Friday, September 5, 2025

sri Bhuvaneswari Devi Vupasana Vidhanamu - శ్రీ భువనేశ్వరీ దేవి ఉపాసన విధానము

శ్రీ భువనేశ్వరీ దేవి ఉపాసన విధానము

శ్రీ భువనేశ్వరీదేవి ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడవ నేత్రం తెరుచుకుంటుంది. అంటే భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంటారు. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. దశమహావిద్యాధి దేవతలలో ముఖ్యంగా చెప్పుకోదగినది భువనేశ్వరీదేవినే అంటారు. ఈమెనే మహావిద్య అని కూడా పిలుస్తారు.

భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భుః అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః స్వర్గము ఈ మూడింటిని ఏలే తల్లి అని అర్థం. ఈమెకే శ్రీ రాజరాజేశ్వరీ దేవి అనే పేరు కూడా ఉంది.

ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడివుంది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయనారంభించాడు. సృష్టిలో తాను కోరుకున్న ప్రతీ వస్తువునీ, ప్రతీ ప్రాణినీ బ్రహ్మ సృజించాడు. కానీ ప్రాణులలో క్రియా శక్తిని మాత్రం నింపలేకపోయాడు. అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోరతపస్సు చేసాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో, మరో చేత అంకుశంతో, వరదాభయ ముద్రలతో, అరుణవర్ణంలో, కమలాసనయై బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది. అపై బ్రహ్మచే స్తుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణువణువులో క్రియా శక్తిగా ప్రవేశించింది.

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం
దేవికి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి సుమంగళులకు వడ్డిస్తే ఆ ఇంట్లో సుఖం, శాంతి, ప్రశాంతత, సంతోషం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని నమ్మకము. అంతేకాక ఈ దేవికి పాయసం అంటే కూడా ఎంతో ప్రీతి. పాయసాన్న ప్రీతమానస అయిన ఈ దేవికి పాయసాన్ని నివేదిస్తే ఎంతో సంతోషిస్తుంది.

పదునాలుగు భువనాలకు అధీశ్వరి
భువనేశ్వరి అంటే ఈ చతుర్ధశ భువనాలకీ అధీశ్వరి. పధ్నాలుగు భువనాల్లోని చరాచర జీవరాసులన్నీ ఈ దేవి ఆదీనంలోనే ఉంటాయి. ఈ మహా విద్య పరమశాంతి రూపిణీ. మూల ప్రకృతి రెండో నామాన్ని భువనేశీ అంటారు. భువనేశీ అనగా భువనేశ్వరీ. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశ్వరీ దేవివే.

బ్రహ్మదేవుడు తపస్సు చేయగా పార్వతీదేవి బ్రహ్మ తపస్సుకు మెచ్చి విశ్వసృష్టికై భూదేవిగా అవతరించింది. విశ్వం యొక్క సృష్టి, క్రియ మరియు లయ కారకురాలు భువనేశ్వరి దేవి. ఈమె శరీరము ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఈమెకు మూడు నేత్రాలు మరియు నాలుగు హస్తాలు ఉన్నాయి. ఈమె చేతులలో పాశము, అంకుశము మిగిలిన చేతులతో భయం తొలగిస్తూ స్వేచ్చను ప్రసాదిస్తూ అభయ ముద్రతో ఉంటుంది.

