మత్స్య పురాణము
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
అష్టాదశపురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధః ప్రకీర్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహస్రాణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు.
మత్స్యపురాణంలోని 53వ అధ్యాయంలో అష్టాదశ పురాణాల లక్షణాలు, ఆపురాణాలలో చెప్పబడ్డ అంశాలు, శ్లోకాల సంఖ్య తదితర విషయాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి. పురాణాలలో ఇది ప్రాచీనమైనదిగా పండితులు భావిస్తారు.
మత్స్యపురాణంలో చెప్పబడ్డ ప్రధాన అంశాలు :
మత్స్యావతారవర్ణన, బ్రహ్మాండసృష్టి, గర్భిణీధర్మాలు, సూర్యచంద్ర వంశాల వర్ణన, గయాక్షేత్ర విశేషాలు, పురూరవుడి చరిత్ర, కచదేవయానుల వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, శ్యమంతకోపాఖ్యానం, కలిధర్మాలు, ద్వాపరధర్మాలు, కృష్ణాష్టమీవ్రతం, అక్షయతృతీయ వ్రతం, మహాదానవర్ణన, పుష్యవాహనుడికథ, ప్రయాగక్షేత్రమాహాత్మ్యం, యమునానదీ స్నాన ప్రాశస్త్యం,
సప్తద్వీపాల వర్ణన, ఋషిలక్షణాలు, పార్వతీకళ్యాణం, వినాయకజననం, కుమారసంభవం, తారకాసురవధ, నృసింహావతారవర్ణన, సావిత్రీ సత్యవంతుల చరిత్ర, రాజధర్మాలు, వామనావతారం, వరాహావతారం, క్షీరసాగరమధనం, వాస్తు శాస్త్రవిశేషాలు, క్రియాయోగ వర్ణన, వివిధరకాల ప్రతిమా నిర్మాణ విశేషాలు, కల్పనామ సంకీర్తన వంటి ప్రధానాంశాలతో పాటు మరెన్నో
విషయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.
మత్స్యపురాణ ప్రాశస్త్యం
పాతాళాదుత్పతిష్టోర్మకర వసతయోయస్య పుచ్చాభిఘాతా ।
దూర్ధ్వం బ్రహ్మాండఖండ వ్యతికర విహితవ్యత్యయే నాపతంతి ॥
విష్ణోర్మత్స్యావతారే సకల వసుమతీ మండల వ్యశ్రువానా ।
స్తస్యాస్యోదరితానాం ధ్వని రపహరతాదశ్రితుం వః శ్రుతీనాం ॥
(మత్స్యపురాణం -శ్లో 1 -2)
మత్స్యావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు, పాతాళలోకంనుంచి పైకి ఎగిసిపడే తన మత్స్యంతోకతో కొట్టబడుతూ, సముద్రంపై భాగం నుంచి పడుతూ ఈ బ్రహ్మాండఖండాల సంపర్కంతో పుట్టిన కల్లోలం వల్ల సమస్త భూమండలంలో వ్యాపిస్తూ, పైకెగిరి తిరిగి క్రిందపడుతున్నాడు. ఆ మత్స్యపరమాత్మ నోటినుంచి వెలువడే వేదాలనాదం మనందరి పాపాలనూ పోగొట్టుగాక.
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సృష్టి ప్రారంభంలో హయగ్రీవుడనే రాక్షసుడు వేదాల్ని దొంగిలించి పాతాళంలో దాచగా, మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి, హయగ్రీవుడి చెరలోవున్న వేదాల్ని ఉద్దరించాడు. ఈ విధంగా వేదాల్ని ఉద్ధరించి సమస్త భూమండలాన్ని రక్షించిన మత్స్యావతార విశేషాల్ని చెప్పినందువల్ల ఇది మత్స్యపురాణం అనబడుతోంది. మహాప్రళయ కాలంలో శ్రీమహావిష్ణువు సప్తర్షులకూ,
వైవస్వతమనువుకూ ఉపదేశించిన ఎన్నో మహిమాన్వితమైన కథలు, గాథలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.
ఈ మత్స్యపురాణాన్ని శైవులు, స్మార్తులు, శాక్తేయులు, వైష్ణవులూ ప్రామాణికంగా గ్రహిస్తారు. పురాణానికి చెప్పబడ్డ ఐదులక్షణాలూ ఈ పురాణంలో సమగ్రంగా వున్నాయి. ఇందులో కథలు, గాథలే కాక అనేకమైన శ్రౌత, స్మార్త, నిత్యనైమిత్తిక కామ్య కర్మలకూ సంబంధించిన వివిధ రకాల అంశాల వివరణ కూడా కనిపిస్తుంది. ప్రాచీనతదృష్ట్యా కూడా మత్స్య పురాణానికి ఒక ప్రత్యేకత
వుంది. అందుకే వామన పురాణం 'పురాణేషు దైవం మాత్స్యమ్' - పురాణాలలో దైవంలాంటిది మత్స్యపురాణం అని చెబుతుంది.
ఈ పురాణంలో ఎన్నోరకాల వైదిక అనుష్టాన ప్రక్రియలు వివరించబడ్డాయి. ముఖ్యంగా తొంభైరెండు, రెండువందల అరవై నాలుగు అధ్యాయాల్లో గ్రహశాంతుల గురించి సవివరంగా చెప్పారు. ఇవేకాక రుద్ర, ఉమా, విష్ణు, స్వయంభూ, ఇంద్ర, యమ, అగ్ని జల, సర్ప, వినాయక వంటి దేవీ దేవతలకు నైవేద్యం అనగా బలిని ఎలా సమర్పించాలి? అనే విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి.
మత్స్యపురాణంలో వైదికమంత్రాలే కాకుండా పౌరాణిక మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. ఇవి శ్లోకాల రూపంలో అందరికీ సులభగ్రాహ్యంగా వుంటాయి . ఇందులో పాంచరాత్ర మత సిద్ధాంతానికి సంబంధించిన విశేషాలు చాలావరకూ కనిపిస్తాయి. 264వ అధ్యాయంలో వివిధ దేవతల్ని ప్రతిష్టించే విధివిధానాలు పామ్రాణికంగా చెప్పబడటంతో ఇది విశిష్ట పురాణంగా ప్రసిద్ధిచెందింది. అందుకే వామనపురాణం మత్స్యపురాణం గొప్పతనాన్ని గురించి ఇలా వర్ణిస్తుంది.
ముఖ్యం పురాణేషు యథైవ మత్స్యం స్వాయంభువోక్తి స్వధసంహితాసు ।
మనుస్మృతీనాం ప్రవరోయథైవ తిథైషు ధర్మో విబుధేషు వాస వః ॥
(వామన అధ్యా -12-శ్లో॥48)
పురాణాలలో మత్స్యపురాణం, సంహితలలో స్వాయంభుడు చెప్పిన స్వథసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులన్నిటిలో అమావాస్య గొప్పవి. దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడు.
మత్స్యావతార కథనం
నైమిశారణ్యంలో దీర్గసత్రయాగం చేస్తున్న శౌనకాదిమహామునులంతా సూతమహర్షి దగ్గరికి చేరి “మహాభాగా! తమరు ఇప్పటిదాకా ఎన్నోపురాణాలు వివరించి చెప్పారు. సంతోషం. అయితే మాకు ఇంకా వాటిని గురించి వినాలని కోరికగా వుంది. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి సృష్టిచేసాడు? పరమేశ్వరుడికి, భైరవుడు, మురారి, కపాలి అనేపేర్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి సందేహాలు మాకు ఎన్నోవున్నాయి. దయచేసి వాటిని తీర్చండి” అని ప్రార్థించారు.
మునుల ప్రార్థన విన్న సూతమహర్షి వారికి ఇలా చెప్పటం ప్రారంభించాడు. “మునులారా! పూర్వం సూర్యుడి కుమారుడైన వైవస్వతు మనువు అనే మహారాజుండేవాడు. మహా సంస్కారవంతుడు, క్షమాగుణం కలిగిన వాడు. ఒకనాడు ఆ మనువు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్య భావంతో మలయ పర్వతం మీదకు వెళ్ళీ దీర్ఘంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా పది లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. అతడి తీవ్రమైన తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని అడిగాడు. మనువు ఆయనకు నమస్కరించి “స్వామీ! ప్రళయకాలంలో స్థిర, చర, ప్రాణులందరినీ రక్షించే శక్తిని నాకు ప్రసాదించు” అని కోరుకున్నాడు. ఆయన తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.
అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు మనువు పితృతర్పణం చేయటానికి ఒక నదికి వెళ్ళి దోసిలితో నీటిని తీసుకున్నాడు. ఆ దోసిలిలోకి ఒక చేప పిల్ల వచ్చింది. ఆయన దాన్ని రక్షించాలని అనుకుని తనకమండలంలో వేశాడు. తిరిగి మర్నాడు ఉదయమయ్యేసరికి ఆ మత్స్యం పెరిగిపోయి కమండలంనుంచి తలపైకెత్తి రాజా రక్షించు రక్షించు అని పలికింది. వెంటనే దాన్ని బైటికి తీసి పెద్ద పాత్రలో వేశాడు. తిరిగి ఆ చేప ఒక్క రోజులో ఆ పాత్రని మించి పెరిగిపోయింది. రాజా రక్షించు అని కేకలు వేసింది మనువు ఆశ్చర్యపోతూ దాన్ని బావిలో పడేశాడు. అక్కడ కూడా ఇంతే ఒక్కరోజులోనే బావి సరిపోనంతగా పెరిగింది. తిరిగి దాన్ని చెరువులో వేశాడు. అక్కడా అంతే. అక్కడ నుంచి నదిలో ఆ చేపని వదిలిపెట్టాడు. మర్నాటికల్లా యథావిథిగా నదిని మించిపోయింది ఆ చేప. ఈ తతంగం అంతా చూస్తున్న మనువుకు ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు. చివరికి ఆ చేపను సముద్రంలో పడేశాడు. అది ఆ సముద్రమంతా వ్యాపించింది.
ఒక చిన్న పిల్లగా తన చేతిలోకి వచ్చిన ఆ చేప మహా మత్స్యంగా సముద్రాన్నంతా ఆక్రమించటం చూసి మనువుకు ఒక్కసారిగా భయం వేసింది. ఆ మహా మత్స్యంతో “ఎవరునీవు? రాక్షసుడివా? లేక భగవంతుడివా? అలాకాకపోతే ఇంత విశాలంగా ఎలా పెరగగలిగావు? బహుశానీవు
శ్రీమన్నారాయణుడివే అయుంటావు. స్వామీ! నీ వీ మత్స్యరూపాన్ని ధరించి ఎందుకునన్ను పరీక్షిస్తున్నావు” అని ప్రశ్నించాడు.
ఆ మత్స్యం మనువుతో “రాజా! నీవు సత్యం గ్రహించావు. అతి తొందరలోనే మహాప్రళయం సంభవించబోతోంది. ఈ పర్వతాలు, భూమి, నగరాలు అన్ని నీటిలోమునిగిపోతాయి. అదిగో సముద్రంలోకనిపిస్తున్న ఆ మహానౌకను చూశావు కదా! అది జీవుల్ని రక్షించటానికి దేవతలు చేత నేనే నిర్మింపచేసాను. స్వేదజాలు(చెమటనుంచి పుట్టేవి) అండజాలు(గ్రుడ్ల నుంచి పుట్టే జీవులు) దోమలు, పక్షులు, ఉద్భిజాలు నేల నుంచి పుట్టేవి చెట్లు, మొక్కలు, అలాగే జరాయుజాలు ఇవన్నీ భీకరమైన గాలికి నశించిపోతాయి. కనుక నీవు వీటిని నౌకలో చేర్చి ఆ నౌకను నా కొమ్ముకు కట్టు. ప్రళయం ముగిసిన తరువాత తిరిగి ఆవిర్భవించే నూతన ప్రపంచానికి నీవు ప్రజాపతివై సకల
దేవతలచేతా పూజింపబడతావు” అని పలికాడు.
ప్రళయం
మత్స్యరూపంలోవున్న మహావిష్ణువు మాటలువిన్న మనువు ఆయనతో “ప్రభూ! శ్రీహరీ! ఎన్ని సంవత్సరాల తరువాత ప్రళయం వస్తుంది. నేను ప్రాణులందరినీ ఎలా రక్షించగలను? తిరిగి నిన్ను ఎలా చేరుకోగలను? అని ప్రశ్నించాడు. “మహారాజా! నేటినుంచి భూమండలంలో అనావృష్టి
ప్రారంభమవుతుంది. వందసంవత్సరాలవరకూ ఇది కొనసాగుతుంది. ఆ కరువుకు ఎందరో మరణిస్తారు. తరువాత సూర్యుడు నిప్పుకణికల్ని భూమి మీదకి వర్షిస్తాడు. ఆ వేడికి అల్పప్రాణులన్నీ నాశనమైపోతాయి. ప్రళయకాలంలో సముద్రం నించి బడబాగ్ని విజృంభిస్తుంది. పాతాళం నుంచి అగ్ని పైకి వెలువడుతుంది. అదే విధంగా శివుడి మూడోకంటి నుంచి భయంకరమైన జ్వాలలు ఎగసి అన్ని లోకాల్నీ భస్మంచేస్తాయి.
ఆ విధంగా భూమండలమంతా తగలబడి పోయి తాబేలు వీపులా మారిపోతుంది. ఆకాశమంతా సూర్యుడి వేడితో నిప్పుల కొలమిలా మారిపోతుంది. ఆ వేడికి పైనవున్న దేవతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నశిస్తాయి.
1. సంవర్తం,
2, భీమనాదం,
3. ద్రోణం,
4.ఇంద్రం,
5.పలాహకం,
6. విద్యుత్సాతకం,
7.శోణం
అనే మహాప్రళయకాల మేఘాలు జన్మించి భూమండలాన్నంతా తమ వర్ష ధారలతో ముంచెత్తుతాయి. సప్తసముద్రాలు ఒక్కటై పోతాయి.
అలాంటి భయంకరమైన పరిస్థితిలో అపార జలరాశిలో స్థిరంగా ఈ మహానౌక నిలిచివుంటుంది. అనేక లోకబీజాల్ని తీసుకువచ్చి నేను చెప్పిన విధంగా వాటిని సంరక్షించు. అలాగే నేను చెప్పిన జీవుల్ని కూడా నౌకలోకి ఎక్కించి ఆ నౌకని నా కొమ్ముకు తగిలించు నేను నౌకను నిన్ను రక్షిస్తాను.
మహారాజా! ఆవాంతర ప్రళయంలోఅన్ని జీవరాసులు, దేవతలు నశించినప్పటికీ నీవు ఒక్కడివే జీవించివుంటావు. నీతోపాటు, సూర్య చంద్రులు, స్వర్గ, మర్త్య పాతాళ బ్రహ్మలోకాలు బ్రహ్మదేవుడు, నేను, నర్మదానది, మార్మండేయ మహర్షి పరమేశ్వరుడు, వేదాలు, పురాణాలు, ఇతర మహావిద్యలు నిలిచి వుంటాయి”. ఈ విధంగా మత్స్యావతారుడు మనువుకు బోధించి అదృశ్యమయ్యాడు.
మనువు తిరిగి నగరానికి వచ్చి రాబోయే ప్రళయకాలాన్ని తలుచుకుంటూ, అన్నిటినీ వదిలేసి ఏకాగ్రంగా ధ్యానయోగాన్ని అవలంబించాడు.
మహావిష్ణువు చెప్పినట్టే ప్రళయకాలం ప్రారంభమైంది. స్వామి చెప్పిన ప్రకారం ఆ మహాజలధిలో పెద్ద కొమ్ముతో వున్న మహామత్స్యం ఆవిర్భవించింది. అలాగే మహానౌకకూడా కనిపించింది. ఆదిశేషుడు(సర్పం)ఒక తాడులా మారి మనువు దగ్గరకు వచ్చాడు. మనువు ఆ తాడుతో నావను మహామత్స్యం కొమ్ముకు తగిలించాడు. నారాయణుడికి నమస్మరించి ఆ మత్స్యం కొమ్ము మీద నిలిచాడు. క్రమంగా ప్రళయం ముగిసి పోయింది. కొత్తయుగం ఏర్పడింది. ఆ సమయంలో
మనువు కోరగా నారాయణుడు మత్స్యపురాణాన్ని అతడికి బోధించాడు.
దేవీ అష్టోత్తరశత (108) స్థానాలు
పూర్వం దక్షప్రజాపతి మహాయాగాన్ని చేయటం ప్రారంభించాడు. ఆ యాగానికి సకల దేవతల్ని ఆహ్వానించాడు గానీ తన అల్లుడు, కూతురైన సతీ-శంకరుల్ని ఆహ్వానించలేదు. అయితే తండ్రిచేసే యాగాన్ని చూడాలని కోరుకున్న సతీదేవి శివుడు వారిస్తున్నా వినకుండా యాగశాల దగ్గరకు వచ్చింది. దక్షుడు ఆమెను పట్టించుకోకుండా అల్లుడైన శివుణ్ణి దూషించాడు. ఆ అవమానభారం సహించలేని సతీదేవి యోగాగ్నిని సృష్టించుకుని తన శరీరాన్ని తానే దగ్గంచేసుకోవటం ప్రారంభించింది. అదిచూసి అక్కడున్న దేవతలంతా దక్షుడు చేసిన పనికి అతన్ని నిందించారు. తప్పుతెలుసుకున్న దక్షుడు దగ్గమౌతున్న కుమార్తె దగ్గరకి వెళ్ళి ఎంతో దుఃఖిస్తూ తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించాడు. తనను విడిచి శరీరత్యాగం చేయవద్దని
వేడుకున్నాడు. అయితే సతీదేవి దక్షుడి మాటని మన్నించలేదు. ఆయనతో “తండ్రీ! నేను అనుకున్నదే చేస్తాను. నీవు నన్ను భక్తితో ప్రార్ధిస్తున్నావు. అయినాసరే నా భర్త శివుడి చేతిలో నీ యజ్ఞం ధ్వసంకాక తప్పదు. రాబోయేకాలంలో నా అనుగ్రహాన్ని పొంది, సృష్టిని కొనసాగించటానికి నా సన్నిధిలో వుండి సాధన చేయి అప్పుడే నీవు తిరిగి ప్రజాపతులందరిలోకీ గొప్పవాడివవుతావు.
నా అంశతో నీకు అరవైమంది కుమార్తెలు జన్మిస్తారు” అని చెప్పింది.
సతీదేవి మాటల్నివిన్న దక్షుడు “అమ్మా! సతీ! నీవు ఏ ఏ తీర్థాలలో వుంటావు? నిన్ను ఏ ఏ పేర్లతో సంబోధించాలి? స్తుతించాలి? అని ప్రశ్నించాడు.
తండ్రీ! నన్ను సర్వకాలాలలో ఈ భూమ్మీద వుండే అన్ని ప్రాణుల్లో దర్శించగలగాలి. ఈ సకలలో కాలంలో నేను కానిది ఏదీ లేదు. అయితే అన్నిట్లో నన్ను చూడటం అందరికీ సాధ్యంకాదు. కనుక తమ తమ కోరికల్ని తీర్చుకోవాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండిటినీ వాంఛించేవారు. ఈ భూమండలంలో ఇతర లోకాలలో ఏఏ స్థానాలలో, ఏఏ రూపాలతో నన్ను స్మరించాలో పూజించాలో చెబుతున్నా విను.
అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం
వారాణస్యాం విశాలాక్షీ నైమిషే లింగధారిణీ ।
ప్రయాగే లలితాదేవీ కాముకా గంధమాదనే ॥ 01 ॥
మానసే కుముదా నామ విశ్వకాయా తథాஉ౦బరే ।
గోమంతే గోమతీ నామ మందరే కామచారిణీ ॥ 02 ॥
మదోత్కటాచైత్రరథే జయంతీ హస్తినాపురే ।
కాన్యకుబ్జే తథా గౌరీ రంభా మలయ పర్వతే ॥ 03 ॥
ఏకామ్రకే కీర్తిమతీ విశ్వా విశ్వేశ్వరీ తథా ।
కర్ణికే పురుహస్తేతి కేదారే మార్గదాయికా ॥ 04 ॥
నంద్యాహిమవతః పృష్టే గోకర్ణే భద్రకాళికా ।
స్థాణీశ్వరే భవానీ తు బిల్వకే బిల్వపత్రికా ॥ 05 ॥
శ్రీశైలే మాధవీ దేవీ భద్రా భద్రేశ్వరీ తథా ।
జయా వరాహశైలే తు కమలా కమలాలయే ॥ 06 ॥
రుద్రకోట్యాం తు రుద్రాణీ కాళీ కాలంజరే తథా ।
మహాలింగే తు కపిలా కర్కోటే మంగళేశ్వరీ ॥ 07 ॥
శాలిగ్రామే మహాదేవీ శివలింగే జలప్రియా ।
మాయాపుర్యాం కుమారీతు సంతానే లలితా తథా ॥ 08 ॥
ఉత్పలాక్ష్మీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా ।
గయాయాం మంగళా నామ విమలా పురుషోత్తమే ॥ 09 ॥
విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్యవర్ధనే ।
నారాయణీ సుపార్శ్వే తు త్రికూటే భద్రసుందరీ ॥ 10 ॥
విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే ।
కోటవీ కోటితీర్ధేతు సుగంధా మాధవీ వనే ॥ 11 ॥
కుబ్జామ్రకే త్రిసంధ్యా తు గంగాద్వారే హరిప్రియా ।
శివకుండే శివానందా నందినీ దేవికా తటే ॥ 12 ॥
రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృందావనే తథా ।
దేవకీ మధురాయాంతు పాతాళే పరమేశ్వరీ ॥ 13 ॥
చిత్రకూటే తదా సీతా వింధ్యే వింధ్య నివాసినీ ।
సహ్యాద్రే ఏక వీరా తు హరిశ్చంద్రే తు చంద్రికా ॥ 14 ॥
రమణా రామతీర్దే తు యమునాయాం మృగావతీ ।
కరవీరే మహాలక్ష్మీ రమాదేవీ వినాయకే ॥ 15 ॥
ఆరోగ్యా వైద్యనాథే తు మహాకాళే మే హేశ్వరీ ।
అభయా పుష్ప తీర్థే తు అమృతా వింధ్య కందరే ॥ 16 ॥
మాండవ్యే మాండవీ దేవీ స్వాహా మేహేశ్వరే పురే ।
వేగవే తు ప్రచండాஉథ చండికాஉమర కంటకే ॥ 17 ॥
సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ ।
దేవమాతా సరస్వత్యాం పారాஉవారే తటే స్థితా ॥ 18 ॥
మహాలయే మహాపద్మా పయోష్ణ్యాం పింగళేశ్వరీ ।
సింహికా కృతశౌచే తు కార్తికేయే తు శంకరీ ॥ 19 ॥
ఉత్సలాஉవర్తకే లోలా సుభద్రా సింధు సంగమే ।
ఉమా సిద్ధవనే లక్ష్మీ రనంగా భరతాஉశ్రమే ॥ 20 ॥
జాలంధరే విశ్వముఖీ తారా కిష్కింధ పర్వతే ।
దేవదారు వనే పుష్టి ర్మేధా కాశ్మీర మండలే ॥ 21 ॥
భీమా దేవీ హిమాద్రౌ చ తుష్టి ర్విశ్వేశ్వరే తథా ।
కపాల మోచనే శ్రద్దా మాతా కాయాஉవరోహణే ॥ 22 ॥
శంఖోద్దారే ధ్వని ర్నామ ధృతిః పిండారకే తథా ।
కాలా తు చంద్రభాగాయా మచ్చోదే సిద్ధిదాయినీ ॥ 23 ॥
వేణాయా మమృతా దేవీ బదర్యా మూర్వశీ తథా ।
ఔషధీ చోత్తర కురౌ కుశద్వీపే కుశోదకా ॥ 24 ॥
మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ ।
అశ్వత్థే వందనీయా తు నిధి ర్వైశ్రవణాஉలయే ॥ 25 ॥
గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ ।
దేవలోకే తథేంద్రాణీ బ్రహ్మాస్యే తు సరస్వతీ ॥ 26 ॥
సూర్యబింబే ప్రభా నామ మాతౄణాం వైష్ణవీ తథా ।
అరుంధతీ సతీనాం తు రామాసు చ తిలోత్తమా ॥ 27 ॥
చిత్తే బ్రహ్మకళా నామ శక్తిః సర్వశరీరిణామ్ ।
ఏత ద్భక్త్యామయా ప్రోక్తం నామాஉష్టశత ముత్తమమ్ ॥ 28 ॥
అష్టోత్తరం చ తీర్థానాం శత మేతదుదాహృతమ్ ।
యో జపేత్ శ్రణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే ॥ 29 ॥
(శ్లో-26-55, అధ్యా-13)
01.వారణాసిలో విశాలాక్షిగా
02.నైమిశారణ్యంలో లింగధారిణీదేవిగా
03.ప్రయాగక్షేత్రంలో లలితాదేవిగా
04. గంధమాదన పర్వతం మీద కాముకాదేవిగా
05.మానససరోవరతీర్థంలో కుముదాదేవిగా
06. విశ్వేశ్వరక్షేత్రంలో విశ్వగా
07.నివ్వక తీర్ధంలో శ్రీలక్ష్మిగా
08. ఇచ్చాక్షేత్రంలో మదనోత్కటగా
9. గోమంతంలో గోమతీదేవిగా
10.మందారతీర్ధంలో కామచారిణిగా
11. చిత్రరథంలో మదోత్కటాదేవిగా
12. హస్తినాపురంలో జయంతిగా
13. కన్యాకుబ్జంలో గౌరీదేవిగా
14. మలయపర్వతం మీద రంభగా
15. హిమవత్పర్వతం మీద నందాదేవిగా
16. గోకర్ణక్షేతంలో భద్రకర్ణికగా
17.స్థౌణీశ్వరంలో భవానీదేవిగా
18. బిల్వక వనంలో బీల్వపత్రికా దేవిగా
19. శ్రీశైలక్షేత్రంలో మాధవీదేవిగా,
20. భద్రేశ్వరంలో భద్రాశక్తిగా,
21.వరాహశైలంలో జయాదేవిగా
22.కమలాలయ తీర్థంలో కంబళాదేవిగా
23. పుష్కరక్షేత్రంలో పురుహూతికగా
24. కేదారక్షేత్రంలో మార్గదాయినిగా
25. రుద్రకోటితీర్ధంలో రుద్రాణిగా
26. కాలంజర పర్వతం మీద కాళీశక్తిగా
27. మహాలింగక్షేత్రంలో కపిలాదేవిగా
28. మకుటక్షేత్రంలో మకుటాదేవిగా
29. సాలగ్రామతీర్ధంలో మహాదేవిగా
30. శివలింగ క్షేత్రంలో శివప్రియగా
31 మాయాపురిజగన్నాథక్షేత్రంలో కుమారిగా
32. లలితాక్షేత్రంలో సంతతాదేవిగా
33. ఉత్పలాక్ష తీర్ధంలో సహస్రాక్షిగా
౩4.మహోత్పలంలో హిరణ్యాక్షిగా
35. గయాక్షేతంలో మంగళగౌరిగా
36. పురుషోత్తమ క్షేత్రంలో విపులాదేవిగా
37. విపాశాతీర్థంలో అమోఘాక్షిగా
38.పుండ్రవర్ధనంలో పాటలాదేవిగా
39. సుపార్శ్వక్షేత్రంలో నారాయణిగా
40.త్రికూటి పర్వతం మీద భద్రసుందరిగా,
41. విపులక్షేత్రంలో విపులగా
42.మలయాచలం మీద కల్యాణిగా
43.కోటితీర్ధంలో కోట్యాక్షిగా
44. మాగధవనంలో సుగంధాదేవిగా
45. కుబ్జామ్రక క్షేత్రంలో త్రిసంధ్యగా
46. గంగాద్వారం(హరిద్వారం)లో రతిప్రియగా
47.శివకుండ తీర్ధంలో సునందగా,
48 దేవికానదీతీరంలో నందినిగా
49. ద్వారకా నగరంలో రుక్మిణీదేవిగా
50. బృందావనధామంలో రాధాదేవిగా,
51.మధురా నగరంలో దేవకిగా,
52.పాతాళంలో పరమేశ్వరిగా,
53.చిత్రకూట పర్వతం మీద సీతాదేవిగా,
54. వింధ్యాచలంమీద వింధ్యవాసినిగా,
55. సహ్యపర్వతం మీద ఏకవీరాదేవిగా,
56. హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రికాదేవిగా,
57.రామతీర్ధంలో రమణగా,
58. యమునాతీరంలో మృగావతిగా,
59. కరవీరవనంలో మహాలక్ష్మిగా,
60. వినాయక క్షేత్రంలో ఉమాదేవిగా,
61. వైద్యనాధక్షేత్రంలో ఆరోగ్యాదేవిగా,
62. మహాకాళంలో మహేశ్వరిగా,
63. శుక్ల తీర్ధంలో అభయాదేవిగా,
64. వింధ్యపర్వత గుహల్లో స్మృతీ శక్తిగా,
65. మాండవ్యక్షేత్రంలో మాండకీదేవిగా,
66. మహేశ్వరపురంలో స్వాహాదేవిగా,
67. ఛాగలాండ తీర్ధంలో ప్రచండశక్తిగా,
68. అమరకంటక తీర్ధంలో చండికగా,
69. సోమేశ్వరంలో వరారోహగా,
70. ప్రభాసతీర్థంలో పుష్కరావతిగా,
71.సరస్వతీ తీరంలో దేవమాతగా,
72. మహాలయక్షేత్రంలో మహాభాగగా,
73. పయోష్ణ తీర్థంలో పింగళావతిగా,
74.కృతశౌచక్షేత్రంలో సింహికాదేవిగా,
75. కార్తికేయక్షేత్రంలో యశస్కరీదేవిగా,
76.ఉత్పలావర్తకంలో లోలాదేవిగా
77.సాగరసంగమ తీర్థంలో సుభద్రగా,
78.సిద్ధవనంలో లక్ష్మీదేవిగా,
79.భరతాశ్రమంలో అనుగగా,
80.జాలంధర క్షేత్రంలో విశ్వముఖిగా,
81. కిష్కిందపర్వతం మీద తారగా,
82.దేవదారువనంలో పుష్టిగా,
83. కాశ్మీరదేశంలో మేథాదేవిగా,
84.హిమాద్రి మీద ఉమాదేవిగా,
85. షష్ఠ క్షేత్రంలో వస్త్రేశ్వరీ దేవిగా,
86.కపాలమోచన తీర్ధంలో శుద్ధిదేవిగా,
87.కాయావరోహణ క్షేత్రంలో మాతగా,
88. శంఖద్వారంలో ధ్వనిశక్తిగా,
89. పిండారకక్షేత్రంలో భృతిగా,
90.చంద్రభాగాతీరంలో కలాదేవిగా,
91. అచ్చోదసరవరతీరంలో శూలధారిణిగా,
92. వైనాక్షేత్రంలో అమృతాదేవిగా,
93. బదరీక్షేత్రంలో ఊర్వశిగా,
94. ఉత్తకురుదేశంలో ఓషధిగా,
95. కుశద్వీపంలో కుశోదకిగా,
96.హేమకూటంలో మన్మథగా,
97. కుముదక్షేత్రంలో సత్యవాదినిగా,
98. అశ్వత్ధ తీర్ధంలో వందనీయగా,
99.వైశ్రవణాలయంలో నిధిదేవిగా,
100.వేదనతనంలో గాయత్రిగా,
101. శివసన్నిధిలో పార్వతిగా,
102. దేవలోకంలో ఇంద్రాణిగా,
103. బ్రహ్మశరీరంలో సరస్వతిగా,
104 సూర్యబింబంలో తేజస్సులా,
105. సప్తమాతృకలలో వైష్టవిగా,
106. పతివ్రతలలో అరుంధతిగా,
107. అందమైన స్త్రీలలో తిలోత్తమగా,
108.సకల ప్రాణుల హృదయాలలో బ్రహ్మకళ అనే శక్తిగా నేను కొలువుంటాను.
తండ్రీ! నేను చెప్పిన నా నూట ఎనిమిది నామాలను, నూటఎనిమిది దివ్యక్షేత్రాలను గురించి విన్నా స్మరించినా, పఠించినా వారికి సకల పాపాలనుంచీ విముక్తి లభిస్తుంది. నేను చెప్పిన తీర్జాలలో స్నానంచేసి అక్కడ కొలువైన నన్ను దర్శించినవారు కల్పాంతంలో పాపవిముక్తులై శివలోకంలో నివసిస్తారు. నా క్షేత్రంలో నివసించేవారు సకల శుభాలను పొందుతారు.
శుక్షపక్ష తదియనాడుగానీ, అష్టమితిధి ఉన్నరోజునకానీ శివాలయంలో శివసన్నిధిలో నా అష్టోత్తర శతనామాలను ఇతరులకు వినిపించిన వారు సత్సంతానవంతులవుతారు. అలాగే గోదానం చేసేటప్పుడు గానీ, శ్రాద్ధం పెట్టే సమయంలోకానీ, దేవీపూజ చేసే సమయంలోకానీ ఈ నా దివ్య స్తోత్రాన్ని పఠిస్తే బ్రహ్మపదాన్ని చేరుకుంటారు.
ఈ విధంగా సతీదేవి తన తండ్రి దక్షుడికి తన నివాసస్థానాల్ని పేర్కొని వాటి ఫలితాలను వివరించి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించింది.
శ్రాద్ధకాల నిర్ణయం
పగలు మొత్తం పదిహేనుముహూర్తాలు వుంటుంది. ఈ పగటికాలంలో ప్రాతఃకాలం, పూర్వాహ్నం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంత్రం అని అయిదు విభాగాలతో వుంటుంది. వీటిలో ఒక్కో విభాగానికీ మూడుముహూర్తాలకాలం. సాయంకాలాన్ని రాక్షసీ హోరా అంటారు. కనుక సాయంకాలం శ్రాద్ధం పెట్టరాదు. ఈ రాక్షసీ హోర అనేది ఏపనులకీ మంచిది కాదు. ఈ మొత్తం
పదిహేను ముహూర్తాలలో ఎనిమిదోముహూర్తకాలానికి 'కుతుప' కాలం అంటారు. మధ్యాహ్నం సమయం తరువాత ఏ సమయంలో సూర్యుడు చల్లబడతాడో అప్పటినుంచి సాయంకాలం ప్రారంభమవుతుంది. ఈ సాయంకాలం ప్రారంభమయ్యేలోపే శ్రాద్దాన్ని జరపాలి. అలాచేస్తే సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు.
1.మధ్యాహ్నకాలం,
2. కత్తిఉంచేపాత్ర,
3. నేపాళదేశంలో నేసిన కంబళి,
4.దీపం
5. దర్భలు
6.పువ్వులు,
7. ఆవులు
8.దౌహిత్రుడు (కూతురుకొడుకు)
ఈ ఎనిమిదింటినీ కుతపం అంటారు. కుతపం అంటే 'కు' అనగా పాపాన్ని 'తపం' అనగా తపింపచేసేది అని. ఇవిగాక పగటి ముహూర్తకాలాలలో ఎనిమిదోదైన 'కుతుప' ముహూర్తకాలం తరువాత వచ్చే నాలుగు ముహూర్తాలు. మొత్తం ఈ అయిదు ముహూర్తాలనూ 'స్వథాభవనం' అని వ్యవహరిస్తారు.
దర్భలు, నల్లనువ్వులు మహావిష్ణువు శరీరంనుంచి ఆవిర్భవించాయి. శ్రాద్ధం మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే శ్రాద్ధంలో వీటిని ఉపయోగించాలి. ఈ విషయాన్ని ద్యులోకంలో నివసించే పితృదేవతలు స్వయంగా చెప్పారు. కనుక శ్రాద్దంపెట్టెవాడు ఒక చేతలో దర్భలు పట్టుకొని నువ్వులతో తిలోదకాలు పితృదేవతలకు సమర్పించాలి.
ఈ శ్రాద్ధ విధిని మత్స్యరూపాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడు మనువుకు చెప్పాడు. ఇది పుణ్యకరమైనది, పవిత్రమైనది. దీన్ని చదివినా, విన్నా ఆ మానవుడు పుణ్యఫలాలు పొందుతాడు. అతడికి ఐశ్వర్యం లభిస్తుంది.
శ్రాద్ధం జరిపితే పుణ్యం వచ్చే తీర్థక్షేత్రాలు
సూతమహర్షి శౌనకాది మునులకు, ఏఏ తీరాలలో, క్షేత్రాలలో శ్రాద్ధవిధిని జరిపిస్తే అఖండమైన పుణ్యఫలాలు లభిస్తాయో ఇలా చెబుతున్నాడు.
అభిజిత్ ముహూర్తం, రేణముహూర్తం ఉండే అపరాహ్న కాలంలో పెడితే అది అనంతమైన ఫలాన్నిస్తుంది.
భూలోకంలో గయాతీర్థం శ్రాద్ధవిధిని ఆచరించటానికి ఎంతో ప్రశస్తమైనది. ఆ క్షేత్రంలో బ్రహ్మ దేవుడు స్వయంగా నివసిస్తుంటాడు. గయతరువాత వారణాసిక్షేత్రం శ్రాద్ధవిధికి మంచిది. ఆ దివ్య క్షేత్రాన్ని విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవీ ఎప్పటికీ విడిచివుండరు. కాబట్టి అది అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. అక్కడ శ్రాద్ధంపెట్టటం వల్ల భక్తిముక్తి రెండూ లభిస్తాయి. వీటితోపాటు విమలేశ్వరం, ప్రయాగ, కటీశ్వరం అనే క్షేత్రాలు కూడా పితృదేవతలకు ఇష్టమైనవి. పుణ్యప్రదమైనవి.
హరిద్వారం, నందాతీర్థం, మాయాపురం, గంగా గోమతీసంగమం, నైమిశక్షేత్రం పితృదేవతలకు ప్రీతికరమైన స్థానాలు. గంగా గోమతీ సంగమ స్థలంలో యజ్ఞవరాహమూర్తి అయిన శ్రీమహావిష్ణువు, త్రిశూలధారి అయిన పరమేశ్వరుడు సన్నిహితంగా వుంటారు. అక్కడ బంగారు ద్వారం వున్నది.
అక్కడ వుండే శివుడికి పద్దెనిమిది చేతులువుంటాయి.
శ్రీమహావిష్ణువు చక్ర నేవి (అంచు శీర్ణమైన (శిధిలమైన)) చోటే నైమిశక్షేత్రం.
ఈ క్షేత్రంలో కొలువున్న యజ్ఞవరాహమూర్తిని దర్శిస్తే విష్ణులోకాన్ని చేరుకుంటారు. కృతశేచం అనే గొప్ప అరణ్యం వుంది. అది అన్ని పాపాల్నీ పోగొట్టే దివ్య ప్రదేశం. నారాయణుడు ఆ వనంలో నరసింహుడి రూపంలో వుంటాడు. అలాగే ఇక్షుమతీ గంగాసంగమతీర్థం కూడా పవిత్రమైనదే.
ఈ చెప్పిన క్షేత్రాలు తీర్థాలన్నీ పితృదేవతలకు ప్రీతికరమైనవి. ఈ ప్రదేశాలలో శ్రాద్ధవిధిని ఆచరించాలి.
కురుక్షేత్రంలో అన్ని తీర్థాలూ చేరివుంటాయి. సరయూనదీ తీరం పవిత్రమైనది. ఐరావతీ, యమునా, దేవికా, కాళీ, చంద్రభాగా, దృషద్వతీ, వేణుమతీ, పారా, వేత్రవతీ అనే నదులు కూడా శుభప్రదమైనవి. పితృదేవతలకు ఇష్టమైన ఈ ప్రాంతాల్లో శ్రాద్ధం జరిపితే కోటిరెట్లు ఫలితం లభిస్తుంది. శిప్రానది (ఉజ్జయినీ దగ్గర) నర్మదాద్వారం (నర్మదాసాగర సంగమ (ప్రాంతం) ఇక్కడ పిండప్రదానం చేస్తే గయలో చేసిన ఫలితం లభిస్తుంది.
తుంగభద్రానదీ, త్రిసంధ్యాతీర్ధం, భీమనది, భీమేశ్వర క్షేత్రం, కృష్ణవేణీ, కావేరీ, మంజులా, గోదావరీ త్య్రంబక తీర్ధం, ప్రశస్తమైనవి. వీటిలో త్య్రంబక తీర్ధంలో పరమేశ్వరుడు ఎప్పుడూ కొలువైవుంటాడు. ఇక్కడ పిండప్రదానంచేస్తే అక్షయఫలం లభిస్తుంది. గోదావరీనదీ పరీవాహక ప్రాంతంలో వున్న
జమదగ్నితీర్థం శ్రాద్ధం చేయటానికి ఉత్తమమైనది. సహస్రలింగక్షేత్రం, రాఘవేశ్వర క్షేత్రం. ఇంద్రసేనానది పితృదేవతలకు పీతికర స్థానాలు.
పుష్కరతీర్థం, సాలగ్రామతీర్థం, శోణపాదతీర్థం, లోహదండతీర్థం, ఋణమోచనతీర్థం, గౌతమేశ్వరం, వశిష్ఠతీర్థం, శంఖధారం, ఘటేశ్వరతీర్థం, బదరీతీర్థం, కరవీరతీర్థం, వైకుంఠతీర్థం, గౌరీతీర్థం, రామతీర్థం, శ్రీపతితీర్ధం, రైవకతీర్ధం, శారదాతీర్థం ఇవన్నీ శ్రాద్ధకర్మల్ని ఆచరించటానికి ప్రశస్తమైనవి.
మహామునులారా! ఇప్పుడు నేను చెప్పిన ఈ దివ్య తీర్దాలేకాక ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్దాలు పితృదేవతలకు ప్రీతినికలిగించేవి వున్నాయి. వాటన్నిటినీ వివరించిచెప్పటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యంకాదు. మానవులకు సత్యం-దయ-ఇంద్రియ నిగ్రహం అనేవి అత్యుత్తమమైన తీర్థాలు. ఈ మూడు గుణాలతో వర్ణాశ్రమధర్మాల్ని అనుసరించి నడుచుకునే వారికి వారి ఇల్లే ఒక దివ్య తీర్థమౌతుంది. పితృదేవతలు వారి ఇంటికి వచ్చి స్వయంగా పిండప్రదానాన్ని స్వీకరిస్తారు.” ఈ విధంగా సూతమహర్షి పితృదేవతలకు ప్రీతికరమైన తీర్థాల గురించి, క్షేత్రాలగురించి అక్కడ శ్రాద్ధవిధిని ఆచరిస్తే లభించే ఫలితాల గురించి మునులందరికీ ప్రబోధించాడు.
చంద్రుడి వృత్తాంతం
బ్రహ్మమానసపుత్రుడైన అత్రి ప్రజాపతి ఎంతో గొప్పవాడు. బ్రహ్మదేవుడు అత్రి మహర్షిని పిలిచి లోక సృష్టిని కొనసాగించమని ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞను పాటించటంకోసం అత్రిమహర్షి కఠోరదీక్షతో తపస్సుచేయటం ప్రారంభించాడు.
లోకాలన్నిటి కష్టాల్నీ నశింపచేసేది, అందరికీ ఆనందాన్ని కలిగించేది, బ్రహ్మ, విష్ణు, రుద్రులకి అంతరంగ రూపంగా వుండేది, ఇంద్రియాలకి గోచరంకానిది, శాంతిని ప్రసాదించేది, అన్నిటికన్నా గొప్పది అయిన పరబ్రహ్మతత్త్వం అత్రి మహర్షికి గోచరించింది. ఆ పరబ్రహ్మతత్వం అత్రిముని
తపోశక్తి వల్ల ఆయన కళ్ళలో స్థిరంగా నిలిచిపోయింది.
అది చూసిన పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవితో కలిసి తనలోని ఎనిమిదో అంశతో అత్రినేత్రాల్ని ఆశ్రయించాడు. ఆ ప్రభావంతో ఆ ముని కళ్ళనుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ భాప్పజలం నుంచి శివుడి ఎనిమిదో అంశతో కూడిన “సోముడు” అనే శిశువు ఆవిర్భవించాడు. చల్లని వెన్నెలతో ప్రకాశిస్తున్న ఆ బాలుడు సమస్త విశ్వాన్నీ వెలుగులు చిందేలా చేసాడు. దిక్కులన్నీ ఒక పుత్రుణ్ణి కనాలని భావించి ఒక స్త్రీ రూపాన్ని ధరించాయి. ఆ స్త్రీ సోముడి దివ్యతేజస్సును తనలో నింపుకుంది. ఆవిధంగా సోముడి తేజస్సు దిక్కుల గర్భంలో ముప్ఫైవేల సంవత్సరాల పాటువుంది.
కొంతకాలానికి దిక్కులన్నీ గర్భాన్ని భరించలేక దాన్ని విడిచిపెట్టేశాయి. అదే సమయంలో చతుర్ముఖబ్రహ్మ ఆ గర్భం నుంచి జారిన పిండం అన్ని దిక్కుల్నీ ప్రకాశింపచేస్తుండటాన్ని చూసాడు. వెంటనే ఆయన ఆ తేజో రూప పిండాన్ని ఒక నవయువకుడిగా మార్చివేశాడు. తన దివ్యశక్తితో వెయ్యి అశ్వాలతో లాగబడే రథాన్ని సృష్టించి ఆయువకుణ్ణి అందులోకి ఎక్కించి
తనలోకానికి తీసుకుపోయాడు.
