Saturday, August 29, 2026

Balaramudu Teerdhayatraku Januta - బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - బలరాముడు తీర్థయాత్రకు జనుట

ఆ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి మొదట ప్రభాసతీర్దానికి వెళ్లి, పుణ్యస్నానం ఆచరించి, ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. 

బ్రాహ్మణోత్తములు వెంటరాగా, సరస్వతీనది, బిందు సరోవరం, వజ్రతీర్ధం, విశాలానది, సరయూనది, యమున, గంగ మున్నగుపుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవ, ఋషి పితృగణాలకు తర్పణాలు నిర్వహించాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులకు సంతర్పణలు చేశాడు. 

అనంతరం సమస్తలోకాలకు స్తుతి పాత్రమైందీ, సకల మునిసమాజానికి నివాసమూ - అయిన నైమిశారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ మునీశ్వరులు సుదీర్ఘకాలికమైన సత్రయాగాన్ని నిర్వహిస్తున్నారు.

వారందరూ బలరామునికి భక్తితో ఎదురేగి, వినయంతో స్వాగతం పలికి, అతిథి సత్కారాలు ఆచరించారు. అందుకు ఆనందించి, బలరాముడు సపరివారంగా ఆసీనుడైనాడు.

(“ప్రభాసము” ; సౌరాష్ట్రదేశంలో సరస్వతీనది పడమటిసముద్రంలో కలిసేచోట వెలసియున్న పుణ్యతీర్థం. చంద్రుడు ఈ నదిలో స్నానంచేసి, తనకృశత్వాన్ని వదిలించుకొని ప్రభాసుడైనాడు. ఇందువలన ఆ తీర్థానికి 'ప్రభాస తీర్ధ'మనే నామధేయం సార్ధకంగా ఏర్పడింది.

ఆ సమయంలో తక్కిన మునులలాగా తన కెదురేగి వచ్చి నమస్కారాది సముచిత కార్యాలను చెయ్యకుండా ఉన్నతా సనంమీద అలాగే కూర్చుండిన ప్రజ్ఞాసముపేతుడైన సూత పౌరాణికుణ్ణి

(“జ్ఞానవయోవృద్దుడు వచ్చినప్పుడు యువకుడుగా ఉన్నవాడి ప్రాణాలు నిలువున పైకి పోవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి, చిన్నవయస్సులో ఉన్నవాడు కూర్చున్నస్థానం నుండి లేచి, ఎదురేగి నమస్కరించి, మర్యాద చేయడంవలన ఆ ప్రాణాలు పోకుండా నిలుస్తాయి.” అని మనుధర్మశాస్త్రం సూచించింది.)

సూతుడు తనను జూచి లేవనందుకు బలరాముడు కోపించాడు. వెంటనే అచ్చటి ఋషులను చూచి ఇలా పల్కాడు 'వీడు మహర్షులసభలో తానే పెద్దగా భావించి, దురభిమాని ఐనాడు. వ్యాసునివద్ద కొన్ని కథలూ, గాథలూ నేర్చుకొని విద్వాంసుడినని విర్రవీగుతున్నాడు. విద్య ఇలాంటి అల్పులలో గర్వాన్నే పెంచుతుందిగాని సత్త్వగుణాన్ని పెంపొందించదు కదా! ధర్మాన్ని సంరక్షించేందుకై అవతరించిన మాకు ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం అవశ్యకర్తవ్యం' - అని పలుకుతూ తన చేతిలోగల దర్భపోచయొక్క కొనతో సూతుణ్ణి సంహరించాడు. అది చూచి అక్కడి మునీంద్రులందరూ హాహాకారాలు చేశారు. అనంతరం బలరామునితో ఇలా పల్కినారు.

(సూతుడు : క్షత్రియునికి బ్రాహ్మణస్త్రీయందు జన్మించినవాడు; లేదా వైశ్యునికి క్షత్రియస్త్రీయందు జన్మించినవాడు సూతుడు. అందువల్లనే బలరాముడు సూతుజ్జి 'ప్రతిలోమజాతుడు' - అని పేర్కొనినాడు. ద్వాపరయుగంలోని భారతీయసమాజంలో సూతకులస్థులు విద్యావేత్తలైన పారాణికులుగా, యుద్ధనీతినిపుణులుగా, రథసారథులుగా ప్రముఖస్థానాన్ని వహించియుండినారు)

మహానుభావా! బలరామా! మా కందరికీ పురాణాలు వివరిస్తూ ఉన్న ఈ సూతునికి (ఈ యజ్ఞంపూర్తి అయ్యేదాకా) శ్రేష్ఠమైన బ్రహ్మాసనాన్ని మేమే ఏర్పరచాము. అందువల్లనే నీవు వచ్చినప్పుడు ఈతడు బ్రహ్మాసనంనుండి దిగలేదు. (అవతార పురుషుడవయిన) నీ మనస్సుకు ముందుగా ఈ విషయం తెలియకుండా ఉంటుందా? (ఉండదు కదా!)

