Wednesday, August 5, 2026

Peace Rituals (Shanti Homas) - శాంతి హోమాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - శాంతి హోమాలు

నారదా! శమీసమిధలతో భూత రోగ గ్రహాదుల ఉపశమనంకోసం శాంతిహోమం చెయ్యాలి. పాలుగారే చెట్టునుంచి పచ్చి పేళ్ళు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో (మద్ది) చేసినా  భూతరోగశాంతి కలుగుతుంది. 

సూర్యుడికి ముందుగా జలతర్పణం చెయ్యాలి. మోకాలిబంటి నీటిలో నిలిచి. చేస్తే దోషాలన్నీ ఆంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతకభయాలు తొలగిపోతాయి. శాంతికర్మలన్నింటికీ నీటిలో నిలిచి జపం చెయ్యడమే ఉత్తమం.

బంగారం వెండి రాగి మట్టి పాత్రల్లోగానీ బొడిపెలులేని కొయ్యపాత్రలోగానీ పంచగవ్యాన్ని నింపుకొని క్షీర వృక్షకాష్ఠాలతో జ్వలితాగ్నిలో సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాహుతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యంలో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలిప్రదానం చెయ్యాలి. పరదేవతను ధ్యానించాలి. అభిచారాలు పాపాలూ నశిస్తాయి. దేవ భూత పిశాచాదులు వశమవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచాదులు పారిపోతాయి.

మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి ఇలాగే సహస్రహోమం చేసి నిఖనం చేస్తే సర్వశాంతులూ సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి నేలలోగానీ ఇసుకలోగానీ పాతిపెట్టి మంత్రజలాలు నింపి నాలుగు దిక్కులనుంచీ తీరజలాలను ఆవాహనచేసి వివిధపుష్పాలూ బిల్వపత్రాలూ బియ్యమూ నువ్వులూ ఆవాలూ పాలుగారే చెట్ల చిగురాకులూ అందులో వెయ్యాలి. 

కుశకూర్చంతో(దర్భలతో చేసిన పొడవుపాటి ముడి) మంత్రాలు చదువుతూ కలియద్రిప్పాలి. అటుపైని ఆనీరు జల్లుకోవాలి. బ్రాహ్మణులపై జల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూతరోగాదులూ చేతబడులూ(అభిచారాలు) తొలగిపోతాయి.

ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటినుంచికూడా బయట పడగలడు. దీర్ఘాయుర్దాయం కోరుకునేవారందరూ ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి నూరుగోవులూ సంతృప్తికరంగా దక్షిణలూ ఇవ్వాలి.

శనివారంనాడు రావిచెట్టు దగ్గర మంత్రజపం చెయ్యడం, భూతరోగాభిచారాది శాంతికరం. పాలుగారే గుడూచి సమిధలతో(తిప్పతీగ) హోమం చేస్తే సర్వరోగాలూ ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయహోమమంటారు.

ఇలాగే జ్వరశాంతికి చూతహోమం క్షయరోగోపశమనానికి వచాహోమం. రాచపుండు(రాజయక్ష్మ) తగ్గడానికి మధుత్రితయహోమం - చెప్పబడ్డాయి. అన్నంతో పాయసం వండి సూర్యుడికి నివేదించి హోమంచేసి మిగిలినదాన్ని భుజిస్తే రాజయక్ష్మ (రాచపుండు) తగ్గుతుంది.

తిప్పతీగ కణుపులతో సోమదేవతాకంగా హోమంచేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖవృక్ష పుష్పాలతో హోమం కుష్ఠురోగనివారిణి. అపామార్గ పుష్పాలను బియ్యంతోకలిపి చేసే హోమం అపస్మారరోగానికి ఉపశమనం. 

క్షీరవృక్ష సమిధలతో హోమం ఉన్మాదరోగ నివారకం. ఔదుంబర సమిధలతో చేసే హోమం ఆతిమేహరోగాన్ని నయం చేస్తుంది. ఇక్షుమధుహోమంతో ప్రమేహరోగశాంతి. మధుత్రితయహోమం మసూరికా నివారకం. కపిలాహోమంకూడా ఇంతే. 

ఇంటిలో చీమలూ దోమలూ వగైరా క్రిమి క్రీటకాలు నశించాలంటే శమీసమిధలు హోమం చెయ్యాలి. వనవేతనహోమం(అడవి పుబ్బలి) వారంరోజులు చేస్తే పిడుగుపాటుల నుంచీ భూకంపాలనుంచీ నివారణ లభిస్తుంది. శతమంత్రజపం చేసి లోష్టాన్ని తాకిన్తూ ఏ దిక్కున ఎంతదూరం వెడితే ఆ మార్గంలోని ప్రదేశాలన్నీ ఆగ్ని - మారుత - శత్రుభయ రహితాలవుతాయి. 

మనస్సులోనే ఈ జపం చేస్తే బంధవిమోచన కలుగుతుంది. అభిమంత్రితజలపానం భూతపిశాచవిమోచకం. అలాగే అభిమంత్రించి విభూతి పెట్టినా శిరసున జల్లినా సర్వవ్యాధులూ సర్వభయాలూ తొలగిపోతాయి. నూరేళ్ళు సుఖంగా జీవిస్తాడు.

