నారదా! నువ్వడిగిన తులసీ వృత్తాంతం ఇప్పుడు చెబుతున్నాను విను. కుశధ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వజుడు మాధవీదేవిని వివాహం చేసుకున్నాడు. గంధమాదనపర్వత గుహలలో అరణ్యాలలో పొదరిళ్ళలో సరస్సులలో ఆ దంపతులు కామకేళీపరవశులై విహరించారు. రేయింబవళ్ళు తేడాలేకుండా నూరు దివ్యసంవత్సరాలు శృంగారం లోతులు చూశారు. అప్పటికి రాజుగారికి తెలివి వచ్చింది. రాజ్యమూ పాలనమూ స్పృహలోకి వచ్చాయి. శృంగారక్రీడ చాలించి రాజధానికి వచ్చాడు. మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదు. అయినా రాకతప్పిందికాదు. గర్భిణీ అయ్యింది. నెలలు నిండాయి. కార్తికపూర్ణిమా శుక్రవారంనాడు శుభముహూర్తాన ఆడపిల్లను ప్రసవించింది. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది. ఆ కనుముక్కు తీరూ ఆ వర్చస్సూ ఆ సౌందర్యమూ ఎర్రని చేతులూ కాళ్ళూ బంగారు శరీరకాంతీ - సుందరీమణులలోకెల్లా సుందరీమణిగా ఉన్న ఆ బాలికను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ముగ్దులవుతున్నారు. ఈమెకు సాటి ఇంకెవ్వరూ లేరంటే లేరు అని నిశ్చయించుకుంటున్నారు. అలా ఆ బిడ్డకు తుల (సాటి)లేనిది కనక తులసి అనే పేరు స్థిరపడింది. అందరూ ఆలాగే పిలవనారంభించారు.
తులసికూడా వేదవతిలాగే సద్యోయౌవనవతియై తపస్సు కోసమని బదరికావనానికి వెళ్ళింది. లక్ష దివ్యవత్సరాలు తపస్సు చేసింది. నారాయణుడే తనకు భర్తకావాలి ఆనే దృఢసంకల్పంతో తీవ్ర తపస్సు సాగించింది. గ్రీష్మంలో పంచాగ్నిమధ్యంలో నిలిచి, శీతర్తువులో తడిబట్టలు ధరించి, వర్షర్తువులో ఆరుబయట వానలో కూర్చుని, రేయింబవళ్ళు తపస్సు చేసింది. నీళ్ళూ పళ్ళూ తప్ప మరింక ఏ ఆహారామూ లేదు. ఒక ముప్ఫయివేల ఏళ్ళు కేవలం ఆకులు తిని, మరో నలభైవేల సంవత్సరాలు కేవలం వాయుభక్షణతోను, మరొక పదివేల వసంతాలు నిరాహారంగాను ఘోరతపస్సు చేసింది. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యంచేసి ఒంటికాలి బొటనవేలిమిద నిలబడి నిష్ఠగా తపస్సు చేస్తూంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తులసీదేవి సవినయంగా ఆ హంసవాహనుడికి నమస్కరించింది.
తులసీ! నీ తపస్సుకి మెచ్చాను. వరం ఇస్తాను. నీ ఇష్టం ఏదైనా కోరుకో. హరిభక్తి కావాలా? హరిదాస్యం కావాలా? అజరామరత్వం కావాలా? ఏది కావాలంటే అది ఇస్తాను. అడుగు - అన్నాడు చతుర్ముఖుడు.
