శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతుల దెచ్చుట
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఒకపర్యాయం కుశస్థలీ నగరంలో అతిథిగా ఆనందిస్తుండగా, ఒక బ్రాహ్మణుని భార్య ప్రసవించింది. పుట్టిన కొడుకు పురిటిలోనే మరణించాడు. బ్రాహ్మణుడు మహాశోకంతో శిశువు శవాన్ని మోసుకొనివచ్చి, రాజద్వారం ముందరపెట్టి, విధిని, తనను నిందిస్తూ అమితమైన దుఃఖంతో దీనాలాపాలు చేస్తూ
అక్కడ మూగి ఉన్న ప్రజలతో “బ్రహ్మద్వేషియై శాస్త్ర ధర్మాల్ని పాటించక, వర్ణాశ్రమ ధర్మాలు మంటగలిపి పాలించే రాజు పాపంవల్ల నా కుమారుడు చనిపోయాడు. హింసాత్మకుడై, అన్యాయాలు చేస్తూ భౌతిక సుఖాలకు లొంగి, పరిపాలన చేసేరాజు పాలించే దేశంలో ప్రజలు అమితంగా కష్టాలు పొందుతారు” అంటూ శాపనార్థాలు పెడుతూ; ఏడుస్తూ అక్కడ నిలువక వెళ్లిపోయాడు.
ఈ విధంగా విధివశాత్తు పుట్టిన ప్రతిపిల్లవాడు చనిపోతుంటే ప్రతిపర్యాయం ఆ కుమారుని శవాన్ని తీసుకొని వచ్చి రాజభవనం ముందుంచి విలపిస్తూ, రాజు ధర్మవిరుద్ధవర్తనుడు, తత్కారణంగా ఈ అకాలమరణాలని ఏకరువుపెడుతూ రోదిస్తూ శాపనార్థాలు పెడుతూ బ్రాహ్మణుడు ఎనిమిదిసార్లు రావడంకాక, తొమ్మిదవసారి అదేవిధంగా తన కొడుకు చనిపోగా అతణ్ణి భుజానవేసుకునివచ్చి ఎప్పటిలా రోదిస్తుంటే ఆ బ్రాహ్మణుణ్ణి చూచి, అనుకోకుండా అక్కడికి వచ్చిన అర్జునుడు ఇలా అన్నాడు.
'నువ్వీ విధంగా ఆక్రందనలు చేస్తుంటే నీ బాధతీర్చీ యోధుడు (విలువిద్య తెలిసినవాడు) ఒక్కడూ ఈ రాజ్యంలోలేడు. ఇది ఈ రాజ్యప్రజలు చేసికొన్న పాపం” అని అర్జునుడు ఊరడించాడు.
"పుత్రులను కోల్పోయి దుఃఖిస్తున్న బ్రాహ్మణులు ఏ రాజ్యంలో ఉంటారో, ఆ దేశమేలే రాజును నటుడిగా భావించాలి. నేను నీ కుమారుణ్ణి బతికిస్తాను. అలాచేయలేకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను” అని బ్రాహ్మణుడు ఆశ్చర్యపడేలా అర్జునుడు ప్రతిజ్ఞ చేయగా, బ్రాహ్మణుడు విని అంత వెర్రిమాటలెందుకు? బలరామ, శ్రీకృష్ణాదులు(చేయలేని పని మీరు చేయగలరా? అన్నాడు)
మహాపరాక్రమవంతులైన ప్రద్యుమ్నాది యదువీరులు చేయలేని పనిని నీవెలా సాధించగలవు. అనవసర ప్రగల్భాలు మాని నీ తోవను నీవు వెళ్లమన్నాడు. అప్పుడు అర్జునుడు (ఇలా అన్నాడు)
బ్రాహ్మణుని తిరస్కారవాక్యాలకు, తన మనసులో దురభిమానం పెరిగి; అర్జునుడు కోపంతో అదుపు తప్పినవాడై అక్కడి ప్రజలు వినేలా ఇలా అన్నాడు.
నీ వింతకు ముందు చెప్పిన బలరాముడనో, కృష్ణుడనో, ప్రద్యుమ్నుడనో, అనిరుద్ధుడనో కాను, నేనెవ్వరంటే శత్రుసమూహాలను పీనుగల పెంటలుగా చేసే గాండీవం ధరించిన అర్జునుణ్ణి అని తనను ప్రశంసించుకొన్నాడు.