బ్రహ్మలోకానికి చేరిన ఆ నవయువకుణ్ణి అతడిలో వున్న చల్లని దివ్యతేజస్సును చూసి ఋషులు, బ్రహ్మర్షులు, దేవతలు, ఓషధులు, గంధర్వులు అందరూ ఈ యువకుడు మాకు ప్రభువుగా వుండాలి అని కోరుకున్నారు. బ్రహ్మతో సహా దేవతలందరూ సోమదేవతామంత్రాలతో అతన్ని ఘనంగా స్తుతించారు. వారి స్తోత్రపాఠాలతో అతడి తేజస్సు మరింతగా వెలిగిపోయింది. అతడిలోని దివ్యతేజస్సు భూలోకానికి వ్యాపించి దివ్యమైన ఓషధుల్ని ఉత్పన్నం చేసింది. దానివల్ల ఆ సోముడికి పగటికన్నా రాత్రిసమయంలో తేజస్సు మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది. అది ఆనాటి నుంచి నేటి వరకూ జరుగుతూనే వుంది. అందుకే సోము (చంద్రుణ్ణి) ఓషధులకు ప్రభువు అంటారు.
ఈ కనబడే చంద్రమండలం వేదాలకు స్థానంగా రసాత్మకంగా వుంటుంది. ఈ చంద్రుడు కృష్ణ పక్షంలో క్షీణిస్తూ, శుక్లపక్షంలో క్రమంగా వృద్ధిచెందుతూ వుంటాడు. తరువాత కొంతకాలానికి చంద్రుడి గుణ గణాలు అతడి చల్లని తేజస్సు, సౌందర్యం గురించి విని దక్షప్రజాపతి తన 27మంది కన్యల్ని అతడికిచ్చి వివాహం చేసాడు.
తరువాత చంద్రుడు విష్ణుభగవానుడి అనుగ్రహంకోసం పదివేల పద్మసహస్రవర్షాలు తపస్సు చేసాడు. నారాయణుడు చంద్రుడు చేసిన తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నాడు. “ప్రభూ! దేవాదిదేవా! శ్రీమన్నారాయణా! నేను ఇంద్రలోకాన్ని జయించగలగాలి. నేను చేసే రాజసూయయాగంలో, నేనిచ్చే హవిస్సుల్ని దేవతలందరూ ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించాలి. బ్రహ్మాది దేవతలు నేను చేసే యజ్ఞానికి ప్రధాన ఋత్విక్కులుగా
వుండాలి. లోకాల్ని రక్షించే పరమేశ్వరుడు త్రిశూలాన్ని ధరించి నాయాగానికి రక్షకుడుగా వుండాలి.” అని కోరుకున్నాడు. శ్రీహరి తథాస్తు అని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు.
శ్రీహరి దివ్యానుగ్రహాన్ని పొందిన చంద్రుడు రాజసూయయాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగంలో వరప్రభావం కారణంగా, బృహస్పతి హోతగా, భృగువు అధ్వర్యుడుగా, బ్రహ్మదేవుడు ఉద్దాతగా, శ్రీహరి యాగ బ్రహ్మగా, సనక సనందనాది మహర్షులు సదస్యులుగా, విశ్వాదేవతలు పదిమంది
చమస్వాధ్యాయులుగా ఉన్నారు. యాగం పరిసమాప్తికాగానే చంద్రుడు వారందరికీ ముల్లోకాల్లోని రాజ్యాన్ని దక్షిణగా ఇచ్చాడు. ఆవిధంగా యాగం దిగ్విజయంగా ముగిసింది. అవభృధ స్నానం పూర్తయ్యింది.
చంద్రుడియాగం పూర్తయిన సమయంలో కామబాణాలతో తమ శరీరం తపించిపోగా తట్టుకోలేక తొమ్మిదిమంది దేవతాస్రీలు చంద్రుణ్ణి చూడటానికి వచ్చారు. వారు ఎవరంటే నారాయణుడి భార్య లక్ష్మీదేవి, కర్దమ ప్రజాపతి భార్య సినీవాలి, విభావసుడనే సూర్యుడిభార్య ద్యుతి, ధాత అనే ఆయన భార్య తుష్టి, ప్రభాకరుడి భార్య ప్రభాదేవి, హవిష్మంతుడి భార్య కుహూ, జయంతుడి భార్య కీర్తి కశ్యపుడి భార్య వసువ, నంది భార్య దృతి. ఇలా వీరందరూ తమతమ భర్తల్ని విడిచిపెట్టి చంద్రుణ్ణి ఆశ్రయించారు. చంద్రుడు కూడా యుక్తాయుక్తాలు మరిచి నచ్చినవారందరినీ తన భార్యలగానే భావించి స్వీకరించాడు.
ఈ విషయం వచ్చిన వారి భర్తలకు తెలిసింది. వారంతా చంద్రుడు తమకుచేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వెంటనే అందరూ మూకుమ్మడిగా అతడిపై దాడిచేసి ఎన్నో శస్త్రాస్త్రాలు ప్రయోగించారు. అలా వారెన్ని ప్రయత్నాలు చేసినా మహాశక్తి సంపన్నుడు, వరపుత్రుడు అయిన చంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయారు. ఆవిధంగా చంద్రుడు దిక్కులన్నిటినీ తన చల్లని వెలుగులతో ప్రకాశింపచేస్తూ అజేయుడుగా లోకప్రసిద్ధి పొందాడు.
చంద్రుడు - తార
చంద్రుడు మానవ రూపంలో సంచరిస్తుండగా ఒకనాడు ఉద్యానవనంలో బృహస్పతి భార్య అతడికి కనిపించింది. పుష్పాలతో, ఆభరణాలతో సర్వాలంకార సంశోభితగా అద్భుతమైన శరీర సౌందర్యంతో ఆమె ప్రకాశిస్తోంది. ఆమె సౌందర్యానికి ముగ్గుడైపోయిన చంద్రుడు ఏకాంతంగా కామవశుడై ఆమె జడను పట్టుకుని లాగాడు. అప్పటికే తార చంద్రుడి దివ్యకాంతిని సౌందర్యాన్ని
చూసి తన మనసులో కామభావాన్ని పొందింది. అందుకే అభ్యంతరం చెప్పకుండా చంద్రుడితో హాయిగా విహరించింది. తారతో ఎంత విహరించినా సంతృప్తి చెందని చంద్రుడు ఆమెని విడిచివుండలేనని భావించి తనతో పాటు తన గృహానికి తీసుకుపోయాడు. ఆనాటి నుంచి ప్రతిరోజూ ఆమెతో కామసుఖం అనుభవిస్తున్నప్పటికీ చంద్రుడికి తృప్తి కలగటంలేదు.
అక్కడ బృహస్పతి ఎంత కాలానికి తన భార్య తిరిగి రాకపోవటంతో ఆమె ఎడబాటుని సహించలేకపోయాడు. నిరంతరం ఆమెనే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఆయనకి తనభార్యని చంద్రుడు అపహరించాడని తెలిసింది. అయినా చంద్రుణ్ణి శాపాలతోకానీ, అభిచార హోమాలతో కానీ ఏవిధంగా శిక్షించలేకపోయాడు. చివరికి ఏమీ చేయలేక చంద్రుడి దగ్గరకి వచ్చి తనభార్యని తనతో పంపించమని ప్రాధేయపడ్డాడు. అయినా చంద్రుడు వినలేదు. చివరికి ఇంద్రుడూ, శివుడు, బ్రహ్మదేవుడు, మరుత్తులు, సిద్దులు, సాధ్యులు అందరూ వచ్చి నచ్చ చెప్పినా తారా మోహంలో వున్న చంద్రుడు ఆమెని వెనక్కి పంపటానికి ఏమాత్రం అంగీకరించలేదు.
చంద్రుడి దుశ్చర్యచూసి పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చింది. పరమేశ్వరుడు సామాన్యుడు కాదు కదా! త్రిపురారి, శత్రుభయంకరుడు పైగా బృహస్పతికి ఇష్టుడు. తన స్నేహితుడికి ఇలాంటి కష్టం కలిగినందుకు విచారించి అందుకు కారకుడైన చంద్రుడి దర్పాన్ని అణచాలనుకున్నాడు. వెంటనే సకల భూతగణాల్ని ఆయుధాల్నితీసుకుని చంద్రుడి మీదకి దండయాత్ర చేసాడు. శివుడితో పాటు సకలదేవతాగణాలు, అసురగణాలు, సిద్ధగణాలు లక్షలసంఖ్యలో వచ్చాయి. దివ్యాస్త్రాలతో చంద్రుడికి శివుడికి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమయ్యింది.
అరివీర భయంకరంగా వివిధ రకాల శస్త్రాలతో వారిద్దరి మధ్యా జరుగుతున్న యుద్ధంలో ఎందరో నశించారు. అది క్రమంక్రమంగా తీవ్రమవుతుంది. వారు ప్రయోగించే దివ్యాస్త్రాల నుంచి వెలువడే భయంకర జ్వాలలు లోకాలన్నిటినీ దహించేస్తున్నాయి. చివరికి కోపం వచ్చిన రుద్రుడు చంద్రుడి మీద బ్రహ్మశీర్షాసనాన్ని ప్రయోగించాడు. దానికి ప్రతిగా సోముడు అజేయమైన సోమకాస్త్రాని వదిలాడు. ఆ రెండూ పరస్పరం ఢీకొనటంతో భయంకరమైన శబ్దం కలిగి లోకాలన్నీ ఒక్కసారిగా భయభ్రాంతులకి గురయ్యాయి.
సోమ - శంకరులయుద్ధం ఎప్పటికీ ఆగకుండా కొనసాగుతుండటంతో లోకాలన్నీ క్షయమై పోతున్నాయి. ఆ పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వారిద్దరిచేతా యుద్దాన్ని విరమింపచేసాడు. ఆయన సోముడితో “నాయనా! నీవిలాగ అకారణంగా అన్ని లోకాలకీ నాశనం కలిగేలా యుద్దాన్ని చేస్తున్నావు. ఇది నీవు చేయకూడని పని, అదీగాక నీవు పరదారా పహరణం అనే ఘోరమైన తప్పిదాన్ని చేసావు. అందుకే నీవీ యుద్ధం చేయాల్సివచ్చింది. సహజంగా నీవు శాంతస్వభావుడివే, అయినా నీవు చేసిన ఈ దోషం కారణంగా లోకంలో ఎప్పటికీ పాపగ్రహంగానే చూడబడతావు. నీకు కలిగిన ఈ దుష్టమైన కోరికను విడిచి పెట్టు. తారని తిరిగి బృహస్పతికి అప్పగించు” అని హితబోధ చేసాడు.
బ్రహ్మదేవుడి హితబోధ విన్నాక చంద్రుడికి జ్ఞానోదయమయ్యింది. తను చేసిన తప్పుతెలిసింది. వెంటనేయుద్దాన్ని విరమించి తారని తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించి క్షమాపణ కోరాడు. బృహస్పతి చంద్రుణ్ణి క్షమించి తనభార్యతో కలిసి వెళ్ళిపోయాడు. రుద్రుడు కూడా శాంతించి తన గణాలతో కైలాసానికి ప్రయాణమయ్యాడు.
యదువంశం
యయాతి చక్రవర్తి కుమారుడు యదువు. ఆయనకి మహావీరులు, మహాధానుష్కులు అయిన సహస్రజిత్, క్రోష్టుడు, నీలుడు, బకుడు, లఘువు అనే అయిదుగురు కుమారులు జన్మించారు. వీరిలో సహస్రజిత్ కుమారుడైన శతజిత్‌కి, హైహయ, హయ, వేణుహయ అనే ముగ్గురు పుత్రులు జన్మించారు.
వీరిలో హైహయుడికి ధర్మనేత్రుడు జన్మించగా అతడికి కుంతి అనేవాడు, కుంతికి సంహతుడు, సంహతుడికి మహిముడు, ఆ మహిముడికి భద్రశ్రేణ్యుడు అనేవారు పరంపరగా జన్మించారు. వీరిలో చివరివాడైన భద్రశ్రేణ్యుడు వారణాసీపట్టణానికి రాజుగా వున్నాడు.
భద్రశ్రేణుడికి దుర్గముడు పుత్రుడుగా జన్మించాడు. దుర్గముడికి కనకుడు, కనకుడికి మహావీర్యవంతులైన కృతవీర్యుడు, కృతాగ్ని కృతధర్ముడు, కృతేజుడు అనే నలుగురు పుత్రులు ఉదయించారు. వీరిలో గొప్పవాడైన కృతవీర్యుడి కుమారుడే కార్తవీర్యార్టునుడుగా విఖ్యాతి చెందాడు.
ఈకార్తవీర్యార్టునుడే అత్రిముని కుమారుడైన దత్తాత్రేయుణ్లి ఆరాధించి ఆయన ద్వారా అలభ్యమైన ఎన్నో వరాలు పొందాడు. వేయి చేతులతో మహావీరుడుగా విశ్వమంతా జయించి ఎంతో గొప్ప వాడుగా కీర్తిగాంచాడు. ఈ కార్తవీర్యార్డునుడికి వందమంది పుత్రులు జన్మించారు. వారందరూ కూడా
మహావీరులు ధర్మపరాయణులే, ఈ వందమంది కుమారులలో శూరసేనుడు, శూరుడు, వృష్టి, కృష్ణుడు, జయధ్వజుడు అనేవారు ముఖ్యులు.
వీరిలో జయధ్వజుడు అవంతీనగరాన్ని నిర్మించాడు. అతడి కుమారుడైన తాళజంఝుడు నూరు మంది పుత్రుల్ని కన్నాడు. ఈ వందమంది కుమారుల్లో నీతిహోత్రులు, భోజులు, అవంతులు, తుండికేసరులు, తాలజంఝులు అనే వంశాలవారు సుప్రసిద్దులు.
ఈవిధంగా యదువంశంలో కృతవీర్యుడి కుమారుడైన కార్తవీర్యార్జునుడు సుప్రసిద్దుడై వేయిచేతులతో సముద్రం వరకూ వున్న భూమండలాన్నంతా జయించి పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో వర్ధిల్లాడు. ఈ కార్తవీర్యుడి పేరు తలచినవారికి ధననష్టం కలగదు. పోయిన ద్రవ్యం తిరిగి లభిస్తుంది.
శూరవంశం
'వృష్టి' మహారాజు కుమారులలో ఒకడు దేవమీధ్వాన్. అతడికి ఇక్ష్వాకి అనే రాజకుమారికి శూరుడనే పుత్రడు ఉదయించాడు. ఆ శూరుడికి భోజ అనే రాజకుమారికి 1. వసుదేవుడు
2.దేవభాగుడు
3.దేవశ్రవసుడు
4. అనాదృష్టి
5.శిబి
6నందుడు
7.స్ఫంజయుడు
8. శ్యాముడు
9. సామీకుడు
10.సంయూపుడు
అనే పదిమంది పుత్రులు జన్మించారు. వీరితో పాటు
1.శ్రుతకీర్తి
2.పృధ
3. శ్రుతదేవి
4.శ్రుతశ్రవ
4.రాజాధిదేవి అనే కూమార్తెలు కూడా పుట్టారు.
వీరందరూ వీరమాతలుగా ఖ్యాతి పొందారు. శ్రుతదేవికి క్రుతుడనే భర్తవల్ల సుగ్రహుడనేవాడు, శ్రుతకీర్తికి కైకేయుడనేవాడి వల్ల సునీథుడు, రాజాధిదేవికి బర్హిషుడి వల్ల ధర్మాత్ముడైన
అరిమర్దనుడు అనే కుమారులు కలిగారు. వృద్ధుడైన శూరుడు తన మిత్రుడైన కుంతిభోజుడికి సంతానం లేకపోవటంతో తన కుమార్తె పృధని ఆమెకి కూతురుగా దత్తత ఇచ్చాడు. ఆనాటి నుంచి పృధకి కుంతి అనే పేరు వచ్చింది. ఈమె శూరసేనుడి పుత్రుడైన వసుదేవుడి చెల్లెలు. తండ్రి మరణానంతరం వసుదేవుడు తన చెల్లెలు కుంతిని పాండురాజుకిచ్చి వివాహం చేసాడు. పాండురాజు శాపగ్రస్తుడుకాగా తరువాత కుంతికి ధర్మరాజు అనుగ్రహంతో యుధిష్టిరుడు, వాయుదేవుడి వల్ల భీముడు, ఇంద్రుడి అనుగ్రహంతో అర్జునుడు జన్మించారు. పాండురాజు రెండోభార్య అయిన మాద్రికి అశ్వినీదేవతల అనుగ్రహంతో నకుల, సహదేవులు జన్మించారు.
వసుదేవుడికి పూరువంశంలో జన్మించిన రోహిణీదేవితో వివాహం జరిగింది. వారిద్దరికీ రాముడు, సారణుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండకుడు, మహాహనుడు అనే కుమారులు, చిత్ర, క్షేత్ర అనే కుమార్తెలు జన్మించారు. వసుదేవుడికి దేవకీదేవి ద్వారా, సుశేణుడు, కీర్తిమాన్, ఉదాసి,
భద్రసేనుడు, ఋషిదాసుడు, భద్రుడు, విదేహుడు అనే పుత్రులు జన్మించారు. వీరందరినీ కంసుడు సంహరించాడు. తరువాత శ్రీకృష్ణుడు సుభద్ర వారికి సంతానమయ్యారు.
వసుదేవుడికి తామ్ర అనే భార్య ద్వారా సహదేవుడు పుట్టగా, దేవరక్షితద్వారా ఉపానంగధర అనే కుమార్తె కలిగింది. ఆకన్యని కంసుడు వధించాడు. ఇంకా వసుదేవుడికి ఇతర భార్యల ద్వారా చాలా మంది పుత్రులు కలిగారు. వసుదేవుడి పుత్రుడైన శ్రీకృష్ణుడు సంతానంలేని గండూషుడు అనే వాడికి తన కుమారుడైన సుచంద్రుడనేవాడిని ఇచ్చివేశాడు. కృష్ణుడికి జాంబవతిద్వారా చారుధేష్ణుడు, సాంబుడు అనే కుమారులు జన్మించారు.
ఈ వంశంలో నందనుడు అనేవాడికి తంత్రిపాలుడు, తంత్రి అనే పుత్రులు జన్మించగా, శమీకుడనేవాడికి మహాబలపరాక్రమవంతులైన విరజుడు, ధనువు, శ్యాముడు, సృంజయుడు అనే నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు కుమారుల్లో శ్యాముడు అనే వాడికి సంతానం కలుగలేదు. సృంజయుడు వాన ప్రస్థాశ్రమం స్వీకరించాడు. ఇది శూరవంశ వృత్తాంతం అని సూతమహర్షి శౌనకాది మహామునులకి ప్రవచించాడు.
అగ్ని వంశం
స్వాయంభువ మన్వంతరంలో జరిగిన సృష్టి మొదట్లో అగ్ని అనే భూతానికి అధిష్టాతగా అగ్ని అనే దేవత చెప్పబడింది. ఈ అగ్ని తత్వాన్నే అగ్ని అభిమానిదేవత అంటారు. అంటే పంచభూతాల్లో ఒకటిగా వున్న అగ్ని అనే దాన్ని ఆశ్రయించి, ఇది నాది అనే అభిమానంతో ప్రవర్తిస్తూ, అగ్నిని ఆరాధించిన వారికి ఆయాఫలాలని అందిస్తూ, అగ్నిలో హవనం చేసిన పదార్ధాలని దేవతలకి
అందిస్తూ, ఉండే అగ్ని తత్వం అని అర్ధం. ఇదే అగ్నిలో వ్యాపించిన దేవతాతత్తం.
అగ్ని దేవుడికి తన భార్య అయిన స్వాహా దేవిద్వారా
1.పావకుడు
2.పవమానుడు
3. శుచి అనే పుత్రులు జన్మించారు. వీరిలో పవమానుడు భూర్, భువః, సువః అనే మూడు వ్యాహృతులలో మొదటి వ్యాహృతి అయిన, భూలోకానికి సంబంధించిన అగ్నికి అధిష్టాంతగా వున్నాడు. ఈ పవమానుడుకి పుత్రుడు నిర్మధ్యాగ్ని అనేవాడు (నిర్మథ్యాగ్ని అంటే ఆరణులతో మధనం చేయగా పుట్టిన అగ్ని అని అర్ధం). తరువాత అగ్నిదేవుడి మరో కుమారుడైన పావకుడు
మూడు వ్యాహృతులలో రెండో దైన భువః అనే వ్యాహృతికి ఆధారమైన అంతరిక్ష లోకానికి సంబంధించిన అగ్నికి అధిష్టాన దేవతగా వున్నాడు. ఈపావకుడికి వైద్యుతాగ్ని కుమారుడుగా వున్నాడు.
అగ్నిదేవుడి మూడో కుమారుడైన శుచి మూడోవ్యాహృతి అయిన సువః అనే దానికి ఆధారంగా వున్న ద్యులోకానికి సంబంధించిన అగ్నికి అధిష్టాన దేవతగా వున్నాడు. ఈ శుచి కుమారుడు సౌరాగ్ని. ఈ విధంగా పవమాన, పావక, శుచుల కుమారులుగా చెప్పబడిన నిర్మద్యాగ్ని - వైద్యుతాగ్ని-సౌరాగ్ని అనే వారి రూపాలు భౌతిక జడరూపాలు.
పవమాన, పావక, శుచులకు జన్మించిన పుత్రుల దేవతాత్మక రూపాలు ఇలా వుంటాయి.
1. పవమానుడు దేవతాత్మకు కుమారుడు హవ్యవాహనుడు. (హవ్యాల్ని దేవతలకి తీసుకెళ్ళి అందించేవాడు)
2. పావకుడి దేవతాత్మక కుమారుడు సహరక్షుడు.
3. శుచి అనే అగ్నికి దేవతాత్మక కుమారుడు కవ్యవాహనుడు. (అనగా పితృదేవతలకి కవ్యాన్ని అందించేవాడు) ఇలా ఈ ముగ్గురూ అనగా హవ్యవాహనుడు దేవతలకి, సహరక్షుడు రాక్షసులకి,
కవ్యవాహనుడు పితృదేవతలకి సంబంధించిన వారిగా ప్రసిద్ధి చెందారు.
ఇక్కడ చెప్పిన పావక-పావమాన-శుచి అనే అగ్ని పుత్రులు ముగ్గురినీ కలిపి 'సూనులు' అని వ్యవహరిస్తారు. (సూనులు అంటే తోజోకిరణాలు అని అర్ధం)
బ్రహ్మ మానసపుత్రుడైన ప్రాథమికాగ్ని దేవుడి, తత్త్వ భేదమైన పావకుడికి భరతుడు అనే కుమారుడు జన్మించాడు. పావకాగ్నికి మరో కుమారుడు వైశ్వానరుడు. ఈవిధంగా ఇంకా ఎన్నో రకాల అగ్ని భేదాలు అగ్ని వంశంలో భాగంగా చెప్పబడ్డాయి.
పురాణదాన వ్రతం
మత్స్యరూపంలో వున్న శ్రీమన్నారాయణుడు మనువుకి పురాణాల్ని దానంచేస్తే వచ్చే శుభఫలితాల గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు.
పూర్వం బ్రహ్మదేవుడి ఐదు ముఖాల్లో ఊర్ధ్వముఖం నుంచి సకలశాస్తాలకీ మూలమైన పురాణం ఆవిర్భవించింది. తరువాత మిగిలిన నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు వెలువడ్డాయి. ఆ కల్పంలో కేవలం పురాణం ఒక్కటిగానే వుండేది. అప్పుడది వందకోట్ల శ్లోకాలతో నిండివుంది. ప్రళయకాలం పూర్తయిన తరువాత నేను హయగ్రీవుడిగా అవతరించి ఒక్కటిగా వున్న పురాణాన్ని
నాలుగువేదాలని, వేదాంగాలని, పద్నాలుగు శాస్త్రాలని స్వాధీనం చేసుకున్నాను. తరువాత కల్పంలో నేను తిరిగి పురాణాన్ని బ్రహ్మదేవుడికి బోధించగా ఆయన దానిని విని దేవతలకి, ఋషులకి తిరిగి బోధించాడు. అయితే అందరూ ఆ మహాగ్రంథాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారని నేను గ్రహించాను. అందుకే ప్రతి ద్వాపర యుగంలో వ్యాసుడుగా అవతరించి ఆ మహాపురాణాన్ని నాలుగు లక్షల శ్లోకాలకి కుదించి వాటిని పద్దెనిమిది మహాపురాణాలుగా విభాగించాను.
దేవలోకంలో మాత్రం ఇది మహాపురాణంగా శతకోటిశ్లోకాలతో ఎలాంటి విభాగాలు లేకుండా ఏక రూపంలోనే వుంది.
విభజించబడ్డ ఈ పురాణాలు ఎన్ని రకాలు వాటి ప్రమాణం ఎంత? వాటిని ఏఏ తిధులలో దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి. అనే విషయాలని నీకు వివరిస్తున్నాను.
1. బ్రహ్మపురాణం : బ్రహ్మదేవుడు మరీచికి ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పదివేలశ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖీంచి (వ్రాసి) వైశాఖపూర్ణిమ తిథినాడు నీలు - ఆవు సహితంగా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. పద్మపురాణం : ఈ జగత్తు అంతా జలమయంగా మారిపోయి ఒక పద్మంగా రూపొందినప్పుడు బ్రహ్మ దేవుడు ఈ పురాణాన్ని ప్రవచించాడు. దీని పరిమాణం ఏభై అయిదువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని వ్రాసి జ్యేష్టమాసం పూర్ణిమ తిథినాడు బంగారు కమలాలతో నువ్వులతో కలిపి దానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది.
3. విష్ణుపురాణం : పరాశర మహర్షి వారాహకల్పంలోని వృత్తాంతాన్ని ఆశ్రయించి, సకల ధర్మాల్ని ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవైమూడు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని వ్రాసి ఆషాఢపూర్ణిమనాడు నెయ్యితో ఆవుతో కలిపి సంసారి అయిన బ్రాహ్మణుడికి దానం చేస్తే విష్ణులోకం
ప్రాప్తిస్తుంది.
4. వాయుపురాణం : వాయుదేవుడు శ్వేతవరాహ కల్పవృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని రుద్రుడి మహాత్మ్యాన్ని ప్రబోధించిన పురాణం ఇది. ఈ గ్రంథ పరిమాణం పన్నెండువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖీంచి శ్రావణ పూర్ణిమనాడు పెరుగు, బెల్లం, ధేనువుతో సహా విప్రుడికి దానంచేస్తే ఒక కల్పం వరకూ శివలోకంలో నివసిస్తారు.
5. భాగవతపురాణం : వృత్రాసుర వధతో శ్రీకృష్ణుడి లీలా విలాసాలతో, సారస్వత కల్పంలోని ఇతివృత్తాల్ని ఆధారంగా చేసుకుని ఎన్నో ధార్మిక విషయాల్ని వివరించిన పురాణం ఇది. దీని పరిమాణం పద్దెనిమిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి బాధ్రపదపూర్ణిమ నాడు బంగారు సింహాసనంతో సహా దానం చేసినవాడు పరమపదాన్ని చేరుకుంటాడు.
6. నారదపురాణం : బృహత్కల్పాన్ని ఆశ్రయంగా చేసుకుని నారదమహర్షి చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవై అయిదువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి, ఆశ్వయుజపూర్ణిమనాడు ధేనువుతో సహా దానం చేస్తే పునర్జన్మలేని కైవల్యం లభిస్తుంది.
7. మార్మండేయపురాణం : పక్షుల్ని ఆధారంగా చేసుకుని ఎన్నో ధార్మిక విశేషాలనిజైమిని మహర్షికి బోధించిన విధంగా చెప్పబడిన పురాణం ఇది. దీని పరిమాణం తొమ్మిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని వ్రాసి బంగారు ఏనుగుతో సహా కార్తీక పూర్ణిమనాడు విప్రుడికి దానం చేస్తే యజ్ఞఫలం లభిస్తుంది.
8. అగ్నిపురాణం : ఈశానకల్పాన్ని ఆధారంగా చేసుకుని అగ్నిదేవుడు వసిష్టుడికి ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పదహారువేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి బంగారు పద్మాలతో నువ్వులు, ధేనువుతో సహా మార్గశీర్ష పౌర్ణమినాడు దానంచేస్తే సర్వక్రతువులు చేసిన ఫలం లభిస్తుంది. స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.
9. భవిష్యపురాణం : అఘోర కల్పవృత్తాంతాలని భూతసమూహలక్షణాలని, జగత్తుస్థితిగతుల్ని, భవిష్యవృత్తాంతాలని ఆదిత్య మహాత్యం ఆధారంగా చేసుకుని బ్రహ్మ మనువుకి బోధించిన పురాణం ఇది. దీని పరిమాణం పద్నాలుగువేల ఐదువందల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి పుష్యమాసపౌర్ణమి తిథినాడు ధేనువుతో సహా దానంచేస్తే అగ్నిష్టామయాగం చేసిన ఫలితం లభిస్తుంది.
10. బ్రహ్మవైవర్తపురాణం : రథంతర కల్ప వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని సౌవర్ణిమనువు నారదుడికి శ్రీకృష్ణ వృత్తాంతాన్ని బ్రహ్మ వరాహచరిత్రని చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం పద్దెనిమిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి, మాఘమాసం పూర్ణిమ తిథినాడు గృహస్టుడైన బ్రాహ్మణుడికి మంచి ఇంటితో సహాదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
11. లింగపురాణం : పరమేశ్వరుడు అగ్ని లింగం మధ్యలో వుండి ఈశాన కల్పవృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పదకొండు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి ఫాల్గుణమాస పూర్ణిమ తిథినాడు నువ్వులతో అర్థనారీశ్వరుడి ప్రతిమతో దానం చేస్తే శివసాయుజ్యం కలుగతుంది.
12. వరాహపురాణం : మానవకల్పాన్ని ఆధారంగా చేసుకుని మహావిష్ణువు భూదేవికి చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవైనాలుగు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి చైత్ర మాస పూర్ణిమ తిథినాడు, బంగారుగరుడుడి విగ్రహం, నువ్వులు, ధేనువులతో సంసారి అయిన బ్రాహ్మణుడికి దానం చేస్తే వరాహమూర్తి అనుగ్రహంతో విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
13. స్కాందపురాణం : తత్పురుషకల్పాన్ని ఆశ్రయించి స్కందుడు పరమేశ్వర ధర్మాలని ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం లక్షా ఒకవేయి శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖీంచి బంగారు శూలంతో సహా దానం చేస్తే అన్ని బంధాలనుంచీ విముక్తులై శివలోకానికి చేరుకుంటారు.
14. వామనపురాణం :త్రివిక్రముడి మహాత్మ్యాన్ని ఆధారంగా చేసుకుని కూర్మకల్పవృత్తాంతాన్ని చతుర్విధ పురుషార్థాలని వర్ణించిన పురాణం ఇది. దీని పరిమాణం పద్నాలుగు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి రాత్రిపగలు సమానంగా వుండే రోజున దానం చేస్తే విష్ణుస్థానాన్ని పొందుతారు.
15. కూర్మపురాణం : కూర్మరూపాన్ని ధరించిన శ్రీహరి ఇంద్రుడి సన్నిధిలో మునులకి లక్ష్మీకల్ప వృత్తాంతంలోని నాలుగు పురుషార్థాల మహాత్యాన్ని ప్రధానంగా వర్ణించిన పురాణం ఇది. దీని పరిమాణం ఆరువేల శ్లోకాలు (పద్దెనిమిది వేల శ్లోకాలని కొందరి అభిప్రాయం) ఈ పురాణాన్ని వ్రాసి ఆయనం ప్రవేశించే కాలంలో బంగారు కూర్మంతో సహా దానం చేయాలి. అలా చేస్తే వేయి గోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది.
16. మత్స్యపురాణం : కల్పం మొదట్లో మత్స్యరూపాన్ని ధరించిన నారాయణుడు మనువుకి సప్తర్షికల్పం ఆధారంగా పురుషోత్తమతత్వాన్ని ప్రధానంగా వర్ణించి చెప్పిన పురాణం ఇది. దీని పరిమాణం పద్నాలుగువేల అయిదువందల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి ఉగాది రోజున బంగారు మత్స్యంతో ధేనువుతో సహా బ్రాహ్మణుడికి సత్కారం చేసి దానం చేస్తే భూమండలాన్నంతా దానం చేసిన ఫలితం లభిస్తుంది.
17. గరుడపురాణం : శ్రీ మహావిష్ణువు గారుడ కల్పంలో బ్రహ్మాండం నుంచి గరుత్మంతుడు ఆవిర్భవించిన వృత్తాంతం ప్రధానంగా ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పంతొమ్మిదివేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి బంగారు హంస ప్రతిమతో సహా దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది.
18. బ్రహ్మాండపురాణం : బ్రహ్మాండ వృత్తాంతాన్ని ఆశ్రయించి బ్రహ్మదేవుడు భవిష్యకల్ప విశేషాలని ప్రధానంగా ప్రవచించిన పురాణం ఇది. దీని పరిమాణం పన్నెండువేల రెండు వందల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి వ్యతీపాతయోగం వున్న రోజు ఉన్ని వస్త్రాలతో, బంగారంతో సహా దానం చేస్తే వేయి రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది.
19. శివుడిపురాణం : నందీశ్వరుడు ఋషులందరికీ శివుడి సంహార కర్తృత్వాన్ని దేవాసురసంగ్రామ వృత్తాంతాలని ప్రధానంగా వర్ణించిన పురాణం ఇది. దీని పరిమాణం ఇరవైనాలుగు వేల శ్లోకాలు. ఈ పురాణాన్ని లిఖించి మాఘకృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి) నాడు గంధాదిద్రవ్యాలతో, భోజనంపెట్టి
విప్రుడికి దానం చేస్తే వంద మానవ తరాల దాకా రుద్రలోక నివాసం లభిస్తుంది.
ఇక ఉపపురాణాల విషయానికి వస్తే 1 పద్మపురాణంలో చెప్పబడ్డ నరసింహుడి వర్ణన ప్రధానంగా కలిగింది నృసింహ పురాణం”. దీని పరిమాణం పద్దెనిమిది వేల శ్లోకాలు.
2. కుమారస్వామి నందుడికి శివమహాత్మ్యాన్ని ప్రబోధించిన పురాణం 'నందపురాణం”
3. సాంబుడి గురించి భవిష్యోపాఖ్యానాల రూపంలో చెప్పబడింది సాంబపురాణం. అలాగే ఆదిత్యపురాణం కూడా వున్నది. ఈ అష్టాదశ పురాణాలలో ఇతర అంశాల గురించి చెప్పబడ్డ పురాణాలు ఏవైతే వున్నాయో అవన్నీ ఉపపురాణాలే.
పురాణ లక్షణాలు
మనురాజా! పురాణాలకి ఐదురకాల లక్షణాలుండాలని నిర్దేశించారు. అవి :
1.సర్గ (ఆదిసృష్టి)
2. ప్రతిసర్గ (పంచభూతాల సృష్టి
3. వంశం ప్రజాపతుల సృష్టి
4 మన్వంతరం(పద్నాలుగుమంది మనువుల వృత్తాంతం)
5.వంశాను చరితం (మనువుల వారసుల వంశచరిత్ర). ఇలా పంచలక్షణాలతో వున్న పురాణాలలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, సూర్యుల మహిమలు, భువనాల సృష్టి సంహారాలు, ధర్మార్థకామ మోక్ష విశేషాలు ప్రవచించబడతాయి.
ప్రధానంగా పురాణాలు సాత్త్వికాలు, రాజసాలు, తామసాలు అని మూడు విధాలుగా వుంటాయి. సాత్త్విక పురాణాలలో విష్ణుమహాత్మ్యం, రాజసపురాణాలలో బ్రహ్మమహాత్మ్యం, తామసపురాణాలలో అగ్ని శివుల మహాత్మ్యం చెప్పబడతాయి. మిగిలిన మిశ్రపురాణాలలో సరస్వతీ, పార్వతీ వంటి శక్తుల మహిమ పితృదేవతల మహాత్మ్యం వర్ణించబడతాయి. ఇక్కడ చెప్పిన ఈ అష్టాదశ పురాణాల అనుక్రమాన్ని దైవ కార్యాలు జరిగే సమయంలో పఠిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. పురాణ దాన క్రమం అనే ఈ అధ్యాయాన్ని చదివిన వారికి, విన్నవారికి, బోధించిన వారికి ఆయుషు యశస్సు కలుగుతాయి.
ఆదిత్యశయన వ్రతం
పూర్వం నారదుడు శివుడుతో “స్వామీ! ఉపవాసాలు చేసే శక్తి లేనివారు, వ్యాధులతో బాధపడేవారు. అనాయాసంగా శుభఫలితాలను పొందాలంటే ఏవ్రతం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. శివుడు ఇలా చెప్పాడు.
నారదా! ఉపవాసం చేయలేనివారు నక్తం (పగలు ఉపవాసముండి రాత్రి భోజనం చేయటం) వుండి చేయతగ్గ మహావ్రతం ఒకటుంది. దానినే ఆదిత్య శయన వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సప్తమి - ఆదివారం-హస్తానక్షత్రం-సూర్యుడు ఏదో ఒక రాశిలో ప్రవేశించే సమయం. వీటిలో ఏదో ఒకరోజుగానీ,
ఇవన్నీ కలిసిన రోజుగానీ ఈ వ్రతాన్ని చేస్తే అన్ని కోరికలూ తీరుతాయి.
వ్రతవిధానం : ఈ వ్రతం చేసేవారు పూజామందిరంలో శివుడు లేక సూర్యుడి ప్రతిమలలో ఒక్కదానినే వుంచాలి. ఎందుకంటే ఇద్దరికీ భేదం లేదు కనుక. ఈ వ్రతం చేసే రోజు నూనె, మాంసం, ఉప్పుకారం లేని భోజనాన్ని చేయాలి. ఇది పద్నాలుగు సంవత్సరాలు వరుసగా చేయవలసిన వ్రతం. ప్రతి సంవత్సరం వ్రతం చివర ఒక కుంచెడు వరి బియ్యాన్ని మేడి కర్రతో చేసిన పాత్రలో వేసి నేయి, బంగారంతో సహా విప్రుడికి దానం ఇవ్వాలి. ఏడో సంవత్సరంలో వ్రతం చేసేడప్పుడు వీటితో పాటు వస్త్రాలని కూడా దానం చేయాలి. పద్నాలుగో సంవత్సరంలో బ్రాహ్మణులకి, బెల్లం, పాయసంతో కూడిన భోజనాన్ని పెట్టాలి.
ఎనిమిది అంగుళాల వ్యాసంతో ఒక బంగారు పద్మాన్ని చేయించాలి. దానికి ఎనిమిది రేకులుండాలి. మధ్యలో దుద్దు ఉండాలి. ఆ ఎనిమిది రేకుల్లో పద్మరాగమణుల్ని తాపడం చేయాలి. ముడులు లేని మంచి కొయ్యతో ఒక మంచాన్ని తయారుచేయించాలి. వీటితోపాటు, దిండ్లు, చాందినీలు, పరుపు,
విసనకర్ర, చెప్పులు, పాదుకలు, గొడుగు, చామరాలు, కాలిపీట, అద్దం, అలంకారాలు, పళ్ళు, వస్త్రాలు, గంధద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. ఆ మంచం మీద బంగారు పద్మాన్ని చెప్పిన వస్తువులన్నిటినీ ఉంచాలి.
తరువాత కొమ్ములతో పొడవని, మంచిగా పాలు ఇచ్చే దూడతో సహా వున్న కపిలగోవుని వస్త్రంతో, బంగారు కొమ్ములతో, వెండిగిట్టలతో అలంకరించి పాలు పితికే కంచు పాత్రని చేర్చి పై తెలిపిన మంచం ఇతర వస్తువులతో సహా మధ్యాహ్నం దాటకుండా యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానం చేసేడప్పుడు
యధైవాదిత్యః శయన మసూన్యంతవ సర్వదా ।
కాంత్యాధృత్యా శ్రియా రత్యాతథామే సంతు వృద్ధయః ।
యథానదేవాశ్శ్రేయాంసం త్వదన్య మనఘం విదుః ।
తథా మాముద్దరాశేష దుఃఖసంసార సాగరాత్ ॥
(ఆధ్యా-55, శ్లో॥26-27)
“ఓ ఆదిత్యా! నీ పడక ఎప్పుడూ కాంతితో, శోభతో ఆనందంతో నిండివున్న విధంగా నాకు కూడా అన్ని రకాల అభివృద్దులూ కలుగుగాక!. దేవతలు కూడా నీ కన్నా వేరెవ్వరినీ పూజ్యుడుగా భావించరు. ఎందుకంటే నీవు అందరు దేవతల కన్నా గొప్పవాడివి కనుక నన్ను సంసార దుఃఖం
నుంచి ఉద్ధరించు” అని ప్రార్థించి, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ దాన ద్రవ్యాలన్నిటినీ అతడికి సమర్పించాలి. తరువాత ఆద్రవ్యాలని బ్రాహ్మణుడి ఇంటికి వ్రతం చేసిన యజమానే చేర్చాలి.
వ్రతఫలం : ఈ దివ్యవ్రతాన్ని నాస్తికులకీ వితండ వాదం చేసే వారికి చెప్పకూడదు. కేవలం ఇంద్రియ నిగ్రహం కలిగిన వారికే బోధించాలి. ఈ వ్రతం శివుడికి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. అన్ని పాపాలనీ తొలగించి అక్షయంగా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించినవాడికి వాడి బంధుమిత్ర పరివారం అందరికీ దేవతాను గ్రహం లభిస్తుంది. రోగంతో వున్నవారికి ఆరోగ్యం కలుగుతుంది.
పూర్వం ఈ వ్రతాన్ని వసిష్ఠుడు, కుబేరుడు, అర్జునుడు ఆచరించారు. ఈ వ్రతం గురించి కీర్తించినా చాలు పాపాలు నశిస్తాయి. ఈ దివ్య వ్రతవిధానాన్ని చదివినా, విన్నా బోధించినా ఇంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడి పితరులు నరకంలో వున్నా స్వర్గానికి చేరుకుంటారు.
ఆదిత్యవ్రత పూజావిధి
ఆదిత్యశయన వ్రతంలో భాగంగా పూజామందిరంలో శివ లేక సూర్యప్రతిమని ఉంచి ఈ క్రింద తెలిపిన మంత్రాలతో పూజించాలి.
1. సూర్యాయనమః - హస్తా నక్షత్రే పాదే పూజయామి
2. అర్కాయ నమః - చిత్తా నక్షత్రే గుల్ఫే పూజయామి
3. పురుషోత్తమాయనమః - స్వాతీ నక్షత్రే జంఘే పూజయామి
4. ధాత్రే నమః - విశాఖా నక్షత్రే జానునీపూజయామి
5. సహస్ర భానవేనమః - అనురాధా నక్షత్రే ఊరూం పూజయామి
6. అనంగాయ నమః - జ్యేష్టా నక్షత్రే గుహ్యం పూజయామి
7. సోమాయ నమః - మూలా నక్షత్రే కటిం పూజయామి
8. త్వష్ట్రే సప్త తురంగాయ నమః - పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రే నాభిం పూజయామి
9. తీక్ష్ణాంశవే నమః - శ్రవణా నక్షత్రే కుక్షిం పూజయామి
10. వికర్తనాయ నమః - ధనిష్టా నక్షత్రే పృష్టం పూజయామి
11. ధ్వాంతవినాశనాయ నమః - శతభిషానక్షత్రే వక్షః స్థలం పూజయామి
12. చండకరాయ నమః - పూర్వాభాద్ర నక్షత్రే, ఉత్తరాభాద్రా నక్షత్రే బాహూం పూజయామి
13. సామ్నామధీశాయ నమః - రేవతీనక్షతే హస్తా పూజయామి
14. సప్తాశ్వదురంధరాయ నమః - అశ్వినీ నక్షత్రే నఖానిపూజయామి
15. కఠోరధామ్నే నమః - భరణీనక్షత్రే కంఠం పూజయామి
16. దివాకరాయ నమః - కృత్తికా నక్షత్రే గ్రీవం పూజయామి
17. అంబుజేశాయ నమః - రోహిణీ నక్షత్రే అధరం పూజయామి
18. రవయే నమః - మృగశీర్షా నక్షత్రే దంతాన్ పూజయామి
19. సవిత్రే నమః - ఆర్ద్రానక్షత్రే నాసికాం పూజయామి
20. అంభోరుహవల్లభాయ నమః - పునర్వసూ నక్షత్రే లలాటం పూజయామి
21. వేదశరీరధారిణే నమః - పుష్యమీ నక్షత్రే అంకాన్ పూజయామి
22. విబుధ ప్రియాయ నమః - ఆశ్లేషానక్షత్రే శిరః పూజయామి
23. గ్రహగణేశాయ నమః - మఖా నక్షత్రే కర్ణే పూజయామి
24. గో బ్రాహ్మణ నందనాయనమః - పూర్వఫల్గుణీ నక్షత్రే నేత్రాణి పూజయామి
25. విశ్వేశ్వరాయ నమః - ఉత్తర ఫల్గుణీ నక్షత్రే భ్రువే పూజయామి
పై తెలిపిన మంత్రాలతో ఆయా నక్షత్రాలు ఉన్న రోజు ఆయా అవయవాలని ప్రధానంగా భావిస్తూ సర్వాంగ పూజని సంపూర్ణంగా ప్రతిరోజూ (25) రోజులు చేయాలి. ఈ పూజలో భాగంగా ప్రతిరోజూ
నమోస్తు పాశాంకుశ పద్మశూల కపాల ఖడ్గేఘ ధ నుర్ధరాయ।
గజాసురానంగ పురాంధకాది వినాశమూలాయ నమశ్శివాయ ॥
అనే శ్లోకాన్ని పఠించి శివుణ్ణి భక్తితో ప్రార్థించాలి.
