Friday, April 10, 2026

Chapter 14 The birth story of Shri Shuka Maharshi - అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 14

శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ నావేద వ్యాసుడా దేవకన్యకను ఘృతాచినిగాంచి ఇపుడేమి చేతును? ఈ దేవకన్యక నాకు దగినది గాదు అని తన మదిలో విచారించు చుండెను. అట్టి వ్యాసునిగని యితడు నన్ను శపించునేమోయని యామె భయభీతయై వెంటనే శుకీ రూపముదాల్చి యచ్చోటుపాసి వెడలినది. పచ్చని చిలుక పక్షియందము ఱప్పవాల్చక వ్యాసుడు వింతగ గాంచుచుండెను. దాని సోయగము చూడగానే ముని మనము విస్మితమయ్యెను. ఆ ముని వర్యుడు మనసును ధీరతతో నిలువ జూచెను. కాని భవితవ్యతా బలమున మహాతేజస్వియగు వ్యాసుడు సైతము తన మనస్సును నిగ్రహించుకొనలేక ఘృతాచీ వశుడయ్యెను. ఆ సంయమి అగ్నికై యరణిని మధించుచుండ ఆ యరణి యందతని వీర్యము పడినది. అతడు తన శుక్ర పాతము సైతమెఱుంగక అరణి మథనము చేయుచునే యుండెను. అంత మునిరూపమునే సంతరించుకొని యొక చక్కని శుకరూప మరణినుండి యుద్భవించినది. జన్నమునందు నేతివేలిమిచేత నగ్నికాంతిమంతుడై ప్రజ్వరిల్లునట్లే శుకబాలుడరణి నుండి వింత కాంతులీనుచు ఆవిర్భవించెను. అపుడు వ్యాసుడు తన సుతు నవలోకించి యిదేమి వింతయని మదిలో విస్తుపోయి ఇదంతయు నా పరమేశ్వరుని ప్రసాదఫలమే యని తలచెను. ఆ శుకుడరణి గర్భసంభూతుడు. మహాతేజస్వి - నిజతేజమున రెండవ యగ్నివలె ప్రజ్వలించుచున్నాడు. వ్యాసుడు గార్హపత్యాగ్ని బ్రహ్మ తేజమున తేజరిల్లు తన పుత్రుని కన్నులపండువుగ తిలకించెను. వ్యాసుడంత గిరినుండి దిగి పావనగంగలో తనయుని స్నానమాడించెను. దేవతలపుడు పూలజల్లు గురిసిరి. అచ్చరలు నర్తించిరి. దివి దేవదుందుభులు మ్రోసెను. ముని యా బాలునకు జాతకర్మాది విదులు నిర్వర్తించెను. గంధర్వపతులు ప్రమదమున బాడిరి. అరణిజుండగు శుకుని జన్మవృత్తాంతము విని నారద తుంబురులు విశ్వావసులు విద్యాధరాదులు ప్రహర్షమున శుకుని దర్శించ నేతెంచిరి. ఆ యరణిజుండగు శుకుని సందర్శించి విద్యాధరాదిదేవత లతనిని సంస్తుతించిరి. అంతలో నంతరిక్షమునందుండి శ్రీ శుకునికొఱకు దివ్యకృష్ణాజినము దండకమండలువులు నేలపై బడినవి.

అతడు పుట్టిననాటి నుండి విజ్ఞాననిధియై బుద్ధిమంతుడై జ్యోతిష్మంతుడై ప్రవర్ధిల్లుచుండెను. అంత విద్యా విధానవిదుడగు వ్యాసుడతని కుపనయన సంస్కార మొనరించెను. వ్యాసునకువలెనే శ్రీ శుకునకు సైతము పుట్టిన వెంటనే యెల్లవేదములను సార్థములుగ సరహస్యములుగ నవగతములైనవి. శుకీ రూపమునందున్న ఘృతాచియందలి కామాతిరేకమున తనకు సుతుడు గల్గుటచేత వ్యాసుడు తన తనయునకు శుకుడని నామకరణము చేసెను. శుకుడు దేవగురుడగు గురుని తన గురువుగ నంగీకరించి బ్రహ్మచర్యవ్రతమును విధిగ బాటించెను. గురుకులమందు వేదములన్నిటిని సరహస్యములుగ ససంగ్రహములుగ నధ్యయనము చేసెను. సకల ధర్మశాస్త్రము లెఱింగెను. పిమ్మట గురునకు దక్షిణ సమర్పించి సమావర్తనముచేసి తన తండ్రియగు వ్యాసుని సన్నిధి కరుగుదెంచెను. అట్లు తిరిగి వచ్చిన శుకునిగాంచి వ్యాసుడు పరమానంద మంది లేచి యతని నక్కునజేర్చి శిరంబు మూర్కొనెను. తన తనయుని కుశలప్రశ్న లడిగి యతని చదువునుగూర్చి ప్రశ్నించి తన యాశ్రమమందుండ నియమించెను. పిమ్మట వ్యాసుడు తన కుమారునకు వివాహము సేయదలంచి ఒక చక్కని మునికన్నియను వధువుగ నిశ్చయించి శుకునితో నిట్లు పలికెను : 