అంతేకాక, త్రిపురారియైన పరమశివుణ్ణే భుజబలంతో ఒంటరిగా ఎదుర్కొని యుద్ధంచేసిన నన్ను నీవెరుగవా? మృత్యుదేవతను భయపెట్టి, గర్వమణచి, నీ కుమారులనిపుడే తెచ్చియివ్వగలను.
(జననజరామరణాలు భగవత్సంకల్పాలు. కృష్ణుడు భగవంతుడు. అర్జునుడు భౌతిక వాది. భుజాస్త్ర బలము నమ్మినవాడు.)
పార్థుడు బ్రాహ్మణునికి నమ్మకం కలిగేలా పలికాడు. బ్రాహ్మణుడు దుఃఖంనుండి ఉపశమనంపొంది, అర్జునుణ్ణి అభినందించి, తన ఇంటికి మరలిపోయాడు. కొంతకాలానికి అతడి భార్య తిరిగి గర్భవతిఅయి, నవమాసాలుమోసి, పురిటి నొప్పులు పడుతూఉండగా, బ్రాహ్మణుడు రాజమందిరానికివచ్చి, అర్జునునకు సమాచారం ఇచ్చినాడు. అపుడు అర్జునుడు
అర్జునుడు పవిత్ర నదులనుండి స్వీకరించిన జలాలతో ఆచమనంచేసి, పవిత్ర స్థలంలో నిలబడి; శుచియై శివుణ్ణి ధ్యానించి, అస్త్రమంత్రాది దేవతల మంత్రాలు స్మరించి, ధ్యానించి, గాండీవం చేతబట్టి, ఎక్కుపెట్టుకొని, బాణాలపొది రెండు భుజాలకు రెంటిని కట్టుకొని మృత్యు దేవతపై యుద్దానికి సిద్ధమయ్యాడు.
పైన చెప్పినవిధంగా అర్జునుడు వివిధాస్త్రాలు, గాండీవం ధరించి యుద్ధసన్నద్దుడై - ఆ సమయంలో
బ్రాహ్మణుని వెంబడి అతని ఇంటికివెళ్లి అర్జునుడు ప్రసూతి గృహానికి దశదిశలా సందులేకుండా బాణాలువెేసి పంజరంవలె నిర్మాణంచేసి మృత్యువు చొరకుండాచేసి జాగరూకుడై కాపలాకాసినాడు. బ్రాహ్మణుని భార్యకు మగబిడ్డ పుట్టినాడు. అక్కడ వింతగా చేరిన జనం పోయాడు పోయాడని ఆర్తనాదాలు చేశారు. ఈ సారి ప్రాణాలు పోవడంకాదు, బిడ్డ బొందితో మాయమైనాడు.
మృత బాలుని శరీరం మాయంకాగానే ఆ బ్రాహ్మణుడు బాగా చింతించి తనరాజైన కృష్ణుని వద్దకు విలపిస్తూ వెళ్ళి శ్రీకృష్ణుని ముందట నిలబడి ఆర్తితో ముకుందా! మునివినుతా! నందకుమారా! కీర్తిమంతుడా! కృష్ణా! గోవిందా! హరీ!
దేవా! విను. పౌరుషంలేని అర్జునుడు చేతకాకున్నా వ్యర్థమైన దంభాలు పలికి నా కుమారుణ్ణి రక్షిస్తానంటే నమ్మి, నా కొడుకును పోగొట్టుకున్నాను. నన్ను నేను నిందించుకోవాలి. సర్వలోకాల సృష్టి స్థితిలయాలకూ కారణభూతుడవైన నీవే వారింపలేక ఉండగా ఈ విపత్తును ఈ అర్జునుడనే మానవమాత్రుడు నివారించగలడా! అని ఇంకా
అర్జునుడు ఒక పెద్ద విలుకాడా? వీని బలం ఏమిటికి? వీని గాండీవం ఏపాటిది? వీని దివ్యాస్త్రాలు ఏపాటివి?; ఏమనాలి?
పై విధంగా అసమర్థుడని తనను నిందించగా విన్న అర్జునుడు మిక్కిలిగా కలతపడి, తన విద్యామహత్వంచేత వెంటనే యమలోకానికి వెళ్లాడు.
