Sunday, August 16, 2026

Deeksha Pradanam - దీక్షా ప్రదానం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దీక్షా ప్రదానం

నారాయణమహర్షీ! రకరకాల పూజలూ ధ్యానాలూ అనుష్ఠానాలూ వివరంగా తెలియజేశావు. కానీ వాటికి సంబంధించిన దీక్షావిధానం ఏమిటి? అది కొంచెం వివరించు.

నారదా! ఏ వ్రతానికైనా దీక్షముఖ్యం. అది లేనిదే పూజచేసే అధికారమే సిద్ధించదు. దీక్ష దివ్యజ్ఞానాన్ని ఇస్తుందనీ పాపాలను క్షయింపజేన్తుందనీ వేదతంత్రవిశారదులు నిర్వచించారు.

కనక దేవ గురు వహ్నిపూజాదులన్నింటికీ దీక్షాస్వీకారం తప్పనిసరి. దీక్షను ఇచ్చినవారూ పుచ్చుకున్నవారూ కూడా విశుద్ధులవుతారు.

దీక్షనిచ్చే గురువు ప్రాతఃకాలంలో స్నానసంధ్యాధికమంతా యథావిధిగా ముగించుకుని కమండలువులో జలం నింపుకుని మౌనిగా నదీతీరంనుంచి ఇంటికి రావాలి. సరాసరి యాగమంటపం దగ్గరలో సముచితాసనంమీద కూర్చోవాలి. ఆచమించాలి. ప్రాణాయామం చెయ్యాలి. 

కమండలుజలంలో గంధపుష్పాలు కలుపుతూ అస్త్ర మంత్రాన్ని ఏడుసార్లు జపించాలి. ఆదే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్ళతో యాగమంటపాన్ని సంప్రోక్షించాలి. ఊర్ద్వోదుంబరంలో గణపతిపూజ చెయ్యాలి. లక్ష్మీసరస్వతులను పువ్వులతో ఆర్చించాలి. 

ద్వార దక్షిణభాగాన గంగా గణపతులనూ వామభాగాన యమునా - క్షేత్ర పాలకులనూ నిక్షేపించి అర్చించాలి. గుమ్మంలో ఆస్త్ర మంత్రంతో అస్త్రదేవతను పూజించాలి. మంటపమంతా దేవీమయమైనట్టు భావించాలి. 

అదే మంత్రం చదువుతూ అంతరిక్షగత - భూమిగత విఘ్నాలను పారద్రోలాలి. అప్పుడు గుమ్మం ఎడమ భాగాన్ని తాకుతూ కుడికాలు మెట్టి లోపలికి ప్రవేశించాలి.

కలశం స్థాపించాలి. సామాన్యార్ఘ్యం నిర్వహించాలి. ఆ జలంతో నైరృతిదిశలో వాస్తునాథుడినీ బ్రహ్మదేవుణ్ణీ గంధపుష్పాక్షతలతో అర్చించాలి. అదే జలంతోనూ పంచగవ్యంతోనూ తోరణస్తంభం వరకూ మండపంలోపల సంప్రోక్షించాలి. అంతా దేవీమయమైనట్టు హృదయంలో భావించాలి. 

భక్తితో మూలమంత్రం జపిస్తూ దర్భలతో అంతటా నీళ్ళు చిలకరించాలి. శరమంత్రం పఠిస్తూ మంటపంలోపలి నేలను చరవాలి (తాటించాలి). హుం మంత్రం పఠిస్తూ అభ్యుక్షణం చెయ్యాలి. ధూపంవేసి వికారాలను పారద్రోలాలి. దర్భలతో మార్జని చేసి అంతటా అన్నింటినీ సమ్మార్జించాలి. ఈశాన్యదిక్కున మార్జించి "తత్పుంజం" స్థాపించి పుణ్యాహవాచనంచేసి దీనానాథులను తృప్తిపరచాలి.