ఈ హోమాలన్నీ ఎవరికివారే చేసుకోవడం ఉత్తమం. అశక్తులు భూరిదక్షిణలిచ్చి బ్రాహ్మణులతో చేయించుకోవచ్చు. పుష్పాలతో చేసే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికరాలు. లక్ష్మీప్రదాలు. 

ఎర్రకలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి. బంగారం దొరుకుతుంది. బిల్వపత్ర, బిల్వపుష్ప, బిల్వఫల, బిల్వ సమిధలతో చేసే హోమాలు ఏవైనా సంపత్ప్రదాలే. వీటిని నేతితో అభిమంత్రించి నూరుచొప్పున సప్తాహహోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంటిలో తిష్ఠవేస్తుంది. 

త్రిమధులాజహోమం(పేలాలు) కన్యాలాభం కలిగిస్తుంది. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. సూర్యదేవతాకంగా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికందుతుంది. అన్నహోమం అన్నవర్ధకం. వ్రీహిహోమం(బియ్యం) వ్రీహివర్ధకం. పిడకలతో చేసే హోమాలు పశుసంపదను పెంచుతాయి. 

ప్రియంగు - పాయస - ఆజ్యహోమాలు సంతాన ప్రాప్తికరాలు. భాస్కరుడికి హోమంచేసి మిగిలిన పాయసాన్నం ఋతుస్నాతలు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది. పుత్రసంతానం కలుగుతుంది. మొలకలు వచ్చిన తడిగింజలతో హోమం ఆయుర్వర్ధకం. ఇటువంటి ఎర్రగింజలూ మధుత్రయమూ వ్రీహి - కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారమవుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.

సువర్ణకుట్మలాలు(సంపంగి మొగ్గలు) హోమం చేసినా కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక పాలు తేనె నెయ్యి - సప్తాహహోమం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. అన్నమూ పాలూ నెయ్యి వీటితో చేసిన హోమానికీ ఇదే ఫలం. న్యగ్రోధసమిధలూ(మర్రి) పాయసమూ రోజుకి నూరుగా ఏడురోజులు హోమం చేసి ఆ ఏడురోజులూ పాలుత్రాగి గడిపి మంత్రజపం చేస్తే మృత్యువును జయిస్తాడు.

నిరాహారుడై మౌనియై మూడురేయింబవళ్ళు జపించినా యముడు దరిదాపులకి రాడు. నీటిలోదిగి జపించినా బిల్వవృక్ష సన్నిధిలో జపించినా విశేషఫలితాలుంటాయి. ఒక్క నెలపాటు ఇలా జపిస్తే చాలు వాడు రాజ్యాధికారి అవుతాడు. సమూలఫల పల్లవంగా బిల్వవృక్షాన్ని హోమంచేసినా రాజ్యం దక్కుతుంది. నూరు పద్మాల చొప్పున నెలనాళ్ళు చేసినా ఈ ఫలం లభిస్తుంది. 

గంజితోహోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్దాలకు వెళ్ళబోయేముందు రావి సమిధలతో హోమం నిర్వహిస్తే విజయం వరించి వస్తుంది. పాలతో కలిపి వేతసపత్రపుష్ప హోమం సప్తాహదీక్షగా చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డులోతు నీళ్ళల్లో నిలిచి మంత్రజపం ఏడురోజులు చేస్తే వానలు పడతాయి. నీటితో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు.

మోదుగు సమిధలతో చేసే హోమం బ్రహ్మవర్చస్సును అందిస్తుంది. పలాశకుసుమాలతో హోమం సర్వాభీష్టప్రదాయకం. పాలతో హోమం మేధాశక్తినీ నేతితో హోమం బుద్ధిశక్తినీ పెంపాందిస్తాయి. ఉప్పూ తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువునల్లా వశపరుచుకోవచ్చు. 

ఇలాగా కోరికలు తీర్చే హోమాలు చాలా ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ నిర్వహించాలి. బ్రాహ్మణుడు తనకోసంగానీ ఇతరులకోసంగానీ వీటిని చెయ్యవచ్చు. అన్యులకోసం చేసినా ఇవి విప్రుడికీ పుష్టిదాయకాలేకావడం మరీ విశేషం.

రోజుకి వెయ్యిగా నెలనాళ్ళు మంత్రజపం చేస్తే ఆయుష్కాముడి కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు రెండూ కావాలనుకుంటే రెండు నెలలు జపం చెయ్యాలి. సంపదలుకూడా కావలిస్తే మూడునెలలు, దారపుత్రులుకూడా కావలిస్తే నాలుగునెలలూ, వారికీ ఆరోగ్యం కావాలంటే అయిదునెలలు, వారికీ సంపదలు కావాలంటే ఆరునెలలు, వారికీ విద్యలు కావాలంటే ఏడునెలలు - ఇలాగ కోరికలు పెరుగుతున్నకొద్దీ మంత్రజపం చెయ్యాల్సిన నెలలూ పెరుగుతుంటాయి. 

