Tuesday, August 4, 2026

Vaishvadevam - వైశ్వదేవం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - వైశ్వదేవం

నారదా! పురశ్చర్యాప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించికూడా చెబుతాను విను. దేవయజ్ఞ - బ్రహ్మయజ్ఞ - భూతయజ్ఞ - పితృయజ్ఞ - మనుష్యయజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే ఛుల్లి(పొయ్యి), పేషణి, ఉపస్కరం, కండణి, ఉదకుంభం - ఆని పంచసూనాలు. 

పొయ్యిలోగానీ ఇనపపాత్రలోగానీ భూమిమీదగానీ కుండపెంకులో(మూకుడు వగైరా) గానీ వైశ్వదేవం చెయ్యరాదు. కుండంలో లేదా స్థండిలంలో(పాత్ర) చెయ్యాలి. చేతితోగానీ చేటతోగానీ చర్మనిర్మితులతోగానీ అగ్నిని విసరకూడదు. 

విప్రముఖంనుంచి అగ్నిపుట్టింది కనక నోటితో ఊదిమాత్రమే ప్రజ్వలింపజెయ్యాలి. చర్మపటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువువాత బడతాడు. కనక నోటితో ఊదటమే కర్మసిద్ధికి ఉపకారకం.

పళ్ళూ పాలూ పెరుగూ దుంపలూ కూరగాయలూ ఇత్యాదులతో వైశ్వదేవహోమం చెయ్యాలి. ఇవ్వి ఏవీ దొరక్కపోతే పుడకలూ ఆకులూ గడ్డీ - వీటితో చెయ్యవచ్చు. నేతిలో ముంచి హోమం చెయ్యాలి. నూనెగానీ ఉప్పుగానీ తగలకూడదు. పెరుగూ(పాయసాలు) పాలల్లోనైనా ముంచి చెయ్యవచ్చు. ఇవీ దొరక్కపోతే ఆయామంతత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని (దుంపలూ కూరలూ) హోమం చెయ్యాలి. 

ఎండిపోయినవీ నిలవున్నవీ (పర్యుషితం - చద్ది) చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే(ఉచ్చిష్టం) శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో (రూక్షాలు) హోమం చేస్తే దారిద్య్రం దాపురిస్తుంది. ఉప్పుగానీ నూనెగానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది.

నిప్పుల్ని బూడిదదులిపి మంటచేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. ఇలా వైశ్వదేవం చెయ్యకుండా భోజనం చేసిన బ్రాహ్మణ గృహము కాలసూత్ర నరకకూపంలో తలకిందుల్లా పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి - తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చాలి. 

ఈ వైశ్వదేవం కాకముందే భిక్షుకుడెవరైనా భిక్షార్ధియై గుమ్మంలోకి వస్తే  వైశ్వదేవంకోసమని కొన్నితీసి ప్రక్కనపెట్టి, భిక్షవేసి పంపించవచ్చు. వైశ్వదేవీకృతదోషాన్ని భిక్షుకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృతదోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు.

పక్వాన్నానికి యతి - బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణవ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం వెయ్యాలి. ఎలాగంటే - ఓ సురభీ! వైష్ణవీ! మాతా! విష్ణుపదస్థితా! నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు(సురభి) అనుగ్రహిస్తుంది.

గోశాలనుంచి తిరిగివచ్చి ఇంటివాకిట్లో కొంచెంసేపు - పాలు పితికినంతసేపు (గోదోహనకాలం) - నిలబడాలి. అతిథుల కోసం ఎదురుచూడటం. ఇంటికి వచ్చి అతిథి వట్టినే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగివెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుపోతాడు.

తల్లిదండ్రులూ సోదరులూ గురువూ బిడ్డలూ సేవకుడూ ఆశ్రితులూ అతిథులూ అభ్యాగతులూ అగ్నిదేవుడూ - వీరంతా గృహస్థుకి పోష్యులు(తాను పోషించవలసినవారు).

ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకుని మోహవిభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు - నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయాగఫలం లభిన్తుంది. పంచమహాయజ్ఞాలనూ చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు.

పంచ ప్రాణాగ్ని హోత్రం




Mantra Purashcharana - మంత్ర పురశ్చరణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మంత్ర పురశ్చరణ

నారదా! గాయత్రీ పురశ్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం అభీష్టదాయకం. పర్వతాగ్రం నదీతీరం బిల్వమూలం జలాశయం గోశాల దేవాలయం అశ్వత్థవృక్షం ఉద్యానవనం తులసితోట పుణ్యక్షేత్రం గురుసన్నిధి - ఇలా ఎక్కడైనాగానీ మనస్సు ఏకాగ్రంగా ఉండేచోట కూర్చుని ఈ పురశ్చరణ చేస్తే మంత్రఫలసిద్ధి కలుగుతుంది. 

