Thursday, April 30, 2026

Narasimha Jayanti - నరసింహ (నృసింహ)జయంతి

నరసింహ (నృసింహ)జయంతి

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని నాల్గవ అవతారమే నరసింహ స్వామి అవతారం. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. ఈ రోజున విష్ణుమూర్తి నరసింహావతారం దాల్చి హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఈ రోజును నరసింహ జయంతిగా జరుపుకొంటారు.

నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, ప్రధానమైన అవతారం. నరసింహస్వామి శరీర సగ భాగం మనిషి, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి వరం కారణంగా స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి.

పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్ధం హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణువు తో వైరం పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు 
బ్రహ్మను గూర్చి తీవ్ర తపమొనర్చి చావులేని వరం పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు. దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు.

ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య కయధు మగపిల్లవాడు ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమే అంటలేదు. అతడు పూర్తిగా విష్ణు భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు. ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు. తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణువు రక్షిస్తు ఉండేవాడు.

ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్నమాత్రంతొ క్రుద్ధుడై తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. 

ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని శలవిస్తాడు ప్రహ్లాదుడు.

దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనయి ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు. అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పరుండబెట్టి ఆయన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. 

ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈ రోజున నా నామసంకీర్తనతో ఉపవసించి ఉంటారో వారి సమస్యలు, బాధలు తొలగిపోతాయి అని శలవిస్తారు. కావున ఈ రోజును మనం అందరం నరసింహజయంతిగా జరుపుకుంటున్నాము.

ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తి తో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు.

నరసింహా అవతారం

Wednesday, April 29, 2026

Sri Lakshmi Narasimha Swamy Temple - Antarvedi - శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం - అంతర్వేది

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం - అంతర్వేది

అంతర్వేది క్షేత్రం
కోనసీమ బంగాళాఖాతానికి అంచున ఉన్న అంతర్వేది పుణ్యక్షేత్రం మరియు ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి. పశ్చిమ గోదావరి నుంచి నరసాపురం, తూర్పు గోదావరి నుంచి రాజోలు, మలికిపురం మార్గాల ద్వారా భక్తులు అక్కడ చేరతారు. సాగరం, నది కలిసే అద్భుత దృశ్యం ఇక్కడి ప్రత్యేకత.

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోనసీమ జిల్లా, సఖినేటిపల్లె మండలం లోని అంతర్వేది అనే ఆలయ పట్టణంలో ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. 

ఇది శాలి వాహన శక సంవత్సరములు [1745] క్రీ .శ 1823 (chala gap)లో అగ్ని కుల క్షత్రియులు కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిచే (పల్లవ వంశం) నిర్మించబడింది. ఈ ఆలయం కోనసీమ జిల్లాలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది. 

హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠుడు మహర్షి ఈ నదిని తీసుకువచ్చాడని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ట నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. 

ఇది నర్సాపూర్‌కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం  ప్రత్యేకత కారణంగా సంవత్సరం పొడవునా భక్తులు దర్శించుకుంటారు. బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం, నది సంగమించే ప్రదేశాన్ని "సాగర సంగమ ప్రదేశం" అని అంటారు. దీనిని స్థానికులు "అన్నా చెల్లి గట్టు" అని కూడా పిలుస్తారు. 

ఈ ప్రాంతంలోని నీరు తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల భక్తులు దీనిని ప్రసాదం రూపంలో సేవిస్తారు. పురాణాల ప్రకారం, క్షీర సాగర మథనం, త్రేతాయుగం ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా ఫాల్గుణ మాసం (జనవరి)లో, ఫాల్గుణ మాసం (మార్చి)లో జరిగే డోలేపౌర్ణమి వేడుకలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి వస్తారు. 

ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని, అందుకే దీనిని "ముక్తి క్షేత్రం" అని కూడా అంటారు.

స్థల పురాణం
వశిష్ట మహర్షి ఆశ్రమానికి తగిన స్థలంగా ఈ క్షేత్రాన్ని ఎంపిక చేశారు. రత్నలోచనుడు చేసిన కిరాతకృత్యాలు వశిష్టుని బాధించడంతో, శ్రీమహావిష్ణువు నరసింహవతారం తీసుకొని రత్నలోచనుని సంహరించారు. ఆ తర్వాత రక్తధార అశ్వరూఢాంబికను స్థానికులు “గుర్రాలక్క” అని పిలుస్తారు.