శ్రీకృష్ణాష్టమీ వ్రతం
పరమేశ్వరుడు నారదుడికి ఈ కృష్ణాష్టమీ వ్రతం గురించి ఉపదేశించాడు. నారదా! సర్వపాపాలనీ పోగొట్టి నరులకు శాంతిని ముక్తిని ఇచ్చే వ్రతమే కృష్ణాష్టమీ వ్రతం. ఈ వ్రతాన్ని కృష్ణాష్టమినాడు మాత్రమే ఆచరించాలి.
వ్రతవిధానం : మార్గశిరమాసం నుంచి కార్తీకమాసం వరకు పన్నెండు మాసాలలో వరుసగా
1. మార్గశిరమాసంలో శివుడు
2. పుష్యమాసంలో శంభుడు
3. మాఘమాసంలో మహేశ్వరుడు
4. ఫాల్గుణమాసంలో మహాదేవుడు
5. చైత్ర మాసంలో స్థాణుడు
6. వైశాఖమాసంలో శివుడు
7. జ్యేష్టమాసంలో పశుపతి
8. ఆషాఢమాసంలో ఉగ్రుడు
9.శ్రావణమాసంలో శర్వుడు
10.భాద్రపద మాసంలో త్య్రంబకుడు
11. ఆశ్వయుజమాసంలో హరుడు
12. కార్తీక మాసంలో ఈశానుడు అనే పేర్లతో పరమేశ్వరుణ్ణి భక్తిగా పూజించాలి. శివభక్తులైన స్త్రీలని శివుడితో పాటు గో, భూ, హిరణ్యా(బంగారం)లతో అర్చించాలి.
ఈ వ్రతం చేసే అష్టమీ తిధిరోజు గోమూత్రం, ఆవునేయి, ఆవుపాలు, నువ్వులు-దర్భలు వేసి వుంచిన నీళ్ళు, ఆవు కొమ్ములో పోసి వుంచిన నీరు, గోమయం (ఆవుపేడ), తెల్లజిళ్లేడాకు, మారేడాకు, ఆవుపెరుగు వీటిని ఆహారంగా (ఏదో ఒకటిగా గానీ వీలైనవిగానీ)తీసుకుని రాత్రిపూట పరమేశ్వరుణ్ణి పూజించాలి.
మార్గశిరమాసం నుంచి ప్రతి రెండు మాసాలు వరుసగా-రావి, మర్రి, మేడి, జువ్వి, మోదుగ, నేరేడు పుల్లలతో పళ్ళుతోముకుని ఆ చెట్లకిందే ఆహారాన్ని భుజించాలి. ఆ విధంగా ఒక సంవత్సరం పాటు వ్రతాన్ని ఆచరించాలి.
వ్రతసమాప్తి (ఉద్యాపన) : వ్రతాన్ని దిగ్విజయంగా ముగించిన తరువాత పెరుగన్నం, చాందినీ, చామరం, దండాలు, నల్లని ఆవులు, బంగారం, వివిధరకాల వస్త్రాలు శక్త్యానుసారం బ్రాహ్మణుడికి దానం చేయాలి. శక్తి లేనివాడు కనీసం ఒక్కగోవునైనా దానం చేయాలి. ధనానికి (ఉన్నవాడు) లోభిస్తే
దోషం కలుగుతుంది.
వ్రతఫలం : ఈ విధంగా నియమపూర్వకంగా శ్రద్దా భక్తులతో కృష్ణాష్టమీ వ్రతాన్ని ఆచరించిన వారు ఏడువందల కల్పాల పాటు దేవతల పూజ లందుకుంటారు. చివరికి శివలోకంలో సుఖంగా నివసిస్తారు.
సాభాగ్యశయన ప్రతం
మత్స్యరూపంలో వున్న నారాయణుడు నారద మహర్షికి అత్యంత పుణ్యప్రదమైన సౌభాగ్యశయన వ్రతం గురించి ఇలా బోధించాడు.
వ్రతకథ : నారాద! పూర్వం ప్రళయకాలంలో అన్ని లోకాలు దగ్ధమైపోయాయి. అయితే ఆయా లోకాలలో వున్న అన్ని భూతాల సౌభాగ్యాలు ఒక్కటిగా చేరి వైకుంఠానికివెళ్ళి శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో నిలిచాయి. తిరిగి చాలాకాలం తరువాత పునః సృష్టి ప్రారంభమైంది. లోకంలో పురుషాహంకారం అంతా ఆవరించింది. దాని ప్రభావంతో బ్రహ్మ విష్ణువులకి పోటీ ఏర్పడింది. నేను
గొప్పంటే? నేను గొప్ప అని వాదులాడుకోసాగారు. అప్పుడు వారిద్దరి మధ్యలో లింగాకృతితో ఒక మహాజ్వాల ఏర్పడింది. ఆ లింగజ్వాల వేడికి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నిలిచిన “సౌభాగ్యం” కరిగి ఒక ముద్దగా మారి బైటికి వచ్చింది. అది ఎగిరి భూమి మీద పడబోతుండగా బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు దాన్ని పట్టుకుని తినేసాడు. ఆ సౌభాగ్యాన్ని భక్షించిన ప్రభావంతో దక్షుడి
శరీరం అపూర్వమైన లావణ్యంతో తేజస్సుతో ప్రకాశించింది.
దక్షుడు సౌభాగ్యాన్ని పట్టుకుని తినేటప్పుడు ఆ ముద్దలోని కొన్ని చుక్కలు నేల మీదపడి ఓషధులుగా మారాయి. అవి.
1.చెఱకు
2.యవల నుండి తయారుచేసే చక్కర అనగా యవలు
3.జాజికాయ
4.ధనియాలు
5.విరిగిన ఆవుపాలు
6.కుంకుమపువ్వు
7.బొబ్బర్లు
8.ఉప్పు
ఈ ఎనిమిది వస్తువుల్ని సౌభాగ్యాష్టకం అంటారు. దక్షుడు సౌభాగ్యాన్ని పానం చేసిన తరువాత
సౌభాగ్యవతి అయిన కుమార్తె జన్మించింది. ఆమే సతీదేవి. ఆమె ఎంతో లలితంగా లావణ్యంగా వుంటుంది కాబట్టి ఆమే లలిత. పరమేశ్వరుడు ఆ సతీదేవిని వివాహం చేసుకున్నాడు. సతీ దేవి సౌభాగ్యంతో పుట్టింది కాబట్టి ఆమెని ఆరాధించిన వారికి సౌభాగ్యం కలుగుతుంది.
వ్రతవిధానం : వసంతమాసం ప్రారంభంలో అనగా చైత్ర శుక్ష తృతీయ తిధినాడు ఉదయంపూట నువ్వుల పిండితో నూనెతో అభ్యంగనం చేసుకుని శుచిగా స్నానం చేయాలి. ఈ తిథినాడే పరమేశ్వరుడు లలితాపరమేశ్వరి అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఈ తిథినాడు, శ్రీ లలితాపరమేశ్వరుల ప్రతిమని స్థాపించి వాటికి విధి విధానంగా షోడశోపచార పూజచేయాలి.
పూజావిధి :
1. పాటలాయై నమః - శివస్యదేవ్యాశ్చ పాదౌ పూజయామి
2. జయాయై-శివాయచ నమః - గుల్ఫే పూజయామి
3. భవానై- త్య్రంబకాయ నమః - జంఘే పూజయామి
4. విజయాయై-భద్రేశ్వరాయ నమః - జానునీపూజయామి
5. వరదాయై-హరికేశాయ నమః - ఊరూం పూజయామి
6. ఈశానాయై-శంకరాయ నమః - కటిం పూజయామి
7. కాళిన్యై-శూలపాణయే నమః - కుక్షి ద్వయం పూజయామి
8. మంగళాయై-మంగళేశాయ నమః - ఉదరం పూజయామి
9. ఈశాన్వై - సర్వాత్మనే నమః - కుచద్వయం పూజయామి
10. రుద్రాణ్యై-వేదాత్మనే నమః - కంఠం పూజయామి
11. అనంతాయై-త్రిపురఘ్నాయ నమః - కరౌ పూజయామి
12. కాలానలప్రియాయై- త్రిలోచనాయ నమః - బాహూం పూజయామి
13. సౌభాగ్యభవాయై-సౌభాగ్య భవనాయ నమః - భూషణాని పూజయామి
14. స్వాహాస్వధాయై-ఈశ్వరాయ నమః - ముఖం పూజయామి
15. అశోక మధువాసిన్యై-అశోకమధువాసినే నమః - ఓష్ఠౌ పూజయామి
16. చంద్రముఖప్రియాయై- స్థాణవే నమః - ఆస్యం పూజయామి
17. అఖిలాంగ్యై-అర్ధనారీశ్వరాయ నమః - నాసికాం పూజయామి
18. లలితాయై-ఉగ్రాయ నమః - భ్రువౌ పూజయామి
19. వాసవ్యై - శర్వాయ నమః - అలకాన్ పూజయామి
20. శ్రీకంఠనాధాయై-శివాయ నమః - కేశాన్ పూజయామి
21. భీమోగ్ర సమరూపిణ్యై - సర్వాత్మనే నమః - శిరః పూజయామి
ఈ విధంగా లలితా - పరమేశ్వరుల్ని పూజించిపైన తెలిపిన సౌభాగ్యాష్ట ద్రవ్యాలని వారికి నైవేద్యంగా సమర్పించి ఉత్తర పూజ చేయాలి. తరువాత గోశృంగం (ఆవుకొమ్ము) ఉంచిన నీటిని త్రాగి ఉపవాసం వుండి నేల మీదే నిద్రించాలి.
మర్నాడు ఉదయం అనగా చవితినాడు స్నానం, జపంచేసి, మంచి వస్త్రాలతో, ఆభరణాలతో బ్రాహ్మణ దంపతుల్ని పూజించి, లలితా పరమేశ్వరుల ప్రతిమల్ని సౌభాగ్యాష్టక ద్రవ్యాల్ని “శ్రీలలితా పరమేశ్వరః ప్రీయతాం” అని పఠిస్తూ వారికి దానం చేయాలి. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ప్రతినెల తదియనాడు ఈ వ్రతాన్ని చేయాలి.
ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతినెలా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, దానంచేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అంటే?
1. చైత్రమాసంలో గోశృంగంలోని నీటిని ఆహారంగా తీసుకుని దానం చేసేడప్పుడు
'లలితా ప్రీయతాం' అనే మంత్రాన్ని చదవాలి.
2. వైశాఖ మాసంలో గోమయాన్ని ఆహారంగా తీసుకుని 'విజయా ప్రీయతాం' అనే మంత్రాన్ని దానం చేసేడప్పుడు పఠించాలి.
3. జ్యేష్ట మాసంలో మందారపూలని ఆహారంగా తీసుకుని 'భద్రాప్రీయతాం' అనే మంత్రాన్ని చదవాలి.
4. ఆషాఢ మాసంలో బిల్వషత్రాల్ని ఆహారంగా తీసుకుని 'భవానీ ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
5. శ్రావణ మాసంలో పెరుగుని ఆహారంగా తీసుకుని 'కుముదా ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
6. భాద్రపదమాసంలో ధర్ఫోదకాన్ని ఆహారంగా తీసుకుని 'శివాప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
7.ఆశ్వయుజమాసంలో పాలని ఆహారంగా తీసుకుని 'వాసుదేవీప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
8.కార్తీక మాసంలో మీగడ పెరుగుని ఆహారంగా తీసుకుని 'గౌరీ పీయతాం' అనే మంత్రాన్ని చదవాలి. 9. మార్గశిరమాసంలో గోమూత్రాన్ని ఆహారంగా తీసుకుని 'మంగళాప్రీయతాం' అనే మంత్రాన్ని
చదవాలి.
10.పుష్యమాసంలో నేయిని ఆహారంగా తీసుకుని 'కమలా ప్రీయతాం' అని పఠించాలి.
11. మాఘమాసంలో నల్లనువ్వుల పొడిని ఆహారంగా తీసుకుని 'సతీ ప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
12. ఫాల్గుణమాసంలో పంచగవ్యాన్ని ఆహారంగా తీసుకుని 'ఉమా ప్రీయతాం' అనే మంత్రాన్ని
చదువుతూ దానం ఇవ్వాలి.
పన్నెండు మాసాలలో లలితా పరమేశ్వరులని వరుసగా
1.మల్లి
2.అశోకం
౩.తామర
4.కడిమి
5.కలువ
6.మాలతి
7. కుబ్దకం (గొజ్జంగి)
8. కరవీరం (ఎర్రగన్నేరు)
9.రెలు
10. వాడగన్నేరు
11.కుంకుమపువ్వు
12.ప్రీంకణం ఈ పూలతో పూజించాలి
వ్రత ఉద్యాపనం : ఈ విధంగా విధివిధానంగా పన్నెండు నెలలపాటు వ్రతాన్ని చేశాక చివరిమాసంలో తాము పూజించిన లలితా - పరమేశ్వరుల ప్రతిమని, దానంచేసే వస్తువుల్ని ఒక కొత్త మంచం మీద వుంచి దాన్ని బ్రాహ్మణ దంపతులకే దానమివ్వాలి. అలాగే యథాశక్తి మరి కొంతమంది బ్రాహ్మణ దంపతులకి వస్త్రాల్ని, ఆభరణాల్ని, ఆవుల్ని దానం చేయాలి. ధనం వున్నవారు దానానికి లోభించకూడదు. అహంకలిగించకూడదు.
వ్రతఫలం : భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. ఈ దివ్య వ్రతాన్ని వరుసగా పన్నెండు సంవత్సరాలు గానీ, పద్దెనిమిది సంవత్సరాలు గానీ చేసినవారు పదివేలకల్పాల వరకూ దేవతలచేత సేవలందుకుంటూ కైలాసంలో నివసిస్తారు.
ఈ సౌభాగ్యశయన వ్రతాన్ని చదివిన వారికి, వినిపించినవారికీ విద్యాధరత్వం, స్వర్గలోక నివాసం లభిస్తాయి. పూర్వం బ్రహ్మదేవుడు, కార్తవీర్యార్దునుడు వరుణుడు, నంది ఈ వ్రతాన్ని ఆచరించారు.
అక్షయ తృతీయ ప్రతం
పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయతృతీయ వ్రతాన్ని ఉపదేశించాడు. ఈ అక్షయ తృతీయ నాడు చేసిన దానం, జపం, హోమం అక్షయంగా ఫలితాన్నిస్తుంది.
వైశాఖమాసంలో శుక్ష పక్షంలో వచ్చే తృతీయనే అక్షయ తృతీయ అంటారు. ఈ తిథి బ్రహ్మదేవుడికి ప్రీతికరమైనది. కనుక ఈ పుణ్య తిథినాడు ఉపవాసంవుండి ఎలాంటి పుణ్యకర్మల్ని ఆచరించినా శుభం జరుగుతుంది. ఈ దివ్య తిథినాడు నాశనం (క్షయం) లేని దేవతలందరూ శ్రీమహావిష్ణువుని పూజిస్తారు. అందుకే ఈ తిథి అక్షయతృతీయ అయ్యింది.
వ్రతవిధానం : అక్షయతృతీయనాడు అక్షతల్ని నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. తరువాత అక్షతలతో శ్రీమహావిష్ణువుని పూజించాలి. ఆరోజు యోగ్యులైన విప్రులకి యథాశక్తి అన్నవస్త్రాలని దానంగా ఇవ్వాలి. ఆ రోజు అక్షతలతో చేసిన అన్నాన్ని భుజించాలి. ఈవిధంగా వైశాఖశుక్ష తృతీయనాడు వ్రతాన్ని ఆచరించి ఆ తరువాత వచ్చే ప్రతిమాసంలో శుక్లపక్ష తృతీయనాడు ఇదే విధానంతో ఉపవాసం వుండి శ్రీమహావిష్ణువుని అర్చించాలి. ఈ విధంగా ఒక సంవత్సరకాలం వ్రతాన్ని ఆచరిస్తే రాజసూయ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది.
అక్షతలు అంటే ఏమాత్రం విరగకుండా వున్న బియ్యం గింజలు అని అర్ధం. అవి యవధాన్యానివి గానీ, వరిధాన్యానివి గానీ, గోధుమ ధాన్యం నుంచి తీసినవి కానీ కావచ్చు. అక్షతాన్నం అంటే వరిబియ్యం లేదా యవ ధాన్యం, గోధుమలతో వండిన ఆహారం.
గ్రహణ స్నానవిధి
మనువు మత్స్యరూపాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడిని చంద్ర-సూర్య గ్రహణాలు సంభవించినప్పుడు ఏవిధంగా స్నానాన్ని ఆచరించాలి దాని విధి విధానాల్ని తెలియచేయమనికోరగా, నారాయణుడు మనువుకి ఇలా తెలియచేసాడు.
చంద్ర-సూర్య గ్రహణాలు సంభవించటానికి ముందే బ్రాహ్మణులతో స్వస్తి పుణ్యాహవాచనాలు జరిపించుకోవాలి. నలుగురు బ్రాహ్మణుల్ని శ్రద్ధగా, తెల్లని వస్త్రాలతో గంధ, ద్రవ్యాలతో పూజించాలి. గ్రహణానికి ముందుగానే దర్భల్ని, ఓషధుల్ని సేకరించుకోవాలి. చిల్లులు లేని నాలుగు కడవల్ని నాలుగు సముద్రాలుగా భావించి వేరువేరుగా నాలుగు వైపులా వుంచాలి. రథాలు,
గుర్రాలు, ఏనుగులు ఆవులు సంచరించే ప్రదేశం నుంచి, పుట్టలు, నదులు, నదీ సాగర సంగమ ప్రదేశాల నుంచి, పెద్ద పెద్ద చెరువుల నుంచి, రాజద్వారం ముందున్న ప్రదేశం నుంచి, మట్టిని తెచ్చి ఆ కుండల్లో వేయాలి.
తరువాత పంచగవ్యాలు, మంచి ముత్యాలు, గోరోచనం, కలువపూలు, శంఖాలు, ఐదురకాల రత్నాలు, స్ఫటికం, తెల్లచందనం, తెల్ల ఆవాలు, తీర్థజలం, ఏనుగుదంతం, వట్టివేళ్ళు, గుగ్గిలం ఈ వస్తువుల్ని కూడా ఆ కుండల్లో వేసి ఈ క్రింద తెలిపిన మంత్రాలతో ఆయా దేవతల్ని కుండల (కడవ)లోకి ఆవాహన చేయాలి.
సర్వేషు సముద్రాన్సరితస్తీర్థాని జలదానదాః ఆయాన్తు యజమానస్య దురితక్షయ కారకాః । యోஉసౌవజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మతః॥
సహస్ర నయనశ్చేంద్రో గ్రహపీడాం వ్యపోహతు ।ముఖం యస్సర్వదేవానాం సప్తార్చి రమితద్యుతిః॥
చంద్రోపరాగ నంభూతాం అగ్ని పీడావ్యపోహతు।
యః కర్మసాక్షీ భూతానాం థర్మోమహిషవాహనః॥
యమః చంద్రోపరాగోత్థపీడా మత్రవ్యపోహతు।
రక్షోగణాధిపస్సాక్షాత్ప్రశయానల సన్నిభః॥
ఖడ్గహస్తోஉతి భీమశ్చ గ్రహపీడాం వ్యపోహతు।
ఖడ్గపాశధరో దేవ స్సదామకర వాహనః॥
సజలాధిపతిశ్చన్ద్ర గ్రహపీడాం వ్యపోహతు।
ప్రాణం రూపేణ యోలోకాన్పాతి కృష్ణమృగ ప్రియః॥
వాయుశ్చంద్రోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు।
యోஉసౌనిధిపతిద్దేవః ఖడ్గ శూలగదాధరః॥
చంద్రోపరాగ సంభూతాం గ్రహపీడాం వ్యపోహతు।
యోஉసామిందుధరో దేవః పినాకీవృషవాహనః॥
చంద్రోపరాగపాపాని శీఘ్రంనాశయ శంకర।
త్రైలోక్య యాని భూతాని స్థావరాణి చరాణి చ॥
బ్రహ్మవిష్ణ్వర్క యుక్తాని తాని పాపం హరంతుమే॥
అన్ని సముద్రాలు, నదులు, దివ్యతీర్ణాలు, మేఘాలు, నదాలు యజమాని దురితాల్ని నశింపచేయటం కోసం ఈ కుంభం (కలశం)లోకి వచ్చుగాక! వజ్రధరుడు ఆదిత్యులకి ప్రభువు, వేయికళ్ళు కలిగిన ఇంద్రుడు గ్రహపీడల్ని పోగొట్టుగాక! సకల దేవతలకీ ముఖంలాంటివాడు, అమితమైన దివ్య ప్రకాశం కలిగినవాడు అయిన అగ్నిదేవుడు చంద్రగ్రహణం వల్ల కలిగిన పీడని తొలగించు గాక! రాక్షసగణాలకి అధిపతి, ప్రళయాగ్ని లాంటివాడు, ఖడ్గాన్ని ధరించి
అతిభయంకరంగా వుండే నిరృతి గ్రహబాధల్ని తొలగించుగాక!
ఖడ్గాన్ని పాశాన్ని ధరించినవాడు, మకర వాహనుడు, జలానికి అధిపతి అయిన వరుణుడు చంద్రగ్రహణ పీడని తొలగించుగాక! ప్రాణ స్వరూపుడుగా లోకాలన్నిటినీ రక్షించేవాడు, కృష్ణమృగం (నల్లలేడి) మీద ప్రీతికలిగినవాడు అయిన వాయుదేవుడు చంద్రగ్రహణం వల్ల కలిగిన దోషాల్ని నశింపచేయుగాక! నిధులకి పతి, ఖడ్గశూల గదాధరుడు అయినకుబేరుడు చంద్రగ్రహణ దోషాల్ని పాపాల్ని పోగొట్టుగాక! చంద్రవంకని ధరించినవాడు పినాకధారి, వృషభవాహనుడు అయిన శంకరుడు చంద్రగ్రహణ పాపాన్ని నశింపచేయుగాక! ముల్లోకాలలో వున్న స్థిర చర భూతాలు, బ్రహ్మ విష్ణు సూర్యాది దేవతలు అందరూ గ్రహణ పాపాల్ని పోగొట్టు గాక!
ఈ విధంగా అన్ని మంత్రాలతో మంత్రించబడ్డ పవిత్ర కుంభాల(కడవల)లోని నీటితో, ఋక్‌యజు సామ మంత్రాలు పఠిస్తుండగా యజమాని స్నానం చేయించుకోవాలి. స్నానం చేసిన తరువాత తెల్లని పూలతో, తెల్లని సుగంధ ద్రవ్యాలతో, వస్త్రాలతో, గోవులతో బ్రహ్మోణుల్ని తమ ఇష్ట దేవతల్ని పూజించాలి.
తరువాత పై తెలిపిన మంత్రాలని పత్రాలమీద వ్రాసి వాటిని గంగలో వుంచి, వాటితోపాటు బంగారాన్ని రత్నాలని అందులో వేసి ఒక వస్త్ర ఖండం మీదకానీ జంపకానామీదకానీ యజమానిని 'గరగ' తో సహా కూర్చోబెట్టాలి. తరువాత మంత్రాన్ని లిఖించిన పత్రాలు గల 'గరగ' ని యజమాని తలమీద ఉ౦చాలి. తరువాత ఆ యజమాని తూర్పు ముఖంగా తిరిగి దేవతలకి నమస్కరించి
చంద్రగ్రహణం పూర్తయ్యేంత వరకూ అలాగే కాలం గడపాలి.
చంద్రగ్రహణం విడిచిన తరువాత కేశఖండనం చేయించుకుని, స్నానం చేయించిన బ్రాహ్మణులకి తాను అంతవరకూ కూర్చున్న వస్త్రాన్ని (ఆసనాన్ని) దానంగా ఇవ్వాలి. ఈ విధానం ప్రకారం చంద్రగ్రహణ స్నానాన్ని చేసిన వారికి గ్రహపీడలు ఎప్పటికీ కలుగవు. వారి బంధువులకి కూడా ఎలాంటి ఆపదలు రావు. అందరూ క్షేమాన్ని ఆయురారోగ్యాల్ని పొందుతారు.
సూర్యగ్రహణం సంభవించినప్పుడు మంత్రాలతో పాటు సూర్యుడి నామాలని కూడా కీర్తించాలి. చంద్ర-సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు పద్మరాగమణుల్ని మంచి కపిలగోవుల్ని దానంచేస్తే చాలామంచిది.
య ఇదంశృణుయాన్నిత్యం శ్రావయేద్వాసమాహితః ।
సర్వపాప వినిర్ముక్త శ్శివలోకే మహీయతే ॥ (అధ్యా-67 శ్లో-27)
ఈ గ్రహణ స్నానవిధి అధ్యాయాన్ని విన్నా చదివినా వారు సర్వపాపాల నుంచీ విముక్తులై శివలోకంలో సుఖిస్తారు.
శుక్ర- పూజావిధి
ఎవరైనా యాత్రలు చేసే సందర్భంలో యాత్రకి ముందు తరువాత శుక్ర దోషశాంతి (చుక్కెదురు) కోసం శుక్రోదయ కాలంలో శుక్రపూజ చేయాలి.
బంగారంతోకానీ, వెండితోకానీ, కంచుతోకానీ చేసిన పాత్రలో తెల్లని వస్త్రాన్ని పరచాలి. అందులో తెల్లని బియ్యాన్ని పోసి దానిమీద వెండితో చేసిన శుక్రుడి ప్రతిమని స్థాపించాలి. మంచి ముత్యాలతో ఆయన్ని అలంకరించి ఈ మంత్రంతో పూజించాలి.
నమస్తే సర్వలోకేశ నమస్తే భృగునందన ।
కవే సర్వార్ధ సిద్ధ్యర్ధం గృహాణార్ఘ్యం నమోస్తుతే ॥ (అధ్యా-73, శ్లో॥4)
“సర్వలోకేశా, భృగుపుత్రా, కవీ! నీకు నమస్కారం. మేము నీకు సమర్పించే అర్ఘ్యంన్ని అందుకుని మా కోరికలు తీర్చు” ఈ విధంగా ప్రార్థించి నమస్కరిస్తే అన్ని దోషాలూ విఘ్నాలూ తొలగిపోయి చేయదలుచుకున్న యాత్ర సుఖప్రదంగా సాగిపోతుంది.
గురుపూజావిధి
బంగారుపళ్లెంలో బృహస్పతి బంగారు ప్రతిమని పచ్చని వస్త్రంతో సహా ప్రతిష్టించాలి. యజమాని ఆవపిండి, ఆవనూనెలతో, మోదుగ, రావి, చిగుళ్ళతో, పంచగవ్యాలతో కూడిన నీళ్ళతో స్నానంచేసి, పట్టుపీతాంబరాలు ధరించి, నేయితో బృహస్పతి హోమం చేయాలి. హోమం చేసిన తరువాత యోగ్యుడైన బ్రాహ్మణుడికి నమస్మరించి గోవుతో సహా బృహస్పతి ప్రతిమని ఈ మంత్రం చెబుతూ దానం చేయాలి.
నమస్తే వచసాం నాథ వాక్పతేஉథ బృహస్పతే ।
క్రూరగ్రహైః పీడితానా మవనాయ నమోనమః ॥ (అధ్యా-73, శ్లో॥ 10)
వచస్సులకి నాథుడైనవాడా! వాక్కులకి పతీ! బృహస్పతీ! క్రూరమైన గ్రహాలద్వారా పీడించబడేవారిని రక్షించేవాడా నీకు నమస్మారం.
సంక్రాంతి సమయంలో కానీ, యాత్రలు చేసే సమయంలో కానీ, శుభకార్యాలలో గానీ, బృహస్పతి పూజచేసేవారికి సకల కామ్యాలూ సిద్ధిస్తాయి. (ఇక్కడ యాత్ర అంటే! రాజులు యుద్దానికి బయలుదేరే సమయం, రాచకార్యాలమీద ఇతర ప్రాంతాలకి బయలుదేరటం, స్త్రీలు పుట్టింటికి లేదా అత్తవారింటికి బయలుదేరటం, ఎవరైనా వ్యాపారం, వ్యవహారం పనులమీద పొరుగు ప్రాంతానికి బయలుదేరటం, లేదా తీర్ధయాత్రకి వెళ్ళటం అని భావం) ఈ శుక్ర గురుపూజా విధానాలని పిప్పలాదమహర్షి యుధిష్ఠిరుడికి బోధించాడు.
నవగ్రహ స్వరూపం
పరమేశ్వరుడు నారదుడికి నవగ్రహాల స్వరూపం గురించి ఇలా చెప్పాడు.
1. సూర్యుడు :
పద్మాసనః పద్మకరః పద్మ గర్భ సముద్యుతిః ।
సప్తాశ్వ స్పప్తరజ్జుశ్చ ద్విభుజస్సవితా రవిః ॥
2. చంద్రుడు :
శ్వేత శ్శ్వేతాంబరధర శ్శ్వేతాశ్వ శ్శ్వేత భూషణః ।
గదాపాణిర్ద్విబాహుశ్చ కర్తవ్యో వరదశ్శశీ ॥
3. కుజుడు :
రక్త మాల్యాంబరధర శ్శక్తిశూల సమన్వితః ।
చతుర్భుజో మేషగమో వరదస్సాద్దరా సుతః ॥
4. బుధుడు :
పీతమల్యాంబరధరః కరికారదశద్యుతిః ।
ఖడ్గచర్మగదాపాణి సింహస్ధోవరదో బుధః ॥
5, 6. గురువు, శుక్రుడు :
దేవదైత్య గురూతద్వత్పీతకేశే చతుర్భుజే ।
దండినే వరదే కౌర్యే సాక్షసూత్ర కమండులూః ॥
7. శని:
ఇంద్రనీల ద్యుతిశ్శూలీ వరదో గృధ్ర వాహనః ।
ప్రాసబాణాసన ధరః కర్తవ్యోஉర్కసుతస్సదా ॥
8. రాహువు :
సదాకరాశః ఖడ్గీచ చర్మశూలధరస్తదా ।
నీలసింహాసనస్థశ్చ రాహురత్ర ప్రసశ్యతే ॥
9. కేతువు :
ధూమ్రా ద్విబాహవస్సర్వే గదితో వికృతాసనాః ।
గృధ్రాసనగతా నిత్యం కేతవోనృవర ప్రదాః ॥
(అధ్యా-92, శ్లో॥ 1-8)
రవి, పద్మాన్ని ఆసనంగా కలవాడు. ఆయన చేతుల్లో పద్మాన్ని ధరిస్తాడు. ఆ పద్మం లోపల ఎలాంటి కాంతి వుంటుందో అలాంటి శరీరకాంతి కలిగినవాడు. ఆయన రథానికి ఏడు గుర్రాలు ఏడు తాళ్ళతో కట్టబడి వుంటాయి.
చంద్రుడు, రెండు భుజాలతో ప్రకాశిస్తూంటాడు. తెల్లని శరీరం గలవాడు. తెల్లటి వస్త్రాలు, గుర్రాలు, ఆభరణాలు ధరించి, గదాపాణిగా రెండు భుజాలతో ప్రకాశిస్తాడు.
అంగారకుడు (కుజుడు), ఎర్రని మాలల్ని ఆభరణాలని, వస్త్రాలని ధరించి వుంటాడు. మేషం (మేక) ఆయన వాహనం. నాలుగుభుజాలు కలిగినవాడు. శక్తి శూలం ఆయన ఆయుధాలు.
బుధుడు, పచ్చని శరీరం కలవాడు. పచ్చని వస్త్రాలు, ఆభరణాలు, మాలలు ధరిస్తాడు. పచ్చగన్నేరు పూవులాంటి శరీరకాంతి ఆయనది. ఖడ్గాన్ని చర్మా(డాలు)న్ని గదని ధరించి సింహ వాహనం మీద ఆశీనుడైవుంటాడు.
గురువు, పసుపు పచ్చని రంగుతో, శుక్రుడు, తెల్లని రంగుతో వుంటారు. వీరిద్దరూ చతుర్భుజులు. ఇద్దరూ రుద్రాక్షమాలని, కమండలాన్ని దండాన్నిధరించి వుంటారు.
శని, ఇంద్రనీలమణి లాంటి శరీరకాంతితో ప్రకాశిస్తూంటాడు. ఆయనకు శూలం ఆయుధం. వాహనం గ్రద్ద ప్రాసధనువుని ఆయుధంగా ధరిస్తాడు.
రాహువు, భయంకరమైన ఆకారాన్ని కలిగినవాడు. ఖడ్గాన్ని డాలుని, శూలాన్ని ఆయుధాలుగా ధరిస్తాడు. నల్లనివర్ణంతో ప్రకాశిస్తూ సింహాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు.
కేతువు, ధూమ్ర (బూడిద) వర్ణంతో ప్రకాశిస్తూంటాడు. ఆయన ద్విబాహుడు. గదని ఆయుధంగా ధరించి వికృతముఖంతో వుంటాడు. ఆయన వాహనం గ్రద్ద.
ఈ నవగ్రహాలన్నిటినీ కిరీటాలతో సహా నిర్మించాలి. అవి రెండు అంగుళాల ఎత్తులో వుండాలి. ఈ నవగ్రహ శ్లోక మంత్రాలని ఆయారోజుల్లో కనీసం నూట ఎనిమిది సార్లు ఒక్కో శ్లోకం పఠిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
మహిమాన్వితమైన అరవై ప్రతాలు
నందికేశ్వరుడు నారదుడితో తనకి పరమేశ్వరుడు బోధించిన మహిమాన్వితమైన అరవై వ్రతాల గురించి సవివరంగా ప్రబోధించాడు.
1. దేవవ్రతం : ఒక సంవత్సరం పాటు నక్తవ్రతాన్ని (ఉదయం ఉపవాసం రాత్రికి భోజనం) ఆచరించి సంసారి అయిన విప్రుడికి పాడి ఆవుని బంగారంతో చేసిన త్రిశూలాన్ని చక్రాన్ని వస్త్రాలని 'శివోஉహమస్మి - రుద్రోஉహమస్మి' అనే భావనతో దానం ఇవ్వాలి. ఈ వ్రతం ఆచరించటం వల్ల మహాపాతకాలు నశించి శివలోకం సంప్రాప్తిస్తుంది.
2. లీలావ్రతం : రోజు విడిచిరోజు ఒక సంవత్సరకాలం నక్తవ్రతాన్ని ఆచరించి సంవత్సరం చివర్లో బంగారంతో చేసిన కలువపూవు, పంచదారతో నింపిన పాత్ర, బంగారంతో చేసిన వృషభం (ఎద్దు) ప్రతిమ- వీటిని యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. అలా చేసిన వారు విష్ణులోకానికి చేరుకుంటారు.
3. ప్రీతివ్రతం : ఆషాఢం నుంచి వరుసగా నాలుగు నెలలపాటు అనగా ఆశ్వయుజమాసం వరకు, అభ్యంగనం చేసుకోకుండా, యోగ్యుడైన వాడికి భోజన సామాగ్రిని దానం చేయాలి. ఇలా చేసినవాడు విష్ణుపథాన్ని చేరుకుంటాడు.
4. గౌరీవ్రతం : చైత్రమాసం మొత్తం పాలు, పెరుగు, తేనె, నేయి, చెరుకురసం స్వీకరించకుండా వుండాలి. చివరిరోజు బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి, వారికి ఒక పాత్రలో తాము వదిలిన ద్రవ్యాలలో ఏదో ఒక రసాన్ని నింపి, 'గౌరీమే ప్రీయతాం' అని చెప్పి వస్త్రాలతో సహా దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడికి అజ్ఞానం తొలగిపోతుంది.
5. కామవ్రతం : వసంత ఋతువు ప్రారంభంలో చైత్రశుక్ష త్రయోదశినాడు నక్తవ్రతాన్ని చేసి, బంగారు అశోక పుష్పాలు, పది అంగుళాల పొడవున్న చెరుకుగడ, నూతన వస్త్రాలు తీసుకుని 'ప్రద్యుమ్నః ప్రీయతాం' అనే మంత్రం చెబుతూ బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఈ వ్రతం అన్ని రకాల శోకాల్నీ పోగొడుతుంది. దీన్ని ఆచరించిన వాడు ఒక కల్పం పూర్తయ్యేంతవరకు
విష్ణులోకంలో సుఖ భోగానుభవిస్తాడు.
6. శివవ్రతం : ఆషాఢమాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించి వరుసగా నాలుగు నెలలపాటు గోళ్ళు కత్తిరించుకోకుండా వుండాలి. అలాగే ఈనాలుగు నెలలూ వంకాయకూరని, తేనె, నేయి, బెల్లాన్ని విసర్జించాలి. కార్తీకమాసం మొదట్లో బంగారంతో వంకాయ ప్రతిమని చేయించి యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానమివ్వాలి. అలా చేసిన వాడు రుద్రలోకానికి చేరుకుంటాడు.
7. సౌమ్యవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవారు హేమంత -శిశిరఋతువుల్లో ఎలాంటి పూలని ధరించకుండా వుండాలి. ఫాల్గుణమాసం చివర ఆ ఋతువుల్లో పూచే మూడురకాల పూలని బంగారంతో చేయించి, మూడు వేళల్లో మూడుపూలని విడివిడిగా 'శివకేశవేప్రీయతాం' అనే మంత్రాన్ని చెబుతూ విప్రుడికి దానం ఇవ్వాలి. ఇలా చేసినవారు పరమపదాన్ని పొందుతారు.
8. సౌభాగ్యవ్రతం: ఫాల్గుణమాసం శుక్లపక్ష తృతీయ తిధి నుంచి ఆ నెల చివరి వరకూ ఉప్పుని తినకూడదు. చివరిరోజు బ్రాహ్మణ దంపతుల్ని పూజించి వారికి ఒక ఇంటిని, మంచాన్ని 'భవానీ ప్రీయతాం' అనే మంత్రాన్ని చెబుతూ దానమివ్వాలి. ఇలా చేసిన వారికి ఒక కల్పాంతం వరకూ గౌరీ లోక నివాసం లభిస్తుంది.
9. సారస్వతవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవాడు సంధ్యాకాలంలో మౌనాన్ని పాటించాలి. అతడు పాత నేతితో నింపిన పాత్రని, వస్త్రాల జతని, నువ్వులని, ఘంటని విప్రుడికి దానం చేయాలి. ఇలా చేసిన వాడికి రూపం, విద్యాలాభం కలుగుతుంది. అంతే కాదు పునరావృత్తి రహితమైన సారస్వత లోక ప్రాప్తి కూడా లభిస్తుంది.
10. సంపద్వ్రతం : పంచమితిథినాడు ఉపవాసం వుండాలి. మర్నాడు షష్టి తిథినాడు ఒక బంగారు పాత్రలో కొంత బంగారాన్ని ఉంచి యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇలా చేసినవాడు ప్రతి జన్మలో ధనాధిపతి అవుతాడు. చివరికి విష్ణులోకానికి చేరుకుంటాడు.
11. శుద్ధివ్రతం : ఒక సంవత్సరంపాటు శివాలయంలో గానీ, విష్ణు ఆలయంలో కానీ, నివసించి చివర గంధాన్ని అనులేపనాన్ని ధరించి, ఒక పాడి ఆవుని నీటితో నింపిన కుండని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇలా చేసినవాడు పదివేలజన్మల వరకూ రాజుగానే జన్మిస్తాడు. చివరి జన్మలో అతడికి శివలోక ప్రాప్తి కలుగుతుంది.
12. కీర్తివ్రతం : ఒక సంవత్సరం పాటు మంచి మనసుతో ఒకే స్థానంలో వుండి, రావి చెట్టుకి, సూర్యుడికి, గంగకి నమస్కరించి మౌనవ్రతాన్ని పాటిస్తూ ఏకభుక్తుడై వుండాలి. వ్రతం చివర బ్రాహ్మణ దంపతుల్ని పూజించి, మూడు పాడి ఆవుల్ని బంగారంతో చేయించిన వృషభాల్ని దానమివ్వాలి. ఇలా ఇచ్చిన వాడికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. అంతే కాదు ఎనలేని కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి.
13. కామధుక్‌వ్రతం : గోధుమపిండితో ఒక మండలాన్ని ఏర్పర్చాలి. దానిమీద శివుడిది గానీ విష్ణుమూర్తిది గానీ ఒక ప్రతిమని పళ్ళెంలో వుంచి స్థాపించాలి. ఆ ప్రతిమలకి నేయితో అభిషేకం చేసి, తరువాత అక్షతలతో పూలతో పూజను చేయాలి. పూజ పూర్తయిన తరువాత సామవేదం చదివిన బ్రాహ్మణుడికి నువ్వులు, పాడి ఆవు, ఎనిమిది అంగుళాల పొడవున్న స్వర్ణకమలాన్నిదానం
ఇవ్వాలి. ఈవిధంగా వ్రతాన్ని ఆచరించినవాడు శివలోకానికి చేరుకుంటాడు.
14. వీరవ్రతం : నవమితిథినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు ఏకభుక్తం చేసి, ఒక కన్యకి మంచి భోజనంతో సహా బంగారు జరీ అంచుగల చీరని, రవికని దానంగా ఇవ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడిని పిలిచి కొంచెం బంగారాన్ని దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించినవారికి చక్కని రూప సౌందర్యం కలుగుతుంది. శివలోకం ప్రాప్తిస్తుంది. స్త్రీలకి ఈ వ్రతం ఆనందాన్ని పుణ్యాన్ని,
ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
15. పితృవ్రతం : పౌర్ణమినాడు పాలుమాత్రమే ఆహారంగా స్వీకరించాలి. ఆ మర్నాడు పాడ్యమినాడు పితృదేవతల్ని ఉద్దేశించి శ్రాద్దాన్ని జరిపి బ్రాహ్మణులకి అయిదు పాడి ఆవుల్ని ఎరుపు పసుపు రంగుతో వున్న వస్త్రాలు అయిదింటిని నీటితో నింపిన అయిదు కుంభాలని దానం ఇవ్వాలి. ఈవిధంగా వ్రతాన్ని ఆచరించినవాడు, అతడి పితృదేవతలు తరిస్తారు. విష్ణులోకానికి చేరుకుంటారు. కల్పాంతమై తిరిగి నూతన కల్పం ప్రారంభంలో మహారాజుగా జన్మిస్తారు.
16. ఆనందవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవాడు చైత్రమాసం నుంచి వరుసగా ఆరుమాసాలు అయాచితంగా జలదానం చేయాలి. నాలుగో మాసం చివర వ్రతసమాప్తి నాడు మణికం అనే పాత్రని, అన్న వస్త్రాలని నువ్వులతో నింపిన పాత్రని, బంగారాన్ని యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
17. రాజ్యవ్రతం : ఒక సంవత్సరంపాటు శివుడికి పంచామృతస్నానాన్ని ప్రతిరోజు జరిపించాలి. సంవత్సరం పూర్తయిన తరువాత ఒక ధేనువుని, శంఖాన్ని పంచామృతాలతో సహా బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించినవాడికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. కల్పాంతం అయిన తరువాత తిరిగి నూతన సృష్టి ప్రారంభంలో రాజుగా జన్మిస్తాడు.
18. అహింసావ్రతం : మాంసాహారులైనవారు ఒక సంవత్సరం పాటు మాంసాహారాన్ని భుజించకూడదు. సంవత్సరం చివర ఒక పాడి ఆవుని, బంగారంతో చేసిన లేడి ప్రతిమని దానమివ్వాలి. ఈ వ్రతం చేసిన వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది.
19. సూర్యవ్రతం : ఈ వ్రతాన్ని మాఘమాసంనాడు ఉషోదయకాలంలో ఆచరించాలి. ఉదయాన్నే స్నానం చేసి, విప్రదంపతుల్ని పూజించి వస్త్రా భరణాల్ని వారికి సమర్పించి మంచి భోజనాన్ని పెట్టాలి. ఈవిధంగా వ్రతం చేసిన వారికి రవిలోక ప్రాప్తి కలుగుతుంది.
20. విష్ణువ్రతం : ఆషాఢమాసం నుంచి వరుసగా నాలుగు మాసాలు అనగా ఆశ్వయుజమాసం వరకు వరుసగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయాలి. నిత్యం పూజ చేసుకుని కార్తీకమాసం ప్రారంభంలో వ్రతసమాప్తి చేసి ఆ రోజు విప్రుణ్ణి పిలిపించి అతడికి మృష్టాన్న భోజనం పెట్టి ఒక ధేనువుని దానమివ్వాలి. ఇలా చేసినవాడికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది.
21. శీలవ్రతం : ఉత్తారాయణంలో పూలని, దక్షిణాయనంలో నేతిని విడిచిపెట్టాలి. ఇలా ఒక సంవత్సరం గడిచాక ఒక బ్రాహ్మణుడికి నేతి పాయసంతో భోజనాన్ని పెట్టి, పూలదండల్ని నేయిని, పాడిఆవుని దానంగా ఇవ్వాలి. ఇలా చేసినవాడికి మంచిశీలం, ఆరోగ్యం కలుగుతాయి. చివరికి అతడు శివలోకాన్ని చేరుకుంటాడు.