శాకాంబరిగా అవతరణ
పూర్వం దుర్గమాసురుడు క్రూరుడై, అభేద్య వరాలు పొంది సమస్త సృష్టిలోని ప్రాణులను, దేవతలను బాధించసాగాడు. వాడి ప్రకోపం వలన భూమిపై జలధారలు ఎండిపోయి కరువు ఏర్పడింది. ఎంతో మంది తమ ప్రాణాలు విడిచారు. అప్పుడు ఋషులు, దేవతలు హిమాలయాలకు బయలుదేరి అమ్మవారికై ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన మాత వెంటనే వారి ఎదుట ప్రత్యక్షమైంది. వారి కష్టాలను విన్నమాత తన సహస్ర అశ్రుధారలతో భూమిపై నదులను ప్రవహింపచేసి దుర్గమాసురుడి వలన ఏర్పడిన క్షామాన్ని తరిమికొట్టింది. వెంటనే భూమిపైన జీవకళ ఉట్టిపడింది. అమ్మ స్వయంగా తన చేతులతో శాకములను, కందాది మూలాలను సృష్టించింది. అందువల్లనే అమ్మ వారికి ‘శాకంబరి' మరియు శతాక్షి అనే పేర్లు కూడా కలవు. అప్పుడు భువనేశ్వరి దేవి బాణములు, పాశము, అంకుశము మొదలైన ఆయుధాలు ధరించి దుర్గమాసురుడిని సంహరించింది.

శాంతిని కోరుకునేవారికి భువనేశ్వరి
నిత్య జీవితములో పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వారు శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరీ దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా, త్రయంబకుడు శివుడుగా, పరమేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్య మోహిని యక్షిణిగా ఉంటారు.

బృహన్నీలతంత్రంలో అమ్మవారికి ఉన్న మూడు నేత్రాలు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలని వివరించబడింది. సృష్టిలో అవ్యక్తరూపంలో భువనేశ్వరి దేవి ఉంటే, వ్యక్తంగా కాళీ మాత ఉంటుంది. అందుకే ఇద్దరికీ భేదమే లేదు.

భువనం అంటే లోకం. ఈ లోకానికి సృష్టికర్త భువనేశ్వరీ. సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే. ఈమెనే అదితి అని కూడా అంటారు. అ+దితి అంటే ఖండం కానిదని అర్థం. ఈ అదితి దేవతలందరికీ మాతృమూర్తి. 

సమస్త భువనాలకు అధీశ్వరియైన ఈ దేవత ల సూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. కిరీటం మీద చంద్రకళ, మూడు కన్నులు, చిరునవ్వు ఆమెకు అలంకారాలు. ఈమె పరమ శాంతి స్వరూపిణి “పరమాం శాంతిం కామయ మానో భువనేశ్వరీ ముపాసీత”. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావమును చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన శమ స్థితిని పొందాలి. ఆ శమములో ఆనందముంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం.
ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. 

దశమహావిద్యల వరుస క్రమాన్ని గనక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభం అని తెలిపే కాళీమాత రూపం సృష్టి బీజానికి ప్రతీక ఐతే, తారా మాత ప్రారంభానికి ప్రతీక. షోడశిమాత నిర్మాణానికి ప్రతీక ఐతే, భువనేశ్వరి దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక. ఈ సృష్టి పరిణామక్రమమే ముందుకు సాగుతూ కమలా దేవి వద్ద పూర్ణత్వాన్ని అందుకుంటుంది.

ఇంద్రియ విజయాన్ని కలిగించే మాత
దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టించబడినారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువునకు స్థితి శక్తిని మహే వాశ్వరునకు సంహారశక్తిని ఆమె ప్రసాదించింది. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగతీసుకొన్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీం కార బీజ రూపిణిగా, మహామాయగా, శక్తిగా, ఏకాక్షరిగాని, త్రక్షరిగాని, స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే ఆ సాధకునకు భువనేశ్వరీ కరుణ అ కలుగుతుంది.

శివశక్త్యాత్మకమైన హ్రీం మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్‌ అంతయూ ఆమె హిరణ్యగర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం.

హృల్లేఖా మంత్ర ప్రభావం
చతుర్ధశభువనాధీశ్వరి అయిన భువనేశ్వరీ దేవి, దేవీ భాగవతంలో హిమవంతుడికి యోగవిద్యను బోధిస్తూ తనను ఏ విధంగా ధ్యానించాలో ఇలా చెబుతుంది.