ఆలయ చరిత్ర
పురాణాల ప్రకారం, సృష్టికర్త బ్రహ్మ  శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని "రుద్రయాగం" నిర్వహించటానికి ఈ స్థలంలో "వేదిక" ని సిద్ధం చేసాడు. అందుకే దీనికి "అంతర్వేది" అని పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. దీనికి ముందు, వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి, దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు. 

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ట నది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరించాడు. భగవంతుడు రక్తవిలోచనుని తపస్సుకు సంతోషించి అతనికి వరం అనుగ్రహించాడు. రక్తవిలోచనకు చాలా అసాధారణమైన కోరిక ఉంది - యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్తపు బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య, తనంత బలం, శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని, వారు తనకు సహాయం చేసేవిధంగా వరం కోరతాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. 

ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙపై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరించాడు. తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ట మహర్షి, తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు.

ప్రహ్లాద వరదం విష్ణుం నృసింహం పరదైవతం.
శరణం సర్వలోకానామాపన్నారతి నివారణం.

వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనంపై నృసింహ రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నృసింహ స్వామి సుదర్శనంను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నృసింహ స్వామి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు.

ఈ రక్తావలోచనుని సంహరించిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నృసింహ స్వామి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య నదిలోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధంను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

కలియుగంలో వశిష్టుడు తర్వాత, కేశవదాసు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. 1822లో ఆయన కుమారుడు కోపనాతి కృష్ణమ్మ ఆలయం పూర్తి చేశారు. 1844లో బ్రిటిష్ పాలకులు ఆలయం ధర్మకర్తృత్వాన్ని మొగల్తూరు రాజులకు అప్పగించారు. వంశపారంపర్యంగా వారి కుటుంబీకులు నిత్యకైంకర్యం చేస్తున్నారు.

శిలా శాసనము ప్రకారం 
శ్రీయుతుడైనా శ్రీ కొప్పనాతి అది నారాయణ అంతర్వేది క్షేత్ర స్వామియైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము, ప్రాకార విమాన మండపాదులు కొన్ని కట్టించి , భగవదర్పణ బుద్దితో, తానారంభించిన నిర్మాణ కార్యమును కృష్ణమ్మ దివ్యమై, భవ్యమైన మహామహిమ యొప్పనట్లుగా శాలి వాహన శక సంవత్సరములు [1745] క్రీ .శ 1823, స్వభాను నామ సంవత్సరాధిక చైత్ర కృష్ణ దశమి భాను వాసరము నాటికీ పూర్తి చేయించ నిష్కళంకమైన భక్తి గల్గిన సజ్జనులు మెచ్చుకొనునట్లుగా, నిర్మించి తరించాడు.

ఆలయ ప్రాముఖ్యత
అంతర్వేది ఆలయం నది, సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనిని ద్వీప దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం మరొక ప్రత్యేకత, ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు భిన్నంగా తూర్పు వైపుకు కాకుండా పశ్చిమం వైపుగా చూస్తుంటుంది. 

ఈ ఆలయం పదిహేనవ లేదా పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రధాన దైవం విష్ణువు దశావతారాలలో ఒకటి అయిన శ్రీలక్ష్మీ నృశింహ స్వామి అవతారం. అంతర్వేది ఆలయ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది. "గర్భగుడి" పై ఎత్తైన అయిదు అంతస్తుల "విమానం గోపురం" ఉంది.

ఆలయ ప్రవేశ ద్వారం 
ఇరువైపులా గరుడ హనుమ విగ్రహం లు దర్శనమిస్తాయి.ఆలయ గర్భగుడి పైకప్పుపై శ్రీకృష్ణుని విగ్రహం "వటపత్ర సాయి" రూపంలో ఉంటుంది. ఈ విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ వీక్షించవచ్చు.

ఆలయానికి తూర్పు వైపున, గోడలో రాజ్యలక్ష్మి దేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఉత్తరాన భూదేవి, రంగనాధ స్వామి ఉన్నారు. సంతాన గోపాల స్వామి, కేశవ స్వామి గోడకు పశ్చిమాన చివరగా దక్షిణం వైపున ఆచార్యులు, ఆళ్వార్ల సన్నిధి (చిన్న దేవాలయాలు), చతుర్భుజ (నాలుగు చేతులతో) ఆంజనేయుడు విగ్రహాలు ఉన్నాయి. 

ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి. నీలకంఠేశ్వర (శివుడు) దేవాలయం కూడా ఉంది, ఇది గోదావరి ఒడ్డుకు దాదాపు సమీపంలో ఉంది, దీనిని వశిష్ట గోదావరి అని కూడా పిలుస్తారు. 