22. దీపవ్రతం : ఒక సంవత్సరం పాటు ఎలాంటి నూనెని ఆహారంలో తీసుకోకూడదు. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజూ దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించాలి. సంవత్సరాంతంలో యోగ్యుడైన బ్రాహ్మణుడికి బంగారంతో చేసిన చక్రాన్ని శూలాన్ని వస్త్రాలని దానమివ్వాలి. ఇలా చేసినవాడికి మంచి తేజస్సు కలుగుతుంది. రుద్రలోకం ప్రాప్తిస్తుంది.
28. కల్యాణగౌరీ వ్రతం : కార్తీకమాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం ఉన్న రోజునించి ఒక సంవత్సరం పాటు గోమూత్రాన్ని గోధుమరవ్వని, పాలతో వండిన అన్నాన్ని మాత్రమే భుజిస్తూ, నక్త దీక్షలో వుండాలి. సంవత్సరం చివర వ్రత సమాప్తి చేసి యోగ్యుడైన విప్రుడికి గోదానం చేయాలి. దీనివల్ల కల్పాంతం వరకూ గౌరీలోక ప్రాప్తి కలుగుతుంది. కొత్త సృష్టి మొదట్లో రాజు జన్మలభిస్తుంది.
24. దీప్యవ్రతం : ఈ వ్రతాన్ని చేసేవారు చైత్రమాసం అంతా గంధానులేపనాన్ని విడిచిపెట్టాలి. మాసం చివర విప్రుడికి గంధంతో నింపిన ముత్యపుచిప్పని, తెల్లని వస్త్రాలని దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుంది.
25. శుభకీర్తివతం : ఈ వ్రతం చేసేవారు వైశాఖ మాసమంతా ఉప్పు-పూవులు విడిచిపెట్టాలి. మాసం చివర ఉప్పుతో నింపిన కుండని విప్రుడికి దక్షిణతో సహాదానమివ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించిన మంచి తేజస్సు కీర్తి కలుగుతాయి. ఒక కల్పకాలం విష్ణులోక నివాసం కలుగుతుంది.
26. బ్రహ్మవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవాడు మూడు పలాలకి తక్కువ బరువుకాకుండా బంగారంతో బ్రహ్మాండం ప్రతిమని తయారుచేయించాలి. తరువాత మూడు రోజులు వరుసగా నువ్వులతో హోమం చేయాలి. హోమం పూర్తయిన తరువాత బ్రాహ్మణ దంపతులని భోజనంతో సంతృప్తి పరిచి వారిని వస్త్ర మల్యాది ఆభరణాలతో పూజించి 'విశ్వాత్మా ప్రీయతాం' అనే మంత్రాన్ని చెబుతూ తాను చేయించిన బంగారు బ్రహ్మాండం ప్రతిమని దానమివ్వాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
27. సువ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు బంగారంతో సహా, ఉభయముఖీగోదానం (అనగా అపుడే ఈనుతున్న ఆవుని) చేయాలి. ఆ రోజంతా కేవలం పాలనే ఆహారంగా తీసుకోవాలి. ఈవిధంగా చేస్తే పునరావృత్తి రహితమైన పరమపదాన్ని చేరుకుంటారు.
28. కల్పప్రతం : మూడురోజుల పాటు పాలనే ఆహారంగా తీసుకోవాలి (దీన్నే పయోవ్రతం అంటారు). నాలుగోరోజు ఒక పలానికి తక్కువకాకుండా బంగారంతో కల్పవృక్షాన్ని తయారుచేయించి, బియ్యంతో సహా దాన్ని యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. ఇలా చేసిన వారికి బ్రహ్మలోకం సంప్రాప్తిస్తుంది.
29. భీమవ్రతం : ఒక నెలరోజులపాటు ఏకభుక్తం లేక నక్త వ్రతాన్ని అవలంబిస్తూ నెల చివర్లో యోగ్యుడైన విప్రుడికి పాడి ఆవుని దానమివ్వాలి. ఇలా చేసినవారికి విష్ణులోకప్రాప్తి కలుగుతుంది.
30. ధరావ్రతం : ఈ వ్రతాన్ని చేసేవారు ఇరవై పలాలకి తక్కువ కాకుండా బంగారంతో భూమి ప్రతిమని చేయించి విప్రుడికి దానమివ్వాలి. ఆ రోజు మొత్తం కేవలం పాలనే ఆహారంగా తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు అతడు చేసిన పుణ్యఫలం ఏడు కల్పాల దాకా వెంటవస్తుంది.
31. మహావ్రతం : మాఘమాసంలోకానీ, చైత్రమాసంలోకానీ, శుక్లపక్ష తృతీయతిథినాడు గానీ బెల్లంతో వండిన పాయసాన్ని ఆహారంగా స్వీకరించి, ఆ రోజు బెల్లంతో సహా ధేనువుని విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతం చేసిన వారికి గౌరీలోక ప్రాప్తి కలుగుతుంది.
32. ప్రభావ్రతం : ఒక పక్షం (పదిహేను) రోజులు ఏక భుక్తంతో గానీ, నక్తంతో గానీ ఉపవాసం ఉండి, పదిహేనోరోజు తరువాత రెండు కపిలగోవుల్ని బ్రాహ్మణులకి దానమివ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని చేసినవారు దేవతలతో పూజించబడి బ్రహ్మలోకంలో సుఖంగా నివసిస్తారు.
33. ప్రాప్తివ్రతం : ఒక సంవత్సరం పాటు ఏకభుక్తం చేస్తూ ఉపవాసముండి సంవత్సరం చివర మంచి భక్ష్యాలతో సహా నీటితో నింపిన కడవల్ని దానమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసిన వారు ఒక కల్పం వరకూ శివలోకంలో నివసిస్తారు.
34. సుగతివ్రతం : ఒక సంవత్సరకాలం ప్రతి అష్టమీతిథినాడు నక్త వ్రతాన్ని చేస్తూ సంవత్సరం చివరి అష్టమినాడు గోదానం చేయాలి. అలా చేసినవాడికి శుభమంగళాలు కలుగుతాయి.
35. వైశ్వానరవ్రతం : వర్షాకాలం నాలుగునెలలు అనగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం బ్రాహ్మణులకి వంట కట్టెల్ని దానమివ్వాలి. నాలుగు నెలల తరువాత నేయిని, దేనువుని దానం చేయాలి. ఇది అన్ని పాపాలనీ తొలగించి బ్రహ్మలోక ప్రాప్తి కలిగిస్తుంది.
36. కృష్ణప్రతం : ఒక ఏడాదిపాటు ప్రతి ఏకాదశినాడు నక్త వ్రతాన్ని ఆచరించాలి. ఏడాది చివర వచ్చే ఏకాదశినాడు బంగారంతో విష్ణుచక్రాన్ని తయారు చేయించి విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతం చేసిన వాడికి విష్ణులోక ప్రాప్తి కులుగుతుంది.
37. దేవీవ్రతం : ఈ వ్రతం చేసేవాడు ఒక సంవత్సరం పాటు పాల అన్నాన్ని మాత్రమే భుజించాలి. సంవత్సరం చివర యోగ్యుడైన విప్రుడికి రెండు పాడి ఆవుల్ని దానమివ్వాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వాడికి ఒక కల్పకాలం లక్ష్మీలోక ప్రాప్తి కలుగుతుంది.
38. భానువ్రతం : ఒక సంవత్సరం పాటు సప్తమీతిథుల్లో నక్తదీక్షతో ఉపవాసం ఉండాలి. సంవత్సరం చివర్లో యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఒక పాడి ఆవుని దానమివ్వాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారు రవిలోకాన్ని చేరుకుంటారు.
39. వైనాయకప్రతం : ఒక సంవత్సరంపాటు వరుసగా అన్ని చవితి తిథుల్లో నక్తదీక్షతో ఉపవాసముండాలి. సంవత్సరం చివర బంగారంతో ఏనుగు ప్రతిమని తయారుచేసి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసినవారికి శివలోకం ప్రాప్తిస్తుంది.
40. కాలవ్రతం : ఆషాఢమాసం నుంచి వరుసగా నాలుగుమాసాల పాటు ఆ ఋతువుల్లో లభించే ఫలాలని భుజించకూడదు. కార్తీకమాసం ప్రారంభంలో తాము వదిలేసిన ఫలాల ప్రతిమల్ని బంగారంతో చేయించి వాటిని రెండు పాడి ఆవులతో సహా యోగ్యుడైన విప్రడికి దానం చేయాలి. దీనివల్ల వ్రతం చేసిన వాడికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
41. సౌరవ్రతం : హేమంత ఋతువులో ప్రారంభించి ఒక సంవత్సరకాలం ప్రతి సప్తమినాడు ఉపవాసంచేయాలి. తిరిగి సంవత్సరం గడిచాక వచ్చే హేమంతంలో యధాశక్తిగా బంగారు కమలాన్ని ఆవుని నీటితో నింపిన కుండని విప్రుడికి దానంగా ఇవ్వాలి. ఇది సూర్యలోకాన్ని ప్రాప్తింపచేసే వ్రతం.
42. విష్ణువ్రతం : పన్నెండు ద్వాదశి తిథుల్లో ఉపవాసంచేసి, చివరి ద్వాదశినాడు
గోవస్తుకాంచ(బంగారం)నాలతో బ్రాహ్మణుణ్ణి సంతృప్తి పరచాలి. ఆవిధంగా వ్రతాన్ని ఆచరించిన వాడికి ఐశ్వర్యం పరమపదం సంప్రాప్తిస్తాయి.
43. వృషవ్రతం : కార్తీకమాసంలో వృషోత్సర్గం చేసి నక్తవ్రతాన్ని అవలంబించాలి. (వృషోత్సర్గం అంటే నాలుగు దూడలతో కలిసిన ఆవుకి త్రిశూల చక్రాంకితాలు వేసి విడిచిపెట్టటం) అలా చేసిన వారికి శివలోకం ప్రాప్తిస్తుంది.
44. ప్రాజాపత్యవ్రతం : చాంద్రాయణ వ్రతం, కృచ్చవ్రతం వంటివి పాటించి, వ్రతం చివర గోదానాన్ని చేసి యధాశక్తిగా యోగ్యులైన బ్రాహ్మణులకి భోజనం పెట్టించి వారితో పాటు తానూ భుజించాలి. దీన్ని ఆచరించటం ద్వారా సకల శుభమంగళాలు జరుగుతాయి.
45. త్రయంబకవ్రతం : ఒక సంవత్సరం పాటు చతుర్ధి తిథులలో నక్తవ్రతాన్ని ఆచరించాలి. సంవత్సరం చివర్లో విప్రుడికి ఆవుని, ధనాన్ని దానంగా ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడికి శివసాయుజ్యం లభిస్తుంది.
46. ఘృతవ్రతం : వరుసగా ఏడురోజుల పాటు ఉపవాసం చేయాలి. చివరిరోజు నేతితో నింపిన కుండని విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
47. ఇంద్రవ్రతం : ఒక సంవత్సరంపాటు దర్భలమీదే శయనిస్తు (పడుకుంటూ) సంవత్సరం తరువాత బంగారాన్ని ఒక పాడి ఆవుని విప్రుడికి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని చేసినవారికి ఇంద్రలోకప్రాప్తి, స్వరసుఖాలు లభిస్తాయి.
48. శివవ్రతం : ఒక సంవత్సరంపాటు ప్రతి తదియనాడు నిప్పులపై ఉడికించిని ఆహారాన్ని అనగా పచ్చిపాలు, పళ్ళు మాత్రమె ఆహారంగా తీసుకోవాలి. ఆఖరి తదియనాడు విప్రుడికి గోవుని దానంచేయాలి. ఇలా చేసిన వారికి పునరావృత్తి రహితమైన శివలోకం లభిస్తుంది.
49. అశ్వవ్రతం : రెండు పలాలకి తగ్గకుండా బంగారంతో రెండు రథాల్ని, గుర్రాల్ని చేయించి యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని చేసినవారు వందకల్పాలు స్వర్గలోకంలో నివసించి సృష్ట్యాదిలో మహారాజుగా జన్మిస్తారు.
50. కరివ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవారు రెండు పలాలకి తక్కువ కాకుండా బంగారంతో ఒక రథాన్ని రెండు ఏనుగుల్ని తయారు చేయించి, యోగ్యుడైన విప్రుడికి దానమివ్వాలి. దానం చేసిన రోజు పూర్తిగా ఉపవాసముండాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది.
51. నిర్దుఃఖవ్రతం : ఒక సంవత్సరం పాటు ఏకభుక్తతో గానీ, నక్తంతోగానీ ఉపవాసం చేయాలి. సంవత్సరం చివర్లో విప్రుడికి గోదానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి యక్షాధిపత్యం లభిస్తుంది.
52. వరుణవ్రతం : ఒక రాత్రిఅంతా నీళ్ళల్లో గడిపి, ఆ మర్నాడు ఉదయం యోగ్యుడైన విప్రుడికి గోదానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుంది.
53. చంద్రవ్రతం : ఒక నెలరోజులపాటు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించి, వ్రతం చివరి రోజున బంగారంతో చంద్రుడి ప్రతిమని తయారు చేయించి, విప్రుడికి దానమివ్వాలి. దీనివల్ల చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
54. రుద్రవ్రతం : జ్యేష్ట శుక్ల అష్టమి, చతుర్దశి తిథుల్లో పగటిపూట పంచాగ్నులమధ్యలో వుండాలి (అనగా నాలుగువైపులా అగ్నిని వెలిగించుకుని పైన సూర్యుడు వున్నప్పుడు) సాయంకాలం వ్రతసమాప్తి చేసి విప్రుడికి గోదానం చేయాలి. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించినవారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.
55. భవానీదేవివ్రతం : ఒక సంవత్సరం పాటు ప్రతి తదియ నాడు చాందినీని నిర్మించాలి. చివరి తదియరోజు విప్రుడికి గోదానం చేయాలి. ఆవిధంగా వ్రతాన్ని ఆచరించినవారికి భవానీలోక ప్రాప్తి కలుగుతుంది.
56. స్నాపకవ్రతం : ఈ వ్రతాన్ని ఆచరించేవారు మాఘమాసం శుక్షపక్ష సప్తమినాడు రాత్రంతా తడిబట్టలతో గడపాలి. మర్నాడు ఉదయం విప్రడికి గోదానం చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఒక కల్పం వరకు స్వర్గలోకంలో నివసించే యోగం కలుగుతుంది.
57. దేవేంద్రవ్రతం : ఒక రోజు పూర్తిగా ఉపవాసం వుండి, ఆ రోజు మూడు సంధ్యల్లో విప్రదంపతుల్ని వస్రాదిభూషణాలతో అర్చించాలి. ఇలా చేసిన వారికి ముక్తి లభిస్తుంది.
58. సోమవ్రతం : ప్రతిమాసం శుక్లపక్ష ద్వితీయా తిథినాడు చంద్రుణ్ణి పూజించాలి. ఆ తిథినాడు ఉప్పుతో నింపిన పాత్రని దానం ఇస్తూ వుండాలి. వ్రతం చివర యోగ్యుడైన విప్రుడికి గోదానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించినవారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. కల్పాంతం అయ్యాక తిరిగి ప్రారంభమయ్యే సృష్టి మొదట్లో మహారాజుగా జన్మించే యోగ్యత లభిస్తుంది.
59. వైశ్వానరవ్రతం : ఒక సంవత్సరంపాటు ప్రతి పాడ్యమి తిథినాడు ఏకభుక్తం చేస్తూ, సంవత్సరం పూర్తయిన తరువాత పది ఆవుల్ని యోగ్యులైన విప్రులకి దానంచేయాలి. ఇలా చేసిన వారికి అగ్నిలోక ప్రాప్తి కలుగుతుంది.
60. విప్రప్రతం : ఒక సంవత్సరం పాటు ప్రతిదశమితిథినాడు ఏకభుక్తం చేస్తూ సంవత్సరాంతాన పది ఆవుల్ని విప్రులకి దానం చేయాలి. తరువాత బ్రహ్మవిష్ణు శివులని, బ్రాహ్మణుల్ని ఆరాధించాలి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మహాపాతకాలు కూడా తొలగిపోతాయి.
సర్వోత్తమమైన ఈ షష్టి(60) వ్రతకల్పం గురించి విన్నా చదివినా వందమన్వంతరాల వరకూ గంధర్వాధి పత్యం కలుగుతుంది. ఇది ఎంతో పుణ్యకరమైనది. సకలశుభఫలితాలనీ అందించేది.
(గమనిక - పై తెలిపిన అరవై వ్రతాలలో బంగారం, గోవులు దానంగా ఇవ్వాలని చెప్పారు. ఇది ఆనాటి పరిస్థితులకి అనుగుణంగా చెప్పినదానం. ప్రస్తుతకాలంలో వీటికి బదులుగా యధాశక్తి ధనాన్ని దక్షిణ రూపంలో 'తదభావే' అని సమర్పించినా వ్రతఫలం దక్కుతుంది)
ప్రయాగ మాహాత్మ్యం
పూర్వం ధర్మరాజుకి మార్మండేయ మహర్షి ప్రయాగ తీర్థ మాహాత్మ్యాన్ని గురించి ప్రబోధించగా, నందీశ్వరుడు నారదమహర్షికి ఆ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు.
మహాభారతయుద్ధం ముగిసిన తరువాత యుధిష్టిరుడు రాజ్యాన్ని పొందినప్పటికీ, తనసోదరులు, గురువులు ఎందరో యుద్ధంలో మరణించినందుకు ఎంతో శోకించాడు. "అయ్యో! నాసోదరుడైన దుర్యోధనుడు పదకొండు అక్షౌహిణుల సైన్యానికి నాయకుడుగా వున్నాడు కదా! వారంతా మమ్మల్ని బాధించినప్పటికీ చివరికి అందరూ మరణించారు. ఇక శ్రీకృష్ణుడి దయతో మేము అయిదుగురం మాత్రమే మిగిలాం. భీష్మ, ద్రోణ, కర్ణుల్ని, సోదరుడైన ధుర్యోధనాదుల్ని వధించగా ప్రాప్తించిన ఈ రాజ్యం భోగం ఏమీ సుఖాన్నివ్వటం లేదు. ఛీ! ఇదంతా ఎందుకు? రక్తపు కూడు తింటున్నామే!" అని విచారిస్తూ కాలంగడపసాగాడు.
కొంతకాలం గడిచాక "నేనిలా విచారిస్తే ఏం లాభం? ఏవిధానాన్ని అనుష్టించి, ఏ తీర్థాల్ని సేవిస్తే ఈ మహాపాతకం నుంచి విముక్తి లభిస్తుంది! ఏ క్షేత్రంలో నివసిస్తే సర్వోత్తమమైన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? నాకు దుఃఖ నివారణోపాయాన్ని తెలిపేదెవరు? అని ఆలోచిస్తుండగా, ఈ విషయం తన దివ్య దృష్టి ద్వారా గ్రహించిన మార్కండేయుడు వెంటనే వారణాసి నుంచి హస్తినాపురానికి వచ్చాడు.
మార్కండేయుడు వచ్చిన విషయం తెలుసుకున్న యుధిష్టిరుడు, ఆయన్ని సగౌరవంగా స్వాగతించి సింహాసనంమీద కూర్చోబెట్టి భక్తిగా పూజించాడు. యుధిష్టిరుడు పూజకి సంతోషించిన మార్మండేయుడు "రాజా! ఎందుకు నీవు విచారంగా వున్నావు. నీ బాధకి కారణమేమిటి?" అని ప్రశ్నించాడు. యుధిష్టిరుడు తన బాధకి గల కారణాన్నంతా ఆయనకి వివరించాడు. అదివిని "ధర్మజా! క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం చేయాలి. యుద్ధంలో పాపపుణ్యాల ప్రసక్తి వుండదు. కనుక నీవు ఎలాంటి పాపాన్నీ చేయలేదు. క్షత్రియుడన్న వాడికి యుద్ధం చేయటమే క్షేతధర్మం. తన రాజ్యాన్ని రక్షించుకోవటం రాజధర్మం. కనుక నీవు పాపం చేసానని ఏమాత్రం చింతించకు"అని ఓదార్చాడు మార్కండేయుడు.
యుద్ధిష్టురుడు ఆయనతో "స్వామీ! తమరు బ్రహ్మవేత్తలు, త్రికాలజ్ఞులు, మహాప్రాజ్జులు ధర్మాధర్మవిషయ పరిజ్ఞానం కలిగినవారు. మీరు చెప్పినట్టు నేను పాపం చేయనప్పటికీ అందరినీ వధించి రాజ్యాన్ని సంపాదించానన్న పాపచింతన నన్ను వదిలిపోవటంలేదు. కనుక నా మనస్సంతృప్తి కోసం ఏ తీర్జానికి వెళితే నాకు దుఃఖవిమోచనం జరిగి మనశ్శాంతి లభిస్తుందో తెలియచేయండి" అని వినయంగా ప్రార్థించాడు.
మార్కండేయుడు ధర్మరాజుతో "రాజా దివ్యతీర్థాలలో, పుణ్యక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందిన క్షేత్రం ప్రయాగ. దీనినే తీర్థరాజం అంటారు. ఈ క్షేత్రం పేరు ప్రతిష్ఠానం. ఈ ప్రయాగ క్షేతం పూర్వం దుష్యంతుడు పాలించే కాలంలో పూరువంశీయులకి రాజధానిగా వుండేది. అంతకు ముందు కాలంలో దీన్ని ప్రజాపతిపురమని వ్యవహరించేవారు. ఆ దివ్యక్షేత్రంలో స్నానం చేసిన వారికి పునర్జన్మ లేదు. అక్కడ మరణించిన వారికి ముక్తి లభిస్తుంది. అందుకే బ్రహ్మాది దేవతలు ఈ దివ్య క్షేత్రాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటారు.
ఈ దివ్యక్షేత్రంలో ఎన్నో ఉపతీర్థాలున్నాయి. అక్కడ వుండే గంగని ఆరువేలమంది ధానుష్కులు రక్షిస్తుంటారు. యమునని సప్తాశ్వరధుడైన ఆదిత్యుడు కాపాడుతుంటాడు. విశేషంగా ఈ క్షేత్రాన్ని ఇంద్రుడు ప్రత్యేకంగా సంరక్షిస్తుంటాడు. ఈ దివ్యక్షేత్రానికి నాయకుడు శ్రీహరి. ఆ క్షేత్రంలో అక్షయ వటవృక్షం వుంది. దాన్ని పరమేశ్వరుడు స్వయంగా రక్షిస్తుంటాడు. లోకంలో ఎంతో పుణ్యం చేసినవాడు మాత్రమే ఆ క్షేత్రానికి వెళ్ళగలడు. తక్కువ పాపాలు చేసినవారు ప్రయాగ క్షేత్రం గురించి కేవలం తలుచుకుంటే చాలు వారి పాపాలు నశిస్తాయి. ఆ దివ్యతీర్థాన్ని దర్శించినా, దాని గురించి ఇతరులకి చెప్పినా, అక్కడి మట్టిని స్పర్శించినా చాలు పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.
ధర్మజా! ప్రయాగతీర్థంలో మహిమాన్వితమైన అయిదు కుండాలున్నాయి. ప్రయాగక్షేత్రంలోకి ప్రవేశిస్తే చాలు పాపం నాశనమౌతుంది. వేల యోజనాల దూరం నుంచి ప్రయాగని స్మరించినా చాలు ఘోరపాపాలు తొలగిపోతాయి. అక్కడి గంగా యమునల సంగమంలో స్నానంచేసినా, ఆ నీటిని త్రాగినా అనంతమైన పుణ్యం లభిస్తుంది. మనసారా ఆ దివ్యక్షేత్రాన్ని తలుచుకున్న వాడికి అన్ని కోరికలూ నెరవేరతాయి.
ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఒక నెలరోజులు అక్కడే నివసించి, బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ పితృదేవతలకి పిండప్రదానం చేసి తర్పణాలు విడవాలి. అది అనంతమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. సూర్యుడి పుత్రిక యముడి చెల్లెలైన యమునానది అక్కడే గంగానదితో సంగమిస్తుంది. ఆ క్షేత్రానికి పరమేశ్వరుడు ఎప్పుడూ చాలా సన్నిహితంగా వుంటాడు. ప్రయాగ క్షేత్రాన్ని దర్శిస్తేచాలు మానవులకి సకల శుభమంగళాలూ కలుగుతాయి. ఎందుకంటే? దేవతలు, దానవులు, గంధర్వులు, సిద్దులు, చారణులు, ఋషులు ఆ క్షేత్రాన్ని సదా దర్శిస్తుంటారు.
నైమిశం, పుష్కరతీర్ధం, గోతీర్థం సింధుసాగరం, గయలోని చైత్రధనూకం, గంగా సాగరసంగమం లాంటి ముప్ఫై కోట్ల పదివేల తీర్థాలు సదా ప్రయాగ తీర్థంలో నివసిస్తూంటాయి. ఇక్కడ వున్న గంగా యమునా నదుల మధ్య ప్రదేశాన్ని పృధివీజఘనం అంటారు. ముల్లోకాలలో వున్న మూడున్నరకోట్ల తీర్థాలు కూడా ప్రయాగ తీర్థానికి సరిపోలవు. అది సిద్ధ క్షేత్రం. నిర్మలమైన ఈదివ్య తీర్ధం గురించి విన్నా పఠించినా, ఇతరులకి బోధించినా స్వర్గఫలం లభిస్తుంది.
ఈవిధంగా మార్కండేయుడు చెప్పిన ప్రయాగక్షేత మహాత్మ్యాన్ని విన్న యుధిష్టరుడు తనసోదరులతో ధర్మపత్ని ద్రాపతితో కలిసి ప్రయాగక్షేత్రానికి వెళ్ళి అక్కడి గంగాయమునల సంగమంలో స్నానం చేసాడు. తరువాత నిత్యానుష్టానాన్ని పూర్తి చేసుకుని బ్రాహ్మణులకి, గురువులకి నమస్మరించి తన పూర్వీకులందరికీ తర్పణాలు విడిచాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి విచ్చేయగా వారంతా ఆయన్ని కూడా భక్తిగా పూజించారు. తరువాత మార్కండేయ మహర్షి ధర్మరాజుని అతడి సోదరుల్ని ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే యుధిష్టరుడు అక్కడే కొన్ని రోజులు నివసించి ఎన్నో దానధర్మాలు చేసాడు.
హిమవత్పర్వతం - ఓషధులు
హిమవత్పర్వతం అత్యంత మనోహరమైంది. భారతదేశానికి అది ఉత్తరభాగంలో వేల యోజనాలు వ్యాపించి వుంటుంది. ఎందరో సిద్దులకి, ఋషులకి, మునులకి అది నివాస స్థానం. ఎన్నో దివ్యనదులు ఆ పర్వతం నుంచే ఆవిర్భవించాయి. ఆకాశాన్నంటే వృక్షాలతో సుందరమైన వనాలతో ఆదివ్య పర్వతం ఎందరినో ఆకర్షిస్తూ వుంటుంది.
అటువంటి ఆ హిమవత్పర్వతం మీద ఒక మనోహరమైన ప్రదేశం వుంది. అక్కడికి సామన్యులెవరూ చేరుకోలేరు. అయితే అదృష్టవశాన మహావీరుడైన మద్రదేశరాజు పురూవరుడు మాత్రమే అక్కడికి చేరుకోగలిగాడు. ఆ దుర్గమమైన ప్రాంతం నుంచే శ్రేష్టమైన 'ఇరావతీ' నది ప్రభవించింది. ఎన్నో వృక్షాలతో, గుబురైన పొదలతో నిండిన ఆ ప్రదేశం దట్టమైన కారుమబ్బుల్లాగా కనిపిస్తుంది.
ఇరావతీనది జన్మస్థానమైన ఆ ప్రాంతం వివిధరకాల అద్భుతమైన దివ్యౌషధులకి నిలయం. అక్కడ సాలతాటి, తమాల, కర్ణికార, శాల్మల (బూరుగు), న్యగ్రోధా (మరి), అశ్వద్ధ (రావి), శిరీష (దిరిసెన), శింశుపా (అగరు), శ్లేష్మాతకామలక(ఉసిరిక), హరీతక(కరక), విభీతక(తాడి), భూరముంజక, బాణ (ఈ రెండూ నదీతీరంలో మొలిచే గడ్డి విశేషాలు), సప్తచ్చద (ఏడు ఆకులువుండే చెట్టు), మహానింబ (పెద్దనిమ్మ) నిబనిర్గుండీ, హరిద్రుమ, దేవదారు, కాలేయక, పద్మక, వందన, బిల్వ, కపిత్థ(వెలగ), రక్తచందన, వాతామ, రిష్టకా, క్షీరా,శ్వకర్ణా, అర్జున(మద్ది) హస్తికర్ణ, సువనస వృక్షాలున్నాయి.
వీటితోపాటు ఓషధీప్రభావం కలిగిన కోవిదార, ప్రాచీనామలక, మధూక(విప్ప), పరాటక, ఖర్జూర, నారికేళ, ప్రియాళ్వామ్రాతక, తంతుమాలధవ, భవ్య, కాశ్మీర పర్ణి, జాతీఫల(జాజికాయ), పూగఫల (పోక) కల్ఫల, సల్లకీ ఫల, మందార, కింసుక, కుసుమాంశుక, పలాశ(మోదుగు), శాల్మలీభేద (మరొకరకమైన బూరుగ), వేతస(మెట్టప్రబ్బలి), జలవేతస (నీటి ప్రబ్బలి), రక్తాంగ,సారంగ హింస(ఇంగువ) ప్రియాంగు, రక్తాశోక, అశోక, కురుక, భువిరూఢక, ముచుకుంద, కుందకోట, రూషక, కింకరాత, కిరాతకేతక(నీటి మొగలి), వనకేతకి(అడవి మొగలి), శోభాంజనాంజన, కుశలంగ, నిచోళక, పర్ణాక, శయనాసన అనే వృక్షాలున్నాయి.
ఈ పర్వతం మీద అందమైన పూలని ఔషధాలుగా పనికివచ్చే ఫలాలని ఇచ్చే మరికొన్ని చెట్లున్నాయి. అవి-ఆసన, మన్మథశరాకార, మనోరమ, సహకార (రసాలం అనే మామిడి) పీతమయూధికా, వల్మీక, శ్వేతయూధికా, జాతీ(జాజి), చంపక (సంపెంగ), తుంబక, తిల, బిల్వ, కుసుంభక (నూనెని ఇచ్చే కుసుమపువ్వు), సుష్మచరణ, వరుణ, కామ వల్లభ, పుష్పాంకుశ, వకుళపారి, భద్రహరిద్రక, ధారాకదంబ, కుటజ, కదంబ, గిరికుటజ (కొండగోగు), సమాక్రాంత, కకుభ, పాలీవన, దాడిమ(దానిమ్మ) ద్రుమచంపక, బంధూక, పాటల, కరవీర, కురవక హిమమంజీర అనేవి.
ఆ పర్వత పరిసరాల్లోనే జంబూ(నేరేడు), మృదుజంబూ, బీజపూర, కర్పూరాగరు, బంబ(దొండ) సంతానక, వితానక, హింతాలధన్విక, తృణశూన్య, కరీషశాక (నాగ) మదన (ఉమ్మెత్త) పీలుధాతకీ (ఆరె) చిరిబిల్వవాలుక, తింత్రిణీ (చింత) లోధ్ర, విడంగ, క్షీరికా, అంకోల (ఊడుగ) మధుక, భల్లాతక (జీజి) వల్మీక, సిందువార, సుకేసర, నాగకేసర, కరమర్దక, రుద్రాక్ష, ద్రాక్ష, నింబ, పుత్ర జీవక (గారకాయ) తక్కోల వృక్షాలున్నాయి.
ఓషదీగుణాలు కలిగిన మరికొన్ని తీగలతో కూడిన గుబురు పొదలలాంటి జాతులు కూడా వున్నాయి. అవి - పిప్పలీ, నాగవల్లి(తమలపాకు), మరీచ(మిరియం), పద్మ, వనమాలికా, మృద్వీకా(ద్రాక్షా), అతి ముక్తక, వకుళ(పొగడ), సఫల, వక్రకీ, కూష్మాండ (బూడిద గుమ్మడి) పటో(పొట్ల) లాలాబు (సొర), చిరంట, కారవేల్ల (కాకర), కర్కోటక, వార్తాకి(పందిలివంగ), బృహతీఫల, రాజమాషా, అతసీ(బొబ్బర- అవిసె), కంద, విదారీ, కరోట, కాకోలీ, క్షీరకాకోలీ, చక్రకవంటి వృక్షాలు, శాక, శాలి, కాలశాక, శింబి వంటి ధాన్యవిశేషాలు ఇంకా దీర్ఘాయువునిచ్చే ఎన్నో రకాల ఓషధులు హిమవత్పర్వతం మీద వివిధ ప్రాంతాల్లో నెలకొన్నాయి. అయితే ఇవన్నీ అందరికీ కనిపించవు. కొన్ని దుర్గమమైన ప్రాంతాల్లోనే పెరుగుతాయి కనుక.
కైలాసపర్వత వర్ణన
హిమాలయాలలో అత్రి ఆశ్రమానికి ఉత్తర దిక్కున త్రిపురారి అయిన పరమేశ్వరుడు ఆనందంగా నివసించే సుందర కైలాసపర్వతం ఉన్నది. అది కల్పద్రుమాలతో అలంకరించబడి, వివిధ రత్నాలతో కూడిన శిఖరాలతో అలంకరించబడి వుంటుంది. ఆ దివ్య పర్వతానికి సమీపంలోనే శ్రీమంతుడైన కుబేరుడు గుహ్యకులతో కలిసి నివసిస్తుంటాడు. అలకా నగరానికి ప్రభువైన కుబేరుడు అప్పరసలతో సహా కైలాస పర్వతం నుంచి ప్రభవించే శీతమైన పవిత్రమైన జలాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ జలం కైలాసం నుంచి పుట్టిన దివ్య మందాకినీ నదీ జలం.
ఈశాన్య దిక్కు: దివ్యకైలాసానికి ఈశాన్య దిశలో సౌగంధిక పర్వతానికి, సువేల పర్వతానికి దగ్గర్లో సముద్రజలాల లాంటి కాంతితో ప్రకాశించే చంద్రప్రభ అనే పర్వతం వుంది. దాని సమీపంలోనే అచ్చోదం అనే దివ్య సరస్సు వుంది. ఆ సరోవరం నుంచే అచ్చోదకం అనే దివ్యనది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీరంలో ఎంతో గొప్పదైన చైత్రరథం అనే సుందరమైన వనం వున్నది. ఆ వనంలో శూరులు, కూరులు అయిన గుహ్వకులు (యక్షులు) తమ సేనాధిపతి అయిన మణిభద్రుడితో కలిసి నివసిస్తుంటారు. ఈ అచ్చోదానదినే మందాకినీ నది అని కొందరు వ్యవహరిస్తారు. ఈ నది భూమండలం మీద ప్రవహించి మహా సముద్రంలో కలుస్తుంది.
ఆగ్నేయదిక్కు: కైలాసపర్వతానికి ఆగ్నేయదిశలో సకలౌషధులకీ నిలయమైన, మణిశిలలతో కూడుకున్న శబలపర్వతం వున్నది. ఆ పర్వతానికి దగ్గర్లో మంచు శిఖరాలతో సూర్యుడిలా ప్రకాశించే లోహిత పర్వతం నెలకొంది. ఆ పర్వతపాదాన మహిమాన్వితమైన “లహితం” అనే సరోవరం వున్నది. ఆ సరోవరం నుంచి లోహితానది ఆవిర్భవించి ప్రవహిస్తోంది. ఆ సరోవర తీరంలో 'అశోకం' అనే వనం వుంది. ఆవనంలో సౌమ్యులు ధార్మికులు అయిన గుహ్యకులు తమ నాయకుడైన మణిధారుడితో కలిసి నివసిస్తుంటారు.
నైరృతీ దిక్కు: కైలాసపర్వతానికి నైరృతీ దిశలో కకుద్మత అనే పర్వతం వుంది. ఇది మూడు శిఖరాలు గల పర్వతం. ఈ త్రికకుద్మంత పర్వతం మీద వున్న శిఖరాలపైనే రుద్రుడు ఆవిర్భవించాడు. ఈ దివ్య పర్వత పాదాన సిద్ధసేవితమైన “మానసం” అనే సరస్సు వుంది. ఆ సరస్సు నుంచి పవిత్రమైన సరయూనది ప్రవహిస్తోంది. ఆ సరోవరానికి సమీపంలో 'వైబ్రాజం' అనే ప్రసిద్ధమైన వనం వున్నది. ఆవనంలో కుబేరుడి ప్రధాన అనుచరుడైన “ప్రహీతి అనేవాడి కుమారుడు మహాపరాక్రమ వంతుడైన “బ్రహ్మథానుడు” అనే రాక్షసుడున్నాడు.
పచ్చిమదిక్కు: కైలాసపర్వతానికి పశ్చిమదిశలో బెషధులతో నిండిన దివ్య పర్వతం వున్నది. అది బంగారు రంగులో వుండే గైరికాది ధాతువులతో ప్రకాశిస్తూ చూడటానికి బంగారు కొండలా కనిపిస్తుంది. శివుడికి ఈ పర్వతం అంటే ఎంతో ప్రీతి. బంగారు రంగు శిఖరాలతో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో వున్నతంగా ఈ “అరుణ పర్వతం” నెలకొంది. ఈ పర్వతానికి సమీపంలోనే దివ్యమై ముంజవత్పర్వతం, మహోన్నతమైన దుర్గశైలం అనే పర్వతం నెలకొన్నాయి. అరుణ పర్వతం మీద ధూమ్రలోహిత రూపుడైన పరమేశ్వరుడు నివసిస్తాడు. ఈ అరుణ పర్వత పాదాలనుంచి 'శైలోదం' అనే సరస్సు ఆవిర్భవించింది. ఆ సరస్సు నుంచి 'శైలోదయా' అనే నది ప్రవహిస్తుంది. ఇది దక్ష-శీత పర్వతాల మధ్యగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది.
ఉత్తర దిక్కు: కైలాస పర్వతానికి ఉత్తర దిశలో ఓషధులతో నిండిన పర్వతం వుంది. దానికి హంసాలం అనే వనానికి మధ్యలో గౌర వర్ణంతో ప్రకాశించే “హిరణ్య శృంగం” అనే పర్వతం నెలకొంది. ఆ పర్వత పాదంలో బంగారు ఇసుకతో కూడుకున్న బిందు జరోవరం ఆవిర్భవించింది. ఆ సరోవర తీరంలోనే పూర్వం భగీరథుడు తన పూర్వీకుల్ని గంగాజలంతో తడిపి పునీతుల్ని చేద్దామనే ఆశయంలో కఠోరమైన తపస్సు చేసాడు.పూర్వం త్రిపథగా(మూడు మార్గాలలో ప్రవహించే) ఉండే గంగానది ఇక్కడే వుండేది. అక్కడ ఇప్పటికీ మణిమయాలైన యూపస్తంభాలు, బంగారంతో చేసిన హోమగుండాలు ఉన్నాయి. అక్కడ ఇంద్రుడు దేవతాగణాలతో కలిసి ఎన్నో యాగాలుచేసి కామితఫలాలు పొందాడు.
భగీరథుడి తపః ప్రభావంతో గంగానది మొదట శివుడి శరీరం మీదకి దూకింది. దానిని ఆయన తన యోగశక్తితో తన జటాజూటంలో బంధించాడు. ఆ సమయంలో ఆ జటాజూటం నుంచి కొన్ని బిందువులు జారి భూమి మీద పడ్డాయి. ఆ బిందువులతో ఏర్పడిన సరోవరమే ఈ బిందు సరోవరం.
పరమేశ్వరుడు తనని జటూ జూటంలో బంధించటంతో గంగాదేవికి ఎంతో కోపం వచ్చింది. తన ప్రచండమైన శక్తితో ఆయన్ని కూడా పాతాళానికి తనతో తీసుకుపోవాలనుకుంది. ఆమె అభిప్రాయాన్ని శివుడు గ్రహించాడు. వెంటనే గంగని తన శరీరంలోనే లయం చేయాలనుకున్నాడు. అయితే ఆయనకి ఎదురుగా నమస్కరిస్తూ భగీరథుడు కనిపించాడు. భగీరథుడు తపస్సు చేసీ చేసీ చిక్కి శల్యమైవున్నాడు. అంతలో ఆయనకి భగీరథుడికి తానిచ్చిన వరం గుర్తుకు వచ్చింది. తనకోపాన్ని తమాయించుకుని తన జటాజూటంలో బంధించిన గంగని ఏడు ధారలుగా భూమి మీదకి వదిలాడు.
పరమేశ్వరుడి జటాజూటం నుంచి వెలువడ్డ ఏడు ధారలలో
1.నళింది
2.హ్లాదిని
3.ప్లావని అనే మూడు ధారలు తూర్పుదిశగా
4.సీత
5. చక్షుష్
6.సింధు అనే మూడు ధారలు పడమర దిశగా ప్రవహించాయి. చివరిదైన ఏడోధార భగీరథుడి వెంట నడిచి దక్షిణదిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిసింది. అందుకే గంగకి “భాగీరథి” అనే పేరు వచ్చింది. ఆ విధంగా కైలాస పర్వతం దాని పరిసర పర్వతాలు ఎన్నో పుణ్యప్రదమైన నదులకి పుట్టిల్లుగా అయినందువల్ల పరమపవిత్రమైన దివ్య పర్వతంగా కైలాసం ప్రఖ్యాతి చెందింది.
త్రిపురాసురోపాఖ్యానం
పూర్వం మహాబలవంతుడు, మాయావి అయిన “మయుడు” అనే రాక్షసుడుండేవాడు. అతడు దేవతలతో యుద్ధం చేసి ఓడిపోయాడు. తిరిగి ఎలాగైనా వారిని జయించాలని ఘోరమైన తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం తెలసి మయుడి మిత్రులైన విద్యున్మాలి, తారకాక్షుడు అనే ఇద్దరు అసురులు కూడా అతడితో పాటే తపస్సు చేయాలని భావించారు. ఒకనాడు ఆ ముగ్గురూ కలిసి కఠోరదీక్షతో తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించాడు.
తమ శరీరం సంపూర్ణంగా కృశించిపోయేలా అన్ని ఋతువుల్ని తిరస్కరిస్తూ వారు చేసిన తపోశక్తికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. వారి వేడికి అగ్ని సూర్యులు కూడా తట్టుకోలేకపోయారు. లోకాలన్నీ తగలబడటం ప్రారంభించాయి. వెంటనే ప్రజాపతి బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
తమ తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మదేవుణ్ణి చూసి ఆ అసురులు ముగ్గురూ ఎంతో సంతోషించారు. మయుడు ఆయనతో “బ్రహ్మదేవా! పితామహా! పూర్వం దేవతలతో జరిగిన యుద్ధంలో మా దానవులు ఎందరో మరణించారు. మిగిలిన దానవులంతా తలో దిక్కుకీ పారిపోయి తలదాచుకున్నారు. కొంతకాలం తరువాత వారంతా నా దగ్గరకి వచ్చి శరణు వేడారు. నావారందరినీ కాపాడాల్సినబాధ్యత నాదే కదా స్వామీ! అందుకే నా వారందరి కోసం నేను నీ దివ్యానుగ్రహంతో దేవతలెవరూ చొరబడలేని ఒక మహా దుర్గాన్ని నిర్మించాలనుకుంటున్నాను. ఆ దుర్గాన్ని సకలలోకాలలో వున్న ఎలాంటి శక్తులు, ఆయుధాలు ఛేదించని విధంగా వుండాలి. మా అందరికి అమరత్వం కావాలి. ఇదే నా కోరిక” అని నమస్మరించాడు.
మయుడి కోరిక విన్న బ్రహ్మ దేవుడు "దైత్యగణాధిపా! మయా! పుట్టినవారికి మరణం తప్పదు. అమరత్వం కోరుకోవటం నీకు సమంజసం కాదు. అయితే నీవు కోరినట్టు నీ దుర్గాన్ని నిర్మించుకో. అది శత్రుదుర్భేద్యమవుతుంది" అన్నాడు. అందుకు మయుడు "పితామహా సరే! నీవన్నట్టు మాకు
అమరత్వం వద్దు. అయితే మేము నిర్మించిన దుర్గాన్ని ఒకేసారి విడిచిన ఒకే బాణం మాత్రమే భేదించగలగాలి. ఆ బాణం ద్వారా మాత్రమే మేమంతా మరణించాలి. అంతవరకూ మాకు అమరత్వాన్ని ప్రసాదించు” అని కోరాడు. బ్రహ్మ 'తథాస్తు' అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు.
బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావంతో మయుడికి అతడి అనుచరులకి రెట్టింపు ఉత్సాహం వచ్చింది. వెంటనే మయుడు శత్రుదుర్భేద్యమైన విధంగా వంద యోజనాల పొడవు వెడల్పు కొలతలతో మూడు శక్తివంతమైన పురాలని నిర్మించాడు. ఆ మూడు పురాలు పుష్యయోగంలో నిర్మించబడ్డాయి.