దుష్టులను సంహరించే స్వభావంగల బలరామదేవా! తెలిసితెలిసీ నీవు బ్రహ్మహత్యాపాతకానికి పాల్పడినావు. ఈ పాప నివారణకు తగిన ప్రాయశ్చిత్తకార్యాన్ని వెంటనే ప్రారంభించవలసింది.

(సూతుడు పుట్టుకచేత బ్రాహ్మణేతరుడైనను నైమిశారణ్యఋషులు తమ తపశ్శక్తివల్ల ఉన్నతమగు బ్రహ్మాసనంపై ఆయన్ను కూర్చుండజేసినారు. ఆ విధంగా అతనికి బ్రాహ్మణత్వం ప్రాప్తించింది. ఆతణ్ణి సంహరించినందున బలరామునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొనింది.)

అంతేగాక, పరమపవిత్రుడవైన నీవే ధర్మాన్ని తప్పితే, ఇక మాన్పగలవారెవరు? కాబట్టి, నీవు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ధర్మానికి మనుగడ ఉండదు గనుక, నీవు ఇందుకు అనుగుణమైన ప్రాయశ్చిత్తాన్ని ఆలోచించు. అప్పుడు బలరాముడు వాళ్లతో ఇలా అన్నాడు. 'తొందరపడి ఈ పాపం చేశాను. దీనికి ప్రతిక్రియను మీరే తెల్పగలరు. నా యోగమాయా ప్రభావంచేత సూతుణ్ణి బ్రతికించి, దీర్ఘమైన ఆయుర్దాయంగల గొప్ప బలవంతుణ్ణిగా చేస్తాను. అది మీకు సమ్మతమేనా?' (అన్నాడు)

అప్పుడు ఋషులు ఇలా అన్నారు :

'దేవా! నీ అస్త్రప్రభావానికీ, మృత్యుదేవతకూ, మాకూ (మా సత్యవాక్కులకూ,) ఎటువంటిలోటు వాటిల్లకుండే విధంగా చేయవలసింది. అప్పుడు బలరాముడు మరల ఋషులతో ఇలా పల్కినాడు.

పరీక్షిన్మహారాజా! ఉదాత్తచరితుడైన బలరామదేవుడు నిశ్చయభావంతో ఋషుల నుద్దేశించి ఇలా పలికినాడు. “ఆత్మా వై పుత్ర నామాసి” - అనే పవిత్రమైన వేదవాక్యం ప్రసిద్ధమై ఉన్నది కదా! అందువలన

విద్వత్‌ శ్రేష్ఠులైన మునీంద్రులారా! నేను బతికిస్తున్న ఈతని పుత్రుడు నేటినుండి అధికమైన బలం, పరిపూర్ణమైన ఆయుస్సు, మంచి ఆరోగ్యం, చక్కని విద్యాప్రావీణ్యం గలిగినవాడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు.

(1. బలరామదేవుడు తాను సంహరించిన సూతునినుండి తన యోగమాయాప్రభావంతో ఆతని పుత్రుని(మరియొక సూతుని) సృష్టించాడు. ఆతనికి అమితబలాన్ని ఆయుస్సును, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. 

చనిపోయిన తండ్రియగు సూతుని పేరు రోమహర్షణుడు; ఆతనినుండి సృష్టింపబడిన సూతుని పేరు రౌమహర్షణి (ఉగ్రశ్రవసుడు).

2. రోమహర్షణుడు సాక్షాత్తుగ జీవితుడు కాకపోవటంచేత బలరాముని అస్త్రానికి, మృత్యువునకు సత్యత్వం చేకూరింది. అలాగే సూతుడు పుత్రుని రూపంలో జీవించడంచేత, అతనికి బలం, ఆయుస్సు, ఆరోగ్యం చేకూరటంచేత ఋషీశ్వరుల వాక్కులకు సత్యత్వం సిద్ధించింది.)