ఈ దేవతను శ్రీ రాముడు ప్రతిష్ఠించాడని, బ్రహ్మ స్వయంగా పూజించాడని నమ్ముతారు. ఈ ప్రదేశాలలో స్నానాలు చేసి దానధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మ ఉండదనే నమ్మకంతో భక్తులు వస్తారు. గయలో, గంగా నది తీరాలలో జరిగే వేడుకల మాదిరిగా పూర్వీకులకు జప తర్పణాలు విడుస్తారు.

ముఖ్యమైన ప్రదేశాలు
సముద్రతీరం:
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది.

అన్న చెళ్ళెళ్ళ గట్టు : సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత

వశిష్ట నది: అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రతీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది.

రక్తకుల్య నది: మహా విష్ణువు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరించిన రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా మాయాశక్తి తో రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడి దురాలోచనకు అడ్డుకట్ట వేసాడు.

చక్రతీర్థం: చక్రతీర్థ రాక్షసులందరినీ సంహరించిన తర్వాత భగవంతుడు తన చక్రాయుధాన్ని కడిగిన ప్రదేశం.

వశిష్టాశ్రమం:అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రతీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కలువపూవు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతమైన కట్టడం. దీనికి సమీపంగా ద్యానమందిరం, పఠశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడాలు ఉన్నాయి.

గుర్రాలక్క: నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం దేవాలయానికి ఒక కిలోమీటరు దూరములో ఉంది. మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని, అందుకే దీనిని 'అశ్వారూఢంబ' లేదా 'గుర్రాలక్క' అని పిలుస్తారు.

లైట్ హౌస్: దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా 
బ్రిటిష్ పాలకుల కాలంలో లైట్ హౌస్ నిర్మించారు.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతాలలోనూ, అంతర్వేది గ్రామంలోనూ, సముద్రతీరానికి వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి.


ప్రత్యేక విశేషాలు
బంగాళాఖాతం ఒడ్డున నిలిచిన నరసింహుడు ప్రజలను తుపానులు, సునామీల నుండి రక్షిస్తాడనేది భక్తుల విశ్వాసం. భీష్మ ఏకాదశి నాటి పర్వదినంలో, సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకుతాయి. ఆలయం వెనుక నదీ తీరంలో గల శిలలు సాలగ్రామాలుగా పూజలు పొందుతాయి.

రోడ్డు మార్గం: 
రాజమండ్రి నుండి (సుమారు 100 కి.మీ.): మార్గం పట్టుకొని మోరి చేరి అక్కడి నుండి అంతర్వేది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం నుండి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం: సమీప ప్రధాన రైల్వే స్టేషన్లు: రాజమండ్రి (సుమారు 100 కి.మీ.), కాకినాడ టౌన్ (సుమారు 90 కి.మీ.)

విమాన మార్గం: సమీప విమానాశ్రయం: రాజమండ్రి ఎయిర్.పోర్ట్ (మధురపూడి ఎయిర్.పోర్ట్), సుమారు 110 కి.మీ. దూరంలో.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Tuesday, April 28, 2026

Description of the five forms of Durga - దుర్గాదిపంచరూపవివరణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుర్గాదిపంచరూపవివరణ

శ్రీకృష్ణుణ్ణి అవతరింపజెయ్యడంకోసం లోకజనని అయిదు రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికీ మళ్ళీ అనేకభేదాలు ఉన్నాయి. భక్తుల్ని అనుగ్రహించడంకోసం వారి అభ్యర్థనలమేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది. వాటిలో మొదటి రూపం శివప్రియ, గణేశమాత, దుర్గ, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణబ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్ఠాత్రి, శర్వరూప, సనాతని, ధర్మసత్య, పుణ్యకీర్తి, యశోమంగళదాయిని, సుఖమోక్ష హర్షదాత్రి, శోకార్తిదుఃఖనాశిని, శరణాగతదినార్తపరిత్రాణపరాయణ, తేజఃస్వరూప, సర్వశక్తిస్వరూప, సిద్దేశ్వరి, సిద్దిరూప, సిద్ధిద, బుద్ది, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ - ఇత్యాది రూప నామభేదాలతో కీర్షింపబడుతోంది.

ఇక రెండవది శుద్ధసత్త్వస్వరూప. మహాలక్ష్మి సర్వసంపత్స్వరూప, సంపదధిష్ఠాత్రి. పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోభమోహకామరోషమదాహంకార వివర్జిత, భక్తానురక్త, పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ప్రేమపాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయరూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతిసేవాతత్పరయై నివసిస్తూ ఉంటుంది. సర్వప్రాణికోటిలోనూ శోభారూపంగా ఉంటుంది, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజుల్లో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతూంటుంది. పుణ్మాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభారూప, వైశ్యులకు వాణిజ్యరూప, పాపాత్ములకు కలహాంకురరూప, వేదాలలో హయరూపగా వర్ణింపబడింది. సర్వపూజ్య, సర్వవంద్య.

