Sunday, May 3, 2026

Bhudana Phalalu - భూదానఫలాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - భూదానఫలాలు

నారాయణ మహర్షీ! భూదాన హరణాది మహాపాపాలు ఏవేవో చెప్పావు. అవి ఏమిటి? ఏ రకంగా పాపాలయ్యాయి? వాటి ఫలితాలేమిటి? ఇంకా ఏమైనా పాపాలున్నాయా? వాటి ప్రతీకారం ఎమిటి? విస్తరంగా తెలియజేస్తే నాబోంట్లు జాగ్రత్తపడతారు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణడు అందుకున్నాడు-

బ్రహ్మనందనా! నిరంతరం సంధ్యావందనం చేసుకునే విప్రుడికి ఒక జానెడు నేల దానం చేసినవాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు. శివమందిరంలో నివసిస్తాడు. సస్యలక్ష్మితో విరాజిల్లే భూమిని దానం చేసినవాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలపాటు వైకుంఠంలో నివసిస్తాడు. అగ్రహారాన్నిగానీ భూమినిగానీ ధాన్యాన్నిగాని నైష్ఠికుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాలనుంచీ ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది. దాతృప్రతిగ్రహీతలిద్దరూ తరిస్తారు. దేవీ సాన్నిధ్యం పొందుతారు. భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్రమిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు. తాను ఇచ్చినదిగానీ పరులు ఇచ్చినదిగానీ భూదానాన్ని అపహరించినవాడు సూర్యచంద్రులున్నంతకాలం నరకంలోనే హింసలు అనుభవిస్తుంటాడు. వాడి వంశం గర్భదరిద్రులై అంతరిస్తుంది. గోవులు తిరిగే దారినీ తటాకాలనూ భూదానంగా సమర్పించేవాళ్ళు కుంభీపాక - అసిపత్రనరకాలలో నూరు దివ్యవత్సరాలపాటు లేదా పధ్నాల్గురు ఇంద్రులు గతించేదాకా యమయాతనలు అనుభవిస్తారు. పంచపిండాలను ఉద్ధరించకుండా వెళ్ళి పరుల నూతిలో స్నానం చేసేవాడు రౌరవానికి పోతాడు. కాముకుడై రాత్రిపూట రహస్యంగా నేలమోద వీర్యస్ఖలనం చేసుకునేవాడు రేణువుకి ఒక్క సంవత్సరంగా రౌరవంలో నరకయాతన అనుభవిస్తాడు. అంబువాచిగా ఉన్నప్పుడు భూమిని దున్నినవాడు కృమిదంశ నరకానికి పోయి నాలుగు యుగాలపాటు పరితపిస్తాడు. పూడుకుపోయిన ఇతరుల నూతిలో నుయ్యి తవ్వించి నాది అన్నవాడు, పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాదన్నవాడు తప్తకుండంలో పడతాడు. పుణ్యఫలంమాత్రం ఆ మొదటి దాతలకే దక్కుతుంది. ఇతరుల చెరువుల్లో నుంచి మట్టిని తొలగించి వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు రేణుప్రమాణ నంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు.

తండ్రికీ రాజుకీ పిండప్రదానం చెయ్యకుండా శ్రాద్ధకర్మలు ముగించినవాడు నరకానికి పోతాడు. వట్టినేలమీద దీపం వెలిగించినవాడు ఏడుజన్మల దాకాగుడ్డివాడవుతాడు. ఏ ఆచ్చాదనాలేని వట్టి నేలమీద శంఖాన్ని పెడితే వాడికి జన్మాంతరంలో కుష్ఠరోగం వస్తుంది. అలాగే ముత్యం, మాణిక్యం, రత్నం, బంగారం, మణులూ వీటినికూడా వట్టి నేలమోద ఉంచకూడదు. అలా ఉంచినవాళ్ళు ఎడు జన్మలకీ అంధులవుతారు. శివలింగాన్నిగానీ శివామూర్తినిగానీ పూజాద్రవ్యాలనుగాని కనీసం ఆకునైనా అడ్డంవేసి ఉంచాలే తప్ప వట్టినేలమీద ఉంచినవాళ్ళు శతమన్వంతరాలు కృమిభక్షకులు అవుతారు. అలాగే యంత్రాలనూ పువ్వులనూ తులసీదళాలనూ నేలమోద ఉంచకూడదు. ఉంచితే నరకానికి పోతారు. జపమాల, కర్పూరము, గోరోచనము, గంధపు చెక్క, రుద్రాక్ష, దర్భలు, పుస్తకం, యజ్ఞోపవితం - వీటిని వట్టి నేలమోద ఉంచడమూ నరకహేతువే. యజ్ఞం చేసి ఆ నేలను పాలతో అలకనివాడు ఎడేడు జన్మలకీ నరకంలోనే ఉండిపోతాడు. భూకంపం వచ్చిన రోజునగానీ గ్రహణంనాడుగానీ భూమిని తవ్వినవాడు జన్మాంతరంలో అంగవికలుడవుతాడు.

నారదా! భూమి అంటే సమస్త ప్రాణికోటికీ పుట్టిల్లు మహాభవనం. ఇది కశ్యపుడి సొత్తు. కనక కాశ్యపి అనే పేరు. ఇది అచల. ఇది స్థిర. చరాచర జీవజాలాన్ని భరిస్తోంది అనంతకాలంగా. అందుచేత విశ్వంభర. పృథుకన్య కాబట్టి పృథివి అయ్యింది. విశాలంగా పృథురూపంలో ఉంటుంది కనకనూ ఆ పేరు ఏర్పడింది.

నారాయణ మహర్షీ! పృథివీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు. ధన్యుణ్ణి చేశావు. ఇంక గంగావతరణ గాథను వినాలని ఉంది. సరస్వతి శాపంవల్ల గంగాదేవి భారతభూమికి అవతరించింది కదా! న్వయంగా విష్ణుపది ఆయిన ఆ పరమపావన స్వరూప ఎలా ఎప్పుడు ఎక్కడ అవతరించిందో ఆ క్రమమంతా తెలుసుకోవాలని ఉంది. అది పుణ్యప్రదమూ పాపఘ్నమూను. కనక అనుగ్రహించు - అని నారదుడు కోరాడు. నారాయణుడు యథావిధిగా ఆరంభించాడు.

గంగావతరణగాథ


No comments:

Post a Comment

Radha Devi is Ganga Devi - రాధాదేవియే గంగాదేవి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  రాధాదేవియే గంగాదేవి మహర్షీ! గంగానదికి “త్రిపథగ” అనేపేరు ఉంది అన్నావు. అది ఎలా ఎర్చడింది ? ఎలా ఎక్కడెక్కడ ఆ న...