ఒంటికాలుమీద నిలబడి చేతులు పైకెత్తి నిరాశ్రయుడుగా నిలిచి మూడునెలలు రోజుకి మూడువందలు చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడికింక తీరని కోరికలంటూ ఉండవు. అలాగే శతోత్తర సహస్రం చొప్పున(పదకొండువందలు) జపించగలిగితే సిద్ధించనిదంటూ ఉండదు. 

నీటిలో మునిగి నూరుచొప్పున నెలనాళ్ళు జపిస్తే ఇష్టఫలావాప్తి. మూడువందల చొప్పున జపిస్తే సర్వవాంఛిత సిద్ధి. రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్దతిలో ఏడాదిపాటు మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. రెండేళ్ళు జపిస్తే అమోఘవాక్కు అవుతాడు. మూడేళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. నాలుగేళ్ళు జపిస్తే భగవంతుడు తోడై నిలుస్తాడు. అయిదేళ్ళకి అణిమాది శక్తులు సిద్ధిస్తాయి. ఆరేళ్ళకి కామరూపధారణశక్తి వస్తుంది. ఏడేళ్ళకి అమరత్వం లభిస్తుంది. తొమ్మిదేళ్ళకి మనుత్వం, పదేళ్ళకి ఇంద్రత్వం, పదకొండేళ్ళకి ప్రజాపతిత్వం, పన్నెండేళ్ళకి బ్రహ్మత్వం సిద్ధిస్తాయి. 

ఈ తపస్సుతోనే నీవంటివారు లోకాలను జయిస్తున్నారు. కొందరు శాకాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు పయస్సులుగ్రోలి, కొందరు నెయ్యిత్రాగి, కొందరు సోమరసం పుచ్చుకుని, కొందరు చరువు(హవిష్యం) ఆరగించి, కొందరు పదిహేను రోజులకు ఒక్కసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాన్నం తిని - ఇలాగ కఠోర నియమాలతో తపస్సులు చేస్తున్నారు. మహర్షు లనిపించుకుంటున్నారు.

ఇటువంటి దీక్షతో మంత్రజపం మూడువేలు చేస్తే రహస్యంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. వెయ్యిచొప్పున నెలనాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపమైనా అంతరిస్తుంది. మూడువేలు చొప్పున నెలనాళ్ళు చేస్తే సురాపానదోషం నశిస్తుంది. గురుపత్నీ సంగమదోషమైనా తొలగిపోతుంది. 

అడవిలో పర్జశాల వేసుకుని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్యాపాతకమూ అంతరిస్తుంది. నీళ్ళల్లో మునిగి రోజుకి వెయ్యి చొప్పున పన్నెండురోజులు జపిస్తే సర్వమహాపాతకాలూ తొలగిపోయి విప్రుడు విశుద్ధుడవుతాడు.

ప్రాణాయామానికికూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకం. నూరు ప్రాణాయామాలు చేస్తే అన్ని పాపాలూ తొలగి శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి వెయ్యిచొప్పున నెలవాళ్ళు ఉపవాసం ఉండి మంత్రజపం చేసినవాడిని నిత్యజాపి అంటారు. అతడు పవిత్రుడు. 

ఇరవైనాలుగు వేలు చేస్తే అది కృచ్భసంజ్ఞితం. అరవైనాలుగువేలు చేస్తే చాంద్రాయణసమానం. ఉభయ సంధ్యల్లోనూ ప్రాణాయామం చేసి కనీసం నూరుసార్లు(గాయత్రి) మంత్రజపం చెయ్యాలి. ఇది గృహస్థుకి కర్తవ్యం తదిత్యాదిఋక్కు సర్వపాపహారం. 

నీటిలోమునిగి ఈ ఋక్కును రోజుకి నూరుసార్లు జపించాలి. జపిస్తూ సూర్యరూప గాయత్రీదేవిని ధ్యానిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

నారదా! శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాతిరహస్యాలైనా నీకు సవిస్తరంగా సవ్యాఖ్యానంగా తెలియజేశాను. ఇది సదాచార సంగ్రహం. క్లుప్తంగా చెప్పాను. ఈ పద్దతిలో జీవిక సాగించినవారిని మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య - నైమిత్తిక - కామ్యకర్మలన్నింటినీ యథావిధిగా ఆచరించినవారికి భుక్తిముక్తిఫలాలు కొంగుబంగారాలు. 

ఆచారమే మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు(రక్షణ) జగదీశ్వరి అని సర్వశాస్తాలూ ఆచార ఫలాన్నీ మహత్తునూ శతధా కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడూ పరిపూతుడే. అతడే సుఖి. అతడే ధన్యుడు. ఇది సత్యం. 

సత్యం, సదాచారం పాటించడంకన్నా దేవీ అనుగ్రహ సంపాదనకు మరొక సులభమార్గం లేదు. దీన్ని వినడంకూడా సంపత్తి సాఖ్యదాయకమే. సదాచారంవల్ల ఐహికాముష్మిక సుఖాలు అన్నీ చేకూరుతాయనడం సారాంశం. అదే నీకు చెప్పాను, మరింకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణమహర్షి ముగించాడు.

