దశావతారములు
1. మత్స్యావతారము
మత్స్యావతారము దశావతారములలో ప్రప్రథమ అవతారము. లోమ హర్షణుడు గొప్ప ఋషి. నైమిశారణ్యములో అగస్త్య మునికి “మత్స్య పురాణము”ను వివరించెను. 291 అధ్యాయములలో -14 వేల శ్లోకములు గా లోమహర్షణ వాక్కులు సంకలనముగా ఏర్పడినది. మత్స్యపురాణము ను “తామసిక పురాణము”గా పరిగ్రహింపబడుచున్నది. సత్య వ్రతుడు ప్రజా క్షేమము కొరకు పాటుపడే భక్తాగ్రగణ్యుడైన చక్రవర్తి. ఇతడే “వైవశ్వత మనువు”గా ప్రసిద్ధిగాంచెను.
అగ్ని పురాణములో ఈ గాథ ఉన్నది. కృతమాలా నదిలో స్నానము చేసి, సంధ్య వార్చునప్పుడు, సత్యవ్రతుని కమండలమునందు ఒక చిన్న చేప చేరినది. రాజు దానిని తిరిగి నదిలో విడువబోయాడు. కానీ ఆ మీనము “రాజా!నన్ను పెద్ద మత్స్యములు వెంటాడుచున్నవి. వాని నుండి నాకు రక్షణ అవసరము“ అనెను. ప్రభువు జాలి పడి “అట్లే!” అని దానిని భవనమునకు తెచ్చెను. చిత్రంగా అది ఒక్క రాత్రిలో ఎంతో పెరిగినది. అ చేపను పెద్ద గంగాళములోనికి మార్చ వలసి వచ్చినది.రోజు రోజుకూ అలాగ అది అపరిమితముగా వృద్ధి చెందుచునే ఉన్నది. తత్ఫలితముగా అద్దానిని, మడుగు , సరస్సు , చెరువు,కొట్ట కొసకు మహా సముద్రములోనికి మార్చుతూ, చేర్చారు.
“ఇది మామూలు మత్స్యము కాదు. కేవలము భగవానును అపర అవతారమే!” అని గ్రహించిన మహారాజు సత్యవ్రతుడు, అంజలి ఘటించి,అడిగాడు.”నేను మీ అవతార రహస్యమును తెలుసుకొనలేకున్న అజ్ఞానిని. మీ అవతార హేతువులను, లీలా విశేషములను బోధపరచ కోరుచున్నాను”
ఆ మీనము అన్నది “ నేటి నుండి ఏడవ దినమున ( సప్తమ = 7 )సృష్టి యావత్తు నాశనము అవబోతున్నది. అందు చేత ముందు జాగ్రత్త అక్కర కలిగినది. సృష్టి రక్షణ బాధ్యతా భారమును నీ భుజ స్కంధముల పైన వహింపవలయును.
తదుపరి సంపద నిమిత్తము ముఖ్యమైన విత్తనములను, ప్రాణి కోటి యొక్క పునఃసృష్టి ఆరంభము కొఱకు జంతువులను సేకరించి, భద్రపరచుము.” ఆ ఆదేశములను శిరసావహించాడు సత్యవ్రతుడు.
ప్రకృతి విలయము సంభవించినది.ఆ బృహత్ మీనావతారము, తన వీపున ఒక పెద్ద నావను మోసుకొని వచ్చినది.అందులో సప్తర్షులు, సృష్టి కర్త ఐన బ్రహ్మ ,ముందే తాను సేకరించిన బీజాది అనేక వస్తు సముదాయములతో రాజు అధిరోహించెను.
చేప కొమ్ముకు (చేప మొప్ప/ రెక్క)ఒక సర్పముతో పడవను కట్టాడు. వైవస్వంతుని పుత్రుడు సత్యవ్రతుడు ప్రళయ పయోధి జలముల నుండి సృష్టిని కాపాడి,నిలిపెను. సృష్ట్యాది నుండి అసంఖ్యాక మన్వంతర యుగములు గడచినవి. ఈనాడు మనము “వైవస్వంత మన్వంతర కాలము”లో ఉన్నాము. మహాభారతము లో అర్జునుడు భేదించిన “మత్స్య యంత్రము” సుప్రసిద్ధమైనదే కదా!