హకారః స్థూలదేహః స్యాద్రకారః సూక్ష్మ దేహకః
ఈకారః కారణాత్మా సౌ హ్రీం కారో హం తురీయకమ్‌

ఓ హిమవంతా మూడు అక్షరాలతో కూడిన నా దివ్య బీజాన్ని నీవు ధ్యానించాలి.
నా స్థూలదేహమైన కారాన్ని నా సూక్ష్మ దేహమైన కారాన్ని నా కారణ దేహమైన  కారాన్ని కలిపి హ్రీం అనే ప్రణవ బీజంతో నన్ను ఉపాసించాలి. నాకు చేసే ప్రతి పూజా ఈ హృల్లేఖా మంత్రంతోనే చేయాలి.

హృల్లేఖా దర్పణే నిత్యమహం తత్ప్రతిబింబితా
తస్మాత్‌ హృల్లేఖయా దత్తం సర్వమంత్రైః సమర్పితమ్‌

హృల్లేఖ అంటే సర్వ మంత్రాలకూ నాయిక వంటిది. మంత్ర మహారాజ్ఞి అయిన హ్రీం అనే ఆ మంత్ర దర్పణం (అద్దం) లో నేను ప్రతి నిత్యం ప్రతిబింబించి ఉంటాను. అందుకే నాకు సమర్పించే పూజ, జపం, తపం అన్ని హృల్లేఖా మంత్రంతో సమర్పిస్తే అది సకల మంత్రాలతో సమర్చించినట్టవుతుంది.

అందుచేత ఓ హిమవంతా నిత్యం హ్రీం భీజంతో భువనేశ్వరి అయిన నన్ను పూజిస్తూ, ఉపాసిస్తూ ఉండేవారికి లోకంలో దుర్లభమైనది ఏదీ ఉందదు. వారు శరీరం విడిచాక నా దివ్య చింతామణి గృహానికి చేరుకుంటారు అని స్వయంగా చెప్పింది కనుక అత్యంత మహిమోపేతమైన ఈ భువనేశ్వరీ మహావిద్యని నియమపూరితంగా ఉపాసించి కృతార్థులు కావచ్చు.

సుభద్రాదేవి అవతారంలో భువనేశ్వరీ
పూరీలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని భువనేశ్వరి దేవి అవతారంగా కొలవడం అక్కడి సంప్రదాయం. ఈ లోకాలన్నింటిని కాపాడేది తల్లే. దశమహావిద్యలలో కాళీమాత మరియు భువనేశ్వరిదేవి అతి ముఖ్యమహా విద్యలు. నారద పాంచరాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది. షోడశిమాతకి మరియు భువనేశ్వరి దేవికి సారూప్యత ఎక్కువ. మహా నిర్వాణతంత్రం ప్రకారం ఏడు కోట్ల మంది మహామంత్రిణులు ఈమె సేవలో సదా ఉంటారు.

శ్రీ విద్యకు సారం
శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలను ఓక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా వేయి నామాలలో అనేకానేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఐదు నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే, ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని మరోచోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహా మంత్రం. ఇంకోచోట శ్రీ చక్రాన్ని వివరించారు. మరి కొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్టిపూజా విశేషాలను, షట్చక్రా లను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయనీ విద్య, వాగ్వాదినీ విద్య, శివదూతి విద్య, గాయత్రీ మంత్రం, ఆత్మ విద్య... ఈ విధంగా అనేకానేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినవి. ఒక్కలలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రము శ్రీ విద్యకు సారధి వంటిది.

హ్రీంకార కోశాసిలతా
1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రములుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాల మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం. అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో మూడవ హ్రీంకారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకార కోశాసిలతా అని స్తుతించబడింది. అసి అంటే ఖడ్గము. అసిలతా అంటే ఖడ్గధారి. హ్రీంకారమనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి. హ్రీంకారమనే కోశంలోనే ఆమె ఖడ్గము (కత్తి. తన భక్తులకు కలిగే రాగ ద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో ఛేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ దేవి ఖడ్గమాలతో స్తుతిస్తాము.