ఏ మంత్రాన్నైనా పురశ్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయసహితంగా గాయత్రిని అయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదికమార్గాలు రెండూ ఉన్నాయి. రెండూ అనుష్ఠించవలసినవే. నారదా! గాయత్రీదేవి అంటే వేదమాత. ఆదిపరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరూ శైవులూ వైష్టవులూ అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు. కనక అందరూ శాక్తేయుల క్రిందే లెక్క.

ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనక ముందుగా ఆత్మశోధనకోసం మంత్రాన్ని మూడు లక్షలు జపించాలి. కనీసం ఒక లక్షసార్లయినా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోనిదే ఏ జపహోమాలు చేసినా వ్యర్థం. కనక ముందుగా దాన్ని సాధించాలి. 

తపస్సుతో శరీరాన్ని తపింపజెయ్యాలి. దేవతలనూ పితృదేవతలనూ తనియించాలి. తపస్సే స్వర్గసాధకం, మహత్వసంపాదకం, క్షత్రియుడు బాహుశక్తితో వైశ్య శూద్రులు ధనంతో బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదలనుంచి గట్టెక్కుతారు.

అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చెయ్యాలి. చాంద్రాయణాది నియమ నిష్ఠలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజెయ్యాలి. అంతశ్శుద్దిని సాధించాలి. అదే తపస్సు అంటే. 

నారదా! ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను. విను. ఆయాచితాన్నం, ఉంఛాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నమని నాలుగువిధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి నాలుగు భాగాలు చెయ్యాలి. ఒకభాగం బ్రాహ్మణులకూ ఒకభాగం గోవులకూ ఒకభాగం ఆతిధులకూ మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. 

కోడిగ్రుడ్డంత ముద్దలు ఎనిమిది గృహస్థ వానప్రస్థులకు గ్రాసప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. తొమ్మిదిసార్లు ఆరుసార్లు మూడుసార్లుగా ఈ సంప్రోక్షణలు చేనుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని తదిత్యాది ఋక్కుతో గాయత్రిని ఉచ్చరిన్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించేవారి ఇళ్ళనుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది ఆథమాన్నం. నరకహేతుపు. సరే - .

గాయత్రీ ఛందస్సులో అక్షరానికి లక్షచొప్పున ఇరవైనాల్గు లక్షలు మంత్రాన్ని పురశ్చరణ చెయ్యాలి, ఇరవైమూడు లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహంలాంటిది పురశ్చరణ లేని మంత్రం. ఎందుకూ పనికిరాదు.

కొన్ని రాశులూ కొన్ని నక్షత్రాలూ కొన్ని మాసాలూ కొన్ని తిథులూ కొన్ని వారాలూ పురశ్చరణకు పనికిరావు. వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుకూలంగా శుక్లపక్షంలో మంచిరోజున మంచి ముహూర్తాన ప్రారంభించి పురశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచన నాందీశ్రాద్దాలు యథావిధిగా చెయ్యాలి. విప్రులకు సంతర్పణ చెయ్యాలి. బట్టలు పెట్టాలి. 

అటుపైని గురువుల అనుమతితో ప్రత్యఙ్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి ప్రసిద్ధిపొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశి, కేదారం, మహాకాళం, నాసికం, త్య్రంబక మహాక్షేత్రం - ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. 

ప్రారంభించిన రోజునుంచి ముగించే రోజుదాకా ప్రతిరోజూ హెచ్చు తగ్గులు లేకుండా మంత్రజపం చెయ్యాలి. మునీశ్వరులైతే నిరంతరాయంగా చెయ్యాలిగానీ తక్కినవారు ఉదయంనుంచి మధ్యాహ్నం వరకూ చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థచింతనలతో గడపవచ్చు. 

అక్షరలక్షలుగా చేసే ఈ మంత్రపురశ్చరణలో దశాంశాన్ని హోమం చెయ్యాలి. పాలూ నెయ్యీ అన్నమూ తిలలూ పత్రపుష్పాలూ యవలూ హోమద్రవ్యాలు. దశాంశహోమం చేస్తేనేగానీ మంత్రసిద్ధి కలగదు.