బలరామదేవుడు సూతుణ్ణి ఆతని పుత్రుని రూపంతో బ్రతికించి మళ్లీ ఇలా అన్నాడు.

'నేను మీయెడల తెలియక చేసిన ఈ అపరాధం శాంతించే విధంగా, అందుకు ప్రాయశ్చిత్తంగా మీకు మిగుల ఇష్టమైన ఏదైన ఒక కార్యాన్ని చేస్తాను; సెలవీయండి!' అని పల్కగా ఆ మహర్షులు బలరాముణ్ణి చూచి

'బలరామదేవా! ఇల్వలుడనే రాక్షసుని కుమారుడు పల్వలుడు. వాడు బలగర్వితుడై పట్టుబట్టి ద్వేషంతో ప్రతియొక్క పర్వంనాడూ వచ్చి, మా యజ్ఞశాలలమీద మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను కురిపించి, ఆ శాలల్ని పాడుచేస్తూన్నాడు.

కాబట్టి, ఆ దుష్టరాక్షసుణ్ణి సంహరించి మాకు సంతోషాన్ని కలిగించు అటు పిమ్మట నిర్మలచిత్తంతో సంచరిస్తూ పన్నెండుమాసాలు భారతవర్షంలోని వివిధపుణ్యతీర్థాల్లో పవిత్రస్తానాలు ఆచరించు! అందువల్ల సమస్తపాపాలు తొలగిపోతాయి అని వాళ్లు అంటూ ఉండగానే పర్వదినం వచ్చేసింది.

(మామూలు దినాల్లోకన్నా పర్వదినాల్లో యజ్ఞయాగాదులు ఆచరించటం అధికఫలదాయకమని త్రికాలజ్ఞులైన మహర్షిపుంగవుల నిశ్చయం.

పూర్ణిమ, అమావాస్య, రవిసంక్రాంతి, బహుళ అష్టమి, బహుళ చతుర్దశి - ఈ ఐదిటికి 'పంచపర్వము'లని వ్యవహారం. ఈ పంచపర్వాలలోను పూర్ణిమకు ప్రాధాన్యం చెప్పబడింది.)

పర్వదినం కావటంచేత నైమిశారణ్యంలోని మహర్షులు యజ్ఞకార్యానికి పూనుకొనటం పల్వలుడు పసికట్టాడు. వెంటనే వచ్చి ఆకాశంనుండి రక్తాన్ని మలమూత్రాలను, మద్యమాంసాలను కురిపించి, మున్యాశ్రమాలను నానాబీభత్సం కావించాడు. ధూళితో, రాళ్లతో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలాగున చేశాడు. కాటుక కొండను పోలిన నల్లని భారీ శరీరం, క్రొత్తగా ఒలిచిన మానవచర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని, ఎర్రనిగడ్డం, మీసాలు గలిగి, పెద్దముక్కూ మిడిగ్రుడ్లూ, నిప్పులు విరజిమ్మేచూపులు, వ్రేలాడుతున్నపెదవులూ, మిగుల పొడుగైన, భీకరమైన నాలుకా కలిగి, ముడివడినకనుబొమలతో అమితభయం గొల్పుతూ ఆకసంలో సంచరిస్తూ ఉండిన ఆ పల్వలుణ్ణి బలరాముడు చూచాడు.

పల్వలుడనే ఆ రాక్షసుడిచేతిలో యమదండంలాంటి శూలాయుధం తీవ్రంగా చూస్తూవుంది. ఆతనిదౌడలు మానవరక్తుచేత బాగా తడిసి ఉన్నాయి. వాడు అత్యధికమైన యుద్దోత్సాహంకలవాడుగా గోచరిస్తున్నాడు. వజ్రాయుధంలాంటి వాడికోరలనుండి నిప్పురవ్వలు వెలువడుతూ దిగంతరాళాన్ని ఆవరిస్తున్నాయి. వాడిమెడలోని తలల, ఎముకల హారాన్నిబట్టి ప్రాణుల్ని చంపడమే వాని స్వభావంగా వెల్లడవుతున్నది. అటువంటి భయంకరాకారుడైన రక్కసు
ణ్ణి బలరామదేవుడు చూచాడు.

ఆకాశంలో క్రొత్తకాంతులను విరజిమ్మే విధంగా గదను వేగంగా త్రిప్పుతూ, పల్వలుడు తనమీదికి రావటాన్ని బలభద్రుడు గమనించాడు. వెంటనే రాక్షస సంహారకార్యంలో సమర్థాలైన రోకలి, నాగలి - అనే తన రెండు ఆయుధాలను స్మరించాడు అవి తత్‌క్షణమే సూర్య సమాన తేజంతో బలరాముని యెదుట ప్రత్యక్షమయ్యాయి.