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము




SRI DEVI BHAGAVATHAM PART 12 - శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము

శౌనకాది మహమునులారా ! నారాయణమహర్షి ఇంతవరకూ చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు మరొక ప్రశ్న వేశాడు. వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం ఆందంగా ఉంటుంది. కనక అలాగీ చెబుతాను వినండి - అంటూ సూతుడు కొనసాగించాడు.

నారాయణమహర్షీ | సదాచారం గురించి సవివరంగా తెలియజేశావు. చాంద్రాయణజాది వ్రతాలగురించీ చెప్పావు. కానీ అవన్నీ ఆచరణకు కష్టసాధ్యాలు. మాలాంటివారికి దేవి అనుగ్రహం లభించేట్టూ, సుఖంగా తేలికగా అనుష్టించడానికి తగినట్టూ ఏమైనా వ్రత విధానాలుంటే తెలియజెయ్యి. గాయత్రీవిధి చెప్పావు. అనుష్టానం చాలా ఉంది. వాటిల్లో ముఖ్యాతిముఖ్యం అత్యధిక పుణ్యప్రదం ఏమిటి? గాయత్రీమంత్రానికి ఇరవైనాలుగక్షరాలన్నావు. వాటికి బుషులు ఎవరు ? ఛందస్సు లేమిటి ? దేవతలెవరు ? ఇవన్నీ సమగ్రంగా తెలియజేసి నావంటి అలనుల్ని తరింపజెయ్యి - అని నారదుడు ప్రార్థించాడు. నారాయణ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఆరంభించాడు.

గాయత్రీ మంత్రాక్షర మహిమ
























శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి





Prajapatyam - ప్రాజాపత్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ప్రాజాపత్యం

వేదాధ్యయనానికి ముందు ప్రాజాపత్యం చెయ్యాలి, గుండు కొట్టించుకుని మీసాలు తీయించుకుని గోళ్ళు తొలగించుకుని శుచి అవ్వాలి. ఒక పగలూ రేయీ మౌనంగా ఉండాలి. వ్యాహృతులు జపించాలి, ఆపోహిష్ఠాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలలో పునంతీ, స్వస్తిమతీ, పావమానేత్యాది మంత్రాలతో ఆయావిధులు నిర్వర్తించాలి.

సహస్రగాయత్రి చెయ్యాలి. కనీనం నూరు - లేదా వంద చెయ్యాలి. తర్పణలు విడిచి పెట్టాలి. అసంభాష్యులతో భాషించకూడధు. సత్యవాఙ్నియమం పాటించాలి. ప్రాజాపత్య సాంతపన పరాక చాంద్రాయణాదులకు ఈ నియమాలు సమానం. 

ఇలా చేస్తే పంచమహాపాతక విముక్తి కలుగుతుంది. మూడు చాంద్రాయణాలతో బ్రహ్మలోకం లభిస్తుంది. ఎనిమిదింటితో దేవతాసాక్షాత్కారం. పదింటితో సర్వచ్చందఃపరిజ్ఞానం,ర్వకామ సమువలబ్ధి.

మూడునాళ్ళు ప్రాతఃకాలంలోనూ మూడునాళ్ళు సాయంకాలంలోనూ అయాచితాన్నం తింటూ మరిమూడునాళ్ళు ఉపోష్యం ఉండి ప్రాజాపత్యం చెయ్యాలి. గోమూత్రం గోమయం గోక్షీరం గోదధి ఆవునెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది సాంతపనం.

రోజుకి ఒక్కముద్దమాత్రమే తింటూ మూడునాళ్ళు ఉపవాసం చేస్తే అది మహాసాంతపనం. జలక్షీర ఘృతానిలాలను ప్రతిమూడునాళ్ళకూ ఒక్కసారి గ్రహిస్తూ జలాహారిగా ద్వాదశాహాలు ఉపవాసం చేస్తే అది పరాకవ్రతం. 

శుక్షపక్షంలో రోజుకి ఒకముద్ద చొప్పున పెంచుకొంటూ వెళ్ళి కృష్ణపక్షంలో (అలా తగ్గించుకుంటూ వచ్చి) ఒక్కొక్కటీ తింటూ అమావాస్యనాడు అస్సలు ఏమీ తినకండా ఉపోష్యం ఉంటే అది చాంద్రాయణవ్రతం.

ప్రాతఃకాలాన ఆహ్నికక్రియలు నిర్వర్తించి నాలుగుముద్దలూ, సాయంకాలాన విధులు నిర్వర్తించి సూర్యాస్తమయం అయ్యాక నాలుగు ముద్దలూ తింటూ నెలగడపడం శిశుచాంద్రాయణ వ్రతం. మధ్యాహ్నంపూట ఎనిమిదేసి హవిష్యపిండాలను తిని ఉపవాసాలుండటం యతిచాంద్రాయణం. 