చతుర్విధ పురుషార్థాలూ సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు మూడింటా గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నానతత్పరుడై జలమధ్యంలో నిలిచి మూడు లక్షలు జపించాలి. 

కామ్యకర్మగా చేసేట్టయితే కార్యం సిద్ధించేవరకూ మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతస్సంధ్యలో ప్రతిరోజూ సహస్రగాయత్రీజపం చెయ్యడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్యభోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 

ఆరునెలలుగానీ మూడునెలలుగానీ చేస్తే సంవత్పరాంతానికి ఫలితం కనపడితీరుతుంది. నేతితో లక్షపద్మాలు హోమం చేస్తే మోక్షం కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయాక ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధిక్షీరాలతో పాతికలక్షలు హోమం చేస్తే దానిఫలం అమోఘమనీ వర్ణనాతీతమనీ అష్టాంగయోగసిద్ధికి సరిసమానమనీ మహర్షుల అభిప్రాయం. 

శక్తుడో అశక్తుడో నియతాహారులై ఆరునెలలు జపిస్తే చాలు గురుభక్తిపరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణాన్నంతో గడిపేవాడు గాయత్రీజపానికి అర్హుడు. గంగాది పవిత్రనదీజలాలలో మునిగి శతమూ ఆ పవిత్రోదకాలను ఆచమించి శతమూ జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

చాంద్రాయణ వ్రతఫలం దక్కుతుంది. బ్రాహ్మణులూ క్షత్రియులూ సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకూ బ్రహ్మచారులకూ వానప్రస్థులకూ ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌతస్మార్తక్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణపాంది నిర్వహించాలి. (వినీ చదివీ చేసెయ్యకూడదు). భిక్షాన్నాన్నిమాత్రం ఎనిమిది ముద్దలు స్వయంగా భుజించవచ్చు.

వైశ్వదేవం




Saayam Dandhya - Evening twilight - సాయం సంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సాయం సంధ్య

సాయంసంధ్యవల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రౌతస్మార్తకర్మలకు సగర్భప్రాణాయామం, ధ్యానమాత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి.

ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గదా పద్మహస్త, గరుడవాహన రత్నవిభూషిత, క్వణన్మంజీరమేఖలాలంకృత, రత్నకిరీటధారిణి, తారహారావళీయుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధరకూడా. సచ్చిదానందరూపిణి, సామవేదస్వరూపిణి, ఆదిత్యపథగామిని, స్వర్లోకనివాసిని. 

సూర్యమండలంనుంచి వస్తున్న మహాదేవిని ఆవాహన చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యాసంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిష్టా - అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి. సంప్రోక్షించుకోవాలి. ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతస్సంధ్యలాగానే. 

గాయత్రీమంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతికోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రెండుకాళ్లూ సరిగా దగ్గరకు పెట్టుకుని నిలబడి సూర్య భగవానుడిని ధ్యానిస్తూ తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్ళల్లో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిత్యేత్యాది మంత్రంతో సూర్యోపస్థానం చెయ్యాలి. 

పీటమీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగమో. ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతస్పంధ్యలాగానే. వసిష్ఠుడు ఋషి. విష్ణురూప సరస్వతి దేవత. ఛందస్సు సరస్వతి. సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగః. సామవేదపురుష హిరణ్యగర్భ సరస్వతీ సంకృతి వృద్ధసంధ్యా ఉషసి నిమృజి - ప్రభృతులకు గాయత్రీమంత్రంతో తర్పణలు ఇవ్వాలి.

ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరం. వ్యాధినాశకం. మోక్షప్రదం. సదాచారాలలో సంధ్యావందనానికున్నంత ప్రాధాన్యం దేనికీ లేదు. గాయత్రీమాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది.

మంత్ర పురశ్చరణ




Brahma Yagnam Yajna - బ్రహ్మ యజ్ఞం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మ యజ్ఞం

నారదా! ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను తెలుసుకో. (మూడు) రెండుసార్లు ఆచమించి రెండుసార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు శిరస్సు నేత్రాలు నాసిక చెవులు హృదయం మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి.

రెండు దర్భలు కుడిచేత మూడు ఎడమచేత కొన్ని పీటకింద కొన్ని శిఖమీద కొన్ని పాదమూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వపాపక్షయకరాలు. సూత్రోక్త దేవతాప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహమ్‌ ఆని ఉదకం స్పృశించాలి. 