అవి తిరిగి పుష్యయోగంలో మాత్రమే పరస్పరం కలుసుకుంటాయి. మయుడు తన నిర్మాణ చాతుర్యంతో ఆ మూడు పురాలలో ఒక దాన్ని అయో(ఇనుము) దుర్గంగా చేసి భూమండలం మీద ఉంచాడు. రెండోదాన్ని రజతం(వెండి) తో నిర్మించి అంతరిక్షంలో వుంచాడు. మూడో దుర్గాన్ని బంగారంతో నిర్మించి అంతరిక్షానికి పైన నిలిచేలా చేసాడు.
ఆ విధంగా సకల రక్షణా వ్యవస్థలతో, వివిధ ఆయుధాలు ధరించిన సైనికులతో ఆ మూడు నగరాలు శత్రువులు జయించటానికి వీలు లేనంత పటిష్టంగా రూపొందాయి. ఆ మూడు పురాలనీ మయుడు, విద్యున్మాలి, తారకాక్షుడు నిత్యం సంరక్షిస్తున్నారు.
త్రిపుర దుర్గంలో అసురుల ప్రవేశం: అసుర శిల్పి మయుడు నిర్మించిన ఆ దివ్య పురాలలోకి సకలలోకాలలో వున్న అసురులంతా తండోపతండాలుగా వచ్చిచేరారు. ఆ దుర్గాలలో మహా పర్వతాలు, నదులు, సముద్రాలు, సుందరమైన స్థలాలు ఎన్నో వున్నాయి. మొత్తం ఆ మూడు పురాలలోకి వంద కోట్ల మంది దైత్యులు ప్రవేశించారు. అక్కడ వారికి ఎలాంటిలోటు లేదు. ఏది కోరితే అది లభిస్తుంది. అద్భుతమైన అందంతో విరాజిల్లే కాంతలు నిత్యం దైత్యుల్ని ఆనందంలో ముంచెత్తుతుంటారు. అయితే అన్ని రకాల సుఖాలు లభిస్తున్నప్పటికీ త్రిపురాలలో వున్న దైత్యులు ఎవ్వరూ ధర్మాన్ని వీడలేదు. అందరూ ధర్మబద్ధంగా నీతివంతంగా జీవిస్తుండేవారు. పెద్దల్ని గౌరవిస్తూ, గురువుల్ని పూజిస్తూ బ్రాహ్మణులకి నమస్కరిస్తూ ధర్మార్ధకామమోక్షాలని ఆచరిస్తూ నియమబద్దంగా కాలం గడుపుతున్నారు.
త్రిపురాలలో కలి ప్రవేశం: ఒకనాడు ఒకేసారి లోభం, క్రోధం, కలహం అనే రూపాలతో కలిపురుషుడు త్రిపురాలలోకి ప్రవేశించాడు. అది మొదలు త్రిపురంలో వున్న వారందరినీ వ్యాధులు పీడించటం ప్రారంభించాయి. ఆ కలి సంధ్యాకాలంలో ప్రవేశించాడు. మర్నాడు ఉదయం దానవులందరికీ ఎన్నో ఉత్పాతాలు, దుఃశకునాలు కనిపించాయి. ఏమిటీ విపరీతం? అసలేం జరుగుతోంది? ఎందుకిన్ని మార్పులు వస్తున్నాయి? అని పరస్పరం విమర్శించుకోసాగారు.
సూర్యోదయమైన తరువాత మహాతేజస్సుతో వెలిగిపోతున్న మయుడు రాజసభలోకి ప్రవేశించాడు. ఆ సభలో విద్యున్మాలి, తారకాక్షుడు కూడా కూర్చొనివున్నారు. అందరూ కొలువుదీరిన తరువాత మయుడు వారందరినీ ఉద్దేశించి "సభాసదులారా! ప్రియమైన దైత్యప్రముఖులారా! ప్రజలారా! నిన్న రాత్రి నాకు దుఃస్వవ్నం వచ్చింది. మహాబలం, క్రోధం, ఉగ్రమైన ముఖం కలిగిన ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు మన దుర్గంలోకి ప్రవేశించారు. వారు ముగ్గురూ రోషంతో ఆవేశంతో ఎన్నో రకాల శరీరాలు ధరించి ఇక్కడున్న వారి ఇళ్ళలో ప్రవేశించారు. దానితో త్రిపుర దుర్గమంతా అంధకారమై పోయింది. ఎన్నో దుశ్శకునాలు నాకు కనిపించాయి. అంతలో నాలుగు పాదాలతో స్త్రీలాగా పోలికలున్న వాడొకడు నన్ను హఠాత్తుగా మేలుకొల్పాడు. ఇదీ నాకు వచ్చిన దుఃస్వప్నం.
ప్రజలారా! ఈ దుఃస్వప్నం మనకి రాబోయే అరిష్టాల్ని సూచిస్తోంది. భవిష్యత్తులో మనకి ఇంకెన్ని కష్టాలు రాబోతున్నాయో! మీరంతా నేటి నుంచి నేను చెప్పినట్టు దయచేసి వినండి. మీరంతా మీ మనసుల్లో కోపాన్ని ఈర్ష్యని, కామాన్ని విడిచిపెట్టండి. సత్యం, దమం, శమం అనే సద్గుణాల్ని ఆశ్రయించండి. నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి అర్చించండి. చూస్తుంటే మనందరికి ఇష్టదైవమైన ఆ త్రిలోచనుడు మనమీద అలిగాడేమో అనిపిస్తోంది. ఏదేమైనా మీరందరూ పరస్పరం కలహించుకోకుండా శాంతిగా వుండండి” అని ప్రకటించాడు.
మహారాజు మయుడు హితబోధచేసినప్పటికీ అరిష్టం దాపురించినందు వల్ల అతడి మాటలు వారి తలకెక్కలేదు. పైగా ఆ మాటలు విన్న వెంటనే ఆగ్రహంతో ఒకరినొకరు చూసుకుంటూ, దూషించుకోవటం ప్రారంభించారు. అంతే ఆ నాటి నుంచి కలి విజృంభణ త్రిపురాలలో ప్రారంభమయ్యింది. నిత్యం దానవులందరూ నగరంలో వున్న బ్రాహ్మణులని ద్వేషించటం,
హింసించటం ప్రారంభించారు. పరస్పరం కలహించుకుంటూ గురువుల్ని పెద్దల్ని నిందించటం ప్రారంభించారు. యజ్ఞయాగాలకి విఘాతాలు కల్పించటం, మునుల్ని ఋషుల్ని హింసించటం, దేవాలయాల్ని ధ్వంసం చేయటం లాంటి ఆకృత్యాల్ని చేయసాగారు.
శివుణ్ణి ప్రార్థించిన దేవతలు: అప్పటిదాకా ఎంతో శీలవంతులుగా నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న త్రిపురాలలోని దానవులు దురాత్ములై బైటికివచ్చి అన్నిలోకాల్నీ నాశనం చేయటం ప్రారంభించారు. వాటి ధాటికి ముల్లోకాలలోని వారు చింతాక్రాంతులయ్యారు. వెంటనే ఆదిత్యులు, అష్టవసువులు, సిద్దులు, సాధ్యులు, పితృదేవతలు, మరుద్గణాలు భయపడిపోయి పరుగున వెళ్ళీ బ్రహ్మదేవుణ్ణి శరణువేడుకున్నారు.
బ్రహ్మదేవుడు దేవతల్ని ఓదార్చి! దేవతలారా! పూర్వం నేను మయుడికి వరాన్నిచ్చాను. దాని ప్రభావం ఎవరూ తప్పించలేరు. అయితే వాడు కోరిన చేటుకాలం ఇప్పుడే సమీపించింది. వాడు నన్ను "త్రిపురాలన్నీ ఒకే బాణంతో భేదించబడాలి. అప్పుడే నా వినాశనం జరగాలి" అని కోరుకున్నాడు. మనలో ఒక్క పరమేశ్వరుడే ఆ త్రిపురాలన్నీ ఒక్క బాణంతో పడగొట్టగల సమర్షుడుగా నాకు కనిపిస్తున్నాడు. కనుక మన మందరంపోయి ఆయన్నే వేడుకుందాం" అన్నాడు. అందరూ అంగీకరించి బ్రహ్మని వెంటబెట్టుకుని పరమేశ్వరుడి దగ్గరకి వెళ్ళారు. స్వామిని దర్శించి ముందుగా ఆయన్ని భక్తితో ఇలా స్తుతించారు.
దేవతాకృత శివస్తుతి
॥ ఓం నమోభవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ ॥
పశూనాం పతయే నిత్యముగ్రాయచకపర్దినే ।
మహాదేవాయ భీమాయ త్య్రంబకాయ నిశాంపతే ॥
ఈశ్వరాయ భగమ్నాయ నమస్త్వన్ధక ఘాతినే ।
నీలగ్రీవాయ భీమాయ వేదసే వేదసాంపతే ॥
కుమార శత్రువిఘ్నాయ కుమారజననాయచ ।
విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రధనాయచ ॥
నిత్యం నీల శిఖండాయ శూలినే దివ్యశాయినే ।
ఉరగాయ సూక్షేత్రాయ హిరణ్యవసురేతసే ॥
అంచిత్యాయాంబికా భర్త్రే సర్వదేవస్తు తాయచ ।
వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే ॥
తప్యమానాయ నలినే బ్రహ్మణ్యాయా జతాయ చ ।
విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమాధృత్య తిష్ఠతే ॥
నమోஉస్తు దివ్య సేవ్యాయ ప్రభవే సర్వ సంపదాం ।
అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా ॥
॥ భక్తానుకంపితే తుభ్యం దిశతేజన్మనో గతమ్ ॥
(అధ్యా-130, శ్లో-22-29)
ఇది మాతృకా సంఖ్యలో అనగా 5 నామాలతో దేవతలు చేసిన శివస్తుతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇందులోని నామాలు 51 ఉంటాయి
1.భక్తులకి శుభకరుడు 2.పాపులకి హింసకరుడు
3.బాధలు తొలగించేవాడు
4.వరాలు ప్రసాదించేవాడు
5.జీవులకి అధిపతి
6. భయంకరుడు
7.జటాజూటధారి
8.మహాదేవుడు
9. దుష్టభయంకరుడు
10. త్రినేత్రుడు
11.ప్రజలకి అధిపతి
12. ఈశ్వరుడు
13.భగుడు
14.ఆదిత్యుని కొట్టినవాడు
15.అంధకాసురుణ్ణి చంపినవాడు
16. నీలకంఠుడు
17. సూర్యాదులతో కూడా పనుల్ని చేయించేవాడు
18. లోకకర్తలకి అధిపతి
19.కుమారస్వామి శత్రువుల్ని నాశనం చేసేవాడు
20.కుమార స్వామికి తండ్రి
21. ఎర్రని జటాజూటంకల వాడు
22.ధూమ్రవర్ణుడు
28. లోకాల్ని ధరించేవాడు
24. పాపుల్ని నరికేవాడు
25.నీలకేశాలు కలవాడు
26.శూలధారి
27 దివ్యశయనుడు
28. సర్పభూషణుడు
29.మంచి నేత్రాలు కలిగినవాడు
30. హిరణ్మయుడు
31. వసువురేతస్సుగా కలవాడు
32. అచింత్యుడు
38. అంబికాదేవికి భర్త
34.అందరుదేవతల చేతా స్తుతించబడేవాడు
35. వృషభధ్వజుడు
36. చండస్వరూపుడు
37. జటాధారి
38. బ్రహ్మచారి
39. నీటిలో వుండి తపస్సు చేసేవాడు
40. బ్రహ్మవేత్త
41. అజితుడు
42. విశ్వస్వరూపుడు
43. విశ్వాన్ని సృష్టించినవాడు
44. విశ్వమంతా ఆవరించి ఉండేవాడు.
45. దివ్యపురుషుల సేవలందుకునేవాడు.
46. సకల సంపదలకి ప్రభువు
47. ఆశ్రయించతగినవాడు
48.కోరికలు కోరదగినవాడు
49. ఎప్పుడూ పనిలో మునిగి ఉండేవాడు.
50. భక్తుల్ని అనుగ్రహించేవాడు
51.జన్మకి తగిన ఉత్తమగతుల్ని ప్రసాదించేవాడు.
ఈ విధంగా పరమేశ్వరుడికి ప్రీతికరమైన నామాలతో ఆయన్ని స్తుతించారు. తరువాత వారంతా త్రిపురాలలోని దైత్యుల ద్వారా తాముపడ్డ కష్టాలన్నిటినీ వరుసగా ఏకరువు పెట్టారు. వారి బాధల్ని కష్టాల్ని విన్న శంకరుడు వారితో ఇలా అన్నాడు.
శివరధం: దేవతలారా! మీరు ఆ దానవుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. నేను త్రిపురాలనీ దగ్ధం చేసి మీ కష్టాల్ని పోగొడతాను. అయితే మీరు నేను చెప్పినట్టు ఇలా చేయండి. ముందుగా నాకు యుధ్ధం చేయటానికి తగిన రథాన్ని సిద్ధం చేయండి అన్నాడు. వెంటనే దేవతలు దివ్యమైన రథాన్ని సిద్ధంచేసారు. ఆరథం ఎలా వుందంటే భూమి శివుడు అధిరోహించే రథం. శివుడి పక్కన వుండే అనుచరులిద్దరూ దాని కాడికి కొనలు. మేరు పర్వతశిఖరం ఆయన కూర్చుండే స్థానం. మందర పర్వతం ఆ రథానికి ఇరుసు. సూర్య చంద్రులిద్దరూ రథచక్రాలు. శుక్షకృష్ణపక్షాలు రెండూ ఆ రథానికి నేమి ద్వయం. నాగులలో శ్రేష్థులైన తక్షకుడు, కంబళీశ్వతరుడు అనే సర్పాలని తాళ్ళుగా చేసి, శుక్ర, బృహస్పతి, బుధ, అంగారక, శనైశ్చరుల్ని రథంలోని వివిధ భాగాలుగా ఏర్పరిచి, ఆ భాగాల్ని ఆ తాళ్ళతో బిగించి కట్టారు. ఆకాశం ఆ దివ్యరథానికి చెక్కతో నిర్మించిన రక్షణపంజరం. మరో ముగ్గురు నాగులు (సర్పాలు)ఆ రథానికి బంగారు త్రివేణువు(రథానికి ముందుభాగంలో త్రిభుజాకారంలో ఏర్పరిచే అమరిక), గంగ, సింధు, చంద్రభాగా, ఐరావతి, వితస్త, విపాశ, గండకి, సరస్వతీ, దేవికా, సీతా, సరయూ అనే నదులు శివుడికి అమ్ములపొదులు. ధార్తరాష్ట్ర కర్కోటక, వాసుకి, ఐరావత అనే జాతి సర్పాలు తూణీరంలో వున్న శరాలు. సురస, సరమ, కద్రువ, వినత, శుచి, త్వష్ట, బుభుక్షా, ఉగ్రవేదన, చిత్రసంభవ, బ్రహ్మహత్య, గోహత్య, అశ్వహత్య అనే భయానక తత్త్వాలన్నీ గదలుగా శక్త్యాయుధాలుగా మారి ఆ రథం మీద నిలిచాయి.
ఆ దివ్యరథానికి నాలుగు వేదాలు నాలుగు గుర్రాలయిన్నాయి. తక్షకుడు కర్కోటకుడు, ధనుంజయుడు అనే సర్పాలు ఆ గుర్రాలకి పగ్గాలుగా మారాయి. ఆరు ఋతువులతో చిత్రించిన సంవత్సరం ధనుస్సుగా అయ్యింది. అంబికా దేవి ఆ బాణాలకి మొనగామారింది. కాళరాత్రి ఆ విల్లుకి నారి అయ్యింది. విష్ణువు, సోముడు, అగ్ని కలిసి ఒక్కటై ప్రధాన బాణంగా రూపొందారు.
ఆ విధంగా దేవతలందరూ కలిసి తమ దివ్య ప్రభావంతో గొప్పరథాన్ని నిర్మించి పరమేశ్వరుడికి సమర్పించారు. సర్వాలంకార శోభితంగా కనిపిస్తున్న ఆ రథాన్ని చూసి శివుడు ఎంతో ఆనందించాడు. దేవతలతో "నేను త్రిపురాలతో యుద్ధం చేయటానికి సిద్ధంగా వున్నాను. సరే? ఈ రథాన్ని తోలే సారధి ఎవరు?" అని ప్రశ్నించాడు. అది విని దేవతలంతా ముఖాముఖాలు చూసుకున్నారు. సాక్షాత్తు శివుడి రథాన్ని తోలగలిగే సమర్థుడు ఎవ్వరు? అని ఆలోచించసాగారు.
అంతలో బ్రహ్మదేవుడు ఉత్సాహంగా లేచి శివరధానికి నేను సారధిగా వుంటాను అని ముందుకి వచ్చాడు. ఆ మాటవిని దేవతలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేసారు. వెంటనే రథాన్ని ఎక్కి పగ్గాలు పట్టుకున్నాడు బ్రహ్మ. అది చూసి ఆనందించిన శివుడు తాను కూడా విజయదరహాసం చేస్తూ రథాన్ని అధిరోహించాడు. బ్రహ్మదేవుడు ఒక్కసారిగా రథాన్ని ముందుకి దూకించాడు. అంటే రథం పరుగులు తీయటం ప్రారంభించింది. శివుడి రధం వెంట మంగళనాదాలు, సింహనాదాలు చేస్తూ సకల ప్రమథగణాలు, సకలదేవతాగణాలు కోలాహలంగా బయలుదేరాయి. అందరు దేవతా గణాలతో వారివారి వాహనాలతో, ఆకాశం నిండి పోయింది.
నారదుడి హిత బోధ: శివరథం మహోత్సాహంతో సకలసైన్య పరివేష్టితంగా దూసుకువస్తున్న సమయంలో, నారదమహర్షి హఠాత్తుగా త్రిపురాలలోకి ప్రవేశించాడు. ఎన్నో దుశ్శకునాలతో చింతాక్రాంతులైవున్న మయుడి సభలో నారదమహర్షి ప్రత్యక్షంకాగానే వారంతా వినయంగా లేచి ఆయనకి స్వాగతం పలికారు. వారి సత్కారాలు స్వీకరించిన నారదుడు "ఓ మయాసురా! దుర్మార్గులతో సహవాసం చేసిన వాడికి కూడా దుష్టగుణాలు అంటుకుంటాయి. నీవు సన్మార్గుడివే అయినప్పటికీ ఈ మహర్షులందరి సహవాసంలో చాలా చెడ్డ పనులు చేస్తున్నావు. అవి నీకు తెలియటం లేదు. నీవు నీ దానవులు చేసిన దోషాలకి పరిహారంగా శివుడు మహారథాన్ని అధిరోహించి మిమ్మల్ని సంహరించటానికి వస్తున్నాడు. నీవు ఆయన్ని శరణు వేడుకో లేదంటే నీవు నీ పురాలు, నీ వారందరూ మరణిస్తారు" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.
నారదుడు వెళ్ళిపోయిన మయుడు తనవారందరితో "అసురవీరులారా! మీరు భయపడకండి. మనం యుద్ధమే చేద్దాం. విజయమో వీర స్వర్గమో! మీరంతా వెంటనే ఆయుధాలు ధరించి మీమీ స్థానాల్లో నిలవండి. దేవతల్ని మీ బల పరాక్రమాలతో తరిమి కొట్టండి" అని వారందరినీ ఉత్సాహపరిచి తాను రాజమందిరంలోకి ప్రవేశించాడు. లోపల పూజా మందిరంలోకి వెళ్ళీ త్రిలోచనుడైన శంకరుణ్ణి హృదయపూర్వకంగా శరణువేడుకున్నాడు. శివుడు అతడి ప్రార్ధన మన్నించి ధ్యానంలో అభయాన్ని ప్రసాదించగా దాన్ని గ్రహించిన మయుడు నిశ్చింతగా నిర్భయంగా మనసులో శివుణ్ణి స్తుతిస్తూవున్నాడు.
దేవదానవ సంగ్రామం: దివ్య రథాన్ని అథిరోహించి బయలుదేరిన శివుడు సకలసైన్యసమేతంగా త్రిపురాలకి సమీపానికి వచ్చాడు. ఆయనకి అల్లంతదూరంలో త్రిపురదుర్గం కనిపించింది. వెంటనే రథాన్ని నిలిపి ఇంద్రుణ్ణి పిలిచి, "ఇంద్రా! అదిగో త్రిపురదుర్గం ఎంతో ఉన్నతంగా, ధ్వజాలతో
అసురులకోలాహంతో కనిపిస్తోంది. నీవు వెంటనే నీ ప్రమథగణాలని నీ దేవతాగణాలని తీసుకుని ఆ దుర్గాల మీదకి దండెత్తు. నేనిక్కడ సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాను. పుష్యయోగకాలం వస్తే గానీ ఆ మూడుపురాలు ఏకంకావు. ఆ సమయం రాగానే నేనా మూడు పురాల్నీ నా బాణంతో ఛేదిస్తాను. నీవు వెంటనే బయలుదేరు” అని ఆజ్ఞాపించాడు.
శివాజ్ఞవిన్న ఇంద్రుడు తన సైన్యాన్ని తీసుకుని సింహనాదాలు చేస్తూ త్రిపురదుర్గం మీదకి దండెత్తారు. దానవులు, దేవతల మధ్య భయంకరమైన పోరు ప్రారంభమయ్యింది. ఏనుగులతో, గుర్రాలతో, రధాలతో పరస్పరం అత్యంతభీకరంగా యుద్ధం చేయసాగారు. తారకాక్షుడు, విద్యున్మాలి ఎన్నో మాయోపాయాలు ప్రయోగించి దేవసైన్యాల్ని చికాకు పరిచారు.
తారకాక్షవధ: మయుడి సన్నిహితుడైన తారకాక్షుడు మహాబలవంతుడు. తనపురం మీదకి దండెత్తిన దేవతాసైన్యాన్ని ఛిన్నా భిన్నం చేశాడు. సాక్షాత్తు విష్ణుమూర్తే వృషభరూపంలో తనని చంపటానికి రాగా ఆయన్ని కూడా తరిమివేశాడు. తన బలగర్వంతో సరాసరి శంకరుడి రథం దగ్గరికి వచ్చి రథసారధిగా వున్న బ్రహ్మదేవుణ్జి తన గదతో మోదాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడే వున్న నందీశ్వరుడికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. తారకాక్షుణ్ణి ఎదుర్కొన్నాడు. ముందుగా తారకాక్షుడిదే పై చేయి అయ్యింది. తన చేతిలోని గొడ్డలితో నందీశ్వరుణ్ణి చెక్కేశాడు. నందీశ్వరుడు ఆ గాయాల్ని తట్టుకుని తన దివ్య ఖడ్గంతో శరభమృగంలా దూకి ఒక్కసారిగా తారకాక్షుణ్ణి అడ్డంగా నరికేశాడు. ఆవిధంగా మహాబలుడైన తారకాక్షుడు నందిచేతిలో మరణించటంతో దేవతలంతా జయజయ ధ్వానాలు చేసారు.
విద్యున్మాలివధ: తారకాక్షుడి మరణంతో యుద్ధంలో ప్రధాన పదవిని విద్యున్మాలి చేపట్టాడు. తన దానవసైన్యాన్ని ఉత్సాహపరుస్తూ శత్రువులైన దేవసైన్యాన్ని చీల్చి చెండాడటం ప్రారంభించాడు. గదలు, ముసలాలు, తోమరాలు, ప్రాసాలు, గుర్రాలు, వజ్రాలు,శూలాలు, ఋషులు(చిన్న ఖడ్గాలు),
పెద్ద పెద్ద కొండరాళ్ళు ఆ యుద్ధంలో దేవతలతో దానవులతో ప్రయోగించబడి నిప్పుకణికల్లా పొగలుకక్కుతూ మహారాసులుగా సముద్రంలో పడుతున్నాయి. విద్యున్మాలి యుద్ధరంగం నుంచి బైటికి వచ్చి సరాసరి "నంది" దగ్గరకి వెళ్ళాడు. నందితో "ఓయీ! నందీ! నీవు మా తారకాక్షుణ్జి వధించానన్న గర్వంతో వున్నట్టున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగవు. నిన్ను అంతం చేయటానికే
వచ్చాను. చూడు నా ప్రతాపం" అని ఒక్కసారిగా నంది మీదకి దాడిచేశాడు.
విద్యున్మాలి ఏనుగు తన తొండంతో మేఘాన్ని చీల్చినట్టు ఒక పదునైన బాణంతో నందిని గుచ్చాడు. ఆ బాణం తాకిడికి నంది శరీరం నుంచి రక్తం ధారలుగా కారింది. క్షణంలో తమాయించుకున్న నంది దెబ్బతిన్న ఏనుగులాగా ఒక మహావృక్షాన్ని పెకలించి విద్యున్మాలిపై విసిరాడు. ఆ వృక్షం విద్యున్మాలి మీదకి రాబోయేంతలోనే అతడు ఒక బాణంతో ఆ వృక్షాన్ని ఛిన్నాభిన్నం చేసాడు. వెంటనే నంది తన దివ్యఖడ్గాన్ని తీసుకుని అత్యంత వేగంగా విద్యున్మాలి వైపు పరుగెత్తాడు. తనవైపు దూసుకొస్తున్న నందిమీదకి వందలాది శస్త్రాల్ని ప్రయోగించాడు విద్యున్మాలి. అయినా సరే ఆ బాణాల్ని తప్పించుకున్ననంది విద్యున్మాలి ఎక్కిన రధాన్నిపైకెత్తి గిరగిరా తిప్పి భూమిమీదకి విసిరికొట్టాడు. మహామాయావి అయిన విద్యున్నాలి రథంలో నుంచి తప్పించుకుని అక్కడే నిల్చున్న నందీశ్వరుణ్ణి తన శక్త్యాయుధంతో గాయపరిచాడు. ఇక ఆగ్రహం
తట్టుకోలేని నంది తనని గాయపరిచిన శాక్త్యాయుధాన్నే తీసి విద్యున్మాలి గుండెల్లోకి బలంగా దించాడు. ఆ దెబ్బకి హాహాకారాలు చేస్తూ విద్యున్మాలి నేలకొరిగాడు.
విద్యున్మాలి మరణంతో దేవతల్లో ఆనందం వెల్లివిరిసింది. అందరూ నందీశ్వరుడికి జయజయ ధ్వానాలు పలికారు. శంకరుడు కూడా తారకాక్షుణ్ణి, విద్యున్మాలిని వధించిన నందీశ్వరుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు.
త్రిపుర విధ్వంసం: దేవ దానవుల మధ్య పోరు భయంకరంగా కొనసాగుతూనే వుంది. దేవతల చేతిలో తనకి అత్యంత ఆప్తులైన తారకాక్షుడు, విద్యున్నాలి ఘోరంగా సంహరించబడటంతో మయుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనే స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అతన్ని ఇంద్రుడు, కుబేరుడు, నంది, షణ్ముఖుడు తదితర ప్రమథగణాలు మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు.
సర్పాల్ని గరుత్మంతుడు చీల్చినట్టు మహాబలసంపన్నుడైన మయుడు తనని చుట్టు ముట్టిన వారందరినీ దివ్యశస్త్రాలతో చీల్చిచెండాడాడు.
అంతలో పుష్యయోగం రానే వచ్చింది. ఆయోగ ప్రభావం కారణంగా త్రిపురాలు మూడూ ఒక్నటిగా అయ్యాయి. ఆ విషయాన్ని రధం మీద వున్న త్రిలోచనుడు గమనించాడు. దానికోసమే ఆయన ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా ఆ మూడుపురాలు ఒకేచోటికి వచ్చి చేరే సమయంలో తన చేతిలో వున్న దివ్యశరాన్ని ఆ పురాల మీదకి ప్రయోగించాడు. పరమేశ్వరుడు ప్రయోగించిన ఆ బాణం
ఆకాశంలో రెల్లు పూవులాగా తరువాత బంగారంలాగా దివ్యకాంతితో ప్రకాశిస్తూ దుసుకుపోతుంది. అదిచూసి శివుడు ఒక్కసారిగా "అయ్యో! నేనెంతపని చేసాను. అని దుఃఖించటం ప్రారంభించాడు" అక్కడే వున్న నందీశ్వరుడు ఆవిషయాన్ని గమనించి ప్రభూ! ఎందుకు మీరిలా దుఃఖిస్తున్నారు అని ఆందోళనగా అడిగాడు. "నందీ నేను ప్రయోగించిన బాణంతో త్రిపురాలతో పాటు అందులో వున్ననా ప్రియభక్తుడు మయుడు కూడా నశిస్తాడు" అందుకే బాధపడుతున్నానని అన్నాడు.
శివుడి మాటలువిన్న నంది "ప్రభూ! మీరేమీ చింతించకండి ఆ మయుణ్జి నేను తప్పిస్తాను". అని పలికి వాయువేగంతో శివుడు ప్రయోగించిన బాణం కన్నా ముందుగా త్రిపురాల్లో వున్న మయుడి దగ్గరకి వెళ్ళాడు. అతడితో "వెంటనే నీవు వుంటున్న ఈ ఇంటితో సహా త్రిపురాల్ని విడిచి వేరేచోటకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకో. ఇది శివాజ్ఞ" అని చెప్పి వేగంగా తిరిగి వచ్చాడు. మయుడు తక్షణమే తన దివ్య శక్తితో ఇంటితో సహా త్రిపురాల్ని విడిచి వెళ్ళిపోయాడు. వెంటనే మహేశ్వరుడు ప్రయోగించిన బాణం నారాయణ-అగ్ని-చంద్ర అనే మూడు బాణాలుగా మారి వరుసగా మూడు పురాలనీ ఏకకాలంలో దగ్ధం చేశాయి. సర్వాంగ సుందరంగా మహాసౌధాలతో నిర్మించబడ్డ ఆపురాలు మూడూ భయంకరమైన శివాస్త్రాల ధాటికి తట్టుకోలేక ఆ అగ్ని జ్వాలల్లో ఆహుతైపోయాయి. ఆ విధంగా త్రిపురాలు దగ్గమౌతున్న వేడికి భూలోకమే కాకుండా పాతాళలోకం కూడా వేడెక్కిపోయింది.
తను ఎంతో కష్టపడి తపస్సుచేసి వర ప్రభావంతో నిర్మించుకున్న త్రిపురాలు మూడూ ఒకే సారి దగ్గమైపోవటం చూసి మయుడు ఎంతో దుఃఖించాడు. అయితే తనకి మహాభక్తుడు సహజంగానే యోగ్యుడు అయిన మయుడికి, వేరొకచోట నూతన గృహాన్ని నిర్మించుకుని సుఖంగా కాలం గడుపమని శివుడు వరమిచ్చాడు. ఆ వర ప్రభావంలో మయుడు ఒక శిలాగృహాన్ని నిర్మించుకుని నిరంతరం భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ కాలంగడపసాగాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే అతన్ని అనుగ్రహించటంతో ఆనాటి నుంచి దేవేంద్రుడు కూడా మయుడితో వైరం మాని స్నేహాన్ని ప్రకటించాడు.
త్రిపురాలని దగ్ధంచేసి త్రిపురవైరిగా త్రిపురాంతకుడిగా ప్రసిద్ధిచెందిన శివుడి వీరచరిత్రని పఠించినా, విన్నా బోధించినా, వృషభధ్వజుడైన శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ త్రిపురాసురోపాఖ్యానాన్ని పితృశ్రాద్ధం, తర్పణాలు విడిచేసమయంలో వినిపిస్తే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. సకలశుభాల్ని కలిగించే ఈ దివ్యచరిత్ర పారాయణ చేస్తే రుద్రలోకప్రాప్తి కలుగుతుంది.
మంత్రద్రష్టలైన ఋషులు
బ్రహ్మమానసపుత్రులైన 1.భృగువు 2.మరీచి
3.అత్రి
4. అంగిరసుడు
5.పులహుడు
6.క్రతువు
7.మనువు
8.దక్షుడు
9.వసిష్టుడు
10.పులస్త్యుడు
అనే పదిమంది ఈశ్వర సమానులు, సర్వసమర్ధులు తమకు బ్రహ్మదేవుడు అప్పగించిన కార్యక్రమాల నిర్వహణలో సంపూర్ణమైన ప్రజ్ఞాపాటవాలు అధికారాలు కలిగినవారు. ఆత్మ తత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నవారు. అందుకే వీరిని ఋషులు అంటారు. ఋషులందరిలో వీరంతా మొదటివారు చాలా గొప్పవారు అవటం వల్ల వీరినే మహర్షులు అని వ్యవహరిస్తారు.
ఈ పదిమంది మహర్షుల కుమారులు కూడా మహర్షులే.
కావ్యుడు,
బృహస్పతి,
కశ్యపుడు,
ఉతథ్యుడు,
వామదేవుడు,
అగస్త్యుడు,
కౌశికుడు,
కర్దముడు,
వాలఖిల్యుడు,
విశ్రవసుడు,
శక్తివర్ధనుడు
అనేవారు. వీరంతాకూడా తమ తపశ్శక్తితో ఋషిత్వాన్ని పొందారు. తరువాత వారికి “ఋషికులు” అనే
వత్సరుడు,
భరద్వాజుడు,
వీర్యవాన్ దీర్ఘతముడు,
బృహద్వక్షసుడు,
శరద్వాన్,
వాజశ్రవన్,
సుచింతుడు,
పరాశరుడు,
శృంగి,
శంఖపాతుడు,
వైశ్రవణుడు
వంటి బుషులు జన్మించారు.
భృగువంశ ఋషులు: భృగువంశ ఋషులు, ఋషికులలో ఎంతో మంది మంత్ర ద్రష్టలుగా కీర్తిగాంచారు. వారెవరంటే !
భృగువు
కాశ్యపుడు,
ప్రచేతసుడు,
దధీచి,
ఆత్మవాన్,
ఊర్వుడు,
జమదగ్ని
వేదుడు,
సారస్వతుడు,
అర్షిషేణుడు,
చ్యవనుడు,
వీతహవ్యుడు,
వేధనుడు,
వైన్యుడు,
పృథువు,
దివోదాసుడు,
బ్రహ్మస్మాన్,
గృత్సుడు,
శౌనకుడు.
ఈ పంతొమ్మిది మందీ భృగువంశానికి చెందిన మంత్రద్రష్టలు.
అంగిరమహర్షి వంశఋషులు: అంగిరసమహార్షి వంశంలోజన్మించిన ఋషులు
అంగిరసే,
వేధనుడు,
భారద్వాజుడు,
లక్ష్మణుడు,
కృతవాచుడు,
గర్గుడు,
స్మృతి,
సంకృతి,
తురవీతుడు,
మాంధాత,
అంబరీషుడు,
యవనాశ్వుడు,
పురుకుత్సుడు,
స్వశ్రవుడు,
సదస్యుడు,
అజమీఢుడు,
అస్వహార్యుడు,
ఉత్కలుడు,
కవి,
వృషదశ్వుడు,
విరూపుడు,
కావ్యుడు,
ముద్గలుడు,
ఉతచభ్యుడు,
శరద్వాన్,
వాజిశ్రవసుడు,
అపస్యోషుడు,
సుచిత్తి,
వామదేవుడు,
ఋషిజుడు,
బృహచుక్షుడు,
దీర్ఘతమస్,
కక్షీవాన్
అనే ఋషులు ఈ వంశంలో జన్మించిన మంత్రద్రష్టలు
కశ్యపవంశ ఋషులు :
కాశ్యపుడు,
వత్సారుడు,
నైధ్రువుడు,
నిత్యుడు,
అసితుడు,
దేవలుడు
అనే ఆరుగురు ఈ వంశంలోజన్మించిన మంత్రద్రష్టలు.
అత్రివంశ ఋషులు :
అత్రి,
అర్థస్యనుడు,
శ్వావాశ్వుడు,
గవిష్టిరుడు,
కర్ణికుడు,
తపస్సిద్దుడు
అనే ఆరుగురు ఋషులు ఈ వంశంలో జన్మించిన మంత్రద్రష్టలు.
వశిష్ఠ వంశ ఋషులు :
వసిష్టుడు,
శక్తి,
పరాశరుడు,
ఇంద్రప్రమితి,
భరద్వసువు,
మిత్రావరుణుడు,
కుండినుడు
అనే ఏడుగురు ఈ వంశానికి చెందిన మంత్రద్రష్టలు.
కౌశిక వంశఋషులు:
గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు,
దేవరాతుడు,
బలుడు,
మధుఛందుడు,
అఘమర్షణుడు,
అష్టకుడు,
లోహితుడు,
భృతకీలుడు,
మాంబుధి,
దేవశ్రవస్,
ధనుంజయుడు,
శిశిరుడు,
శాలంకాయనుడు
అనే వారు కౌశిక వంశంలో జన్మించిన మంత్రద్రష్టలు.
అగస్త్య మహర్షి వంశ ఋషులు:
అగస్త్యుడు,
దృఢద్యుమ్నుడు,
ఇంద్రబాహువు
అనే ముగ్గురూ అగస్త్యవంశంలో జన్మించిన మంత్ర ద్రష్టలు.
క్షత్రియులలో మంత్ర ద్రష్టలు :
వైవస్వతమనువు,
ఇలాపుత్రుడైన పురూరవుడు
ఈ ఇద్దరూ క్షత్రియులలో శ్రేష్ఠులైన మంత్రదష్టలు, మంత్రవేత్తలు.
వైశ్య మంత్రద్రష్టలు:
భలందకుడు,
వాసాశ్వుడు,
సంకాలుడు
ఈ ముగ్గురూ వైశ్యులలో ప్రసిద్ధి పొందిన మంత్రద్రష్టలు.
పార్వతి గౌరిగా మారటం
పూర్వం పార్వతీదేవి కైలాసం నుంచి వేరే ప్రదేశంలో తపస్సు చేసుకోవటానికి వెళ్తూ వీరకుడు అనే ద్వారపాలకుడిణ్ణి అక్కడ నియమించి వెళ్ళింది. ఒకనాడు ఆడీ అనే అసురుడు బ్రహ్మ వరప్రభావంతో కామరూపశక్తిని సంపాదించాడు. తనకి శత్రువైన పరమేశ్వరుణ్ణి ఎలాగైనా సంహరించాలని నిశ్చయించుకున్నాడు. పార్వతీదేవి కైలాసంలో లేదన్న విషయం అతడికి
తెలిసింది. ఇదే సరైన సమయమని భావించి వెంటనే పార్వతీదేవి వేషాన్ని ధరించి కైలాసంలోకి ప్రవేశించాడు. ద్వారం బైటవున్న వీరకుడు ఈ విషయాన్ని గుర్తించలేదు. లోపలికి వెళ్ళిన ఆడి రాక్షుడు పార్వతీ రూపంలో శివుణ్ణి కౌగిలించుకోగా, ఆయనకి వచ్చింది పార్వతికాదు అసురుడని తెలిసింది. ఆగ్రహంతో ఆ మాయా రాక్షసుణ్ణి సంహరించాడు. అతడు స్త్రీ రూపంలోనే నేలపైపడి ప్రాణాలు కోల్పోయాడు.
కైలాసంలోపల పరమేశ్వరుడు ఒక స్త్రీని సంహరించిన విషయం ద్వారం బైటవున్న వీరకుడికి తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని వాయుదేవుడి ద్వారా తన మాత అయిన పార్వతీ దేవికి తెలియచేసాడు. ఆ విషయం విన్న పార్వతీదేవికి ఎంతో ఆగ్రహం కలిగింది. తను లేనప్పుడు శంకరుడి దగ్గరకి వేరే స్త్రీ ప్రవేశానికి కారకుడైన వీరకుణ్ణి ఒక శిల నీకు తల్లి అగుగాక! అని శపించింది. అలా శపించిన తరువాత కూడా ఆ ముఖంలో ఆగ్రహం ఏ మాత్రం తగ్గలేదు. తక్షణమే ఆమె హృదయంలోనించి పైకి ఉబికిన క్రోధం ద్వారా భయంకరమైన సింహం ఆవిర్భవించింది. ఆ సింహం భయంకరమైన కోరలతో, విశాలమైన ముఖంతో జడలు నిండిన కంఠంతో సన్నని నడుముతో దొరికిన దానిని దొరికినట్టే తిందామన్నంత ఆకలితో వుంది. తన భర్త అన్య స్త్రీ తో వున్నాడని అపోహపడి ఎంతో బాధలోవున్న పార్వతీదేవి ఆకలిగా ఎదురుచూస్తున్న ఆ సింహానికి తానే ఆహారంగా మారాలనుకుంది.
పార్వతీదేవి హృదయంలో పడుతున్న వేదన బ్రహ్మదేవుడికి తెలిసింది. వెంటనే ఆయన ఆమె ముందు ప్రత్యక్షమై “దేవీ! ఎందుకు నీవిలా బాధపడుతున్నావు. నీ కోరిక ఏమిటి? తీవ్రమైన తపస్సుచేయాల్సిన అవసరం నీకెందుకొచ్చింది?" అని ప్రశ్నించాడు. బ్రహ్మ మాటలు విన్న పార్వతి ఆయనతో “బ్రహ్మదేవా! పూర్వం నేను ఎంతో కఠోరదీక్షతో తపస్సుచేసి శంకరుణ్జి భర్తగా పొందాను. ఆయన కూడా నా మీద అనురాగంతోనే వుండేవాడు. అయితే ఆయన చాలాసార్లు నన్ను శ్యామలవర్ణా! (నల్లని శరీరం కలదానా) అని అనేవాడు. దానితో నా శరీరం రంగు ఆయనకి ఇష్టం లేదని గ్రహించాను. కనుక నేను బంగారు రంగు శరీరంగల దానినవ్వాలి. తిరిగి నా భర్త ప్రేమని పొందాలి”. ఇదే నాకోరిక అన్నది.
పార్వతి మాటలు విన్న బ్రహ్మ దేవుడు “దేవీ! నీవు కోరిన విధంగానే బంగారు (గౌర} వర్ణం గల శరీరాన్ని పొందుతావు. నీ భర్త శరీరంలో అర్ధభాగం కూడా నీకు లభిస్తుంది” అని వరాన్ని ప్రసాదించాడు. వెంటనే వర ప్రభావంతో పార్వతీదేవి నల్లని తుమ్మెదలా తన శరీరం మీదున్న చర్మాన్ని విడిచిపెట్టింది. తాను పచ్చని పసిడి వర్ణంతో (గౌర) చర్మాన్ని ధరించి సర్వాలంకార భూషితగా మారిపోయింది.
పార్వతీదేవి విడిచిన నల్లని చర్మం నుంచి అన్ని అవయవాలు ధరించి ఒక మహాశక్తి ఆవిర్భవించింది. చేతిలో ఘంటతో, మూడుకళ్ళతో నల్ల కలువకాంతితో ప్రకాశిస్తూ నిలిచింది. ఆ మహాశక్తిని చూసి బ్రహ్మదేవుడు “ఓ నిశాదేవీ! నీవు పూర్వం నా ఆజ్ఞతోనే ఈ పార్వతీదేవి శరీరంలోకి ప్రవేశించావు. ఇప్పుడు నీకు నీ స్వస్వరూపం లభించింది. ఇదుగో పార్వతీదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన ఈ సింహాన్ని నీకిస్తున్నాను. దీన్ని నీ వాహనంగా చేసుకో. ఈ సింహాన్ని అధిరోహించి ఇక్కడి నుంచి సరాసరి వింధ్యాచలానికి వెళ్ళు. అక్కడ మహాశక్తిగా కొలువుండి రాబోయే కాలంలో దేవతల కార్యాలు నెరవేర్చు. నీకు పంచాలుడు అనే యక్షుణ్సి అనుచరుడిగా ఇస్తున్నాను. ఈ యక్షుడు మహామాయావి. లక్షమంది అనుచరులు వీడికున్నారు. తీసుకెళ్ళు” అని ఆజ్ఞాపించాడు.
బ్రహ్మ ఆజ్ఞని అనుసరించి ఆ కౌశికీ దేవి పరివారంతో సహా వింధ్యాచలానికి వెళ్ళిపోయింది. పార్వతీదేవి శరీరం నుంచి ఆవిర్భవించింది కాబట్టి నిశాదేవికి కౌశికీ అనే పేరు వచ్చింది. బ్రహ్మ దేవుడికి నమస్కరించి నూతన శరీరాన్ని పొందిన పార్వతీ దేవి సరాసరి కైలాసానికి బయలుదేరింది.
కైలాసానికి వచ్చిన పార్వతి లోపలికి వెళ్ళబోతుంటే ద్వారం దగ్గరున్న వీరకుడు ఆమెను అడ్డగించాడు. ఎందుకంటే తన మాత పార్వతీదేవి శరీరం రంగు మారిపోవటంతో అతడామెని గుర్తించలేదు. ఎంతో కఠినంగా నీవెవరు? లోపలికి ప్రవేశించటానికి వీల్లేదు అని హెచ్చరించాడు. పార్వతి అతని మాటలు విని ఆశ్చర్యపోయింది. అక్కడే నిల్చున్న పార్వతితో “ఓ అమ్మాయీ! పూర్వం నీలానే ఎవరో ఒక రాక్షసుడు మాయా స్త్రీ రూపాన్ని ధరించి లోపలికి వెళ్ళాడు. పరమేశ్వరుడు అది గ్రహించి ఆ అసురుణ్ణి సంహరించాడు. నన్ను పిలిచి నా అశ్రద్ధ కారణంగానే అన్య స్త్రీ లోపలికి వచ్చిందని ఇక నీవు ఈ కాపలాకాసే పనిచేయక్కర్తేదని నన్ను పరుష పదాలతో నిందించాడు” కనుక నీవు లోపలికి వెళ్ళటానికి అనుమతించను. ఇక్కడ నుంచి మరియాదగా వెళ్ళు అని గద్దించాడు.