భువనేశ్వరీ శక్తి వర్ణనాతీతం
భువనేశ్వరీ దేవికి ఉన్న శక్తి వర్ణణాతీతం. ఈ సృష్టి దాని స్థితి మరియు లయం కావటం అనే కార్యాలు ఈమె యొక్క శక్తికి నిదర్శనాలు. చిరునవ్వులు చిందించే ముఖంతో ఆమె భక్తులకు వరాలు ఇస్తూ ఉంటుంది. ఈమెను పూజించేవారికి సమస్త భయాలు తొలగిపోతాయి. భువనాన్ని ఏలే శక్తిగల భువనేశ్వరీదేవి కలువ పువ్వులో రాజసంగా లోకాన్ని శాసిస్తూ కూర్చుని ఉంటుంది. ఈమె మహిమలను అడ్డుకునే శక్తి నవగ్రహాలకు గానీ, త్రిమూర్తులకు గానీ లేదు అని చెబుతారు.

భువనేశ్వరీ అనగా పార్వతీ దేవి. కాళి, తార, త్రిపుర సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెర వంటిది. దశమహావిద్యలు వామ, కౌళ సంప్రదాయములకు చెందినవి. వామ, కౌళములు సిద్ధపురుషులకే గాని సామాన్యులకు కాదు. పరమ దేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల విధి విధానం తెలుసుకొని అర్చించి దేవీ కృపకు పాత్రులు కావలసి ఉంటుంది.

ఈ దేవిని ఏడుకోట్ల మహా మంత్రాలు ఆరాధిస్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియా శక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరీ అని పిలుస్తారు. అవ్యక్తం నుండి వ్యక్తమైన బ్రహ్మాండ రూపం, చైతన్య స్వరూపమే భువనేశ్వరీ దేవి.

దయామయమైన భువనేశ్వరీమాత చూవుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. భువనానికి అధినాయికగా ఈమెను పేర్కొంటారు. ఈ దేవతను పూజించిన వారికి సమస్త భయాలు తొలగి పోతాయి. సకల భువనాలకు భువనేశ్వరీ దేవి అధి దేవత. సకల సృష్టి అమ్మ రూపంలో ఇమిడి ఉంటుంది.

భువనేశ్వరీ గాయిత్రి మంత్రం

ఓమ్‌ నారాయణైచ విద్మహే 
భువనేశ్వయై ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌!

శ్రీ భువనేశ్వరి దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్దతుల గురించి, శ్రీ భువనేశ్వరి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు సాధన చేస్తే ఆ సాధకుడికి జ్ఞాన నేత్రం అంటే మూడోకన్ను తెరుచుకుంటుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు అని అంటారు.

సంతానాధిదేవత
సంతానం కొరకై భువనేశ్వరి దేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది. రుద్రయామల అను గ్రంథంలో అమ్మవారి కవచము, నీలసరస్వతి తంత్రంలో అమ్మవారి హృదయము మరియు సహస్రనామాలు సంకలనం చేయబడి ఉన్నాయి.

