Sunday, August 16, 2026

Sthandila Kunda Samskaralu - స్థండిల కుండ సంస్కారాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - స్థండిల కుండ సంస్కారాలు

నారదా! ఇక్కడ చెయ్యవలసిన స్థండిల కుండసంస్కారాలు చెబుతాను. తెలుసుకో. మూలమంత్రంతో వీక్షించి అస్త్రమంత్రంతో ప్రోక్షించి తాడన చెయ్యాలి. కవచంతో అభ్యుక్షణం జరిపి ముమ్మారు స్తవం చెయ్యాలి. పాగగ్రాలుగానూ ఉదగగ్రాలుగానూ చుట్టూ రేఖలు గియ్యాలి. 

దేవీపీఠాన్ని ప్రణవోచ్చారణతో అభ్యుక్షణచేసి అర్చించాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠమంత్రాంతంగా ఇది జరగాలి. ఆ పీఠంలో పార్వతీపరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. గంధాదులతో ఉపచారాలతో శ్రద్ధగా అర్చించాలి. ఋతుస్నానం చేసి కామాతురయై శంకరుడితో సంగమిస్తున్నట్టు దేవిని ధ్యానించాలి. 

ఆ దంపతుల క్రీడా విశేషాన్ని కొంచెంసేపు భావించాలి. అటుపైని ఒక పాత్రతో అగ్నిని తెచ్చి ముందుంచుకోవాలి. రాక్షసాంశను విడిచిపెట్టి పూర్వోక్తంగా వీక్షణాదులతో వహ్నిని సంస్కరించాలి. రం బీజముచ్చరించాలి.

అటుపైని చైతన్యయోజన చేసి ప్రణవంతో అభిమంత్రించాలి. ఏడుసార్లు గురువు ధేనుముద్రను ప్రదర్శించాలి. దర్భతో రక్షణ చేసి తనుత్రాణం కప్పాలి. ముమ్మారు ప్రదక్షిణం చేసి జానువులు నేలపై అన్చి కూర్చోవాలి. అగ్నికుండం మీద (చెయ్యిసాచి) తారమంత్రం జపించాలి. 

శివబీజబుద్దితో అగ్నిని దేవీయోనిలో ఉంచాలి. ఆపైని పార్వతీపరమేశ్వరులను ఆచమింపచెయ్యాలి. చిత్పింగళ హన దహ పదయుగ్మమూ సర్వజ్ఞాజ్ఞాపయ స్వాహా మంత్రమూ జపిస్తూ వహ్నిదీపనం చెయ్యాలి. స్తుతించాలి.

అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనమ్‌ 

సువర్ణవర్ణమమలం సమిద్దం విశ్వతోముఖమ్‌ 


ఇలా స్తుతించాక వహ్నిమంత్రానికి షడంగరార్చన జరపాలి. సప్తార్చిః స్వస్తిపూర్ణః ఉత్తిష్ఠపురుషః ధూమవ్యాపీ సప్తజిహ్వః ధనుర్ధరః ఈ క్రమంలో షడంగన్యాసం చెయ్యాలి. హేమవర్ణుడూ త్రినేత్రుడూ పద్మసంస్థితుడూ ఇష్టశక్తి స్వస్తికధరుడూ మంగళప్రదుడూ పరముడూ ఆయిన వహ్నిని ధ్యానించాలి. కుండమేఖలోపరిభాగాన మంత్రపరిషేచన చెయ్యాలి. 

ఆ తరుపరి దర్భలు పరచాలి. పరిధులు ఉంచాలి. త్రికోణ - వృత్త - షట్కోణ - సాష్టదళంగా సభూపురంగా వహ్నియంత్రం లిఖించాలి. భావన చెయ్యాలి. దాని మధ్యభాగాన వహ్నిదేవుణ్ణి వైశ్వానరప్రభృతి మంత్రాలతో అర్చించాలి. 

షట్కోణాలలో హిరణ్య - గగన - రక్త - కృష్ణ - సుప్రభ - బహురూప - అతిరక్తిక అనే సప్తజిహ్వలనూ పూజించాలి. కేసరాలలో ఆంగపూజ చేసి, దళాలలో శక్తిధరుడు స్వస్తికధరుడు జాతవేదసుడు సప్తజిహ్వుడు హవ్యవాహనుడు అశ్వోదరజుడు వైశ్వానరుడు కౌమారతేజుడు విశ్వముఖుడు దేవముఖుడు తారాగ్ని అనే మూర్తులను అర్చించాలి. సాయుధులుగా దిక్పాలకులను నాలుగు దిక్కులా నిక్షేపించి పూజించాలి.

