Friday, May 1, 2026

Kaliyuganlakshaṇalu - కలియుగంలక్షణాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - కలియుగంలక్షణాలు

సాలగ్రామాలూ శివశక్తులూ జగన్నాథుడూ కలియుగంలో పదివేల సంవత్సరాల తరవాత భారతభూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు పురాణాలు శంఖాలు శ్రాద్ధతర్పణాలు వేదోక్తకర్మలు దేవపూజలు దేవనామధేయాలు గుణకీర్తనలు వేదాంగాలు సకలశాస్త్రాలు సత్యధర్మాలు వేదాలు గ్రామదేవతలు వ్రతాలు తపస్సులు ఉపవాసాలు - ఇత్యాదులన్నీ వారితోపాటే తరలివెళ్ళిపోతాయి. అటు పైని భూగోళంనిండా వామాచారులు మిగులుతారు. కపటులూ మిథ్యావాదులూ మిగులుతారు. తులసి కలికానికైనా కనిపించదు. ఏ పూజలూ ఉండవు - పొట్టపూజ తప్ప, అందరూ శఠులూ క్రూరులూ దాంభికులూ అహంకారులూ చోరులూ హింసకులూ అయిపోతారు. స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావివరసలు ఆంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింటా ఆడపెత్తనమే సాగుతుంది. తర్జనభర్త్పనలతో భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు.

ఇల్లాలే ఇంటికి అధిపతి. మొగడు సేవకుడికన్నా అధముడు. అత్తమామలు దాసీదాససమానులు. ఇళ్ళల్లో రక్తసంబంధులే తప్ప విద్యాసంబంధులు ఎవ్వరూ కనపడరు. విద్యా సంబంధులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితుల్లాగా మెలుగుతుంటారు. ఆడవాళ్ళ ఆజ్ఞలేనిదే ఎవ్వరూ ఏ వనీ చెయ్యలేని దుర్బలులైపోతారు.

కలియుగంలో వర్ణాశ్రమధర్మాలు అన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణాలవారూ మ్లేచ్ఛాచారులైపోతారు. మ్లేచ్చ విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్చ శాస్త్రాలే పఠిస్తారు. అగ్రవర్ణాలవారు అట్టడుగువారికి సేవకులు అవుతారు. ప్రజలందరూ సత్యహీనులవుతారు. మేదినీ మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలవుతాయి. తరుణులు సంతానహీనలు అవుతారు. గోవులు క్షీరహీనమవుతాయి. క్షీరంలో వెన్న ఉండదు. దంపతులు ప్రీతిహీనులవుతారు. గృహస్థులు సత్యహీనులవుతారు. రాజులు ప్రతాపహీనులవుతారు. ప్రజలు కరపీడితులు (పన్నుల బెడద) అవుతారు. నదీనద వాపీకూపతటాకాదులు జలహీనాలు అవుతాయి. చతుర్వర్ణాలవారూ ధర్మహీనులూ పుణ్యహీనులూ అవుతారు. కోటికొక్కడైనా పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత వికృతాకారులవుతారు. అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి.

కొన్ని నగరాలూ గ్రామాలూ నరశూన్యాలైపోతాయి. భయానకంగా మారిపోతాయి. కొన్నిచోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాలలో గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కరపీడితులు (పన్నుల బెడద) అవుతారు. తటాక నదీతీరాలలో మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాలవారు నీచపడతారు. అసత్యవాదులూ ధూర్తులూ అవుతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. పంటలు పండవు. నీచులు ధనవంతులవుతారు. దైవభక్తులు నాస్తికులవుతారు. పౌరులు దయావిహీనులూ హింసకులూ నరఘాతకులూ అవుతారు. సాలప్రాంశులు కనిపించరు. స్త్రీ పురుషులందరూ వామనులూ వ్యాధి పీడితులుగానే ఉంటారు. అల్పాయుష్కులూ గదాపీడితులూ (గదా = అదొక రోగం). యౌవనమే కనిపించదు. ఇరవై ఏళ్ళకే వృద్ధులైపోతారు. ఎనిమిదేళ్ళకే యువతులు రజస్వలలై గర్భిణులవుతారు. సంవత్సరానికి ప్రసవించి పదహారేళ్ళకే ముసలమ్మలవుతారు. పతిపుత్రవతులు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువమంది గొడ్రాళ్ళుగానే మిగిలిపోతారు. చతుర్వర్ణాలవారూ నిస్సంకోచంగా కన్యావిక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వారు అందించే సామ్ముతో పొట్టపోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణమేమంటే - శ్రీహరి నామంకూడా ఒక వ్యాపారవస్తువు అవుతుంది. (హరేర్నామ్నాం విక్రయిణో భవిష్యంతి కలౌయుగే).

ధనవంతులు కీర్తికోసమనీ ప్రచారంకోసమనీ దానాలు చేస్తారు. అటు తరువాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. దాన నియమాలను ఉల్లంఘిస్తారు. దేవవృత్తి బ్రహ్మవృత్తి గురువృత్తి (కులవృత్తి) - అన్ని భూములనూ ఆక్రమించుకోవడమే. స్వదత్తమా పరదత్తమా అనే విచక్షణ కూడా ఉండదు.

అత్తగారు వదినగారు సవతితల్లి మరదలు రక్త సంబంధీకురాలు - ఇలాంటి వావివరసలు అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెచ్చరిల్లుతాయి. ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కష్టమవుతుంది

నారదా! కలియుగంలో లాక్షాలోహ రసాలతోనే కాదు ఉప్పుతోకూడా వ్యాపారం చేస్తారు. విప్రులు వృషవాహకులూ అన్యశవదాహకులూ అవుతారు. చెయ్యకూడనిచోట భోజనాలు చేయడం పరస్త్రీలతో సంగమించడంలాంటి దోషాలకు వెనుకాడరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతాలు ఉండవు. సంధ్యాశౌచాలు వదిలేస్తారు. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలూ, తార్పుడు గత్తెలూ, జారిణులూ, ముట్టుతలూ విప్రుల ఇళ్ళల్లో వంటగత్తెలవుతారు.

సారాంశంగా ఒక్కమాట చెబుతాను - కలియుగంలో ఆహార నియమంకానీ, విహార నియమంకానీ ఆశ్రమ నియమంకానీ ఎమీ ఉండదు. సమస్తమూ మ్లేచ్చమయమైపోతుంది. హస్తప్రమాణ వృక్షాలూ అంగుష్ఠప్రమాణ మానవులూ తయారవుతారు. (హస్తప్రమాణే వృక్షే చ అంగుష్ఠే చైవ మానవే) ఈ స్థితి వచ్చేసరికి విష్ణుయశస్కుడు అనే విఫ్రుడికి పుత్రుడుగా కల్కి నామధేయంతో నారాయణుడు కళాంశగా అవతరిస్తాడు. మహాబలిష్ఠుడై సుదీర్ఘ కరవాలంతో ఎత్తయిన గుర్రంమీద భూగోళమంతటా వీరవిహారం చేన్తూ మ్లేచ్చుల్ని సంహరిస్తాడు. మూడు రాత్రులలో పృథివిని మ్లేచ్చశూన్యం చేస్తాడు. వెంటనే అంతర్థానం చెందుతాడు.

పునస్సృష్ఠి


No comments:

Post a Comment

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ । చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥ రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ । వ...