Monday, January 13, 2025

గోదా కళ్యాణం

గోదా కళ్యాణం

సకల శుభకరం గోదా కళ్యాణం వీక్షణం..

సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకని ?

ఎందుకని అంటే రెండు కారణాలు. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే "పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసారు కానీ వారు తరువాతి వారికి ఏమి అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది, పద్మావతి అమ్మవారు శ్రీనివాసున్ని వివాహమాడి ఊరుకుంది, కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏంతెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది.  సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తనవంటి కదిలే రూపంలోనే వివాహ మాడారు వారి అవతారాల్లో. కానీ గోదా దేవి మనవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథున్ని వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇది కదండి గొప్ప అంటే. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని, అది దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. "ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర శుడరే తుయిలెరాయ్", అంది అమ్మ అంటే "లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహరూపంలొ ఉండే భగవంతుడా! ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను" అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది..

మూడు పనులు చేసి విగ్రహరూపంలొ ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి "కృష్ణమ్ ఉద్భోధ్య", "కృష్ణమ్ అధ్యాపయంతి" మరియూ "కృష్ణమ్ బలాత్కృత్య భూంక్తే". ఆయన ఏమి ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా, మనల్ని బాగుచేయడానికి, మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతే కాదు స్వామి విగ్రహరూపంలో ఉన్నా ఆయన్ని నిర్బందించి, బంధించి, ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆంఢాళ్ ఉంటే, శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీదికి చిత్రవీది అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీది ఉత్తరవీది, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవకన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవ మూర్తిగా మలచి తానూ ఉత్సవ మూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో, అమ్మ ఆదేశాన్ని బట్టి..

అమ్మ రామచంద్రుని ఇలవేల్పుఅయిన శ్రీరంగనాథున్ని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించినా వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం..

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...