ముందుగా ముమ్మారు గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితమ్‌, యదంగ, అగ్విర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష పంథా అని పలకాలి. మఘవత్‌, ఇషేత్వోర్జ, అగ్న ఆయాహి, శంనో దేవీః, వృద్ధిరాదైచ్‌, పంచసంవత్సర, యమరస తజభన, అథాతో ధర్మజిజ్ఞాసా, అథాతో బ్రహ్మజిజ్ఞాసా, తచ్చంయో, బ్రహ్మణేనమః - ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. 

అనంతరం తర్పణలు చెయ్యాలి. ప్రజాపతి, బ్రహ్మ దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, ఆంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్తసముద్రాలు, నదులు, సప్తకులవర్యతాలు, పుణ్యక్రేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సరోనాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు - వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది. కనక తర్పణాలు వదలాలి.

ఇది భూతతర్పణం. ఆ తరవాత నివీతం చేసుకుని ఋషితర్పణం. శతర్చి - మాధ్యమ - గృత్సమదులకూ, విశ్వామిత్ర వామదేవ అత్రి భరద్వాజ వసిష్ఠ ప్రగాథ పావమాన్యులకూ అలాగే క్షుద్రసూక్త మహాసూక్తాలకూ సనక సనందన - సనాతన - సనత్కుమార - కపిల - ఆసురి - వోహలి - పంచశీర్షకులకూ తర్పణాలు ఇవ్వాలి.

తరవాత ప్రాచీనావీతిగా సుమంత జైమిని వైశంపాయన పైల మహాభాష్య మహాభారత ధర్మాచార్యులకూ బాహవి గార్గ్య గౌతమ శాకల బాభ్రవ్య మాండవ్య మాండూకేయ గార్గీ వాచక్రవీ బడబా ప్రాతిథేయికా సులభా మైత్రేయీ, కహోళ కౌశీతక మహాకౌశీతక భారద్వాజ పైంగ్య మహా పైంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతరేయ మహైతరేయ బాష్కల శాకల సుజాతవక్త్ర ఔదవాహి సౌజామి శౌనక ఆశ్వలాయన తర్పణలు చెయ్యాలి. 

ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరునా ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రికులై అపుత్రకులై మరణించినవారికందరికీ చెందుగాక, స్వీకరింతురుగాక అని వస్త్రనిపీడనోదకం విడిచిపెట్టాలి.

ఇలాగ విధ్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి, సర్వవేదవేదాంగపఠనఫలం దక్కుతుంది. అటుపైని వైశ్వదేవం నిత్యశ్రాద్ధం చెయ్యాలి. అతిథులకు అన్నదానంకూడా నిత్యమూ చెయ్యాలి. గోవులకు గడ్డివేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దినపంచమభాగంలో హాయిగా సుష్టుగా భోజనం చెయ్యాలి. 

ఇతిహాస పురాణాలతో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటికాకాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య. అటుపైని సాయంసంధ్య వార్చాలి.

సాయం సంధ్య




Madhyaahna Sandhya - Afternoon twilight - మధ్యాహ్నసంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మధ్యాహ్నసంధ్య

ప్రాతస్సంధ్యోపాస్తి, అది అయ్యాక దేవీపూజ - చెప్పానుగదా! ఇప్పుడింక మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతాను ఆలకించు. ఇది అపూర్వమూ అత్యుత్తమమూ అయిన ఫలాలను ఇస్తుంది.

మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, అక్షమాలాధారిణి, త్రిశూల ధారిణి, 
వరద, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్యమార్గ సంచారకర్త్రి, మాయామయి. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యానశ్లోకం పఠించాలి. 

ప్రాతస్సంధ్యలో లాగానే ఆచమనాదికం చెయ్యాలి. అటు పైని అర్ఘ్య ప్రదానం పువ్వులతో చెయ్యాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్ళల్లో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమమంతా ప్రాతస్సంధ్యలాగానే. 

కొందరిక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారుగానీ అది సంప్రదాయం కాదు. అసంప్రదాయం హానికరం. కనక ఉభయ సంధ్యల్లోనూ ఓంకారసహితమైన గాయత్రీ మంత్రంతోనే నీరు జల్లాలి. ఆకృష్ణేన - ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వదుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యాసాఫల్యదాయకం. మందేహరాక్షస వినాశకం. 

ఆ తరవాత గాయత్రీమంత్రంతోనే యజుర్వేదపురుష హిరణ్యగర్భాదులకు తర్పణాలు విడిచి పెట్టాలి. ఉదుత్యమిత్యాది మంత్రాలతో సూర్యోపస్థానం చెయ్యాలి. అటుపైని గాయత్రీమంత్రజపం. 

