Sunday, May 3, 2026

Boons of Lord Varaha to Goddess Earth - భూదేవికి వరాహస్వామి వరాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - భూదేవికి వరాహస్వామి వరాలు

శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారా? అని హెచ్చరించి నారద నారాయణ సంవాదాన్ని సూతుడు కొనసాగించాడు. నారదుడు నారాయణమహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు -

మహర్షీ! మహాదేవికి రెప్పపాటు కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడు అన్నావు. ప్రాకృతిక ప్రళయం వస్తుంది అన్నావు. సృష్టి అంతా జలమయమై భూగోళం అదృశ్యమవుతుంది అన్నావు. అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడ ఉంటుంది? పునన్సృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది ఏ రూపాన్ని ధరిస్తుంది? మంగళప్రదమైన దేవీ జన్మకథను వినిపించి నన్ను అనుగ్రహించు - అని నారదుడు వేడుకొన్నాడు. నారాయణ మహర్షి సంతోషించి కథనం ఆరంభించాడు.

నారదా! సర్వసృష్టికీ ఆదియందు మహాదేవి ఉంటుంది అని వేదం చెబుతోంది. ఆరంభంలో ఆవిర్భావమూ ప్రళయాంతంలో తిరోభావమూ సహజం. ఇంక వసుధ ఎలా ఆవిర్భవించిందో చెబుతాను తెలుసుకో. మధుకౌటభుల మేదస్సుతో ఎర్పడిందనీ అందుకే మేదిని అనే పేరు వచ్చిందనీ కొందరన్నారు. పుష్కరక్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం ఉంది. అదేమిటంటే జలమయమైన సృష్టిలో మునిగి ఉన్న మహావిరాట్‌ స్వరూపుడి శరీరంలోకి రోమరంధ్రాలద్వారా ఈ భూమి ప్రవేశించి అదృశ్యమవుతుందట. పునస్పృష్టికి ఆతడి మనస్సు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రోమరంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట. ఇది ప్రతిప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది.

ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైల కానన సాగర ద్వీప గ్రహచంద్రార్క సంయుతంగా అవిర్భవిస్తూ ఉంటుంది. త్రిమూర్తులూ దిక్పాలకులూ దేవతలూ యథాతథంగా అవతరిస్తుంటారు. ఇదంతా మహావిరాట్‌ స్వరూపుని సంకల్పమూ ఆజ్ఞాను. పుణ్యతిర్థాలూ, పుణ్యభారతమూ బంగారు వేలలూ సప్తస్వర్గాలూ సప్త పాతాళాలూ బ్రహ్మలోకమూ ధ్రువలోకమూ అంతా పునస్సృష్టి జరుగుతుంది. ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలూ కృత్రిమాలు. కనక నశ్వరాలు. ప్రళయంలో అంతరిస్తాయి. సృష్టి - లయాలు మాత్రమే నిత్యాలు. ఇవి రెండూ శ్రీకృష్ణుని ఆత్మ సంకల్పాలు. మహావిరాట్‌ స్వరూపుడికన్నా పురాతనాలు.

ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు. వీరి కుమారుడు మంగళుడు. ఇతని తనయుడు కుంభసంభవుడు. పంచీకరణమార్గంలో మూలప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతారకాలంలో వారాహిగా అర్చింపబడింది. ఆ పూజావిధానం బహుమంగళ ప్రదం. అదికూడా తెలియజేస్తాను విను. వరాహావతారాన్ని మున్ముందుగా బ్రహ్నదేవుడు స్తుతించాడు. హిరణ్యాక్షుడనే రాక్షనుణ్టి సంహరించి భూగోళాన్ని ప్రళయజలధినుంచి ఉద్దరించడంకోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారు కోరతో భూమిని పైకి లేవనెత్తి నీటిమీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. అప్పుడు ఆ భూగోళంమీద సర్వమనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు.

ఆ సమయంలో భూగోళాధిదేవతను వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యాడు. సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సరకాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనందసమ్మూర్చిత అయ్యింది. నెరజాణల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదంకదా!

విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతలో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరం గడిచేదాకా స్పృహ రానేలేదు. అప్పటికి తేరుకుని స్పృహలోకి వచ్చి ఆ కాముకుడు ఆ కాముకిని విడిచిపెట్టాడు. లీలావిలాసంగా మళ్ళీ వరాహరూపం ధరించాడు. ధరణీదేవిని ధ్యానించి ధూపధీప నైవేద్యాలతో సిందూరానులేపనాలతో వస్త్ర పుష్ప బలిప్రదానాలతో అర్చించి కృతజ్ఞతా సూచకంగా దివ్యవరాలు ప్రసాదించాడు.

సర్వాధారా! శుభస్వరూపిణీ! వనుంధరా! ఈ రోజునుంచీ నువ్వు దేవదానవ మానవకోటులందరి చేతా పూజింపబడతావు. శంకుస్థాపనలు చెయ్యాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీకూప తటాకాదుల్ని నిర్మించాలన్నా వ్యవసాయం మొదలుపెట్టాలన్నా - మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచిత్యాగదినాన తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూఢులు నరకానికి పోతారు. ఇది నా శాపం.

(ప్రతి నెలా ఆర్ద్రానక్షత్రం నుంచి మూడురోజులు భూదేవి రజస్వలగా ఉంటుంది. అప్పుడు అమెకు అంబువాచి అని పేరు. ఆ మూన్నాళ్ళు భూమిని దున్నరాదని నియమం.)

ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక్కవరం అడిగింది. నాథా! నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచరజగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప హరిపూజాద్రవ్యాలు, శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామశిల - వీటినిమాత్రం భరించలేను. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నామీద ఉంచకుండా నాకు సమర్పించకుండా కట్టడి చెయ్యమని అభ్యర్థించింది. శ్రీహరి సమ్మతించాడు. ఈ ద్రవ్యాలను నీకు సమర్పించినవారూ నీమీద సాక్షాత్తుగా ఉంచినవారూ నరకానికి పోతారని శాసించాడు. అదృశ్యమయ్యాడు. అటు పైని వసుంధర గర్భిణియై మంగళుడిని ప్రసవించింది.

నారదా! అప్పటినుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞమేరకు కాణ్వశాఖోక్త ప్రకారంగా భూమిపూజ చేస్తున్నారు. మూలమంత్రాన్ని జపిస్తున్నారు. పృథ్వీరూపాన్ని ధ్యానిస్తున్నారు. స్తుతులూ నైవేద్యాలూ సుప్రసిద్ధాలు. మంగళప్రదమైన ఆ మూలమంత్రాన్నీ ధ్యాన స్తవనవిధానాలనీ తెలియజేస్తాను. శ్రద్ధగా ఆలకించి ఆచరించు.

మొట్టమొదటగా పృథివీదేవిని వరాహమూర్తి శ్రీహరి పూజించాడు. అటు పైని బ్రహ్మదేవుడు అర్చించాడు. ఆ తరువాత మునులూ మనువులూ మానవులూ ఉపాసించారు. ధ్యాన స్తవన మంత్రాలు ఏమిటంటే - ఓం - హ్రీం - శ్రీం - క్లీం వసుధాయై స్వాహా అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు. భూదేవి తెల్లకలువ రంగులో ఉంటుంది. శరత్పూర్ణిమనాటి చంద్రబింబంలాంటి ముఖం. శరీరమంతటా చందనం పులుముకొని రత్నభూషణభూషితయై విరాజిల్లుతూ ఉంటుంది. ఆవిడ రత్నాధార. రత్నగర్భ రత్నాకరసమన్విత. (రత్నాకరం = సముద్రం). అగ్నిజ్వాలవంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిన్తూ ఉంటుంది. అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం.

శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌
 ।
చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥

రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌
 ।

వహ్నిశుద్దాంశుకాధానాం పస్మితాం వందితాం భజే ॥

కా
ణ్వ శాఖోక్తమైన స్తవనం కూడా ఒకటి ఉంది. అది కూడా శ్రీహరి ప్రోక్తమే. దానినే అటు తరువాత బ్రహ్మాదిదేవతలూ మునులూ అందరూ వినియోగించారు. యథాతథంగా చెబుతున్నాను విని ధారణ చెయ్యి.

జయ జయే జలాధారే జయశీలే జలప్రదే
 ।
యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ॥

మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే ।
మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే ॥

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే
 ।
సర్వకామ ప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ॥

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని ।
పుణ్యాశ్రయే పుణ్యవతామాలయే పుణ్యదే భవే ॥

సర్వసస్యాలయే సర్వసస్యా
ఢ్యే సర్వసస్యదే ।
సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే॥

భూమే భూమిపసర్వస్వే భూమిపాలపరాయణే ।
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ॥

ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌
 
కోటిజన్మసు స భవేద్బలవాన్‌ భూమిపేశ్వరః 

నారదా ! ఈ స్తోత్రాన్ని పఠించినవారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమిదానహరణపావం నశిస్తుంది. అంబువాచీభూఖనన పాపమూ అంతరిస్తుంది. ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం, పరభూమిని అపహరించడం, నేలమోద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటావంచలవుతాయి. అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వకల్యాణ కారకమైన భూదేవీస్తవం.


భూదానఫలాలు


No comments:

Post a Comment

Boons of Lord Varaha to Goddess Earth - భూదేవికి వరాహస్వామి వరాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  భూదేవికి వరాహస్వామి వరాలు శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారా? అని హెచ్చరించి నారద నారాయణ సంవాదాన్ని స...