పైలోకాలకు తన మహిమతో వెళ్లి, ముందట యముని ఆలయమైన నరకంలో పరిశీలించి, అక్కడ బ్రాహ్మణ పుత్రుడు కనిపించని కారణంగా, అష్టదిక్పాలకుల స్థానాలలో మిగిలిన ఏడింటినీ పరిశీలించాడు.
అష్టదిశల పిదప, మిగిలిన దేవ, యక్ష కింపురుషాది సమూహాలు నివసించే వారివారి నివాసాలకు వెళి, ఎక్కడా బ్రాహ్మణ కుమారుల జాడ కానక, తిరిగి భూలోకానికివచ్చి, తన శపథంమేరకు అగ్నిలో ప్రవేశించటానికి సిద్ధపడ్డాడు.
అర్జునుడు బ్రాహ్మణ బాలకరక్షణలో విఫలుడైనందువల్ల తన ప్రతిజ్ఞమేరకు అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధంకాగా, శ్రీకృష్ణుడు విషయమంతా తెలిసికొని, ఈ బ్రాహ్మణపుత్రులను నీకు చూపుతాను అని అగ్నిలో ప్రవేశించకుండ ఆపి, అప్పుడు
అతిశ్రేష్ఠమైనమణులు తాపడంచేసిన బంగారురథాన్ని ఎక్కుతున్న కృష్ణుడు ఉదయాద్రినెక్కే సూర్యునివలె ప్రకాశించినాడు. అర్జునుణ్ణి ఎక్కించుకొని, శరీరకాంతులు దిక్కులలో ప్రకాశించగా; బ్రాహ్మణ బాలురను వెదకడానికి బయలుదేరాడు.
(శ్రీకృష్ణుడు సూర్యునివలె, తనురశ్మి సూర్యరశ్మివలె, కాంచన రథం ఉదయపర్వతంలాగా, మణికాంతులు సూర్యకిరణాలలాగా, సూర్యకాంతులు దిక్కులు నిండినట్లు కృష్ణుని తనుకాంతులు అన్ని దిశలా వ్యాపిస్తున్నట్లు వర్ణించడంచేత సూర్యునివలెనే కృష్ణుడు సర్వలోక సందర్శనానికి బయలేరాడని - సూచింపబడుతోంది. ఇక్కడ శ్రీకృష్ణుడు సవితృమండల మధ్యవర్తి. విష్ణువువలె సృష్టి స్థితిలయములు ఆయన చేతిలోనివి. ఇది సంపూర్జావతారలక్షణమనడానికి ఉన్న ఎన్నో ప్రమాణాలలో ఇది ఒకటి.)
పట్టణాలు, వాటి బహిఃప్రదేశగోశాలలు, దుర్గాలు, అడవులు, పల్లెలు, బోయతండాలు; గొప్పనైన నదీనదాలు; సరోవరాలుగల భూప్రపంచంచుట్టి; సప్తసముద్రాలు; వాటిమధ్య భూఖండాలు, కులపర్వతాలుదాటి, ఆపై మేరుపర్వతం దాటి, వాయువేగంతో శ్రీకృష్ణుని రథం ముందుకు సాగుతుండగా
శ్రీకృష్ణుడు అర్జున సహితుడై రథారూఢుడై ప్రయాణిస్తూ అతిభీకరమైన అంధకార ప్రపంచంలోకి ప్రవేశించాడు. సాహసించి ఇంకాముందుకు పోగా, చీకటి దట్టమై కన్నుగానక, గుఱ్ఱాలు శక్తిహీనాలై తోవతప్పి, మోకాళ్లపై కూలబడినాయి. శ్రీకృష్ణుడు ఆ చీకటిని తొలగించడానికి
(20వ శతాబ్దంలోని అంతరిక్ష పరిశోధకుల్లో ఖగోళశాస్త్ర వేత్తయైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఊర్థ్వలోకంలో చొచ్చుకుపోయేకొద్దీ దట్టమైన కటికచీకటి (Pitch Darkness/Dark Matter) ఉందని దాని తర్వాత వెల్గురేకలున్నట్లు తెలుస్తున్నదన్నారు. కాని, ఆ 'కటిక చీకటి' గురించి, దాని తత్త్వమేమిటో తెలియడం లేదన్నారు.
"పెను చీకటి” తత్త్వం ఆ కృష్ణునికే తెలుసు. మానవులబుద్దికి పరిశోధనలకు అందడం లేదు. దీనినే ఉపనిషత్తు ఒకే వాక్యంలో “తమసోమా జ్యోతిర్గమయ” అని చెప్పినది. ఇది సృష్టితత్త్వ రహస్యం.)
