Tuesday, August 11, 2026

Panashala (Tavern) - పానశాల

రామాయణం సుందరకాండ పదవ సర్గ - పానశాల

మరుక్షణంలో ఆ మహామహుని బుద్ధి పనిచేయుడం మొదలు పెట్టింది.

రామ వియోగంలో ఉన్న సీత అన్న పానాలు ముట్టదు; అలంకారాలూ, నిద్రా అమె దరి జేరవు.

దేవేంద్రుడయినా సరే, అమె వానిని కన్నెత్తి చూడదు. ముల్లోకాలలో రామునివంటి పురుషు డుండనప్పుడు సీతాదేవి పరపురుషునివైపు ఎందుకు చూస్తుంది, అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు.

అక్కడ

ఆటలాడి, పాటలు పాడి, నాట్యం చేసి, తెగత్రాగి అలసిన నారీజనం కొందరు మద్దెళ్ళమీద, మరికొందరు పీటలమీద, మరెందరో తివాసీలమీద పడి నిద్రిస్తున్నారు.

అందరూ అందకతెలే. చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్ర మర్యాద లెరిగినవారే, హాయిగా సంయోగసుఖంతో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు.

ఇందరు స్త్రీల నడుమ, గోగణమధ్యంలో వృషభరాజులా ఉన్నాడు, రావణుడు. ఆడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు.

పానశాల ప్రక్కకు చూశాడు హనుమంతుడు.

దున్నపోతుల, అడవిపందుల, లేళ్ళ మాంశాలు పోగులు పోగులుగా ఉన్నాయి, వెండి పాత్రలలో, బంగారు గిన్నెలలో తింటూ తింటూ విడిచిన నేమళ్ళ, కోడిపెట్టల మాంసాలున్నాయి. సగం సగం ఆరగించిన చకోరాలు, చేపలు, మేకలు.

షడ్రసోపేతమయిన వంటకాలు, పువ్వులు. పళ్ళు...... రకరకాల మద్యాలు, బంగారు కమండలువులలో ఉన్నాయి. మణులు పొదిగిన వెండి చెంబులు, బంగారు పాన పాత్రలు.

కొన్ని పాత్రలలో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా ఆరగించినవి, కొన్ని యింకా ముట్టకుండా నిండుగా తొణీకిసలాడుతున్నవి.

త్రాగుతూ మత్తులో బోర్లగిల పడవైచిన కుండలు, కమండలాలు. వాటికి యెడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు,

మళ్ళీ వెనుదిరిగాడు.

అక్కడ స్త్రీలు ఒకరి చీర లొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు, ఒకరి నొకరు దగ్గరగా కౌగలించుకుని నిద్రిస్తున్నారు.

మధురమయిన 
ద్యపు వాసనతో, మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనం అంతా వ్యాపిస్తున్నాయి.

స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు ఛాయ మేనివారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు; కాని, జానకీ దేవి కనపడలేదు.

ఆ దశలో వున్న స్త్రీలను చూసిన హనుమంతుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంతఃపురంలోని నారీజనం, పయిగా ఆచ్చాదనలు లేకుండా వున్నారు. పరస్త్రీని చూడడమే పాపం! కాగా ఈ స్థితిలో చూడడం మరెంత పాపం-

అయితే యిందరు సుందరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి వికారానికి లోనుకాలేదు. ఇంద్రియాలన్నిటిలో ప్రధానమయినది మనస్సు. అది నిశ్చలంగానే ఉంది.

పయిగా సీతాదేవిని స్త్రీ జన మధ్యంలో గాక ఎక్కడ వెదకాలి?

స్త్రీని వెదకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెడతామా! నా మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనక పాపభీతి లేదు.

దేవ, గంధర్వ, నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సితాదేవి జాడలేదు. పానశాల విడిచి యీవలకు వచ్చాడు.