వీరకుడి మాటలు విన్న తరువాత పార్వతీదేవికి యథార్థం తెలిసింది. “అయ్యో! అన్యాయంగా నేను సత్యం తెలుసుకోకుండా వీరకుణ్ణి శపించానే. ఇతడు వట్టి అమాయకుడు. నా భర్త అన్యస్త్రీతో ఉన్నాడని నేనే పొరపాటు పడ్డాను. ఆవేశంతో కోపంతో నిజం తెలుసుకోకుండా శపించాను. అసలు క్రోధం వల్లనే కదా కీర్తి సంపదలు నశిస్తాయి” అని మనసులో భావించి వీరకుడితో “వీరకా! నేను నీ తల్లిని నాయనా! హిమపుత్రికని, శంకరుడి భార్యని, మారిన నా శరీరాన్ని చూసి సందేహపడకు నేను చేసిన తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు నాకా దివ్య శరీరాన్ని ప్రసాదించాడు. నిజం తెలియక నేను నిన్ను శపించాను. శాపాన్ని మరల్చలేనుకానీ నీకు త్వరలో శుభం జరుగుతుంది” అని పలికింది.
గౌరవర్ణంతో మెరిసిపోతున్న పార్వతీదేవి మాటలు విని వీరకుడు ఎంతో ఆనందించాదు. తల్లికి భక్తిగా నమస్కరించి ఇలా స్తుతించాడు.
గౌరీస్తుతి
నతసురాసుర మౌళీమిలన్మణి ప్రచయకాంతి తాళనఖాం కితే ॥
నగసుతే శరణాగతవత్సలే తవ నమోస్తు నతార్తి వినాశిని ।
తపన మండల మండిత కందరే పృథుసువర్ణ సువర్ణ తనుద్యుతే ॥
విషభుజంగ విషంగవిభూషితే గిరిసుతే ప్రణమే మహదాశ్రయే ।
జగతిః కః ప్రణతాభిమతందదౌ ఝడితి సిద్ధనుతే భవతీయథా ॥
జగతికాంచనవాంచతి శంకరో భువధృత్తనయే భవతీం యధా ।
విమలయోగవినిర్మిత దుర్జయ స్వతను తుల్యమహేశ్వర మండలే ॥
విదళితానందక బాంధవ సంహతిససరవరైః ప్రథమం త్వమ భిష్టుతా ।
సితనటాపటలోద్ధత కంధరాధర మహామృగరాజ రధస్థితా ॥
విమల శక్తి ముఖానల పింగశాయిత భుజేషు విపిష్ఠ మహాసురా ।
నిగథితా భువనైరితి చండికాజనని శుంభనిషుంఛ నిషుందినీ ॥
ప్రణత చింతిత దానవదాన పమధనైక రతిస్తరసాభువి ।
వియతివాయుపథే జ్జ్వలనోజ్వలేஉవనితలే తవదేవిచ యద్వపుః ॥
తరజితేஉప్రతిమే ప్రణమామ్యహం భువనభావని తేభవ వల్లభే ।
జలదయౌలలితోద్ధత వీచయో హుతవహద్యుత యశ్చచరాచరం ॥
ఫణసహస్ర భృతశ్చ భుజంగ హస్త్వభిదాస్యతి మయ్యభయంకరాః ।
భగవతి స్థిర భక్తి జనాశ్రయే ప్రతిగతో భవతీ చరణాశ్రయం ॥
కరణ జాతమిహాస్తు మమాచలన్నుతిలవాప్తి ఫలాశయ హేతుతః ।
ప్రశమమేహి మమాత్మజ వత్సలే నమోஉస్తుతే దేవి జగత్త్రయాశ్రయే ॥
(అధ్యా-157, శ్లో 11-20)
ఈ విధంగా వీరకుడు చేసిన స్తుతిని విని ఎంతో ఆనందించిన పార్వతీదేవి కైలాసమందిరంలోకి ప్రవేశించింది. వీరకుడు యధావిధిగా కైలాస ద్వారం వద్దే కాపలా కాస్తూ ఎవరూలోపలికి వెళ్ళకుండా చూస్తున్నాడు.
కుమారస్వామి స్తుతి
తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించినవాడు కుమారస్వామి. పార్వతీ పరమేశ్వరుల అనురాగఫలంగా మహావీరుడుగా అసుర సంహారుడుగా జన్మించిన కుమారస్వామి దేవతలందరిచేతా ఎంతో భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించబడ్డాడు.
నమఃకుమారాయ మహాప్రభాయ స్కందాయ చస్కందిత దానవాయ ।
నవార్కబింబద్యుతయే నమోస్తు నమోஉస్తుతే షణ్ముఖ కాలరూపిణే ॥
సినంద నానాభరణాయ భర్త్రే నమోరణే దారుణధారణాయ ।
నమోస్తుతేஉర్క ప్రతిమప్రభాయ నమోస్తు గుహ్యాయ గుహాయ తుభ్యం ॥
నమోస్తుతే లోకభయావహాయ నమోస్తుతే బాలకృపావరాయ ।
నమోవిశాలాయతలోచనాయ నమోవిశాఖాయ మహావ్రతాయ ॥
నమోనమస్తేస్తు మనోరమాయ నమో నమస్తేస్తు గుణోత్కటాయ ।
నమోమయూరోజ్జ్వల వాహనాయ నమోస్తు కేయూరధరాయ తుభ్యం ॥
నమోధృతో దగ్రవతాకినేஉస్తు నమః ప్రభావప్రణతాయతేஉస్తు ।
నమోస్తు ఘంటాధర వీర్యశాలినే క్రియాపరాణాం భోవభవ్యమూర్తే ॥
క్రియపరాయజ్ఞ పతిం చస్తుత్వా విరేమురేవం హ్యమరాధిపాద్యాః ।
ఏవం తదాషడ్వదనంతు సేంద్రైర్యుదా సుతుష్టశ్చ గుహస్తతస్తాన్ ॥
(ఆధ్యా-158 శ్లో-13-20)
దివ్యమైన కాంతి గలవాడు, అసురుల్ని నాశనం చేసేవాడు, కొత్త సూర్యబింబంలా ప్రకాశించేవాడు, కాల స్వరూపుడు అయిన కుమారస్వామికి నమస్మారం. స్కందుడికి, షణ్ముఖుడికి నమస్మారం.
వివిధా భరణాలని ధరించినవాడు, అన్ని లోకాలకీ అధిపతి, లోకాలన్నిటినీ పోషించేవాడు, యుద్ధరంగంలో శత్రువుల్ని చీల్చి చెండాడేవాడు, సూర్యుడితో సమానమైన తేజస్సుకలవాడు, యోగులకి తప్ప ఎవరికీ తెలియని రహస్య స్వరూపుడు, దేవతా సైన్యానికి రక్షకుడు అయిన స్వామికి నమస్మారం.
లోకాల భయాల్ని పోగొట్టేవాడు. దయామయుడు, విశాలమైన దీర్ఘమైన నేత్రాలు కలవాడు, శ్రేష్టమైనవాడు బాలుడు అయిన స్వామికి వందనం.
మనస్సులకి ఆనందాన్ని చేకూర్చే వాడు, భుజకీర్తుల్ని ధరించినవాడు అయిన స్వామికి నమస్మారం.
భయాన్ని పుట్టించే పతాకాన్ని ధరించిన వాడు, అత్యంత ప్రభావ శీలురచేత నమస్మారాలు అందుకొనేవాడు, ఘంటను ధరించినవాడు, వీర్యశాలి, క్రియాపరులైన వారికోసమే జన్మించిన మంగళ స్వరూపుడు, అయిన కుమారుడికి, నమస్మారం.
యజ్ఞపతి అయిన కుమార స్వామిని దేవతలంతా ఈవిధంగా స్తుతించి నమస్కరించారు. ఈ స్తోత్రం
ఎంతో మహిమాన్వితమైనది. దేవతలు చేసిన ఈ స్తోత్రం వినే కుమారస్వామి వారికి ప్రసన్నుడయ్యాడు.
నాలుగు యుగాల పరిమాణం
1. కృతయుగం: నాలుగువేల దివ్య వర్షాలు. కృతయుగం పరిమాణం నాలుగు వందల దివ్య వర్షాలు. దీనికి సంధ్య అంటే కాలం సంధ్యాశం. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలతో అధర్మం పావు భాగం కన్నా చాలా తక్కువగావుంటుంది. ఆ యుగంలో మానవులందరూ స్వధర్మనిరతులుగా వుంటారు. విప్రులు విప్రధర్మాన్ని, క్షత్రియులు క్షత్రియధర్నాన్ని వైశ్యులు వైశ్యధర్మాన్ని, శూద్రులు శూద్రధర్మాన్ని ఆచరిస్తూ సజ్జనులుగా వుంటారు. సత్యం, శౌచం, ధర్మం వృద్ధి చెందుతుంటుంది. సజ్జనులు ఆచరించే కర్మల్ని అందరూ మెచ్చుకుని తాము కూడా ఆచరించేవారు. నీచ కర్మలు ఆచరించేవారు కూడా తమ తప్పుల్ని తెలుసుకొని పరివర్తన పొందేవారు. ఈ విధంగా
కృతయుగంలో అందరూ సన్మార్గులు గానే వుండేవారు.
2. త్రేతాయుగం: మూడు వేల దివ్యవర్షాల పరిమాణం కలది త్రేతాయుగం. మూడువందల దివ్య వర్షాలు దానికి సంధ్య, అంతే సంఖ్యలో సంధ్యాశం వుంటుంది. ఈ యుగంలో మూడు పాదాలతో ధర్మం నడుస్తుంది. రెండు పాదాలకన్నా కాస్త తక్కువగా అధర్మం వుంటుంది. శాస్త్రాధ్యయనం. సత్యం, బలం, క్షమ, ధర్మం అనే వాటిని ఆ యుగంలో వున్నవారు ఆచరిస్తూవుంటారు. వీటివల్ల ఆ యుగంలో ప్రజలు దుర్బలులుగా మారుతారు. ఈ విధంగా త్రేతాయుగం వుంటుంది.
3. ద్వాపరయుగం: రెండువేల దివ్య వర్షాలు ద్వాపరయుగ పరిమాణం. రెండు వందల దివ్య వర్షాలు దాని సంధ్యాకాలం. అంతే పరిమాణం దానికి సంధ్యాశం. ఆయుగంలో మానవులంతా రజోగుణ వంతులై అర్థానికి ప్రాధాన్యత నిస్తారు. చాలా వరకూ క్షుద్రులు, మోసగాళ్ళు వుంటారు. ఆయుగంలో ధర్మం రెండుపాదాలతో వుండగా అధర్మం మూడు పాదాలకన్నా కాస్త తక్కువగా వుంటుంది. దీనివల్ల క్రమంగా కలియుగం వచ్చేసరికి ధర్మం క్షయమవుతుంది. ద్వాపరయుగం ముగిసేనాటికి క్రమక్రమంగా బ్రాహ్మణులమీద, వైదిక ధర్మాలమీద ఆసక్తి తగ్గుతుంది. అందరూ వ్రతాల్ని ఉపాసనల్ని విడిచిపెడతారు.
4. కలియుగం: అన్ని యుగాల కన్నా కలియుగం చాలా క్రూరంగా వుంటుంది. ఒక వేయి దివ్య వర్షాలు కలియుగ పరిమాణం. వంద దివ్య సంవత్సరాలు ఈ యుగానికి సంధ్యాకాలం. అంతే పరిమాణంలో సంధ్యాశం వుంటుంది. ఈ యుగంలో అధర్మం నాలుగు పాదాల్లో వుంటుంది. ధర్మం ఒక పాదం కన్నా కాస్త తక్కువగా వుంటుంది. మానవులందరూ కాముక ప్రవృత్తితో వుంటారు. తమోగుణ ప్రధానులై నాస్తికులుగా మారి నేనే సర్వసం అన్న అహంకారంతో వుంటారు. విప్రులందరూ శూద్రుల్లాగా ప్రవర్తిస్తారు. ఆశ్రమధర్మాలన్నీ వ్యత్యస్తంగా మారిపోతాయి. యుగం చివరి నాటికి అసలు వర్ణవ్యవస్థ వుంటుందా లేదా అనిపిస్తుంది.
ప్రళయం: పన్నెండు దివ్యవర్షాలు ఒక చతుర్యుగం. వేయి చతుర్యుగాలు బ్రహ్మ దేవుడికి ఒక పగలు. ఆ పగలు గడవగానే సకల ప్రాణులు శరీరాల్ని నాశనం చేసి, లోక సంహారం చేయాలనే సంకల్పంతో మహాభూతాలకి అధిపతి అయిన నారాయణుడు, సర్వదేవతలు, దైత్యదానవ, యక్షరాక్షస పక్షి గంధర్వాదులు, పర్వతాలు, నదులు సమస్త క్రిమి కీటకాది ప్రాణులు, జడపదార్థాల నుంచి పంచభూతాలని ఉపసంహరిస్తాడు.
సృష్టి సంహారం కోసం ఎంతో హింసని చేస్తాడు. ఆ విధంగా వాయువుగా మారి ప్రాణుల్ని ఉపహరించి, అగ్నిలా మారి సకలలోకాల్నీ దహించి, చివరికి భయంకరమైన మేఘాలుగా మారి కుంభవృష్టి కురిపిస్తాడు.
అంధకాసుర సంహారం
పూర్వం 'అంధకుడు' అనే రాక్షసుడుండేవాడు. నల్లని కాటుక కొండలాంటి శరీరంతో మహా భయంకరంగా కనిపించేవాడు. గొప్ప తపస్సంపన్నుడు. దేవతలకి కూడా అసాధ్యుడు. ఒకనాడు ఆ అంధకాసురుడు పార్వతీ దేవితో విహరిస్తున్న శివుణ్ణి చూసాడు. అకారణంగా శివుడి మీద అతడికి ద్వేషం కలిగింది. ఎలాగైనా శంకరుణ్జి సంహరించాలనుకున్నాడు. అవంతీదేశంలో వున్న ఘోరమైన మహాకాలవనంలో అంధకాసురుడికి, పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అంధకాసురుడి వల్ల శివుడికి చాలా బాధ కలిగింది. కొంత సమయం యుద్ధం గడిచాక ఆగ్రహంతో శివుడు తన పాశుపతాస్త్రాన్ని అంధకుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకి అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తం నుంచి తిరిగి ఎన్నో వేల మంది అంధకాసురులు పుట్టుకురాసాగారు.
ఆవిధంగా కొత్తగా ఎంతో మందిఅంధకాసురులు పుట్టుకు రావటంతో వచ్చిన వారందరినీ సంహరించి, ఆ అంధకుడి రక్తాన్ని త్రాగటానికి శివుడు మాతృకలు అనే దేవతల్ని సృష్టించాడు. వారెవరంటే!
189 మాతృకాశక్తులు: మహేశ్వరీ, బ్రహ్మీ కౌమారీ, మాలినీ, సౌవర్ణీ, వాయవ్యా, శాక్రీ, వైనాయకీ, సౌరీ, సౌమ్యా, శివదూతీ, చాముండా, వారుణీ, వారాహీ, నారసింహీ, వైష్ణవీ, చలచ్చిఖీ, శతానందా, భగానందా, పిచ్చిలా, భగమాలినీ, బలా, అతిబలా, రక్తసురభీ, సుఖమండికా, మాతృనందా, సునందా, బిడాలీ, శకునీ, రైవతీ, శంకరీ, చంద్రా, లాంగలీ, కుదినీ, జయా, విజయా, జయంతీ, అపరాజితా, కాళీ, మహాకాళీ, దూతీ, సుభగా, దుర్భగా, కరాళీ, నందినీ అదితి, దితీ, మాలీ, మృత్యు, కర్ణమోటీ, యామ్యా, ఉలూఖీ, ఘటోదరీ, వజ్రహస్తా, పిశాచీ, కపాలీ, రాక్షసీ, భుశుండీ, శాంకరీ, లంబా, చంద్రా, కరభా, ఘోటా, ధూమ్రా, వరవాణీ, సులోచనా, కరాళికా, విశాల దంష్ట్రిణీ, శ్యామా, త్రిజటి, కుక్కుటా, వినాయకీ, వైతాళీ, ఉన్మనా,జడబా, సిద్ధీ, లేలిహానా, కేసరీ, గర్ధభీ, ఉత్కటా, బహుపుత్రీ, ప్రేతయానా, విటంకినీ, క్రౌంచీ, శైలముఖీ, వినతా, సరమా, దసు, ఉమా, రంభా, మేనకా, సలిలా, చిత్రరూపిణీ, స్వధా, స్వాహా, వషట్కారా, ధృతీ, జ్యేష్ఠా, కపర్థినీ, మాయా, విచిత్రరూపా, కామరూపా, సంగమా, మహానావా, మహాముఖీ, కుమారీ, రోచనా, భీమా, దామా, మదోద్ధతా, లంబాక్షీ, కాలజిహ్వీ, కుంభకర్ణా, మహామారీ, మహాసురీ, కేశినీ, కుసఖీ, పింగళాక్షీ, తామసీ, ఉల్కా ముఖీ, ధూమ్రశాఖా, కంపినీ, పరికంపినీ, మోహినీ, కుండలీ, చంద్రా, నిర్భయా, బాహుశాలినీ, కరకర్ణీ, ఏకాక్షీ, విశోకా, నందినీ, జ్యోత్స్నా ముఖీ, రభసా, నికుంభా, రక్త కంపనా, అధికారా, మహాచిత్రా, చంద్రసేనా, మనోరమా, ఆదర్శనా, హరత్పాపా, మాతంగీ, లంబమేఖలా, అబలా, వంచనా, కాళీ, ప్రాణదాలాంగలావతీ, చిత్తా, చిత్తజలా, కోణా, శాంతికా, దృష్టిశాలినీ, లంబస్తనీ, లంబపటా, వినటా,
వాసచూర్ణినీ, స్థలంతీ, దీర్ఘకేశీ, సుచరీ, సుందరీ, శుభా, అయోముఖీ, కద్రుముఖీ, క్రోధనీ, అశనీ, కుటుంబికా, ముక్తికా, చంద్రికా, బాలమోహినీ, సామాన్యనహినీ, లంబాలకోవిదారీ, మానవీ, శంకుకర్ణీ, మహానాదా, మహాదేవీ, మహోదరీ, హంకారీ, రుద్ర సునటా, రుద్రేశీ, భూతడామరీ, పిండజిహ్వా, చలజ్జావలా, శివా, జ్వాలాముఖీ.
ఈ విధంగా మొత్తం 189 మంది మహాశక్తివంతమైన మాతృకలు శివుడిచేత సృష్టించబడి అంధకాసురుడి నుంచి కారుతున్న రక్తాన్ని త్రాగేసాయి. వాటికి అంధకుడి రక్తంతో ఎంతో తృప్తి కలిగింది. వారలా తృప్తి పడి కొంతసేపు ఆగారు. వెంటనే తిరిగి కొత్త అంధకాసురులు జన్మించి, శూలాలు, ముద్గరాలు ధరించి పరమేశ్వరుణ్ణి బాధించసాగారు. ఇక వాడి బాధ భరించలేక ఆయన వాసుదేవుణ్ణి శరణు వేడుకున్నాడు.
అప్పుడు విష్ణుమూర్తి వచ్చి “శుష్కరేవతి” అనే శక్తిని సృష్టించగా, అదివెళ్ళి అంధకుడి రక్తాన్ని త్రాగేసింది. ఆమె మహాశక్తి ఒక్కసారిగా అంధకుడి శరీరంలో వున్న రక్తాన్నంతా పీల్చేసింది. దానితో కొత్త అంధకాసురులు పుట్టటం ఆగిపోయింది. ఉన్న అంధకులందరినీ శివుడు సంహరించాడు. చివరికి అసలు అంధకుడిని తన త్రిశూలంతో పొడిచాడు.
అంధకుడు త్రిశూలంపోటుకి నేలమీదపడి మరణించబోతూ శివుణ్ణి ఎంతో భక్తిగా స్తుతించాడు. తనకి శివసాన్నిధ్యాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అంధకుడి ప్రార్థన విన్న శివుడు తథాస్తు అని అతన్ని అనుగ్రహించాడు. అంధకుడు సంతృప్తిగా కన్నుమూసాడు. శంకరుడు ఇచ్చిన మాట ప్రకారం, ఆ అంధకుడికి తన సాన్నిధ్యాన్ని, గణేశత్వాన్ని ప్రసాదించాడు.
మాతృకల గర్వాపహరణం: అంధకాసురుడు మరణించిన తరువాత రక్తంరుచి మరిగిన 189 మాతృకలు శంకరుడి దగ్గరకి వచ్చి “శంకరా! మాకు చాలా ఆకలిగా వుంది. మేము అందరం ప్రాణుల్ని భక్షిస్తాం మాకు అనుమతి నివ్వండి” అని కోరారు. ఘోరమైన వారి కోరిక విని శంకరుడికి మతిపోయింది. వారితో “మాతృకలారా! మీ ఆలోచన చాలా తప్పు. మీరంతా లోకాల్ని రక్షించాలి గానీ, ఇలా వారిని భక్షించాలని కోరుకోవటం దారుణం” అని అన్నాడు.
తామసగుణంతో నిండిన ఆ మాతృకాశక్తులు శంకరుడి మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా లోకాలన్నిటినీ భక్షించటం ప్రారంభించాయి. వారిని వారించలేక, తను సృష్టించిన మాతృకల్ని తానే సంహరించలేక శంకరుడు మనసులో - సకల సృష్టికి మూల భూతుడు, రక్తంతో పూయబడిన గోళ్ళు కలవాడు, పెద్దకోరలతో వున్నవాడు, మెరిసే జూలుకలవాడు, మహాసాగరంలా ధ్వని చేసేవాడు, చెవులదాకా నోరు తెరిచినవాడు, మేరు పర్వతంలా ప్రకాశించేవాడు, అగ్నిజ్వాలలాంటి వెంట్రుకలు కలవాడు అయిన నారసింహుణ్ణి స్మరించాడు. వెంటనే నరసింహుడు శంకరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దివ్య తేజోరూపం దేవతలకి కూడా చూడ శక్యంగా వుంది. ఆయన్ని చూసి శంకరుడు భక్తిగా ఇలా స్తుతించాడు.
శివుడు చేసిన నృసింహ స్తుతి
నమస్తేస్తు జగన్నాథ నరసింహవపుర్హరే ।
దైత్యనాథా సృజాపూర్ణ నఖపంక్తి విరాజిత ॥
జగత్సకల సంలగ్న హేమపింగళవిగ్రహ ।
నతోஉస్మి పద్మనాభ త్వాం సురశక్రజగద్గురో ॥
కల్పాంతాం భోధ నిర్ఘోష సూర్యకోటి సమప్రభ ।
సహస్ర పరమక్రోధ సహస్రేంద్ర పరాక్రమ ॥
సహస్రవదన స్ఫీత, సహస్రచరణాత్మక ।
సహస్రకాల రచిత సహస్ర నియతేంద్రి య ॥
సహస్రభూమి సద్ధైర్య సహస్రానంత మూర్తిమాన్ ।
సహస్ర చంద్ర ప్రతిమ సహస్ర గ్రహ విక్రమ ॥
సహస్రరుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్తుత ।
సహస్ర వాయు వేగోగ్ర సహస్రాక్ష నిరీక్షణ ।
సహస్ర యంత్ర మధన సహస్ర బంధమోచక ॥
(ఆధ్యా -.76 జ్లో-శ్లో-55,60)
జగన్నాథా! నరసింహ శరీరాన్ని ధరించినవాడా! రాక్షసనాథుడి రక్తంతో నిండిన గోళ్ళు అనే శక్త్యాయుధం కలిగినవాడా! నీకు నమస్మారం.
సకలజగత్తు నిండా వ్యాపించిన బంగారం లాంటి శరీరం కలిగినవాడా! ప్రళయకాల మేఘం ధ్వనిలాంటి నాదం కలవాడా! పద్మనాభా! దేవతలకి, ఇంద్రుడికీ సకల జగత్తుకీ తండ్రి అయినవాడా! సహస్ర విధాలుగా మహాక్రోధం కలిగినవాడా! వెయ్యి ఇంద్రులంత పరాక్రమం కలవాడా! వేయి ముఖాలతో సమృద్ధి కలిగినవాడా! వేయి పాదాలు కలవాడా! వేయి కాలాలని రచించేవాడా! వేయి ఇంద్రియాలని నిగ్రహించేవాడా! వెయ్యి భూలోకాలకీ ధైర్యాన్ని ఇచ్చేవాడా! వేయి రకాలుగా అనంతమైన మూర్తులుకలవాడా! వేయిచంద్రులతో సమానమైన వాడా! వేయిగ్రహాలని అధిగమించినవాడా! వేయి రుద్రులతో సమానమైన తేజస్సు కలవాడా! వేయి బ్రహ్మలతో స్తుతించబడేవాడా! సహస్రవాయు వేగంతో భయంకరంగావున్నవాడా! వేయి నేత్రాలతో చూసేవాడా! వేలాదియంత్రాల్ని మధించేవాడా! వేయిబంధాలనించి విడిపించేవాడా! నీకు నమస్కరిస్తున్నాను.
ఈవిధంగా నరసింహుణ్ణి భక్తిగా స్తుతించిన శంకరుడు ఆయనతో “స్వామీ, నేను సృష్టించిన మాతృకలు నామాటని లక్ష్య పెట్టకుండా లోకాల్ని భక్షిస్తున్నాయి. నా చేతులతో సృష్టించిన వాటిని నేనే నాశనం చేయలేక పోతున్నాను. కనుక నీవే వాటిని అదుపుచేయాలి” అని ప్రార్థించాడు.
శివుడు విన్నపాన్ని విన్న నృసింహుడు తన నాలుక నుంచి 'వాగీశ్వరి' ని హృదయం నుంచి 'మాయ' ని గుహ్యాంగం నుంచి 'భగమాలినిని', తన కాలి ఎముక నించి 'కాళి' ని సృష్టించాడు. ఈ నలుగురు మహాశక్తులు. వారిని సృష్టించిన తరువాత వారికి సహాయకులుగా మరో ముప్పై రెండు మంది దేవతా శక్తుల్ని కూడా సృష్టించాడు.
32 శక్తులు:
1.ఘంటాకర్ణీ 2. త్రైలోక్యమోహినీ 3.సర్వసత్త్వ వశంకరీ 4.చక్రహృదయా 5. కామచారిణీ 6.శంఖినీ 7. లేఖినీ 8. కాలసంఘర్షిణీ - ఈ ఎనిమిది మందీ వాగీశ్వరీ అనే మొదటి శక్తికి అనుచరులు.
1.సంకర్షిణీ 2. అశ్వద్దా 3.బీజభావా 4. అపరాజితా 5. కాల్యాణీ 6.మధుదంష్ట్రీ 7.కమలా 8.ఉత్పలహస్తికా అనే ఈ ఎనిమది మందీ రెండో మహాశక్తి అయిన మాయాదేవికి అనుచరులు.
1.అజితా 2. సూక్ష్మహృదయా 3.వృద్దా 4. వేశాశ్మదంశనా 5.నృసింహభైరవా 6.బిల్వా 7.గరుత్మద్ధృదయా 8.జయా అనే ఈ ఎనిమిది మంది మూడో మహాశక్తి అయిన భగమాలిని కి అనుచరులు.
1.ఆకర్షిణీ 2.సంకటా 3. ఉత్తరమాలికా 4. జ్వాలాముఖీ 5. భీషణికా 6.కామధేనూ 7.జాలికీ 8.పద్మకరా అనే ఈ ఎనిమిది మందీ నాలుగో మహాశక్తి అయిన కాళికి అనుచరులు.
ఈ ముప్పై రెండు మంది శక్తులన్నీ నృసింహుడి శరీరం నుంచి ఉద్భవించాయి. వీరంతా ముల్లోకాల్ని సృష్టించి సంహరించే నైపుణ్యం కలిగినవారు. నృసింహుడి ఆజ్ఞతో మహాశక్తులు, ముప్ప్ఫైరెండు శక్తులూ కలిసి రుద్రుడు సృష్టించిన 189 మంది మాతృకల మీద భీకరంగా దాడి చేసాయి. నృసింహశక్తుల ధాటికి రుద్రుడి మాతృకలు తట్టుకోలేక పరుగెత్తి వచ్చి నృసింహుణ్జి శరణు వేడుకున్నాయి. వారిని కరుణించిన నృసింహుడు వారితో ఇలా అన్నాడు.
మాతృకలారా! దేవతలందరూ మానవుల్ని ఎంతో దయతో పాలించాలి గానీ! వారిని భక్షించకూడదు. కనుక మీరు ఈ నాటి నుంచి నామాట ప్రకారం లోకాలన్నిటినీ పాలిస్తూ అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. శివభక్తులకీ, నా భక్తులకీ, మీకు బలులు సమర్పించే వారిని రక్షించండి. వారికీ ఏ బాధలు కలుగకుండా, వారికోరికలన్నిటినీ తీర్చండి. మీరందరూ రాబోయే కాలంలో మానవుల చేత పూజించబడతారు అని చెప్పి నృసింహుడు తాను సృష్టించిన శక్తులతో సహా అక్కడ నుంచి అంతర్దానమయ్యాడు.
నృసింహుడు అంతర్జానం అయిన చోట కృతశౌచం అనే దివ్య తీర్ధం ఏర్పడింది. సకల జగత్తులకన్నా ముందే వున్నవాడు, లోకాల ఆర్తిని పోగొట్టేవాడు అయిన శంకరుడు తను సృష్టించిన మాత్రుగణాలకి దివ్య మూర్తుల్ని ప్రసాదించి వాటిని అక్కడ స్థిరంగా ఉంచాడు. తాను కూడా కొంతకాలం ఆ మాతృకా గణాలతో పాటు ఆ సరోవర తీరంలోనే నివసించాడు. శంకరుడు ఆ మాతృ గణాలలోని ప్రధానమైన ఏడుగురు మాతృకల్ని పిలిచివారిని ఆరుద్రాస్థానంలో వుండేలా చేసి తాను మాతృకల మధ్యనుంచి అంతర్దానమయ్యాడు. ఆనాటి నుంచీ రుద్రమాతృకలు నృసింహుడు ఆజ్ఞాపించిన విధంగా శాంతంగా మారిపోయి లోకాల్ని రక్షించసాగాయి.
శివుడు కపాలి అయిన కథనం
ఒకనాడు పార్వతీదేవి ఏకాంతంలో పరమేశ్వరుడితో ప్రభూ! హిమవంతం, మందరం, గందమాదనం, కైలాసం, మేరు పర్వతం రమ్యమైన త్రికూటంలాంటి పర్వతాల మీద ఎన్నో దివ్యమైన సుందరమైన ప్రదేశాలుండగా వీటన్నిటినీ కాదని మీకు అవిముక్త క్షేత్రమైన వారణాసి అంటే ఎందుకు ఇష్టం? అని ప్రశ్నించింది.
శివుడు పార్వతితో "దేవీ! వారణాసి పుణ్యక్షేత్రం. ఇక్కడికి సిద్ధ గంధర్వుల చేత సేవించబడే గంగానది (త్రిపథ) ప్రవహిస్తోంది. అందుకే నాకు ఈ క్షేత్రం అంటే ప్రీతి. ఇది పరమపవిత్రమైన క్షేత్రం. ఇక్కడనేనెప్పుడూ నివసిస్తుంటాను. పాపులుగానీ, పాషండులుగానీ, వేదబాహ్యులుగానీ, అధర్మాల్ని ఆచరించేవారు కానీ అవిముక్త క్షేత్రాన్ని దర్శిస్తే వారి పాపాలనుంచి విముక్తి పొందుతారు. ప్రళయం సంభవించి సకల భూతాలూ నశించినప్పటికీ ఈ దివ్య క్షేత్రం నశించదు. నేను కూడా దీన్ని విడిచివుండను. దేవీ నీకు పరమ రహస్యం చెబుతావిను. వంద జన్మలు యోగం చేసినా సిద్ధిస్తుందో లేదో చెప్పలేము. అలాగే లక్ష జన్మలకైనా మోక్షం లభిస్తుందో లేదో సందేహమే అయితే అవిముక్తమైన ఈ వారణాసీ క్షేత్రంలో ప్రవేశించి అక్కడే నివసించువాడికి ఒక జన్మలోనే యోగం, మోక్షం రెండూ సిద్ధిస్తాయి. దీనితో సాటియైన క్షేత్రం మరొకటి లేదు. ఇక్కడ ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. కనుకనే ఇది నాలుగు వర్ణాల వారికీ గమ్యస్థానం.
పరమేశ్వరుడి మాటలువిన్న పార్వతి స్వామీ! మీరీ అవిముక్త క్షేత్రం గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా ఈ దివ్యక్షేత్రం ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలనుంది అని అడిగింది. దేవీ! నీకు మరో విషయం చెబుతున్నాను. పూర్వం బ్రహ్మదేవుడికి అయిదు తలలుండేవి. ఆయన అయిదో తల ఎంతో అందంగా బంగారు రంగులో ప్రకాసిస్తూండేది. అది చాలా శ్రేష్టమైనది. ఒకనాడు తన అయిదో తలతో బ్రహ్మ నన్ను అవహేళనగా మాట్లాడాడు. దానితో నాకు కోపం వచ్చి రక్తనేత్రాలతో ఆగ్రహంగా నా ఎడమ చేతి బొటన వేలి గోరుతో ఆయన అయిదో తలని తుంచేసాను. నేనలా చేయటంలో బ్రహ్మ “నా తలని తుంచి అపరాధం చేసిన నీవు కపాలాన్ని ధరించి తిరిగెదవుగాక! బ్రహ్మహత్యా దోషం చేసిన కారణంగా ఆకపాలంతో భూమండలమంతా సంచరించు” అని శాపమిచ్చాడు.
బ్రహ్మ శాపం విని నేను చేసేదేమీలేక కపాలాన్ని ధరించి వెంటనే అక్కడ నుంచి హిమవత్పర్వతం మీదకి వెళ్ళాను. అక్కడనుంచొని నారాయణుణ్జి ధ్యానించాను. ఆయన వెంటనే నాకు ప్రత్యక్షమై తన పార్శ్వాన్ని చీల్చాడు దాని నుంచి అనంతమైన రక్తధార ప్రవహించటం ప్రారంభమైంది. ఆ మహాధారలో ముంచినా నాచేతి లోవున్న కపాలం విడిపోలేదు. ఘోరమైన ఆరక్తధార వేయి దివ్య సహస్రాలపాటు అలా ప్రవహిస్తూనే వుంది. అది చూసి శ్రీహరికి ఆశ్చర్యం కలిగి "శంకరా! నీ చేతిలో వున్నటువంటి కపాలాన్ని నేనింత వరకూ చూడలేదు. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది?” అని ప్రశ్నించాడు.
"శ్రీహరీ పూర్వం బ్రహ్మదేవుడు లక్ష దివ్య సంవత్సరాలు కఠోరమైన తపస్సుచేసి దివ్యమైన శరీరాన్ని పొందాడు. అప్పుడే ఆయనికి ఉన్న నాలుగు తలలకి అదనంగా అందమైన అయిదోతల ఆవిర్భవించింది. ఆవేశంలో నేనా తలని తుంచేశాను. ఈకపాలం ఆ తలదే అందుకే అది నన్ను విడవకుండా అంటిపెట్టుకొనే వస్తుంది". అని జరిగిన విషయాన్ని చెప్పాడు శంకరుడు. అది విని "శంకరా! ఇక నేనేమీ చేసేది లేదు ఇది బ్రహ్మ హత్యాదోషం వల్ల సంక్రమించింది. కాబట్టి నీవు బ్రహ్మకి ప్రీతి కలిగి పనిచేయాలి. నీ చేతికి అంటిన ఆయనకపాలం ఏస్థలంలో నీ చేతి నుంచి విడిపోతుందో ఆ దివ్యస్థలాన్నే నీ నిత్యనివాసంగా చేసుకో" అని సలహా చెప్పి అదృశ్యమయ్యాడు.
తరువాత నేను ఆ కపాలాన్ని ధరించి ఎన్నెన్నో దివ్యక్షేత్రాలు, తీర్థాలు, పర్వతాలు అన్ని తిరిగాను. ఎక్కడా ఆ కపాలం నన్ను వదల్లేదు. చివరికి ఈ వారణాసి క్షేత్రానికి వచ్చిన వెంటనే నా చేతికి అంటినకపాలం వేయిముక్కలుగా చీలి వడిపోయింది. అది చూసి ఈ దివ్యక్షేత్రం బ్రహ్మహత్యా నివారకమైనదిగా గ్రహించాను. దేవీ ఈ అవిముక్త క్షేత్రం దేవతా శ్మశానం. ఇక్కడ నేను కాలుడి రూపంలోవుండి ఈ జగత్తునంతా సంహరిస్తూవుంటాను. అందుకే ఇది నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. నా మీద, విష్ణుమూర్తి మీద, ఆదిత్యుడి మీద అచంచలమైన భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దివ్యక్షేత్రానికి వెళ్ళగలరు. ఇక్కడ శరీరత్యాగం చేసినవారు సరాసరి నన్ను
చేరుకుంటారు. ఈవిధంగా పరమేశ్వరుడు పార్వతికి అవిముక్త క్త క్షేత్రమహాత్మ్యాన్ని తాను కపాలిగా మారిన కథనాన్ని చక్కగా వివరించాడు.
నర్మదా మాహాత్మ్యం
పూర్వం మార్కండేయమహర్షి ధర్మరాజుకి ఈ నర్మదానది మహాత్మ్యం గురించి ఇలా వివరించి చెప్పాడు ధర్మరాజా! ఖణకల క్షేత్రంలో గంగానది, కురుక్షేత్రం లో సరస్వతీ నది ఇతర ప్రదేశాలలో కంటే ఎంతో పుణ్యప్రదమైనవని చెబుతారు. అయితే నర్మదానది మాత్రం గ్రామాల్లో, అరణ్యాల్లో క్షేత్రాల్లో ఎక్కడ ప్రవహించినా అది పుణ్యప్రదమైనదే. మూడు రోజుల స్నానంతో సరస్వతీనది, ఏడురోజుల స్నానంతో యమునానది, ఒక్కరోజు స్నానంతో గంగానది మానవుల్ని పవిత్రం చేస్తాయి. నర్మదానది కేవలం దర్శనమాత్రం చేతనే మానవులకి పవిత్రతని కలిగిస్తుంది.
ధర్మజా! ఈ నర్మదానది కలింగదేశం సరిహద్దులోవున్న అమరకంటకం అనే ప్రాంతం నుంచి ప్రాదుద్భవించింది. ఈ ప్రాంతంలోనే ఎందరో సిద్దులు మహర్షులు, దేవతలు, దానవులు తపస్సుచేసి, సిద్దులు పొందారు. ఇక్కడ నర్మదా నదిలో స్నానం చేసి జితేంద్రియుడై ఒక్కరాత్రి ఉపవాసదీక్షతో గడిపితే గడిపినవాడి వంద తరాలవారూ తరిస్తారు. ఈ అమరకంటకంలో జలేశ్వరం అనే తీర్ధం వుంది. అందులో స్నానం చేసి పిండప్రదానాలు చేస్తే వారి పితరులకి ప్రళయకాలం దాకా తృప్తి కలుగుతుంది. ఈ అమరకంటక పర్వతం మీద మొత్తం కోటి మంది రుద్రులు ప్రతిష్టించబడివున్నారు. కనుక ఇక్కడ స్నానం ఆచరిస్తే కోటిరుద్రుల అనుగ్రహం మానవులకి కలుగుతుంది.
నర్మదానది మొత్తం వందయోజనాల పొడవు రెండు యోజనాల వెడల్పుతో వుంటుంది. అమరకంటక పర్వతమంతటా ప్రవహించే ఈ దివ్యనదికి మొత్తం అరవైకోట్ల అరవైవేల తీర్జాలున్నాయి. నర్శదానదీతీరంలో బ్రహ్మచారిగా శుచిగా వుంటూ క్రోధాన్ని జయించి, ఇంద్రియ నిగ్రహంతో సర్వభూతహితుడై నిత్యం శివారాధన చేస్తూ జీవించేవాడు ఇదే ప్రాంతంలో ప్రాణాలు విడిచిపెడితే అతడికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. అమరకంటకానికి తూర్పు అంచులో మహేశ్వరుడు స్వయంగా కొలువున్నాడు. ఆ ప్రాంతంలో శుచిగా, నియమబద్ధంగా పిండప్రదానం చేసి నర్మదా నదిలో తిలోదకాలు వదిలితే ఏడుతరాల వారు తరిస్తారు.
అమరకంటకానికి పడమటి అంచులో జలేశ్వరం అనే సరోవరం వుంది. ఆ సరోవరతీరంలో పిండప్రదానం చేసినా, సంధ్యోపాసన చేసినా వారి పితరులు పది తరాల వరకూ తృప్తి చెందుతారు.
నర్మదానదికి దక్షిణ తీరంలో కపిలా అనే నది వచ్చి కలుస్తుంది. ఆ కపిలానది కూడా ఎంతో పవిత్రమైనది. ఈ రెండూ కలిసిన ప్రాంతం ఎంతో విశిష్టమైనది. అక్కడ వందకోట్ల తీర్థాలు వచ్చి నర్మదాకపిలా సంగమంలో కలుస్తాయి. ఆ ప్రాంతంలో వున్న మక్షాలకి కూడా ఆ నదీజల స్పర్శవల్ల ఉత్తమగతులు కలుగుతాయి. అక్కడికి సమీపంలో 'విశల్యకరణి' అనేనది ప్రవహిస్తుంది. అందులో స్నానం చేసినవాడు తక్షణమే విశల్యుడు అనగా బాధలులేని వాడవుతాడు.
ధర్మరాజా! అమరకంటకం మీద నర్మదా నదితోపాటు ప్రవహించే 'కపిలా' 'విశల్యా' నదులు కూడా పరమపవిత్రమైనవి. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు కనుక ఆ నదుల్లో స్నానం ఆచరిస్తే అశ్వమేధయాగఫలం లభిస్తుంది. నర్మదానది ఉత్తరతీరంలో నివసించేవారు అంత్యకాలంలో రుద్రలోకానికి చేరుకుంటారు. సరస్వతీ, గంగా, నర్మదా, యమునా నదులలో స్నానదానాలు మోక్షప్రదాలని పరమేశ్వరుడు చెప్పాడు. నర్మదానదికి భక్తిగా నమస్కరించేవాడు సకలపాపాలనుంచీ విముక్తుడౌతాడు. నర్మదానది పుణ్యప్రదం. అక్కడ ఒకరాత్రి పగలు నివసించినవాడికి బ్రహ్మహత్యాదోషం కూడా తొలగిపోతుంది. గయాక్షేత్రంలో, హరిద్వారంలో గంగానది దగ్గర పుణ్యకర్మలు ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో నర్మదా సాగర సంగమం ప్రాంతంలో స్నానం, జపం, దానం చేసినవారికి అంతకు పదిరెట్లు పుణ్యఫలం లభిస్తుంది.
కావేరీ సంగమ మాహాత్మ్యం
ధర్మరాజు ఒకనాడు మార్మండేయమహర్షిని ఇలా అడిగాడు “తపోనిధీ! మాకు శుభం కలగటానికి, లోకాలకి హితం కలగటానికి, నిత్యం పాపాలు ఆచరించేవారు ఆపాపాల నుంచి విముక్తి పొందటానికి తగిన స్థానం కావేరీ సంగమ తీర్ధం అని పెద్దలు చెప్పారు. దయ చేసి ఆ కావేరీ సంగమ మాహాత్మ్యం గురించి చెప్పమని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. మార్మండేయమహార్షి ఇలా చెప్పటం ప్రారంభించాడు.
ధర్మరాజా! మహాపరాక్రమ వంతుడైన యక్షరాజు కుబేరుడు నీకు తెలుసు కదా! అతడు ఈ కావేరీ తీర్ధంలో స్నానం చేసినందువల్లే యక్షలోకానికి అధిపతి అయ్యాడు. ఈ కావేరినే కౌబేరి అనికూడా అంటారు.
లోకప్రసిద్ధమైన ఈ కావేరీ-నర్మదా నదీ సంగమం జరిగిన ప్రదేశంలో పూర్వం సత్యవిక్రముడైన కుబేరుడు స్నానంచేసి శుచిగా వంద దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేసాడు. కుబేరుడు చేసిన తపస్సుకి సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై కుబేరా! ఏ వరం ఆశించి ఈ తపస్సు ఆచరిస్తున్నావు? దాన్ని కోరుకో ప్రసాదిస్తానన్నాడు. కుబేరుడు ఆయనతో "స్వామీ! నేటినుంచీ సమస్త యక్షలోకానికీ అధిపతిని కావాలి" ఇదే నా కోరిక అన్నాడు. తథాస్తు! అని ఆశీర్వదించి శివుడు అదృశ్యమయ్యాడు. ఆనాటి నుంచి కుబేరుడు పరమేశ్వరుడి అనుగ్రహంతో సమస్త యక్షలోకానికి అధిపతిగా మారి వారందరి చేతా పూజలందుకున్నాడు.