ఆ తరవాత స్రుక్‌ స్రువాలనూ (కర్రతెడ్డు) ఘృతాన్నీ సంస్కరించి హోమక్రియ సాగించాలి. ఆజ్యంలో దక్షిణభాగాన్ని స్రువంతో తీసుకుని అగ్నిదేవుడి కుడికంటిలో వేస్తూ అగ్నయే స్వాహా అంటూ హోమం చెయ్యాలి.

అలాగే నెయ్యిలో ఎడమభాగం తీసుకుని సోమాయ స్వాహా అనీ, మధ్యభాగం తీసుకుని అగ్నీషోమాభ్యాం స్వాహా అనీ వామ - మధ్యమ నేత్రాలలో హోమం చెయ్యాలి. మళ్ళీ దక్షిణభాగం తీసుకుని అగ్నయే స్విష్టకృత్‌ స్వాహా అంటూ ముఖసీమలో హోమం చెయ్యాలి. 

తరవాత సతారమైన వ్యాహృతులతో చేసి అగ్నిమంత్రాలతో ముమ్మారు హోమం చెయ్యాలి. అయ్యాక ప్రణవంతో ఎనిమిదేసి చొప్పున రెండుసార్లు ఘృతాహుతులు చెయ్యాలి. ఇవ్వి గర్భాధానాది సంస్కారాల నిమిత్తంగా చేసే ఆహుతులు.

నారదా! గర్భాధానం - పుంసవనం - సీమంతోన్నయనం - జాతకర్మ - నామకరణం - ఉపనిష్క్రమణం - అన్నప్రాశనం - చూడాకర్మ - మౌంజీబంధం - మహావ్రతం - ఔపనిషదీవ్రతం - గోదానం - ఉద్వాహం - అని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది.

ఆపైని పార్వతీపరమేశ్వరులను మళ్ళీ పూజించి విసర్జన పలకాలి. అయిదు సమిధలతో అగ్నినే ఉద్దేశించి హోమం చెయ్యాలి. ఆవరణకు ఒకటి చొప్పున ఆహుతులివ్వాలి. అయ్యాక స్రువంతో నెయ్యిని స్రుక్కులోకి నాలుగుసార్లుగా తీసుకుని స్రువంతోనే ఆచ్చాదించి పట్టుకుని గురువుగారు లేచి నిలబడి వౌషడంతమంత్రంతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి.

తరవాత మహాగణేశ మంత్రంతో పది ఆహుతులు చెయ్యాలి. దేయమంత్రాధిదేవతను ధ్యానించి మూలమంత్రంతో ఇరవైఅయిదు ఆహుతులను ఉభయ ముఖైకీకరణంకోసమని వహ్నిముఖభాగంలో ఇవ్వాలి. ఇచ్చి వహ్ని - మంత్రాధిదేవతల ఐక్యాన్ని భావించాలి. 

ఆంగదేవతలకు విడివిడిగా ఆరు ఆహుతులివ్యాలి. వహ్ని - మంత్రాధిదేవతలకు నాడీ సంధానం సంకల్పించి పదకొండుసార్లు ఘృతహోమం చెయ్యాలి. తదనంతరం కల్ఫోక్తద్రవ్యాలతోగానీ తిలలతోగాని దేవతామూలమంత్రోచ్చారణ పూర్వకంగా గజాంతక సహస్రకం హోమం చెయ్యాలి.

ఈ హోమవిధానంతో మహాదేవినీ పరివార దేవిబృందాలను (ఆవృతిదేవీః) అగ్నిదేవుణ్ణీ సంతృప్తి
పరిచినట్టూ వారు సంతృప్తి చెందినట్టూ భావించాలి.

దీక్షా స్వీకారం





No comments:

Post a Comment

Mahadevi Aatmavishkaram - మహాదేవి ఆత్మావిష్కారం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - మహాదేవి ఆత్మావిష్కారం భాస్వజ్జపాకుసుమాభ, బాలకోటిరవిప్రభ, బాలశీతాంశుమకుట, వస్త్రాంతర్వ్యంజితస్తని. వర - పాశ...