మనస్తాపం

Pattamahishi - Shayanagaaram - పట్టమహిషి - శయనాగారం

రామాయణం సుందరకాండ తొమ్మిదవ సర్గల - పట్టమహిషి - శయనాగారం

సాగి సాగి హనుమంతుడు

ఏనుగు దంతాలతో, పదారు వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక, వెడూర్య, రత్నాలతో అలంకృతమయిన శయ్యను చూశాడు. ఒకవంక చంద్రకాంతితో తెల్లని గొడుగు. మరొక వంక సూర్యకాంతితో, అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం. శయ్యమీద అజిన చర్మం.

అగరు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు. తెల్లని వింజామరలతో అందగత్తెలు.

ఆ శయ్యమీద మేఘసన్నిభుడైన మహావీరుని చూశాడు, పొడుగాటి బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు, చీనాంబరం, శరీరమంతా మంచిగంధపుపూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపు కాంతుల మేఘంలా వున్నాడు.

లతా, తరుశోభితమయిన మందరగిరిలా ఉన్నాడు. హాయిగా మధుపానం చేసి, మదవతీ పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాడు.

కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు.

బుస కొడుతున్న కోడెత్రాచులా వున్నాడు.

ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి, మరొక వేదిక మీదకు నడిచి చూశాడు.

మత్తేభం అధివసించిన ప్రస్రవణగిరిలా ఉంది, రావణుడు నిద్రిస్తున్న అ శయ్య.

ఇంద్ర ధనుస్సులా వున్నాయి వాని బాహువులు.

దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు, వజ్రాయుధాన్ని ఢీకొని గట్టి బొప్పికట్టి వున్నాయి. విష్ణుచక్రపు రాపిడికూడా అనుభవించాయి.

చక్కగా, బలిసి, మంచి కణుపులతో, సర్వలక్షణలక్షితములై అలరారుతున్న గోళ్ళతో, వ్రేళ్ళతో ఆ బాహువులు అయిదు పడగలపాములా ఉన్నాయి. వాటికి మంచిగంధపు పూతలున్నాయి. మందరగిరిమీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తూన్న మహాసర్పాలవలె వున్నాయి.

అంతటా సురపాన్న సౌరభం, పాగడపూల పరివుళం. మధుర మదిరాగంధం - అది అంతా ఆ రావణుని నిశ్వాసవాయువే.

మణి, రత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులినే కుండలాలు.

రక్త చందనాల కృతం, మణిహార భూషితం అయిన విశాల వక్షస్థ్సలం పసుపురంగు పంచె. తెల్లని ఉత్తరీయం.

చూస్తున్నాడు హనుమంతుడు.

గంగానది ఒడ్డున విశ్రమించే ఎనుగులా వున్నాడు. మినుముల రాశిలా ఉన్నాడు. నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు.

ఆ రాక్షసేంద్రుని పాదసమీపంలో కొందరు భార్యలు. వారు చంద్రవదనలు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంగల వనితలు కొందరు ఆయన కటి ప్రాంతంలోనూ, భుజసీమ దగ్గరావున్నారు. వారందరితో గృహం తారాశోభితమయిన ఆకాశంవలె ఉన్నది.

అలసి, అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట, కొందరు.

ఒకతె నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది.

నదిలో తరంగాలతో కదలిపోయి నావ చాటున చేరిన కమలం వలె, ఒక కమలముఖి వీణను కౌగలించుకుని ఉంది,

పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక మదవతి.

చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాద్యాన్ని చుట్టుకుని పడుకుంది.

ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది.

మరొకతె మద్దెల నానుకుని నిద్రించింది.

భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకతె. కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది, భేరీ వాద్యాలింగనంతో, ఒకతె;

వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్న దొక పూబోణి పగలకొట్టిన కుండనీటిలో తడిసి.

సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రొఢ ఒకతె-

ఒక చంద్రానన మరొక సుశ్రోణిని కౌగలించుకుని పరవశంతో నిద్రిస్తున్నది.

కామ తీవ్రతగల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీవాద్యాలను ఆలింగనం చేసుకున్నారు.

