షట్టిల ఏకాదశి(షట్ తిల ఏకాదశి)
తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది. ఈ సందర్భంగా షట్టిల ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ ఏకాదశి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు గురించి తెలుసుకుందాం.
షట్టిల ఏకాదశి అంటే!
పుష్య మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు.
షట్టిల ఏకాదశి విశిష్టత
వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం శ్రీ కృష్ణుడు, యుధిష్టిరునికి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. షట్టిల ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుతో పాటు శ్రీ కృష్ణ భగవానుడిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజు గోవును కూడా విశేషంగా పూజిస్తారు. షట్టిల ఏకాదశి రోజు ఉపవాస జాగరణ నియమాలతో శ్రీ మహా విష్ణువును ఆరాధిస్తే సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు ఆ రోజు పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు, వేల సంవత్సరాల తపస్సు, బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు.
షట్టిల ఏకాదశి రోజు నువ్వులతో మోక్షం
షట్ తిలనే వ్యవహార భాషలో షట్టిలగా పిలుస్తారు. ఈ షట్టిల ఏకాదశికి నువ్వులకు అవినాభావ సంబంధం ఉంది. షట్టిల ఏకాదశి రోజున నల్ల నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగిస్తారు. ముందుగా నీళ్లలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నువ్వులతో హవనం, నువ్వుల నీళ్లు, నువ్వులను దానం చేయాలి. చివరగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. పురాణాల ప్రకారం, షట్టిల లేక షట్ తిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది.
షట్టిల ఏకాదశి పూజా విధానం
షట్తిల ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియై పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని ఒక పీటపై లక్ష్మీనారాయణుల విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలి. ఈ రోజంతా పూర్తి ఉపవాసం ఉండాలి. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణులకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. పసుపు కుంకుమలతో విగ్రహాలను అలంకరించాలి. పసుపు రంగు పూవులు, తులసి దళాలతో, అక్షింతలతో విష్ణువును అర్చించాలి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. యథాశక్తి నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇవ్వాలి.
ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. వీలైతే ఈ రోజు విష్ణువు ఆలయంలో తులసి మాల సమర్పించడం శుభప్రదం.
సాయంత్రం తిరిగి శుచియై ఇంట్లో పూజాదికాలు పూర్తి చేసుకొని, ఆలయానికి వెళ్లి రాత్రంతా ఆలయంలో జరిగే భజనలు, కీర్తనలతో విష్ణుమూర్తిని సేవిస్తూ జాగారం చేయాలి.
దానాలు
షట్తిల ఏకాదశి ఉపవాసం చేసిన వారు ద్వాదశి రోజు అన్నదానం, వస్త్రదానం, ఛత్రదానం, జలపాత్ర దానం చేయడం వలన మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. అలాగే ఈ రోజు నువ్వులను దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులవుతారని విశ్వాసం. అంతేకాదు షట్తిల ఏకాదశి రోజు నువ్వులను దానం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు, మరణానంతరం మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ద్వాదశి పారణ
ఏకాదశి ఉపవాసం చేసిన వారు ద్వాదశి రోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేయాలి. ఉదయాన్నే నిత్యపూజాదికాలు పూర్తి చేసుకొని ఒక సద్భ్రాహ్మణునికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.
షట్తిల ఏకాదశి వ్రతఫలం
భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో షట్తిల ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు, వేల సంవత్సరాల తపస్సు, బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ షట్తిల ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. మోక్షాన్ని పొందుదాం. ఓం నమో నారాయణాయ!
చేయవలసినవి
షట్టిల ఏకాదశి రోజున నువ్వులు పండ్లను ఆహారంగా తీసుకోవాలి.
షట్టిల ఏకాదశి వేళ శ్రీ మహా విష్ణువుకు నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి.
షట్టిల ఏకాదశి రోజున నువ్వులను నీళ్లలో వేసి స్నానం చేయాలి.
షట్టిల ఏకాదశి రోజున నువ్వులను దానం చేయాలి. అలాగే పూర్వీకులకు తర్పణం సమర్పించాలి.
షట్టిల ఏకాదశి రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి.
ఈ పర్వదినాన బట్టలు, దుప్పట్లను దానం చేయాలి.
షట్టిల ఏకాదశి రోజంతా శ్రీ హరిని స్మరించుకుంటూ పూజలు చేయాలి.
చేయకూడనివి
షట్టిల ఏకాదశి రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు.
షట్టిల ఏకాదశి వేళ మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఈ పవిత్రమైన రోజున వివాదాలకు దూరంగా ఉండాలి.
మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి.
ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. అలాగే చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి.
షట్టిల ఏకాదశి ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్ర పోకూడదు.
షట్టిల ఏకాదశి రోజున ఎవరినీ విమర్శించకూడదు.
No comments:
Post a Comment