ఈ వ్రతాలు ఒక్కొక్కటీ సప్తరాత్రకాల వ్యవధిలో త్వక్‌ - అసృక్‌ - పిశిత - అస్థి - మేదో - మజ్జా - వసాభాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్నీ ఆత్మనూ శుద్ధి పరచుకుని పురశ్చరణ స్వాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నియతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. 

నారదా! శ్రుతిసారమైన పురశ్చర్యావిధానం సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇది అత్యంత గోప్యంసుమా!

నారాయణమహర్షి! పురశ్చర్యావిధానం తెలిసింది. దానితోపాటు ప్రాజాపత్యాదివ్రతాలూ తెలిసాయి. మరి శాంతిప్రయోగాలుకూడా తెలియజేస్తే ధన్యుణ్ణి అవుతాను - అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు.

శాంతి హోమాలు




Tuesday, August 4, 2026

Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం

అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్య త్రిషవణస్నాయీ నిత్యశుభభాషణుడూ పాపిష్ఠస్నేహదూరుడూ - ఉత్తమోత్తముడు. 

జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైథునాలాపాలు (బూతులు) అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైథునప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను.

బ్రాహ్మణక్షత్రియులు గృహాస్థాశ్రమంలోకూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి, అనుమతించిన దినాలలో రాత్రిపూటమాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. 

దేవ పితృ ఋషి ఋణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యనివాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళస్తనంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవఋణం, తిలోదకాలతో పితౄణం, బ్రహ్మచర్యంతో ఋషిబుణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమధర్మాలను పాటించడం. 

క్షీరాహారిగానీ ఫలాహారిగానీ శాకాహారిగానీ హవిష్యాహారిగానీ భిక్షాహారిగానీ చాంద్రాయణ వ్రతధారిగానీ అవుతూ మంత్రజపం చెయ్యాలి. క్షార లవణ ఆమ్ల తాంబూలాదులూ రాత్రిభోజనమూ దుష్టసహవాసమూ మద్య సేవనమూ శ్రౌతస్మార్తవిధులకు సుతరామూ పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చెయ్యకూడదు. (జపం రాత్రౌ వివర్జయేత్).

ద్యూతక్రీడలతో స్త్రీగోష్ఠులతో నిద్రతో వాదవివాదాలతో వృథాకాలయాపన చెయ్యకూడదు. దేవతా పూజలూ స్తోత్రపఠనలూ ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలూ - వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

భూశయనం బ్రహ్మచర్యం మౌనదీక్ష నిత్యమూ త్రిషవణస్నానం శూద్రకర్మవివర్జన నిత్యపూజ నిత్యదానం ఆనందం స్తుతికీర్తనం నైమిత్తికార్చనం దేవతలపట్ల విశ్వాసం గురువులపట్ల విశ్వాసం ఇవి పన్నెండూ జపనిష్ఠుడి ధర్మాలు. సిద్ధిదాయకాలు.

నిత్యమూ సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందుగానీ అర్చించిన ఆగ్నిముందుగానీ చెయ్యవచ్చు. 

బ్రాహ్మణుడు స్నాన పూజా జప ధ్యాన హోమతర్పణ తత్పరుడై నిష్కామంగా సత్కర్మలనన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురశ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిన్తుంది. జపహోమాలపట్ల ఏకాగ్రత కుదురుతుంది. 

తపస్సుకీ ఆధ్యయనానికీ అంకితమైనవారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గసంపాదకం. ఈ తపస్సే మహత్త్వసాధకం. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏయే దేవతలు ఏయే ఫలాలను ఇస్తారని ఋషులు చెప్పారో ఆదేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరతాయి. పురశ్చరణమనేది సర్వకర్మలకూ సిద్ధికారకం. కనక ఆరంభంలో చెయ్యాలి.

ప్రాజాపత్యం




Pancha Pranagni Hotram - పంచ ప్రాణాగ్ని హోత్రం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - పంచ ప్రాణాగ్ని హోత్రం

నారదా! భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రమని ఒకటి ఉంది. అదికూడా పనిలోపని చెప్పేస్తాను. తెలుసుకో. దీన్ని తెలుసుకున్నా ఆచరించినా పాపవిమోచనం తథ్యం. ఋణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది. ఇరవైయొక్క తరాలు తరిస్తాయి. 

ఈ పంచప్రాణాగ్నిహోత్రానికి హృదయపద్మమే ఆరణి. మనస్సు మంథానం. వాయువు అనే రజ్జువుతో అగ్నిని మధించాలి. దీనికి నేత్రాలు అధ్వర్యువు. తర్ణనీ మధ్యమాంగుష్ఠాలతో ప్రాణాగ్నికి మధ్యమానామికాంగుష్ఠాలతో అపానాగ్నికి, కనిష్ఠికానామికాంగుష్ఠాలతో వ్యానాగ్నికి, కనిష్ఠికా తర్జన్యంగుష్టాలతో ఉదానాగ్నికి, అయిదువేళ్ళతోనూ తీసుకుని సమానాగ్నికి అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వెయ్యాలి. 

