Tuesday, August 4, 2026

Khechari Mudra - ఖేచరీ ముద్ర

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఖేచరీ ముద్ర

ఈ ప్రాతస్సంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత ఖేచరీముద్రను మునిపుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే - ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తమూ జిహ్వా ఆకాశంలో (ఖే) సంచరిస్తూ ఉంటాయి. దృష్టి భూమధ్యభాగంలో స్థిరంగా నిలుస్తుంది. కనక దీన్ని ఖేచరీముద్ర అన్నారు. నారదా! సిద్ధసమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, ఖేచరీ సమానమైన ముద్రలేదు. ఇది ముమ్మాటికీ సత్యం.

అంఘ్రిమూలాలతో యోనిముద్ర చేసి దానిమీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి. మనస్సును కదలనివ్వకూడదు. నడుం నిలబెట్టి సమంగా స్థాణువులా కూర్చోవాలి. భ్రూమధ్యభాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్దాసనం. ఇలా కూర్చుని ఆయాతు వరదా దేవీత్యాది శ్లోకాలతో గాయత్రీమాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతే అని నమస్కరించాలి. తేజో
సీత్యాది మంత్రాలతో ఆవాహన చెయ్యాలి. నేను చేసిన ఈ నీ అనుష్ఠానం సంపూర్ణమగుగాక ఆని అకాంక్షించాలి. అభ్యర్థించాలి.

అటుపైని శాపవిమోచన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ- వసిష్ట - విశ్వామిత్ర శాపాలు వారి స్మరణలతో అంతరిస్తాయి. ఇది అయ్యాక సత్యాత్మకుడూ సర్వజగత్స్వరూపుడూ చిద్రూపుడూ వాచామగోచరుడూ అద్వితీయుడూ అయిన ఆ పరమాత్మను హృదయపద్మంలో ధ్యానించాలి. 

అటు పైని సంధ్యావందనానికి అంగభూతాలైన అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి. ప్రతీమంత్రానికీ ముందు ఓంకారం పలకాలి. ఓం భూః పాదాభ్యాం నమః ఓం భువః జానుభ్యాం నమః. ఓం స్వః కటిభ్యాం నమః. ఓం మహః నాభ్యై నమః. ఓం జనః హృదయాయ నమః. ఓం తపః కంఠాయనమః. ఓం సత్యం లలాటాయ నమః. ఓం తత్సవితుః అంగుష్టాభ్యాం నమః. ఓం వరేణ్యం తర్జనీభ్యాం నమః. ఓం భర్గోదేవస్య మధ్యమాభ్యాం నమః. ఓం ధీమహి అనామికాభ్యాం నమః. ఓం ధియో యోనః కనిష్ఠికాభ్యాం నమః. ఓం ప్రచోదయాత్‌ కరతలకరపృష్ఠాభ్యాం నమః. 

ఓం తత్సవితుర్బ్రహ్మాత్మనే హృదయాయ నమః. ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వౌషట్‌. ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయ హుమ్‌. ఓం ధియో యోనః కళాత్మనే నేత్రత్రయాయ నమః. ఓం ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌.

అక్షరన్యాసమూ ముద్రలూ




Monday, August 3, 2026

Sandhyopasana (Ritual prayers performed at dawn, noon, and dusk) - సంధ్యోపాసన

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సంధ్యోపాసన

నారదా! బొట్టు పెట్టుకోవడమయ్యాక చెయ్యవలసింది సంధ్యోపాసన, ఇక దాన్నిగురించి చెబుతాను ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతస్సంధ్యనూ, సూర్యుడు ఆకాశంలో నట్టనడిమికి చేరుకోగానే మధ్యాహ్న సంధ్యనూ, సూర్యుడు అస్తమించబోతూ ఉండగానే సాయంసంధ్యనూ ఉపాసించాలి.

మళ్ళీ వీటిలో అంతర్భేదాలున్నాయి. నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాతస్సంధ్య ఉత్తమం. నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమం. సూర్యుడు ఉదయించేశాక చేసే ప్రాతస్సంధ్య అధమం. ఇలాగే - సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేసే సాయంసంధ్య - ఉత్తమం. అస్తమించాక చేసేది మధ్యమం. చుక్కలు పాడిచాక చేసే సాయంసంధ్య - అధమం. విప్రుడనే వృక్షానికి సంధ్యోపాసన తల్లివేరు. వేదాలే శాఖలు. ధర్మకార్యాలు ఆకులు. 