త్రిమూర్తులను స్తీ రూపాలుగా మర్చిన మాత
దేవీ భాగవతం తృతీయ స్కంధంలో శ్రీ భువనేశ్వరీదేవి రూపం అత్యంత మనోహరంగా వర్ణించబడింది. బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు యోగమాయను స్తుతించి ఆదేవి అనుగ్రహంతో ఒక దివ్య విమానాన్ని ఎక్కి పర్యటిస్తూ, క్షీర సముద్రం మధ్యలో ఉన్న ఒక సుందర ద్వీపంలో ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించారు. వారు దర్శించిన భువనేశ్వరీ దేవి రూపం ఎర్రని వస్త్రాలు, ఎర్రని మాలలు ధరించి, ఎర్ర చందనాన్ని అలముకొని, కళ్ళు పెద్దగా, విశాలంగా ఎర్రగా చేసి ఉన్నది. కోటి విద్యుత్‌ రేఖల కాంతితో వెలిగిపోతూ, సూర్యబింబం లాగా ప్రకాశిస్తుంది. అత్యంత సుందర వదనంతో, పాశాంకుశాలు ధరించి, వరద అభయ హస్తాలు చూపుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సర్వాలంకార భూషణాలు ధరించిన ఆ మూర్తిని పక్షి బృందాలు హ్రీం హ్రీం అని హ్రీం కార జపం చేస్తూ సేవిస్తున్నాయి. ఆమె చుట్టూ ఉన్న సేవికలు అమ్మా ! భువనేశ్వరీ, హృల్లేఖా అంటూ ఆమె దివ్య నామాన్ని జపం చేస్తున్నారు. అనంగ కుసుమా మొదలైన దేవతలందరూ ఆమె చుట్టూ కూర్చొని పూజిస్తుండగా, షట్కోణ యంత్రం మీద కూర్చొని
భువనేశ్వరీ దేవి వారికి దర్శనమిస్తుంది.

ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించిన త్రిమూర్తులలో విష్ణుమూర్తి “ఈ దివ్యమూర్తి అందానికి కారణమైన భగవతి. ఈమే మహావిద్య, ఈ తల్లే మహామాయ. ఈ దేవే పూర్ణ ప్రకృతి స్వరూపం. ఎప్పటికీ నాశనం లేని మహాశక్తే ఈ భువనేశ్వరి” అని ఆ తల్లి దివ్య స్వరూపాన్ని వర్ణిస్తాడు.

ఈ విధంగా భువనేశ్వరీ లోకానికి చేరిన త్రిమూర్తులు విమానం దిగి ఆ తల్లి లోకంలో అడుగు పెట్టిన వెంటనే కరుణారస దృష్టితో స్త్రీలుగా మారిపోతారు. ఆ స్త్రీ రూపాలతోనే భువనేశ్వరీదేవి దివ్య పాదాల్ని దర్శించి, ఆ తల్లి కాలిగోటిలోనే బ్రహ్మండాల్ని చతుర్ధశ భువనాలను చూసి ఆనందంతో ఆశ్చర్యంతో భువనేశ్వరీ మాతను ప్రస్తుతిస్తారు. వారి స్తుతి విన్న భువనేశ్వరీ మాత వారిని కరుణించి, వారికి భార్యలను ప్రసాదించి, సృష్టి, స్ధితి, లయ కార్యక్రమాలను నిర్వహించమని ఆదేశించి వారిని అచ్చటనుండి పంపుతుంది.

ఈ విధంగా దేవీభాగవతంలో భువనేశ్వరీదేవి త్రిమూర్తులకన్నా అధికమైన దేవతగా, సాక్షాత్తు వారిచేతనే మహామాయగా, మహా విద్యగా కీర్తించబడి దర్శినమిస్తుంది.

ఆకాశానికి అధిదేవత
ఆకాశానికి ఆధిదేవత భువనే శ్వరి అని తంత్ర గ్రంథాలు వర్ణి స్తాయి. భువనేశ్వరీ దేవి నాద శరీరం హ్రీం కారం. అందుకే హ్రీం కారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరీ బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం (ఓం) అని, హృల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహా మాయగా, ఈమె బీజం హ్రీం కారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు.

ప్రపంచ సృష్టికర్త భువనేశ్వరి
భువనం అంటే ప్రపంచం. ఈ ప్రపంచానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే అని చెబుతారు. రాత్రికి అధిష్టాతృ దేవతగా భువనేశ్వరీదేవి ఉంటుంది. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశ్వరీ దేవియే.