అటుపైని మెత్తని ఆసనంమీద తూర్పుముఖంగా కూర్చుని తన గురువునూ దేయమంత్రదేవతనూ ధ్యానించి నమస్కరించాలి. భూతశుద్ధి చేసుకుని దేయమంత్రానికి ఋష్యాదిన్యాసం చెయ్యాలి. ఋషిని శిరోభాగాన, ఛందస్సును ముఖభాగాన, అధిదేవతను హృదయపద్మాన, బీజాక్షరాన్ని గుహ్యభాగాన, శక్తిని పాదద్వయాన విన్యసించాలి. 

మూడుసార్లు చప్పట్లు కొట్టి దిగ్బంధం చెయ్యాలి. ఛోటికాత్రయ పూర్వకంగా (చిటికెలు) ప్రాణాయామం చేసి మూలమంత్రంతో స్వశరీరంలో మాతృకాన్యానం చెయ్యాలి. 

ఓం అం శిరసే నమః ఇత్యాదిగా క్రమపద్ధతిలో ఈ న్యాసం జరగాలి. ఇలాగే మూలమంత్రాన్ని షడంగంగా కరాంగుళీ హృదయాదుల్లో న్యసించాలి. ప్రణవాక్షరపూర్వకాలూ నమః - స్వాహా - వషట్‌ - హుం - వౌషట్‌ - ఫట్‌ పదాంతాలూ అయిన ఆరుమంత్రాలతో చేసే న్యాసాన్ని షడంగకం అంటారు.

అటు పైని మూలమంత్ర వర్ణన్యాసంకూడా తత్తత్‌ కల్ఫోక్తప్రకారంగా చెయ్యాలి. అయ్యాక స్వశరీరంలో శుభాసనాన్ని సంభావించాలి. అందులో దక్షిణభుజాన ధర్మాన్ని వామభుజాన జ్ఞానాన్ని ఎడమతొడలో వైరాగ్యాన్ని కుడితొడలో ఐశ్వర్యాన్ని ముఖంలో అధర్మాన్ని - ఇలాగే ఆయా భాగాలలో ఆయా అంశాలను నియమానుసారం విన్యసించాలి. ఈ సింహాసనానికి ధర్మార్ధ కామమోక్షాలు నాలుగు కోళ్ళు. అధర్మాదులు శరీరం.

ఈ సింహాసనంలో మధ్యభాగం హృదయం. అది మృదువు. కనక అక్కడ అనంతరూపమైన ప్రపంచపద్మాన్ని విన్యసించాలి. (అనంతుణ్ణీ ప్రపంచపద్మాన్నీ అనిగానీ). ఆ నిర్మల పద్మంలో సూర్య చంద్ర - పావకులను కళలతోసహా సమంత్రకంగా న్యసించాలి.

సూర్యుడికి పన్నెండు చంద్రుడికి పదహారు అగ్నికి పది కళలుంటాయని పెద్దలు చెప్పారు. వాటితోసహా వారిని ధ్యానించాలి.

ఈ ముగ్గురికీ పైని సత్వరజస్తమోగుణాలను సంభావించాలి. ఆత్మ - ఆంతరాత్మ - పరమాత్మ - జ్ఞానాత్మలను న్యసించాలి. ఇది పీఠకల్పన. అముకాసనాయ నమః ఇత్యాది మంత్రంతో ఆసనపూజచేసి దానిమీదకు పరాంబికను ధ్యానించి ఆవాహన చెయ్యాలి.

దేయమంత్ర అధిదేవతనుకూడా ఇలాగే కల్పోక్త ప్రకారంగా ఆవాహనచేసి మానసోపచారాలతో అర్చించాలి. ముద్రలు ప్రదర్శించాలి. అవి దేవికి ఆనందకారకాలు.

అటుపైన (శరీర - మండప) వామభాగాగ్రంలో షట్కోణమండలాన్నీ దానిలో వర్తుల మండలాన్నీ దాని మధ్యలో చతురస్ర మండలాన్నీ దాని నడుమ త్రికోణమండలాన్నీ (భావనారూపంగా) లిఖించాలి.