కనక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలూ లేవు, ఆకులూ లేవు. అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చెయ్యనివాడు జీవచ్చవం. మరుజన్మలో కుక్కగా పుడతాడు. అందుచేత నిత్యమూ సంధ్యోపాసన చెయ్యాలి. ఏమరకూడదు. ఇది లేనిదే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదు. 

సూర్యోదయానికీ అస్తమయానికీ ముందుండే మూడు ఘటికలూ సంధ్యాకాలం. ఆ సమయంలోనే సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్య పరిస్థితుల్లో కాలాతిక్రమణం జరిగితే అదనంగా చతుర్థార్ఘ్యం ఇవ్వాలి. లేదా ముందే నూటయెనిమిదిసార్లు గాయత్రిని జపించి సంధ్యవార్చాలి.

ఏ సంధ్యను ఆతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తరవాత తత్కాలీన సంధ్యావందనం చెయ్యాలి. ఇంటిలో చేసుకుంటే అది సాధారణసంధ్య. గోశాలలో చేస్తే అది మధ్యమం. నదీతీరానగానీ దేవాలయంలోగానీ చేసుకుంటే అది ఉత్తమ సంధ్య. 

సంధ్యావందనమంటే దేవీ ఉపాసన కనక దేవీ సన్నిధిలోనే ముప్పాద్దులా చెయ్యాలి. అనంతఫలం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనను మించిన దైవం లేదు. హరహరి ఉపాసనలు నిత్యవిధులు కావు. సంధ్య ఒక్కటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. 

ఇది శ్రుతిచోదితం. సర్వవేదసారం. బ్రహ్మాదిదేవతలు కూడా సంధ్యాసమయంలో వేదస్వరూపిణి గాయత్రిని ధ్యానిస్తారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి. కనక గాయత్రీదేవి అంటే వేదోపావ్య అని తెలుసుకో. అందుచేత శాక్తులా శైవులా వైష్టవులా అనే భేదం లేదు. విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే.

ముందుగా కేశవాదినామాలతో ఆచమించి ప్రాణాయామం చెయ్యాలి. కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న- అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ - అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరి - శ్రీకృష్ణ అనేవి చతుర్వింశతి నామాలు. 

వీటికి ప్రతినామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి. చివరిలో నమః చేర్చాలి. స్వాహాంతంగా మొదటి మూడు నామాలతోనూ జలం ముమ్మారు పుచ్చుకోవాలి, (ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా.) అటుపైని ఓం గోవిందాయనమః ఓం విష్ణవే నమః - ఇత్యాదిగా ఉచ్చరిస్తూ ఈ రెండింటితో చేతులు కడుక్కోవాలి. 

తరవాత రెండింటితో పాదాలు కడుక్కోవాలి. ఆపైని రెండింటితో శిరస్సున జల్లుకోవాలి (మార్జనం). అటు తరువాత మూడింటితో పాణి - పాద - శిరస్పంప్రోక్షణలు చేసుకోవాలి. తక్కిన సంకర్షణాది ద్వాదశనామాలను ఉచ్చరిస్తూ ద్వాదశాంగాలనూ స్పృశించాలి. కుడిచేత్తో త్రాగాలి. ఎడమచేత్తో తాకాలి - స్పృశించాలి. అప్పటికిగానీ నీళ్ళు పరిశుద్ది పొందినట్టు కాదు. అటుపైనే ఆచమనం.

కుడి అరచేతిని గోకర్ణాకారంలో మడిచి, మినప గింజంత నీరు చొప్పున ముమ్మారు (విడివిడిగా పోసుకుని) పుచ్చుకోవాలి. అంటే త్రాగాలి. ఆంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం. అంగుష్ఠ కనిష్ఠికలను సాచి, నడిమి మూడువేళ్ళనూ పాముపడగలాగా ముందుకి తెచ్చి, అరచేతిలో గుంట ఏర్పడేట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి (అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధిపాందిన) ఎడమచేతితో నీళ్ళు పోనుకుని ఓం కేశవాయ స్వాహా అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన రెండు నామాలతోనూ మరో రెండుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తిఅయినట్టు.