వామాదేవిగా శ్రీ భువనేశ్వరీ మాత
ఈ దేవి సమస్త లోకాలను వమనం (వాంతి) చేసుకొన్నది కాబట్టి వామా అని, ఈ దేవికున్న శివమయతత్వం వల్ల జ్యేష్టా లేక కర్మ నియంత్రిణి అని జీవులను దండించే సామర్ధ్యం ఉండటం వలన రౌద్రి అని వ్యవహరిస్తారు.

పరమాత్మే వాక్‌, మనః, ప్రాణమయుడు. ఈ మూడు శక్తులు సూర్యుడిలో ఉంటాయి. సూర్యుడిలోనే షోడశకళ పరిపూర్ణ పురుషుడు వికాసంతో దర్శనమిస్తాడు. ఈ మూడు పురుషులే ఈ మూడు భువనములు. మూడు భువనాలను సృష్టించి రక్షించి సంహరించే పరమాత్మ శక్తినే భువనేశ్వరీ అంటారు. త్రిపురేశ్వరీ, త్రిపుర సుందరీ అన్నట్లుగానే త్రిభువనేశ్వరీ భువనేశ్వరీ అంటారు. ఈ భువనేశ్వరిని త్రికరణ శుద్దిగా అనగా శరీరం, మనస్సు, వాక్కులతో ఆరాధిస్తే ఆరోగ్యం, ఆనందం, బలం, సమృద్ధిగా కలుగుతాయి. మనకున్న మూడు భువనాలు అన్నమయం, మనోమయం, ప్రాణమయం. అన్నం ఆరోగ్యానికి, మనస్సు ఆనందానికి, ప్రాణం బలానికి ప్రతీకలు. లోతుగా పరిశీలించినా భువనం లేదా పురము అనగా మన శరీరమే. ఈ శరీరాన్ని ఇంద్రియాలను, ఇతర అవయవాలు శాసించేది బుద్దే. అనగా జ్ఞానశక్తి. ఆ శక్తే భువనేశ్వరీ. బుద్దికి జ్ఞాన శక్తి, శరీరానికి క్రియా శక్తి, మనస్సుకు ఇచ్చాశక్తి ఈ శక్తులకు ఈశ్వరీ త్రిపురేశ్వరీ, భువనేశ్వరిని సేవిస్తే మంచి కోరికలు కలిగి మంచి పనులు తలపెడతారు. అమ్మను సేవిస్తే పరమాత్మ జీవాత్మ కున్న సంబంధం ఇహపర లోకాల జ్ఞానం కలుగుతుంది. ఈవిధంగా మంచి కోరికలు కలిగి మంచి కార్యాలు తలపెట్టాలంటే భువనేశ్వరీ దేవిని ఆరాధించి తరించాలి.

శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాపార్వతి, త్రిశక్తిస్వరూపిణి, సర్వ శక్తిరూపిణిగా, మహాశక్తి స్వరూపిణిగా భువనేశ్వరీమాత దర్శనమిస్తుంది. అమ్మ యొక్క మంత్రము హ్రీం తో అమ్మవారి ఆరాధన వలన భక్తులకు సౌభాగ్యము కలుగును, విద్య, జ్ఞాన సంపద, ఆయురా రోగ్యములు, ధన, కనక, వస్తు వాహనాది, సమృద్ధి కొరకు, పుత్ర పౌత్రాభివృద్ధి కొరకు, సర్వాపదానివారణార్ధం, సకలకార్య విఘ్ననివారణార్థం, సత్సంతాన సిధ్యర్థం, ఇష్టకామ్యార్ద సిధ్యర్థం సకల ఐశ్వర్యముల కొరకు ఈ భువనేశ్వరీ మాతను పూజించాలి. దేవి దర్శనము, అత్యంత దుర్లభమయినదే కానీ ఆ దేవిని త్రికరణ శుద్దిగా పూజ చేసి అమ్మవారి మూలమంత్రమును సాధన చేసినవారికి అమ్మదర్శనభాగ్యము లభించును అని నమ్మకము.

భువనేశ్వరీ ఉపాసకులకు సర్వ వైభవాలు
భక్తితో సాధన చేస్తే శరీరంలో అణువణువునా దేవీ వైభవమే కనిపిస్తుంది. రైతన్నలకు పాడిపంటలు, సకల సౌభాగ్యములు ఇచ్చేతల్లి భువనేశ్వరీ దేవి. ఆ భువనేశ్వరీ దేవీ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల సంయుక్త రూపము. అందువలన భువనేశ్వరీ ఉపాసకులు సర్వ వైభవములు పొందగలరు.

చరాచర సృష్టికి ఆధార భూతమైన సర్వశక్తి సమన్విత అయిన భువనేశ్వరీ దేవి స్తోత్ర సంప్రీత, ఆశ్రిత కల్పవల్లి, స్మరణ మాత్రముననే తన కరుణను కురిపించే కన్నతల్లి, దశదిశలా వ్యాపించి సర్వశక్తి స్వరూపిణిగా విరాజిల్లే మహామహిమాన్విత మాతయే భువనేశ్వరీదేవి, సకల చరాచర సృష్టికి మూలపుటమ్మ ఓంకార స్వరూపిణి, జగత్‌ అంతా హ్రీం కారం, విశ్వమంతా శ్రీ కారం, సర్వ మహిమలకు మూలధారియై భువనేశ్వరీదేవి విలసిల్లుతుంది.

ఇష్టదైవం నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ, ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానమే జపం. జపంలో కారం మరో జన్మ లేకుండా (జన్మవిచ్చేదన) చేస్తుంది.  కారం పాపాలను నశింప చేస్తుంది. పలికిన వెంటనే ఫలితం ఇస్తుంది కాబట్టి పూజ కన్నా జపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. లింగ పురాణం ప్రకారం జపం చేయడం వల్ల యక్ష రాక్షస పిశాచాది భయంకర గ్రహాల బాధలు తొలిగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. జపం చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది.

జపాలలోని వివిధ రకాలు
జపం మూడు రకాలుగా చేస్తారు. మొదటిది వాచికం అంటే సమీపంలోని వారికి వినపడేటట్లు జపించడం. రెండోది ఉపాంశువు అంటే పెదవులను కదిలిస్తూ ఎవ్వరికీ వినపడకుండా చేయడం, మూడోది మానసికం అంటే మనసులో జపించడం. మూడో పద్ధతిలో చేసే జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

భువనేశ్వరీ మంత్రం
మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి వంటి గ్రంథాలలో వివిధ దేవతా మంత్రాలని ఏ విధంగా జపం చేయాలి? ఏ మాల ఉపయో గించాలి? ఏ ఆసనం మీద కూర్చోవాలి? ఏ సమయంలో చేయాలి? ఎలాంటి వస్త్రాల్ని ధరించాలి? పురశ్చరణ ఎలా చేయాలి? అనే విషయాలు వివరించబడ్డాయి. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్వకంగా జపించినచో మంత్రసిద్ధి జరుగుతుంది అంటారు. ఆ మూల మంత్రంతో చేసే జపం సత్ఫలితాన్నిస్తుంది అని భావన.

పురశ్చరణ పద్ధతిలో ఉపాసన
 ఏ మంతాన్నైనా శాస్త్రోక్తంగా ఒక నియమిత పద్ధతిలో సాధన చేసే విధానాన్ని పురశ్చరణ అంటారు. పురశ్చరణలో పంచాంగాలు.. జపము, హోమము, తర్పణము, మార్జనం, బ్రహ్మణ భోజనం. ఈ 5 విధాలైన కర్మతో శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించినచో అమ్మ కరుణ లభించగలదని అంటారు. పురశ్చరణ లేని మంత్రం కూడా నిరర్ధకమైంది కాబట్టి శ్రీ భువనేశ్వరీ దేవి మంత్రాన్ని పురశ్చరణ పూర్వకంగా ఉపాసిస్తేనే ఆ దేవత అనుగ్రహం మనకు లభీస్తుంది అని అంటారు.

ఎన్నిసార్లు పురశ్చరణ చేయాలి?
సాధారణంగా ఏ మంత్రానికైనా ఒక లక్షసార్లు (108 స సంఖ్య గల మాలతో 1000 మాలలు) మూల మంత్రాన్ని జపం చేయాలి. అందులో పదో వంతు అనగా 10,000 సార్లు ఆ మూల మంత్రంతో హోమం చేయాలి. హోమ సంఖ్యలో పదో వంతు అనగా 1000 సార్లు ఆ మూల మంత్రంతో తర్పణ చేయాలి. తర్పణ సంఖ్యలో పదో వంతు అనగా 100 సార్లు మూల మంత్రంతో మార్జన లేదా అభిషేకం చేయాలి. అందులో పదో వంతు అనగా.. పది మంది బ్రహ్మణులకు భోజనం పెట్టాలి. పై ఐదు కార్యాలతో మంత్ర పురశ్చరణ పూర్తవుతుంది. 

శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్వకంగా అనుష్టానం చేయాలనుకునే సాధకులు శుద్ధ అష్టమి నుంచి పూర్ణిమ వరకు జపం చేస్తే సత్వర ఫలితం లభిస్తుంది. సాధారణంగా సాత్విక దేవతలందరికీ ఈ తిథులు అత్యంత ప్రీతికరమైనవి అని అంటారు.

జపం ఎక్కడ చేయాలి? ఏ ప్రదేశాలు శుభం అనే విషయానికి వస్తే.. పుణ్యక్షేత్రం, తీర్ధప్రదేశం, దేవాలయాలు, నదీ తీరం, గుహ, పర్వతాగ్రం, తీర్థ ప్రదేశాలు, సాగర సంగమ స్థలాలు, పవిత్ర వనాలు, ఉద్యానవనాలు, సముద్ర తీరాలు, స్వగృహాలు.. ఈ ప్రదేశాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రదేశాలలో ఎక్కడైనా జపం చేయవచ్చు. అయితే దశ మహావిద్యలు కొలువున్న అత్యంత శక్తివంతమైన స్థలాలు కూడా గురువుల సలహా మేర ఎంచుకొన్నచో ఉత్తమ ఫలితాలు లభించగలవని భావన.

నిత్యం ఒక శుభ స్థానంలో కూర్చుని జపం చేయాలి. అయితే, శ్రీ భువనేశ్వరీ మంత్రం జపం చేయడానికి ఆసనం ముఖ్యం. శ్రీ భువనేశ్వరీ దేవికి ప్రీతికరమైన రంగు ఎరుపు కనుక ఎరుపు రంగులో ఉండే ఆసనాన్ని ఉపయోగించాలి. దర్భాసనం మీద ఎర్రని రంగు గల చిత్రాసనాన్ని వేసుకుని కూడా జపం చేయవచ్చు.

జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్‌ కుండలాం పద్మసంస్థామ్‌
ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్  భువనేశీమ్‌

ప్రతినిత్యం శ్రీ శ్రీ భువనేశ్వరీ అమ్మవారిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము. ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలముల యందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి, ప్రజల మన్నన, సేవకుల అనుకూల సహకారములు కలుగునని నమ్మకము.

భువనేశ్వరీ ఆలయాలు
శ్రీలంకలోని నైనాతివులో, తమిళనాడులోని పుదుక్కొట్టైలో, ఒడిషాలోని కటక్‌లో, గుజరాత్‌లోని గోందల్‌లో మరియు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో భువనేశ్వరీ అమ్మవారి ఆలయాలు ఉన్నవి.

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...