2. కూర్మావతారం
ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలని స్నేహపూర్వకంగా ఇస్తాడు. సహజంగానే గర్వము, అహంకారము ఉన్న ఇంద్రుడు ఆ మాలని వాహనమైన ఐరావతం కి వేసాడు. గజరాజు ఆ మాలని తన కాలిక్రింద వేసి తొక్కడంతో కోపోద్రేకుడైన మహర్షి, " దేవతల వద్దనున్న సిరిసంపదలు నశిస్తాయి " అని శాపం ఇస్తాడు. దేవతలందరు కలిసి విష్ణుదేవుని వద్ద మొరపెట్టుకోగా, మహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు " సముద్ర మదనం చేస్తే వచ్చిన నిధితో దేవలోకానికి ఎటువంటి కొరత ఉండదు. పైగా సాగర మదనం ద్వార వచ్చే అమృతంతో దేవతలు చిరంజీవులుగా, శక్తిమంతులుగా ఉంటారు, ఆ మదనానికి అసురుల సహాయం కోరండి" అని దేవేంద్రునితో చెప్తాడు. అమృతాన్ని అసురులకు కూడా పంచుతాము అని, అసురులకు చెప్పడం ద్వార, వారి సహాయంతో సాగరమదనానికి పూనుకొన్నారు.
మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకి ని తాడుగా చేసుకొని, వాసుకి తలవైపు సురులు, వెనుకవైపు అసురులు పట్టుకొని సాగరమదనం చేసారు. ఆ మహా పర్వతానికి ఆలంబనగా ఉండటానికి ఏదైన తక్కువే, అంతటి భారాన్ని మోయడానికి సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కూర్మరూపం దాల్చి ఆలంబనగా నిలిచాడు. మదనంలో మొదటగా హలాహలం, లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము చివరకు అమృతము వచ్చాయి. మోహినీ అవతారంలో అమృతాన్ని అసురల బారినపడకుండా సురులుకి పంచుతాడు మాహావిష్ణువు.
కూర్మావతారంలో వెలసిన ఆ విష్ణుమూర్తి ని మనం "శ్రీకూర్మం (వైజాగ్)" లో దర్శించుకోవచ్చు.
3. వరాహావతారం
దశావతార సంప్రదాయంలో వరాహావతారం మూడోది. ఈ వరాహావతారానికి సంబంధించి ఒక పురాణగాధ ప్రచారంలో ఉంది. ఒకానొక సమయంలో సృష్టి చేయదలచిన బ్రహ్మ మానసికంగా మనువును సృష్టించి, సృష్టి సాగించాల్సిందిగా ఆదేశిస్తాడు. ఆ సమయంలో భూగోళం సమస్తం జలంతో మునిగి ఉండడంతో దానిపై సృష్టి ఏ విధంగా చేయాలని మనువు బ్రహ్మను అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ శ్రీమహావిష్ణువును ధ్యానిస్తాడు. నాసికా రంధ్రాల నుంచి యఙ్ఞ వరాహమూర్తి అంగుష్ట మాత్రా దేహంతో ఆవిర్భవించి క్షణాల్లో ఏనుగంత పెరిగాడు. బ్రహ్మ నిద్రావశుడై ఉన్న కాలంలో జలంలొ మునిగిన భూమిని ఉద్ధరించేందుకు రసతలానికి వెళ్తాడు. జలమధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురౌతాడు. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. హిరణ్యాక్షుడు మాయా చక్రాన్ని ప్రయోగించగా, శ్రీహరి తన చక్రంతో ఆ మాయా చక్రాన్ని అడ్డుకొంటాడు. చివరకు వరాహమూర్తి ఆ రాక్షసుడిని కర్ణమూలాన్ని తన కోరలతో చేధించగా హిరణ్యాక్షుడు నెత్తురుకక్కుకొని మరణిస్తాడు. భూమిని ఉద్దరించాక వరాహానికి వైకుంఠం నుంచి భూలోకంలో అవతరించిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల కొండలలో చోటు చూపించాడని వరాహ, బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నాయి.పరమాత్ముడైన విష్ణుమూర్తి యఙ్ఞరూప ధరుడైన వరాహంగా తెల్లని దేహంతో అవతరించిన కల్పం కనుక శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. సకల సంపదలకు యఙ్ఞం అలవాలం గనుక పరమపురుషుడు యఙ్ఞమూర్తిగా అవతరించాడు. చైత్ర బహుళ త్రయోదశి నాడు యఙ్ఞవరాహావతార ఆవిర్భావం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి.
