇందు సందేహము లేదు" అని సమాధానమంపెను. అపుడు దేవదానవులు మరల వాదించుకొనుచు సంఘములుగ కయ్యమునకై గుమికూడిరి. శాంతికాముడగు బ్రహ్మ మరల నచ్చటికి విచ్చేసి దుర్మదులై రణమొనర్ప జూచువారిని వారించెను. 

మరియు దర్మాత్ముడగు బ్రహ్మ తారతో "వరారోహా! ఈ తనయుడెవరివాడో నిక్కము పలుకుము. జరిగినదంతయు నీవు చెప్పిననే కాని వీరు శాంతించరు" అని పలికెను. అపుడా వరవర్ణిని తారాధిపతివై పోరగన్నుల నగి తల వంచుకొని యా శిశువు చంద్రుని పుత్రుడేయని మెల్లగ బల్కి లోనికేగెను. అంత చంద్రుడు ముదమంది తన తనయుని నెత్తుకొని యతనికి బుధుడను పేరు పెట్టి తన నెలవున కేగెను. బ్రహ్మ తన లోకమున కేగెను. సురలింద్రుని గూడి నాక లోకము చేరిరి. ఇట్లెల్ల వారును దమ తమ నిలయముల కరిగిరి. 

ఇట్లు గురుని భార్యయందు చంద్రుని వనల బుధుడు జన్మించెను. ఇదే బుధుని జన్మ వృత్తాంతము. మున్ను సత్యవతీ సుతుడగు వ్యాసుని వలన నిదంతయును వింటిని. ఇపుడదే మీకు వినిపించితిని.

అధ్యాయము 12 సుద్యుమ్నస్తుతి

పంచాంగం

Chapter 10 Vyasa, having a son, performs penance for Shiva - అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 10

వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట


ఋషు లిట్లనిరి : సూత మహర్షీ! మహా తేజస్వియగు వ్యాసుడీ దివ్యదేవీ పురాణమును రచియించి శ్రీ శుకునిచే దానిని చదివించెనంటివి. వ్యాసుడు తపమొనరించి శుకునెట్లుద్భవింపజేసెను? నీవా వ్యాసుని వలన విన్నదంతయు మాకు విశదమొనరింపుము. 

సూతు డిట్లనియెను : సత్యవతీ తనయుడు వ్యాసుని వలన యోగి వరుడగు శుకుని జన్మమెట్లుగల్గెనో యా వృత్తాంతము దెల్పెదను. పూర్వము సత్యవతీ సుతుడగు వ్యాసుడు రమణీయమైన మేరుగిరి శిఖరముపై నియమముతో పుత్రునికై ఘోరతపమాచరించెను. ఆ తపోనిధి పుత్రార్థియై నారదుని వలన నేకాక్షరమంత్ర రాజమగు వాగ్బీజమంత్రము నుపదేశము పొంది జపించుచు మహామాయను ధ్యానించు చుండెను. వ్యాసుడు తనకు నింగి గాలి నిప్పు నీరు నేలయను పంచభూతముల శక్తులతో సంపన్నుడగు పుత్రుడు గలుగవలయునని నిశ్చయించుకొనెను. అందులకై వ్యాసుడు నిరాహారియై దీక్షతో నూరేండ్లు తపమొనరించెను. శివాశివుల నారాధించెను. సకల భూతయోనియగు మహాశక్తియే యెల్లెడల బూజనీయయని తలంచి వ్యాసుడాదేవిని నిరంతరము గొలుచుచుండెను. లోకమందశక్తుడు నింద్యుడగును. శక్తుడు పూజ్యుడగును. ఆ మేరుగిరి శిఖరముపై అద్భుతకర్ణికారవనము శోభిల్లుచుండును. అందు వేల్పులు క్రీడలందు మునిగి తేలుచుందురు. మునులు తపములు సేయుచుందురు. అచట మధుర సంగీతరవములు వీనుల విందులు సేయును. అట్టి సుమనోహరమైనచోట ధర్మాత్ముడు సత్యవతీ సుతుడునగు వ్యాసుడు తపము సేయ మొదలుపెట్టెను.