ఆ రమణీయ రమణీగణంలో అందరికంటె విశిష్టంగా, అత్యంత సౌందర్యంతో, మణి రత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా, సువర్ణకాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఈమెయే అనుకున్నాడు.

అనుకున్న క్షణంలో ఆయన కపిప్రకృతి విజృంభించింది.

తోక నేలకు కొట్టాడు.

తోకను ముద్దుపెట్టుకున్నాడు.

గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు.

పానశాల

Anthapuram - అంతఃపురం

రామాయణం సుందరకాండ ఎనిమదవ సర్గ - అంతఃపురం

సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం వుండే అంతఃపుర భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్థయోజనం వెడల్పు వున్న ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు కల ఏనుగులు రక్షణ కార్యంలో వున్నాయి. ఆయుధపాణు లయిన యోధులు అప్రమతంగా తిరుగుతున్నారు. మకర, తిమింగల, మహాసర్ప సమృద్ధమయిన సాగరంలా ఉన్నదది. యమ, వరుణ, కుబేర, దేవేంద్ర భవనాలను అధఃకరిస్తున్నది.

రావణుని భార్యలందరూ అక్కడ వున్నారు. ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీజనం కూడా ఆ భవనంలో స్వేచ్చగా విహరిస్తున్నారు.

విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షేశుడయిన కుబేరుడు తీవ్ర తపస్సుచేసి బ్రహ్మను సంతుష్టుని చేసి ఆ విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని ఓడించి రావణుడు దీనినీ సాధించాడు.

మేరు మందర గిరిశిఖర సదృశమయిన గోపుర సమూహాలతో అలరారుతోంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు. స్ఫటికమణులతో రూపొందించిన గవాక్షాలు. పగడాలు, మణులు, ముత్యాలతో నిండి అక్కడి నేల అంతా కాంతు లీనుతున్నది. రక్త చందనాలేపనంతో లేతసూర్య కాంతితో
వెలుగుతోంది, రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. ఆప్త బంధువుకి విందుకోసం చేసినట్లున్నాయి.

ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది.

గ్రామ, నగర, సౌధ చిత్రా లలంకరించిన తివాసీ పరచి ఉంది.

ఆ భవనంలో తెల్లని రాజహంసలవలె అగరు ధూమం వ్యాపించి శోభావహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది.

చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలా ఉంది. అక్కడి బంగారు దీపకళికలను తదేకంగా చూశాడు.

చూసి లోపలకు సాగుతున్నాడు హనుమంతుడు.

రంగు రంగుల చీరలతో వివిధ విధాలయిన ఆభరణాలతో అలరారే నారీమణులు అర్థరాత్రివరకూ ఆసవాలు సేవించి, నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో వున్న సరోవరంలా వున్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన
పద్మాలమీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖపద్మాలచుట్టూ భ్రమిస్తాయి.

తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకుని నేలకుజారిన తారాగణాల వలె వున్నారువారు.

సడలిన కేశబంధాలు, చెదరిన అంగభూషణాలు, జారిన పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటకు కరగిన తిలకాలు.

పాన వ్యాయామ సమయంలో తెగిన ముత్తెపుసరులు. జారిన వసనాలు, పట్టు సడలిన వడ్డాణాలు, తెగిపోయి ఊడిపడి పగిలిన కుండలాలు.

ఏనుగులు నలగత్రొక్కిన లతామతల్లులవలె ఉన్నారు. చంద్రకిరణ శోభ లీనే ముత్యాలహారాల కిరివంకలా ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలు గోచరించాయి.

వారి అలంకారాలలో వైడూర్యముణులు రాజహంసలవలె, బంగారు హారాలు చక్రవాకాలవలె కనిపిస్తూంటే, హంసలూ చక్రవాకాలూ విహరించే నదులవలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి.

వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత కమలాలుగా, శృంగారక్రియలే మకరాలుగా, తనుద్యుతులే తటాలుగా వారందరూ నదీ దేవతల్లా వున్నారు.