"మహామతీ! నీవు గట్టిగ వేదములు చదివితివి. దర్మశాస్త్రము లెఱింగితివి. ఇపుడింక చక్కగ గార్హస్థ్యము నెఱపుము. దేవపితృయాగము లొనర్చుము. నన్ను ఋణముక్తుని జేయుము. అపుత్త్రకులకు స్వర్గాది సద్గతులు లేవు. నీవు గృహాశ్రమము నడపి నా కోర్కె దీర్చుము. నాకు సుఖము గల్గించుము. నే నాచరించిన యుగ్రతపః ఫలితముగ నీవు నా కయోనిజుడవై జనియించితివి. నీ తండ్రినగు నా మాట పాలించుము.

సూతుడిట్లయె : ఈ విధముగ ననురాగియగు వ్యాసుడు పలుకగా విరాగియగు శుకుడు తన తండ్రికిట్లు మారుపలికెను: 

"మీరేమి పల్కుచున్నారు? నన్ను మీ శిష్యునిగ గ్రహించి తత్త్వముపదేశింపుడు. మీ యాన జవదాటను." 

"ఓ పుత్ర! నీ కొఱకు నేను నూరువర్షములు ఘోరమైన తప మొనర్పగా శివుని ప్రసాదమున నతికష్టముమీద నీవు గల్గితివి. నేనే రాజు నైన నభ్యర్థించి నీకు విత్తము సమకూర్తును. నీవిక పరువమునకు తగిన సుఖములనుభవించుము" అని వ్యాసుడనెను. 

శుకుడిట్లనియె : తండ్రీ! నిత్యసత్యమైన యానంద మీనరలోకమున నెక్కడనున్నది? ప్రాజ్ఞులు దుఃఖముతో ముడివడినసుఖము సుఖముగ దలంపరు. నేను భార్యను బడసినచో నామెకు వశుడనై యాత్మ స్వాతంత్య్రమును గోల్పోవవలసి వచ్చును. నారి చెప్పుచే తల నడుచు నరునకు సుఖమెక్కడిది? నరుడు లోహకాష్ఠములచే బిగింపబడిన యంత్ర బంధములనుండి యొక వేళ విముక్తుడైన గావచ్చును. కాని భార్యామాయబంధములనుండి విముక్తుడేనాటికిని గాలేడు. ఈ శరీరము మలమూత్రములకొంప! ఈ కొంప కంపుతో కులుకు కలికితో నరుడు బద్ధుడగును గద! అట్టి హేయమైన దానియందు విబుధులకు ప్రీతియెట్టు గల్గును ? అయోనిజుండనగు నాకింక యోని విషయమై రక్తియెట్లు గల్గును? ఇక ముందును నేను యోనిజుడ నగుటకెన్నడును గోరుకొనను. సత్యజ్ఞానానంతమై పరమైన యాత్మానందమే నా స్వరూపము. ఇక మలమాత్రముల మురికిలో నెట్లు సుఖింతును? నేనాత్మారాముడను. మరల కృపణుడను కాగోరను. నీవు ప్రపంచించిన వేదములెల్ల నేను చదివితిని. అవన్నియును కర్మ మార్గము బోధించునవే; హింసామయములే.