4. నృసింహావతారం
మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము". పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులు' సంరక్షించుచూ ఉండు సమయాన, ఒక్కసారి సనక, సనందన, సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల, శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు. దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురుమొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులుగారెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మిస్తారు. అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులుగా జన్మించి ఘోరమైన తపస్సులుచేసి, ఆ వరగర్వంతో లోకకంటకులైనారు. దానితో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహా రూపంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.
హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి తనకు ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతోవిర్రవీగిపోతూ ఉంటాడు. (గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయటగాని, చావులేకుండా వరం) అట్టి దానవుడి నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు" విష్ణుభక్తుడు, దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రయత్నిస్తారు.ఆగ్రహించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఎక్కడ ? ఈ స్తంభమున చూపగలవా? అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లదుడు తండ్రీ! సర్వాంతర్యామి అయిన శ్రీహరి
"ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!
కలడందురు దీనుల యెడ
కలడందురు పరమ యోగిగణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో! "
అని జవాబు ఇస్తాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా? అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు.
"వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ ,
మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"
అని సాక్షాత్తు శ్రీహరి స్వయముగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి) అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశ్యపుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరిగిపడుచుండగా భూమ్యాకాశాదులు దద్దరిల్లేలా సింహగర్జన చేస్తూ ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు. సింహంతల, మానవశరీరం. సగం మృగత్వం, సగం నరత్వం. ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి హిరణ్యకశ్యపుడు పొందిన వరాలను ఛేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన" మృగ నరలక్షణాలతో గూడి, ఒక్క ఉదుటన హిరణ్యకశ్యపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక, స్వామిని శాంతింప చేయమని ప్రహ్లాదుడిని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా, పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాడబడచూ పూజించబడుచున్నారు.
5. వామనావతారం
అన్నీ అవతారాలలోకి వామనావతారం విశిష్టమైనదిగా చెప్పవచ్చు. అప్పటివరకూ సృష్టిలోని జీవరాసులన్నిటియందూ తనను తాను ప్రతిష్టించుకొన్న ఆ శ్రీహరి ప్రధమంగా మానవావతారాన్ని ధరించిన రూపమే వామనావతారం. అమృతపానం చేసిన దేవతలు రాక్షసులతో యుధ్ధం చేసి ఎంతో మందిని సంహరించారు. మరెందరినో ఓడించారు. ప్రహ్లాదుని మనుమడు వరోచనుడు. ఆ వరోచనుని కుమారుడు బలి. గురువైన శుక్రాచార్యుల వారు బలి చేత 'విశ్వజిత్ 'అనే యాగం చేయించాడు. రాక్షసులకీ బలమూ, తేజస్సు, లభించిది. యుధ్ధ పరికరాలన్నిటినీ పొందిన బలి, దానవ సైన్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇంద్రుని మీదకు యుధ్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడి రాజధానిని బలి చక్రవర్తి ఆక్రమించాడు. అదితి తన కుమారులైన దేవతలు సర్వ సంపదలూ కోల్పోయి బాధపడుతుంటే కుమిలిపోయింది. కశ్యపుడు అదితికి ధైర్యం చెప్తూ, " మాఘమాసంలో అమావాస్య గడిచిన తెల్లవారుజామున ఫాల్గుణ శుక్లపక్షం ప్రారంభం అవుతుంది. శుక్లపక్ష ప్రధమదివసాన తెల్లవారుజామునే వాసుదేవుడిని స్తుతించాలి " అని వ్రతమును ఉపదేసిస్తాడు.
వ్రత ఫలితంగా మహావిష్ణు వరం వలన అదితి గర్భవతి ఐనది. భాద్రపద శుద్ద ద్వాదశి నాడు శ్రవణానక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో ఆ శ్రీమహావిష్ణువు, వామన అవతారం లో ఈ భూమిమీద అవతరించాడు.