దీనికీ మూడుపూటలకూ మూడు పద్ధతులున్నాయి. ప్రాతఃకాలంలో చేతులు పైకి త్రిప్పి, సాయంకాలంలో క్రిందికి త్రిప్పి మధ్యాహ్నసమయంలో గుండెల పై ఆన్చి గాయత్రిని జపించాలి.

గాయత్రీమంత్ర జప పరిగణనకుకూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య గణువుతో మొదలుపెట్టి చిటికెనవేలు గణుపులుమీదుగా చూపుడు వేలు మూలంవరకూ పదిగణుపులవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు.

ఇలా పదిసార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కణుపుదగ్గర (పైనుండే కణుపు) ఆపేస్తే ఎనిమిది. మొత్తం ఆష్టోత్తరశతగాయత్రి. రోజూ సహస్రగాయత్రి చేస్తే విశేషఫలితాలుంటాయి. గోహత్య పితృహత్య మాతృహత్య భ్రూణహత్య గురుపత్నీసంగమం బ్రహ్మహత్య సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. 

మానసిక వాచిక కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రీ మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. నాలుగువేదాలూ చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమమాత్రమే అవుతుంది. వేదావృత్తికన్నా గాయత్రీజపం ఉత్తమోత్తమం.

బ్రహ్మ యజ్ఞం




devimahima - bruhadradhudi puurvajanma sruthi - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

నారదా! ఇక్కడ నీకొక కథ చెప్పాలి విను. పూర్వం హిమాలయపర్యతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ఆకాశమార్గాన ఆయాదేశాలపై ఎగురుతూ వచ్చి వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారబ్ధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో పడిఉన్న మెతుకుల్ని ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తరవాత అక్కడినుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది.

కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్యరూపం దరించి రెండు కల్పాలపాటు దివ్యభోగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియవంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రథుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషక్తుడయ్యాడు. 

అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్దించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిగా జితేంద్రియుడుగా ధార్మికుడుగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మస్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. 

మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహద్రథుడు భక్తిశ్రద్ధలతో అతిథిమర్యాదలు జరిపాడు. కుశలప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఎమిటో చెప్పారు.

మహారాజా! నీకు పూర్వజన్మస్మృతి ఉంది. త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్యవిశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి? తెలుసుకుందామని వచ్చాం. కాకపోతే, చెప్పదగినదే అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపజెయ్యి.

మునీంద్రులారా! ఇందులో రహస్యమేమీలేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాకపక్షిని. అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు. అయినా అమోఘఫలం దక్కింది. ఆ పుణ్యవిశేషం వల్ల స్వర్గసుఖాలు రెండు కల్పాలపాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజునూ సార్వభౌముడనూ అయ్యాను.

పూర్వజన్మ స్మృతితోపాటు భూత భవిష్యద్వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనందబాష్పాలు జాలువారతాయి. 

జగన్మాతను ఉపాసించనివారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మరిచిపోయిన కృతఘ్నులు. పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్యవిధులు కావు. పరాదేవతోపాసన ఒక్కటే నిత్యమనీ సత్యమనీ శ్రుతి చెబుతోంది. మీవంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంభోజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణంగానీ సగుణంగానీ ఏదీ లేదు.

బృహద్రథుడి సమాధానం మునిశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనందబాష్పాలు ఒత్తుకొంటూ తమతమ ఆశ్రమాలకు తిరిగివెళ్ళారు.

నారదా! ఇంతటి ప్రభావం కలది దేవీపూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజపట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకుని ఉండాలి.

మధ్యాహ్నసంధ్య




Worship of Mahadevi - మహాదేవీ సమర్చన

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మహాదేవీ సమర్చన

దేవిపూజావిధానం సమగ్రంగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణమహర్షి ఆరంభించాడు. 

శ్రీమాతృపూజ భుక్తిముక్తిప్రదం. సమస్త ఆపదలనూ తొలగిస్తుంది. సకల భోగభాగ్యాలనూ కలిగిస్తుంది. నారదా! మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకుని భూతశుద్ధ్యాదికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగన్యాసం చెయ్యాలి. సామాన్యా ప్రదానాదికంతో శంఖస్థాపన చెయ్యాలి.

పూజాద్రవ్యాలను మంత్రోదకాలతో సంపప్రోక్షించాలి. గురువు అనుమతిపాంది పూజకు ఉపక్రమించాలి. పీఠపూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యుపచారాలు సమర్పించి పంచామృతరసాదులతో స్నానం చేయించాలి. 