ప్రణవాద్యాలూ స్వాహాంతాలుగా నామమంత్రాలు జపించాలి. (ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా - ఇత్యాదిగా). ముఖంలో ఆహవనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని నాభిలో దక్షిణాగ్ని స్మర్తవ్యాలు. అధోభాగంలో అసథ్యకులిద్దరూ సభ్యులు.

ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షువు సరే అధ్వర్యుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నీధ్రుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్సు, బుద్ధియే పత్ని, గృహస్థాశ్రమ వాసి దీనికి ఆధీనుడు, వక్షఃస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్భలు. చేతులే స్రుక్ స్రువాలు (హోమాగ్నిలోకి నెయ్యి పోసే కర్రగరిటెలు).

బంగారపు రంగులో ఉండే(రుక్మవర్ణం) క్షుధాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి, ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు, "ఓం ప్రాణాయ స్వాహా" అనీ "ఇదమాదిత్యాయ న మమ" అనీ మంత్రం. 

ఇక అపానమంత్రానికి ఆవుపాలలాగా తెల్లగా ఉండే శ్రద్దాగ్నియే ఋషి, సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందస్సు. ఓం అపానాయ స్వాహా. సోమాయేదం న మమ - అనేది మంత్రం. 

వ్యానమనబడే ప్రాణవాయు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి అగ్నియే దేవత, అనుష్ఠుప్పు ఛందస్సు, ఓం వ్యానాయ స్వాహా. అగ్నయ ఇదం న మమ - అనేది మంత్రం.

ఉదాన ప్రాణవాయు మంత్రానికి ఇంద్రగోపవు రంగులో ఉండే అగ్నియే ఋషి వాయువే దేవత. బృహతీఛందస్సు. ఓమ్‌ ఉదానాయ స్వాహా. వాయవ ఇదం న మమ - అనేది మంత్రం. 

సమాన ప్రాణవాయుమంత్రానికి మెరుపురంగులో విరూపుడుగా ఉండే అగ్నియే ఋషి. పర్జన్యుడు దేవత. పంక్తి - ఛందస్సు. ఓం సమానాయ స్వాహా. పర్జన్యాయేదం న మమ అనేది మంత్రం, 

ఇవి పంచప్రాణాహుతులు. ఇవి చెబుతూ అయిదుసార్లు కాసిని కాసిని మెతుకులు తిన్నాక ఆరవ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వానరాగ్ని దేవత. గాయత్రి ఛందస్సు. ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహా. పరమాత్మన ఇదం న మమ - అనేది మంత్రం, ఇవి ఆరూ అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఆరగించాలి.

భోజనం ముగించాక అమృతాపిధానమిత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్చిష్ఠాన్నాన్ని విస్తరి చివర నేలమీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనితో తృప్తి పాందుదురుగాక అనే మంత్రం పఠించాలి.

అలాగే - రౌరవ పుణ్యనిలయ పద్మార్బుదనివాసులై దాహార్తులైన మా వూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయ్యమై అందుగాక అని ఆకాంక్షిస్తూ నీళ్ళు వదిలిపెట్టి పవిత్రగ్రంధిని(దర్భముడి) విప్పి నేలమీద(మండలంలో) పడవెయ్యాలి. భోజన పాత్రలోమాత్రం(విస్తరి) వెయ్యకూడదు. 

పొరపాటున అలా వేసినవాడు పంక్తిదూషకుడవుతాడు. అలాగే ఉచ్చిష్ఠాన్ని కుక్క తాకినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాత్రి అంతా ఉపోష్యం ఉండి మర్నాడు మంచగవ్యంతో శుద్ధిచేసుకో వాలి. (అనుచ్చిష్ట సంస్పర్శకు స్నానంతో శుద్ధి).

నారదా! ఏకాహుతిప్రదానమే కోటియజ్ఞఫలం ఇస్తుంది. పంచాహుతులూ చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకూ దాతకూ పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు. 

పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మణుడు ముద్దముద్దకూ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. ఇలాగ నిత్యమూ త్రిసంధ్యల్లోనూ జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడాన్నే పురశ్చరణమంటారు.

బ్రహ్మచర్యం




Vaishvadevam - వైశ్వదేవం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - వైశ్వదేవం

నారదా! పురశ్చర్యాప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించికూడా చెబుతాను విను. దేవయజ్ఞ - బ్రహ్మయజ్ఞ - భూతయజ్ఞ - పితృయజ్ఞ - మనుష్యయజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే ఛుల్లి(పొయ్యి), పేషణి, ఉపస్కరం, కండణి, ఉదకుంభం - ఆని పంచసూనాలు. 

పొయ్యిలోగానీ ఇనపపాత్రలోగానీ భూమిమీదగానీ కుండపెంకులో(మూకుడు వగైరా) గానీ వైశ్వదేవం చెయ్యరాదు. కుండంలో లేదా స్థండిలంలో(పాత్ర) చెయ్యాలి. చేతితోగానీ చేటతోగానీ చర్మనిర్మితులతోగానీ అగ్నిని విసరకూడదు. 