ఉపనయన సమయమున సవిత్రుడు గాయత్రిని భోదించాడు. బృహస్పతి బ్రహ్మ సూత్రాలను, సోముడు దండాన్ని, భూమి కృష్ణాజినాన్ని, దివస్సు చ్చత్రాన్ని, తండ్రి కశ్యపుడు మేఖలను, తల్లి అదితి కౌపీనాన్ని, కుబేరుడు భిక్షాపాత్ర, సరస్వతి జపమాల, సప్తౠషులు కుశలను ఇచ్చారు. ఉపనయనం తరువాత అదితి సంతతి మేలు కోసం
బలిచక్రవర్తి దగ్గరకు బయలుదేరాడు.
వామనుడు బలిచక్రవర్తిని 3అడుగుల నేలను దానంగా ఇవ్వమని అడిగాడు. బలి చక్రవర్తి పక్కనే ఉన్న గురువు శుక్రాచార్యులు వామనుడు సామాన్యుడు కాదని గ్రహించి, దానం ఇవ్వొద్దు అని బలి ని వారిస్తాడు. అంతరార్ధం తెలియని బలి దానం ఇవ్వడానికి సిద్దపడి, కమండలం నుండి నీరుని వదులుతున్న సమయంలో శుక్రాచర్యుడు ఒక చిన్న పురుగు రూపంలో ఆ కమండలం నుండి నీరు బైటకు రాకుండా అడ్డుపడుతాడు. ఒక్క చిన్న దర్భ తో ఆ శ్రీమహావిష్ణువు అడ్డుని తొలగిస్తాడు. అలా దానం ఇవ్వడంలో ఆటంకం తొలిగించాడు. మొదటి అడుగు తో ఈ భూమండలాన్ని, రెండవ అడుగుతో ఆకాశాన్ని పూర్తిచేసాడు. ఇక ఒక్కడుగు మిగిలి ఉంది చోటు ఏది అని బలిని అడుగగా, సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే వామన రూపంలో వచ్చాడని తెలుసుకొన్న బలి తన శిరస్సుపై మూడవ అడుగు పెట్టమని శిరస్సు వంచి అభివాదం చేసాడు. వామనడు తన మూడవ అడుగును బలి శిరస్సుపై పెట్టి పాతాళానికి అణచివేసాడు.
" ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై "
6. పరశురాముడు
జమదగ్ని మహర్షి, రేణుకల కుమారుడు పరశురాముడు. కోపము, ఆవేశము ఎక్కువ. ఏ కార్యం తలపెట్టిన వెనుతగ్గే సమస్యే లేదు, విజేయుడై వస్తాడు. ఒకసారి హైహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు, వేటలో అలసిపోయి, తన సేనతో జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. మహర్షి రాజుకు, వారి పరివారానికి పంచభక్ష పరమాన్నలతో భోజనం పెట్టాడు. మహర్షి కామధేనువు సాయంతో ఇంతమందికి లోటులేకుండా భోజనాలు పెట్టాడు అని తెలుసుకొన్న రాజు, ఆ ధేనువును తనకు ఇమ్మని మహర్షిని అడిగాడు, అందుకు జమదగ్ని ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ధేనువుని తీసుకొనివెళ్ళిపోయాడు.
పరశురాముడు తన తండ్రిని అవమానించిన కార్తవీర్యార్జునిడిని సం హరించి, తిరిగి కామధేనువును ఆశ్రమానికి తెస్తాడు. కొద్దికాలం తరువాత మరొక సంఘటన జరిగింది.
తల్లి రేణుకా నీరు తేవడానికి సరస్సుకి వెళ్ళింది. అదే సమయంలో అప్సరసలతో చిత్రరధుడు క్రీడిస్తున్న దృశ్యం చుసి అలాగే ఉండిపోయినది. దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకొన్న జగమదగ్ని, తల్లిని వదించమని కుమారులను ఆఙ్ఞాపించాడు. అందుకు వారు నిరాకరించారు. కుమారులలో ఒకడైన పరశురాముడిని, తన మాట ధిక్కరించిన సోదరులను, మనోవికారానికి గురైన తల్లిని సంహరించమని ఆఙ్ఞాపించాడు, తండ్రి మాట శిరసావహించిన పరశురాముడిని వరం కోరుకోమంటాడు జమదగ్ని. తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించమని వేడుకొంటాడు పరశురాముడు. జమదగ్ని పుత్రుడి కోరికను నెరవేరుస్తాడు. ఇలా కొంతకాలం గడిచింది.
ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలోలేని సమయంలో, కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్నిని సంహరించి వెళ్తారు. విషయం తెల్సిన పరశురాముడు, తన తండ్రిని రాకుమారుడు సంహరిచినందుకు ప్రతీకారంగా ఈ భూమండలమందు రాజులను బ్రతకనివ్వనని ప్రతిఙ్ఞ చేసాడు.
పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేశాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్చించాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.
కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.
7. రామావతారం
తల్లితండ్రుల మాటను తూచా తప్పకుండా పాటించే ఒక సామాన్యుడిగా రూపం దాల్చి, రావణాసురుడు వంటి రాక్షసులను సంహరించి, సీతా మహాసాధ్వితో అయోధ్యాదీసుడైనాడు రాముడు. అన్న మాటే వేదంగా శిరసావహించే తమ్ముడు లక్ష్మణుడు,, అన్న పాదారక్షలనే సింహాసనం పైన ఉంచి పాలనను సాగించిన తమ్ముడు భరతుడు, శత్రుఘ్యుడు.
మందర మాట విని కైకేయి, శ్రీరామునికి బదులు తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయమని, రాముడిని 14 ఏళ్ళ వనవాసం పంపమని దశరధ మహారాజుని కోరింది. పినతల్లి మాటకు కట్టుబడి, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం తలపెట్టెను. వనవాస సమయంలో లంకేయుడూ, మహేశ్వరుని అపర భక్తుడూ అయిన రావణాసురుడు, సీతమ్మ తల్లిని అపహరించి లంకలో అశోకవనములో ఉంచుతాడు. అపహరన తగదని రావణుడి తమ్ముడు విభీషణుడు, భార్య మండోదరి రాముడి గొప్పతనమును రావణుడికి చెప్పినను రావణుడు లెక్కచేయక, ఆ శ్రీరామచంద్రుడితోనే వైరంకి దిగాడు. రామయ్య వానరసేనతో, లంక పైన దాడి చేసి, రావణ సంహారమొనరించి, సీతమ్మతల్లిని తన దరికి చేర్చుకొంటాడు.
ఇంత గొప్ప రామాయణంలో హనుమంతుడి యొక్క స్వామిభక్తి, లక్ష్మణుడి యొక్క సోదరభావం, సీతమ్మ పతిభక్తి, శబరి తల్లిప్రేమ, గుహుడు, వారధి కట్టే సమయంలో ఉడత భక్తి ఇలా ఒక్కొక్కరు ఒక్కోరూపంలో తమ భక్తిని చాటుకొన్నారు.
"శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిసాచరవినాశకరం నమామి"
8. బలరాముడు
మహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగాను, నీలతేజస్సు శ్రీకృష్ణుడుగాను అవతరించి దుష్టశిక్షణ చేసారు. చెరశాలలో ఉన్న దేవకి సప్తమగర్భాన్ని యముడు తన మాయ చేత ఆకర్షించి, రోహిణిదేవి గర్భంలో ప్రవేశపెట్ట్టాడు. ఈ సందర్భంలోనే బలరాముడికి సంకర్షణుడు (సంపూర్తిగా ఆకర్షించినవాడు) అనే పేరు వచ్చింది. బలవంతులలోకి బలవంతుడు కనుక బలరాముడు అని పేరు. బలరామదేవుడు ఆదిశేషుని అవతారం. సాందీపుడి దగ్గర బలరామకృష్ణులు శిష్యరికం చేసారు. బలరాముడికి దుర్యోధనుడు అంటే మహాప్రీతి. భార్య రేవతీదేవి, నాగలి ఆయుధం, ఎప్పుడూ నీలిరంగు వస్త్రాలనే ధరిస్తాడు, జెండా పైన తాటిచెట్టు గుర్తు ఉంటుంది. భీముడు, ధుర్యోధనుడు గదావిద్యను బలరాముడిదగ్గరే నేర్చుకొన్నారు. పాండవ కౌరవ యుద్దంలో తటస్థంగా ఉన్నాడు. ఆ తటస్థ స్వభావాన్ని నిలుపుకోడానికి సరస్వతి నదీతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు బయలుదేరివెళ్ళాడు. 42 రోజుల యాత్ర ముగించుకొని, భీమ దుర్యోధనుల గదాయుద్ధ సమాయానికి తిరిగివచ్చాడు. ఆ గదాయుద్ధంలో భీముడు, ధుర్యోధనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధధర్మం కాదు అని ఆగ్రహిస్తాడు బలదేవుడు. మైత్రేయమహర్షి శాపం వలన మరియు భీముడి ప్రతిఙ్ఞ వల అలా జరిగింది అని కృష్ణుడు చెప్పగా బలరాముడు శాంతించాడు.