పౌండ్రేక్షురసపూర్ణాలైన శతకుంభాలతో స్నానం చేయించినవాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణంచేస్తూ చూతఫల రసంతోగానీ చెఱకు పానకంతోగానీ (ఇక్షురసం) అమ్మవారిని స్నానం చేయించినవారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది.

ద్రాక్షాఫలరస స్నానం చేయించినవారు రసబిందువులన్ని సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగురు కాశ్మీర కస్తూరీ సమ్మిశ్రితమైన జలాలతో వేదమంత్రపూర్వకంగా జగదీశ్వరిని స్నానం చేయించినవారికి నూరు జన్మల పాపాలు భస్మీపటలమై పోతాయి. 

క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతంవరకూ క్షీరసాగరమధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో తేనెతో నెయ్యితో పంచదార పానకంతో అభిషేకించినవారు ఆయా ద్రవ్యాలకూ ద్రవ్యప్రవాహాలకూ అధిపతులవుతారు.

భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటు పైని కాశ్మీర చందనం ఇచ్చి, కస్తూరి బొట్టు దిద్ది, సీమంతంలో సిందూరం సింగారించి, పాదాలకు లత్తుకను అలంకరించినవాడు ఇంద్రపదవిని ఆధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసినవాడు కైలాసం చేరుకుంటాడు.

బిల్వపత్రాలతో పూజచేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడా ఏ దుఃఖమూ ఉండదు. బిల్వపత్ర దళాలమీద రక్తచందనంతో మాయాబీజాక్షర త్రయాన్ని సుస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థ్యంతంగా పలికి నమః అంటూ (ఓం మహాదేవ్యై నమః. హ్రీం జగదీశ్వర్యై నమః - ఇత్యాదిగా) బిల్వపత్రాలను అమ్మవారి పాదాలచెంత ఉంచాలి. 

ఇలా బిల్వపత్రార్చన చేసినవారికి మనుత్వం లభిస్తుంది. లేతదళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసినవాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుందపుష్పార్చన చేస్తే ప్రాజాపత్యం దక్కుతుంది. కోటిసంఖ్యలో మల్లికా మాలతీపుష్పాలను సుంగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజచేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మత్వం లభిస్తాయి. 

ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారందరూ ఇలా అర్చించివవారే. జపా - బంధూక - దాడిమీ కుసుమాలుకూడా ఇలాగే అనంతపుణ్య ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లొ దొరికే పువ్వులతో సంవత్సరం పాడువువా అమ్మవారికి సహస్రనామార్చవ చేస్తే సర్వమహాపాతక - ఉప పాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది.

దేహాంతంలో శ్రీదేవీపదసన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతానాయకులకుకూడా దుర్లభమైన పదవి. కృష్ణాగురు కర్పూర చందన సిల్హిక ఆజ్య గుగ్గులు సమన్వితంగా ధూపంవేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలనూ తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూరఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోకనివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన సహస్రదీపార్చన కోటి దీపార్చనలు చేసినవారికీ ఇదే పుణ్యఫలం దక్కుతుంది.

అమ్మవారి ఎట్టయెదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్యచోష్య పేయాలతో రకరకాల పిండివంటలతో రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదన చెయ్యాలి. అమ్మవారు తృప్తి చెందితే జగృత్త్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జువునందు సర్పత్వంలాగా జగత్త్రయమూ అమ్మవారే కనక.

నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తర్వాత కర్పూరతాంబూలం ఇవ్వాలి. ఏలకులూ లవంగాలూ వక్కపొడి ఇత్యాదులతో లేతతములపాకులు మడిచి ముఖసౌంగంధ్యవర్థకంగా అందివ్వాలి. అటు పైని మృదంగ వీణాది వాద్యాలతో మనోహరగానాలతో వేదపారాయణలతో పురాణపఠనలతో స్తోత్రపాఠాలతో జగన్మాతను అలరించాలి.

రెండేసి ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలు అన్నీ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలూ నిత్యమూ భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికీ అనుగ్రహానికీ అవధులు ఉంటాయా!

ఆవిడ జగన్మాత కనక పుత్రులపట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చనచేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా!

దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి




Sri Krishnudu Gopakantala Chentaku Nuddhavuni Bamputa - శ్రీ కృష్ణుడు గోపకాంతల చెంతకు నుద్ధవుని బంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీ కృష్ణుడు గోపకాంతల చెంతకు నుద్ధవుని బంపుట ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఇలా తలపోశాడు. వ్రేపల్ల...