విప్రముఖంనుంచి అగ్నిపుట్టింది కనక నోటితో ఊదిమాత్రమే ప్రజ్వలింపజెయ్యాలి. చర్మపటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువువాత బడతాడు. కనక నోటితో ఊదటమే కర్మసిద్ధికి ఉపకారకం.

పళ్ళూ పాలూ పెరుగూ దుంపలూ కూరగాయలూ ఇత్యాదులతో వైశ్వదేవహోమం చెయ్యాలి. ఇవ్వి ఏవీ దొరక్కపోతే పుడకలూ ఆకులూ గడ్డీ - వీటితో చెయ్యవచ్చు. నేతిలో ముంచి హోమం చెయ్యాలి. నూనెగానీ ఉప్పుగానీ తగలకూడదు. పెరుగూ(పాయసాలు) పాలల్లోనైనా ముంచి చెయ్యవచ్చు. ఇవీ దొరక్కపోతే ఆయామంతత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని (దుంపలూ కూరలూ) హోమం చెయ్యాలి. 

ఎండిపోయినవీ నిలవున్నవీ (పర్యుషితం - చద్ది) చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే(ఉచ్చిష్టం) శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో (రూక్షాలు) హోమం చేస్తే దారిద్య్రం దాపురిస్తుంది. ఉప్పుగానీ నూనెగానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది.

నిప్పుల్ని బూడిదదులిపి మంటచేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. ఇలా వైశ్వదేవం చెయ్యకుండా భోజనం చేసిన బ్రాహ్మణ గృహము కాలసూత్ర నరకకూపంలో తలకిందుల్లా పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి - తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చాలి. 

ఈ వైశ్వదేవం కాకముందే భిక్షుకుడెవరైనా భిక్షార్ధియై గుమ్మంలోకి వస్తే  వైశ్వదేవంకోసమని కొన్నితీసి ప్రక్కనపెట్టి, భిక్షవేసి పంపించవచ్చు. వైశ్వదేవీకృతదోషాన్ని భిక్షుకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృతదోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు.

పక్వాన్నానికి యతి - బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణవ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం వెయ్యాలి. ఎలాగంటే - ఓ సురభీ! వైష్ణవీ! మాతా! విష్ణుపదస్థితా! నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు(సురభి) అనుగ్రహిస్తుంది.

గోశాలనుంచి తిరిగివచ్చి ఇంటివాకిట్లో కొంచెంసేపు - పాలు పితికినంతసేపు (గోదోహనకాలం) - నిలబడాలి. అతిథుల కోసం ఎదురుచూడటం. ఇంటికి వచ్చి అతిథి వట్టినే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగివెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుపోతాడు.

తల్లిదండ్రులూ సోదరులూ గురువూ బిడ్డలూ సేవకుడూ ఆశ్రితులూ అతిథులూ అభ్యాగతులూ అగ్నిదేవుడూ - వీరంతా గృహస్థుకి పోష్యులు(తాను పోషించవలసినవారు).

ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకుని మోహవిభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు - నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయాగఫలం లభిన్తుంది. పంచమహాయజ్ఞాలనూ చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు.

పంచ ప్రాణాగ్ని హోత్రం




Mantra Purashcharana - మంత్ర పురశ్చరణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మంత్ర పురశ్చరణ

నారదా! గాయత్రీ పురశ్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం అభీష్టదాయకం. పర్వతాగ్రం నదీతీరం బిల్వమూలం జలాశయం గోశాల దేవాలయం అశ్వత్థవృక్షం ఉద్యానవనం తులసితోట పుణ్యక్షేత్రం గురుసన్నిధి - ఇలా ఎక్కడైనాగానీ మనస్సు ఏకాగ్రంగా ఉండేచోట కూర్చుని ఈ పురశ్చరణ చేస్తే మంత్రఫలసిద్ధి కలుగుతుంది. 

ఏ మంత్రాన్నైనా పురశ్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయసహితంగా గాయత్రిని అయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదికమార్గాలు రెండూ ఉన్నాయి. రెండూ అనుష్ఠించవలసినవే. నారదా! గాయత్రీదేవి అంటే వేదమాత. ఆదిపరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరూ శైవులూ వైష్టవులూ అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు. కనక అందరూ శాక్తేయుల క్రిందే లెక్క.

ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనక ముందుగా ఆత్మశోధనకోసం మంత్రాన్ని మూడు లక్షలు జపించాలి. కనీసం ఒక లక్షసార్లయినా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోనిదే ఏ జపహోమాలు చేసినా వ్యర్థం. కనక ముందుగా దాన్ని సాధించాలి. 

తపస్సుతో శరీరాన్ని తపింపజెయ్యాలి. దేవతలనూ పితృదేవతలనూ తనియించాలి. తపస్సే స్వర్గసాధకం, మహత్వసంపాదకం, క్షత్రియుడు బాహుశక్తితో వైశ్య శూద్రులు ధనంతో బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదలనుంచి గట్టెక్కుతారు.

అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చెయ్యాలి. చాంద్రాయణాది నియమ నిష్ఠలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజెయ్యాలి. అంతశ్శుద్దిని సాధించాలి. అదే తపస్సు అంటే. 