కురుక్షేత్ర యుద్ధం తరువాత బలరాముడు అరణ్యంలో ఒక వృక్షం క్రింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమైన సమయంలో అతని నోటినుండి తెల్లని సర్పం బైటకువచ్చి పడమటిసముద్రంలో లీనమైనది. బలరాముడు ఆదిశేషు అవతారం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము.
9. కృష్ణావతారం
"వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం "
మథుర లో దేవకీవసుదేవుల బిడ్డగా పుట్టి, రేపల్లెలో యశోదానందుల ముద్దులకొండగా, బలరాముడు, సుభద్ర ల సోదరుడిగా, కన్నయ్య గా మన అందరిచేత ముద్దుగా పిలిపించుకొంటున్న విష్ణుమూర్తి యొక్క 9వ అవతారం శ్రీకృష్ణుడు. కౌరవలచేత పాండవపక్షపాతిగా పేరుపడ్డాడు. కృష్ణవర్ణం అంటే నీలం, నలుపు, చీకటి అనే అర్ధాలు ఉన్నాయి, ఙ్ఞానానికి ప్రతీక నీలం. అందుకే ఆ విష్ణుమూర్తి నీల మేఘశ్యాముడైనాడు.
"కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం.
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చుడామణిః "
పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. కాళిందిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యముచేసి "తాండవకృష్ణుడు" అయ్యాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో రేపల్లెను మురిపించి కంసునిచే పంపబడిన ఉద్దవుని రాకతో మధురకు చేరి తనను మాయోపాయయంచే చంపచూసిన కంసుని వధించి తన తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించి చెరలోఉన్న తల్లి, తండ్రులను వారితో విడిపించి ద్వారకకు చేరుకుంటాడు. విద్యాభ్యాసానికి ముని ఆశ్రమము చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొంది, గురుదక్షిణగా తక్షకుడు తస్కరించిన అధిథి కుండలాలను విడిపించి గురువుకి సమర్పించి విద్యాధనంతో తన తల్లి తండ్రులవద్దకు చేరుకుంటాడు.
కృష్ణుని అష్టభార్యలు - రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళిందిని, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ
వనవాస సమయంలోను, కురుక్షేత్ర యుద్దంలోను పాండవులకు అండగా ఉండి, అర్జునుడికి "గీత" ను భోధించిన జగన్నాటకసూత్రధారి ఆ గోపాలపాలకుడు.
శ్రీమధ్బాగవత పఠన సంప్రదాయాన్ని మొట్టమొదట ప్రారంభించినవారు వ్యాసమహర్షి పుత్రుడు శుకమహర్షి, పరీక్షిత్ మహారాజుకి 7రోజులపాటు భాగవతాన్ని వినిపించాడు. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన 30ఏళ్ళ తరువాత కలియుగం ప్రవేసించిన భాద్రపద శుద్ధనవమి నుండి పౌర్ణమి దాక తొలి భగవత సప్తాహం జరిగింది.
10. కల్కి అవతారం
శ్రీమద్భాగవతం ప్రకారం కల్కి అవతారం కలియుగ అంతంలో వస్తుంది. ఎలా వస్తుంది అనేది భాగవతంలో వివరణ ఉంది. ఈ అవతారం ప్రతి కలియుగంలో వస్తుంది కనుకనే వేదవ్యాసుడు కల్కి అవతారం గురించి ప్రస్తావించాడు. ప్రతి మన్వంతరంలో 71 చతుర్యుగాలు వస్తాయి, అంటే 71 కలి యుగాలు. అందులో మనం ఉన్నది 28వ కలియుగం, అంటే 27 కల్కి అవతారాలు ఇది వరకే వచ్చాయని పురాణం చెబుతుంది.
ఇంకో కధనం కూడా ఉంది :
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కల్కి అవతారమున "విష్ణుయశస్సుడు" అనే పేరుతో జన్మిస్తాడని, హయగ్రీవుడికి వలె ఇతనికి కూడా గుఱ్ఱపు ముఖము ఉంటుందని, చేతిలో ఖడ్గముతో, తెల్లటి అశ్వం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని వివరణ.

No comments:
Post a Comment