ఆ రీతిగా తాను సంకల్పించినవెంటనే తన వద్దకు చేరిన తన కార్యాన్ని సాధించే శక్తిమంతాలైన ఆయుధాలను రెండిటిని ధరించిన పిమ్మట

ఆ రీతిగా సాక్షాత్కరించిన తన ఆయుధాలను రెండిటిని అందుకొని బలరామదేవుడు ఆకాశంలో సంచరిస్తూవున్న పల్వలుని కంఠానికి తన ఎడమచేతియందలి నాగలిని తగిలించి, క్రిందికి లాగినాడు. వెనువెంటనే కుడిచేతిలోని రోకలితో వాని నడినెత్తిపై బలంగా మోదినాడు. ఆ దెబ్బకు దేవేంద్రుని వజ్రాయుధంవేటుకు ఱెక్కలు విరిగి పడ్డ కొండలాగా భుగభుగమను ధ్వనితో శరీరంనుండి నెత్తురు స్రవిస్తూవుండగా భూమిపై బోరగిలపడిపోయాడు.

ఆ విధంగా బలరాముని చేతిలో పల్వలుడు మృతి నొందిన పిమ్మట

పైవిధంగా పల్వలుడు కూలిపడటం చూచి, వృత్రాసురు
ణ్ణి సంహరించిన దేవేంద్రుణ్ణి దేవతలు వినుతించిన విధంగా నైమిశారణ్యమునీశ్వరులు బలరామదేవుణ్ణి అనేకరీతుల ప్రస్తుతించారు.

నైమిశారణ్యలోని మహర్షులు బలరామదేవుణ్ణి పుణ్యజలాలతో అభిషిక్తు
ణ్ణి కావించారు. సౌరభాలు వెదజల్లే సుందర పద్మమాలికతో అలంకరించినారు. అందమైన ఆభరణాలను, దివ్యవస్త్రాలను ప్రీతితో సమర్పించారు. మునీంద్రులకు ఆనందం కలిగేటట్లు బలరాముడు వాటిల్ని సముచితంగా ధరించాడు.

నైమిశారణ్య మునీశ్వరులచే సమ్మానితుడైన బలరాముడు దేవేంద్రునివలె భాసించాడు. బుద్దిశాలియైన ఆయన ఆ మునిసమూహాన్ని వీడ్కొని, విప్రోత్తములు కొందరు తనను సేవిస్తూ వెంటరాగా 'కౌశికి' అనే నదీతీరానికి

బలరాముడు కౌశికీనదిలో స్నానంచేశాడు. అక్కడ నుండి వెళ్లి సరయూనదిలో మునిగాడు. అటుపై ప్రయాగకేగి త్రివేణీ సంగమంలో దేవర్షి పితృతర్పణాలు నిర్వహించాడు. పులస్త్యాశ్రమంమీదుగా వెళ్లి గోమతీనదిని దర్శించి, గండకీ నదిని దాటి, సంసారబంధమోచనియైన విపాశలో పవిత్ర స్నానంచేసి, శోణనదంలోనూ, గయలోనూ మునుకలువెేసి, అటుపై గంగా సాగరసంగమ సందర్శనానంతరం మహేంద్ర పర్వతం చేరుకొన్నాడు.

బలరాముడు(నిరంకుశులైయున్న) క్షత్రియకులాన్ని తునుమాడినవాడూ, దయాది సమస్తసద్గుణాలకు నెలవైనవాడూ, సజ్జనులకు అలంకారమైనవాడూ, భృగువంశ జాతుడూ అయిన పరశురామస్వామిని మహేంద్రాచలంమీద సందర్శించినాడు.

బలరాముడు కుతూహలం విలసిల్లగా పరశురామదేవుణ్ణి సందర్శించి వందనం కావించాడు. అచ్చటినుండి మిగుల మనోహరమైయున్న సప్తగోదావరిని సందర్శించి, అందులో పుణ్యస్నానం కావించాడు.

(సప్తగోదావరి ; గౌతమి, వశిష్ట ఆత్రేయ, వైనతేయ, తుల్యభాగ, భరద్వాజ(విశ్వామిత్ర), జమదగ్ని - అనే పేర్లుగల ఏడు పాయలుగా చీలినందువల్ల గోదావరికి సప్తగోదావరం' అనే పేరు ప్రసిద్ధం.)