బాలసూర్యుని కాంతివంటి కాంతితో ప్రకాశిస్తూ కృష్ణుడు ప్రయోగించిన చక్రం దూసుకువెళ్లి చీకటిని వేగంగా తొలగిస్తూపోగా దానివెంబడి ఆ వెలుగులో రథాన్ని పరిగెత్తిస్తూతోలి, చీకటి ప్రదేశాన్ని దాటినాడు. ఆ తరువాత కళ్లు మిరుమిట్లు గొలిపే మహాతేజస్సు ఆకాశంలో కనిపించింది. ఆ వెలుగును చూసి అర్జునుని భయం కలిగింది. కళ్లుమూతలు పడ్డాయి. అలా కొంతదూరం వెళ్ళి
కృష్ణుని రథానికి ముందుచీకటి, తరువాత వెలుగు, అడ్డమైనవి. ఇపుడు గొప్ప సముద్రంవంటి జలరాశి ఎదురైంది. గొప్పగా గాలివీచి సృష్టించిన మిక్కిలి చలించే అలలుగల సముద్రంవంటి ఆ జలరాశిలో ప్రవేశించగా వారికి కోటిసూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న
ఆ జలరాశిమధ్యలో వేలాదిమణిస్తంభాలతో ప్రకాశించేదీ, రత్నహారాలు వేలాడుతుండేదీ, అంతులేని తేజస్సుతో ప్రకాశించేదీ, సూర్యచంద్రకాంతులు చొరలేనిదీ, జన్మరాహిత్యానికి మార్గమైందీ, ఐశ్వర్యాన్ని ఇచ్చేదీ, అంత మనేదిలేనిదీ, మహోన్నతమైంది, అనల్పవైభవాస్పదమైందీ, పరమయోగులు తాము చేరాలని కోరుకొనేదీ, హరిభక్తులు నివసించేదీ ఐన ఒక దివ్య భవనంలో
కృష్ణార్హునులు చూచిన దివ్యభవనంలో శరదృతువులోని వెన్నెలవలె, కర్పూరంవలె, మంచువలె, ముత్యాలవలె తెల్లని దేహంతో ఒప్పినవాడూ; తుమ్మెదలు, నల్లకలువలు, ఇంద్రనీలమణులవంటి నల్లని పడగకింది మెడలు గలవాడూ. ఉదయభానునివంటి లేత ఎరుపురంగులో ఉన్న పద్మరాగ మణులు నిలిచిన వేయి పడగలు (తలలు) గలవాడూ, తెరచిన నోళ్లనుండి విషధూమం బయటికి వెలువడుతున్నదా అన్నట్లున్న నాలుకలు కలవాడూ, సాయంకాలపు హోమకుండాలవంటి వేడి చూపులుగలవాడు, వెండికొండలా తెల్లని పెద్దదేహంగలవాడు ఐన ఆదిశేషుడు సుఖతల్పంగా అమరగా ఆ పడకపై...
(ఆదిశేషుని దేహం చిత్రవర్ణసమేతం. తెల్లనాగుకనుక శరచ్చంద్ర చంద్రికలవంటి దేహం నల్లనిమెడలు, వేయిపడగలపై నిల్చిన ఉదయభానునివంటి లేత ఎరుపురంగులోని వేయిమణులు, హోమకుండం వేడివంటి ఎర్రనైన చూపులు, విషధూమాన్ని అనుకరించే నల్లని రెండువేలనాలుకలు, చుట్టలుగా చుట్టి పరచుకొన్న హిమాలయంవంటి వెండిరంగు శరీరం ఇలాసాగింది మనోహరంగా వర్ణన. పగలంతా జ్వలించిన హోమకుండల్లో సాయంత్రం జ్వాలలుకాక వేడిమాత్రం రగులుతూ, తగులుతూ ఉంటుంది. కనుక వేడి చూపులకు సాయంతన హోమకుండాలతో పోలిక చెప్పబడింది.)