సకల పాపాల్నీ పోగొట్టె కౌబేరీ (కావేరీ) నర్మదా సంగమ స్నానం ఫలితం గురించి తెలియనివాడు దురదృష్టవంతుడే. తెలిసి కూడా అక్కడ స్నానం చేయనివాడు మరీ దురదృష్ట వంతుడు. కనుక ప్రయత్నించి మరీ ఆ సంగమంలో స్నానం చేసి అక్కడవున్న పరమేశ్వరుణ్ణి అర్చిస్తే అశ్వమేధ ఫలం లభిస్తుంది. అక్కడ గనుక ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారికి పునరావృత్తి రహితమైన కైవల్యం లభిస్తుంది. ఆ సంగమంలో స్నానమాచరించినవారికి గంగా, యమునా నదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ధర్మజా! ఎంతో పుణ్యప్రదమైనదిగా కీర్తించబడ్డ ఈ కావేరీనది దక్షిణ దేశంలో వున్న కావేరీనది కాదు. నర్మదానదికి ఉపనది అయిన కౌబేరి. దీన్నే కొందరు కావేరీ అనికూడా వ్యవహరిస్తారు.
కావేరీ తీరంలో వున్న దివ్యతీర్ణాలు
1. మంత్రేశ్వర తీర్ధం : నర్మదానది ఉత్తరం ఒడ్డున ఒక యోజనం విస్తీర్ణంలో సర్వపాపహరమైన 'మంత్రేశ్వరం' అనే దివ్యతీర్ధం వుంది. ఆ తీర్థంలో స్నానం చేసిన వారు అయిదువేల సంవత్సరాలు కామరూపధారులై దేవతలతో చేరి సుఖభోగాలు అనుభవిస్తారు.
ఈ మంత్రేశ్వర తీర్థం వరిసర ప్రాంతాల్లో 1.గర్జనతీర్థం 2. అఘ్రాతకేశ్వరతీర్థం 3. బ్రహ్మావర్తతీర్ధం 4. గాణేశ్వరతీర్ధం 5. కపిలాతీర్థం 6. కరంజతీర్థం7. కుండలేశ తీర్ధం 7. పిప్పలేశతీర్థం 9. విమలేశ్వర తీర్ధం 10. పుష్కరతీర్థం ఉన్నాయి.
2. శూలభేదాది తీర్ధం : నర్మదా తీరంలో వున్న తీర్థాలలో శూల భేదన తీర్ధం విశిష్టమైనది. ఇక్కడ స్నానం చేసి త్రిరాత్ర దీక్షతో శివుణ్ణి అర్చిస్తే పునర్జన్మ వుండదు. వేయిగోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది.
ఈ శూలభేద తీర్థ పరిసరాలలో 1.భీమేశ్వర 2.నారదేశ్వర 3. ఆదిత్యేశ్వర 4. నందికేశ్వర 5.వారుణేశ్వర 6. స్వతంత్రేశ్వర 7.కోటితీర్ధం 8. రాజేంద్రతీర్థం 9. బలాకేశ్వర తీర్థం 10. శుక్రతీర్థం 11.ఋషితీర్ధం 12.రావణేశ్వర తీర్ధం 13.నదీసంగమతీర్థం 14.సోమతీర్థం 15. పింగళేశ్వర తీర్ధం 16.సురేశ్వర తీర్ధం 17. కర్కోటకేశ్వర తీర్ధం 18. నందితీర్థం 19. దీపేశ్వర తీర్ధం 20. వ్యాసతీర్ధం వంటి ఎన్నో దివ్యతీర్థాలు మహిమాన్వితమైనవి వున్నాయి.
3. శుక్ల తీర్ధం : వివిధరకాల గైరికాదిధాతువులతో బాలసూర్యుడిలా ప్రకాశించేది, బంగారు రంగుతో మెరిసిపోయేది. వజ్ర స్ఫటిక మణుల సోపానాలతో కూడుకున్నది అయిన హిమవత్పర్వతం మీద కొలువున్న శంకరుణ్ణి స్తుతించి "దేవా లోకంలో పరమ పవిత్రమైన దివ్యతీర్థం ఏది? అని మార్కండేయమహర్షి అడిగాడు. అప్పుడు శివుడు మార్కండేయా! సకల ఋషులు, మునులు, సిద్దులు నిత్యం సేవించేది నర్మదానదీతీరంలో వున్న శుక్ల తీర్ధం. ఆ దివ్యతీర్థం గంగా, యమునా, పుష్కర, గయా క్షేత్రాలలాగా పరమపవిత్రమైనది” అని చెప్పాడు.
ఈ శుక్ల తీర్ధం ఒక యోజనం విస్తీర్ణంలో గుండ్రంగా వుంటుంది. వైశాఖ, మాఘమాస కృష్ణ చతుర్ధశీ తిథుల్లో పరమేశ్వరుడు కైలాసం నుంచి వచ్చి ఈ తీర్ధంలో స్నానం చేస్తాడు. ఈ తీర్ధంలో ఆ సమయంలో స్నానం చేసినవారికి ఆ జన్మకృత పాపాలు నశిస్తాయి. కార్తీక కృష్ణ చతుర్ధశినాడు ఆ తీర్థంలో స్నానంచేసి శివుడికి నేతితో అభిషేకంచేస్తే ఇరవైఒక్క తరాలవారు తరిస్తారు.
ఈ శుక్ల తీర్థానికి సమీపంలో మరి కొన్ని మహిమాన్వితమైన దివ్య తీర్థాలున్నాయి. 1. నరకతీర్ధం 2.గణేశ్వరతీర్థం 3.ఋషితీర్ధం 4.గంగావదన తీర్ధం 5. దశాశ్వమేధతీర్థం 6. భృగుతీర్థం 7.గౌతమేశ్వరతీర్థం 8. ధౌతుపాపతీర్ధం 9. బదండీతీర్థం 10. హిరణ్యద్వీప తీర్ధం 11.కనఖలతీర్ధం 12.హంసతీర్థం 13.చంద్రతీర్థం 14.కన్యాతీర్థం 15. ద్వీపేశ్వరతీర్థం 16.రుద్రకన్యాసంగమ తీర్ధం 17.అంకుశేశ్వర తీర్ధం 18. నర్మదేశ్వరతీర్థం 19. అశ్వతీర్ధం 20. పైతామహతీర్థం 21.కురుతీర్థం 22.త్రిదశజ్యోతి తీర్థం 23. స్వర్ణబిందు తీర్థం 24. ఆషాఢీతీర్థం 25.కౌశికీ తీర్థం
నర్మదా తీర్ధ మాహాత్మ్య ఫలశ్రుతి
ఈవిధంగా పరమపావనమైన నదిగా, దర్శన మాత్రం చేతనే సకల జీవుల పాపాలనీ పోగొట్టేదిగా ప్రసిద్ధమైన నది నర్మదానది. ఈ నది జన్మస్థానమైన అమరకంటకం నుంచి సాగరసంగమందాకా మధ్యలో పదికోట్ల తీర్జాలున్నాయి. వీటిలో ప్రతి తీర్థానికీ మధ్యలో కోట్లాది ఋషులున్నారు. వారందరూ అక్కడ నిత్వాగ్ని హోత్రాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తుంటారు.
నర్మదానదీతీర్ధ మాహాత్మ్యాన్ని ఎవరు శ్రద్ధతో వింటారో, పఠిస్తారో అతన్ని ఈ నదీతీరంలోవున్న సమస్తతీర్ధాలూ అభిషేకిస్తాయి. అతడికి అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. నర్మదానది అనుగ్రహం అతడికి కలుగుతుంది. దీని శ్రవణం వల్ల పఠనం వల్ల విప్రులకి వేదాధ్యయనఫల క్షత్రియులకి రాజ్యఫలం, వైశ్యులకి ధనలాభం, శూద్రులకి సద్గతి లభిస్తాయి.
సప్తఋషుల గోత్రాలు ప్రవరలు
బ్రహ్మ మానసపుత్రులైన సప్తర్షులు ఏడుగురు. వీరితోపాటు ఎనిమిదో వాడుగా అగస్త్యమహర్షి కూడా పరిగణించబడ్డాడు. మొత్తం ఈ ఎనిమిది మంది ప్రధాన ఋషులకి గోత్రాలు ప్రవరులు ఉన్నాయి. బోధాయన ధర్మసూత్రంలో
విశ్వామిత్రో జమదగ్ని ర్భరద్వాజోஉధగౌతమః
అత్రిర్వశిష్టః కశ్యప ఇత్యేతే సప్తఋషయః ॥
సప్తానాం ఋషీణాం అగస్త్యాష్టమానాం ।
యదపత్యం తత్ గోత్రం ఇత్యాచక్షతే ॥
అని చెప్పిన ప్రకారం ఋషుల పురుషసంతానం అనగా కుమారులు వారి కుమారులు ఇలా తరాల పరంపరగా వారి గోత్రాలు వర్తిస్తాయి.
గోత్రాల గురించి చెప్పేడప్పుడు ప్రవరని అందులోని ఋషులని పేర్కొనటం సంప్రదాయం. ప్రవర అంటే-ఆయాగోత్రాలని ప్రవర్తిల్లచేసిన ఋషి అదేపేరుగల మరో ఋషినుంచి వేరు పరిచే సమూహం అని మాధవాచార్యులు చెప్పారు. అయితే అది కొంత దోషభూయిష్టంగా వుందని భావించి అనంత దేవుడనేవాడు “'స్మృతికౌస్తుభం” అనే గ్రంథంలో ఇలా చెప్పాడు.
ప్రవరణం- ప్రవర ఈ రెండు పదాలూ సమానార్థకాలు. ఈ పదాలకి ప్రార్థన అని అర్థం. ఆయాశ్రౌత స్మార్త కర్మానుష్ఠానాల్లో యజమాని స్వయంగా కానీ లేదా అతని పక్షాన యాగంచేసే ఋత్విక్కులు గానీ అగ్నిని ఉద్దేశించి ప్రార్థన చేయాలి (అదేప్రవర). ఆ ప్రార్థనలో చెప్పిన ఋషులే ప్రవర ఋషులు.
బుషుల జననం
పూర్వం వైవస్వత మన్వంతరంలో పరమేష్టి అయిన బ్రహ్మదేవుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వర్తించాడు. ఆయజ్ఞ గుండంలోని అగ్నినుంచి మహా తేజస్వి అయిన 1.భృగుమహర్షి మొదట ఆవిర్భవించాడు. తరువాత నిప్పు కణికల నుంచి 2. అంగిరసమహర్షి, జ్వాలల నుంచి 3.అత్రిమహర్షి, తేజోకిరణాల నుంచి 4.మరీచిమహర్షి, కేశాలనుంచి 5.కశ్యపమహర్షి, 6. పులస్త్యుడు వేలాడే కేశాల కొనల నుంచి 7.పులహుడు, అగ్ని మధ్యలోనించి 8. వశిష్ఠమహర్షి జన్మించారు. వీరంతా గొప్ప తపస్సంపన్నులు.
ఈ మహర్షుల్లో మొదటీవాడైన భృగువు పులోముడనే రాక్షసుడి కూతురైన పౌలోమి అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమెద్వారా భృగు మహర్షికి యజ్ఞసంపన్నులైన 1.భువనుడు 2.భౌవనుడు 3.వసుజన్యుడు 4.సుజనుడు 5.శుచి 6. క్రతువు 7.మూర్థన్ 8.యాజ్యుడు 9.వసుధుడు10.ప్రభవుడు 11.అవ్యయుడు 12. దక్షుడు అనే పన్నెండు మంది కుమారులు జన్మించారు.
ఈ పన్నెండు మందీ దేవర్షులుగానే పూజించబడ్డారు. అలాగే భృగుమహార్షికి పౌలోమిద్వారా కొంతకాలానికి ఇద్దరు పుత్రులు జన్మించారు. 1.చ్యవనుడు 2.అప్నువానుడు అనేవారు. వీరిలో అప్పువానుడి కుమారుడు జేర్యుడు, జేర్యుడికుమారుడు జమదగ్ని మహర్షి
1. భృగు మహర్షి గోత్ర ప్రవరలు : మహాత్ముడైన భృగువంశం వారిలో 'జేరుడు' గోత్ర ప్రతిష్ఠాపరుడు. ఈ భృగువంశంలో మొత్తం ఆరువర్గాలున్నాయి. ఈ ఆరువర్గాలలోని ఋషులకి (గోత్రాలవారికి) ఆరు రకాలుగా ప్రవర ఋషులుంటారు.
మొదటి వర్గంలోని గోత్రాల వారికి 1.భృగువు. 2. చ్యవనుడు 3.అప్నువానుడు 4. జేర్యుడు 5.జమదగ్ని అనే అయిదు మంది మహర్షులు ప్రవరఋషులు.
రెండో వర్గంలోని గోత్రాల వారికి 1. భృగువు 2.చ్యవనుడు 3.అప్నువానుడు ప్రవరఋషులు.
మూడో వర్గంలోని గోత్రాల వారికి 1.భృగువు. 2. చ్యవనుడు 3. అప్పువానుడు 4.అర్షిషేణుడు 5.రూపి ప్రవరఋషులు.
నాలుగో వర్గంలోని గోత్రాల వారికి 1.భృగువు. 2.వీతహవ్యుడు 3.వేతనుడు అనేవారు గోత్ర ఋషులు.
అయిదో వర్గంలోని గోత్రాల వారికి 1.భృగువు. 2.షద్వ్రర్యుడు 3. దివోదాసుడు 4.అర్షిషేణుడు 5.రూపి అనేవారు గోత్ర ఋషులు.
ఆరో వర్గం వారికి 1.భృగువు. 2. గృత్సమదుడు ప్రవరఋషులు. వీరిలో పరస్పరం ఒకే గోత్రాల వారు వివాహం చేసుకోకూడదు.
2. అంగిరస ఋషిగోత్ర ప్రవరలు : అంగిరస మహర్షి మరీచి అనే ప్రజాపతి కుమార్తె 'సురూప' అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి పదిమంది దేవతలు జన్మించారు. వారు 1.ఆత్మ 2.ఆయువు 3.దమనుడు 4. దక్షుడు 5.సదుడు 6.ప్రాణుడు 7.హవిష్మాన్ 8.గవిష్టుడు 9.ఋతుడు 10.సత్యుడు- వీరందరినీ అంగిరసులంటారు. ఈ దేవతలందరూ యజ్ఞాల్లో సోమపానాన్ని చేస్తారు.
అంగిరసమహర్షికి సురూపద్వారా మరికొంతమంది ఈశ్వర తత్పరులైన ఋషులు జన్మించారు. వారు 1.బృహస్పతి 2.గౌతముడు 3.సంవర్తనుడు 4. ఉపథ్యుడు 5.వామదేవుడు 6. అజస్యుడు 7.ఋషిజుడు - ఈ ఋషులంధరూ అంగిరగోత్ర ప్రతిష్ఠాపకులు. ఈ అంగిరస ఋషి వంశంలో మొత్తం 14వర్గాలున్నాయి. ఈ 14 వర్గాలలోని గోత్రాల వారికీ (ఋషులకీ) 14రకాలుగా ప్రవర ఋషులంటారు.
మొదటి వర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1. అంగిరసుడు 2. ఉదథ్యుడు 3.గౌతముడు అనేవారు ప్రవరఋషులు
రెండవవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2. బృహస్పతి 3.భరద్వాజుడు అనేవారు ప్రవరఋషులు
మూడవవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2.బృహస్పతి 3.భరద్వాజుడు 4.గర్గుడు 5. శైన్యుడు అనే అయిదుగురు ప్రవరఋషులు.
నాలుగోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1. అంగిరసుడు 2. దమబాహ్యుడు 3. ఉరఃక్షయుడు అనే ముగ్గురు ప్రవరఋషులు
అయిదో వర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2. సంకృతి 3. గౌరవీతి అనేవారు ప్రవరఋషులు
ఆరోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2.బృహదుఃఖుడు 3.వామదేవుడు ప్రవరఋషులు
ఏడోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2.సదస్యుడు 3.పురుకుత్సుడు అనేవారు ప్రవరఋషులు
ఎనిమిదోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1. అంగిరసుడు 2. విరూపుడు 3.రథీతరుడు ప్రవరఋషులు
తొమ్మిదోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1. అంగిరసుడు 2. విరూపుడు 3.వృషపర్వుడు ప్రవరఋషులు
పదోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2. మత్స్యదగ్ధుడు 3.ముద్గలుడు అనేవారు ప్రవరఋషులు
పదకొందోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2. అజమీఢుడు 3.కాట్యుడు అనేవారు ప్రవరఋషులు
పన్నెండోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1.అంగిరసుడు 2. తిత్తిరి 3.కవిభూ అనేవారు గోత్ర ఋషులు
పదమూడోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1. అంగిరసుడు 2. భరద్వాజుడు 3.బృహస్పతి 4.మిత్రవరుడు 5.మానవుడు అనేవారు ప్రవరఋషులు.
పద్నాలుగోవర్గం : ఇందులో వున్న గోత్రాల వారికి 1. అంగిరసుడు 2. భరద్వాజుడు 3.బృహస్పతి
4.మౌద్గల్యుడు 5. శైశిరి అనేవారు గోత్రఋషులు
3. అత్రిమహర్షి గోత్రప్రవరలు : అత్రి మహర్షి వంశంలో మొత్తం మూడు వర్గాలవారున్నారు.
మొదటి వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.అత్రి 2. శ్యానాశ్వుడు 3.అర్చనాసనుడు అనేవారు ప్రవరఋషులు
రెండో వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.అత్రి 2. గవిష్ఠిరుడు 3.పూర్వాతిథి అనేవారు ప్రవరఋషులు
మూడో వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.అత్రి 2. వామరథ్యుడు 3.మైత్రి అనేవారు ప్రవరఋషులు
4. విశ్వామిత్ర మహర్షి గోత్ర ప్రవరలు : అత్రికుమారుడైన సోముడి వంశంలో వున్న విశ్వామిత్రుడు దీర్ఘతపస్సుచేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు. ఈ విశ్వామిత్ర వంశంలో ఎనిమిది వర్గాల ఋషులు వున్నారు. వారికి ఎనిమిది రకాలుగా ప్రవర ఋషులుంటారు.
మొదటి వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.విశ్వామిత్రుడు 2. దేవరాతుడు 3. ఉద్దాలుడు ప్రవరఋషులు
రెండో వర్గం: ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.దేవశ్రవుడు 2. విశ్వామిత్రుడు 3.దేవరాతుడు అనేవారు ప్రవరఋషులు
మూడోవర్గం : ఈవర్గంలో వున్న గోత్రాల వారికి 1. విశ్వామిత్రుడు 2. మధుచ్చందుడు
3. అఘమర్షణుడు అనేవారు ప్రవరఋషులు
నాలుగో వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1. విశ్వామిత్రుడు 2. పూరణుడు అనేవారు ప్రవరఋషులు
ఐదో వర్గం : ఈ వర్ణంలో వున్న గోత్రాల వారికి 1. విశ్వామిత్రుడు 2. అశ్మరథ్యుడు 3.మంజులి అనేవారు ప్రవరఋషులు
ఆరో వర్గం: ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.విశ్వామిత్రుడు 2.పూరణుడు అనే ఇద్దరూ ప్రవరఋషులు
ఏడో వర్గం: ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1. విశ్వామిత్రుడు 2. లోహితుడు 3.అష్టకుడు గోత్రఋషులు
ఎనిమిదో వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.ఖిలఖిలి 2. విశ్వామిత్రుడు 3.విద్యుడు అనే ముగ్గురు గోత్రఋషులు.
5. కశ్యపమహార్షి గోత్రప్రవరలు : కశ్యపమహర్షి వంశంలో కేవలం ఒకే వర్గం వుంది. ఇందులో మొత్తం ఏభైఎనిమిది గోత్రాల ఋషులున్నారు. వీరందరికీ 1.కశ్యపుడు 2.విధ్రువుడు అనేఇద్దరూ గోత్ర ఋషులుగా వుంటారు.
6. వశిష్ఠ మహర్షి గోత్రప్రవరలు : వశిష్ఠ మహర్షి వంశంలో నాలుగు వర్గాల వారున్నారు. ఈ నాలుగు వర్గాలలో వున్న గోత్రాలవారందరికీ నాలుగు రకాలుగా ప్రవరఋషులుంటారు.
మొదటివర్గం :ఈ వర్గంలో వున్న గోత్రాల వారందరికీ వశిష్టమవర్షి ఒక్కడే ప్రవరఋషి
రెండో వర్గం “ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.భవద్వసుడు 2. వశిష్ఠుడు 3.ఇంద్రప్రమదుడు అనే ముగ్గురూ గోత్ర ఋషులు.
మూడోవర్గం "ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1. వశిష్టుడు 2.మిత్రావరుణుడు 3.కుండినుడు అనే ముగ్గురూ గోత్ర ఋషులు
నాలుగో వర్గం : ఈ వర్గంలో వున్న గోత్రాల వారికి 1.వశిష్ఠుడు 2.అత్రి అనే ఇద్దరు గోత్ర ఋషులు
7. పరాశర మహర్షి గోత్రప్రవరలు : పరాశర మహర్షి వంశంలో మొత్తం అయిదు వర్గాలున్నాయి. ఈ అయిదు వర్గాలలో ఒక్కో వర్గంలో అయిదుగురు గోత్రాలవారు (మహర్షులు) వున్నారు. ఈ అన్ని వర్గాలవారికీ 1.పరాశరుడు 2.శక్తి 3.వశిష్ఠుడు ప్రవర ఋషులు.
8. అగస్త మహర్షి గోత్ర ప్రవరలు : అగస్త్య మహర్షి వంశంలో కేవలం రెండు వర్షాలు మాత్రమే ఉన్నాయి.
మొదటివర్గం ఈ వర్గంలో మొత్తం పదిమంది గోత్రాలు వారు (మహర్షులున్నారు) వీరికి 1.అగస్త్యుడు 2. మహేంద్రుడు 3.మయోభవుడు అనే ముగ్గురు గోత్ర ఋషులు
రెండో వర్గం: ఈ వర్గంలో ఇద్దరే గోత్రాల వారు (మహర్షులు) ఉన్నారు వీరికి 1.అగస్త్యుడు 2.పౌర్ణమానుడు 3.పారణుడు అనేవారు గోత్ర ఋషులు (ఈ చెప్పిన అందరూ ఋషులు గోత్రాలవారు పరస్పరం వివాహం చేసుకోకూడదు)
ఉభయతోముఖ గోదానం
ఉభయతో ముఖగోదానం అంటే అప్పుడే ఈనుతున్న ఆవుని దానం చెయ్యటం. ఈ దానాన్ని ఏవిధంగా చెయ్యాలంటే! ప్రసవిస్తున్న ధేనువుకి బంగారు కొమ్ములతో, వెండి గిట్టలతో, ముత్యాల తోకతో, కంచుతో చేసిన పాలు పితికేపాత్రతో, దూడతో సహా యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. అలా చేసిన వాడికి అఖండమైన పుణ్యం లభిస్తుంది.
దూడ ఇంకా సగంలోపలే వుండి గర్భం విడవనంత వరకూ ఆ గోవు పర్వతాలతో నదులతో, సముద్రాలతో కూడిన భూమండలంతో సమానం. ఇలాంటి ధేనువుని తగిన దక్షిణతో సహా దానం చేస్తే నాలుగు సముద్రాలు హద్దుగా వున్న సమస్త భూమండలాన్నీ దానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఆ ప్రసవించే ఆవుకి దాని దూడకి ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని మహా యుగాల వరకూ స్వర్గలోకనివాసం లభిస్తుంది. మంచి దక్షిణతో ప్రసవిస్తున్న ధేనువుని దానం చేస్తే పితృ పితామహ ప్రపితామహులు తరిస్తారు. ఈనుచున్న ఆవుకి వెనక వైపునుంచి మొదట దూడతల బైటికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ ఆవు చూడటానికి రెండుతలలతో కనిపిస్తుంది. అందుకే దీన్ని ఉభయతోముఖీ గోదానం అంటారు.
కృష్ణాజిన (జంకచర్మం) దానం
కృష్ణాజినం అంటే నల్లటి మచ్చలున్న జింకచర్మం. వైశాఖపూర్ణిమ (గురుపూర్ణిమ) చంద్ర-సూర్యగ్రహణాలు, మాఘపూర్ణిమ, ఆషాఢ, కార్తీక పూర్ణిమలు, ఉత్తరాయన - దక్షిణాయనాలు, ద్వాదశితిథి ఈ రోజుల్లో కృష్ణాజనాన్ని విప్రుడికి దానం చేస్తే మంచిది. ఈ కృష్ణాజినాన్ని ఏవిధంగా దానం చేయాలంటే
ముందుగా గోమయంతో(ఆవుపేడతో) నేలని శుభ్రంగా అలికి అక్కడ మంచి తివాచీని పరచాలి. కొమ్ములు, గిట్టలతో వున్న కృష్ణాజినాన్ని దానిమీద పరిచి,ఆ జింక కొమ్ములకి బంగారుతొడుగులు, వెండి దంతాలు, ముత్యాలతో, నూలుతోక కుచ్చుని అమర్చి నూవులతో ఆ చర్మాన్ని కప్పి దానిమీద నూతన వస్త్రాలని ఉంచి బంగారంతో రత్నాలతో గంధంతో అలంకరించాలి. ఈ ఆసనం చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు కాంస్య పాత్రల్ని ఉంచాలి. అలాగే నాలుగు మట్టి పాత్రలు కూడా వీటిలో తూర్చునించి వరుసగా నేయి, పాలు, పెరుగు, తేనె పోయాలి. వీటికి బైట ఒక సంపెంగ కొమ్మని, రంధ్రంలేని మంచి కడవని ఉంచాలి.
ఈ జింక చర్మానికి అన్ని అంగాలలో వేరువేరుగా కొత్త పసుపుపచ్చని వస్త్రాల్ని పాదాల దగ్గర మట్టి పాత్రల్ని ఉంచాలి. "నేను లోభంతో చేసిన అన్నిరకాల పాపాలు ఈ లోహపాత్రదానం వల్ల వెంటనే నశించుగాక" అని మనసులో అనుకుని ఒక లోహ పాత్రని జింక ఎడమపాదంపై నువ్వులతో నింపి ఉంచాలి.
"నేను కామవశాన చేసిన పాపాలన్నీ నేను చేసే ఈ కాంస్య (కంచు) పాత్ర దానంతో నశించుగాక" అని అనుకుని జింక చర్మం కుడిపాదం దగ్గర తేనెతో నింపిన కాంస్య పాత్రని ఉంచాలి
"ఇతరుల్ని నిందించటం, చాడీలు చెప్పటం మాంస భక్షణం వంటి పాపాలు నేను చేసే ఈ తామ్ర (రాగి) పాత్ర దానంతో నశించి పోవుగాక!” అని భావిస్తూ ఒక రాగి పాత్రని అదేవిధంగా "స్త్రీల విషయంలో అబద్దాలు చెప్పటం, గోవుల్ని అపహరించటం నేను చేసే ఈ వెండి పాత్ర ద్వారా నశించుగాక! అని పలికి ఈ రాగి, వెండి పాత్రల్ని జింక చర్మం ఎడమకుడి పాదాల దగ్గర వుంచాలి.
వేయి జన్మాంతరాలలో నేనుచేసిన పాపమంతా నేను ఇచ్చే సువర్ణపాత్ర దానం ద్వారా నశించుగాక! అని భావించుకుని జనార్ధనా నీకు నమస్మారం అని విష్ణువుని ప్రార్థించి ఒక బంగారు పాత్రని లేడి చర్మం దగ్గర ఉంచాలి. బంగారం, ముత్యాలు, పగడాలు, దానిమ్మపళ్ళు, మాదీఫలాలు, ఒక మంచిపాత్రలో వుంచాలి. అలాగే జింక చర్మానికున్న చెవులు, గిట్టలు, కొమ్ములు మధ్య భాగంలో కూరలు ఇతరఫలాలు ఉంచాలి.
ఈ విధంగా అలంకరించిన జింక చర్మాన్ని దానంగా గ్రహించాలనుకునే బ్రాహ్మణుడు స్నానంచేసి కొత్త పంచెని ధరించి యథాశక్తిగా అలంకరించుకోవాలి. ఈ దానాన్ని ఆ విప్రుడు జింక చర్మంతోక వైపు వుండి గ్రహించాలి. దానమంత్రం "ఓ నల్లని కృష్ణాజినమా నల్లని కంఠం కలిగిన వాడు, కృష్ణాజినాన్ని ధరించినవాడు అయిన వృషభధ్వజుడు ఈ దానంతో సంప్రీతుడవుగాక! నా పాపాలన్నీ నశించిపోవుగాక!" అని పఠించి దానం ఇవ్వాలి.
ఈ విధంగా కృష్ణాజినాన్ని దానం చేసిన తరువాత దానం పుచ్చుకున్న విప్రుణ్ణి తాకకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అతడు చితిలోవున్న యూపకాష్ఠం(కాలేకట్టెతో)సమానం. దానం చేసే సమయంలో శ్రాద్ధకాలంలో బ్రాహ్మణ్ణి తాకకుండా దూరంగావుండాలి. తరువాత దానంపుచ్చుకున్న విప్రుణ్ణి సగౌరవంగా ఇంటికి పంపి దాత మంగళస్నానం చేయాలి. ఎలాగంటే! చంపక వృక్షం కొమ్మతో వున్న కుంభంలోని నీళ్ళతో ఆచార్యుడు దాత తలమీద "ఆప్యాయస్వ" సముద్ర జ్యేష్ఠా? అనే మంత్రాలు చదువుతూ జలాన్ని ప్రోక్షించాలి. తరువాత దాత నూతన వస్త్రాలని ధరించి ఆచమనం చేస్తే శుచివంతుడవుతాడు. ఇక ఆ కుంభంలో మిగిలిన నీళ్ళని అందులోని కొమ్మల్ని నాలుగు దోవలు కలిసేచోట పారవేయాలి.
ఈ విధంగా శాస్త్రోక్తంగా శ్రద్ధాభక్తులతో కృష్ణాజిన దానం చేస్తే కలిగే ఫలితం, భగవత్ప్రీతి ఇంత అని చెప్పటానికి దేవతలకి కూడా సాధ్యంకాదు. దీనివల్ల సమగ్రంగా భూదానం చేసిన ఫలితం లభిస్తుంది. కామరూపధారియై స్వర్గానికి చేరుకోగలడు. ప్రకయాంతం వరకూ స్వర్గసుఖాలు అనుభవించగలడు.
అతడికి ఎప్పటికీ భార్యా పుత్రులతో, మిత్రులతో వియోగం సంభవించదు. ధనత్యాగం, దేశత్యాగం చేయవలసిన అవసరం ఏర్పడదు. కృష్ణుడికి ఇష్టమైన ఈ కృష్ణమృగచర్మాన్ని యోగ్యుడైన విప్రుడికి దానంచేస్తే శోకరాహిత్యం, సర్వాభీష్టసిద్ధి కలుగుతాయి.
సతీసావిత్రి చరిత్ర
పూర్వం మద్ర దేశానికి అధిపతిగా శాకలవంశానికి చెందిన అశ్వపతి అనేరాజుండేవాడు. అతడికి పుత్ర సంతానం లేదు. అందుకోసం ఆ రాజు సర్వకామప్రదాయినిగా ద్విజుల్ని రక్షించే సావిత్రీ దేవిని ఆరాధించాడు. వందమంది ఋత్విక్కులతో పదినెలలపాటు తెల్లని ఆవాలతో ఆదేవిని ఉద్దేశించి హోమం చేయించాడు. అలా చేసిన తరువాత ఒకనాడు చతుర్ధితిథిరోజు సావిత్రీదేవి ఆరాజుకి సాక్షాత్మరించింది. అతడితో "రాజా నీ దీక్షకి నాకు సంతోషం కలిగింది. అయితే నీకు నేను పుత్రుణ్ణికాదు యోగ్యురాలైన పుత్రికని ప్రసాదిస్తున్నాను" అని వరాన్ని అనుగ్రహించి అదృశ్యమయ్యింది. తరువాత కొంతకాలానికి అశ్వపతికి అతని భార్యమాలతికి సుందరమైన కుమార్తె ఉదయించింది. సావిత్రీదేవి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆమెకి సావిత్రి అని నామకరణం చేసారు.
సావిత్రీ గుణరూప శీలాలలో ఎంతోగొప్పది. క్రమంగా ఆమె యుక్తవయసుకి వచ్చాక సత్యవంతుడనే యువకుడికిచ్చి వివాహం చేయాలని భావించాడు అశ్వపతి. అప్పుడు నారదమహర్షి అశ్వపతి దగ్గరకి వచ్చి "రాజా! ఈ సత్యవంతుడు ఒక సంవత్సరంలో మరణిస్తాడు. అతడికి ప్రాణగండం వుంది అని హెచ్చరించాడు. అయినా ఆ మాటల్ని పట్టించుకోకుండా తన కుమార్తెని సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించాడు. వివాహం జరిగిన తరువాత సావిత్రి భర్తని అనుసరించి వెళ్ళీ ఒక అడవిలో రాజ్యం కోల్పోయి తలదాచుకున్న తన అత్తమామలకి శుశ్రూషలు చేయసాగింది. సత్యవంతుడి తండ్రి ద్యుమత్సేనుడు రాజ్య భ్రష్టుడై కళ్ళని కోల్పోయాడు. తనకి కోడలు వచ్చినప్పటికీ ఆమెకీ తమలాగా కష్టాలు తప్పటంలేదని మనసులో ఎంతో బాధపడ్డాడు.
సావిత్రికి నారదమహర్షి చెప్పిన మాటలు గుర్తున్నాయి. తన భర్తకి అతిత్వరలో ప్రాణగండముందని తెలిసి మనసులో ఎంతో వేదన అనుభవించింది. నారదుడు చెప్పిన సంవత్సరకాలం గడువు ముగియబోతోంది. మరొక్క నాలుగు రోజులే సమయం వుంది. వెంటనే ధర్మజ్ఞురాలైన సావిత్రి వరసగా మూడు రోజులు అహోరాత్రాలు ఉపవాసం చేసింది. నాలుగోరోజున అందమైన పూలని అలంకారంగా ధరించి మంచిఫలాల్ని భుజించి తన భర్త సత్యవంతుణ్ణి తీసుకుని అడవిలోపలికి వెళ్ళింది. అక్కడ ఒక వృక్షం నీడలో ఇద్దరూ కూర్చున్నారు.
సావిత్రి "స్వామీ! మీకు ఇప్పుడు ఒంట్లో ఎలా వుంది?" అని అడిగింది. “కొంచెం శ్రమగా వుంది". అన్నాడు సత్యవంతుడు. సరే కొద్దిసేపు విశ్రమించండి అని అతడికి పాద సేవ చేయసాగింది. కొద్ది సేపటి తరువాత తేరుకున్న సత్యవంతుడు పైకి లేచి "దేవీ! నీవు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. మనం పూలని, పళ్ళని సేకరించాంగానీ, కట్టెల్ని సేకరించలేదు. నేను ఇప్పుడే వెళ్ళీ కట్టెల్ని తీసుకువస్తా" అన్నాడు. అతడి మాటలు విని "సరే! స్వామీ మీరు వెళ్ళండి అయితే నాకు కనబడేంత దూరంలో వుండండి. ఎందుకంటే ఈ కారడవిలో నాకు భయమేస్తుంది". అని చెప్పిపంపింది. సత్యవంతుడు సావిత్రి కను చూపుమేరలో వున్న ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడున్న చెట్టునుంచి ఎండుకొమ్మల్ని సేకరించసాగాడు.
సత్యవంతుడి మరణం: కట్టెలు కొడుతున్న సత్యవంతుడికి ఉన్నట్టుండి ఒక్కసారిగా తలతిరిగింది. ఎంతో బాధపడుతూ భార్యని పిలిచి "సావిత్రీ నా తల గిర్రున తిరిగిపోతుంది. చీకటిలోకి వెళ్ళిపోతున్నట్టుగా వుంది. నాకేం జరుగుతుందో తెలియటంలేదు. నీ తొడమీద తలవాల్చి నిద్రపోవాలనిపిస్తోంది" అని అన్నాడు. వెంటనే సావిత్రి సత్యవంతుణ్జి తీసుకుని ఒక చెట్టుకింద కూర్చుని అతడి తలని తన తొడమీద ఉంచుకుని నెమ్మదిగా నిమరసాగింది.
మహాకాల స్వరూపుడైన యమ ధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోవటాన్ని అక్కడికి స్వయంగా వచ్చాడు. నల్లనికలువపూల రేకులా వున్నవాడు, పచ్చని వస్త్రాలు ధరించినవాడు, తన చుట్టూ మెరుపు తీగలు చుట్టుకున్న నీటితో నిండిన మేఘంలాగా వున్నవాడు అయిన యమధర్మరాజు సూర్యసమానమైన కాంతితో ప్రకాశించే దివ్య కిరీటాన్ని కుండలాల్ని ధరించి సావిత్రికి కనిపించాడు. యముడి వెంట కాలుడు-మృత్యుదేవత కూడా వున్నారు.
వచ్చిన యమధర్మరాజును సావిత్రి ఆశ్చర్యపోయి తనని చూస్తుండగానే సత్యవంతుడి శరీరం నుంచి బొటనవ్రేలంత పరిమాణంలో వున్న సూక్ష్మ పురుషుణ్ణి బైటికి తీసి, అతన్ని తన పాశంతో బంధించి వెంటనే దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు. ఉత్తమ ఇల్లాలైన సావిత్రి తన భర్త మరణించడాన్ని చూసింది. బాధని దిగమింగుకుని ఆలస్యంచేయకుండా వెంటనే యమధర్మరాజుని అనుసరించి వెళ్ళింది. అలా ఆయనతోనే వెళ్తున్న సావిత్రి దయనీయంగా, వినయంగా అంజలి ఘటించి యమధర్మరాజుతో ఇలా పలికింది.
సావిత్రీ యముల సంవాదం : “యమధర్మరాజా మాతృభక్తి ఉండటం వల్ల భూలోకంలో సుఖాలు, పితృభక్తి ఉండటం వల్ల అంతరిక్షలోకంలో సుఖాలు, గురుశుశ్రూషచేయటం వల్ల బ్రహ్మలోకంలో సుఖాలు మానవులు పొందుతారు. ఈ మూడు ధర్మాల్ని ఎవరైతే పాటిస్తారో వారు అన్ని ధర్మాల్నీ పాటించినట్టె. ఇవి పాటించనివారు ఏ ధర్మాన్నీ పాటించనట్టె. తల్లికి, తండ్రికి, గురువుకి సేవలు చేసే వాడు వేరే ఏ ధర్మాన్నీ ఆచరించాల్సిన అవసరంలేదు. కనుక పురుషుడు చేసే పనులన్నీ ఈ ముగ్గురి మీదే ఆధారపడి వున్నాయి” అన్నది.
సావిత్రి మాటలు విన్న యమధర్మరాజు “ఓ సావిత్రీ! నీవు చెప్పింది నిజమే. నీ కోరిక నెరవేరింది కదా! నీవు అన్నట్టే నీపుట్టింట్లో నీ తల్లి తండ్రుల్ని, భర్త ఇంట్లో అత్తమామల్ని అతని గురువుల్ని సేవించావు. ఇప్పుడు నీవు నా వెంట వచ్చి చేయాల్సిన సేవ పరలోకంలో ఏదీలేదు. ఇక నీవు నీ లోకంలోనే వుండి నీభర్తకి తగిన పరలోక క్రియల్ని ఆచరిస్తే మంచిది. కనుక నీవు బయలుదేరు. నాతో రావటం నీకు వృధాశ్రమ, నాకు ఆటంకం కూడా. అందుకే చెబుతున్నాను వెనక్కి వెళ్ళిపో. గురువులమీద పెద్దలమీద గౌరవం కలిగినదానివి. అదీగాక నీవు గొప్ప పతివ్రతవి. ధర్మం తెలిసినదానివి. నీవింకా ముందుకు వచ్చిన కొద్దీ శ్రమ అధికమౌతుంది వెళ్ళు”అని అన్నాడు.
“యమధర్మరాజా! ఉత్తమ స్త్రీలకి పతిని అనుసరించి వెళ్ళటమే ధర్మం. స్త్రీలకి పతే ప్రత్యక్షదైవం. స్త్రీలకి తండ్రి, సోదరుడు సుతుడు ఇచ్చేది కొంచెం మాత్రమే ఆమెకి అనంతమైన పుణ్యఫలాన్ని ఇవ్వగలిగేది కేవలం భర్త ఒక్కడే. స్త్రీ తను, మన, ప్రాణాలకి అధిపతి భర్తే. అలాంటి పుణ్యవంతుడైన భర్తని ఏ స్త్రీ విడిచి వుంటుంది. నా భర్త కూడా పుణ్యవంతుడే. నాభర్తని ఎక్కడికి తీసుకువెళుతున్నారో అక్కడి వరకూ నేను వెంట వెళ్ళవలసిందే. యథాశక్తి ఆయన్ని అనుసరించటమే భార్యగా నాధర్మం. స్వామీ! నాభర్త ప్రాణాల్ని తీసుకువెళ్తున్న మీతో నేను రావటం తగదని మీరు భావిస్తే ఇక నాకు మరణమే శరణ్యం. ఏ స్త్రీ అయిన మాంగల్యాది అలంకారాలకి దూరమై వైధవ్యాన్ని పొంది క్షణకాలమైనా జీవించగలదా!” అని బదులిచ్చింది సావిత్రి.
యముడి మొదటివరం : మహా పతివ్రతవైన ఓ సావిత్రీ! నీ మాటలు చాలా సంతృప్తికరంగా, వివేక వంతంగా వున్నాయి. నీపతి భక్తికి నేను ఎంతో సంతోషించాను నీ భర్త సత్యవంతుడి ప్రాణాలుతప్ప ఏదైనా వరం కోరుకో ప్రసాదిస్తానన్నాడు యమధర్మరాజు. వెంటనే సావిత్రి "యమధర్మరాజా! మహాత్ముడు, ధర్మప్రభువైన నా మామగారు కళ్ళుకోల్పోయి రాజ్య భ్రష్టుడై దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. వారికి రెండు కళ్ళు తిరిగి వచ్చేలా అనుగ్రహించు" అని వరం కోరింది. తథాస్తు నీవు కోరిన వరాన్ని ఇస్తున్నాను. ఇక వెనక్కి తిరిగివెళ్ళు. నామార్గానికి ఆటంకం కలిగించకు. నా మాటవిను అని నచ్చచెప్పాడు యముడు.
సావిత్రి వెనకకి మరలకుండా ఆయన్నే అనుసరిస్తూ "ప్రభూ! సత్పురుషులకి సజ్జనులతో మైత్రి కుదిరినప్పుడు వారికిక కష్టాలు, బాధలు ఎందుకుంటాయి. సత్పురుషులైనవారు ఎప్పుడూ సజ్జనులకీ, దుర్దనులకీ గతిగావుంటారు. కానీ దుర్దనులు మాత్రం ఎవరికీ మార్గదర్శకులుగా వుండరు. అందుకే లోకంలో అకారణంగా ఇతరులకి బాధలు కలిగించే దుష్టులు వల్ల ఎంతో భయపడాలికానీ, విషం వల్ల, అగ్నివల్ల, శత్రువుల వల్ల, ఆయుధాల వల్ల ఎలాంటి భయం మనకి వుండదు. సజ్జనులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టయినా సరే ఇతరులకి ఉపకారాలు చేస్తారు. అదే దుర్దనులు ప్రాణాలు తీసైనా తాము ఉపకారాన్ని ఇతరుల నుంచి పొందుతారు.
యమధర్మరాజా! లోకంలో వున్న ఆ సజ్జనుల్ని అనగా దుష్టుల్ని దుర్మార్గుల్ని దండించటం కోసమే బ్రహ్మ దేవుడు రాజరిక వ్యవస్థని సృష్టించాడు. ఎలాగైతే ధాన్యాన్ని పరీక్షించి మంచిచెడు విచారిస్తామో అదేవిధంగా రాజు ప్రజల్ని పరీక్షించి మంచి చెడు బాగా విచారించాలి. సజ్జనుల్ని రక్షిస్తూ దుర్దనుల్ని దండించాలి. స్వర్గాన్ని పొందాలనుకునే రాజు చేయవలసిన పని ఇదే. ఇంత కన్నా రాజు చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం వేరేదీ లేదు. యమధర్మరాజా ఆ విధంగా ఒక మహారాజు సజ్జనుల్ని రక్షిస్తూ తాను శాసించలేని దుర్దనుల్ని సైతం శాసించగలిగే ధర్మప్రభువు నీవు. అందుకే నీవు దేవుళ్ళందరి కన్నా గొప్పవాడివని నాకు అనిపిస్తోంది. లోకాలని సరిగ్గా నడిచేటట్టు చేస్తూ దాన్ని సరైన దారిలో నిలిపే వారే సజ్జనులు. అలాంటి సజ్జనుల్లో నీవు శ్రేష్టమైన
వాడివి. అందుకే నేను నీ వెంట ఎంతదూరం వస్తున్నా నాకు ఏ మాత్రం శ్రమ అనిపించటం లేదు” అన్నది సావిత్రి.