సప్తగోదావరిని సందర్శించిన అనంతరం బలభద్రస్వామి కృష్ణవేణీనదిని, పంపాసరోవరాన్ని తిలకించాడు. అటు పిమ్మట భీమరథీనది వద్ద కరిగి, అచ్చట నెలకొని ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించాడు. ఆ తరువాత శ్రీశైలం, వేంకటాచలం, కాంచీపురి మొదలయిన పుణ్య క్షేత్రాలను చూచి, కావేరిని చేరి, ఆ మహానదిలో పుణ్యస్నానం కావించాడు.

(భరతఖండంలోని 18 శక్తిపీఠాల్లో కాంచీపురం ఒకటి.)

తనను శరణుపొందిన ఆశ్రితులనే క్షీరసాగరానికి పున్నమచంద్రుడైనవాడూ, పాపాలనే కాలకూటాన్ని కబళించే పరమేశ్వరుడూ, రాక్షసుల సంపదలను ఉపసంహరించేవాడూ, దేవతలచే వినుతింపబడిన అనంత నామధేయాలు గలవాడూ, అద్వితీయమయిన బుద్ది విశేషంచేత మనోజ్ఞంగా భాసించేవాడూ, సమస్తదేవతలకు సార్వభౌముడూ, కావేరీ మధ్యదేశంలో వేంచేసివున్నవాడూ అయిన శ్రీరంగనాథు
ణ్ణి బలరాముడు భక్తిప్రపత్తులతో సేవించాడు.

(కావేరీకొల్లడం నదుల మధ్య గల భూభాగానికి (ద్వీపానికి) 'రంగ'మని పురాణ ప్రసిద్ధి. ఆ 'రంగము' ను నివాసంగా గలిగి ఉన్నందున అచ్చట వెలసివున్న అర్చామూర్తికి 'రంగధాము'డని వ్యవహారం. 'ఇవతల కావేరి, అవతల కొల్లడము, నడుమనే శ్రీరంగనాథపురము' అని స్త్రీల పాటల్లో ప్రసిద్ధి.)

కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరమ్‌ |
సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్‌ ॥
- గరుడపురాణమ్‌.

'రంగమునకు 'శ్రీరంగము' - అనేది పవిత్రమైన నామాంతరం.

ఇక్కడ సంస్కృతమూలంలో "శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్రసన్నిహితో హరిః” - అని అర్ధశ్లోకంలో చెప్పబడిన విషయాన్ని భక్తకవీశ్వరుడైన బమ్మెరపోతన తెలుగున స్రగ్ధరావృత్తంలో పెంపొందించివుండటం విశేషం!

“స్రక్‌” - అనగా పూలదండ. “స్రగ్ధరా - అనగా పూలమాలను ధరించినట్లుగా ఉండే పద్యమని భావం.
అర్చామూర్తులలో అగ్రగణ్యుడైన శ్రీరంగనాథు
ణ్ణి వర్ణించటంలో మహాకవి ఈ పద్యాన్ని రచించడం సాభిప్రాయమైన విశేషం! శ్రీరంగనాథునికి ఆళ్వారులలో ప్రసిద్ధుడైన పెరియాళ్వార్‌ యావజ్జీవం చేసింది పుష్ప మాలాకైంకర్యమే! అంతేకాదు, పెరియాళ్వార్‌ పెంపుడు కూతురు గోదాదేవి చేసింది కూడా పుష్పమాలా కైంకర్యమే! కాబట్టి 'స్రగ్ధరా' వృత్తం సార్ధకం!)

బలరాముడు శ్రీరంగనాథు
ణ్ణి సందర్శించిన పిదప వృషభాద్రి, మధుర, సేతుబంధం దర్శించి, అచ్చటి బ్రాహ్మణులకు పదివేల పాడియావులను దానం చేశాడు. రామేశ్వరం మొదలైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూచి, మలయాచలంఎక్కి అగస్య మునీంద్రునికి అభివందనం కావించి, కన్యాకుమారిని గాంచి, గోకర్ణక్షేత్రంలో పరమేశ్వరుణ్ణి సందర్శించాడు. తాపి, పయోష్ణి, నిర్వింధ్యానదులను దాటి, దండకారణ్యంలో ప్రవేశించి, క్రమంగా మళ్లీ ప్రభాసతీర్థం చేరినాడు. కౌరవపాండవయుద్ధంలో సమస్తరాజులూ హతులయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్దానికి సన్నద్దులౌతున్నారనీ ప్రభాసతీర్థమందలి బ్రాహ్మణులవల్ల తెలుసుకొన్నాడు. అందువల్ల వారిరువురినీ ఆ గదాయుద్దాన్నుండి నివారించేందుకు ఆ ప్రదేశానికి వెళ్లాడు.