బృహస్పతి నాకు గురువుగ లభించెను. పాపము! అతడును మాయా సంసారమందే మున్కలు వేయుచున్నాడు. అజ్ఞానాంధహృదయు డీ దుస్తర సంసారము నెట్లు తరింపనోపును? రోగగ్రస్తుడగు వైద్యుడితర రోగుల కుపయోగపడనట్లు ముముక్షుడనగు నాకును బాహ్యగురు డుపయోగపడడు. ఇదంతయు లోకుల విడ్డూరమే సుమా! ఆ గురువునకొక్క నమస్కారముచేసి నీ సన్నిధి కరుగు దెంచితిని. నేను సంసార ఘోర విషసర్పాల దంష్ట్రలకు వెఱతును. నన్ను స్వాత్మ ప్రబోధామృతమున పరిరక్షింపుము. ఆకాశవీథిలో నహోరాత్రములు సూర్యుడు చక్రమట్లు పరిభ్రమించునట్లే ఈ ఘోరమైన కోర్కులనెడు మొసళ్లు తిరుగాడు సంసార సాగరమందు జీవుడు విశ్రాంతి లేక పరిభ్రమించును. పెండపురుగు మలమందే సుఖమందునట్లు మందమతులీ సంసారమాయలందు తగుల్కొనుటయందే సుఖమున్నదనుకొందురు. వేదశాస్త్రములు చక్కనెఱిగి మన్ననలందిన హిరణ్యగర్భునివంటివాడే. శక్తిహీనునిజేయు విషయ విషమందే సంరక్తుడగునే! అట్టివాని కంటె మూర్ఖుడింకొక్కడుండునా? అయ్యయో! వాని నడతలు పందినడతలు. వాని ధర్మము కుక్కధర్మము. చిత్ర చిత్రము సృష్టి చిత్రము. మానవ జన్మము మరి దుర్లభంబు. వేదశాస్త్రములబ్బుట మరింత దుర్లభము. అట్టివాడే యట్టి విషయ సంసార సంబద్ధుడైనచో నింక ముక్తినందు దీరాత్ముడెవ్వడు? తన్ను నమ్ముకొనిన భార్యను బిడ్డలను మమతతో బోషించువాడే తెలివైనవాడని లోకులందురు. ఈ లోకాన నింతకుమించిన వింతయేముండును? ఏ మానవుడీ దుర్భరమైన సంసార మందుజిక్కి స్త్రీల త్రిగుణకృత మాయాబంధములచేత భగ్న హృదయుడుగాడో వాడే విద్వాంసుడు; వాడే మేధావి; వాడే శాస్త్రపారంగతుడు. హృదయగ్రంధులు దృఢపరచు చదువులు వృథలు. ఇక్కడనే సమత్వమున భవబంధముక్తి గల్గించు చదువే చదువు. పురుషుని గ్రహించునది గృహమనబడును. బంధములకు పుట్టిల్లగు గృహమందేమి సుఖముండును? నేను దీనికి బిట్టు వెఱతురు. మందమతులు బోధరహితులు విదివంచితులునైన నరులీ దుర్లభ మానవజన్మమెత్తియును మరల మరల బంధనములచే కట్టువడుదురు.

వ్యాసు డిట్లనియెను : గృహము బంధించు కారాగారముగాదు. ఇందు బంధన కారణమును లేదు. కామవాసనల నుండి ముక్తుడైన విమలహృదయుడు గృహస్థుడైనను బంధరహితుడైనవాడే. న్యాయార్జితధనముగలవాడు వేదవిహితము లొనర్చువాడు సత్యవాది శుచి శ్రాద్ధకారియైనవాడు గృహస్థుడైనను ముక్తుడైనవాడే. బ్రహ్మచారి యతి వ్రతి వానప్రస్థుడు అను వారలు మధ్యాహ్నము దాటగనే గృహస్థుని జేరుదురు. గృహస్థాశ్రమవాసులు ధర్మపరులు - శ్రద్ధతో నన్నదానమొనర్చువారు - సత్యవచనులు - పరోపకారపరాయణులు నగుదురు. గృహస్థాశ్రమ ధర్మమునకు మిన్నయగు ధర్మమింతవఱకును కన-విన-బడ లేదు. వసిష్ఠాది జ్ఞానులు ఆచార్యులు దీనిని చక్కగ నాచరించిరి. వేదోక్తమార్గమున నడచుకొనువాని కసాధ్యమైనదేదియును లేదు. స్వర్గము - మోక్షము - ఉత్తమజన్మము - ఏది కోరిన నతని కది లభించితీరును. ఒక యాశ్రమమునుండి వేరొండాశ్రమమున కేగవలయునని ధర్మవిదులు పేర్కొందురు. కనుక నీవగ్నిని వేల్చి తెలివితో వేదోక్తకర్మలు నడుపుము. కుమారా! మానవుడైనవా డీ విధముగ విధ్యను సారముగ దేవపితృ మనుజులను దనిపి సత్పుత్త్రులనుబడసి వారినొక యింటివారిని జేయవలయును. పిదప నిల్లువదలి యడవికేగి నియమముతో వానప్రస్థాశ్రమము స్వీకరించి, తరువాత సంన్యాసి గావలయును. ఈ యింద్రియములు మదించిఉండి మనస్సునుగూడి దురంతములై యుండును. ఇవి భార్యతోడులేని వానిలో మరింతగ బాధ గల్గించును. కనుక వీనిని జయించుటకై దారను పరిగ్రహింపుము. వార్ధకమున తపమొనరింపుము. ఇది శాస్త్రోక్తవచనము. విశ్వామిత్రుడును మున్ను మూడువేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై దుశ్చరతప మాచరించెను. అంతటి తపోధనుడే వనమందు మేనకను గాంచినంతనే విమోహితుడయ్యెను. అతని వీర్యమున శకుంతల జననమందినది. నా తండ్రియగు పరాశరుడును దాశకన్యయగు కాళిని గాంచినంతనే మన్మథాగ్నివశుడై నావయందే యాకన్నియను ననుభవించెను. బ్రహ్మయును తన కొమరిత సొబగును గాంచినంతనే మదనావేశ మూర్ఛితుడై పరుగులెత్తుచుండగ రుద్రుడతనిని వారించెను. కావున నీవును నా హితము నాలించి కులీనయగు నొక పడుచుకన్నెను పెండ్లియాడి వేదమార్గానుసారముగ నడచుకొమ్ము.

అధ్యాయము 15 శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...