దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల) అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది.
ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత
యతి – తపః – తలం(ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గామారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది.
అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ, మూడు వంకలు కలిసి (చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక) ‘మధువంక’గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి మధు గోకర్ణ గా ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా త్రివేణి మధు గోకర్ణ కాస్తా యతి – తపః – తలం గా తదుపరి ఎత్తిపోతల గా మారింది.
ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని (నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు.
దత్త శిల
దత్త శిల ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కుర్చుని కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది.
No comments:
Post a Comment