ఇక మూడవది వాగ్బుద్ధి విద్యాజ్ఞానాదిష్ఠాత్రియైన సరస్వతి, సర్వవిద్యాస్వరూప, బుద్ధి, కవిత, మేద, ప్రతిభ, స్మృతి - ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడ దయవల్లనే కలుగుతున్నాయి. సిద్ధాంత బేదాలు, అర్థబేదాలూ కలిగించేది ఈ తల్లియే. వ్యాఖ్యాస్వరూపిణి. బోదస్వరూపిణి,  సర్వసందేహభంజిని, విచారకారిణి, గ్రందకారిణి, శక్తిరూపిణి, సర్వసంగీత సంధాన తాళకారణరూపిణి, విషయజ్ఞానవాగ్రూప, ప్రతివిశ్వోపజీవని, వ్యాఖ్యావాదకరీ, శాంత, వీణా పుస్తక ధారిణి, శుద్దసత్త్వస్వరూప, సుశీల, శ్రీ హరిప్రియ, హిమ - చందన - కుంద - ఇందు - కుముద - అంభోజ సన్నిభ, రత్నాజపమాలికతో శ్రీకృష్ణుణ్ణి ధ్యానించే తపఃస్వరూపిణి, తపఃఫలప్రద, సిద్దివిద్యాస్వరూప, సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మూగవారవుతారు. మృతప్రాయులవుతారు,

ఇక నాల్గవది చతుర్వర్ణాలకూ చతుర్వేదాలకూ వేదాంగాలకూ అధిష్ఠానదేవత, సంధ్యావందన మంత్రతంత్రస్వరూపిణి, ద్విజాతిజాతిరూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్యతేజోరూప, సర్వసంస్కారరూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ, ఆత్మశుద్ధికోసం సకలతీర్థాలూ ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ ఉంటాయి. శుద్దస్ఫటికవర్ణ, శుద్దసర్వస్వరూపిణి, పరమానందరూప, పరమ సనాతని.

పరబ్రహ్మస్వరూపిణి. నిర్వాణప్రదాయిని. బ్రహ్మతేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూతమవుతోంది. ఇక అయిదవ రూపాన్ని వర్ణిస్తున్నాను నారదా ! ఆలకించు.

అయిదవది - పంచప్రాణాలకూ అధిష్ఠానదేవత. పంచప్రాణస్వరూపిణి, ప్రాణాధికప్రియతమ అందరికన్నా అందగత్తె, సౌాభాగ్యమానిని, గౌరవాన్విత, వామాంగార్దస్వరూప, తేజోగుణసమన్విత, పరాపర, సారభూత, పరమ, ఆద్య, సనాతని, పరమానందరూప, ధన్య, మాన్య, పూజ్య, శ్రీకృష్ణుడికి రాసక్రీడాధిదేవి, రాసమండల సంభూత, రాసమండలమండిత, రాసేశ్వరి, సురసిక, రాసావాస నివాసిని, గోలోకవాసిని, గోపీవేషవిధాయిక, పరమాహ్లాదరూప, సంతోషహర్షరూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, ఆత్మస్వరూపిణి, నిరీహ, నిరహంకార, భక్తానుగ్రహవిగ్రహ, విచక్షణులు వేదానుసారిజ్ఞానంతో ఈవిడను తెలుసుకుంటారు. సురేంద్రమునీంద్రాదులయినా ఈవిడను చర్మచక్షువులతో చూడలేరు. వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది. నానాలంకారవిభూషిత, కోటిచంద్రప్రభ, పుష్టసర్వశ్రీయుక్తవిగ్రహ, శ్రీకృష్ణుడిపట్ల భక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వరాహావతారంలో ఈవిడ వృషభానుడి కూతురుగా జన్మించింది. ఈవిడ పాదస్పర్శతో వసుంధర అంతా పావనమయ్యింది. శ్రీకృష్ణుడి వక్షఃస్థలంలో స్త్రీరత్నమై విరాజిల్లి నీలమేఘావృతమైన ఆకాశంలో మెరుపుతీగలా భాసించింది.

ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శనభాగ్యం భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈ రాధ - దేవీపంచమరూపం.

నారదా ! సృష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం కళారూపంగానో కాలరూపంగావో అంశరూపంగానో కళాంశాంశాంశరూపంగానో ఉంటూనే ఉంటుంది. స్త్రీలందరూ దేవిస్వరూపాలే, పరిపూర్ణస్వరూపాలు మాత్రం ఈ అయిదే. ప్రధానాంశ రూపిణులు కొందరున్నారు. వారి గురించి కూడా చెబుతాను, తెలుసుకో.