అతని మహోగ్ర తేజము చరాచరలోకములనే వెలిగించెను. ధీమంతుడగు ఆ పారాశర్యుని జడ లగ్నివర్ణములయ్యెను. అతని తపము వేడిమికి దేవేంద్రుడే గడగడలాడెను. ఇంద్రుని భయవ్యాకులత్వములను రుద్రుడు గాంచెను. అపుడా రుద్రభగవాను డింద్రున కిట్లనియెను: 

"ఓ యింద్రా! ఏల భీతుడవైతివి? నీకు గలిగిన శోకమునకు కారణమేమి? తాపసులను గని యెవ్వడు నెప్పుడును కోపము జెందకూడదు. మహర్షులు నన్ను శక్తి సంపన్నునిగ దెలిసికొని తపమొనర్తురు. తాపసు లెప్పుడు నితరులకు కీడు తలపెట్టరు." అను వచనములాకర్ణించి "ఆ వ్యాసుడేల తపమొనర్చు చుండెను. అతని మదిలోని కోర్కి యెట్టిది?" అని ఇంద్రుడడుగ "ఆ వ్యాసుడు పుత్రుని కొరకు కఠిన తపమొనర్చుచున్నాడు. వ్యాసునకు తపముతో నూరేండ్లు నిండినవి. కాన నతనికిపుడు శుభకరుతనయుని ప్రసాదింతును" అని రుద్రుడనెను. మధుర దయాసముద్రుడు ప్రసన్నవదనుడు జగద్గురువునగు రుద్రుడు వ్యాసుని జేరి యిట్లనియెను: 

"ఓ సత్యవతీ తనయా! వ్యాస మునీ! లెమ్ము. నీకు సత్పుత్త్రుడుదయించుగాక! ఓ యనఘా! అమిత తేజోనిధియు జ్ఞానియు నీకు పేరు ప్రతిష్ఠలు దెచ్చువాడును లోక ప్రియుడునగు పుత్త్రుడు నీకు జన్మించుగాక! అతడు సత్త్వగుణ సంపన్నుడు సత్యవిక్రముడు పూర్ణాత్ముడు గాగలడు." 

సూతుడిట్లనెను : అను శివుని శివంకరవచనములు విని వ్యాసుడు శివునకు నమస్కరించి తన యాశ్రమమున కరిగెను. అతడు తాను పెక్కేండ్లు పడినపాట్లకు బాధపడుచు –

అరణిలో గుప్తమైయున్న యగ్నిని మరల బొందుట కరణిని మథించుచుండెను. అపుడతని డెందమున పుత్ర కామమును గలిగెను. దండముతో నరణిని జేర్చి మథించగ మథించగా నగ్ని యుదయించెను. నాకు పుత్ప్రోత్తికి హేతువగు స్త్రీ లేనేలేదు! నాకీ యగ్నితో సమానుడగు పుత్రుడెట్లు కలుగును? కుల్పోత్పన్న రూప సంపన్న తరుణి కాళ్ళకు సంకెళ్ళవంటిది అగు కాంతను నేనెట్లు పరిగ్రహింతును? ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలు, పాత్రివ్య్రత జీవన రూపవతి కామిని కావచ్చును. అట్టి స్వేచ్ఛాసుఖ విధాయిని యగు నారి బంధన కారిణి. ప్రణవ స్వరూపుడగు శివు డంతటివాడే ఉమా రాగపాశ బంధములచే బద్ధుడయ్యె గదా! ఇట్లు దుర్ఘటమైన గార్హస్థ్యము నేనెట్లు నెఱపగలను అని వ్యాసుడు విచారించు చుండెను. అంతలో దివ్య కామిని యగు ఘృతాచి వ్యాసునకెట్ట యోదుట నింగిపై దోచెను. చపలములగు క్రీగంటి చూపులతో తన సమీపమున ఉన్న ఆ అప్సరః శ్రేష్టుని చూచి వ్యాసుడు వ్రతపరాయణుడయ్యు కామబాణవ్యాప్తమనస్కుడయ్యెను. ఆ సంకటము విషయమున నేనేమి చేతునని అతడు తలపోసాగెను. ఇపుడు ధర్మము ముందు దుస్తరమైన కామము పెల్లుబికినట్లున్నది. నన్నే మోసగించవచ్చిన యీ రమణిని నే నొకవేళ నంగీకరింతు ననుకొందము. అపుడు బ్రహ్మవాదులు తాపసులును కామ లోలుడనగు నన్ను గేలిసేతురు. 

'ఇతడే నూరేండ్లెంతో ఘోరముగ తపించి యొక యచ్చర కొంగుబట్టుకొని తన సర్వస్వమామె ముందుంచెను' అని వారందురు. సాటిలేని సుఖము లభించినచో నిందవచ్చినను సరే! గృహస్థాశ్రమమున పుత్త్రజన్మము గల్గినచో నది సర్వసుఖము గలిగించును. అది జ్ఞానులకు మోక్షానందమును గల్గించును. ఈ దేవకన్యవలన నాకట్టి పుణ్యము గలుగదు. తొల్లి పురూరపు డూర్వశికి వశుడై తుదకామెచేతనే తిరస్కరింపబడెను అను కథను నేను నారదుని వలన వింటిని.

అధ్యాయము 11 బుధుని జన్మవృత్తాంతము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...