ఆచమించాక ప్రాణాయామం చెయ్యాలి. ప్రణవ సహితంగా గాయత్రీమంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. ఇందులో రేచక పూరక కుంభకాలని మూడు అంశాలున్నాయి. దక్షిణ నాసారంధ్రంనుంచి రేచకం, వామవాసారంధ్రం నుంచి పూరకం చెయ్యాలి. పూరకమంటే గాలిని లోపలికి పీల్చుకోవడం. కుంభకమంటే పీల్చిన గాలిని ఊపిరి తిత్తుల్లో నిలుపుకోవడం. రేచకమంటే ఆ గాలిని విడవడం. 

(ఇవి మూడూ సమానకాల వ్యవధానంతో జరగాలి. పీల్చినంతసేపు నిలపాలి. నిలిపినంతసేపు విడవాలి. అంతసేపు ఆగాలి. మళ్ళీ అలాగే అంత సేపు పీల్చాలి. ఇలా సాగాలి అంటారు. దీన్ని తజ్ఞుల దగ్గర తర్ఫీదు పాందడం అవసరం) 

పూరక సమయంలో కుడిముక్కు పుటాన్ని బొటనవేలితో నొక్కి ముయ్యాలి. ఎడమ ముక్కునుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమివేలూ చూపుడు వేలూ వదిలేసి మిగిలిన చిటికెనవేలూ దాని ప్రక్కనే ఉండే అనామికతో (ఉంగరంవేలు) ఎడమ ముక్కుపుటాన్ని ఒత్తి ముయ్యాలి. కుడిముక్కు నుంచి గాలి వదలాలి.

పూరక - కుంభక - రేచకాలు మూడు కలిసి ఒక ప్రాణాయామమని యోగులూ యోగశాస్త్రాలూ చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పలదళశ్యాముడూ చతుర్భుజమహాత్ముడూ అయిన శ్రీహరిని నాభిమధ్యంలో ప్రతిష్టించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడూ ప్రజాపతీ జగన్నాథుడూ చతుర్వదనుడూ అయిన పితామహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధస్పటిక సంకాశుడూ పాపనాశకుడూ నిర్మలుడూ శంకరుడూ అయిన మహేశ్వరుణ్ణి ఫాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణుసాయుజ్యం. కుంభకంలో బ్రహ్మగతి. రేచకంలో ఈశ్వర ప్రాప్తి,

నారదా! పౌరాణాచమనాద్యమూ శ్రౌతాచమనాద్యమూ అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారుపడకు. కేశవనామాలతో ఆచమిస్తే ఆది పౌరాణికాచమనం. గాయత్రీ మంత్రంతో ఆచమిస్తే అది శ్రాతాచమనం. ప్రణవసహితంగా వ్యాహృతిత్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి.

ప్రాణాయామసమయంలో గృవాస్థులూ వానప్రస్థులూ నాసాగ్రాన్ని అయిదు వేళ్ళతోనూ ముయ్యాలనీ, బ్రహ్మచారులూ సన్యాసులూ అంగుష్ఠ కనిష్ఠికానామికలతో ముయ్యాలనీ ఒక నియమం. ఆపోహిష్ఠాదిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. ఋగంతంలోగాని పాదాంతంలోగానీ ఈ సంప్రోక్షణలు (మార్జనలు) చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సరపాపం నశించిపోతుంది. 

అటు పైని మళ్ళీ ఆచమించి సూర్యశ్చేత్యాది మంత్రాన్ని చదివి జలప్రాశన చెయ్యాలి. దీనితో ఆంతరంగపాపాలన్నీ అంతరిస్తాయి. ఇప్పుడు దక్షిణహస్తంలోకి మళ్ళీ జలం తీసుకుని ముక్కుకి దగ్గరగా తెచ్చుకుని వామకుక్షిలో పాపపురుషుణ్ణి స్మరించి, ఋతమిత్యాది మంత్రంగానీ ద్రుపదా ఇత్యాదిమంత్రంగానీ పఠిస్తూ దక్షిణశ్వాసమార్గం గుండా (కుడిముక్కు) ఆ పాపపురుషుణ్ణి చేతినీటిలోకి తీసుకురావాలి. ఇక ఆ నీళ్ళను చూడకుండా ఎడమవైపు రాతిమీదకు విసిరికొట్టాలి. నా శరీరం నిష్పాపమయ్యింది అని భావించాలి. 