గంగాది ప్రధానాంశస్వరూపిణులు


Monday, April 27, 2026

SRI DEVI BHAGAVATHAM PART 9 - శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము

శౌనకాది మహామునులారా ! వ్యాసభగవానుడు నాకు చెప్పిన నారద-నారాయణ సంవాదరూపమైన
దేవీ ప్రకృతిస్వరూపారాధనను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి, అంటూ సూతుడు మళ్లీ ఉపక్రమించాడు.

నారాయణుడు నారుదుడితో చెబుతున్నాడు - విరించితనయా ! గణేశజననియైన దుర్గ, రాధ,
లక్ష్మి, సరస్వతి, సావిత్రి - అని ప్రకృతిస్వరూపిణికి అయిదు రూప నామధేయాలున్నాయి.

నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి చాలా సందేహాలు కలిగాయి. వినయంగా
అడిగాడు. నారాయణ మహర్షీ! ఆదిపరాశక్తి ఆ రూపాలను ఎందుకు ధరించింది ? ఎలా ధరించింది?
వాటి లక్షణాలు ఏమిటి ? చరిత్ర ఏమిటి ? గుణగణాలు ఏమిటి ? పూజావిధానాలు ఎమిటి ? ఆయా
అవతారాలు ఎక్కడ ధరించింది ? ఈ విశేషాలు అన్నీ వ్యాఖ్యానసహితంగా తెలియజెయ్యి అని ప్రార్థించాడు. నారాయణమహర్షి వివరంగా తెలియజేశాడు.

ప్రకృతి నిర్వచనం










Definition of nature - ప్రకృతి నిర్వచనం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ప్రకృతి నిర్వచనం

వత్సా ! నారదా ! ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. అయినా అడిగావు కనక నేను విన్నంత, తెలుసుకున్నంత నీకు తెలియజెప్పుతాను. ఆలకించు. ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ. ప్రకృష్టవాచకం. కృతి అనేది సృష్టివాచకం. ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనక ఆ దేవి ప్రకృతి అని కీర్తింపబడుతోంది.

గుణాలలోకెల్లా ఉత్తమోత్తమమైనది సత్వగుణం. దానికి సూచకం ప్రశబ్దం. మధ్యమ రజోగుణానికి కృశబ్దం, చివరి తమోగుణానికి తిశబ్దమూ వాచకాలు. త్రిగుణాత్మకస్వరూపిణి కనక, సృష్టికి ప్రధానకారణం కనుక ఆదిపరాశక్తిని ప్రకృతి ఆంటున్నారు. కృతిశబ్దం సృష్టివాచకం. దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం. అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనక ప్రకృతి అని స్తుతింపబడుతోంది.

ఆ ప్రకృతిస్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను (ఆత్మ) రెండుగా విభజించుకుంటుంది. కుడిభాగం పురుషుడుగా. ఎడమభాగం స్త్రీగా (ప్రకృతిగా) రూపు ధరిస్తుంది, అందుకనే యోగీంద్రుల దృష్టిలో స్త్రీ పురుషభేదం ఉండదు. అంతా బ్రహ్మమమయే. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప. నిత్య. సనాతని. ఆత్మ అన్నా శక్తి అన్నా రెండింటికి భేదం లేదు. అగ్నినీ వేడిమినీ ఎలా విడదీయలేమో అలాగే అత్మశక్తుల్ని విడదీయలేము.

దుర్గాదిపంచరూపవివరణ


Goddess worship - Tithivaras, offerings, fruits - దేవీపూజ - తిథివారాలు, నైవేద్యాలు, ఫలాలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - దేవీపూజ - తిథివారాలు, నైవేద్యాలు, ఫలాలు