కొందరి చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ భ్రమ గొలుపుతోంది. కొందరి నిట్టూర్పులకే వారి చేలాంచలాలు ముఖంమీద ఆడుతున్నాయి. అవి రంగు రంగుల పతాకాలవలె ఉన్నాయి.

ఆ గాలిసోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి. ఆ మహిళల కాంతిగంధానికి తోడు మధుపానగంధం కలిసివచ్చే వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి.

మద్యపాన వివశలయిన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూంటే, ఆ సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు.

మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపధానాలుగా కొందరు, ఎదుటి ఆమె వక్షస్థ్సలం మీద తలవంచి ఒకతె, దాని ఒడిలో తల పెట్టి యింకొకతె, తొడలమీద, పిరుదులమీద ఆలా ఒకరికి తెలియని మైకంలో ఒకరు హాయిగా నిద్రాముద్రలో వున్నారు. ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు.

తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలె వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నవారు నారీమణిహారంలా ఉన్నారు.

వసంత వాయువుకు కదలియాడే లతలు, పూవులు, ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరి నొకరి బంధించుకున్నారు.

ఎవరి అవయవాలు ఎవో, ఎవరి అలంకారాలు ఎవో, ఎవరి కేశాలంకారం యేదో తెలియకుండా ఉంది. బంగారు దీపాలవలె వున్నారు.

ఇందరినీ రావణుడు తన పరాక్రమంతోనే తెచ్చాడు. కొందరు మాత్రం రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితులనెవరినీ తీసికొని రాలేదు. ఇతరుల యందు అనురాగం వున్న ఆడదాన్నీ తేలేదు.

వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం.

అందరినీ చూస్తూ హనుమంతు డనుకున్నాడు.

వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీ దేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థమయేది. ఎంతటివాడయినా సీతాపహరణంతో తుచ్చుడయాడు రావణుడు.

పట్టమహిషి - శయనాగారం

Pushpaka Vimana - పుష్పక విమానం

రామాయణం సుందరకాండ ఏడవ సర్గ - పుష్పక విమానం

మహీకృతా పర్వతరాజి పూర్ణా
శైలాః కృతా వృక్షవితాన పూ
ర్ణాః
వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః
పుష్పం కృతం కేసరపత్ర పూర్ధమ్‌॥

సువర్ణ, వైడూర్యకాంతు లీనే రావణుని భవనం మెరుపులతో, రంగు రంగుల పక్షులతో అలరారే ప్రావృట్కాల మేఘమండలంలా ఉంది. వాటిలో ఆయుధశాలలు. ధనురాగారాలు, శంఖశ్రేణులు.

విశాలములూ మనోహరములూ అయిన గిరిశిఖరాలమీద చంద్రశాలలూ, దోషరహితాలూ, రాక్షస, దేవతాపూజార్హాలూ, సువర్ణ శోభితాలూ, మయశిల్పి నిర్మితాలూ అయిన గృహరాజాలు గోచరించాయి.

మహామేఘంలా ఉన్న సువిశాల భవనంలో రాక్షసేంద్రుని ప్రధాన సేనాబలం ఉన్నది. దానికి సాటివచ్చే భవనం మరొకటి లేదు. భూమికి దిగిన స్వర్గంలా ఉంది. రత్నశోభ లీనుతున్నది.

కేసరాలు నిండిన పూలతో మునిగిన వృక్షాలతో అలరారే గిరిశిఖరంలా ఉంది. ఆ భవనంలో నారీరత్నాలు మేఘాలలో మెరుపులవలె ఉన్నారు. ఆకాశంలో విహరించే పుణ్యపురుషుల విమానంలా ఉంది. రాజహంసలే వాహనాలుగా ఉన్నట్లుంది.

అది పుష్పకం.

రంగు రంగుల శిలలతో శోభించే పర్వత శిఖరంవలె రత్నఖచితమై, గ్రహపరివేష్టిత చంద్రమండల సదృశమై, విచిత్ర మేఘాలయమై గోచరించింది.