ఆదిశేషునితో ఏర్పడ్డ పడకపై సుఖంగా కూర్చున్న విష్ణువుకు దగ్గరగా వెళ్లిన సమయంలో
నీలమేఘంవంటి శ్యామలవర్ణంతో వెలిగేవాడు, ఆశ్రితుల్ని రక్షించడంలో ఆనందం పొందేవాడు, యోగి హృదయ పద్మాలలో నివసించేవాడు, నిండు జాబిల్లి మోమువాడు, జగత్తుకు హితంచేసేవాడు, వేకువనే వికసించిన పద్మాలవంటి కన్నులుకలవాడు, లక్ష్మీమానసోల్లాసి, పీతాంబరుడు, హారకుండలకేయురకిరీటాద్యాభరణాలు ధరించినవాడు. భవసాగరంనుండి తరింపచేసేవాడు, భక్తపోషకుడూ ఐన విష్ణు భగవానుణ్ణి.
ఇంకా, సునందాది పరిచారకులచే సేవించబడుతున్నవాణ్ణి సంతోష హృదయంకల్గినవాణ్ణి, శ్రీదేవీ, భూదేవీ సమేతుడైనవాణ్ణి, నారదాదుల సంకీర్తనలకు ఆనందించేవాణ్ణి, అవ్యయుణ్ణి, పుణ్యాత్ముడూ, అనంతుడూ, అప్రమేయుడూ, జయంకలవాడు; మార్పులు లేదు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, కరుణాసముద్రుడు, చ్యుతిలేనివాడు, మహానుభావుడు, పరమాత్ముడు, పురుషశ్రేష్ఠుడు, జగదుత్పత్తి స్థితి, లయకారకుడు, జ్ఞానాజ్ఞాన ప్రభుడు, అష్టభుజుడు, కౌస్తుభశ్రీవత్సములు ఎదపై లాంఛనాలుగా కలవాడు, శంఖచక్రాది ఆయుధధారి, సర్వశక్తిమంతుడు, బ్రహ్మకు తండ్రియైనవాడు అగు శ్రీమన్నారాయణుణ్ణి కృష్ణార్జునులు దర్శించుకొని సాష్టాంగప్రణామాలు ఆచరించి, భక్తితో నుతించగా శ్రీమహావిష్ణువువారిని దయతోచూచి, చిరునవ్వుతో, ఆప్యాయంగా ఇలా అన్నాడు.
భూమికి బరువైన రాక్షసుల్ని చంపి, ధర్మరక్షణ చేసేందుకు మీరిద్దరు నా అంశతో నరనారాయణులుగా భూమిపై జన్మించారు.
భూభారంతగ్గించే గొప్ప నిష్ఠతో మీరిద్దరూ భూలోకంలో ప్రసిద్ధులుకాగా, మిమ్మల్నిద్దరినీ చూడాలని ఇక్కడి మునులు కోరగా బ్రాహ్మణకుమారులను తెచ్చే మిషతో మిమ్ము రప్పించాను - అని శ్రీ మహావిష్ణువన్నాడు.
విష్ణువిలా చెప్పి, బాలకుల్ని తీసుకొని వెళ్తండనగా, ఆయనను వీడ్కొని, నమస్కరించి, స్తుతించి బ్రాహ్మణబాలకులతో కృష్ణార్జునులు తమ కోర్కెలు ఫలించగా ఆ బాలకులను వారివారి వయస్సులకు తగిన రూపాలతో తీసుకొనివచ్చి వారితండ్రి అయిన బ్రాహ్మణునికి అప్పచెప్పారు. అతడు చాలా సంతోషించినాడు. ఆ సమయంలో
ఓ పరీక్షిన్మహారాజా! ఇంద్రసూనుడైన అర్జునుడు శ్రీకృష్ణునితోబాటు వైకుంఠానికివెళ్లి శరణాగతరక్షకుడైన ఆ శ్రీమహావిష్ణువురూపాన్ని, వైభవాన్నీ కన్నులార వీక్షించినందుకు సంబరపడి, పలుమార్లు ఆ దేవదేవుణ్ణి స్తుతించినాడు.
కమలాక్షుడు, భక్తకల్పవృక్షము, సకలేశ్వరుడు, పురుషోత్తముడు, అతిపవిత్రుడు అయిన కృష్ణుణ్ణి స్తుతిస్తూ, ఆయన పాదాలకు నమస్కరించి, పరమానందం పొందాడు అర్జునుడు.