నారదా! విద్యావిశారదా! చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు. చెబుతాను. ఏకాగ్రచిత్తంతో ఆలకించు. పాడ్యమినాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానంచేస్తే దాతకు  రోగపీడలు తొలగిపోతాయి. విదియ రోజున చక్కరతో పూజించాలి. విప్రులకు శర్కర దానం చెయ్యాలి. దాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదియనాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వదుఃఖాలూ తొలగిపోతాయి. చవితినాడు పిండివంటలతో దేవిని ఉపాసించి ద్విజులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. పంచమిరోజున అరటిపండ్లు నివేదించి అవే విద్వాంసులకు దానం చెయ్యాలి. దాతకు మేదావికసనం కలుగుతుంది. షష్ఠి తిథినాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేదవిదులకు దానం చేస్తే దాత అంతటి కాంతిమంతుడు అవుతాడు. సప్తమినాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోకవిముక్తుడవుతాడు. అష్టమినాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. దాతలకు తాపాలు నశిస్తాయి. నవమినాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు ఇస్తే దాతలు ఇహంలోనూ పరంలోనూ సుఖసంపన్నులవుతారు. దశమినాడు నల్లటి నువ్వులను జగదంబికకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే దాతలకు ఇక యమలోకభయమే ఉండదు. ఏకాదశినాడు పెరుగు నివేదించి దానంచేస్తే అతడు అమ్మవారికి అత్యంతాప్తుడు అవుతాడు. ద్వాదశినాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించినవారుకూడా దేవికి ప్రేమపాత్రులు అవుతారు. త్రయోదశి రోజున సెనగపప్పు నివేదనచేసి దానంగా ఇచ్చినవారికి దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. చతుర్దశినాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసినవారు శివుడికి ఆప్తులు అవుతారు. పున్నమినాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్చించినవారు తమ పితృదేవతలను ఉద్ధరించినవారు అవుతారు. అదేరోజున దేవీప్రీతికోసం హవనం చెయ్యాలి.

నారదా! వారాలకుకూడా కొన్ని విశేషాలున్నాయి. ఆదివారంనాడు పాయసం, సోమవారంనాడు. పాలు, మంగళవారంనాడు అరటిపండ్లు, బుధవారంనాడు వెన్న, గురువారంనాడు కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారంనాడు ఆవునెయ్యి అమ్మవారికి నివేదనచేస్తే విశేషంగా ఫలప్రదాలు అవుతాయి, అరిష్టాలు తొలగిపోతాయి. ఇరవైయేడు నక్షత్రాలకు కూడా ఇలాగే విశేషార్చనలున్నాయి. పాలు, పెరుగు, చక్కెర, పటికబెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాలలో అమ్మవారికి నివేదనచేసి విప్రులకు దానం చెయ్యాలి. విష్కంభాదియోగాలకూ ఇలాగే బెల్లం నెయ్యి తేనె పాలు పెరుగు చల్లబూరెలు ఉండ్రాళ్ళు కజ్జికాయలు వెన్న దోస గుమ్మడి పనస అరటి నేరేడు మామిడి నారింజ దానిమ్మ రేగు ఉసిరిక కొబ్బరి సెనగలు అటుకులు పాయసం - ఇత్యాదులు నివేదన చెయ్యాలి. లడ్డూలు ఉండ్రాళ్ళు నెయ్యి మొదలైనవి కరణాలలో యోగాలలో నైవేద్యం పెట్టాలి.

మదూకపూజ అని మరొక విధానం ఉంది. చైత్రశుద్డ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదియనాడు శుచిగా మధూకవృక్షం క్రింద (ఇప్పచెట్టు) మహాదేవికి పోడశోపచారపూజలు ఆచరించాలి. తృతీయనాడు పంచఖాద్యాలు నివేదన చెయ్యాలి. వైశాఖశుద్దతృతీయనాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి. తరవాత నెలల్లో వరసగా తేనె. వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, ఫేణి, దధికుర్చిక, ఆవునెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదనలు పెట్టాలి. పన్నెండు నెలలకూ అమ్మవారికి పన్నెండు విశిష్టరూపాలూ నామాలూ ఉన్నాయి. మంగళ - వైష్ణవి - మాయ - కాళరాత్రి - దురత్యయ - మహామాయ - మాతంగి - కాళి - కమలవాసిని - శివ - సహస్రచరణ - సర్వమంగళ ఆనే పేర్లతో మధూకవృక్షం క్రింద అర్చించాలి. ఇలా చేసినవారికి అన్నికోరికలూ తీరుతాయి. అమ్మవారు భక్తుల పాలిటి కల్పవృక్షంకదా ! ఇలా అర్చించి మొక్కినవారికి కొంగుబంగారం అవుతుంది.

అటుపైని మధూకస్థమైన మహేశ్వరిని నర్వకామసమృద్ధికోసం వ్రతపూర్ణత్వ సిద్దికోసం భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇలా స్తుతించాలి.