అ ప్రాంతపు భూప్రదేశం పర్వత సమూహంతో, పర్వతాలు తరు సముదాయంతో, తరువులు పూలగుత్తులతో, పూలు పరాగ సముదాయంతో ఉన్నాయి.

సౌధాలు సుధాధవళములు.

సరోవరాలు, పద్మసంభరితాలు. పద్మాలు కేసరపూర్ణాలు. చిత్ర చిత్రంగా ఉన్నాయి.

భవనాలన్నిటికంటె ఉన్నతంగా రత్నద్యుతులతో అలరారుతున్నది పుష్పకవిమానం.

కొన్ని పక్షలు వైడూర్యమణిమయాలు. మరికొన్ని రజితఖచితాలు. ప్రవాళ, స్వర్ణ నిర్మితాలు కొన్ని. సర్వమూ స్వర్ణమయం. సర్పాలు, జాత్యశ్వాలు అన్నీ చక్కగా చెక్కివుంచారు.

పగడాలతో, బంగారుతో పూవులు చెక్కిన రెక్కలు కొన్నింటికి, వయారంగా వంగిన రెక్కలతో కొన్ని, మదనుని సమక్షంలో ఉన్న పక్షులవలె ఉన్నాయన్నీ. కేసరాలు వీడని కలువలు పట్టిన తొండాలతో గజరాజులు. పద్మహస్తయైన లక్ష్మీదేవి స్వరూపం. వసంతకాలంలో వికసించిన తరు శోభతో నిండిన పర్యతరాజులా వున్నదది.

రావణుని పూజలతో, రక్షణతో అలరారే లంకానగరంలో తిరిగి తిరిగి సీత జాడ దొరకక విచారిస్తున్నాడు హనుమంతుడు.

సుగుణ సంపదతో రాముని ప్రియురాలయిన జానకిదేవిని అన్వేషిస్తూ పరి పరి విధాల అలోచనలు సాగిస్తూ సాగుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు.

రావణ భవన మధ్యంలో రత్న శోభితమూ సువర్ణగవాక్ష సంభరితమూ, గగన సంచారయోగ్యమూ అప్రతిమానమూ అయిన పుష్పకాన్ని చూస్తున్నాడు.

ఏకాగ్రమయిన తపోదీక్షతో కాని దాన్ని నిర్మించలేరు అది మన మనస్సుని ఊహననుసరించి సాగిపోగలశక్తి కలది. వాయువేగంతో ప్రయాణం చేయగలదు.

త్రైలోక్యవర్తనులూ, మహాత్ములూ, శ్రీ యశో విరాజితులూ అయిన దేవతల భవనంలా కనిపిస్తున్నది.

శరత్కాలచంద్రునివలె ఉన్నది. దర్శన మాత్రంచేత మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తుంది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరిశిఖరంలా వుంది.

మాంచి తిండిపుష్ఠీ, తీవ్రగమనమూ, విశాలనేత్రాలూ కల గగన చారులయిన రాక్షసులు దాన్ని పరిరక్షిస్తున్నారు.

వసంతసుమశోభతో, వాసంతాధిక మనోహరంగా ఉన్నదది

అంతఃపురం

Anveshana - అన్వేషణ

రామాయణం సుందరకాండ ఆరవ సర్గ - అన్వేషణ

సూర్యకాంతులీనే ప్రాకారంతోవున్న రావణభవనంవైపు అడుగుపెట్టాడు. సింహ రక్షితమయిన అరణ్యంలా ఉన్నదది.

ఏనుగుల మీద, గుర్రాలమీద, రథాలమీద మహాయోధులు కాపలా కాస్తున్నారు. ఆ రథాలు రజత, సువర్ణ, దంత వినిర్మితాలు. సింహ శార్దూల చర్మాలంకృతాలు.

భవనం నిండా రంగురంగుల పక్షులు, మృగాలు, మణిఖచిత పాత్రలు, రత్న వినిర్మితాసనాలు, విచిత్రభూషణ శోభతో అలరారే యువతీ జనం.

శంఖ, భేరీ, మృదంగ నాద తరంగాలతో సముద్రంవలె ఉన్నది. పూజలు, హోమాలు సాగుతున్నాయి.

ఆ భవన పరిసరాలలోవున్న ప్రహస్త, మహాపార్శ్వ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి, సుమాలి, జంబుమాలి, రశ్మికేతు, సూర్యశత్రు, వజ్రకాయ, వక్ర, శుకనాస, శఠ, వికట, హ్రస్వకర్ణ, రోమశ, దంష్ట్రాసుర, ధూమ్రాక్షాది మహాయోధుల భవనాలన్నీ తిరిగాడు.

రావణ భవనానికి అల్లంత దూరంలో కాలజీమూత౦లా ఉన్న కుంభకర్ణుని మందిరం అంతా అన్వేషించి, విభీషణుని సౌధం కూడా శోధించాడు. ఇంద్రజిత్తు అవాసంకూడా తిరిగి, తిరిగి లంకేశ్వరుని సౌధంలో ప్రవేశించాడు.

ఆ భవన ప్రాంగణంలో ఐరావత సదృశాలయిన మత్తేభాలు వర్షకాల మేఘాలవలె వున్నాయి. వాటి ఘీంకారాలు మబ్బులు ఉరుము తున్నట్టున్నాయి.

శూల, ముద్గర, శక్తి, తోమరాయుధధారులై ఎందరో వికృతా కారులయిన రాక్షసులు అప్రమత్తంగా రక్షణభారం నిర్వహిస్తున్నారు.

సాగుతున్నాడు. హనునుంతుడు.

బంగారు తెరలతో, లేయెండ కాంతితో పాలకీలు, పొదరిళ్ళు, కుటీరాలు, క్రీడాగృహాలు, దారు వినిర్మిత పర్వతశ్రేణులు, వినోదమందిరం, మరొకవంక కేళీ విహార భవనం.

ఇంకా ముందుకు పోగా మయార నర్తనాలతో మందరగిరి సదృశంగా ఉన్న సౌధం.

ధైర్యశాలురు బలికర్మలు నిర్వర్తించిన పరమశివ భవనంలా ఉన్నదది. ఆ భవనంలోని మణి రత్నకాంతులు సూర్యకిరణాలవలె వెలుగు లీనుతున్నాయి.

బంగారు ఆసనాలు, మంచాలు, పాత్రలు. అంతటా మధువు, మద్యం నింపిన మాణిక్య కలశాలు; చూడగా అది కుబేర భవనంలా ఉంది.

విశాల ప్రాంగణాలు.

బంగారు వడ్డాణాలు, అందెలు గలగలలాడే నారీ రత్నాలు, అంతటా శ్రవఃపేయంగా మృదంగ నిస్వనాలు.

సాగుతున్నాడు హనుమంతుడు.

పుష్పక విమానం

Chandra Darsanam - చంద్ర దర్శనం

రామాయణం సుందరకాండ అయిదవ సర్గ - చంద్రదర్శనం

వెన్నెలలు విరజిమ్ముతూ, ఆకాశ మధ్యానికి చేరాడు చంద్రుడు. గోశాలలో వృషభంలా వున్నాడు. సర్వభూతకోటినీ ప్రకాశింపజేస్తూ, లోకాల పాపాలు నశింపజేస్తూ, సముద్రాన్ని ఉప్పాంగిస్తూ, భూలోకంలో శోభామయమయిన మందరగిరివలె, ప్రదోషవేళ సాగరంవలె, సరోవరంలో వికసించిన పద్మంలా కనిపించాడు.

చూస్తున్నాడు హనుమంతుడు.

వెండి పంజరంలో హంస వలె, మందరగిరి గుహలో సింహం వలె, మత్తేభంమీద వున్న మహావీరుని వలె- గగన మధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడు.

మొనదేరిన వాడికొమ్ముల ఆబోతులా, అకాశానికి పొడుచుకు వచ్చిన శిఖరాలుగల పర్వతంలా,
బంగారు పూతపూసిన దంతాలుకల గజరాజులా వున్నాడు.

రాతిబండ నెక్కిన మృగేంద్రం, రణమధ్యంలో నిలిచిన గజేంద్రం, రాజ్యసుఖం పొందిన నరేంద్రునివలె వున్నాడు చంద్రుడు.

చీకటి తొలగి, కాంతి వెల్లివిరిసింది, రాక్షసుల మాంసభక్షణ వాంఛ పెరిగింది. ప్రేయసీ ప్రియులకు కోపాలు వైదొలగాయి. 

వీణానాదాలు వీనులవిందు చేస్తున్నాయి. నారీమణులు తమ ప్రియుల గాఢ పరిష్వంగంలో నిద్రిస్తున్నారు. నక్తంచర ప్రాణికోటి రౌద్రరూపంతో విహరిస్తున్నది.

ప్రయాణ యోగ్యమయిన రథాలు, అశ్వాలూ, వాటికితోడు భద్రమయిన ఆసనాలూ కల ఆ భవనాలలో మదిరాపానమత్తులు యధేచ్చా విహారం చేస్తున్నారు.

ఆ రాక్షస జనంలో పరిహాస ప్రసంగాలు, భుజాస్ఫాలనాలు. ఒకరిపై ఒకరు విసురులు.. ఓహ్! కోలాహలంగా ఉంది.

మరీ మత్తులో ఉన్న కొందరు ఎదురుగా ఉన్న అందకత్తెల మీద వాలుతున్నారు.

స్త్రీ జనంలో

కొందరు సుఖంగా నవ్వుతూ, మధురమధురంగా పలుకుతున్నారు. కొందరు అలకతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. మరి కొందరు హాయిగా నిద్రపోతున్నారు.

గజ ఘీంకారాలు, మహావీర విశ్వాసాలు, పడగలు విప్పిన సర్పాల బుసబుసలతో నిండిన మహాహ్రదంలా కనిపించింది.

సజ్జన సత్కారాలు కూడా ఉన్నా యక్కడ.

ఆ రాక్షసగణంలో ధీమంతులూ, కార్యకుశలులూ. శ్రద్ధాళువులూ ఉన్నారు.

రూప, గుణసంపన్నులయిన పురుషులూ వారికి యోగ్యులయిన పరిశుద్ధ హృదయులయిన వారి ప్రియురాండ్రనూ చూశాడు.

సిగ్గు తెరలో వెలిగే భామలు కొందరు. భర్తృపరిష్వంగంలో పరవశించేవారు కొందరు. ప్రియుల అంకసీములో అంగనలు.

మేడల పై భాగాలలో విహరించే భామామణులు. మదనమంత్ర పరాయణలు కొందరు. ధర్మాచరణ మర్మమెరిగిన మహిళ లెందరో!

మేలిముసుగు జారగా బంగారు శోభతో కొందరు. కొలిమిలో కరుగుతూన్న బంగారు కాంతి శరీరాలు కొన్ని.

చంద్రకాంతితో మరెందరో! వారిలో కొందరు విరహవ్యధలో ఉన్నారు. అభిసారికలు, వాసవసజ్జికలు! మెరపు తీగెల మాలల వలె ఉన్నా రందరూ.

అందరు కనిపించినా, సీతాదర్శనం కాలేదు. హనుమంతునికి. సనాతన ధర్మశీల, పతివ్రతా శిరోమణి, రామహృదయేశ్వరి గోచరించ లేదు. రామవిరహంతో ఆ యిల్లాలు అస్పష్ట చంద్రరేఖవలె, ధూళిసోకిన బంగారు కణికలా, వాయుధూత మేఘశకలంవలె ఉంటుంది, అనుకుంటూ అన్వేషణ సాగిస్తున్నాడు.

కనిపించలేదు సీత. శోకవశు డయాడు హనుమంతుడు.

Entering the City - నగరప్రవేశం

రామాయణం సుందరకాండ నాల్గవ సర్గ - నగరప్రవేశం

ప్రవిశ్శ నగరీం లంకాం
కపిరాజ హితంకరః
చక్రే
థ పాదం సవ్యం చ
శత్రూణాం సతు మూర్ధని”.

కోట ద్వారాలవంక చూడకుండా ప్రాకారంమీది నుండి దిగుతూ శత్రువు శిరస్సుమీద పెట్టినట్టు ఎడమకాలు ముందు పెట్టాడు, నగరంలో రంగురంగుల పూలతో అలరారే రాజవిధులలో సాగుతున్నాడు. అటూ ఇటూ ఐరావతాలవంటి భవనాలు. వాటినుండి నవ్వుల రువ్వులు. భేరీ
భాంకారాలు. తెల్లని మేఘాలవలె పద్మాకారంతో కొన్ని, స్వస్తికాకృతితో కొన్ని భవనాలు కన్పించాయి.

కాలి అందెల చప్పుళ్ళు, మువ్వల వడ్డాణాల ధ్వనులు. అప్సరసల అందాన్ని అపహసించే రమణీమణులు తార, మంద్ర, మధ్యమ స్థాయి భేదాలతో మధురంగా గానం చేస్తున్నారు.

ఒక్కో భవనం నుండి ఇంకో భవనానికి వెడుతున్నాడు. సింహగర్జనలతో జెబ్బలు చరుచుకుంటూన్న వీరులు. ఉదాత్తానుదాత్త, స్వరిత స్వర సంపన్నులయి మంత్రపాఠం చేసే వేదవేత్తలు.

గొంతెత్తి రావణస్తోత్రాలు వినిపించేవారు.

రాజవీధులనిండా ఆయుధధారులయిన రాక్షస వీరులు.

కోటలోని మధ్యప్రాకారంలో చారచర్య నెరిగిన మేధావులు.

వృషభ చర్మాలు ధరించిన యజ్ఞదీక్షితులు, జటాజూటధారులు, ముండిత శిరస్కులు, దర్భాయుధదారులు, అగ్నిగుండాలే ఆయుధాలుగా కలవారు, దండ, ముద్గరాది ఆయుధాలతో అలరారేవారు, ఏకాక్షులు, ఏకకర్ణులు, లంబోదరులు, భీకరాకారులు, వంగిన ముఖాలవారు, వికృత
దేహులు, పొట్టివారు, కత్తులు, ధనుస్సులు, శతఘ్నులు, పరిఘలు పట్టి తిరిగే కవచ ధారులు, పొట్టి పొడుగూకాని, అంతలావూ, మరీ సన్నం కానివారు.

రూపవంతులు, తేజస్వంతులు, పతాకశోభితధ్వజదండధారులు, పాశహస్తులు, పట్టిస, అశని, శక్తి వృక్షాది ఆయుధపాణులు.

సాగుతున్నాడు హనుమంతుడు.

మంచిగంధం పూసుకుని, సువాసనలీనే పూలమాలలు వేసుకుని, రత్నాభరణ భూషితులై విహరించేవారు, గోచరించారు.

అంతఃపురం సమీపిస్తున్నాడు,

వందల యోధులు పహరా యిస్తున్నారు. పర్వత శిఖరం మీద ఉన్న ఆ గృహ ద్వార తోరణం బంగారంతో నిర్మించారు. దాని చుట్టూ ప్రాకారాలు. వాటిలో పద్మ సరోవరాలు. 

మత్తగజాలు, ఉత్తమ జాతి అశ్వాలు, రథాలు, విమానాలు, మృగాలు, పక్షులు.

రత్నమాణిక్యకాంతులతో గోడలు.

అంతటా అగరుగంధ ధూపం. అందులో అడుగుపెట్టాడు హనుమంతుడు.

చంద్రదర్శనం

రామాయణం సుందరకాండ

Rukminidevi Anidyothanuniki Namaskarinchuta - రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రు క్మి ణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట బ్రాహ్మణవంశానికే రత్నంవంటివాడా; నీ బంధువులపాలిటి చింత...