బలరాముడు భక్తితో తనకు నమస్కరించిన శ్రీ కృష్ణుణ్ణి, పాండవులను చూచికూడా పలుకరింపలేదు. గదాయుద్దానికి సంసిద్దులౌతూవున్న భీమదుర్యోధనుల దగ్గరికే సరాసరి వెళ్లాడు.

బలరాముడు భీమ సుయోధనులను చూచి, దగ్గరకు వెళ్లి, వాళ్లతో ఇలా అన్నాడు.

అలా భీమదుర్యోధనులను సమీపించిన బలరాముడు వారితో ఇలా పల్కాడు. 'వీరశ్రేష్ఠులారా! మీలో ఒకడు(భీముడు) భుజబలంలో అధికుడు; మరొకడు(సుయోధనుడు) అభ్యాససంపదలో శ్రేష్ఠుడు. అందువల్ల మీరిద్దరూ గదాయుద్ధంలో సమానబలశాలురు. కనుక మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అలాంటప్పుడు ఊరక యుద్ధం చెయ్యడమెందుకు?' - అని. ఆ హితవచనాలు వాళ్లకు రుచించలేదు. అందుకు కారణం వాళ్ల మనస్సుల్లో మెదలుతూవున్న పాత పగలు, ప్రతిజ్ఞలూను. అందువల్ల వాళ్లిరువురూ పట్టుదలతో, పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించుకొన్నారు. వీళ్లకు మేలు కీడులు ఎలా జరుగవలసివుంటే అలా జరుగుతాయి' - అని నిర్ణయించుకొని, బలరాముడు ద్వారకకు మరలినాడు.

ఉగ్రసేనాది బంధువుల బృందాలు ద్వారకలోనుండి ఎదురేగి, వచ్చి బలరామదేవునికీ స్వాగతం పలికారు. ఆయన అచ్చట కొంతకాలంనుండి మళ్లీ సపరివారంగా నైమిశాటవికి వెళ్లినాడు. అక్కడ ఋషీశ్వరుల అంగీకారంతో ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. భూరిదక్షిణలతో ఋత్విక్కుల్ని తదితర బ్రాహ్మణుల్ని సంతోషింపజేశాడు; యజ్ఞం చివర ధర్మపత్ని రేవతీదేవితోనూ, బంధుజనులతోనూ కూడి అవభృథస్నానాన్ని చక్కగా ఆచరించాడు.

(అవభృథము : యజ్ఞం ముగించిన తర్వాత వివిధ దోషపరిహారంకోసం చేసే మంత్రపూర్వకమైన పవిత్రస్నానం.)

బలరామదేవుడు పుష్పమాలికలను ధరించి, చందనపు మైపూతతో; వినూత్న భూషణాలతో రత్నాంబరాలతో పున్నమ చంద్రునివలె ప్రకాశిస్తూ, బంధువుల నేత్రాలనే తెలకలువల సమూహానికి పరిపూర్ణమైన వికాసాన్ని ప్రసాదించాడు. మిక్కిలి తెల్లని కీర్తి గలిగి భాసిస్తూ, అమిత వైభవంతో విరాజిల్లసాగాడు.

ఆదిశేషుని అవతారమైనవాడూ, మహామహిమోపేతుడూ, మాయామానుషవేషధారీ, అమితబలశాలీ - అయిన బలరామదేవుడు ఈ విధంగా మహావైభవంతో ద్వారకను ప్రవేశించి, అచ్చట సుఖంగా ఉన్నాడు - అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మళ్లీ చెప్పటానికి ఉపక్రమించాడు.

మాయా మానుషస్వరూపుడు, గొప్ప భుజబలంకలవాడు, హలాయుధుడు అయిన బలరామస్వామి నిర్వహించే ఆశ్చర్యకరాలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. చతుర్ముఖబ్రహ్మకుకూడా వాటిని ఇన్నని లెక్కపెట్టడం సాధ్యంకాదు - అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో చెప్పాడు.

కుచేలోపాఖ్యానము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...