ఓ పరమా! పాపహంత్రీ ! పరమార్గప్రదాయినీ ! పరమేశ్వరీ ! ప్రజోత్పత్తీ ! పరబ్రహ్మ స్వరూపిణీ! మదదాత్రీ ! మదోన్మత్తా ! మానగమ్యా ! మహోన్నతా ! మనస్వినీ ! మునిధ్యేయా ! మార్తాండసహచారిణీ! లోకేశ్వరీ ! ప్రాజ్ఞా ! ప్రళయాంబుద సన్నిభా ! జగన్మాతా ! మహామోహవినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. నువ్వు యమలోకాభావకారిణివి. యమపూజ్యవు. యమాగ్రజవు. యమనిగ్రహరూపవు యజనీయవు. జగజ్జననీ ! నమోనమః

ఓ సమస్వభావా ! సర్వేశీ ! సర్వసంగవివర్జితా ! సంగనాశకరీ ! కామ్యరూపా ! కారుణ్యవిగ్రహ కంకాళక్రూరా! కామాక్షీ ! మీనాక్షీ ! మర్మభేదినీ ! మాధుర్యరూపశీలా ! మధురస్వరపూజితా మహామంత్రవతీ ! మంత్రగమ్యా ! మంత్రప్రియంకరీ ! మనుష్యమానసగమా ! మన్మథారిప్రియంకరీ!  అశ్వత్థ వట నింబామ్రకపిత్థబదరీ గతా ! పనసార్కకరీరాది క్షీరవృక్ష స్వరూపిణీ ! దుగ్ధవల్లీనివాసార్హా ! దయనీయా ! దయాధికా ! దాక్షిణ్యకరుణారూపా ! సర్వజ్ఞ వల్లభా ! నమోనమః.

ఇలా స్తుతించిన వారికి వ్రతసాఫల్యం వెంటనే సిద్దిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించినవారికి ఆధివ్యాధి శత్రుభయాలు ఉండవు. చతుర్విధపురుషార్ధాలలోనూ ఏది కోరినవారికి అది సిద్దిస్తుంది. చతుర్వర్గాలవారికీ అనుకూలమైన స్తోత్రమిది.

ఇలా అర్చించి స్తుతించినవారు సర్వపాపవిముక్తులవుతారు. మానధనులవుతారు. సర్వత్రా మన్ననలు పొందుతారు. కలలోకూడా యమలోకభయం ఉండదు. మహామాయాప్రసాదంవల్ల పుత్రపౌత్రాదికంగా వృద్ధి చెందుతారు. నారదా ! ఇదంతా నరకోద్దారలక్షణమైన దేవిపూజా విధానం. సర్వమంగళకారకం. మధూకపూజ చేసినవారికి రోగబాధలు ఉండవు. నరకయాతనలు ఉండవు. 

అమ్మవారి అనుగ్రహంవల్ల ఇహపరాలలో సకలసుఖాలూ అనుభవించి ముక్తి పొందుతారు. బ్రహ్మనందనా! ప్రకృతిస్వరూపిణిగా అమ్మవారికి ఆయిదు రూపాలున్నాయి. నామ రూప ఉత్పత్తులలో అవి జగదానందదాయకాలు. వాటి మాహాత్మ్యాలనూ వాటి ఆర్బావిధానాలనూ వివరిస్తాను తెలుసుకో. ముక్తిప్రదమే కాదు చాలా కుతూహలంగానూ ఉంటుంది - అంటూ నారాయణమహర్షి రవ్వంత విశ్రాంతి తీసుకున్నాడు.


శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Karmagati Vishesha Vyavastha - కర్మగతి విశేషవ్యవస్థ

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - కర్మగతి విశేషవ్యవస్థ

నారాయణు డిట్లనెను: ఆ యనంతుని ప్రభావమును బ్రహ్మపుత్రుడగు నారద భగవానుడు బ్రహ్మసభలో పాటలుగ పాడుచు ఉపాసించును. ఎవ్వాని దివ్యగుణము లీ జగముల సృష్టిస్థితి లయములకు మూలకారణములో యెవ్వని మేలుచూపు మాత్రాన ప్రకృతి గుణములు తమతమ విధులు నెఱవేర్చునో యెవని దివ్య స్వరూపము ధ్రవతేజమో యనాదియో యెవం డొక్కడే యయ్యు పెక్కురూపుల చక్కనిపేరుల భాసిల్లునో యాతని మూలతత్త్వ మెట్టు లెఱుంగబడును! 

ఈ సదసద్రూప విశ్వమే విశ్వరూపు నమృతదయవలన సత్త్వముగ దోచునో యే రసికశేఖరుని లీలా వినోదము భక్తుల మనస్సులను సింహము వలె లాగునో యట్టి యుదారవిక్రము ననన్యగతి నాశ్రయింపవలయును. ఏ హరి శుభనామధేయము నార్తుడుగాని పతితుడు గాని నవ్వులాట కేని యొక్కసారియేని విన్న-కీర్తించినయేని పాపుని పాపరాసులు కూలిపోవునో యాశేష భగవానుని ముముక్షు వాశ్రయింప వలయును ఏవేల శిరముల యనంతుడు నదీ-నద-సాగరములు గిరి-దరీభూములుగల భూమండలము నొక్క పరమాణులీల దాల్చునో యట్టి మొక్క పోనియుక్కుగల్గిన శేషుని వీర్యమహిమను వేయినాల్క లున్నవాడు నుగ్గడింపజాలడు. 

ఇట్టి యనంత గుణగరిష్ఠుడు దురంతవిక్రముడు ననంతప్రభావుడునగు ననంతశేషుడు స్వతంత్రముగ లీలగ నీ భూమి నంతయును తలదాల్చి పాతాళమందున విరాజిల్లుచుండును. మునిపుంగవా! నరులు తమతమ కర్మల ననుసరించి గతులు పొందుదురు. నరులెట్టి కొర్కెలు కొరుకొందురొ యట్టి ఫలితములు బొందుదురు. 

ఓ రాజేంద్రానీకీ విధముగ నల-మృగ-పక్షుల గూర్చి తెల్పితిని. ధర్మబద్దములైన వారివారి కర్మ-కాల-పరిపాక-గతులను గూర్చి వాని మంచి చెడులను గుఱించి నీప్రశ్నలకు తగినట్లుచెప్పితిని. 

నారదు డిట్లనెను; ప్రాణికోటుల కర్మలన్నియును సమానములే గదా! భగవానుడీ లోకముల నింత వింత వింతలు దోప నేల సృజించెనో నాకు దెలుపుము. 

నారాయణు డిట్లనెను: కర్త యొక్క శ్రద్ద ననుసరించి కర్మఫలములు వేర్వేరుగ మూడు విధములుగ నుండును. కర్తకు సాత్విక శ్రద్దవలన సుఖమును రాజుల శ్రద్దవలన దుఃఖమును గల్గును. తామసశ్రద్దవలన దుఃఖమేకాక మూర్ఖత్వమును గల్గును. ఈ శ్రద్దల తరతమ భేదముల వలననే ఫలితము లందును భేదములు గలుగు చుండును. 

ఓనారదా! అవిద్య - అనాది. దానివలన జరుగు పనుల గతులు ప్రవృత్తులు ఫలితములు వేనవేలుగ గల్గుచుండును.

విప్రవర్యా ! కర్మగతుల భేదములను తేటపఱతును. ఈ ముల్లోకముల మధ్యను దక్షిణ దిశయందున భూమికి క్రిందుగ నతలమునకుపైగ నగ్ని ష్వాత్తులను పితృగణములును పితరులును వసింతురు. వారు స్వాత్మసమాధిలో మునింగి తమతమ గోత్రజులను తప్పక దీవించుచుందురు. పితృరాజు-యమధర్మరాజు. అతని భటులు మృతప్రాణులను కొని తెత్తురు. 

యముడు ప్రాణుల కర్మగుణదోషాలను బట్టి విచారశీలుడై వారి వారికి తగిన శిక్ష విధించును. యముడు గణములతోగూడి దైవాజ్ఞ పాటించును శాసించుచుండును. యముడు ప్రాజ్ఞుడై తన యాన జవదాట నట్టి ధర్మత్తత్వజ్ఞులగు వారిని తన యాదేశము పాటించుటకు పంపుచుండును. కొందఱు నరకము లిరువదొకటనియు మఱికొందఱిరువదెనిమిదనియు నందురు. 

వాని సరియగు సంఖ్య చెప్పుదును వినుము. తామిస్రము అంధతామిస్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రారణ్యము శూకరముఖము అంధకూపము కృమి భోజనము సందంశము తప్తమూర్తి వజ్రకంటకము శాల్మలి వైతరణీ పూయోదము ప్రాణరోధము విశసనము లాలాభక్షణము సారమే యాదనము అవీచి అయఃపానము క్షార కర్దమము రక్షోగణము సంభోజము శూలప్రోతము దందశూకము వటారోధము పర్యావర్తనము సూచీముఖము ననున విరువ దెనిమిది నరకములు. ఓ నారదా! ఇవన్నియును పెక్కు యాతనలు పెట్టు నరకభూములు. ఆయా చెడుకర్మల ఫలితముగ ప్రాణు లాయా నరకములందు గూలుదురు.

దుష్కర్మలు - నరకయాతనలు

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

The conflict between Ganga and Saraswati - గంగా సరస్వతుల కలహం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  గంగా సరస్వతుల కలహం నారాయణమహర్షీ! సరస్వతీదేవి గంగాశాపంవల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ ...