Friday, January 3, 2025

తిరుప్పావై - ఇరవైవ పాశురము

 తిరుప్పావై - ఇరవైవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 20వ రోజు.

నిన్నటి రోజున గోపికలు నీలాదేవి తో చెబుతున్న మాటలు..
నువ్వు నీ స్వామిని ఇప్పటికైనా లేపి మాకు చూపించవా? ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా? నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు.

ఈరోజు పాశురాన్ని చదువుదాం.

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు 
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పమ్ కొడుక్కుం విమలా! తుయిలెళాయ్
శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ చ్చిరుమరుంగుల్
నప్పిన్నయ్ నంగాయ్! తిరువే! తుయిలెళాయ్
ఉక్కముం తట్టొళియుం తన్దు వున్ మణాళనై
ఇప్పోతే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్ || 20 ||

ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం

దేవతలకు ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే శ్రీహరి తన శక్తి చేత వారిని ఆదుకుంటాడు.ముప్పై మూడు కోట్ల దేవతలకు రాక్షసుల వల్ల కానీ, మరే విధంగా గాని కలిగే ఆపదలను ముందుగానే పోయి తొలగించేటంత బలం కలవాడా! 

నిర్మలుడవు, ఆర్జవము కలవాడా! అంటే నిజాయితీ కలవాడా! నిదుర మేలుకో! మనసుతోను, వాక్కుతోను, శరీరంతోనూ కూడా ఒకే విధమైన గుణము కలవాడా!...
(భగవంతుడు తన మనసులో ఉన్నది మాటలతోనూ, మాటలతో వచ్చినది చేతులతోనూ చేసి చూపిస్తాడు.మన లాగా మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి. ఆ విధంగా ఉండదు పరమాత్మ తత్వం.)

నిన్ను ఆశ్రయించిన వారి దుఃఖములను పోగొట్టేవాడా! నిద్ర మేల్కో! అని గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మని లేపినా సరే ఆయన నిద్ర లేవలేదు. 

పరమాత్మ లేవలేదు అంటే, లేచి వాళ్ళను అనుగ్రహించలేదు అంటే ఆ గోపికలకి ఇంకా మోక్షం పొందడానికి కొంచెం సమయం ఉందన్నమాట.

అప్పుడు గోపికలు ఆలోచించి..అలాక్కాదు ముందు అమ్మనే నిద్ర లేపుదాం అని నీలాదేవిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నారు. నిద్రలే అమ్మా! బంగారు కలశముల వంటి మృదువైన స్తనములను కలదానా!, దొండపండు వలె ఎర్రని పెదవియును, సన్నని నడుమును కలిగిన నప్పిన్న అనే పేరుగల ఓ మహాలక్ష్మీ!

ఓ నీలాదేవీ! నిద్ర మేలుకో! 
నీలాదేవి వక్షస్థలమే (స్తన ద్వయమే) శ్రీకృష్ణపరమాత్మ నివాసస్థానం.
(లోకలన్నింటికీ అమ్మ కదా! అందుచేత అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇలా వర్ణించడం తప్పుకాదని గోపికలు భావించారు.) 

మాకు (ఆలపట్టం) విసనకర్రను, అద్దమును ఇచ్చి మమ్ములను నీ పెనిమిటితో కలిసి,
స్నానమాడించి సుఖింప చేయుము. 

ఆ గోపికలు పరమాత్మతో కలిసి స్నానం చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
విసనకర్ర, అద్దము అనునవి స్నాన వ్రతానికి కావలసిన పరికరములు. విసనకర్ర శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాపాన్ని పోగొడుతుంది. ఇక అద్దము స్వస్వరూపాన్ని తెలియజేసేది. మనల్ని మనకు చూపించేది.మమ్మల్ని అనుగ్రహించి సుఖ పెట్టమ్మా!

అని గోపికలు ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...