ఈ సంఘటన తరువాత
అంతంలేనివాడు, సకలేశ్వరుడు, పుట్టుకలేనివాడు, వేదాలచే తెలియదగిన భగవంతుడైన కృష్ణుడు, బ్రాహ్మణాదులైన జాతి సర్వప్రజలను, సమస్తధన, కనక, ధాన్య, వస్తు, వాహన సమృద్ధమై సంతోషించేవిధంగా ఏలుతూ, ఆర్హులను కాపాడుతూ, ధర్మాన్ని పరమోత్సాహంగా ప్రతిష్ఠాపిస్తూ, పాపులను శిక్షిస్తూ ద్వారకలో ప్రకాశిస్తూ, తన రాజ్యప్రజలు ప్రశంసించేలా తనకు తానే నిర్ణయించి, వేదాలు చెప్పినట్లుగా పలుయజ్ఞాలు, ఎంతో ఇష్టంగా నిర్వహించాడు.
(తనకు తానే అనడంలో ఓ విశేషం ఉంది. తానే సర్వయజ్ఞాలకు భోక్త. ఇక్కడ తనను తృప్తి పెట్టేందుకు ఇతరులు యజ్ఞాదులు చేయాలి. కాని, తానే యజ్ఞకర్తయై తనకు తానే (కర్త, భోక్త) చేశాడు. ఇది ప్రజల సంతోషంకొరకు, ధర్మాచరణకొరకు చేశాడు.)
ఈ విధంగా తన రాణులందరితో అఖండమైన భోగభాగ్యాలు అనుభవిస్తూ వేదవిహితమైన మార్గంలో గృహస్థాశ్రమధర్మాన్ని నిర్వహిస్తూ, ధర్మ, అర్థ, కామాలను అనుభవిస్తూ సజ్జనులకు ఆదర్శంగా సంసారివలే ప్రవర్తిస్తున్నాడు.
పరీక్షిన్మహారాజా! దేవదానవయుద్ధంలో మరణించిన రాక్షసులు తిరిగి ద్వాపరయుగంలో రాజులై పుట్టి ప్రజలను బాధ పెట్టగా
రాక్షస అంశతో పుట్టిన ఆ రాజులను సంహరించటానికి, విష్ణువు దేవతలను యాదవులుగా పుట్టింపగా, వారు తామరతంపరగా నూటబఒక్క వంశాలుగా అభివృద్ది చెందినారు. వారిని లెక్కించటానికి బ్రహ్మకు కూడా వశం కాదు.
మహారాజా! కృష్ణుడు వేణువు ఊదితే గోపాలురు, గోపికలు, ఆయన ఉన్న వన భూములకు పరిగెత్తుకొని వస్తారే? ఎల్లప్పుడూ ఆయననే సేవించే భక్తులైన పండితులు ఆ దయాసముద్రుణ్ణి ఆరాధించకుండా ఉంటారా?
ఓ రాజా! అశుభాన్ని నశింపజేసే ఎవ్వని నామస్మరణ, హృదయంలో చేస్తారో వారి జీవనం సాథ్యం, ధన్యం అవుతుంది. సంసార సంబంధమైన దోషాలను తొలగించుకుంటారు. కాలచక్రమనేపేరుగల సుదర్శన చక్రాయుధం ధరించిన ఆ కృష్ణుడు భూభారం తొలగింపచేయడంలో వింతయేముంది?
ఈ విధంగా గోపికలకు మన్మథుడైన శ్రీకృష్ణుడు లీలగా మానవ రూపం ధరించి, తన ద్వారకానగరంలో దివ్య వైభవంతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అని వివరించి, ఇంకా ఇలా అన్నాడు.
ఓ పరీక్షిన్నరేంద్రా! నేను నీకు ముల్లోకాలకు మంగళకరమైనట్టి శ్రీకృష్ణ కథఅనే అమృతాన్ని అందించాను. దీన్ని భక్తితో గ్రోలిన పుణ్యాత్ములు, ఇహలోకంలో సుఖాలుపొంది, పుణ్యాత్ములై పరలోకంలో మోక్షాన్ని పొందుతారు.
ఈ విధంగా శుకుడు, పరీక్షిన్మహారాజుకు చెప్పిన అతిమనోహరమైన భాగవతకథలలోని శ్రీకృష్ణచరిత్రమును సూతుడు యథాతథంగా మునులకు చెప్పినాడు. వారు ఆనందంగా స్వీకరించారు
మునులు కృష్ణ కథ చెప్పిన సూతుని బహుభంగుల సత్కరించి, తృప్తి పెట్టిన మహిమాభీరామమైన కృష్ణగాథను గొప్పభక్తితో స్వీకరించి భజించారు.
శ్రీకృష్ణార్పణమస్తు
శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం