Friday, May 1, 2026

Regeneration - పునస్సృష్ఠి

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - పునస్సృష్ఠి

అప్పుడు జగత్తు అంతా అరాచకమవుతుంది. ఆరు రేయింబవళ్ళు కుండపోతగా స్థూలధారలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలుకానీ గృహాలుకానీ దేశాలుగానీ ఏమీ ఉండవు. అటుపైని ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండుతుంది, కృతయుగం ప్రారంభమవుతుంది. సత్త్వగుణ సంపన్నుడూ తపోనిరతుడూ ధర్ముడు అవతరిస్తాడు. ధర్మనిరతులూ వేదవేత్తలూ మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్వులై తేజస్వులై ధర్మిష్ఠులై పుణ్యకర్మరతులై జనరంజకంగా పరిపాలన సాగిస్తారు. వైశ్యాది జాతులవారంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తులలో ధార్మికులై ప్రజాసేవ చేస్తారు. చతుర్వర్ణాలవారూ దేవీభక్తి పరాయణులవుతారు. అందరూ దేవీమంత్ర జప పరాయణులూ ధ్యానపరాయణులూ అవుతారు. శ్రుతి స్మృతి పురాణజ్ఞులై తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుంది. అధర్మం కలికానికైనా కనిపించదు. సత్సంతానంకోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతులమధ్య విపరీత కామోపభోగాలు ఉండవు. త్రేతాయుగంలో మూడు పాదాలు, ద్వాపరంలో రెండు పాదాలు, కలియుగారంభంలో ఒక పాదమూగా నడిచిన ధర్మం చిట్టచివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునరుజ్జీవించి నాలుగుపాదాలా నడుస్తుంది.

నారదా! కృతయుగంలో కాలవిభజన స్పష్టంగా ఉంటుంది. నాలుగు జాములకాలం (మూడు గంటలు = జాము) ఒక పగలు. అలాగే ఒక రాత్రి. రేయీ పగలూ కలిసి ఒక వాసరం (రోజు). ఎడు రోజులు ఒకవారం. పదహారు తిథులు ఉంటాయి. పదిహేను రోజులు ఒకపక్షం. రెండు పక్షాలు కలిసి ఒక మాసం. అంటే ముప్పయి రోజులు. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు నెలలు ఒక ఆయనం. పన్నెండు నెలలు(రెండు అయనాలు) ఒక సంవత్సరం. 
ఈ సంవత్సరాలు అయిదు విధాలు. 

మానవులకు ఒక సంవత్సరమైతే దేవతలకు అది ఒక పగలూ రేయీని. అంటే ఒకరోజు. ఇది దేవమానం. మానవులకు మూడువందల అరవై యుగాలు గడిస్తే దేవతలకు అది ఒక యుగమవుతుంది దేవతలకు డెబ్బయ్యొక్క(71) యుగాలు ఒక మన్వంతరం. ఇంద్రుడి వయస్సు ఒక మన్వతరం. ఇరవైయెనిమిదిమంది ఇంద్రులు గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక అహోరాత్రం. అటువంటి రోజులతో నూటెన్మిది సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృతప్రళయం సంభవిస్తుంది. అంత జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ విష్ణు శివాదులు ఉండరు. ఇలాంటి ప్రాకృతి ప్రళయం జరిగేవరకూ ఉన్న కాలమంతా కలిపి శ్రీదేవికి ఒక్క నిమేషమాత్రంగా లెక్క. మహాదేవి కాలప్రమాణం అంతటిది. బ్రహ్మాయుష్షు శ్రీమాతకు నిమేషమాత్రం.

నారదా! అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ సృష్టింపబడుతున్నాయి. ఇలా ఇప్పటికి ఎన్ని సృష్టిలయాలు అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో వచ్చాయో, ఎందరు బ్రహ్మలు అవతరించారో అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానవమాత్రుడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగినవాడు ఒక్కడే ఒక్కడు - అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు. సర్వేశ్వరుడు. సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాదిదేవతలంతా అతడి అంశావతారాలు. మహా విరాట్‌ స్వరూపంకూడా అతడి అంశమే. అందులో ఒక అంశం విరాట్‌ స్వరూపం. అదే (పరా) ప్రకృతి. ఆ ప్రకృతినుంచే అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు. ద్విభుజ - చతుర్భుజ రూపాలతో ద్విధాభూతుడవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. నారదా! బ్రహ్మాది తృణపర్యంతం సమస్తమూ ప్రాకృతికమే (ప్రకృతి సంభవమే). ప్రాకృతికమైన సృష్టి సర్వస్వమూ నశ్వరమైనదే. కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే.

ఇటువంటి సృష్టికి హేతుభూతమైనది పరబ్రహ్మతత్త్వం. అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్చామయం, నిర్గుణం, ప్రకృతికి ఆవలిది, ఉపాధిరహితం, ఆకారరహితం, భక్తానుగ్రహకాతరం. దానిని తెలుసుకున్నందువల్లనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలను సృష్టించగలుగుతున్నాడు, శివుడు మృత్యుంజయుడై ఉపసంహరించగలుగుతున్నాడు, విష్ణుమూర్తి మహామహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికీ ఈ మూడు శక్తులూ ఆ పరబ్రహ్మ తత్త్వోపాసనవల్లనే లభిస్తున్నాయి. అదే మహామాయ. అదే పరాప్రకృతి. సర్వశక్తిమయి. ఈశ్వరి. భగవతి. సచ్చిదానందరూపిణి. ఆ తత్త్వాన్ని సేవించడంవల్లనే సావిత్రి వేదమాతయై వేదాధిష్ఠాన దేవత కాగలిగింది. వేదవేత్తల పూజలు అందుకుంటోంది. సర్వవిద్యాధిదేవతగా విశ్వమానవకోటితో ఆరాధింపబడుతోంది. ఆ మహామాయయే సర్వగ్రామాధిదేవత, సర్వసంపత్ప్రదాయిని, సర్వేశ్వరి, సర్వవంద్య, సర్వులకూ పుత్రదాయిని, సర్వస్తుత, సర్వజ్ఞ, సర్వదుర్గార్తినాశిని, కృష్ణవామాంశ సంభూత, కృష్ణ ప్రాణాధిదేవత, కృష్ణ ప్రాణాధిక - రాధిక. పత్నిగా కృష్ణుడి వక్షఃస్టల౦లో శాశ్వతంగా స్థానం సంపాదించుకొంది.

ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగపర్వతంమీద దివ్య వర్షసహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెను వక్షఃస్థలంమాద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడై విలపించాడు. అతిదుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు.

ప్రాణప్రియా! నువ్వు శాశ్వతంగా నా వక్షఃస్థలంమిదనే ఉండు. నాకు భక్తురాలివై ఉండు. సౌభాగ్యంలో గౌరవంలో ప్రేమలో నువ్వే శ్రేష్ఠవు, నువ్వే జ్యేష్ఠవు. నాకు అత్యంత ప్రేయసివి. వరిష్ఠవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను. పూజిస్తాను. నేనెప్పుడూ నీకు వశుడను, నీకు సాధ్యుడను - అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ లలనకు వరమిచ్చి సపత్నీరహితయైన ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవీమూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను పొంది లోకారాధ్యలు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాలలో వెయ్యి దివ్య వత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాధ్య అయ్యింది. సరస్వతీదేవి గంధమాదన పర్వతంమీద లక్ష దివ్యవసంతాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని ఇల్లాలై సకలవిద్యాధిదేవతయై పూజలు అందుకుంటోంది. పుష్కరక్షేత్రంలో లక్ష్మీదేవి నూరు దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలై సకలసంపదధిష్ఠానదేవత కాగలిగింది. సావిత్రీదేవి కూడా ఇలాగే అరవైవేల దివ్యశరత్తులు ధ్యానించి వేదాధిష్ఠాన దేవత అయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరూ శతమన్వంతరాలు తపస్సుచేసి ఆదిపరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితిలయ శక్తులను పొందగలిగారు. ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని దశమన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ ఆక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా దశమన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడూ సర్వపూజ్యుడూ సర్వాధారుడూ కాగలిగాడు. ఇలాగ దేవిని ఆరాధించినవారంతా లోకారాధ్యులు అయ్యారు. మునులూ మనువులూ రాజులూ బ్రాహ్మణులూ దేవిని ఆరాధించి శక్తిసంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు.

నారదా! గురుముఖతః నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు - అని ముగించాడు నారాయణ మహర్షి

భూదేవికి వరాహస్వామి వరాలు


No comments:

Post a Comment

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ । చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥ రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ । వ...