నారదా! ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను. విను. ఆయాచితాన్నం, ఉంఛాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నమని నాలుగువిధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి నాలుగు భాగాలు చెయ్యాలి. ఒకభాగం బ్రాహ్మణులకూ ఒకభాగం గోవులకూ ఒకభాగం ఆతిధులకూ మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. 

కోడిగ్రుడ్డంత ముద్దలు ఎనిమిది గృహస్థ వానప్రస్థులకు గ్రాసప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. తొమ్మిదిసార్లు ఆరుసార్లు మూడుసార్లుగా ఈ సంప్రోక్షణలు చేనుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని తదిత్యాది ఋక్కుతో గాయత్రిని ఉచ్చరిన్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించేవారి ఇళ్ళనుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది ఆథమాన్నం. నరకహేతుపు. సరే - .

గాయత్రీ ఛందస్సులో అక్షరానికి లక్షచొప్పున ఇరవైనాల్గు లక్షలు మంత్రాన్ని పురశ్చరణ చెయ్యాలి, ఇరవైమూడు లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహంలాంటిది పురశ్చరణ లేని మంత్రం. ఎందుకూ పనికిరాదు.

కొన్ని రాశులూ కొన్ని నక్షత్రాలూ కొన్ని మాసాలూ కొన్ని తిథులూ కొన్ని వారాలూ పురశ్చరణకు పనికిరావు. వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుకూలంగా శుక్లపక్షంలో మంచిరోజున మంచి ముహూర్తాన ప్రారంభించి పురశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచన నాందీశ్రాద్దాలు యథావిధిగా చెయ్యాలి. విప్రులకు సంతర్పణ చెయ్యాలి. బట్టలు పెట్టాలి. 

అటుపైని గురువుల అనుమతితో ప్రత్యఙ్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి ప్రసిద్ధిపొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశి, కేదారం, మహాకాళం, నాసికం, త్య్రంబక మహాక్షేత్రం - ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. 

ప్రారంభించిన రోజునుంచి ముగించే రోజుదాకా ప్రతిరోజూ హెచ్చు తగ్గులు లేకుండా మంత్రజపం చెయ్యాలి. మునీశ్వరులైతే నిరంతరాయంగా చెయ్యాలిగానీ తక్కినవారు ఉదయంనుంచి మధ్యాహ్నం వరకూ చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థచింతనలతో గడపవచ్చు. 

అక్షరలక్షలుగా చేసే ఈ మంత్రపురశ్చరణలో దశాంశాన్ని హోమం చెయ్యాలి. పాలూ నెయ్యీ అన్నమూ తిలలూ పత్రపుష్పాలూ యవలూ హోమద్రవ్యాలు. దశాంశహోమం చేస్తేనేగానీ మంత్రసిద్ధి కలగదు.

చతుర్విధ పురుషార్థాలూ సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు మూడింటా గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నానతత్పరుడై జలమధ్యంలో నిలిచి మూడు లక్షలు జపించాలి. 

కామ్యకర్మగా చేసేట్టయితే కార్యం సిద్ధించేవరకూ మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతస్సంధ్యలో ప్రతిరోజూ సహస్రగాయత్రీజపం చెయ్యడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్యభోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 

ఆరునెలలుగానీ మూడునెలలుగానీ చేస్తే సంవత్పరాంతానికి ఫలితం కనపడితీరుతుంది. నేతితో లక్షపద్మాలు హోమం చేస్తే మోక్షం కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయాక ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధిక్షీరాలతో పాతికలక్షలు హోమం చేస్తే దానిఫలం అమోఘమనీ వర్ణనాతీతమనీ అష్టాంగయోగసిద్ధికి సరిసమానమనీ మహర్షుల అభిప్రాయం. 

శక్తుడో అశక్తుడో నియతాహారులై ఆరునెలలు జపిస్తే చాలు గురుభక్తిపరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణాన్నంతో గడిపేవాడు గాయత్రీజపానికి అర్హుడు. గంగాది పవిత్రనదీజలాలలో మునిగి శతమూ ఆ పవిత్రోదకాలను ఆచమించి శతమూ జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

చాంద్రాయణ వ్రతఫలం దక్కుతుంది. బ్రాహ్మణులూ క్షత్రియులూ సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకూ బ్రహ్మచారులకూ వానప్రస్థులకూ ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌతస్మార్తక్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణపాంది నిర్వహించాలి. (వినీ చదివీ చేసెయ్యకూడదు). భిక్షాన్నాన్నిమాత్రం ఎనిమిది ముద్దలు స్వయంగా భుజించవచ్చు.

వైశ్వదేవం




Sri Krishnudu Uddhavunitho Jeri Kubjaa Grhambunaku Naruguta - శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో జేరి కుబ్జా గృహంబునకు నరుగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీ కృష్ణుడు ఉద్ధవునితో జేరి కుబ్జా గృహంబునకు నరుగుట తనతో శృంగారక్రీడ జరపాలని కుబ్జ మునుపే శ్రీక...