యముడిచ్చిన రెండోవరం : అమ్మా సావిత్రీ! ధర్మ బద్ధమైన నీమాటలు వింటుంటే నాకెంతో సంతోషంగా వుంది. నీకు నీ భర్త ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో ఇస్తాను” అన్నాడు యమధర్మరాజు. అప్పడు సావిత్రి ప్రభూ! నాతండ్రికి పుత్ర సంతానం లేదు ఆయన ఎంతో బాధపడుతున్నాడు కనుక నా తండ్రికి వందమంది పుత్రుల్ని అనుగ్రహించి ఆయనకి ఆనందాన్ని కలుగచేయి” ఇదే నా కోరిక అన్నది సావిత్రి. తథాస్తు నీ తండ్రికి నూరుగురు పుత్రుల్ని అనుగ్రహిస్తున్నాను. ఇకనైనా తిరిగి వెళ్ళు. వెళ్ళి నీ భర్త శరీరానికి చేయవలసిన కార్యాలు చేయి. అంతేకానీ మరణించిన నీ భర్త వెంట నీవు సశరీరంగా ఇలా రావటం తగదు. నీవు తల్లి తండ్రులకి, గురువులకి, నీ భర్తకి ఎంతో శ్రద్ధగా సేవలు చేసి నందువల్ల ఎంతోపుణ్యాన్ని సముపార్ణించుకున్నావు. అందుకే నేను నా దూతల్ని పంపకుండా స్వయంగా నీ భర్త ప్రాణాల్ని తీసుకెళ్ళటానికి వచ్చాను.
యమధర్మాలు : సావిత్రీ! నీ భర్త సత్యవంతుడు ధర్మాత్ముడు. వనంలోవుండి తల్లితండ్రుల్ని గురువుల్ని సేవించి వారిని సంతోషపరిచాడు. ఇలా నీ భర్త ఎంతో పుణ్యం చేసి చిరకాలం స్వర్గంలో వుండతగినంత అర్హతని సంపాదించాడు. తపస్సుచేతా, బ్రహ్మచర్యం చేతా, గురుసేవచేతా, అగ్నిసేవచేతా స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి. ఎవ్వరైనా సరే విప్రుణ్ణి, ఆచార్యుణ్ణి, తల్లి తండ్రుల్ని అన్నని అలక్ష్య పెట్టకూడదు. ఆచార్యుడు బ్రహ్మ స్వరూపుడు, తండ్రి ప్రజాపతి, తల్లి భూదేవి స్వరూపం, అన్న స్వయంగా తన రూపమే. మనిషి పుట్టటానికి ముందు తల్లితండ్రులు ముఖ్యంగా తల్లి ఎంతో కష్టాన్ని పడుతుంది. తరువాత పెంచటంలో ఇద్దరూ ఎన్నో బాధల్ని అనుభవిస్తారు. వీరి ఋణం తీర్చుకోవటం వందేళ్ళయినా సాధ్యం కాదు. కనుక వారికి ఎప్పుడూ సంతోషాన్ని కలిగించాలి.
తల్లి, తండ్రి, గురువు సంతోషిస్తే అన్ని తపస్సులా పూర్తి చేసినట్టే. అసలు ఈ ముగ్గురికీ సేవ చేయటమే గొప్ప తపస్సు. ఈ ముగ్గురే మూడు లోకాలలాంటివారు. వారి అనుమతి లేకుండా ఎవరూ ఏపనీ చేయకూడదు. ఋగ్యజస్సామవేదాలు మూడూ తల్లి, తండ్రి, గురువులే, అలాగే బ్రహ్మచర్యం, గార్హస్థ్వం, వానప్రస్థం అనే మూడు ఆశ్రమాలు, దక్షిణ గార్హపత్య అహవనీయ అనే మూడు రకాల అగ్నులు ఈ ముగ్గురి స్వరూపాలే, వీటిలో గురువు అహవనీయాగ్ని. సావిత్రీ! నీవు కోరిన వరాలన్నీ ఇచ్చాను. కనుక నీవు వెనక్కి వెళ్ళటం ధర్మం. నన్ను అనుసరించవద్దు. నేను నీకు చేసే దేమిలేదు. నాకు ఆటంకం కలిగించవద్దు" అన్నాడు యమధర్మరాజు.
సావిత్రి చేసిన ధర్మప్రసంగం : ధర్మాలు ఉపదేశించిన యముడి మాటలువిని సావిత్రి తిరిగి ఆయనతో "యమధర్మరాజా! ధర్మం సంపాదించేడప్పుడు శ్రమ ఎక్కడుంటుంది. అదీగాక నీపాద సేవ చేయటం ఎంతో గొప్ప ధర్మం. విజ్ఞానవంతుడైనవాడు ఎప్పుడూ ధర్మాన్నే ఆదరించాలి. ధర్మం ద్వారా పొందే లాభం అన్నిటికన్నా గొప్పది. ధర్మంతో అర్ధం దానితో కామం సాధ్యమవుతుంది. ధర్మాచరణ వల్ల ఇహపరాలు రెండూ సాధించుకోవచ్చు. జీవుడు ఏ స్థానానికి చేరుకోవాలో అక్కడికి తీసుకువెళ్ళేది ధర్మం ఒక్కటే. మిగిలినవన్నీ జీవుడి శరీరంతోనే నశిస్తాయి. జీవుడు తానొక్కడే పుట్టి ఒంటరిగానే మరణిస్తాడు. అతడితో పాటు, బంధుమిత్రపరివారం ఎవరూ వెంట వెళ్ళరు. కేవలం అతడు చేసిన ధర్మం మాత్రమే అతడి వెంట వెళుతుంది. ధర్మరాజా! జీవులకి సకల సుఖాల్నీ ప్రసాదించే బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్ర, శివ, చంద్ర, యమ, రవి, అగ్ని వాయు, వరుణ, కుబేరాది లోకాలన్నీ ధర్మాచరణ వల్లే వారికి లభిస్తాయి. కనుక జ్ఞానవంతుడైన పురుషుడుకానీ, స్త్రీ గానీ ధర్మాన్ని ఆచరించాలి. జీవితం అనిత్యం కనుక మృత్యువు ఆసన్నమయ్యేలోపే ధర్మాచరణ చేయటం ప్రారంభించాలి.
యమధర్మరాజా! లోకంలో ఎంతోమందికి తమ కళ్ళఎదురుగా మృత్యువు కనిపిస్తున్నా తాము అమరులమని గర్విస్తూ తమకి మృత్యువు అప్పుడే రాదులే అనుకుంటారు. అదెంతో ఆశ్చర్యం. అందుకే వారంతా ధర్మాచరణ తరువాత చేద్దాంలే అప్పుడే వయసేమైందని భావిస్తుంటారు. అయితే ప్రతివాడూ మృత్యువుకి ఎంతో భయపడతాడు. తను ఎప్పటికీ చావకుండా చిరంజీవిలా వుండాలనుకుంటాడు. ఇలాంటి ప్రాణులకి ఏది గతి ప్రభూ? ఇలా ప్రాణులకి అభయస్థానం ఏదీలేదు. మరణమే అందిరకీ భయాన్ని కలిగించే కారణం. మృత్యువంటే అసలేమాత్రం భయంలేనివారు పుణ్యప్రదమైన ధర్మాన్ని ఆచరించినవారే” అని ధర్మం గొప్పదనాన్ని గురించి ప్రసంగించింది సావిత్రి.
యముడిచ్చిన మూడోవరం : సావిత్రి ఎంతో నిర్దుష్టంగా, పలికిన ధర్మ ప్రసంగానికి యమధర్మరాజు ముగ్దుడైపోయాడు. ఆమెతో “సావిత్రీ! ధర్మం గొప్పతనం గురించి అది ఆచరించాల్సిన ఆవశ్యకత గురించి నీవు చేసిన ప్రసంగం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నీకు మరోవరం ఇవ్వాలనుకుంటున్నాను. అదీ నీ భర్త ప్రాణాలుతప్ప కోరుకో" అన్నాడు. వెంటనే సావిత్రి “సమవర్తీ! అనపత్యుడైన (పురుషసంతానం) వారికి ఏలోకాల్లోకీ ప్రవేశంలేదని అంటారు కదా! కనుక నాకు వందమంది పుత్రుల్ని అనుగ్రహించండి” అని వేడుకుంది. సావిత్రి కోరికలోని మర్మాన్ని గ్రహించని యమధర్మరాజు కళ్యాణీ! తథాస్తు నీ కోరిక నెరవేరుతుంది. నీకు వందమంది పుత్రులు జన్మిస్తారు. ఇక నీవు వెళ్ళు. శ్రమపడకు ఇప్పటికే చాలాదూరం వచ్చావు” అని నచ్చచెప్పాడు.
యముడిమాటలు విన్న సావిత్రి "ప్రభూ! ధర్మాధర్మ విచక్షణ తమకు బాగా తెలుసు. అన్ని జగాలకీ నీవే నాయకుడివి. ప్రజలందర్నీ వారివారి కర్మానుసారం శిక్షించే సమవర్తివి. అందరినీ ఎలాంటి పక్షపాతం లేకుండా ధర్మబద్ధంగా చూస్తావు. కనుకనే నిన్ను ధర్మరాజు అంటారు. జనులంతా నిన్ను మృత్యుదేవత అంటారు. నీవు కాల స్వరూపుడివి కూడా. సర్వ భూతాలనీ అంతంచేసే వాడివి కాబట్టి నీవే అంతకుడివి. సూర్య భగవానుడికి మొదటి కుమారుడివి కాబట్టి నిన్ను వైవస్వతుడు అని సంబోధిస్తారు. జీవులందరి ఆయువు ముగియగానే వారిప్రాణాల్ని తీసుకుపోతావు. కాబట్టి నీవు సర్వప్రాణహరుడివి.
స్వామీ! నీ అనుగహంతోనే వేదత్రయ ధర్మం నశించకుండా వుంది. ప్రాణులందరూ ధర్మంమీద నిలిచివుంటున్నారు. అన్ని ధర్మాలు నీ వీక్షణ వల్ల పరస్పరం సంకీర్ణం కాకుండా వున్నాయి. సజ్జనులందరికీ నీవే గతి. కనుక ఓ దయామయా! నన్ను కరుణించి రక్షించు. నా భర్త సత్యవంతుడి తల్లితండ్రులు కూడా నాలాగానే ఎంతో దుఃఖిస్తున్నారు. దయచేసి నా భర్త ప్రాణాల్ని తిరిగి ప్రసాదించు” అని దీనంగా వేడుకుంది.
యముడిచ్చిన నాలుగోవరం : సావిత్రి ప్రార్థనవిని యమధర్మరాజు మనసు కరిగిపోయింది. ఆమెతో “ధర్మజ్ఞురాలవైన ఓ సావిత్రీ! నీవు ఎంతో భక్తితో చేసిన స్తుతులకి, నీవు చెప్పిన ధార్మిక ప్రసంగాలకి నేనెంతో ముగ్ధుణ్ణుయ్యాను. నీ కోరిక ప్రకారం నీ భర్త సత్యవంతుడి ప్రాణాల్ని విడిచిపెడుతున్నాను. ఇక నీ కోరిక నెరవేరింది కదా! నీకు సంతోషమేనా! నీతో కలిసి సత్యవంతుడు నూరుగురు కుమారుల్ని కంటాడు. నాలుగువందల సంవత్సరాలు రాజ్యం
పాలిస్తాడు. నీ కుమారులందరూ మహావీరులై కాలక్రమంలో సావిత్రులు అని ప్రసిద్ధి చెందుతారు. అలాగే నీ తల్లి తండ్రులకి కూడా నూరుగురు కుమారులు జన్మిస్తారు. నీ సోదరులైన వారు కూడా దివ్యతేజోసంపన్నులై ఎంతో కీర్తిప్రతిష్టలు పొందుతారు. నీవు చేసిన నా దివ్య స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి దీర్ఘాయుష్షు లభిస్తుంది" అని పలికి సత్యవంతుణ్ణి విడిచిపెట్టి సావిత్రిని ఆశీర్వదించి మృత్యువు, కాలుడితో సహా అంతర్దానమయ్యాడు యమధర్మరాజు.
ఆవిధంగా యమధర్మరాజు అనుగ్రహంతో సావిత్రి తన భర్త ప్రాణాల్ని తిరిగి పొందింది. ఆమె యమధర్మరాజు దగ్గర నుంచి సరాసరి అడవిలో చెట్టుక్రింద వున్న సత్యవంతుడి శరీరం దగ్గరకి వచ్చి తన భర్త తలని వడిలోకి తీసుకుంది. నెమ్మదిగా సత్యవంతుడు కళ్ళు తెరిచాడు. అతడికి జరిగింది లీలగా గుర్తుకు వచ్చింది. "సావిత్రీ! నన్ను ఎవరో నల్లనివ్యక్తి పట్టి బంధించి తీసుకువెళ్తున్నట్టుగా అనిపించింది. ఆ పురుషుడు ఎవరో నీకు తెలుసా? ఇదంతా ఏదో కలలావుంది సరే! పద తల్లితండ్రులు ఎదురుచూస్తుంటారు. అప్పుడే సాయంత్రమైంది. అని పైకి లేచాడు. సావిత్రి బదులేమి చెప్పకుండా అంతా ఆశ్రమానికి వెళ్ళాక చెబుతాను అని బయలుదేరింది. ఇద్దరూ కలిసి తమ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్చర్యం ద్యుమత్సేనుడికి అతడి భార్యకి కళ్ళు వచ్చాయి. వారికంటికి తమ కొడుకు, కోడలు కనబడక పోయేసరికి ఎంతో ఆందోళన పడ్డారు. అంతలోనే సావిత్రీ సత్యవంతులు వారి ముందుకి వచ్చారు. తమ కొడుకుని కోడల్ని చూసి ఆనందంగా వారిని దగ్గరకి తీసుకున్నారు. అందరూ ఎంతో సంతోషించారు.
సావిత్రి ఆరోజు రాత్రి సత్యవంతుడికి జరిగిన వృత్తాంతమంతా వివరించింది. ఆరోజే తన ఉపవాసదీక్షని కూడా విరమించింది. మర్నాడు సత్యవంతుడు తన తండ్రిని వెంటబెట్టుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. ద్యుమత్సేనమహారాజుని సత్యవంతుణ్ణి చూని రాజ్యవ్రజలు ఎంతో సంతోషించారు. ద్యుమత్సేనుడు సరాసరి కోటలోకి వెళ్ళి నన్ను పదవీచ్యుతుణ్ణి చేసిన దుష్టుడు ఎక్కడ? అని సైనికుల్ని అడిగాడు. “వారంతా వినయంగా ఆయనకి నమస్కరించి ప్రభూ! తమరిని పదవీచ్యుతుల్ని చేసి అధికారం చేజిక్కించుకున్న దుష్టుణ్ణి మన మంత్రులు చంపేశారు. ఇప్పుడు మీరే మా మహారాజు. మీ సింహాసనాన్ని మీరు తిరిగి అధిష్టించండి” అని కోరారు.
ఆవిధంగా యమధర్మరాజు వర ప్రభావంతో తిరిగి కళ్ళని పొందిన ద్యుమత్సేనుడు తన రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకున్నాడు. అలాగే సావిత్రి తల్లి తండ్రులకి వందమంది మగసంతానం కలిగారు. మహాపతివ్రత అయిన సావిత్రి తన పాతివ్రత్య మహిమతో అటు తండ్రి పక్షాన్ని ఇటు మామగారి పక్షం వారినీ ఎంతో సంతోషపరిచి విగతజీవుడైన తన భర్త ప్రాణాల్ని తిరిగి సంపాదించుకోగలిగింది. అందుకే మానవులు పతివ్రతల్ని దేవతల్లా భావించి పూజించాలి. వారి అనుగ్రహంతో, ధర్మాచరణతోనే లోకాలన్నీ నిలబడుతున్నాయి. లోకంలో వారేది అంటే అది జరిగి తీరుతుంది.
సావిత్రి చేసిన యమస్తుతి
ధర్మాధర్మవిధానజ్ఞ సర్వధర్మప్రవర్తక ।
త్వమేవ జగతోనాథః ప్రజాసంయమనో యమః ॥ 01 ॥
కర్మణామనురూపేణ యస్మాద్యమయసే ప్రజాః ।
తస్మాద్వై ప్రోచ్యసే దేవ యమ ఇత్యేవ నామతః ॥ 02॥
ధర్మేణ మాఃప్రజాస్సర్వా యస్మాద్రంజయసే విభో ।
తస్మాచ్చ ధర్మరాజేతి నామవద్భిర్ని గద్యతే ॥ 03 ॥
సుకృతం దుష్కృతం చోభే పురోధాయ జనాయథా ।
త్వత్సంకాశం మృతాయాంతి తస్తాత్త్వం మృత్యురుచ్యతే ॥ 04 ॥
కాలం కలార్థం కలయ స్సర్వేషాం త్వంహితష్ఠసి ।
తస్కాత్కాలేతి తేనామ ప్రోచ్యతే తత్త్వ దర్శిభిః ॥ 05 ॥
సర్వేషామేవ భూతానాం యస్మాదంత కరో మహాన్ ।
తస్మాత్త్వమస్తకః ప్రోక్తః స్సర్వైర్ధేవై ర్మహాద్యుతే ॥ 06 ॥
వివస్వతస్త్వం తనయః ప్రథమః ప్రకీర్తితః ।
తస్మాద్వైవస్వతో నామ్నా సర్వలోకేషు కథ్యసే ॥ 07 ॥
ఆయుష్యేకర్మణి క్షీణే గృహ్ణాసి ప్రాణి జీవనమ్ ।
తథాత్వం కథ్యసే లోకే సర్వప్రాణ హరోஉసివై ॥ 08 ॥
(అధ్యా -212 శ్లో1-8)
విషాన్ని విరిచే వస్తువులు
మత్స్యరూపంలో వున్న శ్రీమహావిష్ణువుతో మనువు, రాజు అనేవాడు తన దుర్గంలో విషాన్ని హరించే ఏఏరకాల ఓషధుల్ని మూలికల్ని ఉంచుకోవాలి? అని ప్రశ్నించగా, నారాయణడు ఇలా చెప్పటం ప్రారంభించాడు.
1) బిల్వాటకీ యవాక్షారం, పాటలా, బాహ్లికం, ఊషణం, శ్రీపర్ణి, వల్లకి వీటితో కాచినకషాయాన్ని విషం కలిసినట్టు అనుమానం ఉన్న పదార్థాల మీద చల్లితే వాటిలో వున్న విషం హరించిపోతుంది. యవలు, సైంధవం, పానీయాలు, వస్త్రాలు, శయనసామాగ్రి ఆసన సామాగ్రి, నీళ్ళు, కవచాలు, ఆభరణాలు, ఛత్రాలు, వింజామరలు, ఇలాంటి విషయుక్త మయ్యాయని తెలిస్తే ఈ కషాయాన్ని చల్లితే వాటిమీదున్న విషం నశిస్తుంది.
2) శీతువు, పాటలీ, అవివిష శిగ్రువు, మూర్వా, పుర్నవా, సమంగా వృషమూలం, కపిత్థం, వృషణం, శోణితం, సహదేవ, హరిద్ర ఇవన్నీ విషాన్ని హరించే ఔషధాలు.
3) లాక్ష, ప్రియంగువు, ముంజిష్ఠ, ఏలా, హరేణుకా, అతిమధురం - వీటిని ముంగిస పిత్తంతో కలిపి భావన చేసి ఎద్దు కొమ్ములో ఆ మిశ్రమాన్ని పోసి, ఏడు అహోరాత్రాలు నేలలో పాతి దాన్ని బైటికి తీయాలి. అందులో వున్న పొడిని చిన్న పూసలుగా తయారుచేయాలి. ఆపూసల్ని బంగారు తీగలో గుచ్చి చేతికి కట్టుకుంటే, విషం కలిసిన పదార్థాల్ని తాకినా అవి నిర్విషమైపోతాయి.
4) మనోహ్వయా, శమీపత్రం, తుంబికా, శ్వేత సర్షపాలు, కపిత్ధం, కుష్ఠం, మంజిష్ఠా - వీటిని కుక్క పిత్తంతోగానీ, కవిలగోవు పేడతోగానీ నున్నగా అరగదీసి పూస్తే అది విషనాశకమైన బెషధంలా మారుతుంది.
5) మూషికా జతుకా ఈ రెండు ఓషధుల్ని కూడా కలిపి పై తెలిపిన విధంగా పూసలు చేసి చేతికి ధరిస్తే విషనాశకంగా పనిచేస్తాయి.
6) హరేణువు, మాంసి, మంజిష్ఠా, మధుకా, మధువు, అక్షత్వక, సురసం - వీటిని కుక్కపిత్తంలో భావనచేసి ఆవుకొమ్ములో ఆ మిశ్రమాన్ని నింపి ఏడురోజులు భూమిలో పాతేసి తరువాత బైటకి తీసి అందులో వున్న పొడి విషహర బెషధమవుతుంది.
7) పిప్పలి, మిరియాలు, శొంఠి అనే ఊషణ త్రయం, సముద్రలవణం, సైంధవలవణం, బిడాలవణం, సౌవర్చలవణం అనే పంచలవణాలు, మంజిష్టపసుపు, మ్రానిపసుపు, సూక్ష్మలా, త్రివృతాపత్రం, వాయువిడంగాలు, ఇంద్రవారుణీ, మధుకం, వేతనం, తేనె-ఇవన్నీ కలిపి ఆవు కొమ్ములో వుంచి 7రోజులు భూమిలో పాతాలి. తరువాత ఆ కొమ్ముని బైటికి తీసి అందులోవున్న ద్రవ్యంతో చిన్నమాత్రలు చేసుకుని వుంచుకోవాలి. ఎప్పుడైనా విషాహారం తిన్నప్పుడు అదిజీర్ణమైపోతుంది. విషంలేని ఆహారం స్వీకరించినప్పుడు ఈ మందుని తింటే అది పైత్యాని కలిగిస్తుంది.
8) శుక్లం, సర్జరసం, ఉశీరం, సర్షపాలు, ఏలావాలుకాలు, సువేగ, తస్కరం, సురం, అర్జునకుసుమాలు, వీటిని పొగవేస్తే ఇంట్లో వున్న పదార్థాలవిషం, విషక్రిములు విషం విరిగిపోతుంది. ఈ పొగ ప్యాపించేచోట కీటకాలుగానీ, విషసర్పాలుగానీ, కప్పలుగానీ, అభిచార క్రియల ప్రభావంకానీ ఏమాత్రం వుండదు.
9) నెమలిపింఛం, కొంగ, ఎముకలు, సర్షపాలు, చందనం, నేయి వీటితో పొగవేస్తే అది ఇంట్లో వ్యాపించినంత మేరా విషాన్ని హరిస్తుంది.
10) గోరోచనం, తాళిసపత్రి, నేపాళి, కుంకుమపూవు, వీటిని చూర్ణంగా చేసి తిలకంలాగా ధరిస్తే అతడికి విషబాధలుండవు. అందరినీ ఆకర్షిస్తాడు.
11) హరిద్ర (పసుపు), మంజిష్ఠా, కిణిహి, పిప్పలి, వేపచెక్క - వీటిని చూర్ణంచేసి ఆ చూర్ణాన్ని విషపదార్ధాలకి పూస్తే ఆ విషం విరిగిపోతుంది.
12) శిరీషపుష్పం(దిరిసెనపువ్వు) ఫలం, పత్రం ఆ చెట్టు బెరడు, వేరు-ఇవన్నీ గోమూత్రంతో భావన చేస్తే అది సకల విషహర ఔషధంగా తయారవుతుంది.
రాజు చేయకూడని పనులు
రాజైనవాడు వేటని, మద్యపానాన్ని జూదాన్ని విడిచిపెట్టాలి. ఈ మూడింటినీ విడిచిపెట్టని ఎంతోమంది మహారాజులు లోకంలో క్షీణించిపోయారు. రాజన్నవాడు వ్యర్థంగా తిరగకూడదు. పగటిపూట నిద్రించకూడదు. వాక్పారుష్యం, దండపారుష్యం కూడదు. ఎవరినీ పరోక్షంగా నిందించకూడదు. రెండు విధాలైన అర్ధనష్టం చేయకూడదు. అనగా 1.ధనం 2.ఆస్తి వీటిలో
మొదటిదైన ఆస్తి అనగా తన స్వంతమైన నివాసస్థలాలని, దుర్గాలని సరిగ్గా సంరక్షించకపోవటం, అస్తవ్యస్తంగా వాస్తు విరుద్ధంగా నిర్మించటం, అనవసరంగా వాటిని కూల్చేయటం, చెడిపోయిన వాటిని బాగుచేయకపోవటం, ఒకచోట కట్టించాల్సిన వాటిని వేరొక చోట కట్టించటం - ఇలాంటివి అర్థనష్టాలు.
రెండో రకమైన అర్ధనష్టం అనగా దేశ కాల పాత్రల్ని ఎరగకుండా దానధర్మాలు చేయటం. అనవసరమైన కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చించటం మొదలైనవి. అర్ధనష్టాన్నీ అర్ధదూషణ అనికూడా అంటారు. వీటితోపాటు కామ, క్రోధ, లోభ, మదమాన, హర్షాలని ప్రయత్న పూర్వకంగా విడిచిపెట్టాలి.
ఈ రకమైన దోషాల్ని చేయకుండా వున్న రాజు ముందుగా తన భృత్యుల్ని తరువాత తన పౌరుల్ని లోబరుచుకోవాలి.
రాజు చేయాల్సిన పనులు
రాజు తన పట్టాభిషేకం అయిన దగ్గరనుంచి తన రాజ్యాన్ని పరిరక్షించుకోవటానికి తగిన సహాయకుల్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే వారి మీదే రాజ్యపాలనాభారం నిలిచి వుంటుంది గనుక. రాజు స్వయంగా పరీక్షించి గుణవంతుల్నే సహాయకులుగా ఎన్నుకోవాలి. కులీనుడు, శీలసంపన్నుడు, చతుర్వేదవిశారదుడు, హస్తి శిక్షా, అశ్వశిక్షలలో నిపుణుడు, మృదుభాషి,
శుభాశుభశకునాలు తెలిసినవాడు, వివిధరకాల చికిత్సాపద్ధతుల్ని ఎరిగినవాడు, కృతజ్ఞుడు, కార్యదర్శి, శూరుడు, కష్టాల్ని సహించేవాడు, ఋజుస్వభావుడు, వ్యూహాలు పన్నటంలో నైపుణ్యం కలిగినవాడు అయిన బ్రాహ్మణుడిని కానీ, క్షత్రియుడిని కానీ సేనాపతిగా నియోగించాలి. పొగడగరి, సురూపుడు, దక్షుడు, ప్రియవాది, పొగరులేనివాడు, అందరి మనసులకీ నచ్చేవాడు, అందరి
మనసుల్లోని భావాల్ని గ్రహించేవాడు అయిన వాడిని ప్రీతిహారి (ద్వారాధికారిగా) నియమించుకోవాలి.
శల్యం, శాలాకృతం, శాలాక్యం, కాయచికిత్స, భూతవిద్య, కౌమార, భృత్య, అగదతంత్రం, రసాయనతంత్రం, వాజీకరతంత్రం కాయం, బాలం, గ్రహం, ఊర్థ్వంగకం, శల్యం, దంష్ట్రం, వృషభం అనే వైద్యాంగాలలో, చికిత్సా ప్రక్రియలో నిపుణుడు, వంశపరంపరా క్రమంగా వచ్చినవాడు, వేషంలో నిరాడంబరుడు, ధర్మబద్ధమైన మనసుకలిగినవాడు, ఉత్తమవంశంలో
జన్మించినవాడు, అయిన వ్యక్తిని రాజవైద్యుడుగా నియమించుకోవాలి. రాజుకి అతడు ప్రాణరక్షకుడు కనుక సాధారణ ప్రజల్లాగా రాజు వైద్యుడి మాటను మన్నించి అతడు చెప్పిన విధంగా నడుచుకోవాలి.
రాజు తన ఇష్టం వచ్చినంత మందితో సలహాలు, సంప్రదింపులు, ఆలోచనలు చేయవచ్చు కానీ, అవి వేరు వేరుగా చేయాలి. మంత్రాలోచనా పరుడైన రాజు తన మంత్రులలో కూడా ఒకరితో జరిపిన చర్చల్ని మరొకరితో చర్చించకూడదు. రాజు ఎవరినీ నమ్మకూడదు. ఆయా మంత్రులు చెప్పిన
విషయాల్ని విని తానే సరైన నిర్ణయం చేయాలి. వేదశాస్త్రాలు బాగా చదివిన పండితుల్ని రాజు పోషించి వారిని పూజించాలి. తాను వినయసంపదతో పండితుల నుంచి విషయాలని గ్రహించాలి. ఈవిధంగా చేస్తే రాజు పృథివినంతా తన వశంచేసుకోగలడు.
రాజు ప్రవర్తన
మహారాజైనవాడు వ్యసనాల్ని విడిచిపెట్టాలి. కానీ లోకం కోసం తాను ఆయా విషయాల్లో కూడా నేర్పరి నేనని తెలియచేయటానికి కృత్రిమంగా వ్యసనాల మీద ఆసక్తివున్నట్లు నటించాలి. రాజు ప్రతిపౌరుడితో చిరునవ్వులు చిందిస్తూనే మాట్లాడాలి. వధించాల్సినవారి విషయంలో కూడా కోపం
ప్రదర్శించకూడదు. రాజు ఎప్పుడూ దాతృత్వం, ఉదారత్వం కలిగివుండాలి. అలాంటివాటికి భూమండలమంతా వశమౌతుంది. రాజు ఏ పని గురించీ దీర్గంగా ఆలోచించకూడదు. కొన్ని పనుల్లో తొందర పనికిరాదు, నిదానంగా ఆలోచించి చేయాలి. రాజు ఎప్పుడూ తన మంత్రాలోచనాన్ని రహస్యంగా వుంచాలి. రాజు చేయబోయే పనులు ముందుగా ఎవరికీ తెలియకూడదు. రాజు తన వెంట ఎప్పుడూ మంత్రవేత్తని రక్షణగా వుంచుకోవాలి.
వ్యక్తి ఆకారం, ముఖకవళికలు, వాడి ఇంగితం (సైగలు - కదలికలు) నడక, మాటలు, చేష్టలు, నేత్ర వికారాలని బట్టి ఇతరుల మనసుని గ్రహించగలగాలి. రాజు తనొక్కడే ఏవిషయం గురించీ ఆలోచించకూడదు. అలాగని చాలామందితో కూడా ఆలోచనలు చెయ్యకూడదు. పరిమితంగా
విషయ పరిజ్ఞానం కలిగిన వారితో మాత్రమే చర్చించాలి. తను ఎక్కబోయే నావని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దాన్ని ఎక్కాలి. తాను తినే ఆహారాన్ని కూడా పరీక్షించకుండా భుజించకూడదు. తానే తల్లి తండ్రిగా తన ప్రజలందరినీ కన్న బిడ్డల్లా భావించి పరిపాలించాలి. తాను ప్రజలనుంచి స్వీకరించిన పన్నుల్ని వారి సేవకే వినియోగించాలి. శత్రువుల్ని లొంగదీసుకునే విషయంలో సామ, దాన, భేద, దండోపాయాల్ని పాటించాలి.
చోర ప్రాయశ్చిత్తం
బ్రాహ్మణుడు బుద్ధిపూర్వకంగా తనజాతివారి ధనాన్ని గానీ, ధాన్యాన్ని గానీ దొంగిలిస్తే కృచ్చార్ధం ప్రాయశ్చిత్తంగా ఆచరించాలి. స్త్రీలకి, పురుషులకి, సంబంధించిన పొలాలని, స్థలాలని, దొంగలిస్తే చాంద్రాయణ వ్రతంలో శుద్ధి అవుతుంది. అల్పసారమైన ద్రవ్యాన్ని ఇతరుల గృహాల నుంచి దొంగలిస్తే సాంతపనకృచ్చవ్రతాన్ని ఆచరించాలి. భక్ష్య, భోజ్య, శయ్య(మంచం)ఆసనాలని,
పుష్పాలని, ఫలాలని హరిస్తే పంచగవ్య ప్రాశనంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గడ్డి, కట్టెలు, చెట్లు, అన్నం, ఎండు జొన్న రొట్టె, వస్త్రం, చర్మం, మాంసం దొంగిలిస్తే మూడు రాత్రుల ఉపవాసం ఉండాలి. ముత్యాలు, మణులు, బంగారం, వెండి, ఇనుము, కాంస్యం వంటివి దొంగిలిస్తే పన్నెండురోజులు బియ్యం నూకల అన్నాన్ని తినాలి. పట్టు వస్త్రాల్ని ఉన్ని వస్త్రాలని, రెండు గిట్టల ప్రాణుల్ని ఓషధుల్ని దొంగలిస్తే మూడు రోజులు పాలతో అన్నాన్ని భుజించాలి.
అవయవాల స్పందన శుభాశుభ ఫలితాలు
వీపుమీద, హృదయానికి కుడివైపున గానీ అదిరితే శుభం జరుగుతుంది. అదే ఎడమవైపు అదిరితే అశుభం. కుడివైపున అదిరితే భూలాభం. నుదుటిమీద స్థానవృద్ధి, కనుబొమల మధ్య ప్రియమైన వారితో సంగమం, కళ్ళ ప్రక్కన అదిరితే సేవకులతో లాభం, కంటికొనల దగ్గర-ధనప్రాప్తి, నడుముమీద - తత్తరపాటు, కంటికొలకుల దగ్గర అదిరితే -యుద్ధంలో విజయం, కంటిచివర-
స్త్రీ సుఖం, చెవికొనలో ప్రియవార్తాశ్రవణం. ముక్కు మీద అదిరితే -సౌఖ్యం. పెదవులమీద స్త్రీ లాభం, కంఠంమీద - భోగం, భుజాలమూలల్లో -భోగవ్చద్ధి, భుజాల మీద - మిత్రులతో స్నేహలాభం, చేతుల మీద అదిరితే - ధనాగమం, వీపుమీద-పరాజయం, వక్షస్థలం మదల సద్యోజయం, కడుపుమీద - ప్రీతి, స్త్రీలకి స్తనాలపైన అదిరితే-సంతాన ప్రాప్తి, నాభిప్రదేశం మీద - స్థాన భ్రంశం,
జఘన భాగంలో అదిరితే-ధనాగమం, మోకాళ్ళ సందుల్లో-బలవంతులతో సంధి జరుగుతుంది. అరికాళ్ళలో అదిరితే-ధనకారకమైన ప్రయాణం కలుగుతుంది.
గుహ్యావయావాలలో స్పందన కలిగితే - బొబ్బలు, పుండ్లు పుడతాయి, పాదాలలో అదిరితే - ఉత్తమ స్థాన ప్రాప్తి, కలుగుతుంది. ఇక్కడ చెప్పినవన్నీ స్త్రీలకి ఎడమవైపు, పురుషులకు కుడివైపు స్పందనలు కలిగితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవిగాక మిగిలిన అవయవాల స్పందన ఫలితాలని దైవజ్ఞుల ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ స్పందనలతో పాటు అరిష్ట చిహ్నాలు కూడా
కనిపిస్తే బ్రాహ్మణులకి సంతర్పణ, సువర్ణ దానం చేయాలి.
స్వప్న ఫలితాలు
దుఃస్వప్నాలు : ఒకబొడ్డు మీద తప్ప శరీరంలోని ఇతర అవయవాల మీద గడ్డి, చెట్లు మొలవటం, తలమీద కంచు పాత్రపడి పగలటం, తలబోడిదైపోవడం, నగ్నంగా వుండటం, మలినమైన వస్త్రాలు ధరించటం, నూనెతో తలంటుకోవటం, బురదని వంటికి పూసుకోవటం, ఎత్తునుంచి క్రిందకి పడటం, ఉయ్యాలని ఎక్కటం, ఉడికించిన మాంసాన్ని తెచ్చుకోవటం, గుర్రాలని చంపటం, ఎర్రని పూల చెట్లని ముద్దుపెట్టుకోవటం, పందుల్ని ఎలుగు బంట్లని, గాడిదల్ని
ఒంటెల్ని ఎక్కటం, ఉడికిన మాంసాన్ని తైలాన్ని ఫలాన్ని తినటం, నర్తించటం, నవ్వటం, పెండ్లి జరిగే సన్నివేశం, తీగల్లేని వాద్యాల్ని మ్రోగించటం, నదిలో స్నానం చేయకపోవటం, ఆవుపేడతో, బురదనీళ్ళతో, మట్టితో కలిసిన నీళ్ళతో స్నానం చేయటం, మాతృగర్భంలోకి ప్రవేశించటం, చితిమీద ఎక్కటం, ఇంద్రధ్వజం నేల మీదపడటం, సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలో
ఉత్పాతాలు కనిపించటం.
దేవతలు, విప్రులు, రాజులు, గురువులు కోపించటం, కన్యలు కౌగిలించుకోవటం, పురుషులతో సంభోగించటం, తన అవయవాలకు హాని కలగటం, అనగా విరగటం, వాంతి అవటం, దక్షిణ దిశగా ప్రయాణం చేయటం, వ్యాధి రావటం, పళ్ళు రాలటం, పూలురాలటం, ఇళ్ళు పడిపోవటం, ఇళ్ళని
ఊడ్చటం, పిశాచాలతో, మాంసాహార ప్రాణులతో, వానరులతో, ఎలుగుబంట్లతో ఆడుకోవటం, ఇతరుల వల్ల అవమానించబడటం, వ్యసనాలు కలగటం, కాషాయవస్త్రాలు ధరించినట్టు కనబడటం, స్త్రీలు క్రీడించినట్టు కనిపించటం, నూనె త్రాగటం, నూనెతో స్నానం చేయటం, ఎర్రని పూలని ధరించటం, ఎర్రగంధాన్ని పూసుకోవటం.
పై తెలిపిన వన్నీ దుస్వప్నాలు. ఈ స్వప్నాలు గనుక వస్తే వాటిని ఇతరులకి చెప్పకూడదు. స్వప్నం వచ్చిన మర్నాడు ఓషథీచూర్ణంతో స్నానం చేసి తిలలతో హోమ, బ్రాహ్మణ పూజ వాసుదేవుడి స్తుతి చేసి గజేంద్ర మోక్షం కథని శ్రవణం చేయాలి. ఆవిధంగా చేస్తే దుఃస్వప్న దోష పరిహారం జరుగుతుంది.
స్వప్న ఫలితం : రాత్రిపూట మొదటియామంలో వచ్చిన స్వప్నాలు ఒక సంవృతరానికి, రెండో యామంలో వచ్చిన స్వప్నాలు 6 నెలలు వరకు, మూడవ యామంలో వచ్చినవి 3 నెలలకి నాలుగో యామంలో వచ్చిన కలలు 1 నెలకి అరుణోదయ సమయంలో వచ్చిన స్వప్నాలు ఒక వారానికి ఫలిస్తాయి.
శుభస్వప్నాలు : పర్వతాలని, మేడల్ని ఎనుగుల్ని గుర్రాల్ని వృషభాల్ని అధిరోహించటం, తెల్లపూలుపూసే చెట్టుని ఎక్కటం తన నాభి (బొడ్డు) మీద వృక్షాలు, గడ్డి మొలవటం, తనకి ఎన్నో తలలు పుట్టటం, ఎన్నో చేతులు ఏర్పడటం, జుట్టు నెరియటం, తెల్లని వస్త్రాలని, మూలల్ని ధరించటం, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, తారల్ని అందుకోవటం, భూమిని సముద్రాన్ని మింగటం, శత్రువుల్ని వధించటం, పచ్చిమాంసాన్ని, చేపల్ని పాయసాన్ని భుజించటం, ప్రేగుల్ని
చుట్టుకుని నేలపై పడి దొర్లటం, ఆకాశం నిర్మలంగా వున్నట్టు కనిపించటం, దేవతలు, విప్రులు, గురువుల నుంచి అనుగ్రహాన్ని పొందటం, గోశృంగం నుంచి, చంద్రుడి నుంచి కారే నీళ్ళలో స్నానం చేయటం, రాజలాంఛనాలు లభించటం, తంత్రీవాద్యాలు మ్రోగించటం, సంకెళ్ళతో బంధించబడటం, మలాన్ని పూసుకోవటం, ఇళ్ళు తగలబడటం, రాజుల్ని దర్శించటం,
దేవతామూర్తుల్ని, పవిత్రమైన జలాన్ని చూడటం ఇవన్నీ శుభస్వప్పాలు.
ఈ శుభస్వప్నాల వల్ల అప్రయత్నంగా ధనం లభించటం, రోగులకి రోగవిముక్తి జరగటం అనే శుభఫలితాలు కలుగుతాయి.
శుభాశుభ శకునాలు
అశుభశకునాలు : నల్లనిధాన్యం, దూది, ఎండుగడ్డి, ఎండుపేడ, కట్టెలు, బొగ్గులు, నూనె, బెల్లం, నూనె అంటుకున్న బోడితల, నగ్నంగా వున్నవాడు, జుట్టులేనివాడు, రోగార్తుడు, కాషాయాంబరధారి, ఉన్నత్తుడు, బలహీనుడు, దీనుడు, నపుంసకుడు, ఇనుము, బురద, కేశాలకట్ట, చర్మం, తెలకపిండి, సారంతీసేసిన పదార్థాలు, ఛండాలుడు, కారాగార రక్షకులు, కసాయివాడు,
గర్భిణీస్త్రీలు, ధాన్యంపొట్టు, భస్మం, కపాలం, ఎముకలు, పగిలిన పాత్రలు, కందులు, ఎర్రని పాత్రలు, కుండలు, అమంగళకర వాద్యాలు, భయంకరమైన ధ్వనులు అశుభశకునాలు.
ఎక్కడికి వెళుతున్నావు? ఆగు? వెళ్ళవద్దు? అనే మాటలు అశుభాన్నిస్తాయి. ధ్వజం మీద మాంసాహార పక్షులువాలటం, వాహనాలు తడబడటం, వస్త్రాలు జారిపోవటం, ద్వారానికి తలడీకొనటం, కాళ్ళకి ఎదురుదెబ్బలు తగలటం, ఛత్రం, ధ్వజం, వస్త్రం క్రిందపడటం అశుభాలు. ఇవి మొదటి సారి జరిగినప్పుడు నారాయణుణ్ణి స్తుతించటం అర్చించటం చేయాలి. రెండోసారికూడా జరిగితే ప్రయాణం మానుకుని ఇంట్లో కూర్చోవాలి.
శుభశకునాలు : తెల్లనిపూలు, పూర్ణకుంభాలు, జలపక్షులు, మాంసం, చేపలు, ఆవులు, అశ్వాలు, ఏనుగులు, ఒంటరి బౌద్ధసన్యాసి, సాధుజీవి, మేక, దేవతలు, విప్రులు, మండుతున్న అగ్ని, వేశ్య, దర్భలు, పచ్చి గోధుమలు, వెండి, రాగి, బంగారం, రత్నాలు, తెల్లని ఆవాలు, మనుషులు మోసే పల్లకి, మట్టీ, ఆయుధాలు, రాజలాంఛనాలు. నేయి, పెరుగు, పాలు, ఫలాలు, మంగళకరమైన
వాద్యధ్వని, సంగీతనాద్యాలు ఇవన్నీ శుభశకునాలు.
మత్స్యవురాణం ఫలశ్రుతి
ఈ మత్స్య పురాణం పరమపవిత్రమైనది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వయంగా మత్స్యరూపాన్ని ధరించి మనువుకి ప్రబోధించింది. ఈ పురాణ శ్రవణం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. అనేక తీర్థాలు, క్షేత్రాలు, పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల సమస్త ధర్మాలన్నీ శ్రద్ధగా ఆచరించటం వల్ల కలిగే
ఫలితాలన్నీ ఈ పురాణ శ్రవణం వల్ల పఠనం వల్ల మానవులకి లభిస్తాయి.
అస్మాత్పురాణాత్సుకృతం నరాణాం తీర్ధావలీనామహాఫలానామ్ ।
సమస్త ధర్మాచారణోద్భవానామ్ సదైవ లాభాశ్చ మహాఫలానామ్ ॥
అస్మాత్పురాణాదపి పాదమేకమ్ పఠేత్ యఃసోஉపి విముక్తపాపః ।
నారాయణ స్యాత్ పదమేతి నూనం అనంగవద్దిన్య వపుః సుఖీస్యాత్ ॥
అత్యంత ప్రాచీనమైన ఈ మత్స్యపురాణంలో ఒక్క శ్లోకాన్ని పఠించిన వాడుకూడా సకల పాపాలనుంచీ విముక్తుడై శ్రీమన్నారాయణుడి దివ్య ధామానికి చేరుకుంటాడు. అతడికి మన్మధుడు లాంటి దివ్యమైన శరీరం లభిస్తుంది. ఎన్నో రహస్య తత్త్వల్ని ప్రతిపాదించిన ఈ పురాణాన్ని శ్రద్ధతో వినేవాడికి, చదివే వాడికి అశ్వమేధయాగం ఆచరించిన ఫలం లభిస్తుంది.
మానవులు నిత్యం శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మని, సూర్యుణ్ణి అర్చించిన తరువాత ప్రతిరోజూ శ్రద్ధతో ఈ పురాణంలోని ఒక శ్లోకాన్నిగానీ తాత్పర్యాన్ని గానీ, కనీసం శ్లోక పాదాన్ని గానీ తాను పఠించి, ఇతరులకి వినిపిస్తే బ్రాహ్మణుడికి-విద్య, క్షత్రియుడికి -భూమి, వైశ్యుడికి -ధనం, శూద్రుడికి -సుఖం సంప్రాప్తిస్తాయి. ఇక ఈ పురాణాన్ని ఆసాంతం పఠించినవాడు ధనధాన్యవస్తువాహనాల్ని సమృద్ధిగా పొందుతాడు.
॥ సర్వేజనాః సుఖినోభవంతు ॥