అప్పుడు లేచినిలబడి, కాళ్ళు దగ్గరగా పెట్టుకుని దోసిటిలోకి నీళ్ళు తీసుకుని సూర్యుణ్ణి చూస్తూ గాయత్రిజపిస్తూ ముమ్మారు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ప్రాతస్సాయం సంధ్యలో ఇలా మూడుసార్లూ, మధ్యాహ్న సంధ్యలో ఒక్కసారి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ప్రాతస్సంధ్యలో కొంచెం ముందుకి వొంగి, మధ్యాహ్నసంధ్యలో నిట్టనిటారుగా నిల్చునీ, సాయం సంధ్యలో కూర్చునీ ఇవ్వాలి.

ఇది అయ్యాక అసావాదిత్య మంత్రంతో ప్రదక్షిణం చెయ్యాలి. ఈ అర్ఘ్య ప్రదానానికి కారణమేమిటంటే - 

మందేహులని మహారాక్షసులున్నారు. మూడుకోట్ల మంది. మహావీరులూ మహాఘోరులూ కృతఘ్నులూ దారుణులూ. వీళ్ళంతా కలిసి సూర్యుణ్ణి తినివెయ్యాలని చూస్తుంటారు. కనక దేవతలూ ఋషులూ తపోధనులూ మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచి పెడతారు. 

ఆ మంత్రజలాలు వజ్రాలై ఆ రాక్షసుల్ని దహించివేస్తాయి. అందుకనే ద్విజులు నిత్యమూ సంధ్యను ఉపాసించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది మహాపుణ్యప్రదమైన పవిత్రకర్తవ్యం. ఉచ్చారణమాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేసే అర్ఘ్యాంగమంత్ర సారమేమిటంటే - నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మను, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్తుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును. 

ఓ వరదాయినీ! గాయత్రీదేవీ! బ్రహ్మరూపిణీ! రమ్ము రారమ్ము. జపానుష్ఠాన సిద్ధికోసం నా హృదయంలో ప్రవేశించు - అని ప్రార్థించి శుభ్రప్రదేశంలో శుభ్రపీఠంమీద కూర్చుని గాయత్రీమహామంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక మళ్ళీ ధ్యానించి “పునరాగమనంకోసం సుఖంగా వెళ్ళిరా" అని వీడ్కోలు పలకాలి.

ఖేచరీ ముద్ర




Oordhwapundra Dhaarana - Applying the Urdhva Pundra - ఊర్ధ్వపుండ్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఊర్ధ్వపుండ్ర ధారణ

నారదా! ఇదీ భస్మత్రిపుండ్రాల మహిమ. ఇప్పటికి సమగ్రంగా చెప్పడమయ్యింది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్థ్వత్రిపుండ్రాల గురించి చెబుతాను. ఆలకించు. దాని వర్ణాలూ మంత్రాలూ దేవతలూ ఫలాలూ ఆనీ సమగ్రంగా చెబుతాను. తెలుసుకో.

పర్వతాగ్రం నదీతీరం విశేషించి శివక్షేత్రం సముద్రతీరం పుట్ట తులసికోట - వీటిలో ఎక్కడినుంచైనా మృత్తికను స్వీకరించవచ్చు. మరింక ఏ మృత్తికగానీ పనికిరాదు. నల్లమట్టి శాంతికరం, ఎర్రమట్టి వశ్యకరం, పసుపుమట్టి శ్రీకరం, తెల్లమన్ను ధర్మప్రదం. ఈ మట్టిని బొటనవేలుతో ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం. నడిమివేలుతో ఆయుష్కరం. అనామికతో భుక్తిదాయకం. చూపుడువేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకం. ఈ నాలుగువేళ్ళే ఉపయోగించాలి. గోళ్ళు తాకనివ్వకూడదు.

ఈ నిలువుబొట్టు దీపం వొత్తిలాగానీ వేణుపత్రంలాగానీ(వెదురు ఆకు) తామరమొగ్గలాగానీ తీర్చిదిద్దుకోవాలి. మత్స్య కూర్మ శంఖాకారాల్లోనైనా పెట్టుకోవచ్చు. పది అంగుళాల పొడవుంటే ఉత్తమోత్తమం. తొమ్మిదంగుళాలుంటే మధ్యమం. అయిదు అంగుళాలవరకూ మధ్యమంగానే పరిగణన. నాలుగునుంచి రెండంగుళాలవరకూ కనిష్టం.

నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్నీ, పొట్టమీద నారాయణనామాన్నీ, గుండెలమీద మాధవనామాన్ని, గొంతుముడిక్రింద పెట్టుకునేటప్పుడు(కంఠకూపం) గోవిందనామాన్నీ, పొట్టకి కుడివైపున విష్ణునామాన్నీ, కుడి బాహువుమీద మధుసూదన నామాన్నీ, కుడిచెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రమనామాన్నీ, పొట్ట ఎడమవైవున వామననామాన్నీ, ఎడమ బాహువుమీద శ్రీధరనామాన్నీ, ఎడమ చెవిమీద హృషీకేశనామాన్నీ, వీపుమీద పెట్టుకునేటప్పుడు పద్మనాభనామాన్నీ మూపుమీద పెట్టుకునేటప్పుడు దామోదరనామాన్ని స్మరించాలి. ఇలా పన్నెండు నామాలూ స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టులు పెట్టుకోవాలి. పూజాకాలంలో హోమసమయంలో సాయంప్రాతః సంధ్యాసమయాల్లో ఏకాగ్రచిత్తంతో కేశవాదినామాలు పలుకుతూ బొట్టులు ధరించాలి. శుచిత్వం సిద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు అతడు శ్వమాంసభక్షకుడైనా సరే మరణానంతరం దివ్యవిమానంలో విష్ణులోకం చేరుకుంటాడు.

కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణుపాదాకారంలో సాంతరాళంగా (మధ్యన ఖాళీగా) ధరిస్తే మరికొందరు పరమైకాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతోగానీ పసుపుతోగానీ నిలువుబొట్టు కలపి(నిరంతరాళంగా) త్రిశూలాకారంలో ధరిస్తున్నారు. మరికొందరు వైష్ణవులు అచ్చిద్రంగా దీపశిఖా - పద్మముకుళ - వేణుపత్రాకృతుల్లో ధరిస్తున్నారు. ఇంకొందరు కేవల వైష్ణవులు అచ్చిద్రమో సచ్చిద్రమో - ఎలాగైనా ఏ ప్రత్యవాయవమూ లేదనీ, ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమనీ అంటున్నారు, ఏ బొట్టూ పెట్టుకోకపోతే ఏకాంతులకైనా ప్రసన్నులకైనా పరమైకాంతికులకైనా ప్రత్యవాయం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా ద్వాదశనామాలనూ జపిస్తూ దండాకారంగా అచ్చిద్రంగా ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుంది. సాంతరాళంగా పెట్టుకుంటే ఆ మధ్యఖాళీలో రమాసహితుడై విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే లక్ష్మీశ్రీహరులను అక్కడినుంచి తరిమివేసినట్టే.

కొందరేమో - అచ్చిద్రంగా ఊర్వపుండ్రాలను పెట్టుకోవడంకూడా అంత ప్రశస్తంకాదు, ఏకవింశతి నరకాలకి పోతాడంటున్నారు. అంచేత ఊర్థ్వపుండ్రాలను సాంతరాళంగా ధరించడమే ఉత్తమం. దండాకార - దీపశిఖాకార - పద్మముకుళాకార - మత్స్యాకారాల్లో ధరించడమూ ప్రశస్తమే. శిఖలాగా యజ్ఞోపవీతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ్ర ధారణం నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేనిపక్షంలో ఏ సత్కర్మలూ ఫలించవు. నైష్ఠికులైన వైష్ణవులు త్రిశూల - వర్తుల - చతురస్రక - అర్ధచంద్ర - శివలింగాకారాల్లో ధరించరుగాక ధరించరు. జన్మతః వైష్ణవుడై వేదమార్గాన్ని అనుసరించేవాడు మరింక ఏ ఇతరాకారాల్లోనూ పుండ్రధారణ చెయ్యడు. చెయ్యకూడదు. ఒకవేళ వైష్ణవాగమాలలో ఖ్యాతికోసమో కాంతికోసమో కామ్యసిద్ధికోసమో ఇంకేవైనా ఆకారభేదాలు ప్రసక్తమైనా వాటిని వైదికవైష్ణవులు ధరించరాదు.