అందులో శంఖముద్రను ప్రదర్శించాలి. షట్కోణాలలో షడంగాలను పూలతో పూజించాలి. ఆగ్నేయాది కోణాలలో ఈ షడంగకార్చన చెయ్యాలి. శంఖానికున్న ఆధారపాత్రను తీసి అస్త్రమంత్రోదకంతో ప్రోక్షించి ఆ మండలంలో స్థాపించాలి. 

మం వహ్నిమండలాయ అనే మంత్రంతో దశకళాత్మకుడైన అగ్నిని అర్చించాలి. (శంఖ) ఆధారపత్ర స్థాపనలో అముకదేవ్యా ఆర్ఘ్యపాత్రస్థానాయ నమః ఆంటూ ఆ మంత్రాన్ని పఠించాలి. ఈ ఆధారపాత్రకు తూర్పునుంచి ఆరంభించి ప్రదక్షిణక్రమంలో ఆగ్నికళలు పదింటికీ పూజచెయ్యాలి, 

అటుపైని మూలమంత్రంతో శంఖాన్ని ప్రోక్షించి ఆధారపాత్రలో ఉంచాలి. అప్పుడూ మూలమంత్రమే పఠించాలి. ఆం సూర్యమండలాయ అనే మంత్రంతో ద్వాదశకళలూ అర్చించాలి. అముకదేవ్యర్ఘ్యపాత్రాయ నమః అనాలి. 

శం శంఖాయ నమః అంటూ శంఖాన్ని ప్రోక్షించి ఆందులో సూర్యుడి పన్నెండు కళలకూ కుసుమార్చన చెయ్యాలి. విలోమమాతృకను విలోమ మూలమంత్రంతో ధ్యానించాలి. శంఖంలో నీళ్ళు నింపి చంద్రకళాన్యాసం చెయ్యాలి. 

ఉం సోమమండలాయ నమః అనే దానితో మొదలుపెట్టి అముకార్ఘ్యామృతాయ అనే హృన్మంత్రంవరకూ ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ షోడశకలాత్మకుడిని అర్చించాలి. అదే మంత్రంతో సృణిముద్రతో జలార్చన చెయ్యాలి. సకల తీర్థాలనూ శంఖజలంలోకి ఆవాహనచేసి ఎనిమిదిసార్లు మంత్రోచ్చారణ జరపాలి. 

షడంగాలనూ ఆ జలంలో విన్యసించి హృదయస్థానంలో ఈ జలార్చన చెయ్యాలి. మత్స్యముద్రతో శంఖంపైన ఆచ్చాదన పట్టి మూలమంత్రాన్ని ఎనిమిదిసార్లు జపించాలి. ఆ పైని దక్షిణదిగ్భాగంలో శంఖప్రోక్షణిని ఉంచాలి. శంఖంలోని నీళ్ళు కొంచెంగా ప్రోక్షణిలో పోసి అంతటా జల్లాలి.

ఈ సంప్రోక్షణతో ప్రదేశమూ తానూ పూజాద్రవ్యాలూ విశుద్ది పొందినట్లు భావించాలి.

అటుపైని గురువుగారు తన ఎట్టయెదుట ఉన్న వేదికపై సర్వతోభద్రమండలాన్ని లిఖించాలి. కర్ణికామధ్యం లిఖించి అందులో తెల్లటి బియ్యం నింపాలి. వాటిమీద దర్భలు పరిచి సలక్షణమైన కూర్చను ఉంచాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠమంత్రాంతంగా అర్చన చెయ్యాలి. 

చిల్లులూ బొడిపెలూలేని కొత్త కుంభం తెచ్చి అస్త్రజలంతో క్షాళన చెయ్యాలి. మూడుపేటల ఎరుపుదారంతో తంతువేష్టనం చేసి తారమంత్రం ఉచ్చరిస్తూ నవరత్న కూర్చ గంధపుష్పాదుల్ని ఆ కుండంలో వెయ్యాలి. పీఠానికీ కుంభానికీ ఐక్యాన్ని భావించాలి.