తాతా! నా మనసులో ఉన్నమాట చెబుతున్నాను విను. నువ్వు సర్వజ్ఞుడివి. నీముందు దాపరికమేమిటి, సిగ్గు ఏమిటి? నేను తులసిని. ఒకప్పుడు గోలోకవాసినిని. గోపికను. గోవిందుడితో శృంగారక్రీడలో నేను పరవశించి ఉండగా రాసేశ్వరి రాధికాదేవి వచ్చి చూసింది. కోపావేశంతో గోవిందుణి బెదిరించింది. తనతో లాక్కుపోయింది. పోతూ నన్నుశపించింది. భూలోకంలో మానవకాంతగా పుట్టమంది. అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చుడు. నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుడిని భర్తగా పొందుతావు. బ్రహ్మదేవుడు వరమిస్తాడు. భారతభూభాగాన తపస్సు చెయ్యి - అన్నాడు. అంతర్థానం చెందాడు. నేను రాధాదేవికి భయపడి తనువు చాలించాను. భూలోకాన మానవకాంతగా జన్మించాను, హే సృష్టికర్తా! శాంతసుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి. అదే నేను నిన్ను కోరుతున్న వరం. దయచేసి అనుగ్రహించు.
తులసీదేవీ! తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణాంగ సముద్భవుడైన గోపకుడు సుదాముడు గోలోకంలో ఉండేవాడు. గుర్తుందా? అతడిప్పుడు రాధికాశాపంవల్ల భూలోకంలో దనువంశంలో జన్మించాడు. మహాతేజస్వి. కృష్ణుడి అంశతో ఆవిర్భవించిన సుందరుడు. శంఖచూడుడు అనే పేరుతో ముల్లోకాలలోనూ విఖ్యాతి గడించాడు. గోలోకంలో ఉన్నప్పుడు ఇతడు (సుదాముడు), నిన్ను చూసి కామపరవశుడవుతూండేవాడు. రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసమూచెయ్యలేకపోయాడు. ప్రస్తుతం అతడు భూలోకాన జాతిస్మరుడు. నువ్వూ అలాగే జాతిస్మరవే. నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు. కనక వెళ్ళు. ఇప్పటికి అతణ్జి భర్తగా స్వీకరించు. తరవాత సాక్షాత్తు నారాయణుడినే వరిద్దువుగాని.
గోపికా! మరొక విశేషం. నారాయణుడి శాపంవల్లా దైవయోగంవల్లా నువ్వు ఒక పవిత్రమైన వృక్షరూపాన్ని పాందుతావు. విశ్వపావనివి అవుతావు. నీ పువ్వులు విష్ణుమూర్తికి ప్రాణాధిక ప్రియాలు అవుతాయి. నువ్వులేవి పూజలన్నీ నిష్పలమవుతాయి. బృందావనంలో నీపేరు బృందావని. నీ దళాలతోనే గోపగోపీజనం మాధవుణ్ణి అర్చిస్తారు. నువ్వు వృక్షాధిదేవతవు అవుతావు. ఆ రూపంతో నిరంతరం స్వేచ్చగా శ్రీకృష్ణుడితో విహరిస్తావు. ఇది నా వరం. ఇక ఈ ఘోరతపస్సు చాలించు.
బ్రహ్మదేవుడి వరానికి సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించింది. మరొక్కసారి శిరసువంచి నమస్కరించింది. మెల్లగా తన అంతరంగం బయటపెట్టింది.
పరమేష్టీ! నిజం చెబుతున్నాను. ద్విభుజుడూ శ్యామసుందరుడూ అయిన గోలోక కృష్ణుడిమీదనే ఉంది నా మనను. అంతగా చతుర్భుజుడిమీద లేదు. అలనాడు శృంగారభంగమయ్యింది. అప్పటినుంచీ అసంతృప్తిగానే ఉంది. అయినా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడు అంటున్నావు కనక అంగీకరిస్తున్నాను. అదీకాక నీ వరానుగ్రహంవల్ల, సుదుర్లభుడైన ఆ గోలోక గోవిందుణ్ణి మళ్ళీ పాందగలుగుతాను కనక సమ్మతిస్తున్నాను. కానీ నా హృదయంలో నాటుకుపోయిన రాధాభయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పూ,
తులసీ! దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది. షోడశాక్షరమైన రాధికామంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు. ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియవు అవుతావు. రాధికా సమానురాలివై గోవిందుడికి ప్రీతిపాత్రవు అవుతావు. మీ ఇద్దరి రహస్య శృంగారాన్ని రాధిక తెలుసుకోలేదు - అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించి స్తోత్రమూ కవచమూ పూజావిధానమూ వివరించి అంతర్జానం చెందాడు.
తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మీ సమానురాలయ్యింది. మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. తపఃక్లేశాన్ని మరచిపోయింది. ఫలం సిద్ధిస్తే దుఃఖంకూడా సుఖం అనిపిస్తుంది కదా
ధర్మధ్వజ మహారాజుగారి కూతురు తులసీదేవి తపోవనంలోనే రాజభోగాలు అనుభవిస్తోంది. నిత్యమూ చెలికత్తెలతో విందులూ వినోదాలే. ఒకరోజు రాత్రి విందులు ఆరగించి పుష్పచందన చర్చితమైన మనోహరశయనంమీద మేను వాల్చింది.
నవయౌవనంలో ఒంటరిగా ఉన్న ఆ సుందరాంగిమీదకి మన్మథుడు నిర్దాక్షిణ్యంగా తన అయిదుబాణాలు గురిపెట్టాడు. ఆ దాడికి తట్టుకోలేక తులసీదేవి విలవిలలాడింది. శరీరం పులకించగా కన్నులు ఎరుపెక్కాయి. క్షణంలో మేను వాడిపోయింది. మూర్భపోయింది. క్షణంలో తేరుకుంది. క్షణం నిద్రపోయింది. మరుక్షణంలో మేలుకొంది. క్షణం ఉద్విగ్న అయ్యింది. క్షణంలో దహించుకొనిపోయింది. క్షణంలో ప్రసన్నురాలయ్యింది. క్షణకాలం చేతనత్వం, క్షణకాలం విషణ్ణత. క్షణం కూర్చోవడం, క్షణం లేచి నిలబడటం. క్షణం మేను వాల్చడం, క్షణం లేచి తిరగడం. క్షణం పరుగులు తియ్యడం, క్షణం స్థాణువు కావడం. ఏమి చేస్తోందో ఏమి జరుగుతోందో ఆమెకే తెలియడంలేదు. వుష్పచందనతల్పం కంటకశయనమయ్యింది. (కంటకం = ముల్లు). ఫలాలూ జలాలూ విషతుల్యమయ్యాయి. రాజమందిరం కొండగుహ అనిపించింది. సన్ననివస్త్రం అగ్నికీల అయ్యింది. చెక్కిలిమీద చిత్రించుకున్న సిందూరమకరికాపత్రం పుండులా బాధించింది.
ఒక సుందరాంగుడు రసికేశ్వరుడు యువకుడు చందనచర్చితుడు రత్నభూషణభూషితుడు పుష్పమాలికాసమలంకృతుడు ఎదురు వస్తున్నట్టూ తన ముఖపద్మాన్ని కన్నులతో ఆస్వాదిస్తున్నట్టూ చెవిలో రహస్యంగా మధురంగా రతికథాలాపాలు చేస్తున్నట్టూ తల్పంపైని తనను కౌగిలించుకొని అలరిస్తున్నట్టూ అంతలోనే లేచి వెళ్ళిపోతున్నట్టూ, నిలు నిలు ప్రాణేశా! ఎక్కడికి ఈ పయనం అంటూ తాను వెంటపడుతున్నట్టూ అతడు వెనుదిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తున్నట్టూ - భ్రాంతిలోనే అయినా ఏవేవో మధురానుభవాలు కలుగుతున్నాయి. ఇది అంతా వట్టి భ్రాంతి అని మరుక్షణంలో తెలిసివస్తోంది, ఆ తెలివిడి రాగానే ఆపుకోలేని దుఃఖంతో విలపిస్తోంది. ఇలా నవయౌవనం ఏడిపిస్తూంటే తులసీదేవికి ఆ రాత్రి గడవటం కష్టమయ్యింది. అలాగే విలపిస్తూ కూర్చుంది.
No comments:
Post a Comment