వీటిలో వైదిక శ్రౌత స్మార్తాదిభేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దానిదే. కనక ఏ మార్గానికి చెందినవారు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి. వేరే ఆకృతుల్లో ధరించకూడదు. ఏదియేమైనా - వైదిక మార్గానుయాయులు భస్మంతో తిర్యక్‌త్రిపుండ్రాలను, నారాయణ ప్రపన్నులు గంధజలంతోనో మృత్తికతోనో శూలాకారంలో ఊర్థ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టూలేని శూన్యలలాటం ఎవరికీ ఎప్పుడూ తగదుగాక తగదు.

సంధ్యోపాసన




The eyes of Lord Venkateswara, enshrined at the holy pilgrimage site of Tirumala, are always kept closed - తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు

తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇది దేశంలోనే రెండో అత్యంత ధనిక దేవాలయం. కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోరికలు తీర్చే.. శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాలినడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు.

తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు. స్వామికి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్లు ఉంటాయి. ఆయన కళ్లు విశ్వశక్తికి మించినవని, అందుకే భక్తులు స్వామి కళ్లలోకి నేరుగా చూడలేరట. ఈ కారణం చేతనే, తిరుమల స్వామి కళ్లు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు.

ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి వేంకటేశ్వరుని కళ్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, ఆయన కళ్లు చాలా తీక్షణంగా ఉంటాయని, నేరుగా చూడలేమని చెబుతున్నారు. అందుకే భగవంతుని కన్నులు ఎప్పుడూ కర్పూరంతో మూసి ఉంచుతారట. కేవలం గురువారం మాత్రమే వేంకటేశ్వరుని నేత్రాలను భక్తులు చూడవచ్చని చెబుతారు.

గురువారం జరిగే నిజపాద దర్శనం లేదా నేత్ర దర్శన సమయంలో మాత్రమే ఆ నామన్ని మారుస్తారు, ఆ సమయంలో భక్తులు స్వామివారి కళ్లను ఒక్క క్షణం చూడగలుగుతారు.

గురువారం వేంకటేశ్వరునికి చందన స్నానం చేస్తారు. విగ్రహానికి చందనం పూస్తారు. శ్రీ వేంకటేశ్వరుని హృదయంపై చందనాన్ని పూయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుందని చెబుతారు.

వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది.

తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేశుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారుతూ ఉంటది. ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.

ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలి పోతుంది. కానీ, నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం రాస్తుంటారు పండితులు. అయినా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం.

తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం.. గర్భగుడిలోని వేంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు. నేటికీ శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతుంటాయని పండితులు చెబుతున్నారు.

Molakethu - Jeevinchu - మొలకెత్తు - జీవించు

మొలకెత్తు - జీవించు

మట్టి... అంతం కాదు.
చీకటి... శాపం కాదు.

విత్తనం
మట్టిలో కలిసిపోదు,
మహావృక్షంగా మారిపోతుంది.

ఒత్తిడి
దాన్ని నలపదు,
లోతైన వేర్లను అందిస్తుంది

చీకటి
దాన్ని బంధించదు,
వెలుగువైపు నడిపిస్తుంది.

గుర్తుంచుకో
కష్టం నిన్ను పూడ్చదు.
కాలం నిన్ను ఓడించదు.

నిన్ను నాటుతుంది
నిన్ను బలంగా తీర్చిదిద్దుతుంది.
నిన్ను ఎత్తుగా మహావృక్షంలా నిలబెడుతుంది.

మట్టిలో నిద్రిస్తున్నది విత్తనం కాదు... రేపటి మహావృక్షం....

Why is Goddess Gauri made using turmeric? - గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

పసుపు శుభానికి చిహ్నం.. గాయాలకు ఔషధం.. పవిత్రకు ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును వృద్ధికారకం చూస్తారు. అందుకే వివాహాది శుభకార్యలప్పుడు వధువు తల్లి దండ్రులు ఆమెకు అల్లుడితో పాటు పసుపును బహుమతిగా అందిస్తారు. అంతేకాకుండా అత్తింటి వారింట్లో ఆయురారోగ్యఐశ్వర్యాలతో సంతోషాన్ని వ్యాప్తి చెందించాలని ఇస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును ఉపయోగించడం వల్ల కొన్ని ఉపయోగకరాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొదవ ఉండదు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సొంతమవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి అశుభం జరగకుండా ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం.

హిందూ సంప్రదాయంలో ఏ పూజ లేదా వ్రతం ప్రారంభించినా పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మను తయారుచేసి పూజించడం ఆనవాయితీ. 