ప్రతిలోమమంత్రోచ్చారణ చేస్తూ ఆ తీర్థోదకాలతో మాతృకాపూజ చెయ్యాలి. మూలమంత్రం జపిస్తూ ఆ కుంభాన్ని దేవతగా అర్చించాలి. రావి - పనస - మామిడి చిగుళ్ళతో కుంభవదనాన్ని ఆచ్చాదించాలి.

చషకంలో (చిన్నపాత్ర) పళ్ళూ అక్షతలూ ఉంచి వస్త్రయుగ్మం చుట్టి ప్రాణస్థాపనమంత్రంతో ప్రాణస్థాపన చెయ్యాలి. ఆవాహనాది ముద్రలు పట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి. అటుపైని కల్పోక్త ప్రకారంగా పరమేశానిని ధ్యానించాలి. ముందుగా స్వాగతం పలికి కుశలప్రశ్నలు వెయ్యాలి. 

పాద్యం అర్ఘ్యం ఆచమనం మధుపర్కం అభ్యంగనస్నానం రక్త క్షౌమ వస్త్రయుగ్మం మణిభూషలు - ఇత్యాదిగా షోడశోపచారాలూ చెయ్యాలి. మాతృకార్చనా విధానంలో సంపుటిత వర్ణమంత్రాలతో ఈ ఉపచారాలు శ్రద్ధగా జరపాలి. ఇది అయ్యాక నైవేద్యం సమర్పించాలి.

ప్రతిద్రవ్యాన్నీ కేవలం ప్రోక్షణీజలంతోనే సంప్రోక్షించి నివేదించాలి. మరింక ఏ పాత్రలో నీరూ వాడకూడదు. ఆ తరవాత నవావరణ సాంగదేవీపూజ నిర్వర్తించి వైశ్వదేవం చెయ్యాలి. దక్షిణ దిగ్భాగాన స్థండిలం ఏర్పాటుచేసి అగ్నిని నిక్షేపించాలి.

మూర్తిలో ఉన్నదేవతను ఆక్కడకు ఆవాహన చెయ్యాలి. పూజించాలి. ఆహృతులతో మూలమ౦త్రంతో హోమం చెయ్యాలి. నేతిపాయసాన్ని పాతికసార్లు హోమంచేసి కొసరుగా వ్యాహృతులతో పునర్హొమం చెయ్యాలి. గంధాదులతో అర్చించి దేవిని మళ్ళీ పీఠంమీద పెట్టాలి. 

అగ్నికి విసర్జన చెప్పి దశదిశలకూ బలి చల్లాలి. దేవీపార్షదులకు పంచోపచారాలు చేసి తాంబూలం ఛత్రం చామరం దేవికి సమర్పించాలి. మూలమంత్రాన్ని వెయ్యిసార్లు జపించాలి. ఆ జపాన్ని అమ్మవారికి సమర్పించాలి. 

ఆటు పైని ఈశాన్యకోణంలో వికిరం చెయ్యాలి. కర్కరిని స్థాపించి దుర్గను ఆవాహనచేసి పూజించాలి. రక్ష రక్ష అనాలి. అస్త్రమంత్రమే జపిస్తూ ప్రదక్షిణగా మంత్రోదకం జల్లి అక్కడ కర్కరిని ఉంచి ఆస్త్రదేవతను ఆరాధించాలి. అంతా అయ్యాక గురుశిష్యులిద్దరూ మౌనంగా భోజనం చెయ్యాలి. ఆ రాత్రికి ఆ యాగశాలలో వేదికపై నిద్రించాలి.

స్థండిల కుండ సంస్కారాలు





No comments:

Post a Comment

Indraadi Devatalaku Devi Gunapatham - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం పూర్వకాలంలో మదోద్దతులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది నూరేళ్ళు సాగిన మహ...