Thursday, August 27, 2026

Shivudu Banuni Rakshimpa Srikrishnuni Stuthinchuta - శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శివుడు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట

బాణునిపై శివునికి దయ ఉంది. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి సమీపించి, ముకుళితహస్తుడై నమస్కరిస్తూ, పురుషసూక్తం పఠించి, ఇలా స్తుతించాడు.

ఓ కృష్ణా! నీవు బ్రహ్మస్వరూపుడివి; ప్రకాశమే స్వరూపంగా గలవాడివి, సమస్తవేద వేదాంతరహస్యాలు తెలిసినవాడివి, సమాన అధిక భేదాలు లేనివాడివి. అన్నింటా వ్యాపించినవాడివి అయిన నిన్ను నిర్మలాంతః కరణులు ఆకాశం(శూన్యం) వలె చూస్తారు. 

అంతే కాకుండ పంచోపనిషత్తులతో కూడిన నీ దేవతాపరశుభాకారాన్ని చూస్తారు. ఆ ఆకారదర్శనంలో బొడ్డులో ఆకాశాన్ని ముఖంలో అగ్నినీ, శిరస్సులో స్వర్గాన్నీ చెవుల్లో దిక్కుల్నీ కండ్లలో సూర్యుణ్ణీ, మనస్సులో చంద్రుణ్ణీ, కాళ్ళలో భూమినీ, జీవునిలో అహంభావాన్నీ కడుపులో సముద్రాల్నీ, రేతంలో నీటినీ, భుజాలలో ఇంద్రుణ్ణీ, వెండ్రుకలలో వృక్ష ఓషధీ సమూహాల్నీ తలవెండ్రుకలలో బ్రహ్మల్నీ జ్ఞానంలో సృష్టినీ, ప్రజాపతుల్నీ హృదయంలో ధర్మాన్నీ కలిగిన మహాపురుషుడవు. 

లోక సృష్టికొరకు మొక్కవోని కాంతిని దాచి సృష్టికోసం నీ అవతారంయొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్ము ప్రశంసించడానికి మేమెంతవాళ్లం? నీవు సమస్త చరాచర అచరసమూహానికి మూలకారకుడివి, అద్వితీయుడివి, పురాణపురుషుడివి, సమస్తసృష్టికి కారణమైనవాడివి, ప్రభుడివి.

సూర్యుడు మేఘాల సమూహంతో కప్పబడినవాడై అనేక రూపాలు కలిగినవాడయి అనేకరీతులలో కన్పించేటట్టు, నీ అఘటితఘటనాన్ని చేసే అభిప్రాయంలో త్రిగుణాతీతుడవు అయినప్పటికీ సత్త్వం మొదలైన గుణాలతో అనేకరూపాలు కలిగినవాడివై, సత్పురుషులకు చీకటిని తొలగించి, కాంతిని ఇస్తావు.

నీ మాయచే మోహం పొందినవాళ్లు, భార్య, పుత్రులు, గృహం, ఆస్తి మొదలైన సంసారరూపంలోని పాపమనే సముద్రంలోని సుడిగుండాలలో మునుగుతూ తేలుతున్నారు. నీ పవిత్రమైన రూపానుభవాన్ని పొందలేక, ఇంద్రియాధీనుడై నీ పాదపద్మాల్ని చేరేందుకు మార్గం తెలియని మూఢుడు, తనను తాను మోసం చేసుకొనేవాడు అవుతాడు.

ప్రతికూలబుద్ధితో - ఇష్టుడవైన నిన్ను అంగీకరింపక, ఇంద్రియప్రయోజనానుభవం పొందేందుకు అమృతం వదలి, విషం గ్రహించడమే కదా! ప్రపంచసృష్టికీ, పాలనకూ, లయకూ కారకుడివైన నీవు శాంతస్వభావం కలవాడవై, సజ్జనులకు భాగ్యం ఇచ్చేవాడివై, సమానాధికభావం లేనివాడివై ఉండుటచే నిన్ను నేను, బ్రహ్మయు, మునులును సేవిస్తున్నాము. ఇంకా

(పంచ+ఉపనిషత్తులు= నారాయణ, బ్రహ్మ , తైత్తిరీయ, గార్గ, వరాహ - ఉపనిషత్తులు.)

కృష్ణా! నీవు నాశరహితుడివి, అంతం లేనివాడివి, మొదలు, నడుమ, చివర (ఆదిమధ్యాంతాలు) లేనివాడివి. చ్యుతి లేనివాడివి, సమస్తాన్ని ధరించువాడివి. అంతటా నీవున్నావు అన్నీ నీలో వ్యాపించి ఉన్నాయి.

(వాసుదేవుని తత్త్వస్వరూపమిక్కడ చక్కగా చెప్పబడింది.)

అని శివుడు ప్రశంసిస్తే - కృష్ణుడు బాగా సంతోషించి చిరునవ్వుతో శంకరా! నీ మాట సత్యమే! నీకు ప్రియమైన వరం కోరుకో. దాన్నే ఇస్తాను. ఈ బాణుడు చంపదగ్గవాడు కాడు. ఎందుకంటే నాభక్తుడయిన ప్రహ్లాదునిమనుమడు. ప్రహ్లాదునివంశంలోని వారిని చంపనని వరమిచ్చాను. వీనిగర్వం అణచడానికి ప్రయత్నించాను - కనుక

బాణునిచేతులు నాలుగింటిని తప్ప మిగిలినవాటిల్ని ఖండించాను. నీ భక్తులలో మొదటివాడని పేరుపొంది ముసలితనం, మరణం లేకుండా జీవిస్తాడు.

ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహించాడు. పరమేశ్వరుండు పరమానందం పొందాడు. బాణుడు రణరంగమనే యజ్ఞవేదిక పై కృష్ణుడనే దేవుని సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధమనే మంటల్లో తన హస్తాలనే సమిధల్ని రక్తధారలనే నేతిధారలతో, హుంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడయ్యాడు. విజ్ఞానదీపం వెలిగింది. భుజగర్వం అనే చీకటి తొలగింది. ఎల్లప్పుడు పరమేశ్వరధ్యానంలో ఉన్న బాణుడు కృష్ణుడిచ్చిన వరంతో ఆనందించి, గోవిందుని పాదారవిందాలకు వందనం చేశాడు. తరువాత

ఉషానిరుద్ధ సహితుడై కృష్ణుడు ద్వారకాపురి కరుగుట







No comments:

Post a Comment