గౌరిదేవిని పసుపుతో చేయడానికి ప్రధాన కారణాలు పవిత్రత, సౌభాగ్యం మరియు దైవిక శక్తికి అది చిహ్నంగా ఉండటం. పసుపును ప్రకృతి సిద్ధమైన పవిత్రమైన పదార్థంగా, మంగళప్రదంగా భావిస్తారు.

మంగళకరం & పవిత్రత:
పసుపును మంగళద్రవ్యంగా, శ్రీ మహాలక్ష్మి మరియు గౌరీ దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావిస్తారు.
'గౌరి' అంటే పసిడి (బంగారు) ఛాయ కలది అని అర్థం. పసుపు రంగు గౌరీ దేవి దివ్య తేజస్సుకు ప్రతీక.

సౌభాగ్యానికి ప్రతీక:
ముత్తైదువులు పసుపు గౌరమ్మను పూజించడం వల్ల మాంగల్య బలం (ఐదవతనం) పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి లభిస్తాయని నమ్ముతారు. వరలక్ష్మి వ్రతం, శ్రావణ మంగళవారం, వినాయక చవితి వంటి పండుగలలో పసుపు గౌరమ్మ పూజకు ప్రత్యేక స్థానం ఉంది.

పురాణ నమ్మకం: అమ్మవారు పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపుతోనే వినాయకుడిని సృష్టించింది. అందుకే పసుపుతో దైవ రూపాన్ని చేయడం ఆచారంగా వస్తోంది.

భక్తికి ఆడంబరాలు అవసరం లేదు:
అమ్మవారికి వెండి, రాగి లేదా ఇతర విగ్రహాలు లేకపోయినా, కేవలం ఇంట్లో ఉండే పసుపుతోనే దేవి రూపాన్ని తయారుచేసి అత్యంత భక్తితో పూజించవచ్చు.

భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, నిశ్చలమైన భక్తి మాత్రమే అని ఇది తెలియజేస్తుంది.

ఔషధ గుణాలు & ఆరోగ్నం:
పసుపుకు సహజసిద్ధమైన క్రిమిసంహారక మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రతికూల శక్తులను తొలగించి, ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు.

పూజా వాతావరణంలో పసుపును ఉపయోగించడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా, ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనాత్మక శక్తి వ్యాపిస్తుంది.

పర్యావరణ హితం:
పూజ పూర్తయిన తర్వాత పసుపు గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేయడం లేదా మొక్కల్లో వేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.

పసుపులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పసుపును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటుంటాం. ప్రతీ కూరలో కచ్చితంగా పసుపు వేయాల్సిందే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దెబ్బ తగిలిన వెంటనే పెద్దలు పసుపు రాయమని సలహాలిస్తుంటారు. ఇంతటి మేలు చేసే పసుపును రోజూ ఉదయం పరగడుపు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

The spiritual reason behind using sandalwood paste in worship - పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక కారణం

పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక కారణం

పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక, వైజ్ఞానిక మరియు ఆరోగ్యకరమైన అనేక ముఖ్య కారణాలు ఉన్నాయి.

గంధానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది.

మంచి గంధపు చెక్కను అరగదీసి బొట్టు పెట్టుకోవడం వల్ల ఏన్నో ప్రయోజనాలున్నాయి. అంతే కాకుండా ఇది ఎంతో శ్రేష్టమైనది కూడా. బజారులో డబ్బాల్లో లభించే గంధపుపొడి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దానిలో ఉండే హానికారక రసాయనాలతో ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గంధాన్ని ముందు దేవునికి సమర్పించి తర్వాత నుదిటిపై దిద్దుకోవాలి. భక్తితో దేవతలకు గంధాన్ని సమర్పిస్తే వారు అనుగ్రహిస్తారని హిందూ పురాణాల్లో తెలిపారు. అంతే కాకుండా పాప పరిహారానికి సాలగ్రామశిలపై ఉంచిన గంధాన్ని నుదిటిపై అద్దుకోవాలని కూడా తెలిపాయి.

