శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
బాణాసురుడు అనిరుద్ధుని నాగపాశబద్దుని జేయుట
శుభలక్షణాలతో కూడినవాడు, మన్మథ కుమారుడు, మాన్యుడు, ఆజానుబాహుడు, చెవులకు మకరకుండలాలు గలవాడు, కాంతిమంతుడు, సత్కీర్తిమంతుడు, పీతాంబరాలు ధరించినవాడును, కస్తూరి లేపనంగలవాడు, చంద్రునివలె కాంతిమంతుడు హారాలతో శోభిల్లేవాడు, కమలాలవంటి కన్నులుగలవాడు, యదుకుల తిలకుడు, తుమ్మెదలవంటి నల్లని ముంగురులు గలవాడు, నవమన్మథుడు, ప్రతాపోజ్జ్వలుడు, పాచికలాటలో కుశలుడు, సద్గుణసంపన్నుడు, మన్మథ మంత్రసిద్దుడు, పరిశుద్ధుడు, లోకప్రసిద్ధుడు, తన సౌందర్యంతో స్త్రీలను అడ్డగించేవాడు అయిన అనిరుద్ధుణ్ణి బాణుడు చూశాడు.
రాక్షసరాజైన బాణునికి కోపం అధికమై ఈ నరాధముణ్ణి 'బంధించండి, పట్టుకోండి, కొట్టండి' అని ఆజ్ఞాపించగా, ఆ రాక్షసభటులు సాటిలేని ఆయుధాల కాంతులు సూర్యతేజస్సును మాసిపోయేట్టు చేస్తుండగా, అనిరుద్దుణ్ణి బంధించడానికి దగ్గరికి వచ్చారు. అప్పుడు అనిరుద్ధుడు శక్తి బలం, ప్రావీణ్యం, దర్పం
అనిరుద్దుడు ప్రళయకాలరుద్రునివలె విజృంభించి ఇనుపగుదియను పట్టుకొని, మహోగ్రతతో భయంకరుడై రాక్షసులను ఎదిర్చి, తన ధైర్యసాహసాలను ప్రదర్శించాడు.
అనిరుద్దుని యుద్ధకౌశలానికి దానవసైనికుల పాదాలు, చేతులు, తలలు, మోకాళ్లు, పండ్లు, చెవులు, మెడలు, తొడలు, వీపులు, మూపులు చిన్నచిన్న ముక్కలుగా భూమినిండా చిందర వందరగా పడ్దాయి. అనిరుద్ధునితో యుద్ధం చేయలేక రాక్షస సైనికులు రణరంగం నుంచి దిక్కుతోచక పారిపోయారు.
ఈ విధంగా దానవసైన్యం చేవచచ్చి బాధతో భయంతో బెదరి చెదరి వచ్చి, బాణాసురుని మరుగు చొచ్చింది. బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్దునిపై దూకి భీకర యుద్ధం చేశాడు.
బాణుడు యుద్ధంలో విజృంభించి, యుద్దానికి సిద్ధపడ్డ అందగాడైన అనిరుద్దుణ్ణి తన బాణాలచేత కొట్టి నాగపాశంతో బంధించాడు
ఈ విధంగా అనిరుద్దుణ్ణి బంధించినందుకు ఉష దుఃఖంవల్ల మనస్సు కలతచెంది ఉండింది. అంతట
తీవ్రంగా గాలివీచడంచేత బాణాసురుని నీలవర్ణపతాకం వెంటనే అకారణంగా పెద్ద ధ్వనితో నేలపై కూలింది.
పతాకం పడటం చూచి బాణుడు సంతోషపడ్డాడు. శివుడు తనతో పల్కిన విధంగా జరుగుతుందనుకొని నిశ్చయించి యుద్ధం కోసం ఎదురు చూడసాగాడు.
ఓ రాజా! ద్వారకానగరంలో అనిరుద్దుని పోకా, జాడా యాదవులకు నాలుగు నెలలుగా తెలియదు. యాదవులందరును మిక్కిలి దుఃఖింపసాగారు.
No comments:
Post a Comment