హిందూ సంప్రదాయ ప్రకారం సీమంత సమయంలో మహిళలకు గంధాన్ని పూస్తారు. అది పుట్టే బిడ్డకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. గంధములో ఉండే సుగుణాలు మన శరీరంలోని కొన్ని రుగ్మతల నుంచి ఉపసమనం కలిగిస్తాయి. నుదిట గంధం ధారణ వల్ల మెదడు చల్లబడి కోపం, ఆవేశం, ఆక్రోశం లాంటి ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది. తలపైన గంధాన్ని పూయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది.

లలాట ప్రదేశంలో పూయడం వలన కనుబొమల మధ్య ఉండే జ్ఞాన తంత్రులకు అంటే (సైన్స్ పరంగా చూస్తే పిట్యూటరీ గ్రంథి) ప్రభావితమవుతాయి. దీనివల్ల సంకల్ప బలం సిద్ధిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయి. గంధాన్ని పూసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమమవుతుందని చెబుతారు. గంధ ధారణ వల్ల గలిగే ఆధ్యాత్మిక లాభాన్ని కఠోపనిషత్తు వివరించింది. అంతేకాదు చందన లేపం అన్నివిధాల ఆరోగ్యాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. శరీరంపై ఏర్పడే బొబ్బలు, గజ్జి, తామర లాంటి వ్యాధుల నుంచి గంధం ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అహంకార విసర్జన: చందనం చెట్టుకు పాములు చుట్టుకున్నప్పటికీ అది విషాన్ని ఆపాదించుకోకుండా తన సువాసనను ఎలా ఇస్తుందో, అలాగే మనసును మంచిగా ఉంచుకోవాలని ఇది గుర్తుచేస్తుంది.

షోడశోపచార పూజలో ఒక భాగం:
దేవునికి చేసే 16 రకాల ఉపచారాలలో (షోడశోపచారాలు) "గంధం" సమర్పించడం అత్యంత ముఖ్యమైనది. దేవుడి విగ్రహాలకు లేదా చిత్రపటాలకు గంధాన్ని సమర్పించడం ద్వారా దేవుని పట్ల మనకున్న భక్తిని, గౌరవాన్ని తెలియజేస్తాము.

ప్రశాంతత మరియు చల్లదనం:
గంధానికి సహజంగానే శరీరాన్ని, మనస్సును చల్లబరిచే నైజం ఉంటుంది. పూజ చేసేటప్పుడు దేవునికి గంధం పూయడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సులోని కోపం, అలజడి తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

సానుకూల శక్తి:గంధం నుంచి వచ్చే సువాసన ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, పవిత్రమైన మరియు సానుకూలమైన వాతావరణాన్ని నింపుతుంది. పూజలు, శుభకార్యాలలో గంధం ఉపయోగించడం వల్ల ఆ వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది. ఈ సువాసన మనస్సును పూజపై ఏకాగ్రత నిలిపేలా చేస్తుంది.

దైవిక అనుభూతి: గంధం ధరించడం వల్ల మనసు దైవంపై లగ్నం అవుతుంది. ఇది ధ్యానానికి, ఆధ్యాత్మిక భావనలకు సహాయపడుతుంది.

సంప్రదాయం: హిందూ సంప్రదాయంలో గంధానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవతలకు గంధం సమర్పించడం, భక్తులు నుదుట ధరించడం ఆచారంలో భాగం.

ఆజ్ఞా చక్రం ప్రేరణ:
పూజ పూర్తయిన తర్వాత గంధాన్ని నుదుటన (రెండు కనుబొమ్మల మధ్య) బొట్టుగా పెట్టుకుంటారు.
ఈ ప్రదేశంలో 'ఆజ్ఞాచక్రం' ఉంటుంది.ఇక్కడ గంధం పెట్టడం వల్ల నాడీ వ్యవస్థ చల్లబడి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

సాత్విక గుణానికి ప్రతీక:
హిందూ ధర్మంలో గంధాన్ని 'సాత్విక గుణానికి' (శాంతం, పవిత్రత) సంకేతంగా భావిస్తారు. మనలోని అహంకారాన్ని, కల్మషాలను కరిగించి పవిత్రమైన మనస్సుతో దేవుడిని పూజించాలని ఇది గుర్తుచేస్తుంది.

Bhramara Gitalu -భ్రమర గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  భ్రమరగీతలు అయ్యా! ఉద్ధవా! మేము నిన్ను తెలుసుకొన్నాము. నీవు కమలాలవంటి కన్నులుగల శ్రీకృష్ణుని నెచ్చ...